top of page

బలగం


'Balagam' - New Telugu Story Written By Jidigunta Srinivasa Rao

'బలగం' తెలుగు కథ

రచన : జీడిగుంట శ్రీనివాసరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


ఆఫీస్ నుంచి వచ్చిన శేఖర్ వంటింట్లో వున్న భార్య రమ ని చూసి, “ఏమైంది ఆలా వున్నావు” అన్నాడు.


“ఎలా వుంటే మీకెందుకు.. టిఫిన్ తినేసి ఆఫీస్ కి వెళ్ళిపోతారు, సాయంత్రం వచ్చి కాఫీ తాగేసి జిమ్ కి వెళ్ళిపోతారు” అంది.


“అదికాదే, రోజు నీ మొహం శ్రీలక్ష్మి లా నవ్వుతూ వుండేది, ఈ రోజు ఛాయా దేవి లా వుంటే అడిగాను” అన్నాడు నవ్వుతూ.


“ఛాలెండి సరసం, సాయంత్రం మీ అమ్మగారు పాలు కాస్తా పొంగించేసి, స్టవ్ క్రిందకి తోసేసి ఏమి తెలియనట్టు టీవీ చూస్తున్నారు. యిప్పుడు స్టవ్ బాగు చేసుకొనే సరికి మా తాతలు దిగి వచ్చారు” అంది రుసరుసలాడుతో రమ.


“మీ తాతని తను రాసిన వీలునామా ఎక్కడ పెట్టాడో అడగలేకపోయావా, మనకి కోర్టు ఖర్చులు కలిసివచ్చేవి” అన్నాడు నవ్వుతో శేఖర్.


“ప్రతీ దానికి ఆ వెకిలి జోక్స్ ఒక్కటి, కొద్దిగా స్టవ్ లేపి పట్టుకోండి, కడగాలి” అంది విసుగ్గా రమ.

“అసలు అమ్మ వంటింట్లో కి ఎందుకు వచ్చింది, పాలు ఎందుకు కాచింది?” అన్నాడు శేఖర్.

“ఆవిడకి సాయంత్రం నాలుగు అవ్వగానే టీ కావాలి, నేను ఇంటిపని చేసుకుని అప్పుడే పడుకుంటాను. అయినా మా అమ్మ వంటలు ఎంత రుచిగా వుంటాయో అని మీరు, మీ అన్నగారు నాలుక పీకుంటారు, పాలు కాయడం కూడా రాదని తెలుసుకోండి” అంది.


“అసలు అమ్మకి టీ కూడా టైంకి ఇవ్వలేకపోతున్నావా? పైపేచ్చు పాలు పొంగిపోయాయి అని కంప్లైంట్ చేస్తున్నావ్. రమా, అమ్మ ఆరోగ్యం మంచిది కాదు. ఆవిడ పడిన కష్టాలు అన్నీ యిన్ని కావు. ఈ రోజు నేను ఈ పొజిషన్లో వున్నాను అంటే అమ్మే కారణం. నాన్న డబ్బు తెచ్చి పడేయటమే కాని, నా చదువు గురించి అమ్మ ప్లానింగ్ చాలా వుంది. యిహ నుంచి అమ్మ వంటింట్లో కి రావటానికి వీళ్ళేదు” అన్నాడు శేఖర్.


కాఫీ కప్ తో హాల్ లోకి వచ్చి తల్లితో కూడా అదే చెప్పాడు.


“యిప్పుడు ఏమైందిరా, ఉదయమ్ టిఫిన్ తయారు చేయడం నుంచి రాత్రి వంట వరకు కోడలు వంటింట్లో మగ్గిపోతోంది. కొద్దిగా టీ కూడా పెట్టుకోలేనా, అనవసరంగా నువ్వు నా గురించి కంగారు పడకు” అంది శేఖర్ తల్లి సీతమ్మ గారు వంటింట్లో జరిగిన గొడవ తెలియక.


ఈ అత్తాకోడళ్ల గొడవ ఎంతవరకు పోతుందో అని భయపడి పోయాడు. నాన్నని రమ్మంటే రాకుండా విజయవాడ లోనే వుండిపోయాడు. అదేమిటో నాన్నకి ముంబై హాడావిడి నచ్చదు అని ముంబై రావడానికి ఇష్టపడటం లేదు. అమ్మకి నన్ను చూడాలని అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంది. నాన్న రాలేదు అనే కానీ నాన్న ప్రతీది తను అనుకున్నట్టు జరగాలి అనుకుంటాడు. అమ్మ యిప్పటికి నాన్న ని అడిగి కూర వండుతుంది. యిక్కడ అదే పద్ధతి కావాలి అనుకుంటే ఎక్కడ జరుగుతాయి.. ఏమో నాన్నని చూస్తే చిన్నప్పుడు నన్ను నాన్న భుజం మీద నన్ను ఎత్తుకుని తిరిగిందే గుర్తుకువస్తుంది అనుకుంటూ ఆఫీస్ కి బయలుదేరాడు శేఖర్.


ఆఫీస్ లో మీటింగ్ లో వుండగా నాన్న ఫోన్ రావడం తో మాట్లాడకుండా తరువాత ఫోన్ చేస్తాను అని మెసేజ్ పంపించాడు. తరువాత ఫోన్ చేయడం మర్చిపోయి యింటికి వచ్చేసాడు. హల్ లో అమ్మా, తను యిద్దరు క్యారెమ్స్ ఆడుకుంటోవుండటం చూసి, బతికాము రా నాయనా, అత్తాకోడళ్ళు కలిసిపోయారు అనుకుంటూ వుండగా ఉదయం తండ్రి ఫోన్ చేసిన విషయం గుర్తుకు వచ్చి, ‘చచ్చాం రా నాయనా, యిప్పుడు ఫోన్ చేసి అడిగితే, ప్రాణం మీదకి వచ్చినా నీతో ఇంతే అని మొదలుపెడతాడు నాన్న’ అనుకుని, తండ్రి మూర్తి కి ఫోన్ చేసాడు శేఖర్.


“మీటింగ్ అయ్యిందా, ఏమి యిబ్బంది లేదుగా ఉద్యోగం లో, భోజనం చేసావా?” అని అడుగుతున్న తండ్రితో “అంతా బాగానే వుంది నాన్నా, మీరు ఎందుకు ఫోన్ చేసారు” అన్నాడు శేఖర్.


“ఏమీలేదు రా, కొన్నాళ్ళు నుంచి ఎడమ కన్ను సరిగ్గా కనిపించడం లేదని డాక్టర్ గారి దగ్గర చూపించుకుంటే ‘కేట్రాట్ వచ్చింది, వెంటనే ఆపరేషన్ చేయించుకోండి, ఒక అరవై వేలు పెడితే చక్కగా చూడచ్చు’ అన్నాడు. అయితే అయన కి నా కుడి కన్నులో దోషం కనిపించింది. నాకు కుడికన్ను బాగా కనిపిస్తోంది మరి! ఆయన కి కనిపించడం లేదుట” అన్నాడు.


“డబ్బు గురించి ఆలోచించకండి డాడి, మీకు ఇన్సూరెన్స్ వుంది. నేను, అమ్మా, మీ కోడలు, మనవరాలు తో రెండు రోజులలో బయలుదేరి వస్తాము” అన్నాడు శేఖర్.


“సరే! కంగారు లేదు, మెల్లగా రండి సెలవు దొరికినప్పుడు” అన్నాడు తండ్రి.


“ఎవరికి రా ఆపరేషన్? చేయించే వాళ్ళు ఉంటే మీ నాన్న మూడో కంటికి కూడా చేయించుకుంటారు” అంది శేఖర్ తల్లి.


“అయినా సెల్ ఫోను రాత్రంతా చూస్తూ ఉంటే కళ్ళు పోక ఏమవుతాయి, మొత్తుకుంటూనే ఉన్నాను, వింటేనా” అంది.


“కాట్రాట్ ఆపరేషన్ ఇప్పుడు చాలా ఈజీ అత్తయ్య గారూ! కంగారు పడకండి. ఎలాగా ఇప్పుడు పిల్లలకి సెలవులే కాబట్టి మనం బయలుదేరి వెళ్దాము. మామయ్య గారికి చుక్కల మందు నేను వేస్తాను” అంది కోడలు.


మొత్తానికి హైదరాబాద్ చేరుకున్నారు.

“మామయ్య గారు ఎలా ఉన్నారు, ఆపరేషన్ అంటే భయపడకండి, మా పిన్ని రెండు కళ్ళకి చేయించుకుంది, వారం రోజుల్లో లవకుశ సినిమా మొత్తం మూడుసార్లు చూసింది” అంది కోడలు రమ.

“భయం లేదమ్మా, చిన్న ఆపరేషన్ కి కూడా ఈ హైదరాబాద్ లో చుట్టాలు వున్నా, ఒక్కడూ నేను వున్నానని అనలేదు. అంత దూరం నుంచి మీరు రావాలిసి వచ్చింది” అన్నాడు మామగారు విచారం గా.


“ఎవ్వరి పనిలో వాళ్ళు వుంటారు డాడీ! అవసరం అయితే వస్తారు. నాకు ఎవ్వరు లేరు, ఒంటరి ని అని బాధ పడకండి. మీరు పోనీ వాళ్ళ యింటికి వెళ్లి కాసేపు వుండి రావచ్చు గా, మీరు అది చెయ్యరు, అందరు మీ దగ్గరికి రావాలి అంటే ఎలా?” అన్నాడు కొడుకు.


“అబ్బాయి.. ఎందుకైనా మంచిది. సెకండ్ ఒపీనియన్ తీసుకుందాం. ముందు ఈ రిపోర్ట్స్ చూడు” అంటూ తనకి కళ్ళు చూసిన డాక్టర్ గారి రిపోర్ట్స్ కొడుకు చేతిలో పెట్టాడు.


“ఇదేమిటి హాస్పిటల్ పేరు రాజనాల కన్ను హాస్పిటల్ అనివుంది? ఆ విలన్ పేరు మీద వున్న హాస్పిటల్ ఎలా దొరికింది నాన్నా” అన్నాడు శేఖర్.


“పేరు అలా వున్నా డాక్టర్ మంచి వాడే, అయినా యింకో డాక్టర్ కి కూడా చూపించి అభిప్రాయం తీసుకుందాం” అన్నాడు తండ్రి మూర్తితో.


రెండో రోజు ఉదయం తమ యింటికి దగ్గర వున్న సూపర్ స్పెషలిటి హాస్పిటల్ లో అప్పోయింట్మెంట్ తీసుకుని డబ్బు కట్టి కళ్ళ డాక్టర్ రూమ్ ముందు కూర్చొని వున్నారు.

“ఏమిటిరా అబ్బాయి, యింతమంది వున్నారు, పూర్వం మా కంటి డాక్టర్ దగ్గర కి రోజుకి ఒక్క పేషెంట్ వస్తే పండుగే” అంటున్న తండ్రి కి డాక్టర్ గారి రూమ్ నుంచి పిలుపు వచ్చింది.


లోపలికి వెళ్ళగానే కొయ్యబారి పోయాడు మూర్తి. లోపల నవ్వుతు కనిపించాడు డాక్టర్ రాజనాల.

“ఏమిటి సెకండ్ ఒపీనియన్ కోసం వచ్చారా?” అన్నాడు కోపంగా.


“అబ్బే! సెకండ్ ఒపీనియన్ కోసం కాదు డాక్టర్, మా అబ్బాయి ఊరినుంచి వచ్చాడు, ఆపరేషన్ రేపు చేయించుకుంటాను అని చెప్పటానికి మీరు ఇక్కడకి వస్తారని తెలిసి వచ్చాను” అన్నాడు మూర్తి.


“రేపటికి రేపు అంటే ఎలా, కత్తులు సానపట్టించాలి” అని నాలుక కర్చుకుని, “అదే.. స్టెరిలైజ్ చెయ్యాలి. ఎల్లుండి ఉదయం 8 గంటలకు వచ్చేయండి” అన్నాడు డాక్టర్ రాజనాల.


“సరే సార్” అని బయటకు వచ్చి, మొన్న నేను చూపించుకున్న డాక్టర్ ఇయనే, మనకి తెలియదు ఇక్కడకి కూడా ఈ డాక్టర్ గారు వస్తారని. బుధవారం ఆపరేషన్ కి టైమ్ ఫిక్స్ చేసాడు. నువ్వు మద్రాస్ లో వున్న అక్కయ్య ని వెంటనే బయలుదేరి రమ్మను” అన్నాడు కొడుకు తో.


“ఈ చిన్న ఆపరేషన్ కి యిప్పుడు అక్కయ్య ని కంగారు పెడటం ఎందుకు డాడి..” అంటున్న కొడుకు వంక కోపంగా చూసి “నువ్వు పిలుస్తావా లేక నన్ను పిలవమంటావా” అన్నాడు మూర్తి.


“రేపు ఉదయం 11 గంటలకు ఫ్లైట్ లో వస్తాను,ఎయిర్పోర్ట్ కి రమ్మ”ని అక్కగారు చెప్పడం తో బయలుదేరి వెళ్ళాడు శేఖర్.


అక్కగారిని రిసీవ్ చేసుకుని ఇంటికి చేరుకున్నాడు శేఖర్. యింట్లో తండ్రితో పాటు ముగ్గురు కొత్త మనుషులు ని చూసి, తండ్రి వంక ఎవ్వరు అన్నట్టుగా చూసాడు శేఖర్.


“ముందు సామాను లోపల పెట్టి మీరిద్దరు యిటు వచ్చి కూర్చోండి” అన్నాడు తండ్రి.


అక్కా తమ్ముడు వచ్చి తండ్రికి దగ్గరగా కూర్చున్నారు. మూర్తి కూతురు కొడుకు వంక చూసి, దూరం గా వున్న భార్య ని కూడా దగ్గరగా పిలిచి, “ఈయన సుబ్బారావు గారు అని ప్లిడర్ గారు, వాళ్లిద్దరూ నా స్నేహితులు.రేపు ఆపరేషన్. అందుకే వీలునామా రాయిస్తున్నాను” అన్నాడు.


ప్లీడర్ సుబ్బారావు గారు “హార్ట్ ఆపరేషన్ కి ముందు నా చేత వీలునామా రాయించుకున్న వాళ్ళు యిప్పటికి రాయిలా వున్నారు. ఏదో జాగ్రత్త కోసమే యిప్పుడు రాసేది, మీరు కంగారు పడకుండా గుండె ఆపరేషన్ చేయించుకుని వచ్చి వీలునామా తిరగ రాయిస్తారు” అన్నాడు.


“అయ్యో! మా డాడీ కి హార్ట్ ఆపరేషన్ కాదండి, ఒక కన్నుకి కేట్రాట్ ఆపరేషన్. అదికూడా లేజర్ ఆపరేషన్. యింతోటి దానికి వీలునామా వరకు వచ్చేసారు. మా పక్కింటి ఆయనకు రెండు సార్లు స్ట్రోక్ వచ్చింది, కొడుకు వీలునామా రాయమని అడిగినా ససమెరా అంటున్నాడు” అన్నాడు మూర్తి గారి కొడుకు.


“భలేవారే.. రెండు నిముషాల ఆపరేషన్ కి వీలునామా అని హడావిడి చేయడం ఏమి బాగుండలేదు మూర్తి గారు, నా టైమ్ వేస్ట్ చేసారు” అన్నాడు ప్లీడర్ సుబ్బారావ్.


“రేపు ఉదయమే ఆపరేషన్, ఊరంతా చుట్టాలు వున్నా పరాయి ఊరు నుంచి మిమ్మల్ని పిలవాలిసి వచ్చింది. అవసరంకి ఉపయోగం లేని చుట్టాలు ఎందుకు?” అనుకుంటూ గొణుక్కుంటున్న తండ్రిని పెద్దగా పట్టించుకోలేదు.


ఉదయం 8 గంటలకల్లా తండ్రి ని తీసుకుని అక్కా తమ్ముడు హాస్పిటల్ కి చేరుకున్నారు.

ఆపరేషన్ గదికి ముందు వున్న విజిటర్స్ రూమ్ లో కి వచ్చిన మూర్తిని చూసి, “హయ్ పెద్దనాన్నా” అని తమ్ముడి కొడుకు, “హాయ్ మామయ్య” అని బావమరిది కొడుకు, “బావగారు భయపడుతున్నారా” అని బావమరిది.. యిలా దాదాపు యిరవై మంది చుట్టాలు మూర్తిని చుట్టూముట్టి కుశలప్రశ్నలు వేస్తూవుంటే, “మీరందరు ఎందుకు వచ్చారు, చిన్న ఆపరేషన్ కి ఎందుకు అంతకంగారు పడుతున్నారు?” అన్నాడు మూర్తి.


“అదేమిటి.. చిన్నదైనా పెద్దది అయినా మీకు ఆపరేషన్ అంటే రాకుండా ఎలా వుంటాము బావగారు” అన్నాడు.


ఇంతలో మూర్తి తమ్ముడు లోపలికి వస్తో “ఆపరేషన్ అయిపోయిందా, ఉదయం బయలుదేరాను, ట్రాఫిక్ వల్ల లేట్” అన్నాడు.


“యింకా కాలేదు” అని తమ్ముడితో మాటలలో పడ్డాడు మూర్తి.


బయట హడావిడి విని డాక్టర్ రాజనాల గారు విజిటర్స్ గదిలోకి వచ్చి, ‘ఈ రోజు పేషెంట్స్ బాగానే వున్నారు’ అనుకుని,నర్స్ తో ‘ఫస్ట్ పేషెంట్ ని పంపండి’ అన్నాడు.


“సార్! ఫస్ట్ అండ్ లాస్ట్ పేషెంట్ మూర్తి గారే” అంది.


“అదేమిటి? ఈ జనం అంతా ఎవ్వరు?” అన్నాడు డాక్టర్ గారు.


“వాళ్లంతా మూర్తి గారి బంధుమిత్రులు, ఆయనకి ఆపరేషన్ అని ధైర్యం చెప్పటానికి వచ్చారు” అంది.


“బాగానే వుంది.. క్యాటరట్ ఆపరేషన్ కి యింతమంది రావటం, వచ్చింది చాలక ఏసీ హల్ లో కూర్చొని కబుర్లు.. కుదరదు, వాళ్ళని ఖాళీ చేయించు” అన్నాడు కోపంగా.


నర్స్ డాక్టర్ గారికి ఒక కాయితం మీద, ‘ఇందులో సగం మంది కళ్ళ ప్రాబ్లెమ్ తో బాధ పడుతున్నారు. మూర్తి గారి ఆపరేషన్ బాగా జరిగితే వీళ్ళుకూడా మీ దగ్గరి వైద్యం చేయించుకుంటామని అని మాట్లాడుకుంటున్నారు’ అని రాసి చూపించింది.


“ఏమిటి లేచిపోతున్నారు, ఏదో సరదాగా అన్నాను, మూర్తి గారికి ఆపరేషన్ బాగా చేస్తాను, మీ కళ్ళకి కూడా బాధల నుంచి విముక్తి కలిగిస్తాను, కాఫీ వస్తుంది హాయిగా కాఫీ తాగండి” అన్నాడు డాక్టర్ గారు పంట పండింది అనుకుని.


అనుకున్నట్టే పదినిమిషాలలో మూర్తి కంటికి ఆపరేషన్ చేసి కట్టు కట్టి ‘మీరు రేపు రండి మళ్ళీ’ అన్నాడు.


డాక్టర్ గారు చేతులు కడుగుకుని బయటకి వచ్చి చూస్తే ఒక్కళ్ళు లేరు. నర్స్ పాత పేపర్ చదువుకుంటూ కనిపించింది.


“వీళ్ళందరూ ఏరి?” అన్నాడు డాక్టర్ రాజనాల.


“మళ్ళీ వస్తామని, మూర్తి గారిని తీసుకుని వెళ్ళిపోయారు సార్” అంది.


“అయితే నీ జీతం ఈ నెల కూడా లేటుగానే” అన్నాడు విసుక్కుంటూ డాక్టర్.


శుభం


జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.








63 views0 comments
bottom of page