'Manasuloni Prema Episode 4/6' - New Telugu Web Series Written By Yasoda Pulugurtha
'మనసులోని ప్రేమ - ఎపిసోడ్ 4/6' తెలుగు ధారావాహిక
రచన: యశోద పులుగుర్త
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
జరిగిన కథ:
ముప్పై రెండేళ్ల మురారికి ఇంకా పెళ్లి కాలేదు. ప్రేమించిన చైత్ర కు తన ప్రేమను వ్యక్తపరచక పోవడంతో ఆమెకు మరొకరితో వివాహం అవుతుంది. ఆమెను మర్చిపోలేని మురారికి మరే అమ్మాయీ నచ్చదు.
అతనికి నందిని అనే అమ్మాయినుండి ఫోన్ వస్తుంది. మురారి ప్రొఫైల్ తనకు నచ్చిందని, అతన్ని పెళ్లి చేసుకుంటానని చెబుతుంది. తన బావ ఫణింద్రతో కూడా ఆ సంగతి చెబుతుంది.
మురారి తల్లి మరణిస్తుంది. తన పెళ్లి బావతో ఫిక్స్ అయినట్లు చెబుతుంది నందిని.
ఇక మనసులోని ప్రేమ - ఎపిసోడ్ 4 చదవండి..
''ఆ రోజు మీరు కళామందిర్ లో షాపింగ్ ముగించుకుని వస్తూండగా మాకు ఎదురుపడ్డారు. ‘హమ్మయ్య! వెతకబోయిన తీగ కాలికే తగిలి’నట్లు హుషారు వచ్చేసింది నాకు. బావను ఏడిపించే ఒక మంచి అవకాశం అనుకుంటూ మనిద్దరకూ పెళ్లి చూపులైనాయని, నాకు మీరు నచ్చారని చెప్పేసరికి మా బావ ముఖం ఎలా మాడిపోయిందో గమనించారా మురారిగారూ?
ఎలా వాళ్ల నాన్నను ఒప్పించాడోగానీ మా పెళ్లికి పచ్చ జండా ఊపాడు మా మామయ్య. అందుకనే ఈ రోజు మీకు జరిగింది వివరంగా చెపుదామనే ఇలా వచ్చాను. మిమ్మలని ఒక్క విషయం అడగచ్చా?”
“ఏ విషయం నందినీ?”
“ఇంతకాలం మీరు పెళ్లెందుకు చేసుకోలేదు?”
జవాబు చెప్పలేక మౌనం వహించాడు.
"నేను చెప్పనా? మీరు ఒక అమ్మాయిని ప్రేమించి ఉండచ్చని ఊహిస్తున్నాను".
నందిని మాటలకు తృళ్లిపడ్డాడు.
"మీరు మీ ప్రేమను ఆ అమ్మాయితో చెప్పలేకపోయారు. ఆ అమ్మాయిని మరచిపోలేక పెళ్లి చేసుకోకుండా ఉండి పోయారు. చూడండి మురారిగారూ, మనకు ఇష్టమైన వస్తువు పట్ల ప్రేమను పెంచుకుంటూ దానిని సొంతం చేసుకోవడానికి అహర్నిశలూ ప్రయత్నిస్తూ మొత్తానికి దానిని చేజిక్కించుకుంటాం. ప్రేమ కూడా అంతే.
అసలు మీరు ప్రేమించిన అమ్మాయి ఎలా ఉందో ఎక్కడ ఉందో ఎప్పుడైనా తెలుసుకున్నారా? ఎందుకు తెలుసుకోవడం అంటారా? ఏమో ఎవరికి తెలుసు? ఆ అమ్మాయికి పెళ్లి అయిపోయింది కదా అని మీరనుకోవచ్చు. కానీ ఆ పెళ్లి కాస్తా పెటాకులు అయిపోయి ఉంటే? అమెరికా సంబంధాలైతే ఇంక చెప్పనవసరమే లేదు. ఎన్ని అనుకోని సంఘటనలు జరుగుతున్నాయండీ ఇవాళా రేపూ? ఒకవేళ ఆ అమ్మాయి తన భర్త పిల్లలతో హాయిగా సంసారం చేసుకుంటుంటే మీరెందుకు తన గురించి దేవదాసు అయిపోవాలండీ?
తొందరలో మీరూ పెళ్లి చేసుకోండి మురారిగారూ. సారీ, మీమీద జాలితోనో, సానుభూతితోనో నేను ఈ మాటలు చెప్పడం లేదు. మీరంటే ఒకలాంటి గౌరవం అంతే. మా పెళ్లికి తప్పక రావా”లంటూ వెళ్లిపోతున్న నందిని వైపు అలా చూస్తూ ఉండిపోయాడు.
ఈ అమ్మాయి ప్రేమలో గెలిచింది. ప్రేమించిన బావను తన వాడిని చేసుకోడానికి చాలా ధైర్యం చేసింది. చైత్రను అంతగా ప్రేమించిన తాను ఆ విషయం చైత్రకు చెప్పడానికి మొహమాట పడ్డాడు. మనసులోని ప్రేమను కప్పేసుకున్నాడు. చైత్ర ఎలా ఉందో తెలియదు. పెళ్లి అయిపోగానే అమెరికా వెళ్లిపోతానంది గానీ అమెరికాలో ఎక్కడ ఉందో తెలియదు.
తన క్లాస్ మేట్ అభిరామ్ బెంగుళూర్ లో పని చేస్తున్నాడు. సంవత్సరం క్రితం తను ఆఫీసు పనిమీద బెంగుళూర్ వెళ్లినపుడు షాపింగ్ మాల్ లో భార్యా, మూడేళ్ల పాపతో కనిపించాడు. తనే గుర్తుపట్టి మరీ పలకరించాడు. కాలేజ్ లో అతను అందరితో సన్నిహితంగా ఉండేవాడు. అభిరామ్ కి ఫోన్ చేసి చైత్ర ఎక్కడుందో ఏమిటో తెలుసుకోవా లనుకున్నాడు. నెలరోజులు ఆఫీస్ పనితో బిజీ అయిపోయాడు.
ప్రాజక్ట్ షెడ్యూల్ ప్రకారం పూర్తి అయింది. సాఫ్ట్ వేర్ టెస్టింగ్ పూర్తి చేయించాలి. ఏవైనా బగ్స్ లాంటివి వస్తే వాటిని సరిచేసి మరోసారి రాకుండా అరికట్టాలి. లేకపోతే అన్నాళ్లూ కష్టపడి డెవలప్ చేసిందంతా వృధా అయిపోతుంది. క్లైంట్ కి సంతృప్తికరంగా ఉండాలి.
మురారి పని విషయంలో చాలా అప్రమత్తంగా ఉంటాడు కనుకనే ముఖ్యమైన ప్రాజక్ట్స్ అన్నీ అతనికే ఎసైన్ చేస్తారు. ఆ రోజు మురారి అసిస్టెంట్ చరణ్ వస్తూనే “సర్ టెస్టింగ్ టీమ్ లీడ్ 'శ్వేతా రాఘవన్' ఒక వారం రోజులు లీవ్ పెట్టిందిట".
ఈ మాట వినగానే మురారి ముఖం అప్రసన్నంగా అయిపోయింది.
“మై గాడ్! ఎలా చరణ్”?
“నో టెన్షన్ సర్. ఆమె అసిస్టెంట్ కి ఫోన్ చేసాను. ఆవిడ ఈ మధ్యనే ఒక నెలరోజులైందిట ఆ విభాగంలో చేరి. అంతక మునుపు ముంబై లో వేరే కంపెనీలో పనిచేసిందిట. ‘చైత్రా పసుమర్తిట’ పేరు. ఆమె టెస్టింగ్ టేకప్ చేస్తానంది.
ఏవో ఆలోచనలలో ఉన్న మురారి చరణ్ చెప్పిన పేరుని సరిగా వినలేదు. టెస్టింగ్ చేస్తానని చెప్పిందన్న మాటమాత్రం విన్నాడు.
"థాంక్ గాడ్, ఆ పని ఏమిటో చూడు చరణ్” అంటూ ఆదేశించాడు.
ప్రాజక్ట్ డెలివర్ అవగానే ఒక వారం రోజులు శెలవు పెట్టేసి రెడీగా ఫిక్స్ చేసి పెట్టుకున్న పెళ్లి చూపులకు వెళ్లాలని అనుకుంటున్నాడు అక్కా బావగారు కూడా వస్తామన్నారు తనతో.
మురారి మనసు ఎందుకో గత కొద్ది రోజులుగా ఏదో తెలియని ఉత్సాహంతో ఉరకలేస్తోంది. ప్రాజక్ట్ పూర్తి అయిందన్న ఆనందమా లేక అతని జీవితంలో ఏదైనా మహాద్భుతం జరగబోతోందన్న శుభ సంకేతమా?
మధ్య మధ్యలో చరణ్ వచ్చి టెస్టింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉందని, కొత్తగా వచ్చినావిడ చాలా ఏక్టివ్ గా ఇన్ వాల్వ్ అవుతున్నట్లు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నాడు.
ఆరోజు పదకొండు గంటలకు టెస్టింగ్ పూర్తిచేసిన ప్రాజక్ట్ ను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వడానికి చైత్రా పసుమర్తి వస్తున్నట్లు చరణ్ కి ఫోన్ చేసి చెప్పింది.
========================================================================
ఇంకా వుంది...
========================================================================
యశోద పులుగుర్త గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
Podcast:
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం :
నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.
Comments