top of page

ఆ అమ్మాయి..


'Aa Ammaayi' - New Telugu Story Written By P. Gopalakrishna

'ఆ అమ్మాయి' తెలుగు కథ

రచన: P. గోపాలకృష్ణ

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

చూడ్డానికి ఛామనఛాయ అయినా, ఆ అమ్మాయి చాలా చలాకీగా కనిపిస్తోంది.

పెద్దపెద్ద కళ్ళు..


అందమైన ఆ కళ్ళని మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది ఎవరికైనా. నల్లని ఒత్తైన వంకీల జుట్టు..


పొడవైన జడ వేసుకో డానికి ఆమెకు ఎంత టైం పడుతుందో.


ఆమె నడుస్తూ ఉంటే అంతవరకూ పక్కపక్కనే నడిచిన నేను ఆమెకంటే కొంచెం వెనకపడ్డాను. జడ లయబద్ధంగా కదులుతూ ఆమె అందాన్ని రెట్టింపు చేస్తోంది. "ఆహా, ఇలాంటి అమ్మాయిని పెళ్ళి చేసుకునేవాడు నిజంగా ఎంత అదృష్టవంతుడో కదా" అనిపించింది. చేసుకుంటే ఇలాంటి అమ్మాయిని పెళ్ళిచేసుకోవాలి. లేదంటే జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోవాలి అనుకున్నాను.


‘ఆమె పేరు తెలుసుకుంటే!’.. మనసులో వచ్చిన కోరికను మనసులోనే తొక్కిపెట్టేసాను. ఇది ఇండియా. పైగా తెలుగు రాష్ట్రం. అమ్మాయితో అనవసరంగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే తరువాత జరిగే విపరీత పరిణామాలు తలుచుకునేసరికి అప్పటిదాకా ఉప్పొంగిన ఆనందం చప్పున చల్లారిపోయింది. ఆమె సుమారు ఐదడుగుల ఎనిమిది అంగుళాలు పొడవుంటుందేమో. పొందిగ్గా కట్టుకున్న చీర చూస్తూ ఉంటే ఏదైనా ఫంక్షన్ కి వెళ్తోందేమో అనిపిస్తోంది.


మళ్ళీ నడకలో వేగం పెంచి ఆమె పక్కకి వచ్చా. ఇందాక పరిశీలనగా చూడలేదు కానీ, ఇప్పుడు చూస్తే ఆమె అందమంతా ముక్కు పుడకలోనే ఉందనిపిస్తోంది. ఆమెనే చూస్తూ నడుస్తూ ఎదురుగా సైకిల్ తొక్కుకుంటూ వస్తున్న ముసలాయన్ని బలంగా ఢీ కొట్టేసి. పడగొట్టేసాను. అసలే ట్రాఫిక్ చాల ఎక్కువగా ఉందేమో.


ముసలాయన సైకిల్ నుండి కిందపడి "కొంచెం ముందుకు చూసుకొని నడవ్వయ్యా బాబూ, సైకిల్ ని గుద్దుకున్నావు కాబట్టి నేను కిందపడ్డాను. అదే బస్సు కింద పడితే నువ్వు మళ్ళీ పైకి లేవలేవు" అంటూ చేతికి తగిలిన దెబ్బను చూసుకుంటూ కోపంగా తిట్టుకోవడం మొదలెట్టాడు.


ముసలాయన్ని పైకి లేపి, బ్యాగ్ లో ఉన్న వాటర్ బాటిల్ గాయం మీద పోసి కడిగాను. ఆమె కూడా గబగబా వచ్చి సైకిల్ పైకి లేపి నిలబెట్టి, నావైపు చూసి, "పెద్దగా దెబ్బలేమీ తగల్లేదు కదా" అని అడిగింది.


ఎంత బాగుందో ఆ వాయిస్. "పెద్దగా ఏమీ తగల్లేదండీ" అన్నాను.


"అవును, పెద్దగా తగల్లేదు. నీకేం పోయింది, పడింది నేను, దెబ్బలు తగిలింది నాకు"..


వందో ఏభయ్యో చేతిలో పెడితే శాంతిస్తాడేమో అనిపించి జేబులో చేతులు పెట్టి చేతికి దొరికిన ఒక నోటును బయటికి తీసాను. నోటును చూడ్డంతోనే శాంతించాడు. చేతిలో పడిన రెండు వందల నోటును ఆప్యాయంగా తడుముకుంటూ జేబులో పెట్టుకున్నాడు. ఆమె కూడా ఒక వందనోటు తీసి చేతిలో పెట్టి, "పళ్ళుకొనుక్కో తాతయ్యా" అంది.


"అదేంటండీ, నేనంటే సైకిల్ ని కింద పడేసాను కాబట్టి డబ్బులిచ్చాను. మీరెందుకు అనవసరంగా డబ్బులిచ్చారు" అడిగాను.


మీరు సైకిల్ ని కింద పడగొట్టడానికి కారణం నేనే కదండీ. నేను ఈ రోడ్డు మీదికి రాకుండా ఉంటే మీకు ఈ డబ్బులు పోగొట్టుకునే అవస్థ తప్పేది కదా" అంది నవ్వుతూ.


"అంటే.. మీరూ.. మీరూ.. " అంటూ ఆమెవైపు చూస్తూ ఆగిపోయాను.


“ఇందాక నా పక్కన నడిచినప్పుడు చూసాను. మీరు ఆహా ఓహో అనుకుంటూ కొంచెం వెనకాల నడుస్తూ నా జడ కదలడాన్ని మీరు చూస్తున్నట్లు గమనించాను. మళ్ళీ పక్కన నడుస్తూ ముక్కుపుడకని చూసి, ముసలాయన్ని కింద పడెయ్యడం చూసాను" గలగలా మాట్లాడుతూ నవ్వసాగింది ఆమె.


"దీన్నే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారేమో" మనసులో మాట బయటికే వచ్చేసింది. తిడుతుందేమో అనుకుంటూ పక్కలకి దిక్కులు చూడసాగాను.


"అంత నటించక్కర్లేదులెండి. మీ మాటలు వినిపించాయి” నవ్వుతూనే అంది.


"నా పేరు మనోహర్. ఇక్కడే డెల్ కంపెనీ లో సిస్టం అనలిస్ట్ గా చేస్తున్నా. ఉండేది కోఠీ కి దగ్గర్లోనే ఒక మెన్స్ హాస్టల్ లో" చెప్పాను.


"మిమ్మల్ని చాలాసార్లు చూసాను ఇక్కడే, ఇదే రోడ్డు లో. నాలుగైదుసార్లు హోటల్ లో చూసాను. బై ది బై నా పేరు రితిక. మాది కేరళ" అంది ఆమె.


"మరి మీకు తెలుగు చాలా బాగా వచ్చింది కదా" అడిగాను.


"నేను ఇక్కడే పుట్టి పెరిగాను. మా అమ్మ, నాన్న పెళ్ళి చేసుకొని ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారు" అంది ఆమె.


"నేను ఇక్కడే ఇంజనీరింగ్ కాలేజీ లో ఫాకల్టీ గా పనిచేస్తున్నాను" అంది.


"అయితే మీరు నన్ను చాలాసార్లు చూసారన్నమాట. కానీ నేనే మిమ్మల్ని గమనించలేదు" అన్నాను.


"మొద్దు మొహం" అతనికి వినీ వినిపించనట్లు అంది ఆమె.


"ఏంటో మీతో మాట్లాడుతూ ఉంటే బాగా పరిచయమున్న వాళ్ళతో మాట్లాడుతున్నట్లు అనిపిస్తోందండీ" అన్నాను.

ఎందుకో నా ఫీలింగ్స్ అలా ఉండేవి.


ఆమె నవ్వుతూ, "పులిహోర బాగానే కలుపుతారనుకుంటా మీరు" అంది.


"అర్థం కాలేదండీ” అన్నాను బుర్ర గోక్కుంటూ.


"బుద్ధావతారం" మళ్ళీ వినీ వినిపించినట్లు అంది.


"మీకు అభ్యంతరం లేకపోతే కాఫీ షాప్ కి వెళదామా" అడిగాను.


"కాఫీ షాప్ ఐతే అభ్యంతరమే. ఐస్ క్రీం పార్లర్ ఐతే అభ్యంతరం లేదు" అంది.


ఇద్దరం ఐస్ క్రీం తింటూ ఉండగా తన చదువు వివరాలు చెప్పింది. "మిమ్మల్ని మళ్ళీ కలుసుకోవచ్చా" అడిగాను, ఏదో మూల చిన్న ఆశగా అనిపించి.


"మీ అదృష్టం బాగుంటే కలవచ్చేమో", అంటూ అటువైపుగా వెళ్తున్న సిటీ బస్సు ఎక్కి వెళ్ళిపోయింది.


‘అయ్యో ఫోన్ నెంబర్ అయినా అడగాల్సింది. మట్టి బుర్ర’ అనుకుంటూ తిట్టుకుంటూ హాస్టల్ వైపు దారి తీసాను.


‘ఇప్పుడు ఆమెను చూడాలంటే మళ్ళీ రేపు ఇదే టైం వరకూ ఆగాలన్నమాట.. ఆ ఆలోచన కొంచెం బాధగా ఉంది. డిన్నర్ చేసి, బయటికి వస్తూ ఉంటే, ఫోన్ రింగ్ అయ్యింది. ఏదో నెంబర్ నుండి వచ్చింది ఫోన్.


"ఒరేయ్ చిన్నా, నేనురా అమ్మని" అంది.


"ఈ నెంబర్ ఎవరిదమ్మా అడిగాను.


“మీ మామయ్యదిరా, నేనిప్పుడు వాడింట్లోనే ఉన్నాను. మామయ్య నీకో మంచి సంబంధం చూసాడుట. బాగా చదువుకున్నమ్మాయిట" అంటూ ఏదో చెప్పబోతూ ఉంటే, "అమ్మా నేనిక్కడే ఒకమ్మాయిని చూసాను. త్వరలో నీకు వివరాలన్నీ చెప్తాను. ఇప్పటికైతే ఇంకేమీ సంబంధాలు చూడకండి" అంటూ ఫోన్ పెట్టేసాను.


‘హమ్మయ్యా.. అమ్మకి చెప్పేసాను కాబట్టి నాన్నకి తెలుస్తుంది. కాకపోతే నాన్న నాలుగురోజులు కోపంగా ఉంటారు. తరువాత సద్దుకుంటారు" అనుకుంటూ బెడ్ మీద వాలాను. మళ్ళీ ఫోన్ రింగ్ అయ్యింది. ఏదో కొత్త నెంబర్.


‘హలో’ అన్నాను. అవతలి వైపు నుండి నో ఆన్సర్. నాలుగైదు సార్లు హలో అన్నా సమాధానం లేకపోవడంతో విసుగొచ్చి, “కాల్ చేసి మాట్లాడరేం” అంటూ గట్టిగా అనేసరికి,


"మీకు కోపం కూడా వస్తుందన్నమాట" అని వినిపించింది.


"హే, మీరా ఏంటీ సడన్ సర్ప్రైజ్. నా నెంబర్ మీకెలా తెలిసింది?” అడిగాను.


“మొద్దుమొహం, ఒక ఆడపిల్ల చనువుగా పలకరిస్తే కనీసం ఫోన్ నెంబర్ అడగాలని కూడా తెలీదు. ఉత్త బుద్ధావతారం", నవ్వుతోంది. ఏమనాలో కూడా నాకు తెలియలేదు.


"మిమ్మల్ని చూసాక ఒక్కసారి మాట్లాడితే బావుణ్ణు అనుకున్నా. కానీ ఇద్దరం కలిసి ఐస్క్రీమ్ షాప్ కి వెళ్ళి కాసేపు మాట్లాడుకుంటాం అని ఊహించనేలేదు. అసలే షాక్ లో ఉన్న నాకు ఇంకేమీ తోచలేదు" చెప్పాను నిజాయతీగా.


"నేను ఎప్పటినుండో మిమ్మల్ని చూస్తూనే ఉన్నా, మీరు పట్టించుకోనే లేదు", నిష్ఠూరంగా అన్నట్లు అనిపించింది.


అవునా, "అప్పుడే మిమ్మల్ని చూసి ఉంటేనా".. ఆగిపోయింది నా మాట.


“చూసి ఉంటే ఏం చేసేవారు?” అడిగింది ఆమె. కొంచెం సేపు నిశ్శబ్దం.


"ఇవాళ అమ్మకి చెప్పేసాను, ఇంక సంబంధాలు చూడొద్దు అని" అన్నాను.


"ఎందుకూ? ఏమైనా హెల్త్ ప్రాబ్లెమ్స్ ఉన్నాయా మీకు"


ఆమె టీజ్ చేస్తోందని అర్థమైంది. "నాకు హెల్త్ ప్రాబ్లెమ్ కాదులెండి మెంటల్ ప్రాబ్లెమ్ ఉంది" అన్నాను నవ్వుతూ.


"అవునా.. థాంక్ గాడ్" అంది ఆమె.


"నాకు మెంటల్ ఉంటే మీరెందుకు దేవుడికి థాంక్స్ చెప్పుకోవడం" అన్నాను.


"ఏంలేదు లెండి" అంది ఆవిడ.


"ఎన్నిగంటలకు మీరు నిద్రలేస్తారు" అడిగింది.


"నేను సాధారణంగా ఎవరితోనూ కలవనండి. కాబట్టి లేట్ నైట్ పార్టీలు అవీ ఉండవు. బుద్ధిగా ఉదయం ఐదుగంటలకు నిద్రలేచి, కాసేపు వాకింగ్ చేస్తాను. తరువాత నా పనులన్నీ ముగించుకొని తొమ్మిది గంటలకి ఆఫీస్ కి వెళ్తాను" అన్నాను.


"గుడ్నైట్ అయితే, ఉదయం కాల్ చేస్తాను" అంది.


"మీరు కాదు నేనే చేస్తాను. ఉదయం అదీ ఆరుగంటలకు. అంతే కాదు రేపు సాయంత్రం సరిగా ఆరుగంటలకు మనం తాజ్ బంజారాలో కలుస్తున్నాం" టైం చెప్పాను.


"ఎందుకూ" అడిగింది ఆమె.


"అప్పుడు తెలుస్తుందిగా ఇప్పుడే ఎందుకు చెప్పడం" అన్నాను.


నాలో పూర్తిగా నమ్మకం కలిగిపోయింది. అమ్మకి నాన్నకి ఫోన్ చేసి అర్జెంటు గా బయలుదేరమని చెప్పాలని అనుకున్నా. కానీ నాన్న నా మీద మండిపడిపోతూ ఉంటారని అనిపించిందేమో.. మాట్లాడకుండా పడుకున్నా. ఇంత జరిగాక ఎవడికైనా నిద్రపడుతుందా? రితిక హాయిగా గురకపెడుతూ నిద్రపోతూ ఉంటుందేమో, నిద్రలో తలకింద ఉన్న పిల్లో ని తడిపేస్తోందేమో. నోట్లోంచి లాలాజలం కాలువలుకట్టి పిల్లో ని తడిపేస్తోందేమో.


ఈ చిలిపి ఆలోచన నాకు నవ్వుతెప్పించిందేమో, ఇంక ఆపుకోలేక "గురకపెట్టి నిద్రపోతున్నారా" అంటూ మెసేజ్ చేశాను.


"నా మొహం, కంటినిండా నిద్రపోయి ఎన్నాళ్ళయ్యిందో" అంటూ రిప్లై ఇచ్చింది.


"అవునా.. ఐతే ఇది అదే.. ఇంటికి ఫోన్ చేసి అమ్మా, నాన్నలని అర్జెంటు గా రమ్మని చెప్పండి" అన్నాను.


"వాళ్లకేం ఫోన్ చెయ్యక్కర్లేదు. ఇక్కడే ఉంటారు నాతోనే" చెప్పింది ఆమె.


"అవునా.. సరే ఐతే. రేపు వాళ్ళనీ తీసుకొని తాజ్ బంజారాకి కి రండి. కాబోయే అల్లుణ్ణి చూసి నిర్ణయం తీసుకుంటారు" చెప్పాను.


"మొద్దబ్బాయికి ఇప్పటికి అర్థమైంది అన్నమాట. ఇప్పుడు పిలవాల్సింది మీ వాళ్ళని. అమ్మాయిల్ని ఎలా డీల్ చెయ్యాలో కూడా తెలీదు, సరే ఇంకో గంటలో తెల్లారుతుంది. నేను పడుకోకపోతే మళ్ళీ కాలేజీ లో పని చేయలేను. అందుకే గుడ్ నైట్" అంటూ నెట్ ఆఫ్ చేసుకుంది ఆమె.


అనుకున్నట్లు మర్నాడు సాయంత్రం ఆరుగంటలకు తాజ్ బంజారాలో కలిసాం ఇద్దరం. ఎన్నో విషయాలు.


"మీ డెల్ కంపెనీ కి ఇంటర్వ్యూ కి మూడు సార్లు వచ్చాను. కానీ నాకు జాబ్ రాలేదు. అక్కడే మొదటిసారి మిమ్మల్ని చూసాను. తరువాత మిమ్మల్ని గురించి తెలుసుకున్నాను. ఒకరి మీద ఇష్టం ఏర్పడితే వాళ్ళకోసం ఏదైనా చేయాలనిపిస్తుంది. ఆ ఇష్టాన్ని చెప్పగలిగినవాళ్ళే ధైర్యవంతులు. నేను పిరికిదానిలా బతకాలని అనుకోలేదు. నాకేది కావాలని అనిపిస్తుందో దాన్ని పొందడానికి ఎంత కష్టమైనా నన్ను నేను గెలిపించుకుంటాను" అంది రితిక.


"ప్రేమించబడడం కంటే గొప్పదేముంది. నాకు మీరు నచ్చారు. మీ ధైర్యం నచ్చింది. మీలాంటి అమ్మాయి పక్కన ఉంటే ఏమైనా సాధించగలనని నాకు నమ్మకం ఉంది. నాకు నిజానికి అమ్మాయిల గురించి అసలు తెలియదు. వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయో కూడా తెలీదు. నిజంగా మీరు నాకు నచ్చారు. మీ ముక్కుపుడక చూడ్డంతోనే ఇలాంటి అమ్మాయి నా భార్య కావాలని అనుకున్నా. అమ్మకి చెప్పాను ఈరోజు ఉదయం. వాళ్ళు బహుశా రెండు మూడు రోజుల్లో వస్తారు. మీ అడ్రస్ ఇస్తే నేరుగా నిశ్చితార్థం ఏర్పాట్లు చేసుకోడానికి వస్తాము" అన్నాను.


ఆమె ముఖం గులాబీ రంగులోకి మారిపోయింది.


‘రితికా’ అంటూ ఆమె చేతిని ధైర్యంగా నా చేతిలోకి తీసుకొని మెత్తగా నొక్కి అలాగే పట్టుకున్నాను. ఆమె దించిన తల పైకి ఎత్తలేదు. గలగలా మాట్లాడిన అమ్మాయి ఒక్కసారిగా మౌనంగా మారిపోయింది.


"ఇది ఎలా సాధ్యమో ఇప్పటికీ నాకు నమ్మబుద్ధి కావట్లేదు" అన్నాను.


ఆమె నెమ్మదిగా తన రెండో చేతిని పొజిషన్ లో పెట్టి పక్కలో ఒక్క గుద్దు గుద్దింది. "చచ్చాను బాబోయ్" అన్నాను.


ఇది నిజమే.. ఇది కల కాదు ఐతే" అంది.


"ఐతే నేను నిన్ను ప్రేమిస్తున్నదీ నిజమే అన్నమాట" అన్నాను.


"కాదు.. కాదు మనం ప్రేమలో ఉన్నామన్నది నిజం" అంది సిగ్గుపడుతూ.


వారం తిరిగేసరికి రితికను చూసిన అమ్మా నాన్నా, ఈ అమ్మాయే మా కోడలు అంటూ ఫిక్స్ అయిపోయారు. ప్రేమ వివాహం కాబట్టి, ఎలాంటి షరతులు, కట్నకానుకలు లేకుండా మా స్థితి కి తగినట్లు పెళ్ళి చేసారు పెద్దలు.


ఒక నెల క్రితం ఆమె ఎవరో నాకు తెలియదు. ఇప్పుడు తాను నా ఆణువణువూ నిండిపోయింది. అందుకేనేమో పెళ్లిళ్లు స్వర్గం లో నిర్ణయించబడతాయని అంటారు పెద్దలు.

***

P. గోపాలకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.


దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

నా పేరు గోపాలకృష్ణ. పుట్టింది, పెరిగింది శ్రీకాకుళం జిల్లా లో. చిన్నప్పటినుండి కథలూ,కవితలూ, రాయడం చదవడం ఇష్టం. వృత్తి రీత్యా ఉపాధ్యాయుడిని. నా తల్లిదండ్రులు చిన్నప్పటినుండి ఇచ్చిన ప్రోత్సాహమే రచనావ్యాసంగాన్ని అంటిపెట్టుకొనేలా చేసింది. 'ఆ అమ్మాయి..' కథ ఈ సైట్ లో నేను రాస్తున్న రెండవ కథ. నా కథలను తప్పక ఆదరిస్తారని ఆశిస్తున్నాను.95 views0 comments
bottom of page