top of page

దోషి ఎవరు పార్ట్ - 1'దోషి ఎవరు' పెద్ద కథ ప్రారంభం

'Doshi Evaru Part 1' New Telugu Story Written By Pudipeddi Ugadi Vasantha

'దోషి ఎవరు పార్ట్ 1' తెలుగు పెద్ద కథ

రచన : పూడిపెద్ది ఉగాది వసంత

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


“హాయ్ మాధవీ, ఎలా ఉన్నావే?”


“హాయ్ సుమా, నేను బాగానే ఉన్నాను, కానీ ఏంటి ఇవాళ నేను గుర్తొచ్చాను నీకు? గులాబీ మొక్కకి మందారాలు పూసాయా లేక మల్లె తీగ, జాజులు విరబోసిందా? ఎప్పుడు నేను చేసినా బిజీ అంటూ, ఎవరో తరుముతున్నట్టు ఫోన్ పెట్టేస్తావు? సరే, ఇవన్నీ వదిలెయ్యవే, ఎలా వున్నారు నువ్వు, మీ శ్రీవారు, మీ ముద్దుల లాస్య?”

“అవునే మాధవీ, నిజమే, ఎప్పుడు ఖాళీ దొరకదే. ఓ పక్క ఉద్యోగం, సంసారం, హుష్, సాగరమైనా ఈదొచ్చును కానీ, ఈ సంసారం భారం మోయడం చాల కష్టమే బాబూ. సరే గానీ, సాయంత్రం ఓ అరగంట కి కలవడం అవుతుందా? నీతో చాలా మాట్లాడాలి!” గట్టిగ ఊపిరి తీసింది సుమ, మాధవీ చెప్పే సమాధానం కోసం ఉత్కంఠ గా చూస్తూ.

“ఏంటి రా, ఎనీ ప్రాబ్లెమ్ విత్ సుధాకర్? చెప్పు ఏవైనా తోక జాడిస్తున్నాడా.. నా సంగతి తెల్సుగా, తాట తీస్తా”


పెళ్లయిన ఆడది బాధ పడుతోంది అంటే, ముందు భర్తలని అనుమానించడం పరిపాటయ్యింది..


“అయ్యో! అలాంటిదేమి కాదే బాబు, పాపం సుధాకర్.. నన్ను ప్రాణానికి ప్రాణం గా చూసుకుంటాడే” భర్త మీద ఈగ వాలనివ్వలేదు సుమ.

“ఓకే రా, ఐదింటికల్లా మినర్వా లో కలుద్దాం.. నేను కొంచం త్వరగా వెళ్ళాలి, పాపం అమ్మ, షాలిని ఐదయ్యిందగ్గరనించి, ఎదురు చూస్తూ ఉంటారు..” మాటల్లో తల్లి ప్రేమ వత్తులు పెట్టింది.


********

మాధవీ, సుమ, ఆరవ తరగతి నుండి కలిసి ఒక స్కూల్ లో చదువుకున్నారు. ఇంటర్, డిగ్రీ.. అన్నీ ఒక కాలేజీ లో చదివారు. ఇద్దరూ మంచి స్నేహితులు. పెళ్లిళ్లు కూడా హైదరాబాద్ లో స్థిర పడ్డ వ్యక్తులతోనే జరగడం వల్ల, ఇద్దరి స్నేహానికి, ఎలాంటి అవరోధాలు లేవు.


మాధవీ చాలా చురుకైనది, అన్నిటా చాలా ముందుంటుంది, సుమ కి కొంచం సిగ్గు, మొహమాటం పాళ్ళు ఎక్కువ, పైగా భయస్తురాలు. ప్రతిదానికి, చిగురుటాకులా కంపించిపోతుంది. ఏ చిన్న సమస్య వచ్చినా, భూమ్యాకాశాలు ఏకమైపోయినట్టు గాభరా పడిపోతుంది.


కానీ, ఇద్దరిలో ఉన్నదీ, అద్వితీయమైన ప్రేమ, అభిమానం, పెద్దలంటే గౌరవం, ఉన్నతమైన సంస్కారం. ఇదే వారి స్నేహానికి, మంచి కాంక్రీట్. ఇద్దరు పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు చేసుకుని, సంసారం నౌకలని, చక్కగా నడుపుకుంటున్నారు.

ఇద్దరూ వారి జీవితాల్లో ముఖ్యమైన సందర్భాల్లోను, వేడుకల్లోనూ కలుసుకుంటూ, అప్పుడప్పుడు ఫోన్ లో మాట్లాడుకుంటూ, ఒకరి కష్ట సుఖాలు ఒకరు పంచుకుంటూ, కుదిరినప్పుడు, కలుసుకుని, కప్పు కాఫీ తో కాసిన్ని కబుర్లు కలపోసుకుంటుంటారు. కార్తీక మాసం లో వనభోజనాలప్పుడు, రెండు కుటుంబాలు కల్సి, పిక్నిక్ లకి వెళ్తుంటారు. వారి స్నేహ పరిమళాలు నేటికీ గుబాళిస్తూనే ఉన్నాయి. ఇది అందరి విషయంలో సాధ్యపడదు. వీరి స్నేహం దేవుడు ఆశీర్వదించాడు.


**********


సాయంత్రం ఐదింటికల్లా మినర్వా గ్రాండ్ చేరుకొని, వారిద్దరూ ఎప్పుడు కూర్చునే, మూల టేబుల్ దగ్గర కూర్చుంది సుమ.


మాధవి రాగానే, వారిద్దరికీ అత్యంత ఇష్టమైన, మసాలా దోస ఆర్డర్ చేసుకుని, దాంతో పాటే, మంచి ఫిల్టర్ కాఫీ కూడా తెప్పించుకున్నారు. వారికీ దోస తింటూ మధ్యలో కాఫీ ని కొద్ది కొద్దిగా సిప్ చేయడం అంటే చాలా ఇష్టం. దోస కాఫీ పూర్తయ్యేవరకు, ఏవో అవి ఇవి పిచ్చాపాటీ మాట్లాడుకున్నారు.


సుమ చెప్పడం ప్రారంభించింది..


ఏమి లేదే, మా ఇంట్లో పనిచేసేది కదా, సుబ్బలక్ష్మి అని, ఆవిడ సడన్ గా పని మానేసింది, లాస్య నా కడుపున పడినప్పటినించి, పాపం తానే అన్ని పనుల్లోనూ, చేతిలో పని అందుకుని మరీ సహాయం చేసేదే. ఒక రకంగా మా కుటుంబం లో ఒకరుగా ఒదిగిపోయింది, కానీ వాళ్ళబ్బాయి కి, పెళ్లయిన 10 ఏళ్ళకి కొడుకు పుట్టాట్ట. తాను వెళ్లి తీరాల్సిన సమయం వచ్చేసింది, ఏమి చెప్పగలం. అయితే, ఇప్పుడు, నాకు ఓ మంచి నమ్మకస్తురాలైన మనిషి కావాలే, తాను మాతోనే ఉండిపోవాలి.

భోజనాదులు అన్ని మేమె చేసుకుంటాము, ఓ పది వేలు జీతం ఇస్తాము. గుక్క తిప్పుకోడానికి ఆపిందో, మాధవి కి మాట్లాడే అవకాశం ఇవ్వడం కోసం ఆపిందో, చిన్న కామా పెట్టింది సుమ.


"నీకన్నీ కంగారు సుమా! ఓస్ ఇంతదానికా, అంత బిల్డ్ అప్ ఇచ్చావు.. హడిలి చచ్చాననుకోవే, దాందేముంది, బోల్డన్ని ఏజెన్సీలు పుట్టుకొచ్చాయి మనలాంటి వారి అవసరాలు తీర్చడానికేనే పిచ్చి మొద్దు.."

"వద్దే బాబూ, ఏజెన్సీల వారు పెట్టే పనివారు, అంత బాగా చేయట్లేదుట, మొన్న పేపర్ లో చూడలేదా, ఓ రాత్రి వేళ, ఇంటివాళ్ళు మంచి నిద్రలో ఉండగా, డబ్బు బంగారం, లాప్టాప్, కంప్యూటర్, ఇలా విలువైన సామాన్లు తీసుకుని ఉడాయించేసిందిట, ఏజెన్సీ వాడు చేతులెత్తాశాట్ట, తన దగ్గర ఉన్న అడ్రస్ పోలీసులకి ఇచ్చేసి. తీరా అక్కడికి వెళ్తే, ఆ అడ్రస్ లో అలాంటి పేరుగల వారు అసలు అక్కడ లేనేలేరని తేలిందిట. ఇంతే సంగతులు, చిత్తగించవలెను అనేసి, పోలీసులు చేతులు దులిపేసుకున్నారట".

"ఓహో అలాగా, అయితే నాక్కొంచెం టైం ఇవ్వవే, భోగట్టా చేసి, మంచి అమ్మాయయితేనే, నీ వరకు పంపిస్తాలే, ముందుగా నేనే శల్య పరీక్షలన్నీ నిర్వహించి, నిప్పుల్లో కూడా దూకమని, స్వచ్ఛత చూసి, నూటికి నూరు మార్కులు వస్తేనే నీకు చెప్తాను, మరి ఈ ప్రాసెస్ అంతటికి టైం పడుతుంది కదే!"

సుమా పూర్తిగా విందో లేదో కానీ, పెదవి కొరుక్కుంటూ, గాల్లోకి చూస్తూ ఆలోచనల్లో మునిగిఉంది, ఏమి సమాధానం ఇవ్వలేదు మాధవికి.


"ఏయ్ సుమా! ఏంటా దీర్ఘాలోచనలు, నే చెప్పింది విన్నావా, నీకు అసలే బోల్డు భయాలు, అనుమానాలూనూ" స్నేహితురాల్ని పూర్తిగా ఎక్సరే చేసిన అనుభవం మరి..


"సరేనే, కాస్త సాధ్యమైనంత త్వరగా చూడవే, చాలా ఇబ్బందిగా ఉందే, పాపం సుధాకర్ హెల్ప్ చేస్తాడనుకో, కానీ ఇద్దరం 9 కల్లా ఆఫీసుల్లో ఉంది తీరాల్సిందే. లేదంటే ఆ బాసుగాడు.. వాడు లేట్ గా వస్తాడు, కానీ వాడికి కొందరు వందిమాగధులున్నారు ఆఫీస్ లో.. వాళ్ళు ఎవెరెవరు ఎన్ని గంటలకొస్తారో, నిముషాలు, సెకండ్లతో సహా, ఊదేస్తారు. అది విని, గుర్రుగా చూస్తాడు. గండు పిల్లిలా రూపం వాడూను. ఆ చూపులు భరించడం కన్నా, నీళ్లు లేని మూసీలో దూకి, ఆ కంపు భరించడం సులువే బాబూ"


బాసు మీద అక్కసంతా, ఒకటో ఎక్కం లా, ఏకరువు పెట్టేసింది సుమ, కామాలు ఫుల్ స్టాప్ లతో సంబంధం లేకుండా.


"సర్లేవే, నీకు ఎంత అర్జెంటు గా మనిషి అవసరం ఉందొ అర్ధమయిందిలే, హాయిగా, నిశ్చింతగా ఉండు, మై హూ నా! !" అని ఎయిర్ ఇండియా బొమ్మల పోజ్ పెట్టి, ధీమా ఇచ్చేసింది..

***


"హాయ్ సుమా, మా గేటెడ్ కమ్యూనిటీ లో సెక్యూరిటీ గార్డ్ గా చేసేవాడు, నారాయణ అని, అతని చెల్లి అర్చన అని ఇరవై ఏళ్ళుంటాయిట ఆ అమ్మాయికి, పెళ్లి, విడాకులు కూడా అయిపోయాయిట. మా ఇంటికి తీసుకొచ్చాడు నిన్న సాయంత్రం, చాలా పద్దతి గా ఉంది చూడ్డానికి. నేను అన్ని కోణాల్లో పరిశీలించాను. బాగా బ్రతికి చెడిన వాళ్ళు, ఈ నారాయణ కూడా చాలా మంచి వ్యక్తి. వీళ్ళమ్మ, స్కూల్ లో ఆయాగా పనిచేస్తోంది. వీళ్లది వైజాగ్ ట. మా ఆయన పూర్వాపరాలు అన్నీ ఆరా తీసేరు, ఇంత మంచి అమ్మాయి దొరకడం నిజం గా లక్ అన్నారు.


ఆ అమ్మాయిని తీసుకుని నేను, వాళ్ళమ్మ వస్తాము ఈ సాయంత్రం. నువ్వు, సుధాకర్ కూడా అన్నీ కోణాల్లోంచి చూసుకుని, ఆలోచించి, నచ్చితే పెట్టుకోండి. ఓకే నా?"


"ఒకే మాధవి, చాలా థాంక్స్ రా. సి యు రా"

*********


సాయంత్రం సుమ ఇంటికెళ్లి, వాళ్ళు అన్నీ విధాలా తృప్తి చెందాక, అర్చనని వాళ్ళింట్లో వదిలేసి, వాళ్ళమ్మని తీసుకుని ఇంటికొచ్చేక, సుమ ఫోన్ చేసింది,

"చాలా థాంక్స్ మాధవి, నీ మేలు ఈ జన్మ లో మరిచిపోలేను, సుధాకర్ కూడా చాలా హ్యాపీ ఫర్ అర్చన. తన ఆధార్ కార్డు, ఓటర్ కార్డు జెరాక్స్ కాపీ లు అందజేయమని చెప్పవే కొంచెం. జాగ్రత్త భయం నాస్తి కదా అందుకే.."


చాలా హుషారుగా ఉంది సుమ, పని మనిషి దొరికి నందుకు. తనకి గానీ సుధాకర్ గానీ ప్రమోషన్ వచ్చినా కూడా, అంత ఆనందం కలిగేది కాదేమో. భార్య భర్తలు ఇద్దరు ఉద్యోగాల్లో ఉంటే, పని మనిషి పాత్ర చాలా కీలకం అయిపోతుంది. పని మనిషి మన జీవితాల్లో ఎంత ప్రాముఖ్య మయిపోయిందో అంటూ, తన కొలీగ్ చెప్పిన జోక్ తలుచుకుని నవ్వుకుంది మాధవి..


ఓ రోజు కాలింగ్ బెల్ మోగితే, పరుగు పరుగున వెళ్లి తలుపు తీసిన భార్య కి, భర్త కనిపించాడు గుమ్మంలో, అది చూసి "మీరా " అని నిరాశగా మొహం పెట్టి వెనక్కి తిరిగింది,


అది చూసి భర్త చాలా హర్ట్ అయ్యాడు, తాను కూడా ఏమి తగ్గకుండా, "ఏం బాగా నిరాశ చెందినట్టుగా కనిపిస్తున్నావు, ఎవరికోసమో ఎదురుచూస్తున్నట్టున్నావు " అన్నాడు వ్యంగ్యమంతా ప్రతిమాట మీదా వొత్తు పెట్టడం లో చూపిస్తూ.


ఈవిడ కూడా ఏమి తక్కువ తినలేదు "అంతదృష్టమా, పనిమనిషి ఆరింటికి వస్తానంది, తననుకున్నాను, మీరో గంట ఆలస్యమయిన ఏమి ఫరక్ పడదు నాకు కానీ, పనిమనిషి లేట్ అయితే, ఈ పనంతా ఎవడు చేస్తాడు, ఎస్, మిమ్మల్ని చూసి బాగా నిరాశ పడ్డ మాట వాస్తవం" అందిట పెంకిగా.


పనిమనిషి రాకపోతే, ఎంతో కోల్పోయినంత బాధగా ఉంటుంది. ఇది సత్యం. పాపం అందుకే అంత రిలీఫ్ పొందింది సుమ.


******

దాదాపు ఒక నెల పైనే అయింది, అర్చన ని సుమ ఇంట్లో పనికి కుదిర్చి, ఓ రోజు ఉదయాన్నే మాధవి సెల్ మోగుతోంది.

మాధవి, బద్దకం గా, ఒక కన్నుతో గడియారం వైపు చూసింది,


ఉదయం 5 అయింది టైం, ఇంత ఉదయాన్నే ఎవరబ్బా అని సెల్ చుస్తే, సుమ ఫోటో కనిపిస్తోంది..


"ఏంటే సుమా! ఇంత ఉదయాన్నే ఫోన్ చేసావు, అంత ఓకేనా?"

సుమ ఒకటే ఏడుపు.. మాట రావడం లేదు.


సుధాకర్ ఫోన్ అందుకుని చెప్పసాగాడు, "రాత్రి మామూలుగానే అన్నీ తలుపులు వేసుకుని పడుకున్నామండీ, ఉదయం లేచేసరికి, వీధి తలుపు మూసింది మూసినట్టే ఉందండీ, ఇంకా, మా బెడ్ రూమ్ లో లాకర్ తెరిచి ఉంది, అందులో ఉండాల్సిన నగలు పెట్టె కనిపించలేదు..

అందులో 50 తులాల బంగారం, ఓ కేజీ వెండి వస్తువులున్నాయండి".

"అయ్యో, సో సాడ్" అంది. "ఈ అమ్మాయి, ఎక్కడ వుంది?" గుర్తుచేసుకుని పేరు చెప్పింది, "అదేనండి, అర్చన ఎక్కడుంది?"


"తాను హాల్ లో పడుకుంటుంది రోజూ, అక్కడే ఉందండి.."

"సరే, ముందు పోలీస్ లకి కంప్లైంట్ ఇవ్వండి, నేను మావారు, పాపని స్కూల్ లో దింపేసి వచేస్తాము, ఏమి కంగారు పడకండి, కష్టార్జితం, ఎక్కడికి పోదు.." ధైర్యం చెప్పింది మాధవి.

ఇద్దరు ఓ గంటలో సుమ ఇంటికి చేరుకున్నారు.

సుమ సోకసముద్రం లో మునిగి ఉంది, , ఓ నలుగురు పోలీసులు ఇల్లంతా తిరుగుతూ, ఫోటోలు తీసుకుంటూ, ఏవేవో మాట్లాడుకుంటూ, హడావిడి పడుతున్నారు, పోలీస్ కుక్క కూడా ఇల్లంతా తిరుగుతోంది, అనుమానం వచ్చిన చోట ఆగుతోంది. అర్చన లాస్యని ఎత్తుకుని హాల్ లోనే ఎదురయ్యింది, మాధవిని పట్టుకుని బావురు మంది. అంతమంది పోలీసులని చూసి గాభరా పడిపోతూ, చిగురుటాకులా వణికి పోతోంది.


"అక్కా, నన్ను మా అమ్మ దగ్గరికి తీసికెళ్ళిపో, నాకు భయం వేస్తోంది.." భయం తనని పెనవేసుకుని ఉంది.


తమ రూల్ ప్రకారం, నిర్దేశిత ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకున్నాక, హాల్ లో సోఫా లో కూర్చుని, సుధాకర్, సుమ లని కూడా వచ్చి కూర్చోవాల్సిందిగా ఆదేశించారు పోలీసులు.

"నిన్న రోజు మొత్తం లో ఏవైనా కొత్త సంఘటనలు, కొత్త వ్యక్తులు రావడం ఇత్యాదులు ఏవైనా జరిగితే, మాకు యథేచ్ఛగా చెప్పండి, ఇలా చేయడం ద్వారా, కేసు దర్యాప్తుని వేగవంతం చేయడానికి సహకరించిన వారు అవుతారు. మీరిచ్చే సమాచారం, ఇక్కడ చాలా కీలకం. మీకెవరి మీదైనా అనుమానం ఉంటే కూడా, ఆ వివరాలు చెప్పండి, మేము గోప్యం గా ఉంచి, మాదైనా పద్దతి లో మేము విచారణ కొనసాగిస్తాము, ఎఫ్. ఐ. ఆర్ రాయడానికి ఇవన్నీ అవసరం. వారిద్దరూ ఎవరు, మీకేమవుతారు?" మాధవిని, గోపాల్ ని చూపించి అడిగారు పోలీసులు.


పోలీసు కన్ను ఏది విడిచిపెట్టదుకదా.


"తను మా మిసెస్ ఫ్రెండ్ మాధవి అండి, ఆయన గోపాల్ అని, మాధవి గారి భర్త. చాలా క్లోజ్ ఫామిలీ ఫ్రెండ్స్ అండీ మేము " సుధాకర్ క్లారిటీ గా చెప్పేడు, తను మాట్లాడుతున్నది పోలీస్ అధికారులతో అనే విషయం బాగా గుర్తెరిగి.


"అయితే వాళ్ళని కూడ వచ్చి కూర్చోమనండి, పోలీస్ అధికారి ఆదేశించారో, ఆజ్ఞాపించారో అర్ధం కాలేదు, అది అర్ధం చేసుకునే ప్రయత్నమూ చేయలేదు ఎవరూ..


సుమ ప్రారంభించింది, "మొన్న నైట్ మా బెడ్ రూమ్ లో ఏసీ నించి ఏకధాటిగా నీరు కారుతోంది, బెడ్ అంత తడిసిపోయింది. ఏసీ వాళ్ళకి ఫోన్ చేస్తే, మధ్యాహ్నం 2 కి సర్వీస్ ఇంజనీర్ ని పంపుతామన్నారు. అయితే నేను చాలా రిక్వెస్ట్ చేశాను, సాయంత్రం 5 తర్వాత పంపమని, మా ఇద్దరిలో ఎవరో ఒకరం ఇంట్లో ఉంటే మంచిదని. కానీ వారు ఆలా కుదరదని, వీలు పడదని, వేసవి రష్ ఉందని, ఇంజినీర్లందరూ చాలా బిజీ అని, వాళ్ళకి కేటాయించిన సమయంలోనే వాళ్ళు రాగలరు, అని.


సో, వాళ్ళు 230 కి వచ్చేరని మా పనమ్మాయి ఫోన్ చేయగా తెల్సింది. ఫోన్ లోనే అన్ని వివరించాను ఆ సర్వీస్ ఇంజనీర్ కి. అతని పేరు రహీం అని చెప్పాడు. పైప్ లైన్ లలో బ్లాక్ ఉందని, అది క్లీన్ చేస్తే, ఇంక నీరు కారదని చెప్పేడు. ఇక రోజంతా మాములు రొటీన్ గానే గడిచింది. అంతే.." సుమ చెప్పడం ముగించింది.


"అమ్మా.. మీ మాటకు అడ్డం వస్తున్నాను, ఏమి అనుకోకండి, ఇక్కడ మీ పనమ్మాయి గురించి వివరాలు చెప్పండి, ఇవి అవసరం"

ఆ మాట వింటూనే, అర్చన గట్టిగా ఏడవడం ప్రారంభించింది.

"హుష్ అర్చన, అలా ఏడవకూడదు. కామ్ గా ఉండు" అని వారించింది సుమ.

"ఈ అమ్మాయి పేరు అర్చన, 20 సంవత్సరాలు. అర్చనకి పెళ్లయింది కానీ ఆ అబ్బాయికి వేరే అమ్మాయితో అంతకు మునుపే వివాహం అయి ఉండడం చేత, విడాకులు తీసేసుకున్నారని, వాళ్ళన్నయ్య నారాయణ చెప్పాడు. మా ఇంట్లో ఓ నెల రోజులుగా పని చేస్తోంది" అర్చన గురించి తనకి తెల్సిన తతిమ్మా వివరాలు పోలీసులకి చెప్పింది సుమ.


"ఈ అమ్మాయి ప్రవర్తన ఎలా ఉండేది?" పోలీస్ కదా, ఇలా అడగడం సహజమే!


"హమ్.. చెప్పిన పనులన్నీ చాలా శ్రద్ధగా చేస్తుంది.. ఎంతలో వుండాలో అంతలో ఉంటుంది, అనవసర విషయాల్లో జోక్యం చేసుకోదు, తన పని తను సిన్సియర్ గా చేసుకు పోతుంది. పైగా చాలా భయస్తురాలు. మేము ఏ ఆదేశాలు ఇస్తామో. అవి తు చ తప్పకుండా పాటిస్తుంది. ఇంతకన్నా ఏం కావాలండి మనకి కదా సర్"


సుమ తను చెప్పాల్సింది ఇక ఏమి లేదన్నట్టు గా, పెద్దగా ఊపిరి తీసుకుంది.

"సరే అమ్మా, ఒక సూటి ప్రశ్న అడుగుతాను, నిజాయితీగా చెప్పండి. మీకు ఈ అమ్మాయి మీద అనుమానం ఉందా, ఈ జరిగిన సంఘటనలో?"


పోలీసులు కదా డొంక తిరుగుడు ఉండదు.


ఒక క్షణం ఆగింది సమాధానం ఇవ్వడానికి సుమ, తన ఇంట్లో జరిగిన దొంగతనం లో తను తన సర్వస్వం, ఇన్నేళ్లు కష్టపడి కూడపెట్టిన దంతా పోగొట్టుకుంది, అది తిరిగి తన కళ్ళ పడాలంటే, తను ఇచ్చే సమాధానం కీలకం కాగలదు, మనమిచ్చే సమాచారం ఆధారంగానే కదా పోలీసులు, పరిశోధన జరిపి, అసలు దొంగని పట్టుకోగలరు. బాపు గారి సినిమా లో ముళ్ళపూడి గారు చెప్పినట్టుగా, మంచివారని, చెడ్డవారని విడివిడిగా రాసులు పోసినట్టు ఉండరు మనుషులు, ప్రతి మనిషి లోనూ, మంచి చెడులుంటాయి, అవసరాన్ని బట్టి, అవి బయటికి వస్తాయి,


"ఏంటమ్మా ఆలోచిస్తున్నారు, మీ సమాధానం కోసం ఎదురుచూస్తున్నాము.."


"సర్! ఇలాంటి సందర్భాల్లో, మీరు మీ ఫార్మాలిటీస్ ప్రకారం, ఎవరెవరిని ప్రశ్నించాలో అది చేయండి సర్. మా ఇన్నేళ్ల కష్టార్జితం, మళ్ళీ మాకు దక్కితే అదే పదివేలు." చాలా డైనమిక్ గా సమాధానమిచ్చింది సుమ.


అది విని మాధవి, గోపాల్ కాస్తంత ఆశ్చర్య చకితులయ్యారు, లాస్య కి స్నాక్ తినిపించడానికి, వేరే రూమ్ లోకి వెళ్ళింది అర్చన, ఈ సంభాషణ తను వినలేదు. వింటే, అక్కడే కుప్పకూలి పోయేది.


"అమ్మా ఓ మారు మీ పనమ్మాయిని పిలవండి, ఆ అమ్మాయి స్టేటుమెంట్ తీసుకోవాలి" హుకుం జారీ అయింది.


ఏడ్చి పెడబొబ్బలు పెట్టినా సరే వారి ప్రశ్నలకి సమాధానం చెప్పి తీరాల్సిందే ఎవరైనా సరే! అదీ పోలీస్ పవర్ అంటే! !


వారు వేసిన ప్రశ్నలకి, వణికిపోతూనే, సమాధానాలు చెప్పింది అర్చన. ఎక్కువ మాట్లాడబోయినా కూడా, వారి సహజమైన పంధా లో దానికి అడ్డకత్తెర వేస్తూ, కావాల్సిన సమాచారం రాబట్టుకున్నారు. మాధవి, గోపాల్ ల స్టేటుమెంట్ తీసుకుని, సుమ, సుధాకర్ల స్టేటుమెంట్ కూడాతీసుకుని, వారికేదైనా ఆధారం దొరికితే ఫోన్ చేస్తామని చెప్పి, వారి కుక్కని తీసుకుని వెళ్లిపోయారు పోలీసులు.

=================================================================================

ఇంకా వుంది..

దోషి ఎవరు? పెద్ద కథ పార్ట్ - 2 త్వరలో..

========================================================================

పూడిపెద్ది ఉగాది వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

Podcast Link:


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: పూడిపెద్ది ఉగాది వసంత

నా గురించి స్వపరిచయం...మూడు కథా సంకలనాలలో నా కథలు అచ్చయ్యాయి. తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్ లో చోటు సంపాయించుకున్నాయి. ప్రముఖ పత్రికలూ తెలుగు వెలుగు, నవ్య, విపుల, స్వాతి, సాక్షి , సహారి, మొదలైన పత్రికలలో నా కథలు విరివిగా అచ్చయ్యాయి . పోటీలలో కూడా చాల బహుమతులు వచ్చాయి .


నా కథ మీ మన్ననలు అందుకుంటుందని విశ్వసిస్తున్నాను.


కృతజ్యతలతో


ఉగాది వసంత

93 views0 comments

Comments


bottom of page