top of page

అమ్మ వీలునామా


'Amma Vilunama' - New Telugu Story Written By Varanasi Bhanumurthy Rao

'అమ్మ వీలునామా' తెలుగు కథ

రచన: వారణాసి భానుమూర్తి రావు

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

"మా అమ్మ గారు అన్నపూర్ణమ్మ గారు స్వర్గస్థులయినారని తెలియ చేయుటకు చింతిస్తున్నాము. పదవ రోజు, దశాహస్సు పదకొండవ రోజు, వృషోచ్చర్జనము, శోడసము పండ్రెండవ రోజు సపిండీకరణము, దానములు, మాసికము, ఆశీర్వచనములు. "


వాట్స్ అప్ లలో అమ్మగారి దశదిన కర్మల వివరాలు బంధువులకు, స్నేహితులకు పంపించారు అన్నదమ్ములు ఇరువురూ రామ ప్రసాద్, కృష్ణ ప్రసాద్. చనిపోయిన నాటి నుండీ దశ దిన కర్మ లయ్యేంత వరకూ జీవుడు ప్రేతాత్మ రూపంలో మన మధ్యనే తిరుగుతుందని హిందూవుల నమ్మకం. అన్న పూర్ణమ్మ గారి ఆత్మ గూడా ప్రేతాత్మ రూపంలో తిరుగుతుందేమో! ******************************************


అన్నపూర్ణమ్మ, భర్త గారు చనిపొయ్యాక తను కొడుకుల దగ్గర వుండవలసి వచ్చింది. అప్పుడు ఆమె వయసు 75 సంవత్సరాలు. పెద్ద కొడుకు రామ ప్రసాద్ ముంబై లో ఏదో పెద్ద వుద్యోగం లో వున్నాడు. చిన్న కొడుకు కృష్ణ ప్రసాద్ హైదరాబాదు లో ఉన్నాడు. అన్న పూర్ణమ్మకు బొంబాయి కి పోయి అక్కడ ఉండడం ససేమిరా గిట్టదు. అందుకే ఎప్పుడూ చిన్న కొడుకు దగ్గరే ఉంటుంది. అది ఏ మాత్రం చిన్న కోడలుకు నచ్చదు.


"ఈమెకు సేవలు చెయ్య లేక చస్తున్నా! మీఅన్నయ్యకు చెప్పి ఆరునెలలయినా అక్కడ వుండే ఏర్పాట్లు చెయ్యండి..‌" అని భర్తను పొద్దస్తమానం దెప్పుతూనే వుంటుంది. ‌ రామ ప్రసాద్ ఎట్టకేలకు అమ్మను ముంబై కి పిలుచు కోవడానికి హైదరాబాదు వచ్చాడు. ట్రైన్ లో ఏసి టూ టైర్ లో బుక్ చేసుకొని ఇంటికి పిలుచు కొని పొయ్యేసరికి తల ప్రాణం తోకకు వచ్చింది. ‌అన్న పూర్ణమ్మ గారిది భారీ కాయం. వీల్ చేర్ లో తప్ప నడవ డానికి అవస్థలు పడితుంది. ‌మోకాళ్ళు నొప్పులు, బీపీ, సుగర్ అన్ని రకాల వ్యాధులు ఉన్నాయి. ‌అన్ని మాత్రలు వేసుకొని ఆరోగ్యాన్ని ఏదో ఒక లాగు కాపాడుకొంటోంది.


మొదటి వారం చాలా ఆప్యాయంగా మాట్లాడిన కోడలు రెండవ వారం నుండీ అసలు మాట్లాడం మానేసింది. టై ప్రకారం ఆహారం అందిస్తూ మందులు అందించేది. అన్న పూర్ణమ్మ గారు ఎన్నో విషయాలు మాట్లాడాలని, కోడలితో ఆప్యాయంగా మాట్లాడాలని అనుకొన్నా, కోడలి ముభావతను చూసి ఏమీ మాట్లాడేది గాదు. మాట్లాడే దిక్కు లేక ముంబై పెద్ద కొడుకు ఇంటిలో జీవితం నరక ప్రాయంగా తోచేది.


రామ ప్రసాద్ కి ఇంకా పిల్లలు కలగ లేదు. అందువల్ల ఆ ఇంటిలో నిశ్శబ్ధం మహా భయంకరంగా తోచేది. భక్తి చానల్, టీ టీ డీ చానల్ చూస్తూ ఉంటుంది. తన గదిలో ఒక టీ వీ లో తెలుగు చానల్స్ అన్నీ పెట్టించాడు తన కొడుకు. వాడు తనతో మాట్లాడ డానికి టైమే లేదు. ఎప్పుడూ ఆఫీసు లోనే రోజంతా గడచి పోతుంది. తెలుగు దిన పత్రికలు, వార పత్రికలూ పట్టుకొని వస్తాడు. అదొక్క కాలక్షేపం అవుతుంది. అన్న పూర్ణమ్మ తన ఇద్దరి కొడుకుల కోసం జీవితాన్ని త్యాగం చేసింది. ‌ కొడుకుల్ని వృద్ధి లోకి తీసుకు రావాలని చాలా కష్ట పడేది.


"ఏమండీ.. ఆరునెలలు అవుతూనే మీ అమ్మ గారిని హైదరాబాదు కి పంపెయ్యండి. ఇక్కడ నా వల్ల కాదు. నేను చూసు కోలేను" ఆ రాత్రి కోడలు పిల్ల అన్న మాటలు విని అన్న పూర్ణమ్మ మూగగా రోదించింది.


ఆ రాత్రి అంతా తను ఏడుస్తూనే వుంది. కానీ తనని ఓదార్చే వారెవ్వరు? తన భర్త మరణించినప్పటి నుండీ తనకి కనీసం సానుభూతి మాటలు గూడా కరువయ్యాయి. ‌కనీసం తన గోడు వినే వారు గూడా కరువయ్యారు. ఓదార్చే దిక్కు గూడా లేదు. ఆరునెలలకే వారికి తను బరువయి పోయింది. అక్కడ చిన్న కోడలు గూడా అలాగే సతాయిస్తూ ఉంటుంది. ఇంత బ్రతుకూ బ్రతికి ఇలా ఎవరికీ కానట్లు, స్వంత మనుషులయినా పరాయి వాళ్ళ దగ్గర బ్రతుకుతున్నట్లు ఆలోచిస్తే ఈ క్షణాన్నే చని పోవాలనిపించేది అన్న పూర్ణమ్మకు. ‌


వారు తనని ఒక పరాయి వ్యక్తి లాగా చూస్తున్నారు. మనిషిలో ప్రేమ అనుబంధాలు లోపించిన నాడు ఎదుటి వారిని ప్రేమించ లేరు. స్వార్థం ముందు ఎటువంటి అనుబంధాలయినా ముక్కలయి పోతాయి. అన్న పూర్ణమ్మ గారు ఆశించేది ఒక చక్కని ప్రేమ పూర్వక మైన పలకరింపు. అది గూడా మృగ్యమైపోతున్న నేటి రోజుల్లో మిగిలేది ఏమిటి? తల్లి దండ్రులను చూసుకోవడం గూడా వంతులు వేసుకొని, వారితో మంచి మాట గూడా నోరారా పలకని దౌర్భాగ్య స్థితిలో ఈ సమాజం వుందంటే దానికి కారణం ఎవరు? నైతిక విలువలు లేని ఈ సమాజాన్ని ఎవరు తయారు చేస్తున్నారు?


తల్లిదండ్రులు సంపాదించిన ఆస్థుల మీద హక్కులు మాట్లాడతారు గానీ వారి ముసలి తనంలో వారి బాగోగులను, బాధ్యతలను ఎందుకు సక్రమంగా నిర్వహించడం లేదు? మన ముందు తరాలకు మనం ఏమి నేర్పుస్తున్నాము? ఈ రోజు నువ్వు యువ రక్తంతో వురుకులు పరుగులు పెడుతున్నావు. రేపు నువ్వు జవసత్వాలు ఉడిగి పోయి ఇతరుల మీదా ఆధార పడి వలసి వచ్చినప్పుడు నీ పిల్లలు గూడా అలా బాధ్యతా రహితంగా ప్రవర్తించరని గ్యారంటీ ఏమిటి? తల్లిదండ్రుల అవసాన దశలో వారి అవసరాలు తీర్చ లేని సంతానం ఎందుకు?


ఇంటికి కోడలయినా అత్తగారిని అమ్మ కన్నా బాగా చూసుకోవాలి. కోడలు మీద కొండంత ఆశలు పెట్టుకొన్న అత్త మామల ఆశలు వమ్ము చెయ్యగూడదు. భర్త ను మందలించి అయినా సరే అత్త మామల్ని సుఖంగా ఉంచిన నాడు ఆ ఇల్లు నందన వన మవుతుంది. వృద్ధాశ్రమాల మాట ఇంటిలో ఎత్త గూడదు. అన్నీ వుంటాయి వృద్ధాశ్రమాల్లో. కానీ ఒక ప్రేమ, ఆప్యాయత వుండదు. తమ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డల పంచనే చని పోవాలని ప్రతి తల్లీ తండ్రీ కోరుకొంటారు. కానీ వృద్ధాశ్రమాల్లో చావాలని కోరు కోరు.


ఈ సమాజంలో వృద్ధాశ్రమాల వెర్రి తనం పోయి, పిల్లలు తమ కనీస భాధ్యతల్ని నిర్వహించాలి. ‌ ఆ రాత్రంతా అన్న పూర్ణమ్మ నిద్ర పోలేదు. ఆలోచనలతో తల బరువెక్కింది. కళ్ళు ఇంకి పోయి కన్నీరు గూడా ఆగి పోయింది. ఏడ్వడానికి గూడా అశక్తురాలయింది అన్న పూర్ణమ్మ.


****************************************


ఆరు నెలలు అయిన తరువాత, రామ ప్రసాద్ ఫ్లైట్ లో హైదరాబాదు కు బుక్ చేసుకొని తమ్ముడి ఇంటిలో వదిలాడు. వీల్ చేర్ అసిస్టెన్స్ తీసుకొన్నాడు గాబట్టి అంతగా ప్రాబ్లం కాలేదు.


"ఏరా అన్నాయ్యా! అప్పుడే ఏమి కొంప మునిగిందని? ఇంకా కొన్ని రోజులు అమ్మను వుంచు కోవచ్చు గదా?" అన్నాడు తమ్ముడు.


"అమ్మకు ముంబై జీవితం అసలు నచ్చదు. ఆమెకు హైదరాబాదు కంఫర్ట్బుల్ గా వుంటుంది. ఒక్క రోజు గూడా ఆమె హాపీ గా వుండ లేదనుకో !" అని అన్నాడు రామ ప్రసాద్.


"అది సరే గానీ.. నువ్వు అమ్మతో ఈ ఆరు నెలల్లో ఎన్ని రోజులు ఆప్యాయంగా మాట్లాడినావు? ఎన్ని రోజులు ఆమెతో కూర్చొని భోంచేశావు? ఎన్ని రోజులు నువ్వు, వదిన కలిసి ఆమెతో టైం స్పెండ్ చేశారు?"


తమ్ముడు ఈ ప్రశ్న లడిగే సరికి రామ ప్రసాద్ కి కోపం ముంచుకొచ్చింది. "అంటే.. మేము అమ్మను సరిగా చూసుకోలేదంటావా?" అని కోపంగా అడిగాడు.


"మీరు చెప్పక పోయినా అన్నీ మాకు తెలుస్తూనే ఉంటాయి. ‌ ఇంటికి పెద్ద కొడుకు నువ్వు. అమ్మ బాధ్యత నువ్వే తీసుకోవాలి." అన్నాడు తమ్ముడు.


"పెద్ద కొడుకే తల్లిదండ్రులను చూసుకోవాలని ఎక్కడైనా అగ్రిమెంట్ వ్రాసివుందా? పెద్దకొడుకు గానుగెద్దా? మిగతా వారంతా గాడిదల్ని తోలుతారా?" అని రామ ప్రసాద్ నిప్పు తొక్కిన కోతిలా అరచాడు.


"మాటలు జాగ్రత్తగా రానియ్యి అన్నయ్యా! ఇష్ట ప్రకారం మాట్లాడితే వూరుకొనేది లేదు.‌" అన్నాడు తమ్ముడు కృష్ణ ప్రసాద్.


ప్రయాణ బడలికతో అలసి పోయిన అన్న పూర్ణమ్మ అన్నా దమ్ముల మధ్య జరుగుతున్న వాగ్వాదానికి మూగగా రోదించడం తప్ప తను ఏమీ చెయ్య లేక పోతోంది. రామ ప్రసాద్ వెంటనే తను తెచ్చుకొన్న బాగ్ తో రిటర్న్ టికెట్ ఫ్లైట్ ముంబై కి బుక్ చేసుకొని కోపంగా ఇల్లు వదలి వెళ్ళి పొయ్యాడు. ‌ కాబ్ శంషాబాద్ ఏర్ పోర్ట్ వైపు పరుగులు తీస్తోంది.


***************************************


ఒక్క రోజు పిడుగు లాంటి వార్త విని అన్న పూర్ణమ్మ కుప్ప కూలి పోయింది. కృష్ణ ప్రసాద్ అన్న పూర్ణమ్మ ను అదే కాలనీ లో ఉన్న వృద్ధాశ్రమంలో చేర్పించాడు. ‌ అమ్మ మీద కోపం తో కాదు.. తన అన్నయ్య, వదినల మీద కోపంతో అమ్మను చేర్పించాడు. ‌


"అమ్మా.. నువ్వు గూడా ఇంటిలో ఆనందంగా లేవు. ‌ మేము నీకు ఎన్ని సౌకర్యాలు కల్పిస్తున్నా నువ్వు ఏదో అసంతృప్తి తో ఉన్నావు. నీ కోడలు గూడా ప్రమోషన్ వచ్చాక బిజీ అయిపోయింది. అందుకే నిన్ను ఓల్డ్ ఏజ్ హోం లో చేర్పిస్తున్నాను. అక్కడ వేళకు మంచి భోజనం, డాక్టర్లు, మీ ఈడు వాళ్ళు వుంటారు. ‌భజన కార్యక్రమాలు గూడా వుంటాయి. పది మంది ఎప్పుడూ పలకరిస్తూనే ఉంటారు.


మారే కాలంతో పాటు మనమూ మారాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ పిల్లలకు బరువు గాకుండా ఓల్డ్ ఏజ్‌ హోం‌లో చేరుతున్నారు." అని అమ్మను కన్‌విన్స్ చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాడు చిన్న కొడుకు.


"ఒరేయ్ కృష్ణా! నువ్వు చేసేదేదో చెయ్యరా! ఆ చేసేదేదో మీ అన్నయ్యకు గూడా చెప్పి చెయ్యి." అన్నది అమ్మ గారు.


"వాడి కేందమ్మా చెప్పేది. బాధ్యత బరువు తీసుకోలేని వాడు. హక్కుల గురించి మాట్లాడతాడు. ‌ బాధ్యతలు గురించి మాట్లాడడు. వాడి పెళ్ళాం చెప్పింది విని తైతక్క లాడే గంగిరెద్దు వాడు." అన్నాడు కృష్ణ ప్రసాద్.


***************************************


అన్న పూర్ణ మ్మను వృద్ధాశ్రమం లో చేర్పించి మూడు నెలలు దాటింది. ప్రతి ఆదివారం అమ్మను చూసి పళ్ళు, మందులు, కావలసిన చిరుతిళ్ళు, బిపి సుగర్ మందులు అందించే వారు. ‌ కానీ ఇప్పుడు నెలకు ఒక్క సారి వెళ్ళి అమ్మ గారిని చూసి వస్తున్నారు‌ కొడుకు కోడలు. అన్న పూర్ణమ్మ కు ఆశ్రమంలో బాగున్నా ఏదో తెలియని లోటుతో బాధ పడ సాగింది. ‌ ఆమె పూర్తిగా కుటుంబ మనిషి. తన పిల్లల్ని ఇద్దరినీ కంటికి రెప్పలా కాపాడింది. వారి పెళ్ళిళ్ళు గూడా ఎంతో బాగా చేసింది. కోడళ్ళు కష్ట పడ గూడదని పెళ్ళయిన కొత్తలో వారి ఇళ్ళల్లో ఒక సంవత్సరం పాటు వుండి వారికి కావలసిన వన్నీ చేసి పెట్టేది. ‌ వంట గది వదలి బయటకు వచ్చేది గాదు. తనకు వచ్చిన వంటకాలన్నీ కోడళ్ళకు నేర్పించేది.


మనవడో, మనవరాలో పుట్టాలని వేయి దేవుళ్ళకు మొక్కు కొనేది. కానీ అన్న దమ్ములు ఇద్దరికీ ఇంకా సంతాన సౌభాగ్యాన్ని ఆ దేవుడు ప్రసాదించలేదు. అన్న పూర్ణమ్మకు ఆ చింత ఎక్కువయ్యేది. భర్త చని పోయిన తర్వాత అనారోగ్య పరిస్థితిలు చుట్టు ముట్టాయి. దానికి తోడు స్థూల కాయం. ఒక మనిషి తోడు ఉంటే గానీ బాత్ రూం కి నడవ గలిగేది కాదు. బాగున్నపుడు అత్త గారి దగ్గర సకల సేవలూ చేయించుకొన్న కోడళ్ళు, ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నా పట్టించు కోవడం మానేశారు. ఏదో మొక్కుబడిగా మందులు ఇస్తూ, భోజనం గూడా ఒక ప్లేట్ లో పెట్టి డైనింగ్ టేబుల్ మీద పెట్టేవారు. ప్రేమ, ఒకమంచి మాట, ఓదార్పు వారి నోట్లోంచి వచ్చేది గాదు. ఆ వయసులో నేనున్నాని ఒక భరోసా ఇస్తే చాలు. కోట్ల రూపాయలు, ఇంద్ర భవనాలు అక్కర లేదు.


ఆ భరోసా కొడుకు కోడళ్ళ దగ్గర కరువయింది అన్న పూర్ణమ్మ కు. ఒక్కొక్కరిది ఒక్కొక్క వ్యధ ఆ ఆశ్రమంలో. రక్తం పంచుకు పుట్టిన తల్లిదండ్రుల్ని పట్టించు కోకుండా ఆ ఆశ్రమంలో వేసి చేతులు దులుపు కొన్న ఆ కొడుకులు, కోడళ్ళకి రేపు వారు ముసలి వారయిన తరువాత అలాంటి పరిస్థితే వస్తుందని ఎందుకనుకోరు? అందరి కథలూ విన్న అన్న పూర్ణమ్మ మనస్సు కకా వికలమై పోయింది. కోట్లాది ఆస్థులు పంచి ఇచ్చినా, అన్న దమ్ములు మధ్య సఖ్యత లేక తల్లిదండ్రుల్ని కష్టాల పాలు చేస్తున్నారు.


అన్న పూర్ణమ్మ కు అలా సంవత్సరం ఆ ఓల్డ్ ఏజ్ హోం లో గడచి పోయింది. ఆరోగ్యం ఇంకా దెబ్బ తీసింది. ఒక రోజు కృష్ణ ప్రసాద్ కి అమ్మగారు అపస్మారక స్థితిలో వున్నారని, వెంటనే పిలుచుకొని పొమ్మని ఆశ్రమ నిర్వాహకుల నుండి కబురు వచ్చింది. ఆఘ మేఘాల మీద కృష్ణ ప్రసాద్ అమ్మ గారిని ఇంటికి తీసుకొని వచ్చి హాల్లో పరుండ బెట్టాడు. అన్నా వదినకు ఫోన్ చేసి వెంటనే బయలు దేరమన్నాడు. అమ్మ తలను నిమురుతూ తులసి తీర్థం నోట్లో పోస్తున్నాడు కృష్ణ ప్రసాద్.


"అన్నయ్య వచ్చాడా నాయనా!" అని అడిగింది అన్న పూర్ణమ్మ.


“సాయంత్రానికి ఫ్లైట్ లో వస్తున్నాడు అమ్మా! మీరు రెస్ట్ తీసుకోండి".


అమ్మను ఆ దురవస్థలో చూసే సరికి కృష్ణ ప్రసాద్ గుండెలు తరుక్కు పొయ్యాయి. అంతలో ఫామిలీ డాక్టర్ వచ్చి పల్స్ రేట్ వగైరా చూసి రిపోర్ట్ ఇచ్చాడు.


"అంతిమ ఘడియలు సమీపిస్తున్నాయి. ఆమె ఏమో చెప్పాలని ఆరాట పడుతోంది." అన్నాడు డాక్టర్. ఒక చెంచాతో పాలు, ఇంకొక చెంచాతో తులసి తీర్థం పోస్తూ సపర్యలు చేస్తున్నారు ఆలు మగలు. సాయంత్రానికి రామ ప్రసాద్, భార్యతో వచ్చాడు. అమ్మను చూసి బావురు మన్నాడు.


పెద్ద కొడుకు అమ్మ గారి నోట్లో తులసి తీర్థం పోస్తున్నాడు. ఒక్క సారి రెప్పలు కదిలించి కనులు మూసేసింది అన్న పూర్ణమ్మ. ఇద్దరి కొడుకులు తన తలను సృశిస్తూ వుంటే శాశ్వితంగా ఈ లోకం వదలి పోయింది అన్నపూర్ణమ్మ.


***************************************


దశ దిన కర్మ లన్నీ ముగించారు అన్న దమ్ములు. ‌ వచ్చిన బంధువులంతా వెళ్ళి పొయ్యారు మళ్ళీ ఆ ఇంటిలో నలుగురే మిగిలారు. అంతలో ఆశ్రమం నుండి ఒకతను అన్నపూర్ణమ్మ తాలూకు సంచి, మందులు, ఇంకా కొన్ని కాగితాలు ఇచ్చి వెళ్ళి పొయ్యారు.


"ఒరేయ్ తమ్ముడూ! అమ్మ పేరుతో బాంక్ అక్కౌంట్స్, కొన్ని ఎఫ్ డీ ఆర్ లు ఉన్నాయి. అవి తీస్తావా.. చూద్దాము" అన్నాడు రామ ప్రసాద్.


"అమ్మ అవసరాలు తీర్చ లేని వాడివి అమ్మ దాచిన సొమ్ములు మీద మనసు పడిందా?" అని వెటకారంగా అన్నాడు తమ్ముడు.


"అమ్మకు ఇష్టం లేక పోయినా ఆమెను ఆశ్రమంలో చేర్చి ఆమె మనసును క్షోభపెట్టావు. ఆమెను మానసికంగా హింసించి ఆమె చావుకు కారణం అయ్యావు నువ్వు. నా కేదో పెద్ద నీతులు బోధిస్తున్నావు." అన్నాడు అన్నయ్య ఉక్రోషంగా.


తోడి కోడళ్ళు ఇద్దరూ ఎడ మొహం పెడ మొహం వేసుకొని కూర్చొన్నారు. కృష్ణ ప్రసాద్ అమ్మ ట్రంకు పెట్టె తెరచి రెండు ఎఫ్ డీ అర్ రశీదులు, ఒక ఇరవై తులాల బంగారు వుండడం చూశారు. కోడళ్ళు బంగారాన్ని చూస్తూనే కళ్ళు చాటడంత అయ్యాయి. ఒక్కొక్క ఏఫ్ డి ఆర్ యాభై లక్షలు ఉంది. తన భర్త వుండగా అన్న పూర్ణమ్మ మీద కోటి రూపాయలు డిపాజిట్ చేశాడు. దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ అన్న పూర్ణమ్మ ఖర్చులకు సరిపొయ్యేది.


ఈ సంచీలో అమ్మ ఏదో ఉత్తరం వ్రాసి వుంది. ఏదో చదవండి అన్నది పెద్ద కోడలు. రామ ప్రసాద్ ఆ ఉత్తరం తెరచి చదివాడు.


"రామా.. కృష్ణా ! ముద్దుగా మీ పేర్లు పిలుచుకొని నేనూ మీ నాన్న ఎంత ఆనంద పడి పొయ్యే వాళ్ళమో! మీకేమి.. రత్నాల్లాంటి కొడుకుల్ని ఇద్దర్ని కన్నారు అనే వాళ్ళు బంధువులంతా! కానీ మీ వివాహాల అయిన తరువాత ఈ అమ్మ మీకు భారమై పోయింది. ఇద్దరూ వంతులు వేసుకొని తల్లి సంరక్షణా బాధ్యతల్ని పూర్తిగా విస్మరించారు. వయసు ఉడిగిన తల్లిదండ్రులను కొడుకు కోడళ్ళు తప్ప ఇంకెవరు చూసుకొంటారు? నాకు రోజు రోజుకూ అభద్రతా భావం పెరిగి పోయింది. మన స్వంత ఇంటిలోనే నన్ను పరాయి దానిగా మీరు చూడడం నేను జీర్నించు కోలేక పొయ్యాను.


మీరు తల్లిని చూసుకోవడం ఒక బర్డన్ గా ఫీల్ అయ్యారు. గానీ అది మీ బాధ్యత, కర్తవ్యం అనుకోలేదు. ఎప్పుడయితే మీరు మీ కర్తవ్యాన్ని మరచి పొయ్యారో, మీకు తల్లిదండ్రులు సంపాదించిన ఆస్థుల మీద గూడా హక్కు లేనట్లే! దానికి మీరు అనర్హులు. గాబట్టి ఈ కోటి రూపాయలు నేను వుంటున్న ఈ ఆశ్రమానికి విరాళంగా ఇచ్చేస్తున్నాను. ఇదే నా వీలునామా అనుకోండి.


అలాగే మా పుట్టింటి వారు నాకిచ్చిన ఈ బంగారు ఆభరణాలు గూడా అమ్మి మన సైనిక నిధికి అందచెయ్యండి. దేశ సేవ చేస్తూ అసువులు బాసి వీర మరణం చెందిన వీర సైనికుల మాతృ మూర్తులకు, వితంతువులకు నా విధిగా ఈ ఆభరణాలని విరాళంగా ఇచ్చెయ్యండి.


అలాగే నా బాంక్ అక్కౌంట్ లో ఉన్న నాలుగు లక్షలు నా దశ దిన కార్యక్రమాలకు ఖర్చు పెట్టండి.


- ఇట్లు మీ అమ్మ"


అని ఆ తెల్ల కాగితంలో సుదీర్ఘమైన ఉత్తరాన్ని చదివి అన్నదమ్ముల మొహంలో నెత్తురు చుక్క లేక పాలిపొయ్యాయి. కోడళ్ళు ఇద్దరూ అత్తగారి సంచీని నేల కేసి కొట్టి రుస రుస మని వెళ్ళి పొయ్యారు.


చేసే దేమీ లేక అన్నదమ్ములిద్దరూ అమ్మ వీలు నామా ప్రకారం వృద్ధాశ్రమానికి కోటి రూపాయలు విరాళ మిచ్చారు. బంగారు ఆభరణాల్నీ జాతీయ సైనిక నిధికి అంద చేశారు. ****************************************

వారణాసి భానుమూర్తి రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

వారణాసి భానుమూర్తి రావు గారు ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లాలోని మహల్ రాజుపల్లె లో జన్మించాడు. అతను వృత్తిరీత్యా కార్పొరేట్ కంపెనీలల్లో ముఖ్య ఆర్థిక కార్య నిర్వహణాధికారిగా పనిచేసాడు. ప్రవృత్తి రీత్యా కథలు , వచన కవితలు రాస్తున్నాడు. ఇప్పటికి అతను 60 కథానికలు, 600 దాకా వచన కవితలు రాశాడు. అతని కథలు ఆంధ్ర జ్యోతి , విజేత , ఆంధ్ర ప్రభ మొదలైన పత్రికలలో ప్రచురింపబడ్డాయి. మొదటి కథ ఆంధ్ర ప్రభ సచిత్ర వార పత్రిక లో 1981 లో 'జీవన గతులు ' అనే కథ అచ్చయ్యింది. తరువాత ' ఈ దేశం ఏమై పోతోంది? ' అనే అదివారం ఆంధ్రప్రభ దిన పత్రిక లో అచ్చయ్యింది. ఆంధ్ర జ్యోతిలో పది కథలు దాకా అచ్చయ్యాయి. నల్లటి నిజం , జన్మ భూమి , అంతర్యుద్ధం , వాన దేముడా! లాంటి కథలు అచ్చు అయ్యాయి. 2000లో "*సాగర మథనం* ", 2005 లో " *సముద్ర ఘోష*" అనే కవిత సంపుటిలను ప్రచురించాడు. అందులో "సముద్ర ఘోష" పుస్తకాన్ని అక్కినేని నాగేశ్వర రావు గారికి అంకితం చేశారు. ఈ పుస్తకాన్ని జ్ఞాన పీఠ్ అవార్డు గ్రహీత , డాక్టర్ సి. నారాయణ రెడ్డి విడుదల చేసారు. అతను రాసిన కథ "పెద్ద కొడుకు" ( రాయల సీమ రైతు బిడ్డ మీద కథాంశం) భావగీతి ప్రతిలిపి 2014 కథల పోటీలో ప్రతిలిపి ద్వారా ప్రత్యేక బహుమతి పొందింది.ఈ కథను 60000 మంది పాఠకులు చదివారు. 4500 మంది స్పందించారు.

వారణాసి భానుమూర్తి రావు రాయలసీమ వ్యవహారిక బాషలో వ్రాయడానికి ఇష్టపడతారు.ఇప్పుడు " రాచపల్లి కథలు " , " నాన్నకు జాబు " అని తమ చిన్ననాటి అనుభవాలన్నింటినీ అక్షర రూపంలో నిక్షిప్తం చేస్తున్నారు.‌ .అలాగే తన మొట్టమొదటి నవలా ప్రక్రియను " సంస్కార సమేత రెడ్డి నాయుడు " తెలుగు వారి కోసం వ్రాశారు .ఆ తరువాత '' వరూధిని - ప్రవరాఖ్య '' శృంగార ప్రబంధ కావ్యాన్ని తమ దైన శైలిలో నవలీ కరణ చేశారు . కరోనా పై వీరు రాసిన కవిత ఆంధ్ర ప్రభలో ప్రచురించారు. సాహిత్య రంగంలో విశేషమైన ప్రతిభ ను కనబరచిన వీరికి సాహితీ భూషణ , ప్రతిలిపి కవితా ప్రపూర్ణ ,సహస్ర కవి రత్న అనే బిరుదులు లభించాయి.

వారణాసి భానుమూర్తి రావు గారు ఇటీవల అనగా ఏప్రిల్‌ నెల 2022 లో రెండు పుస్తకాలు పాఠక లోకానికి అందించారు. 1. *మట్టి వేదం* కవితా సంపుటి 2. *సంస్కార సమేత రెడ్డి నాయుడు* తెలుగు నవల . గిడుగు రామమూర్తి పంతులు ఫౌండేషన్ వారిచే సాహిత్య రంగంలో విశేష మైన సేవలు చేసినందుకు గానూ , వీరి *మట్టి వేదం* కవితా సంపుటికి , *గిడుగు రామమూర్తి సాహిత్య పురస్కారం -2022* ని అందు కొన్నారు.

తెలుగు కవులు లో వారణాసి వారి కథలు రాయల సీమ గ్రామీణ ప్రాంతాల నేపథ్యంలో కలిగి వుంటాయి.చిత్తూరు జిల్లాకు చెందిన వారణాసి భానుమూర్తి గారి కథలు , కవితలు వివిధ ఆన్ లైన్‌ పత్రికలలో వచ్చాయి. త్వరలో మరి కొన్ని నవలలు , కథల సంపుటాలు , కవితా సంకలనాలు వెలువడుతున్నాయి.ఇంతవరకు మూడు కవితా సంపుటిలు , ఒక నవలను పాఠక లోకానికి అందించారు.

*వీరి ముద్రిత రచనలు* ------------------

1. *సాగర మథనం* : 2000 సంవత్సరంలో అవిష్కరించారు. డాక్టర్ గోపీ గారు , తెలుగు అకాడమీ ప్రధాన సంచాలకులు , ఈ కవితా సంపుటి మీద ముందు మాట వ్రాశారు.

2. *సముద్ర ఘోష*: 90 కవితలున్న ఈ కవితా సంపుటి 2005 సంవత్సరంలో జ్డానపీఠ్ అవార్డు గ్రహీత , డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారు ( సినారె) అవిష్కరించారు. ఈ పుస్తకాన్ని , పద్మ విభూషణ్ డాక్టర్ నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారికి అంకిత మిచ్చారు .

3. *మట్టి వేదం* : 70 కవితలున్న ఈ కవితా సంకలనాన్ని 2022 ఏప్రిల్‌ నెల 17 వ తేదీ వెలువరించారు.‌ ఈ పుస్తకానికి కే రే జగదీష్ గారు , ప్రముఖ కవి , జర్నలిస్టు ముందు మాట వ్రాశారు

4. *సంస్కార సమేత రెడ్డి నాయుడు* : ఇది రచయిత గారి తొలి నవలా ప్రక్రియ. ఈ నవల 17 ఏప్రిల్ 2022 నాడు అవిష్కరణ జరిగింది. ఈ నవల రాయల సీమ కక్షలు , ఫాక్షన్ ల మధ్య ఎలా రెండు కుటుంబాలు , రెండు గ్రామాలు నలిగి పొయ్యాయో తెలిపిన కథ. శ్రీమతి రాధికా ప్రసాద్ గారు ఈ నవలకు ముందు మాట వ్రాశారు. ఈ నవలకు ప్రతిలిపి సాహిత్య అవార్డు - 2021 అందు కొన్నారు.

5. *పెద్ద కొడుకు* : 19 కథల సంపుటి. వారణాసి భానుమూర్తి రావు గారు వ్రాసిన కథల సంపుటి *పెద్ద కొడుకు* తుమ్మల పల్లి కళా క్షేత్రం , విజయ వాడ లో మల్లె తీగ వారు నిర్వహించిన జాతీయ సాంస్కృతిక ఉత్సవాల సందర్భంగా శ్రీమతి లక్ష్మీ పార్వతి గారు , ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చేర్ పర్సన్ , కళారత్న శ్రీ బిక్కి కృష్ణ , తదితరుల చేతుల మీదుగా 20.11.2022 తేదీన అవిష్కరించారు. ఇందులో 19 కథలు ఉన్నాయి. ప్రతి కథ ఆణి ముత్యమే. కళా రత్న శ్రీ బిక్కి కృష్ణ గారు ముందు మాట వ్రాసిన ఈ పెద్ద కొడుకు కథల సంపుటి మానవీయ విలువల్ని అనేక కోణాల్లో రచయిత స్పృశించారు. వారణాసి గారు ఈ " పెద్ద కొడుకు " కథల సంపుటిని పాఠక లోకానికి అందించారు. ఇందులోని కథలన్నీ ఆణి ముత్యాలే! సమాజానికి సందేశ మిచ్చే కథలే!

*అముద్రిత రచనలు*

1 . *వరూధిని ప్రవరాఖ్య* : అల్లసాని పెద్దన గారి మను చరిత్రము నవలీ కరణ చేశారు‌. ఇది ఇంకా అముద్రితము.త్వరలో ప్రచురణకు వస్తుంది.

2 .*రాచ పల్లి కథలు* : తన చిన్న నాటి అనుభూతుల్ని , గ్రామీణ ప్రాంతాల్లో తను గడిపిన అనుభవాల్ని క్రోడీకరించి వ్రాసిన కథానికలు . త్వరలో ప్రచురణకు వస్తుంది.

3 . *నాలుగవ కవితా సంపుటి* త్వరలో వస్తుంది.

4 . *నాయనకు జాబు* అనే ధారావాహిక ఇప్పుడు వ్రాస్తున్నారు. లేఖా సాహిత్యం ద్వారా కథను వాస్తవిక సంఘటనలతో చెప్పడం ఈ జాబుల ప్రత్యేకత.

*విద్యాభ్యాసం* -----------

వారణాసి భానుమూర్తి గారి విద్యాభ్యాసం అంతా చిత్తూరు జిల్లాలో జరిగినది.

ఐదవ తరగతి వరకూ ప్రాధమిక పాఠశాల మహల్ లో , తరువాత ఆరవ తరగతి నుండి ఎనిమిదవ తరగతి వరకూ మహల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో జరిగింది. ఆ తరువాత తొమ్మిది , పది తరగతులు మేడికుర్తి కలికిరి చిత్తూరు జిల్లా జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల లో చదివారు.‌ ఇంటర్మీడియట్ మరియు బి కాం బీ.టీ కాలేజీలో చదివారు.‌ తరువాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు ఎస్ వీ యూనివర్సిటీ లో చదివారు.‌ వుద్యోగ నిమిత్తం హైదరాబాదు వెళ్ళిన తరువాత అక్కడ కాస్ట్ అండ్ మేనేజ్ మెంట్ అక్కౌంటన్సీ ( FCMA) చేశారు.‌ ప్రొఫెషనల్ అక్కౌంట్స్ లో నిష్ణాతులయ్యారు.

*వృత్తి* ------

వారణాసి భానుమూర్తి గారు అక్కొంట్స్ మరియు ఫైనాన్స్ జనరల్ మేనేజర్ గా వివిధ కార్పోరేట్ కంపెనీలల్లో పని చేశారు. హైదరాబాదు మహా నగర మంచి నీటి సరఫరా మరియు మురుగు నీటి సంస్థలో చీఫ్ జనరల్ మేనేజర్ (అక్కౌంట్స్) గా పని చేశారు.ఒక పేరు పొందిన నిర్మాణ సంస్థలో సీనియర్ జనరల్ మేనేజర్ (అక్కొంట్స్ మరియు ఫైనాన్స్ ) గా పని చేసి వివిధ బాధ్యతలను 36 సంవత్సరాల పాటు నిర్వర్తించారు. కాస్ట్ అక్కౌంట్స్ హైదరాబాదు చాప్టర్ కి వైస్ చేర్మన్ హోదాలో బాధ్యతలను నిర్వర్తించారు.

వృత్తి ఏమైనప్పటికీ , ప్రవృత్తిగా కవిగా , రచయితగా రాణించారు. పదవ తరగతి నుండీ కవితలు , కథానికలు వ్రాశారు.ఇతని కథలు , కవితలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ‌

ఇతనికి ఇంత వరకు లభించిన బిరుదులు; 1. ప్రతిలిపి కవితా ప్రపూర్ణ 2. సహస్ర కవి రత్న 3. సాహితీ భూషణ 4. గిడుగు రామమూర్తి వారి సాహిత్య పురస్కారం 2022 లో. 5. ప్రతిలిపి సాహిత్య అవార్డు - 2021 6. కళావేదిక వారి సాహితీ పురస్కారం 31.12.2022 న అందుకొన్నారు.


Comentarios


bottom of page