top of page

వైద్యో నారాయణో హరి


'Vaidyo Narayano Hari - New Telugu Article On Doctors By Pudipeddi Ugadi Vasantha

'వైద్యో నారాయణో హరి' తెలుగు వ్యాసం

రచన : పూడిపెద్ది ఉగాది వసంత

అంకితం


ఎన్నో త్యాగాలు చేసి, అహర్నిశలూ, తమ అమూల్యమైన సేవలు అందిస్తున్న, ప్రతి డాక్టర్ కి ఈ వ్యాసం అంకితం. డాక్టర్లంటే, కనిపించే దైవాలు!!!

ప్రతి ఒక్క డాక్టర్ కి "డాక్టర్స్ డే" శుభాకాంక్షలు!!!


రచయిత్రి పరిచయం:


వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో మేనేజర్ గా పనిచేసినప్పుడు, ఉద్యోగుల వెల్ఫేర్ కార్యక్రమాలు చూస్తున్నప్పుడు, వారి మెడికల్ సౌకర్యాల గురించి కూడా చూసేదాన్ని. అలా, మా ఉద్యోగులు హాస్పిటల్స్ లో జాయిన్ అయినప్పుడు, ఆయా హాస్పిటల్స్ కి వెళ్లి, సంబంధిత డాక్టర్లని కలిసి, ఉద్యోగి ఆరోగ్యం తదితర విషయాల గురించి చాలాసేపు వారితో మాట్లాడేదాన్ని, . అలా డాక్టర్లతో ఓ అనుబంధం ఏర్పడింది. అప్పుడు ఎన్నో విషయాలు స్పృశించడం జరిగింది.


Dr. Mukharji Madiwada, Famous Cardiologist, Pulse Heart Clinic







Dr Mukharjee Madiwada, Famous Cordiologist గారితో పరిచయం ఇలాగె ఏర్పడింది. వారితో ఎన్నో విషయాలు చర్చించే అదృష్టం కూడా కలిగింది.


ముఖ్యంగా, మా అమ్మాయి Dr Ananda Sagari, Family Physician & Diabetologist గా Sunshine hospital లో పని చేస్తున్నారు. తను చాల విషయాలు నాతో చర్చిస్తుంది. అలా డాక్టర్ల గురించి, పేషెంట్ల తీరుతెన్నుల గురించి తెలుసుకునే అవకాశం కలిగింది. ఇది నా అదృష్టం కాక మరేంటి ?

ఊహ తెల్సిన నాటి నించి, పేరున్న డాక్టర్ ల తో పరిచయాలు కలిగి ఉండడం, డాక్టర్ కి తల్లిగా, సామాజిక సేవ దృక్పధం గల ఓ వ్యక్తిగా, ప్రజల్లో ప్రబలుతున్న అనారోగ్యానికి కారణాలు పరిశీలించి, పరిశోధించి, ఇందులో పొందుపరచడం జరిగింది. ఇంత వరకు, ఈ కోణం లో ఈ విషయం మీద ఇలాంటి వ్యాసం రాలేదని ఈనాడులో పనిచేస్తున్న, ఓ ప్రముఖ పాత్రికేయుడు, చెప్పడం విశేషం .....



Dr. Ananda Sagari, Family Physician & Diabetologist







***


అటు సాంకేతిక పరంగా అభివృద్ధి, ఇటు డాక్టర్ ల సంఖ్య పెరగడం, హాస్పిటల్స్ సంఖ్యా పెరగడం, ప్రభుత్వాలు, వారి పధకాల ద్వారా, అందరికి అందుబాటులో వైద్యం తేవడం, ఇలా అన్నింటా కొంత అభివృద్ధి ఉంటోంది. అలాగే, ఒక వీధిలో రెండు మూడు మందుల షాపులు, ఇంటికొచ్చి నమూనాలు సేకరించి, సోషల్ మీడియా ద్వారా సాయంత్రానికల్లా రిపోర్టులు పంపించడం, ఇలా ఎక్కడ చూసినా, ఎంతో కొంత అభివృద్ధి చూస్తున్నాము. అయినా, రోగుల సంఖ్యా, మరణాల సంఖ్యా పెరుగుతూ ఉండడానికి కారణం ఏంటి ?? ఎక్కడ లోపం ఉంది? ఈ కోణంలో పరిశీలించి, పరిశోధించి ఈ వ్యాసం రూపొందించడం జరిగింది.


అన్నింటా మంచి చెడులున్నట్టే, డాక్టర్లలోనూ అందరూ మంచివారని చెప్పలేము. ఓ ఐదు శాతం మంది, కాస్త వేరుభవాలు కలిగినవారుంటారు. వారివలన, పేషెంట్లకు కాస్త చెడు జరిగి, ప్రాణాలు పోయే స్థితి కూడా వచ్చే పరిస్థితులుంటాయి. కొందరు వ్యాపారాత్మకంగా కూడా ఉండొచ్చు. అలా అని, అందరిని అదే గాటకు కట్టేయకూడదు.


కానీ, నూటికి తొంభై ఐదు మంది, అంకితభావం తో పనిచేసే డాక్టర్లే ఉండడం గమనార్హం. పేదవారు, డబ్బుకట్టుకోలేమంటే, వారికీ ఉచిత సేవలందించిన వారుకూడా ఉంటారు.


ఎన్నో ఉదాహరణలు, సంఘటనలు, వాస్తవాలు పరిశీలించిన మీదట, ఎంతో మంది డాక్టర్లని ఇంటర్వ్యూ చేయడం ద్వారానూ, గ్రహించిన విషయం ఏంటంటే, నూటికి 90 మరణాలకి కారణం, రోగుల్లోనూ, వారి బంధువుల్లోనూ పేరుకుపోయిన అలసత్వం, ఆజ్యానం, నిర్లక్ష్యమే అని.


ఏమచేస్తే రోగాల సంఖ్య, దాంతో పాటే, మరణాల శాతాన్ని తగ్గించగలం ? అసలు దీనికి ఎవరు బాధ్యులు, ఎవెరెవరి పాత్ర ఎంత ? అనేవి జవాబు దొరకని ప్రశ్నలు కాదు. ఇప్పుడు ఆ వివిరాల్లోకి వెళదాం. కొన్ని కారణాలని ఇప్పుడు మనం ప్రస్తావించబోతున్నాము ..


నిన్న మొన్నటి దాకా మన కళ్ళ ముందు తిరిగే వారు, ఆకస్మాత్ గా మరణించేరని వింటున్నాము. పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ కి తీసికెళ్లారని, చాలా డబ్బులు ఖర్చు చేసేరని, అయినా ఫలితం లేకపోయిందని, వాపోడం కూడా వింటున్నాము. ఎంతో కాలం రోగికి సరైన వైద్యం అందించకుండా, మంత్రాలని, తంత్రాలని, ఆర్. ఎం. పీ డాక్టర్ల వద్ద చికిత్స చేయిస్తూ, రోగాన్ని బాగా ముదరపెట్టేక, అప్పుడు తీరిగ్గా, ఓ పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ కి తీసికెళ్తారు. అప్పుడు ఐ. సి. యూ. లో ఉంచి ఖరీదైన వైద్యం అందించే ప్రయత్నం చేస్తారు. డాక్టర్లంటే మెజిషియన్లు కారు, అబ్రక దబ్రా అని రోగం క్షణాల్లో మాయం చేసేయడానికి, పైగా సంవత్సరాల తరబడి ముదిరిపోయిన రోగాన్ని నయం చేయడం అంత త్వరగా అయ్యే పనా ??


కారణాలు విశ్లేషించే ముందు, మనకి సాధారణం గా తటస్థపడే కొన్ని ముఖ్యమైన సంఘటనలని పరిశీలిద్దాము.


డాక్టర్లు చెప్పినట్టు మందులు వాడకపోడం:


15 సంవత్సరాలు అహర్నిశలు శ్రమించి సంపాదించుకున్న పరిజ్జ్యనానికి తమ అనుభవాన్ని జోడించి, రాసిచ్చిన మందుల్ని, ఏ మాత్రం వైద్య పరిజ్యానం లేని ఓ సామాన్యమానవుడు ఇచ్చిన ఉచిత సలహాతో, తమ ఇష్టానుసారం వేసుకునేవారు కోకొల్లలు. చదువుకున్నవారు, చదువులేనివారు అనే తేడా ఉండదిక్కడ. తమ వొంట్లో బాధకి, అధిక మోతాదు మందులే అనీ నిందించుకుంటూ, తమకి నచ్చిన విధంగా మందులు వాడేస్తూంటారు. చివరిగా జబ్బు ఎప్పటికి తగ్గకపోతే, డాక్టర్లని నిందించుకుంటుంటారు


ఓ ఇంట్లో సంఘటన ఎలా ఉందొ చూద్దాము..


“ఒరేయ్ శేఖరం, రేపు నీ మీటింగ్ అయ్యాక, ఓ మారుడాక్టర్ దగ్గరికి వెళ్ళలిరా అబ్బాయ్. అతగాడిచ్చిన మందులు వేసుకుంటే, ఒళ్లంతా ఒకటే మంటగా ఉంటోందిరా, అందుకే, నిన్నటి నించీ, రోజుకి మూడుసార్లకి బదులు, ఓమారే వేసుకుంటున్నానురా బిళ్ళలు. ” అంటుంది ఏమాత్రం చదువు, పరిజ్యానం లేని ఓ తల్లి.


“అయ్యో అమ్మా!! డాక్టర్ చెప్పినట్టు వాడాలి కానీ, అలా మన ఇష్టమొచ్చినట్టు వేసుకోకూడదు అమ్మా!! ఏదీ ఓ మారు ప్రిస్క్రిప్షన్ పట్రా, చూస్తాను. భోజనం అయ్యాక వేసుకోమని రాసారు, అలాగే వాడుతున్నావు కదా?”


“లేదురా, భోజనానికి ముందు వేసుకుంటున్నానురా భోజనం తర్వాత, మరో 4 బిళ్ళలు వేసుకోవాలి కదా, ఎక్కువ బిళ్ళలు అయిపోతాయి కదా అని అలా వాడుతున్నానురా “


“అయ్యో అలా చేయకూడదు అమ్మా, నన్నోమారు అడగాల్సింది కదా, ఇలా అయితే, జబ్బు ఎలా తగ్గుతుందమ్మా? పైగా ఆయన చాలా పెద్ద డాక్టర్ అమ్మా! ఎం. బి. బి. స్, ఎం. స్ లాంటి పెద్ద పెద్ద డిగ్రీలు కలిగి ఉన్నారు. ఎంతో అనుభవం కూడా ఉందమ్మా.. !”

“ఆ !! డాక్టర్లు అలాగే చెప్తారు, రోజుకి మూడుసార్లు వాడండి, ముప్పైసార్లు వాడండి అనీ, వాళ్ళకేంటి నొప్పి, వాడేది మనం, ఏ బాధ వచ్చిన భరించేది మనం, మన శరీర తత్వాన్ని బట్టి, మనం, రోజుకి ఓసారో లేదా రెండు సార్లో వేసుకుంటే సరిపోతుంది”, ఓ ఉచిత సలహా ఇచ్చేస్తుంటారు చాల ఇళ్లల్లో. పైగా తానూ అలాగే చేసెనని, భేషుగ్గా జబ్బు నయమైందని కూడా సెలవిస్తారు. ఎంతో పరిజ్యానం, మరింకెంతో అనుభవమున్న డాక్టర్ల మాట ఖాతరు చేయకుండా విన్నవారు కూడా అదే గుడ్డిగా ఆచరించేస్తుంటారు, .

*

డాక్టర్ దగ్గర దాపరికం:


ఇంకో తమాషా ఏంటంటే, ఇలా మందులు సరిగా వాడలేదని విషయం, డాక్టర్ల కి అస్సలు చెప్పరుకాక చెప్పరు. డాక్టర్ దగ్గరికి రివ్యూ కి వెళ్ళినప్పుడు ఇంకా తగ్గకపోడం చూసి, ఆ సదరు డాక్టర్ జుట్టు పీక్కోలేక ( ఎందుకంటే, జుట్టంతా 14 సంవత్సరాల చదువులోనే ఊడిపోతుంది కనుక), తల ఓ సారి గోక్కుని, మరిన్ని పరీక్షలు రాసిచ్చి, రిపోర్టులు వచ్చేదాకా, మరో రకం మందులు సూచిస్తాడు. ఇది డాక్టర్లకే పెద్ద పరీక్ష. రిపోర్టులన్నీ నార్మల్ గానే ఉంటె, మళ్ళీ మరో రకమైన మందులు మార్చి రాసి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహార వ్యవహారాలు మళ్ళీ ఓపిగ్గా చెప్పి పంపిస్తారు డాక్టర్లు. ఓ "పిచ్చి " నమ్మకం, తాము చెప్పేవన్నీ రోగులు ఖచ్చితంగా పాటిస్తారని, ఎందుకంటే అది వారి ఆరోగ్యం కోసమే కదా అనే ఆలోచనతో.


ఆహార వ్యవహారాలు:


మీకు ఈ వ్యాధి ఉంది కనుక, ఈ మందులు క్రమం తప్పకుండ వాడడం తో పాటుగా, పులుపు, ఉప్పు, కారం, మసాలాలు, కాఫీ, టీలు తగ్గించండి, నయం అయిపోతుంది, ఓ తల్లి పిల్లలకి చెప్పినంత భద్రంగా చెపుతారు డాక్టర్లు.


ఆ !! డాక్టర్ లు అలాగే చెప్తారు, మా అమ్మమ్మ గారు సుష్టుగా మొప్పొద్దులా అన్నమే తినేవారు, పోయేదాకా ఒక్క గోలి వేసుకుని ఎరుగరు.. పోయేదాకా తన పనులన్నీ తానే చేసుకునేది. సమతుల ఆహరం తీసుకుంటే ఏ జబ్బు మన దరి చేరదు అని వారికీ వారే ఎంట్రీ లు వేసేసుకుని, శుభ్రంగా అన్నీతినేస్తారు డాక్టర్ల మాట పెడచెవిని పెట్టి.


ఆ సదరు రోగి ఓ మగాడైతే, ఇంట్లో భోజనం టైం లో ఫార్స్ చెప్పక్కర్లేదు

“ఏంటీ చప్పిడి కూడు ? ఇవి కుక్కలు కూడా తినవు” అని భార్య మీద నానా యాగీ చేస్తాడు.


“డాక్టర్ చెప్పేరు కదండీ” అని అతనికి నచ్చ చెవుప్పడానికి ప్రయత్నం చేస్తే, “ఆ!! ఆ డాక్టర్ ని తినమను, అప్పుడు తెలుస్తుంది ఇది తినడం ఎంత నరకమో”.


ఇంకొందరైతే, ఫలానాది తినకూడదు అంటే, ‘ఆ ఇంత చిన్న ముక్క, అది ఓ సారి తింటే ఏమి కాదు’ అని వారికీ వారే ధ్రువ పరిచేసుకుని అపత్యం చేసేస్తారు. ఇక్కడ ఒక మాట, మనం వేసుకున్న మాత్ర ఎంత సైజు ఉంటుందో గుర్తెరగాలి.


వ్యాయామం:


షుగర్, బీ పీ, గుండెజబ్బులు వగైరా వ్యాధులు ఉన్నవారికి, డాక్టర్లు, మందులతో పాటు, వ్యాయామం కూడా సూచిస్తారు. మందులు వాడేస్తారు గానీ, పథ్యం చేయడం లోను, వ్యాయామం విషయం లోను, డాక్టర్ల మాట పెడచెవిన పెడతారు. మనం చెప్పిన ప్రతి మాట శ్రద్దగా విని, పరీక్షలన్నీ చేసి, వారి విజ్యానాన్ని అంత కాచి, వడబోసి, మనకి మందుల రూపం లోను, సలహాలు రూపంలోనూ అందిస్తారు డాక్టర్లు. ఇవేవి పట్టించుకోడు సదరు రోగి, డాక్టర్ ఇచ్చిన మందులను, సలహాలను కొనగోటితో కొట్టి పడేస్తారు, ఇంక రోగాలెలా తగ్గుతాయి


మూఢ నమ్మకాలు-అశ్రద్ధ:


ప్రజల్లో అవగాహనరాహిత్యం, ఆజ్యానం, మూఢనమ్మకాల పట్ల వేళ్లూనుకుపోయిన నమ్మకం, ఇత్యాది వాటి వలన సకాలంలో సరైన వైద్యం దిశగా అడుగులు వేయలేకపోతున్నారు, జబ్బులు ముదరబెట్టుకుంటున్నారు, డబ్బులు వదలగొట్టుకుంటున్నారు, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.

ఇప్పటికి చాలామంది (చదువుకున్న వారు కూడా), మసూచికం వస్తే, అమ్మవారు వచ్చిందని, వేపమండలమీద పడుకోబెట్టి, అసలు మందులజోలికె వెళ్లడం లేదు. రోగికి ఆయుష్షు ఉంటె, బతికి బట్ట కడతాడు, లేదంటే, ఇంతే సంగతులు. ఎవరైనా డాక్టర్ దగ్గరికి చూపించమని సలహా ఇవ్వబోతే, "అమ్మవారు కోపపడుతారు, లెంపలేసుకోమని” తిరిగి ఓ ఉచిత సలహా ఇచ్చేస్తుంటారు.


స్వంత చికిత్స:


కొంతమంది ఉంటారు, బాగా చదువుకుని ఉద్యోగం కూడా చేస్తుంటారు, వారికీ ఎలాంటి శారీరక బాధ వచ్చినా, దగ్గర్లో ఉన్న మందులషాపు కెళ్ళి, వారి బాధ చెప్పి, షాపువారిని, ఫలానా మాత్ర ఇవ్వండి అని అడుగుతారు లేదా షాపువారినే, వారి బాధకి తగ్గ మందు ఇవ్వమని అడుగుతారు. తాత్కాలిక ఉపశమనం ఉండొచ్చు కానీ, శాశ్వత పరిష్కారం దొరకదు.


వీరు చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు అందరికి, " నేను అనవసరంగా ప్రతి చిన్నదానికి, డాక్టర్లని సంప్రదించను, వేలకువేలు తగలబెట్టి, మందులు కొని, రోజుల తరబడి వాడను. మా ఆఫీస్ లో మెడికల్ బిల్లులు పెడితే, ఆ డబ్బుని మాకు తిరిగి చెల్లించే వీలు ఉన్నా కూడా, ఖరీదైన మందులు, ఎడా పెడా కొనేయను, చూడండి, ఒక్క పదిహేను రూపాయలతో, నా తలనొప్పి, వాంతులు కట్టేశాయి, హాయిగా, అన్ని తింటున్నాను, ఆఫీస్ కి ఒక్క సెలవు కూడా పెట్టలేదు కూడాను. ఇదే వ్యక్తి, కొన్నాళ్ళకి మళ్ళీ అదే బాధ విపరీతంగా వచ్చి, అది మామూలు ఓ. టీ. సి. ( ఓవర్ ది కౌంటర్ ) మందులకు తగ్గకపోతే, అప్పుడు, డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. అంతా బాగుండి, ఏ సీరియస్ జబ్బు లేకపోతే ఫరవాలేదు, కానీ, ఇంకేదయినా అయితే, తనకుతానే, తన జబ్బు, పెరిగి పెద్దదవడానికి కారకుడైనట్టే కదా !


తల్లితండ్రుల మందులు వాడేయడం:


ఇంకొంతమంది ఉంటారు, ఇంట్లో తల్లో, తండ్రో, బీ. పీ. , షుగర్, కాళ్ళ నొప్పులకు వాడే మందులు, వీరిలో అలాంటి లక్షణాలు కనిపిస్తే చాలు, వారి మందులు వీళ్ళు యదేక్షగా వాడేస్తూ ఉంటారు. ఇది మరీ ప్రమాదం. డాక్టర్ ని సంప్రదించకుండా, సరి అయిన పరీక్షలు, వ్యాధి నిర్ధారణ లేకుండా, ఏది పడితే అది వాడేవారు, భవిష్యత్తులో, ఆరోగ్యపరమైన ఇబ్బందులు చాలా ఎదుర్కోవలసి వస్తుంది.


ఫస్ట్ ఎయిడ్ కిట్:


కొంతమంది, ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ ఎప్పుడు అందుబాటులో ఉంచుకుంటారు. అందులో వాంతులు, విరేచనాలు, తలనొప్పి, కడుపునొప్పి, జ్వరాలు, ఎలర్జీ లకి కావాల్సిన మందులు, ఏంటీ బయోటిక్స్ కూడా ఈ కిట్ లో ఉంచుకుంటారు. వారికీ ఏ లక్షణం కనిపించిన, ఆయా మాత్రలు వాడుతూ ఉంటారు. ఇంట్లో వారికి గాని, చుట్టుపక్కల ఎవరికైనా, ఏదైనా అనారోగ్యం కనిపిస్తే, వీరే డాక్టర్ లా మారిపోయి, మందులు, పథ్యం వగైరా సూచిస్తూ ఉంటారు. ఆయా మందుల ఎక్సపైరీ డేట్ అయిపోయిందో లేదో కూడా చూడరు. ఎక్సపైరీ డేట్ అయిపోయిన మందులు వాడితే, ఒక్కోసారి ప్రాణ హాని కూడా జరగవచ్చు. అంతకుముందు డాక్టర్లు సూచించిన, ఏంటీ బయోటిక్స్ ని కూడా, యథేచ్ఛగా కొని వాడేస్తూ ఉంటారు. వీళ్ళకి డాక్టర్ వృత్తి పట్ల విలువ ఉండదు, వారి ఆరోగ్యం అన్నాకూడా పెద్ద లెక్క ఉంaaడదు.


గూగుల్ సేవల వాడకం:


ఓ ఆసామి డాక్టర్ దగ్గరికి వచ్చిందగ్గరనించి, తన ఒంట్లో నలత గురించి ఏకరువు పెడుతూ, మధ్యలో సర్, నేను గూగుల్ లో వెతికాను సర్, ఈ లక్షణాలున్నవారికి, కాన్సర్ లేదా ట్యూమర్ అయి ఉండవచ్చునని, దానికి రక్త పరీక్షలు, స్కానింగ్ వగైరా వగైరా చేయిస్తే, సరైన వైద్యం చేయడానికి, మంచి అవగాహనా ఏర్పడుతుందిట సర్. ఆగకుండా ప్రవాహం సాగిపోతూ ఉంటుంది. ఇక డాక్టర్ పరిస్థితి ఎలా ఉంటుంది ??


ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళు వారి లక్షణాలన్నీ డాక్టర్ కి చెప్పి, వారు గూగుల్ లో చూసి, ఫలానా మందులు వాడేమని, అవే చిట్టీ రాసిమ్మని అడుగుతారు.


అసలు గూగుల్ లో ఇచ్చే సలహాలు, సూచనలు ఎలా, ఉంటాయంటే, అది వారి వారి జీవనశైలి, ఆహారానియమాలు, వంశపారంపర్యత, ఇలా ఎన్నో కారణాల మీద ఆధారపడి ఉంటాయి. ఒకరిలో మనకున్నలాంటి లక్షణాలు ఉండి ఉండవచ్చు, కానీ ప్రతిదీ మన జీవనశైలి తో పోలిఉండకపోవచ్చు. అంచేత గూగుల్ లో ఉన్న సమాచారం ప్రకారం అన్ని సరితూగక పోవచ్చు.


హోటల్ కెళితే సైడ్ ఎఫెక్ట్స్ గురించి అడగం:


ఒక హోటల్ కెళితే, మనం ఒక ఐటెం ఆర్డర్ చేస్తాము. వాళ్ళు ఆ ఐటెం తెచ్చిస్తారు. వాళ్ళని ఈ పదార్ధం చేయడానికి ఏయే ఐటమ్స్ వాడారు, ఏ నూనె వాడారు, అన్ని ఫ్రెష్ వే వాడారా? ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా ? ఇత్యాది ఏ రకమైన ప్రశ్నలు అడగము. బాగున్నా, బాగులేకపోయిన, ఉప్పు, కారం తక్కువైనా కూడా, మారు మాట్లాడకుండా మనం హాయిగా తినేస్తాము. ఫుడ్ ఏమైనా తేడా జరిగి, అనారోగ్యం వస్తే మాత్రం, డాక్టర్ దగ్గరికి వెళ్తాము, కానీ హోటల్ వాళ్ళని ఏమి ప్రశ్నించము.


డాక్టర్లని మందుల సైడ్ ఎఫక్టుల గురించి ఆరా తీయడం:


డాక్టర్ మందులు రాసిస్తే మాత్రం తెగ ప్రశ్నలతో విసిగిస్తాము. ఈ మందు వలన రియాక్షన్ వస్తుందా, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? అది ఇది అని. ఇదే ప్రశ్న హోటల్ వాళ్ళని అడిగితే అసలు డాక్టర్ అవసరమే ఉండేది కాదు కదా !


అవగాహనా లోపం-నిర్లక్ష్య ధోరణి:


ముందస్తుగా ప్రస్తావించవలసిన అంశము, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే, అన్న చందాన, రోగుల్లోనూ, వారి బంధువుల్లోనూ, వారి ఆరోగ్యం పట్ల ఏ మాత్రం పెరగని అవగాహనా శక్తి, వారు వహించే నిర్లక్ష్య ధోరణులే మూల కారణాలు అన్నది సుస్పష్టం.


అసలు విషయం ఎవరికీ అంతుబట్టదు. ఇక్కడే ఉంది తిరకాసంత. వాళ్ళు పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ కి తీసుకెళ్లి ఉండవచ్చు, కానీ ఎప్పుడు ? రోగాన్ని ఎన్నాళ్ళు తమ ఆజ్యానంతో, నిర్లక్ష్యంతో మురగబెట్టారు, ఆర్ ఎం పీ డాక్టర్ ల వద్ద, తాత్కాలిక ఉపశమనాన్నిచ్చే మందుల తోనూ, మంత్రాలూ, తంత్రాలు. చెడుపు, చిల్లంగి అనే మూఢ నమ్మకాలతోను ? వాళ్ళు బాగా డబ్బు ఖర్చు చేసి ఉండవచ్చు.


కార్పొరేట్ హాస్పిటల్ లో జేర్పించి ఏ స్టేజి లో దేనికోసం ఖర్చు పెట్టేరు ? బాగా సీరియస్ గా ఉన్న పరిస్థితి లో తెచ్చి, చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు, ఐ. సి. యూ లో ఉంచడానికి. ఇది వారి నిర్లక్ష్యానికి వారు చెల్లించే మూల్యం, అని వారు ఎన్నటికీ ఒప్పుకోరు కూడాను. వారి నిర్లక్ష్యాన్ని కానీ, వారి అశ్రద్ధ ని కానీ, వారి ఆజ్యానాన్ని కానీ ఎవరికీ చెప్పరు సరికదా, డాక్టర్ ల నిర్లక్ష్యం వలన, కార్పొరేట్ హాస్పిటల్ లో సరి అయిన చికిత్స జరగక పోడం వల్లనే, వారి బంధువు చనిపోయారని చాటింపు వేస్తారు. అక్కడితో ఊరుకుంటారా, వారి చేతకాని తనాన్ని, వారి అగ్రహావేశాలని, హాస్పిటల్ లో వస్తువులని ధ్వంసం చేయడం ద్వారా తెలియచేస్తారు. కొంతమంది ప్రబుద్దులు కూడా ఉంటారు, వారు, ఇంకాస్త ముందుకెళ్ళి డాక్టర్ లని నిర్ధాక్షిణ్యం గా హింసించి, ఇష్టా రాజ్యం గా కొడతారు కూడాను. ఎవరి తప్పు కి ఎవరిని శిక్షిస్తున్నారు, అనే ఇంగితం ఇసుమంతైనా ఉండదు. అదే ఉంటే, వారి ఆప్తుల ఆరోగ్యం పట్ల అంత నిర్లక్ష్య ధోరణి చూపించి ఉండే వారే కాదు.


హాస్పిటల్కిచ్చే డబ్బంతా డాక్టర్లకే ఇస్తున్నామని భ్రమించడం:


చాలా మంది ఒక భ్రమ లో ఉంటారు.. వాళ్ళు హాస్పిటల్ కి కట్టే డబ్బంతా, తమకి చికిత్స చేసే డాక్టరుకే చెల్లిస్తున్నామని అనుకుంటారు. ఆ డాక్టర్ కి లక్షలు లక్షలు గుమ్మరించినా సుఖం లేకపోయిందిరా.. ఆ డాక్టర్ ముక్కు గుద్ది, ఆ డబ్బంతా వసూల్ చేయాలి అని కసిగా మాట్లాడుతూ ఉంటారు.


నిజానికి, వారు కట్టే డబ్బు హాస్పిటల్ లో రూమ్ అద్దెకి, ఐ. సి. యూ అద్దె, మందులకు, ఆహారానికి, ఆక్సిజన్ తదితరాలకు, ఆపరేషన్ థియేటర్ ఖర్చు, సర్జన్ కిచ్చే ఫీజు, నర్సులు, వార్డ్ బాయ్స్, అనస్తేషియా డాక్టర్ కి, పేషెంట్ కి చేసే టెస్టులకి ఇలా ఎన్నింటికో ఖర్చవుతుంది. చికిత్స చేసే డాక్టర్కి "ఇంత " అని ఫిక్స్ చేసి మాత్రమే, హాస్పిటల్ వారు చెల్లిస్తారు. ఈ నగ్న సత్యం చాలామందికి తెలియదు, తెలుసుకోరు కూడా.


డాక్టర్ల హక్కులు:


అసలు డాక్టర్ కి కొన్ని హద్దులు, హక్కులు ఉన్నాయి, తద్వారా, ఒక డాక్టర్, ఒక రోగి కిచికిత్స చేయాలా వద్ద అనే నిర్ణయం, తీసుకునే అవకాశం, వీలు, మెడికల్ ఆక్ట్, డాక్టర్ కి కల్పించింది. ఈ ఆక్ట్ ద్వారా, ఒక డాక్టర్ ఎవరైనా రోగికి చికిత్స ను తిరస్కరించ వచ్చు..


అయినా ఏ డాక్టర్ కూడా, ఈ చట్టాన్ని ఉటంకిస్తూ, ఎప్పుడు, ఏ రోగికి చికిత్స అందించకపోడం అనేది జరగలేదు. అందుకే డాక్టర్లంటే దేవుళ్ళు. ఈ చట్టం గురించి ఎంత మంది కి తెల్సి ఉంటుంది ?

అయినా, మానవతా ధోరణి తో, రోగి ఎంత అలసత్వం చూపించి, ఎంత ఆలస్యం గా తమ వద్దకి వచ్చినా, తమ వంతు ప్రయత్నం చేస్తారు డాక్టర్లు, ఆ రోగికి స్వస్థత చేకూర్చాలని.


కాని, ఇవేమి పరిగణన లోకి తీసుకోలేని, ఆజ్యానం పేరుకుని ఉన్న ఒక రోగి గానీ, అతని బంధువులు గాని, ఒకటే మూర్ఖపు ఆలోచన కలిగి ఉంటారు, డాక్టర్, సకాలంలో, సరిఅయిన చికిత్స అందించలేదు అని.

డాక్టర్ గురించి రోగి ఆరా తీస్తాడు:


మనకి జబ్బు చేస్తే, మనం వెళ్లే డాక్టర్ కి ఏ ఏ డిగ్రీలు ఉన్నాయి, ఎంత అనుభవం ఉంది, హస్త వాసి మంచిదేనా, మనం వేసే ప్రశ్నలన్నింటికీ ఓపిగ్గా సమాధానాలు చెప్తారా, లాంటివి ఎన్నో ఆరాలు తీసి, మనకి నచ్చితేనే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తాము. జబ్బులు ఎంత త్వరగా తగ్గుతాయి, ఆ డాక్టర్ చికిత్స చేస్తే, అలా నయమయిన వారిలో తమకి పరిచయం ఉన్నవారు ఎవరైనా ఉన్నారా, ఇలా ఎన్నో విధాలుగా ఆ డాక్టర్ గురించి తెల్సుకుని మరీ, ఆ డాక్టర్ దగ్గరికి వెళతారు.


రోగి గురించి డాక్టర్ ఆరా తీయడు:


కానీ మనకి చికిత్స చేసే ముందు ఏ డాక్టర్ కూడా, రోగి ఎలాంటివాడు, ఎంత పరిజ్జ్యానం ఉంది, చదువుకున్న వాడా కాదా, మందులు సరిగా వాడని చరిత్ర కలిగి ఉన్నదా? అనేవేవీ చూడడు.

మెడికల్ చట్టం ప్రకారం, డాక్టర్ కి ఏ పేషెంట్ ని అయినా చూడడం లేదా చూడకపోవడం విషయంలో పూర్తి స్వేచ్ఛ ఉన్నప్పటికీ కూడా, ఎలాంటి నిషేధాలు పాటించకపోడం డాక్టర్ల గొప్పదనం కాక మరేమిటి ?. అలా ఈ స్వేచ్చని ఉపయోగించుకుని, డాక్టర్ ఒకవేళ రోగిని చూడకపోతే, రోగులు సంఖ్యా మరియు మరణాల సంఖ్యా కూడా మరింత గణనీయంగా పెరిగి పోయి ఉండేది. మనకి తెలుసు, హోటళ్ళలోనూ, షాపులలోను కూడా, ప్రవేశానికి, కొంత మందికి అనుమతి ఉండదు. అలాంటి నిషేధాలు కూడాఏమి లేవు డాక్టర్లకి.

ఫ్రిడ్జ్ లో రోజుల తరబడి ఆహారపు నిల్వలు:


అమెరికా లాంటి దేశాల్లో, చల్లని వాతావరణం నెలకొని ఉంటుంది, అక్కడ ఆహారం, ఓ వారం రోజులు నిల్వ ఉంచిన పాడవదు, పైగా ఫ్రిడ్జ్ లో పెడితే మరింత భద్రంగా, తాజా గా ఉంటాయి కూడాను । ఇంకా అమెరికా లో, పనిమనుషులు దొరకరు, అన్ని పనులు మనమే చేసుకోవాలి, రోజు వంట చేసుకుంటే, ఆ గిన్నెలు తోముకోవాలి, వంటగది శుభ్రపరచుకోవాలి, ఇలా చాల పని ఉంటుంది। పైగా అక్కడ రెండు లేదా మూడు గంటలు ప్రయాణం చేసి, ఆఫీస్ లకి వెళ్లాల్సి వస్తుంది, అన్ని దూర భారాలు కావడంతో, భార్య భర్తలిద్దరూ, ఉదయం 7 కి బయలుదేరితే, , రాత్రి 7 కి ఇంటికి చేరుకుంటారు। అందుకని, ఈ పరిస్థితుల దృష్ట్యా, అక్కడి వారు, 4 లేదా 5 రోజులకోసారి వంట చేసుకుంటూ ఉంటారు।


కానీ మనకి ఇక్కడ అన్ని సుఖాలు ఉన్న సరే, మన వాతావరణం వేడిగా ఉంటుంది అనిను, ఎక్కువ కాలం ఆహారం నిల్వ ఉండదని తెల్సి కూడా, చాలామంది, వండిన వంటల్ని మూడు నాలుగు రోజులు ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచుకుని, ఓవెన్లలో వేడి చేసుకుని తింటూ ఉంటారు। ఫ్రిడ్జ్ లో ఉన్న సరే, కొన్ని రకాల బ్యాక్తీరియాలు తయారవుతుంటాయి। అలంటి పదార్ధాలు తినడం ద్వారా, ఉదరసంబంధమైన ఇన్ఫెక్షన్లు రావొచ్చు।


దానికి మళ్ళీ స్వంత వైద్యం చేసుకోడం, ఈ పరిస్థితికి సరిపడని పదార్ధాలు తినడం, ఇలా అన్నిరకాలుగా చాల సిక్ అయిపోతారు। అప్పుడు డాక్టర్ గుర్తొస్తాడు, డాక్టర్ దగ్గరికి వెళ్లి, ఇవేమి చెప్పకుండా, సింపుల్ గా రాత్రినించి కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు అని చెప్పి వదిలేస్తారు।, డాక్టర్ ఖర్మ డాక్టరే పడతాడు లే అనే ధోరణిలో । ఇది వారి ఆరోగ్యానికే ప్రమాదకారి అని గ్రహించుకోరు।


పడని పదార్ధం చెడిన పదార్ధంతో సమానం:

మనకి పడని పదార్ధాలని, చెడిన పదార్ధాలుగా భావించాలి. అలా కాకుండా, మనం వాటిని తినేశామంటే, అనారోగ్యం బారిన పడక తప్పదు. కోరి అనారోగ్యం తెచ్చుకోడం అంటే ఇదే. మన ఆహార వ్యవహారాలే, మన ఆరోగ్యాన్ని నిర్దేశిస్తాయి.


పేషెంట్ వివరాలు పూర్తిగా చెప్పకపోడం:


ఇక్కడో విషయం అందరు గుర్తుంచుకోవాలి, పేషెంట్ ని చూడగానే, డాక్టర్ అన్ని గ్రహించి, జబ్బు ఏంటో నిర్ణయించలేరు।


ఇక్కడ, పేషెంట్ చెప్పే వివరణ ప్రధాన పాత్ర వరిస్తుంది। వంశపారంపర్యం ఏంటి, ఎవరికీ ఏ ఏ వ్యాధులున్నాయి, తన ఆహార వ్యవహారాలు, జీవనశైలి ఏంటి ? వ్యాయామం చేసే అలవాటు ఉందా, అంతవరకూ, ఏ ఏ మందులు వాడారు, ఈ లక్షణాలు ఎంత కాలం గా ఉన్నాయి? పాత రిపోర్టులు, మందుల చిట్టీలను చూపించి, అన్ని వివరంగా చెప్పాలి డాక్టర్ కి। డాక్టర్ దగ్గర రహస్యాలు ఉంచితే, జబ్బు నయం కాదు, లాయర్ల దగ్గర వివరాలు దాస్తే, న్యాయం జరగదు, సరికదా, డబ్బు వృధా కూడా తప్పదు। అంచేత, మంచి వైద్యం దొరకాలంటే, పేషెంట్ ఇచ్చి న వివరాలు చాల చాల ముఖ్య పాత్ర వహిస్థాయి. పేషెంట్ చెప్పిందంతా శ్రద్ధగావిని, పాత రిపోర్టులు క్షుణ్ణంగా పరిశీలించి, అవసరమైన పరీక్షలన్నీ నిర్వహించి, ఆ రిపోర్టుల ఆధారంగా, జబ్బేమిటో నిర్ణయించి, తగు చికిత్స సూచిస్తూ, ఆహారానియమాలు కూడాచెప్పి, చేయవలిసిన వ్యాయామాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పి, అన్ని ఆచరించి, మళ్ళీ రివ్యూ కి రమ్మని సూచిస్తారు, డాక్టర్లు, పేషెంట్లకు। డాక్టర్లు చెప్పింది శ్రద్ధగా పాటిస్తే, తప్పక గుణం కనిపిస్తుంది, కాని చిక్కంతా ఇక్కడే కదా మరి।


క్రిమినాశక నిరోధం (AMR):


ప్రతి చిన్న అస్వస్థతకి, స్వంతంగా ఏంటీబయాటిక్స్ వాడడం వలన, క్రిమినాశక నిరోధం (AMR) పెరిగిపోతుంది.


ఆయా ఏంటీబయోటిక్స్ కి, మన శరీరంలో ఉన్న బాక్టీరియా అలవాటుపడిపోయి, అవి పనిచేయని పరిస్థితి వచ్చేస్తుంది. అప్పుడు చాల ప్రమాదం ఎదుర్కోవలసి ఉంటుంది.


అంచేత, ఏంటీబయోటిక్స్ అనేవి, డాక్టర్ సూచన మేరకు మాత్రమే వాడాలి, మన ఇష్టానుసారం వాడేస్తే, చాల దుష్పరిణామాలు చవిచూడాల్సి ఉంటుంది. ఈ స్థితిని క్రిమినాశక నిరోధం (AMR) అంటారు.


బాక్టీరియా, పరాన్నజీవులు, వైరస్ లు మరియు శిలీంధ్రాలు వల్ల కలిగే ఇన్ఫెక్షన్ల శ్రేణి యొక్క సమర్థవంతమైన నివారణ మరియు చికిత్సను క్రిమినాశక నిరోధం (AMR) బెదిరిస్తుంది. AMR పై అన్ని ప్రభుత్వ రంగాలు మరియు సమాజం అంతటా చర్య అవసరం. ప్రపంచ ప్రజారోగ్యం తీవ్రమైన ముప్పు కలిగి ఉంది.


ఎంత ఎక్కువ యాంటీబయాటిక్స్ ఉపయోగిస్తే, అంత ఎక్కువ నిరోధక బాక్టీరియా పెరుగుతుంది, ఎందుకంటే సున్నితమైన బాక్టీరియా అయితే చంపవచ్చు, కానీ బలమైన క్రిములు చికిత్స ని నిరోధిస్తాయి మరియు బాగా విస్తరిస్తాయి.


Prevention is Better than Cure:

(జాగ్రత్త భయం నాస్తి )


ఏ మాత్రం ఒంట్లో తేడా అనిపించినా ముందుగా డాక్టర్ ని సంప్రదించాలి. సంవత్సరానికి ఓ మారు, మన కుటుంబ డాక్టర్ ని కలిసి, అన్ని రకాల పరీక్షలు చేయించుకుని, మన శరీరం లోపల ఏమి జరుగుతుందో తెల్సుకుని, ఏమైనా తేడాలుంటే, మన డాక్టర్ సూచించిన విధంగా, తక్షణమే కావాల్సిన చికిత్స తీసుకోడం, లేదా మన కుటుంబ డాక్టర్, స్పెషలిస్ట్ ని కలవమని సూచిస్తే, వెంటనే ఆ పని చేయాలి, అశ్రద్ధ చేయకుండా. రోగం ముదిరి పాకాన పడక ముందే, తగు వైద్యం చేయించుకోవాలి. ఇలా చేయడం వలన, ఆరోగ్యం లో అగ్ర స్థానం లో ఉంటాము


పైన చెప్పిన కారణాలు పరిశీలించినట్లయితే, రోగాలు పెరగడానికి ఇంకా మరణాల సంఖ్యా పెరగడానికి, రోగుల్లో కనీస పరిజ్యానం లోపించడంవలన, మందుల వాడకం లోను, ఆహార వ్యవహారాల్లోనూ, వ్యాయామం విషయం లోను, డాక్టర్ ల సూచనలు సరిగా పాటించకపోడం వలన. ఇవన్నీ సరిగా పాటించడం ఎంత ఆవశ్యకమో వారికీ తెలియచెప్పడం, ఎప్పుడు పేషెంట్ల తో బిజీ గా ఉండే డాక్టర్ ల వలన జరిగే పని కాదు. దీనికి ఎవరో రావాలి, వీరిలో జ్యానకాంతులు నింపాలి.


కౌన్సెల్లర్ల ఆవశ్యకత:


ప్రతి హాస్పిటల్ లోను అనుభవజ్యులైన వ్యక్తులను, కౌన్సిలర్ ల గా నియమించుకోవాలి. ఓ కార్పొరేట్ హాస్పిటల్ లో, మానవ వనరుల శాఖ అధిపతి ఇలా వివరించారు, రోగుల దృక్కోణం నించి, డాక్టర్ల దృక్పధం నించి వారి అనుభవనాన్ని రంగరించి, పేషెంట్ల కి లేదా వారి బంధువులకి, ఓపిగ్గా, వారి జబ్బు గురించి, మందుల వాడకం, ఆహార నియమాలు వాటి ఆవశ్యకత, వ్యాయామం తదితరమైనవి ఎంత ప్రాముఖ్యతని సంతరించుకున్నాయో అనే విషయాన్ని సావధానంగా చెప్పాలి.


రోజుకి 40 -50 మంది రోగులని పరీక్షించి, వారు వేసే సవాలక్ష ప్రశ్నలకి ఓపిగ్గా సమాధానం చెపుతూ, విసిగి వేసారి, అలసి ఉన్న డాక్టర్లు, అన్ని నిర్వహించాలంటే, చాలా కష్టం, అసంభవం.


డాక్టర్ల దగ్గర పేషెంట్ల పని అవగానే, పేషెంట్లకు చెప్పాలి, కౌన్సిలర్ లని కలవమని, మిగతా అన్ని వివరాలు, కౌన్సిలర్ లు అన్ని వివరంగా చెపుతారని, ఆ ప్రకారం, మందులు వాడి, పథ్యం పాటిస్తూ, మళ్ళీరివ్యూ కి రమ్మని, అప్పుడు డాక్టర్ ని కలవమని. ఇలా అయితే, డాక్టర్ యొక్క విలువైన సమయం, మరో పేషెంట్ కి చికిత్స చేయడాన్నికి ఉపయోగపడుతుంది.


ఈ కౌన్సిలర్ లకి, ముందస్తుగా, చిన్నపాటి ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. దీనివలన, ఇటు పేషెంట్ కి స్వస్థత చేకూరుతుంది, అటు డాక్టర్ కి పేరుప్రతిష్టలు పెరుగుతాయి. ఆరోగ్యవంతమైన సమాజనిర్మాణానికి వీలుపడుతుంది.


ప్రతి మనిషిలోనూ, కాస్త విజ్యానం, ఆలోచన ఉండాలి లేదా చెప్పింది చెప్పినట్టూ పాటించడం అయినా ఉండాలి. స్వతహాగా, ప్రతి మనిషిలోనూ, తన బాగు కోసమే ఈ మందులు, సూచనలు చేస్తున్నారని, అవి పాటించక పోతే, తనకే నష్టం కలుగుతుంది అనే, ఇంగితం, ఇసుమంతైనా ఉండాలి. అదే ప్రధాన లోపం, రోగుల సంఖ్యా మరియు మరణాల శాతం పెరగడానికి.


పై కారణాలన్నీవివరంగా చూసాక మనకి ఒకటి అర్ధం అవుతుంది, ప్రతి ఒక్కరిలోనూ ఎంతో కొంత పరిజ్యానం, ఇంగితం, ఆలోచించే శక్తి ఉం డి తీరాలి. ఇవేవి లేకపోగా, మొండితనంగా వ్యవహరిస్తే, తనకి తానె అన్యాయం చేసుకుంటున్నానని గ్రహించగలగాలి. లేదా చెప్పిన విషయం తు. చ. తప్పకుండ పాటించగలగాలి, అది తన మంచికే చెపుతున్నారని గ్రహించుకోవాలి. ఇవన్నీ ఇటు రోగుల్లోనూ (చదువుకున్నవారైనా, చదువులేని వారైనా) అటు రోగుల బంధువుల్లోనూ పూర్తిగా లోపించడమే, తీవ్రమైన జబ్బులు ప్రబలడానికి, మరణాల సంఖ్యా పెరగడానికి కారణభూతాలు.


తమ పట్ల, తమ ఆరోగ్యం పట్ల తీవ్రమైన నిర్లక్ష్యం కలిగి ఉండడం, అన్నింటికన్నా పెద్ద కారణం, జబ్బులు, మరణాలు పెరగడానికి. ఎన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నా, అవి సద్వినియోగపరుచుకోలేకపోడం దురదృష్టం. కౌన్సిలింగ్ ద్వారా కొంత మేర ఉపయోగం ఉండొచ్చు. అవగాహనా తరగతులు తరచూ నిర్వహిస్తుంటే, వీరి ధోరణిలో కొంతమేర మార్పు రావొచ్చు.


సంవత్సరానికి ఓ సారి హెల్త్ చెక్ అప్:


మనలోపల ఏమి జరుగుతోందో తెలుసుకోవడం చాల అవసరం. దానికోసం, మన ఫామిలీ డాక్టర్ ని సంప్రదించి, సంవత్సరానికి ఓ సారి, డాక్టర్ సూచించిన అన్ని రకాల పరీక్షలు చేయించుకుని, ఆ రిపోర్టులని డాక్టర్ కి చూపించి, తగు చికిత్స, సూచనలు తీసుకుని, వాటిని శ్రద్ధగా వాడితే, బంగారం లాంటి ఆరోగ్యం మన స్వంతమే మరి.


వయసు పైబడుతున్నవారు, ప్రతి మూడు నెలలకి ఓ సారి, డాక్టర్ సూచించిన పరీక్షలు చేయించుకుని, డాక్టర్ తో టచ్ లో ఉంటె, వారికున్న వ్యాధులు ఏ స్టేజి లో ఉన్నాయి, వాడుతున్న మందుల డోస్ సరిపోతుందా, పెంచాలా? తగ్గించాలా? అనేది డాక్టర్ సూచిస్తారు.

'నిన్నటివరకు బాగానే దుక్కుల ఉన్నాడండీ, పాపం సడెన్ గా హార్ట్ ఎటాక్ వచ్చిందిట' అంటుంటారు. పీరియాడికల్ గా పరీక్షలు చేయించుకుంటే, మన కొవ్వు శాతాలు పెరిగాయా, మధుమేహం పెరిగిందా అనేది రూఢి అయి, మంచి చికిత్సకి అవకాశం ఉంటుంది.


అతి పెద్ద వ్యాధి:


ఎంతో కష్ట పడి, అహర్నిశలు శ్రమించి, అన్ని రకాల వినోదాలని త్యాగం చేసి, 15 సంవత్సరాలు ఒక యజ్యంలా చదివిన చదువుని, వారి పరిజ్యానాన్ని, కొనగోటితో తీసి పడేసి, నానా రకాలుగా కించపరుస్తూ, దూషిస్తూ, కొండొకచో, దండప్రయోగం కూడా చేసే ప్రబుద్దులున్నారు. మన వ్యాధుల్ని నయం చేసి, మనకి ప్రాణభిక్ష పెట్టె డాక్టర్లని, డాక్టర్ల తెలివితేటల్ని, ఓ గూగుల్ చూసో, స్వంత పైత్యం తోనో, మంత్రాలూ, తంత్రాలతో కాలయాపన చేసి, వారి జబ్బుల్ని ముదరబెట్టుకుని, సునాయాసంగా దుయ్యబట్టడం, పలచన చేసి మాట్లాడ్డం ఎంతవరకు సమంజసం ??


లోతుగా ఆలోచిస్తే, ఇది చాల ప్రధానమైన, మరియు ప్రమాద భరితమైన సమస్య (వ్యాధి). భారత దేశం అన్ని విధాలా సస్య శ్యామల దేశంగా మారాలంటే, అటు ప్రభుత్వాలు ఇటు స్వచ్చంద సంస్థలు, ఈ సమస్యని తీవ్రమైనదిగా పరిగణించి, ఇది రూపు మాపడానికి, సరి అయిన దిశా నిర్దేశం రూపొందించి, ప్రజల్లో అవగాహనా శక్తి పెంపొందించాడనికి కంకణం కట్టుకోవాల్సిన తరుణం ఆసన్నమయింది, ఇప్పటికే చాలా ఆలస్యమయింది. కార్పొరేట్ హాస్పిటల్స్ వారు కూడా, ఈ సమస్యకి ఒక పరిష్కారం కనుగొని, రోగులలోను, వారి బంధువర్గం లోను అవగాహనా శక్తి పెంపొందించే దిశగా చర్యలు చేపట్టాల్సిన సమయం ఆసన్నమయింది.


దేశభద్రతకు పహారా కాసే సైనికుల్లాంటివారు డాక్టర్లు. వీళ్ళు మన ఆరోగ్యానికి రక్షణ కవచంలా వ్యవహరిస్తున్నారు. కానీ ఒక్కోసారి, ఈ రక్షణ కవచానికే, రక్షణ లేకుండా పోతోంది. హాస్పిటళ్ళ వారు, ఈ విషయంలో తగిన శ్రద్ధ తీసుకోడం సత్వరమే చేయవలసిన ముఖ్యమైన కార్యం.


భారత దేశం, ఆరోగ్యమయమైన దేశం గా, త్వరలోనే, వెలుగొందుతుందని ఆశిద్దాం.

సర్వే జనా సుఖినోభవంతు🙏🙏


పూడిపెద్ది ఉగాది వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: పూడిపెద్ది ఉగాది వసంత

నా గురించి స్వపరిచయం...మూడు కథా సంకలనాలలో నా కథలు అచ్చయ్యాయి. తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్ లో చోటు సంపాయించుకున్నాయి. ప్రముఖ పత్రికలూ తెలుగు వెలుగు, నవ్య, విపుల, స్వాతి, సాక్షి , సహారి, మొదలైన పత్రికలలో నా కథలు విరివిగా అచ్చయ్యాయి . పోటీలలో కూడా చాల బహుమతులు వచ్చాయి .


నా కథ మీ మన్ననలు అందుకుంటుందని విశ్వసిస్తున్నాను.


కృతజ్యతలతో


ఉగాది వసంత


89 views0 comments

Comentarios


bottom of page