top of page

దిద్దుకున్న నిర్ణయం


'Diddukunna Nirnayam' - New Telugu Story Written By Yasoda Pulugurtha

'దిద్దుకున్న నిర్ణయం' తెలుగు కథ

రచన: యశోద పులుగుర్త

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

హైద్రాబాద్ లో అది ఒక ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ. ఆ కంపెనీని ఆనుకున్న పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ కూడా సాఫ్ట్ వేర్ కంపెనీలే. ఐ.టి కారిడార్ గా ప్రసిధ్ది చెందిన ఆ ప్రాంతం ఉదయం తొమ్మిది, పదిగంటల మధ్య రక రకాల యువతీ యువకులతో కళ కళ్లాడుతూ ఉంటుంది.


ఆ రోజు ఒక అందమైన అమ్మాయి, సన్నజాజి మొగ్గలాంటి అమ్మాయి పింక్ కలర్ షిఫాన్ చీర కి సన్నని జరీ బోర్డర్ తో, దానికి మేచ్ అయ్యే డిజైనర్ బ్లౌజ్ ధరించి అలా అలవోకగా వదిలేసిన జుట్టు గాలికి ఎగురుతుంటే, సుతారంగా సర్దుకుంటూ సెకెడ్ ఫ్లోర్ లో లిఫ్ట్ ఆగగానే ఆ అమ్మాయి లిఫ్ట్ లోపలి కి రాబోవడం, అదే సమయంలో ఫాషన్ కి మారుపేరులా ఉన్న ఒక అబ్బాయి లిఫ్ట్ లో నుండి బయటకు వస్తూ ఓరగా ఆమెవైపు చూసాడో క్షణం.


''రోజూ చూస్తూనే ఉంటాను, ఈ అమ్మాయిని ఎప్పుడూ ఇక్కడ చూడలేదే” అనుకున్నాడు. బహుశా కొత్తగా ఉద్యోగంలో చేరిందేమో అనుకున్నాడు.


అతను తనవైపే చూసిన చూపులకు తృటిలో ముఖం మరోవైపుకి తిప్పేసుకుంటూ ''ఏమిటీ అబ్బాయి గడ్డం పెంచేసుకుని, దేవదాసులా..” అనుకుంది. అమ్మాయిలు కాస్త అందంగా తయారైతే చాలు, అబ్బాయిల చూపులన్నీ అమ్మాయిలమీదే ననుకుంటూ గొణుక్కుంది'.


'అలకనంద’ అనే ఆ అమ్మాయి, మరో నలుగురు ఆమె స్నేహితురాళ్లు ఆఫీస్ కు ఆ రోజు చీరలు కట్టుకుని రావాలనుకున్నారు. ‘చీరకట్టుకునా!’ అంటూ హడలిపోతూ "అమ్మో! నేను రెగ్యులర్ వేర్ లో వస్తాన”ని అలకనంద అన్నా మిగతా నలుగురూ ఒప్పుకోలేదు. కట్టుకుని రావాలంటూ డిమాండ్ చేసేసరికి అలకనందకు తప్పలేదు. ఆ రోజు వాళ్ల ఫ్రెండ్ ప్రతిమ పుట్టినరోజు. అదీ విశేషం.


చిలిపిగా నవ్వుతూ నవ్విస్తూ ఉండే అలకనందను ఆ డిపార్ట్ మెంట్ లో అందరూ అభిమానిస్తారు. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి. హెచ్.ఆర్ విభాగంలో పనిచేస్తోంది. ఎమ్.బి.ఏ హ్యూమన్ రిసోర్సెస్ చదివింది. ఈ మధ్యనే రెండు నెలల క్రితమే వేరే కంపెనీ నుండి మారి ఈ కంపెనీకి వచ్చింది. ఆ రోజు హెచ్.ఆర్ డిపార్ట్ మెంట్ హెడ్, 'అలకనంద’ను తన కేబిన్ లోకి పిలిచాడు.


"చూడండి మిస్ అలకనందా, రెండురోజుల క్రితం డెవలప్ మెంట్ డిపార్ట్ మెంట్ హెడ్ ఫోన్ చేసి వచ్చే నెలలో యూకే కంపెనీ నుండి విలువైన ప్రాజక్ట్ ఆర్డర్ వస్తోందని, డెవలప్ టీమ్ కి మరో ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్స్ రిక్వైర్ మెంట్ ఉందని, ఎలాట్ చేయ”మంటూ ఇండెంట్ రైజ్ చేసాడు. 'ఆర్టిఫిషియల్ ఇంటిలిజన్స్' లో అనుభవం ఉన్నవారంటూ చూచాయగా చెప్పాడు.


ఎలాగూ వచ్చేవారంలో ఇంటర్వ్యూలు ఉన్నాయి కాబట్టి ఆ ప్రాజక్ట్ డిటైల్స్ ఏమిటో, ఆ ఫీల్డ్ లో ఎన్ని సంవత్సరాల అనుభవం కావాలో ఆ విభాగం టీమ్ లీడ్ తో చర్చించమని ఆదేశాలిచ్చాడు. ఆ టీమ్ లీడ్ తరుణ్ కి మెసేజ్ చేసింది. అర్జంట్ గా రమ్మనమని. తరుణ్ వచ్చాడు. అలకనందను చూడగానే ఆరోజు లిఫ్ట్ లో చూసిన అమ్మాయి ఈమె కదూ అనుకున్నాడు. కానీ అంతక మునుపు ఎక్కడో చూసినట్లుగా కూడా లీలగా గుర్తు. ఎక్కడబ్బా అని మనసులో గుర్తుచేసుకోడానికి ప్రయత్నిస్తున్నాడు.


అలకనంద పరిస్తితి కూడా అంతే. "ఏమిటో ఇతను, హీరో లా ఉన్నా షేవ్ చేసుకోకుండా ఆ గడ్డమేమిటో?.. ఫాషనా లేక నిజంగా వైరాగ్యమేనా? ప్రపంచంలోని బాధలన్నీ అతనే మోస్తున్నట్లు ఆ చూపులు". కానీ ఇతన్ని ఎక్కడో చూసానబ్బా అనుకోసాగింది. తన పని గుర్తొచ్చి వెంటనే అలర్ట్ అయి తనకు కావలసిన సమాచారాన్ని అతని నుండి సేకరించి ధాంక్స్ చెప్పి పంపించేసింది. తరుణ్ తన సీట్ లోకి వచ్చాడన్నమాటేగానీ ఆ అమ్మాయి పదే పదే గుర్తుకొస్తోంది.


'అలకనంద' పేరు కూడా మెరుపులా మెదడులోకి వచ్చి ఆ నాటి సంఘటన ఒక్కసారిగా గుర్తొచ్చి పెదవులపై దరహాసం మెరిసింది. 'ఏనాటి సంఘటన? దాదాపు రెండు సంవత్సరాలు అయిపోలేదూ’ అనుకున్నాడు. తనకి ఐఐటి ముంబై లో ఎమ్.టెక్ అప్పుడే పూర్తి అయింది. కేంపస్ సెలక్షన్ లో హైద్రాబాద్ లో ఒక ప్రముఖ కంపెనీలో మంచి ఆఫర్ వచ్చింది. ఇంకా ఉద్యోగం లో చేరడానికి నెలరోజులు సమయం ఉంది.


ఒక రోజు సడన్ గా నాన్న ఫోన్ చేసి "బామ్మ నీ పెళ్లి చూడాలనుకుంటోందిరా తరుణ్, పెళ్లి సంబంధాలు చూస్తున్నా”నంటూ చెప్పాడు.


“అప్పుడే పెళ్లేమిటి నాన్నా, చేసుకో”నన్నాడు.


“కాదురా తరుణ్, 'బామ్మ ఆరోగ్యం బాగాలేదు, బామ్మను సంతోషపెట్టరా'' అంటే తను మౌనం వహించాడు.


ఒక సంబంధం చాలా బాగుందని పెళ్లి చూపులకు పిలిపించి తనను తీసుకువెళ్లారు. 'ఇదిగో ఈ అమ్మాయే.. అలకనంద’.


ఈమె పేరు వినగానే అప్పుడు అలకనంద ఏమిటీ, తమాషాగా ఉందే పేరు, బహుశా ఆ అమ్మాయికి అలకలు ఎక్కువేమో అనుకున్నాడు. యస్.. ఇప్పుడు బాగా గుర్తొచ్చింది, ఈమెనే తను చూసాడు. అప్పుడు బొద్దుగా ఉంది. ముఖం అందగా ఉన్నా తన పక్కన లావుగా ఉంటుందని అనిపించింది. తను సన్నగా పొడువుగా ఉంటాడు. అప్పుడైతే చదువు, హాస్టల్ తిండి మూలాన ఇంకా బక్కపలచగా ఉండేవాడు. ఇంట్లో అందరికీ నచ్చింది సంబంధం. కానీ తన పక్కన అలకనంద నప్పదనుకున్నాడు.


'మేడ్ ఫర్ ఈచ్ అదర్’ కాదనుకున్నాడు. 'ఇప్పుడే లావుగా ఉంది, పెళ్లై పిల్లలు పుట్టాకా లడ్డు లా అయిపోతే'? తన ఫ్రెండ్స్ తనను టీజ్ చేస్తారు. ఈ అమ్మాయిని చేసుకోనని బొద్దుగా ఉందని ఇంట్లో చెప్పాడు. నాన్న కోపంతో తనపై విరుచుకు పడ్డాడు. లక్షణంగా ఆరోగ్యంగా ఉన్న అమ్మాయిని లడ్డూ లా ఉందని, బొండంలా ఉందంటావా అంటూ.


తనకి కూడా కోపం వచ్చింది. బామ్మ చచ్చిపోతుందని నా కోరికలను, ఇష్టాలను త్యాగం చేసేయాలా అంటూ తండ్రికి ఎదురుతిరిగాడు. చివరకు నాన్న మరో సంబంధం చూస్తాములే అని కన్విన్స్ అయ్యాడు. కానీ ఏ సంబంధం కుదరకుండానే తన పెళ్లి చూడకుండానే ఆరునెలల క్రితం బామ్మ పోయింది.


కానీ అలకనంద అప్పుడు బొద్దుగా ఉండేది, ఇప్పుడు ఇంత సన్నగా, నాజూగ్గా ఎలా అయిందోననుకుంటూ ఆశ్చర్యపోతున్నాడు. బహుశా తనను గుర్తుపట్టి ఉండదు. తనలోనూ చాలా మార్పు వచ్చింది. అప్పట్లో చాలా సన్నగా ఉండేవాడు. ఇప్పుడు కాస్తంత ఒళ్లు వచ్చింది. అందరూ తనని 'అల్లరి నరేష్' అంటూ జోక్ చేస్తారు. 'అలకనంద’కు ఈ విషయం గుర్తు చేద్దామా అనుకున్నాడు. మళ్లీ 'హమ్మో, ఈ ఆడపిల్లలతో ఎందుకొచ్చిన పెంట’నుకున్నాడు. ఒకవేళ అలకకు పెళ్లి అయిపోయిఉంటే తనను దులిపేయగలదని కూడా అనుకున్నాడు.


కానీ ఆ అమ్మాయి విశాలమైన సోగ కళ్లల్లో ఎంత అందం ఉందో కదా అనుకున్నాడు. ఆ అమ్మాయి రూపం అతని మనస్సు నుండి కదలనంటోంది. అలకనంద కి ఆరాత్రి పడుకునే సమయంలో తరుణ్ గుర్తొచ్చాడు. తను గుర్తుపట్టలేదనుకున్నాడు. పూర్ ఫెలో. తను అంత తొందరగా మర్చిపోయే రకంకాదు. అదీకాక తనకి అంత అవమానం అనిపించిన సంఘటనని ఎలా మరచిపోతుంది? రెండు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనే అయినా గుర్తొచ్చినప్పుడల్లా తనలో ఆవేశం చెలరేగి పోతుంది.


'ఏం తనేమైనా అందగాడు అనుకుంటున్నాడా'? పెరిగిన గడ్డంతో దేవదాసులా పోజులూ వాడూనూ. ఆ రోజు తనను చూసుకోడానికి వచ్చాడు అతని తల్లితండ్రులతో కలసి. పెళ్లి చూపులు అవీ అయిపోయాయి. తరువాత మధ్యవర్తి ద్వారా కబురు పంపారు. మీ అమ్మాయి మా అబ్బాయి పక్కన బొద్దుగా ఉంటుందని మా వాడు అంటున్నాడని, ఏమీ అనుకోద్దంటూ. అమ్మా నాన్న కి తరుణ్ సంబంధం బాగా నచ్చేసిన మూలాన చాలా నిరుత్సాహ పడ్డారు.


అప్పటినుండి అమ్మ తనని మాటి మాటికి బొద్దుగా ఉన్నావు తిండి తగ్గించమంటూ ఒకటే సూటీపోటీ మాటలు అనడం మొదలు పెట్టింది. ఆచితూచి అన్నం పెట్టేది. తనకి ముద్దపప్పు లో నెయ్యి ధారాళంగా వేసుకుని కొత్తావకాయ వేలికి అద్దుకుంటూ నంజుకుని తినడం చాలా ఇష్టం. నెయ్యి వేసుకుంటుంటే అమ్మ తనవేపు గుర్రుగా చూసేది. కొవ్వు పెరిగిపోతుందే, ఇంకా లావైతే పెళ్లే కాదంటూ. నెయ్యి సీసా తనకు కనిపించకుండా దాచేసేది. తను అమ్మని కోప్పడింది కూడా.


"ఛ, నీవు కన్న తల్లివేనా, కూతురికి కొసరి కొసరి తినిపించడం పోయి కూతురు తిండిని దిష్టికొడ్తున్నావా” అంటూ.


తనకి ఇష్టమైన స్వీట్స్, ఐస్ క్రీమ్ కూడా తిననిచ్చేది కాదు. తను బొద్దుగా ఉందన్న తరుణ్ మాటలకు తనలో ఆవేశం పొంగుకొచ్చింది. ఆవేదనతో తన మనస్సు ఎంత విలవిల్లాడిందో! ఆత్మన్యూనతా భావం తో బాధపడేది. నేను లడ్డూనైతే తను కాల్చిన అప్పడంలా లొత్తు బుగ్గలూ వాడూనూ అనుకుంది. అప్పట్లో తరుణ్ తనను కించపరచినందుకు ఏమైనా సరే బరువు తగ్గాలనుకుంటూ తనకి ఇష్టమైనవన్నీ తినడం మానేసింది. ఎక్సర్ సైజులూ, జిమ్, ఒకటేమిటి ఆకులూ అలములూ కూడా తింటూ బరువు తగ్గించుకుంది.


కానీ ఏ మాటకి ఆ మాటే, ఇప్పుడు తరుణ్ చాలా స్టెలిష్ గా కొత్తరకం హెయిర్ స్టైల్ తో భలే స్మార్ట్ గా ఉన్నాడు. ఇప్పుడందరూ గెడ్డం పెంచడం ఫాషన్ చేస్తున్నారనుకుంది. రేపు అతని ప్రొఫైల్ చూడాలి, ఇతన్ని చేసుకున్న ఆ మహా అందగత్తె ఎవరో, సన్నజాజి తీగలా ఉంటుందేమో అనుకోసాగింది. ఎలాగైనా ఆమెను ఒకసారి చూడాలని కూడా మనసులో తలబోసింది. తరుణ్ అప్పుడప్పుడు ఆఫీస్ కారిడార్ లోనూ, కెఫ్టెరియాలోనూ కనపడుతూనే ఉన్నాడు తనవైపు క్రీగంట చూస్తూ.


తను ఆ మాత్రం గమనించలేదనుకుంటున్నాడు. అతని ప్రొఫైల్ చెక్ చేస్తే సింగిల్ అని ఉంది. బహుశా అతను కోరుకుంటున్న బంగారు తీగలాంటి అమ్మాయి దొరకడం లేదేమో పాపం అనుకుంది.


ఒకరోజు హఠాత్తుగా తన సీట్ దగ్గరకు వచ్చి 'ఇంటర్వ్యూస్ ఎంతవరకు వచ్చా’యని ఎన్క్వైర్ చేసాడు. నిలబెట్టి మాట్లాడడం బాగోదని కూర్చోమని సీట్ ఆఫర్ చేసింది. మౌనంగా ఉండడం తనకు చేతకాదు. సంభాషణ తనే కదిపింది.


“ఇంకో నాలుగురోజులలో సెలక్షన్ ప్రాసెస్ పూర్తి అవుతుంది. మీరడిగిన 'ఆర్టిఫిషియల్ ఇంటిలిజన్స్' లో అనుభవం ఉన్న అభ్యర్ధులు కూడా ఉన్నార”ని చెప్పింది.


"ఓ ఇట్స్ నైస్ మిసెస్ అలకనందా!” అనేసరికి 'మిస్' అంటూ కరక్ట్ చేసింది. మనసులో 'ధాంక్ గాడ్' అనుకున్నాడు.


"సారీ, బైదిబై, నన్ను మీరు గుర్తుపట్టారా” అంటూ కాస్త చిలిపిగా అడిగాడు.


‘నీవేమైనా సెలిబ్రెటీవా గుర్తుపెట్టుకోడానికి’ అనుకుంది మనసులో. పైకి మాత్రం, "య్యా, గుర్తుపట్టకేం, కొన్ని సంఘటనలు, అలాగే కొందరు మనుషులు జీవితాంతం అలాగే గుర్తుగా ఉండిపోతారు”


“మీరన్నది రైట్ అలకనందగారూ. మిమ్మలని చూసి ఆశ్చర్యపోయాను తెలుసా? సంవత్సరం క్రితం మీరూ ఇప్పటి మీరూ..."


“ప్లీజ్ స్టాపిట్ మిస్టర్ తరుణ్, అప్పుడూ లడ్డూలా ఉండేదానివని, ఇప్పుడు సన్నగా మారిపోయానని చెప్పడమే కదూ?”


"సారీ! సిన్సియర్ గా చెపుతున్నా, నాకు అప్పట్లో పెళ్లి చేసుకునే మూడ్ లేదు, మా బామ్మకోసం సరేనన్నాను. మీరు అందంగానే ఉన్నారు అప్పుడు. మరీ లావైతే కాదు. నాకు చేసుకునే మూడ్ లేక అలా అనేసాను.. తప్పించుకోడానికి ఒక కారణం అనుకోండి”.


తరుణ్ కి తెలుసు తను అబధ్దం ఆడుతున్నానని. ఎందుకంటే ఇప్పటి అలకనంద తన మనసుని దోచేసింది. "పోనీలెండి.. మీరు నిజం గా అన్నా అలా ఎందుకన్నారని ఇప్పుడు పోట్లాడినా లాభంలేదు. మీరు నన్ను అలా అన్నందుకు ఆవేశపడి నాకిష్టమైన తిండిని కూడా త్యాగం చేసేసి బరువు తగ్గాను. మీకు ధాంక్స్ చెప్పుకోవాలి” కాస్త వ్యంగ్యాన్ని జోడిస్తూ అంది.


“అన్ని ధాంక్స్ లూ ఒక్కసారే చెబుదురుగాని”.


"అంటే"?


“వచ్చే శనివారం మంచిరోజుట. మీకు సమ్మతమైతే మరోసారి పెళ్లి చూపులకు రావచ్చా?” అభ్యర్ధనగా అడిగాడు.


"మళ్లీ ఏమైనా వంక పెట్టడానికా?” చురక అంటించింది.


“చూడండి తరుణ్, ఇప్పటి నా రూపం మీకు నచ్చి మరోసారి పెళ్లిచూపులకు వస్తానంటున్నారు. సరే, పెళ్లి అవుతుందనుకోండి. పెళ్లైనాక నా ఖర్మకాలి బరువు పెరిగి లడ్డూలా అయిపోతే, అప్పుడు నా పరిస్తితి ఏమిటి? నన్ను వదిలేస్తారా మీ పక్కన బాగోలేనని?” కాస్తంత తీవ్రంగానే ప్రశ్నించింది.


"అయ్యో ఎంత మాట అలకనంద గారూ, నేను అంత దుర్మార్గుడిలా కనిపిస్తున్నానా మీకు? అప్పట్లో మిమ్మలని అలా అన్నందుకు మిమ్మలని కాదన్నందుకు ఐయామ్ వెరీ సారీ. వివాహాలు దైవనిర్ణయాలన్న మాట మీద నాకు పూర్తి విశ్వాసం ఉంది. లేక పోతే మీ సంబంధం తరువాత ఎన్నో సంబంధాలు చూసారు మా వాళ్లు. ఏదీ కుదరలేదు ఇంతవరకూ. అలాగే మీ విషయంలోనూ అంతే జరిగి ఉంటుందని ఊహిస్తున్నాను. అంతేకదూ అలకనంద గారూ?”


“మీతో నాకు పోలిక ఏమిటండి బాబూ! మీ తరువాత నేను ఏ అబ్బాయినీ చూడలేదు. నాకు జరిగిన అవమానానికి మా అమ్మా నాన్నకి గట్టిగా వార్నింగ్ ఇచ్చాను. నేను చూడమన్నంతవరకూ మరే సంబంధం చూడద్దని నన్ను విసిగించ వద్దని. ఒక్కొక్కరూ ఒకోరకంగా మాట్లాడితే సహించే ఓపిక నాకు లేదండి బాబోయ్. నాకూ చీమూ నెత్తురులాంటివి ఉన్నాయి” ముఖం ఎర్రగా చేసుకుంటూ మాట్లాడుతున్న అలకనంద తరుణ్ కంటింకి మరింత అందంగా కనిపించింది.


“మీరేమో వివాహాలు దైవనిర్ణయం అంటున్నారు. నాకు అలాంటి నమ్మకాలు ఏమీ లేవండీ. ఏది జరిగినా మన మంచికే అనుకుంటాను. తిరిగి మనిద్దరం ఇలా అనుకోకుండా కలుసుకోవడం, మనకి ఇంకా పెళ్లి కాకపోవడం, ఇదంతా దైవనిర్ణయమేనండీ. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజమండీ అలకనంద గారూ. మీరొక సారి ఆలోచించండి. అవుననిపించడంలేదూ? అందుకనే మరొక ఛాన్స్ ఇవ్వమని వేడుకుంటున్నాను. అప్పటి పెళ్లి చూపులను తిరిగి రిఫ్రెష్ చేసుకుని మీరు నచ్చారని చెపుతూ ఓకే చెప్పడానికి వద్దామనుకుంటున్నాను. ఇంకా మన భాషలో చెప్పాలంటే ఎప్పుడో ‘రి సైకిల్ బిన్’ లోకి వెళ్లిపోయిన మన గత పెళ్లి చూపుల ఫైల్ ను రీలొకేట్ చేసి మళ్లీ కొత్తగా సేవ్ చేసాను”.


అల్లరిగా నవ్వుతూ మాట్లాడుతున్న అతని వైపు తలెత్తి చూడలేకపోతోంది. అతని మాటల్లో అయస్కాంతం లాంటి ఆకర్షణ తనని కట్టి పడేస్తోంది. ఏదో తెలియని సిగ్గు తనని ఆవహిస్తోంది. తరుణ్ తన తప్పుని తెలుసుకున్నాడు. నిజాయితీగా సారీ చెపుతున్నాడు. నేను అతనికి నచ్చానని చెపుతున్నాడు. తనకి తెలియకుండానే తను తరుణ్ మాయలో పడిపోతోంది. 'నో' చెప్పలేకపోతోంది. ఎందుకంటే తరుణ్ తనకు కావాలనిపిస్తోంది. తరుణ్ మొదటి పెళ్లిచూపుల్లోనే అప్పుడే తనకి బాగా నచ్చేసాడు.


"ఏమంటారు అలకనంద గారూ?”


“అలకా అనండి చాలు”.


“ఓ, ధాంక్యూ, ఐతే నా మీద కోపం పోయింది కదూ అలకా” మార్దవంగా అడిగాడు. మౌనంగా ఉండిపోయింది.


“మౌనం అంగీకారంగా తీసుకుంటున్నాను. వచ్చే శనివారం మా పేరెంట్స్ తో వస్తాను. ఆ మధ్య నీవు పింక్ కలర్ చీర లో లిఫ్ట్ లో నాకు ఎదురుపడ్డావు గుర్తుందా? ఎవరీ గులాబీ బాల అనుకున్నాను. నేను వచ్చినపుడు మళ్లీ అదే చీర కట్టుకోవూ” అనేసరికి సరికి అలకనందలో సిగ్గుతెరలు కమ్మేసాయి.


“అన్నీ నా ప్రమేయం లేకుండా మీకు మీరు నిర్ణయించడమేనా?” చిరుకోపంతో ప్రశ్నించింది.


“పోనీ నీ నిర్ణయం ఏమిటి? నేను మొత్తం నా గడ్డాన్ని తీసేసి, నున్నగా షేవ్ చేసుకుని గుడ్ బాయ్ లా రమ్మంటావా? వచ్చేటప్పుడు నీ కిష్టమైన లడ్డూ పేకెట్ తేనా? “


లడ్డూ అనే మాట విన్న అలకనంద ఫక్కుమంటూ నవ్వేసింది. “అదిగో మళ్లీ అప్పుడెప్పుడో నేను లడ్డూ లా ఉన్నానని తిరిగి నన్ను ఎగతాళి చేయడమే కదూ?”


“లేదు అలకా, నేనో నిజం చెప్పనా? నాకు లడ్డూలంటే ప్రాణం. అలాగే నీవన్నా ప్రాణమే. అందుకే అవి తెస్తానంటున్నాను. ఓకే నా మరి” అనగానే అలకనంద కళ్లు సిగ్గుతో వాలిపోతుండంగా సరేనంటూ తల ఊపింది.

***

యశోద పులుగుర్త గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :

నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.
52 views0 comments

Comments


bottom of page