top of page
Writer's pictureAyyala Somayajula Subramanyam

అమ్మ చెప్పింది


'Amma Cheppindi' - New Telugu Story Written By Ayyala Somayajula Subrahmanyam

'అమ్మ చెప్పింది' తెలుగు కథ

రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

అమ్మ చెప్పింది.

అమ్మ చెబుతుంది.

అమ్మ చెబుతూనే ఉంటుంది.

అది అమ్మ మనసు.

అమ్మ ప్రేమ.

అమ్మ బాధ్యత.

అమ్మ లే అంత!


ఆ మాటలని అర్థం చేసుకోగలిగితే, ఆ భావాలని గ్రహించగలిగితే.. అవే ఉపనిషత్తులు, ఖోరాన్‌, అదే బైబిల్‌, అదే భదవద్గీత.. ఓ బిడ్డ జ్ఞాపకాల మాటలలో అమ్మ మాటలు..


'అమ్మా, మా బళ్ళో ఉపన్యాసపోటీలు పెట్టారు'

పొడిపొడిగా చెబుతాన్నేను.


'మొదటి బహుమతి ఎవరికిరా.. ?’


అమ్మెంత కుతూహలంగా అడుగుతుందో నాకు తెలుసు. నేను చెప్పను.

ఓ నవ్వు నవ్వుతాను.

ఆ నవ్వుకు అమ్మ పెట్టిన ముద్దు పేరు దొంగనవ్వు.

వెన్నదొంగ నవ్వు!


'నీ బిడ్డ పాల్గొన్న పోటీల్లో, ఇంకొకరికి బహుమతా?..’

ఆ నవ్వుకున్న బోలెడన్ని అర్థాల్లో అదొకటి.


'నీకే కదూ..' రెట్టిస్తుంది అమ్మ.


' కాదు..' ఉడికిస్తాన్నేను.


'నీకే..'


' కాదు..'


మా ఇద్దరికీ తెలిసిన దాగుడుమూతలాటే! ఎలా కనిపెడుతుందో, పుస్తకాల అడుగున దాచేసిన బహుమతి బయటికి తీస్తుంది.


'దొంగ దొరికిపోయాడు..'

శిక్ష విధించడమే తరవాయి.

బుగ్గ మీద ముద్దు.

‘కమ్మని శిక్ష!’


అమ్మకైతే, తనకే వచ్చినంత ఆనందం, ఆ బహుమతేదో, నిజంగానే. ఆ గెలుపు అమ్మ గెలుపే. ఆ గెలుపు అమ్మదే.


చిన్నప్పుడు నాకు 'ష' పలికేది కాదు. ఎంత గొప్ప విషయాన్నైనా ‘విసయమ’ అనే అనే వాడిని. కొంచెం నత్తి కూడా.

తోటి పిల్లలకు అదో వినోదం.


విషయసూచిక.. 'ఏదీ పలుకు చూద్దాం’ అనే వాళ్ళు.

నాకు రాదు. ఘొల్లున నవ్వేవాళ్ళు.

శిరస్త్రాణం..

నేను పలకలేను. వెనువెంటనే వెక్కిరింతలు.

నా మొహం చిన్నబోయేది.


ఓ మూలన కూర్చుని వెక్కి వెక్కి ఏడ్చేవాణ్ణి. అప్పుడు

"అమ్మ చెప్పింది"..


'నాన్నా, పదాలు కూడా ప్రపంచం లాంటివే ! మనం భయపడుతున్నామని తెలిస్తే నెత్తి కెక్కి కూర్చుంటాయి. తిరగబడ్డామా, తోక ముడుస్తాయి. సాధనతో

మాటలు నేర్చుకున్న మూగవాళ్ళు ఉన్నారు. నువ్వు నత్తిని గెలవలేవా ?’


ఆ వేసవి సెలవులలో అమ్మ తన పనులన్నీ పక్కన పెట్టుకుంది. "విష్వక్సేనుడు" వంటి కఠిన పదాలన్నీ వెతికి వెతికి ఓ చోట రాసిచ్చేది. నేను సాధన చేసేవాణ్ణి.

సెలవులు పూర్తయ్యే సరికి నా నత్తి పోయింది.

పంద్రాగస్టు వక్తృత్వ పోటీలలో విజేత నేనే.

"సాధనమున పనులు సమకూరు ధరలోన".

------------------------------------------


పదో తరగతి పరీక్షా ఫలితాలు వచ్చాయి. ప్రథమ శ్రేణిలో నా పేరు లేదు. ద్వితీయ శ్రేణిలో వెతికాను. కనబడ లేదు. మిగిలింది తృతీయ శ్రేణి. అక్కడా లేదు. అప్పటికే నా కళ్ళలో నీళ్ళు తిరుగు తున్నాయి. సానుభూతి కురిపిస్తున్నారు. ఓదారుస్తున్నారు. ఎగతాళి చేస్తున్నారు. నా కేమీ వినిపించడం లేదు. మెదడు మొద్దు బారిపోయింది.


నేను పరీక్ష తప్పడమేమిటీ? ఎక్కడో పొరపాటు జరిగింది.

తప్పొప్పులు తరువాత. అమ్మ కెలా మొహం చూపించను? నన్ను చదివించడానికి తనెంత కష్టపడింది! వంటలు చేసింది. వడియాలు పెట్టింది. కారం దంచింది. పిండి రుబ్బింది. పస్తులు గడిపింది.


ఆ కష్టానికి నే నిచ్చే బహుమతి ఇదా!


అమ్మ నా కోసం ఎదురు చూస్తుంది. నేను చెప్పబోయే కబురు కోసమే. ఎదురు చూస్తోంది. నోరు తీపి చేయడానికి, పక్కనే చక్కెరడబ్బా కూడా పెట్టుకుంది.


గుండెల్లోంచి దుఃఖం ఎగదన్నుకొచ్చింది. అమ్మ ఒళ్ళో తల దాచుకుని పసివాడిలా ఏడ్చాను. అమ్మ కొంగు తడిసి పోయేంతగా ఏడ్చాను. ఆ కాసేపూ తను ఒక్క మాట కూడా మాట్లాడలేదు.


ఏడ్చి ఏడ్చి నా గుండె తేలికపడ్డాక,

"అమ్మ చెప్పింది"..


“పిచ్చినాన్నా! ఎందుకంత బాధపడతావు. పరీక్షేగా.. మళ్ళీ రాసి పాసవ్వచ్చు. మహా అయితే ఒక ఏడాది వృథా అవుతుంది. కానీ ఈ అనుభవం నీకు జీవితాంతం పనికొస్తుంది. కెరటానికీ అంతెత్తున ఎగిరే శక్తి ఎక్కడిదో తెలుసా? కింద పడ్డప్పుడు వచ్చిందే. మళ్ళీ పరీక్షలు రాయి. నువ్వు తప్పకుండా పాసవుతావు మరి. ఆ నమ్మకం నా కుంది”.


అమ్మ నమ్మకం వృధా కాలేదు. నేను పాసయ్యాను. ప్రథమశ్రేణీ, ద్వితీయ శ్రేణీ.. ఈ లెక్కలకు అందనంత గొప్ప ఫలితం సాధించాను. ఏ విద్యార్థికి రానన్ని మార్కులొచ్చాయి. పై చదువులకు ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తానంది.


పేపరులో నా ఫోటో చూశాక అమ్మకైతే నోటిలోంచి ఒక్కమాట కూడా రాలేదు.

నోరంతా తీపిమయం.

----------------------------------------


ఒకే సారి రెండు ఉద్యోగాలు. దేనిని ఎంచుకోవాలో తెలియదు. ఫ్రొఫెసర్లని అడిగాను. స్నేహితులను అడిగాను. చాలామంది చాలా సలహాలిచ్చారు. ఏదీ నా మనస్సుకు

దగ్గరగా లేదు.


మనసంటే గుర్తుకొచ్చింది.. అమ్మ నడగాలీ..


అమ్మకేమీ తెలియకపోవచ్చు. కానీ నేను తెలుసు. నా ఇష్టాయిష్టాలు తెలుసు. నాకు ఇష్టమైన వంటలు చేసిపెట్టే అమ్మ, నా కిష్టమైన ఉద్యోగం గురించి మాత్రమేం

చెప్పలేదా?


"అమ్మా.. మరేమో, ఇది బహుళ జాతిసంస్థ లో ఉద్యోగం. జీతం లక్షల్లో. విదేశాల్లో స్థిరపడే అవకాశం ఉంది.


ఇదేమో ప్రభుత్వ ఉద్యోగం. దాంతో పోలిస్తే జీతం తక్కువే. అవసరమైతే గిరిజన ప్రాంతాల్లో పని చేయాలి. నగరానికి దూరంగా ఉండాలి. దేనిని ఎంచుకోమంటావో చెప్పు?”


"అమ్మ చెప్పింది"..


'ఎంత సంపాదన ఉన్నా, ఇష్టం లేని పనుల్లో ఆనందం ఉండదు. నీ వల్ల నలుగురికి మంచి జరగాలి. నలుగురు గొప్పగా చెప్పుకోవాలి. ఉద్యోగానికి జీతమో, ప్రమోషనో కొలమానం కాదు’


అమ్మ నా కళ్ళు తెరిపించింది.

కర్తవ్యాన్ని బోధించింది.

-------------------------------------------


‘అమ్మా! పెళ్ళి మనిషిలో స్వార్థాన్ని పెంచుతుంది. మూడు ముళ్ళు పడగానే అమ్మ ప్రేమనూ భరించలేని మరో వ్యక్తి ప్రవేశిస్తుంది. నేను నా భార్యా, నా పిల్లలూ.. ప్రపంచం కురచైపోతుంది. ఆ ఇరుకిరుకు జీవితం నా కొద్దమ్మా! నువ్వు విశాలంగా ఆలోచించడం నేర్పించావు. అట్లాగే బతకనివ్వు!..’

వివాహ వ్యవస్థ మీద నా భయాలు నాకున్నాయి. నా అపోహలు నాకున్నాయి.. అన్నీ అమ్మ ముందు పెట్టాను.

అమ్మ ధైర్యం చెప్పింది. చిన్నప్పుడు చీకటిలో మర్రి చెట్టును చూసి దెయ్యమనుకున్నప్పుడు, ఎలా భుజం తట్టి చెప్పిందో అలాగే..


"అమ్మ చెప్పింది.."


వెర్రి నాగన్నా! పిచ్చి పిచ్చి ఆలోచనలతో బుర్ర పాడు చేసుకోవద్దు. ఎవరికో ఏదో జరిగిందని నీకూ అలాగే జరుగుతుందనుకుంటే ఎలా చెప్పు? నీతో కలిసి ఏడడుగులు నడిచే పిల్ల, నీతో మూడు ముళ్ళు వేయుంచుకునే పిల్ల..

నాకు పోటీ కాదురా।


మనూళ్ళో సంక్రాంతికి నాటకాలు వేసేవారు గుర్తుందా। అందులో మొదటి కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు.. ఒకే పాత్ర ముగ్గురు ధరించే వాళ్ళు. అలానే అమ్మ పాత్ర కూడా. కానీ ఈ అమ్మ పాత్ర తొందరలోనే పూర్తి

కావచ్చు. కానీ అమ్మ బాధ్యత పూర్తి కాదు. దాన్ని అందుకోవడానికి వచ్చే ఇంకోఅమ్మ.. భార్య.


పెళ్ళిలో పురోహితులు చదివిన ఏ మంత్రానికీ నాకు అర్థం తెలియదు. నాకు తెలిసిందల్లా ఒకటే। అమ్మ లాంటి మరో వ్యక్తి జీవితంలో ప్రవేశిస్తుందని.


బహుశాః వివాహవ్యవస్థ పరమార్థం అదేనేమో !

----------------------------------------------------


ఒకటి.. రెండు.. మూడు..


ఎంతకీ రాదే తొమ్మిది! ఎంతని చూడాలి?

ఓ కొత్త ప్రాణికి ఓ కొత్త సభ్యుడికి( సభ్యురాలికి) మా చిన్ని ప్రపంచంలోకి స్వాగతం పలకడానికి అమ్మ, నేను, తను.. ప్రేమతో ఎదురుచూస్తున్నాం!


ఆ బుజ్జాయిక్కూడా మేమంటే ఎంత ప్రేమని? ఇంత.. ఇంత.. ఇంత.. అని చేతులు చాచి చెబుతోంది కాబోలు!


చేతులు విశాలమైన కొద్దీ మా ఆవిడ కడుపు పెద్దదవుతోంది. ఆ తల్లి మనసు మురిసి పోతోంది. సీమంతం రోజైతే ఆ ఇద్దరు అమ్మల ఆనందం చూడాలి.


"నన్ను కన్న తల్లి--- నా బిడ్డకు తల్లి" !!


ఆ పసిప్రాణికి అక్కడే, అమ్మ కడుపులో వెచ్చగా ఉన్నట్టుంది. డాక్టర్‌ రారమ్మని పిలిస్తే అడ్డంగా తలూపింది. బిడ్డ అడ్డం తిరిగింది. ప్రసూతి గదిలో అరుపులు.. అద్దాల తలుపుల్ని చీల్చుకుని బయటికి వినిపిస్తున్నాయి.


అమ్మా.. అమ్మతనం అంత కష్టమా ? రక్తమాంసాల బొమ్మను చేయడానికి నవమాసాలు శ్రమించాలా ? నువ్వు నన్ను కనడానికి అంత కష్టపడ్డావా.? అదిగో మళ్ళీ ఏడుపు.. ఎవరో రంపంతో కోస్తున్నట్లు..


నా కళ్ళల్లో నీళ్ళు. కన్నమనసుకు నా బాధ అర్థం కాకుండా ఉంటుందా?


"అమ్మ చెప్పింది"..


భయం లేదు నాన్నా ! అమ్మాయికి ధైర్యం చెప్పాల్సింది పోయి, నువ్వే డీలా పడిపోతే ఎలా ? పెద్ద పెద్ద డాక్టర్లున్నారు. ఏం ఫరవాలేదని మాటిచ్చారు. నువ్వేం బెంగపడొద్దు. అలా బయటికెళ్ళి కాఫీ తాగి రా। లేదంటే కాసేపు అలా తోటలో కూర్చో.


ఇష్టమైన సంగీతం విను. పది నిమిషాల్లో కాన్పు అయిపోతుంది. అంతా మంచేజరుగుతుంది.


అమ్మ మాట కొండంత ధైర్యం. అమ్మ చెప్పిందంటే అక్షరాలా నిజం. నేను తిరిగి వచ్చేలోపు.. చిరు చెమటలతో తను, చిరు నవ్వులతో అమ్మ.. ఇద్దరూ స్వాగతం

పలికారు. మూడో ప్రాణం చూడటానికి.


చిన్ని పాపాయి !


“పెద్ద పెద్ద కళ్ళు, కోటేరు ముక్కు, బంగారు రంగు.. అచ్చం నీలాగే ఉందిరా.."


అమ్మ కెంత సంతోషమో ! నాకు మాత్రం అమ్మలాగే అనిపించింది. అమ్మమ్మ ఒళ్ళో అమ్మ ఇలాగే ఉండేదేమో!

----------------------------------------


నా చిట్టి తల్లికి ఎన్ని తెలివితేటలు. ఎంత జ్ఞాపక శక్తి.. మూడేళ్ళకే అక్షరాలు నేర్చుకుంది. నాన్నమ్మ ప్రక్కన కూర్చుని విష్ణుసహస్రనామాలు, లలితా పారాయణ

చేసేది. అన్నమయ్య పదాలు పాడేది. ఆఫీసు, ఉద్యోగం, తిండీ- తిప్పలూ ఏమీ వద్దు. నా చిట్టి తల్లి సమక్షమే చాలు.


అదే ప్రపంచం. అదే సర్వస్వం. ఏ ఎక్స్‌ కర్షనో ఉందంటూ తను ప్రయాణమైనా.. ఏ కాన్ఫరెన్స్‌ పేరుతో నేను నగరం

వదిలేసి దాటినా.. ఆ రెండు రోజులూ, రెండు యుగాలు. మళ్ళీ బిడ్డను చూసే దాకా, బిడ్డ మాటలు వినే దాకా, బిడ్డతో కలిసి ఆడుకునే దాకా మనసంతా గందరగోళం. ఏదో తెలియని వెలితి.


అలాంటిది నా తల్లి పెద్ద చదువులకు విదేశాలకు వెళతానంటే, రెండేళ్ళు రానే రానంటే నా మనసెలా ఒప్పుకుంటుంది. ?


ఎంత పెద్ద చదువు. కానీ ఇక్కడే చదువుకోవమ్మా ! నా కళ్ళ ముందే చదువుకోమ్మా! ఏ పుస్తకాలు కావాలంటే, ఆ పుస్తకాలు తెప్పిస్తా. ఏ ప్రొపెసర్‌ కావాలంటే ఆ ప్రొఫెసర్‌తో స్పెషల్‌ కోచింగ్ ఇప్పిస్తా. నువ్వు మాత్రం నన్నొదిలి వెళ్ళడానికి

వీల్లేదురా..


బతిమాలాను. కన్నీళ్ళుపెట్టుకున్నాను. భయపెట్టాను. బెదిరించాను. అది జగమొండి. అనుకున్నది సాధిస్తుంది. నా తత్త్వమే ! తండ్రిగా నా బాధ బంగారు తల్లికి అర్థం కాలేదు. కానీ నా కన్నతల్లి అర్థం చేసుకుంది.


"అమ్మ చెప్పింది"..


దాన్ని ఆపొద్దురా. వెళ్ళనీ. ప్రపంచాన్ని చూడనీ. చదవాలనుకున్న చదువులన్నీ. కన్నప్రేమ నీతో ఇలా మాట్లాడిస్తోంది. కానీ నిజం చెప్పు. నీ బిడ్డ పెద్ద

చదువులు చదవాలని నీకు మాత్రం లేదా? నిజమే! తండ్రిగా ఆ ఎడబాటు భరించలేవు. మరి నేనెలా భరించాను. నువ్వు ఇంజనీరింగ్‌ చదవు కోసమూ, ఐపిస్‌ ట్రైనింగ్‌ కోసమూ అంతదూరం వెళ్తానంటే నే నొద్దన్నానా ? చిరునవ్వుతో

సాగనంపలేదా ! నువ్వు నా అంత ధైర్యంతో కూతుర్ని పంపు.


నిజమే. చేతిలో పాతట్రంక్‌ పెట్టె పట్టుకుని నేను పట్నం బస్‌ ఎక్కుతున్నఫుడు అమ్మ ఎంత నిబ్బరంగా వీడ్కోలు పలికింది. నేను మాత్రం ఇంత ఇరుకుగా ఆలో

చిస్తున్నా నేమిటీ ? అమ్మలా ఆలోచించడం ఎంత కష్టం! అమ్మలా పుడితే తప్ప అలా ఆలోచించలేం !

------------------------------------------------


చదువు, రీసెర్చీ, ఉద్యోగం, తీరిక దొరికితే సంగీతం. చిట్టితల్లి తన చుట్టూ ఓ పెద్ద ప్రపంచాన్నే సృష్టించుకుంది.

అప్పుడప్పుడూ ఈ మెయిల్స్‌, ఎప్పుడో తప్ప ఫోన్‌కాల్స్‌. హఠాత్తుగా ఊడిపడేది.


అదేమిటంటే 'జస్ట్.. సర్‌ఫ్రైజ్‌' అంటూ చుట్టేసేది. చదువైపోయింది. ఉద్యోగ మొచ్చింది. ప్రమోషన్లు వస్తున్నాయి. మరి పెళ్ళెప్పుడు చేసుకుంటావు తల్లీ అంటే,

' నచ్చినవాడు' దొరకనీ నాన్నా' అంటూ తప్పించుకునేది.


నిజమే! నా బంగారు తల్లి అందచందాలకు సరితూగేవాడు, విద్యలకు విజ్ఞానానికి సరిజోడైన వాడూ దొరకాలిగా!


పెళ్ళిపందిరి" ప్రకటన జల్లెడ పట్టేవాణ్ణి. చత్వారం సతాయించినా అక్షరమక్షరం చదివే వాణ్ణి. అందముంటే చదువుండదు. చదువుంటే సంస్కారముండదు. మ్యారేజీ బ్యూరో వాళ్ళు చేతులెత్తేశారు. బంధువులు, స్నేహితులు, పరిచయస్తులు.. ఎవరితో మాట్లాడినా అమ్మాయి పెళ్ళిగురించి.


ఓ రోజు ప్రొద్దున్నే పేపర్‌ చూస్తుంటే, చిట్టితల్లి నుంచి వాట్సప్‌ మెసేజ్‌.


‘ముఖ్యమైన విషయం మెయిల్‌ చేశాను. మీ అభిప్రాయం చెప్పండి.. ?’ అది సారాంశం.


ఏం రాసింది తను. కొంపదీసి అమెరికా లో స్థిరపడి పోతానంటోందా. మమ్మల్నే అక్కడికి రమ్మంటోందా?


ఇన్ బాక్స్ లోని ఉత్తరం, నేను కూర్చున్న కుర్చీ, ఎదురుగా కంప్యూటర్‌. నా గది, ఇల్లు.. మొత్తం ప్రపంచమే కుంగిపోతున్నట్లు అనిపించింది.


'డాడ్‌ । నేనో అబ్బాయిని ప్రేమిస్తున్నా. పేరు పంకజ్‌. బెంగాలీ వాళ్ళు. చాలా మంచివాడు. మా ఆఫీసు లోనే పనిచేస్తున్నాడు. మీకు ఇష్టమైతేనే పెళ్ళి చేసుకుంటాను. నాకు అతని కంటే మీరే ముఖ్యం. ఆ సంగతి పంకజ్‌కు చెప్పాను. మీ నిర్ణయం కోసం ఎదురు చూస్తుంటా. అమ్మనూ, నాన్నమ్మనూ అడిగినట్లు చెప్పండి.’

'ఎలా కుదురుతుంది. మనమేమిటీ. మన సంప్రదాయ మేమిటీ? మనమేమో తెలుగువాళ్ళం. వాళ్ళ భాష వేరు. వాళ్ళ పద్దతులు వేరు. అలా ఎవరినో పెళ్ళి చేసుకుంటానంటే ఎలా ఒప్పుకుంటాను? కుదరదని చెప్పేస్తాను. ఇక చదివింది చాలు. ఉద్యోగాలు చేసింది చాలు. తక్షణం వచ్చేయ మంటాను. నేను చూసిన సంబంధం చేసుకోమంటాను.'


మొండి కేస్తే..


నాలో ఆవేశం కట్టలు తెచ్చుకుంది. అప్పటికప్పుడు ఎవరూ మాట్లాడలేదు. నేను కాస్త శాంతించాక..


"అమ్మ చెప్పింది"..


మరొక్కసారి స్థిమితంగా ఆలోచించరా । ప్రపంచమంతా కుగ్రామమై పోయిందని నువ్వే అంటూంటావుగా !


అటువంటప్పుడు దేశమేమిటీ? రాష్ట్రమేమిటీ? భాష ఏమిటీ? అయినా అమ్మాయి తనకిష్టమైన వాణ్ణి పెళ్ళి చేసుకుని నేరుగా ఇంటికి తీసుకు వచ్చినా, నువ్వు చేసేదేమీ లేదు. అయినా ఆ కుర్రాడు భిన్నత్వంలో ఏకత్వం లాంటి, వసుధైక కుటుంబం ఐన భారతదేశ పౌరుడే కదా !


వాళ్ళదీ మంచి కుటుంబం అని అమ్మాయంటోంది కదా! వాళ్ళది కూడా ఉన్నతమైన కుటుంబమే కదా। అయినా దాని జీవితం దానిదీ. చదువుకుంది. స్వతంత్రంగా ఆలోచించ

గలుగుతుంది. అడ్డుకోవడానికి నువ్వెవరు?


కన్నతండ్రిని- అంటే అనొచ్చు. నిజమే. ఆ గౌరవం తోనే నీ అనుమతి అడిగింది. ఈ తరంలో ఎంతమందికి ఉంటుందా సంస్కారం. దాని మనసు అర్థం చేసుకుని, పెళ్ళికి ఒప్పుకో’


నిజమే. ఎంత చదువు చదివినా, ఎంతెత్తుకు ఎదిగినా నా బిడ్డ తండ్రి కివ్వాలిసిన గౌరవం ఇస్తూనే ఉంది. అందుకే నా అనుమతి కోరింది. ఆ గౌరవాన్ని నిలుపు కోవడం నా ధర్మం.

అమ్మ చెప్పిందే కరెక్ట్‌.

------------------------

ఊపిరి ఉన్నంత కాలం, గుండె కొట్టుకున్నంతకాలం, ఆలోచనలు పట్టుకొస్తుంన్నంత కాలం కళ్ళముందో కళ్ళలోనో బిడ్డ కనిపిస్తుంన్నంత కాలం..


అమ్మ చెబుతూనే ఉంటుంది.

అమ్మ మాట. వినని బిడ్డలు ఉండొచ్చు.

కానీ, బిడ్డలకు బుద్దిమాట చెప్పని అమ్మల్లేరు.

అమ్మ గురించి ఏం చెప్పినా అపురూపంగానే ఉంటుంది. చెప్పాలనే మనసుంటే చాలు.


"అమ్మ చెప్పింది అక్షరాల నిజం."

" అమ్మ తథాస్తు దేవత."


శుభంభూయాత్‌.

అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం

రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.

అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.

ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,

ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.



30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.








262 views1 comment

1 comentario


ajayparu1959
03 jul 2023

Very Very nice.

Me gusta
bottom of page