top of page
Writer's pictureRamya Namuduri

పెంపకం నేర్పిన విలువలు


'Pempakam Nerpina Viluvalu' written by Ramya Namuduri

రచన : రమ్య నముడూరి

" ఏరా సూర్యం..! నేను విన్నది నిజమేనా? నీ కొడుకుని రెసిడెన్షియల్ స్కూల్ లో వేస్తున్నావని చెప్పుకుంటున్నారు. నిజమేనా? " అంటూ అడిగాడు రామారావు.

" అవునురా.! నేనూ, నా భార్య లత కూడా ఉద్యోగస్థులమే కదా. మా పిల్లాడు చదువులో వెనకబడిపోతున్నాడు. వాడిని దగ్గర కూర్చోబెట్టుకుని చదివించే తీరిక మాకు ఉండడం లేదు. రెసిడెన్షియల్ స్కూల్ లో అయితే వాడికి చదువు బాగా వస్తుంది, వాడు నలుగురిలో మసలుకోవడం కూడా నేర్చుకుంటాడు అని ఈ నిర్ణయానికి వచ్చామురా.!" అన్నాడు సూర్యం.

సూర్యం చేతులను తన చేతుల్లోకి తీసుకుని, అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ.. " ఒరేయ్ ఒక్కమాట చెబుతాను వినరా.! ఎంతమంది ఇళ్లలో మొగుడు పెళ్ళాలిద్దరూ ఉద్యోగాలు చెయ్యట్లేదు చెప్పు. అలాగని వాళ్ళ పిల్లల్ని మీలాగే రెసిడెన్షియల్ స్కూల్లో వేసేస్తున్నారా? నువ్వు అనుకున్నట్టు అక్కడ వాడికి మంచి చదువు, నలుగురిలో మసలే లౌక్యం రావచ్చేమో. కానీ, మీ ప్రేమకి దూరం అయిపోతాడు కదరా. పిల్లలు మనకి దగ్గర అయ్యేది ఈ వయసులోనే రా.! వాళ్ళకి ఈ వయసులో మనము ప్రేమతో నేర్పే సంస్కారమే వాళ్ళ వ్యక్తిత్వ అభ్యున్నతికి దోహదం అవుతుంది. నా మాట విను సూర్యం. పిల్లాడ్ని అక్కడికి పంపే నిర్ణయం ఇంకోసారి ఆలోచించి తీసుకోరా .!" అంటూ చెప్తూ ఉన్న రామారావు వైపు విసుగ్గా చూస్తూ..

" ఒరేయ్ ఆపరా బాబు. నువ్వు, నీ చాదస్తం! ఇప్పుడు రోజులు మారాయి. మనలాగే మన పిల్లలు కూడా ఇలా చిన్నా, చితకా ఉద్యోగాలు చేసుకోవాలా? వాడికి అక్కడ చదివితే మంచి చదువు, పెద్ద ఉద్యోగం వస్తాయి. ఇక్కడే ఉంటే నాలాగే కష్టపడతాడు. వద్దురా..! ఈ పేదరికం, కష్టాలు వాడికి వద్దు. వాడు పెద్ద చదువులు చదివి, విదేశాలలో ఉద్యోగం తెచ్చుకోవాలి. ఇదే నా కల.! దాని కోసమే వాడిని దూరంగా పంపించి మంచి స్కూల్ లో చదివించాలి అనుకుంటున్నాను. అసలు నేనూ, నా భార్య ఇంత కష్టపడి సంపాదించేది ఎవరికోసం రా? వాడి భవిష్యత్తు బాగుండాలనే కదా.! ఇదంతా ఈ వయసులో నా కొడుకుకి అర్ధం కాకపోవచ్చు. కానీ పెద్ద వాడు అయ్యాక తప్పకుండా మా త్యాగం అర్ధం చేసుకుంటాడు.!" అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు.

వెళ్లిపోతున్న సూర్యాన్నే చూస్తూ..

" వాడి భవిష్యత్తు బాగుండాలని ఇవాళ నువ్వు తీసుకున్న ఈ నిర్ణయం రేపు నీ భవిష్యత్తునే ప్రశ్నర్ధకం చేస్తుంది సూర్యం.!" అనుకుంటూ రామారావు కూడా తన దారిన తను వెళ్ళిపోయాడు.!

సూర్యం అనుకున్నట్టుగానే తన కొడుకుని గొప్ప పేరుప్రఖ్యాతులు ఉన్న రెసిడెన్షియల్ స్కూల్ లో జాయిన్ చేసి, " ఇకనుండి ఇదే నీ స్కూల్, నీ ఇల్లు, నీ ప్రపంచం.! నువ్వు బాగా చదువుకుని, పెద్ద ఉద్యోగం తెచ్చుకుని, విదేశాలలో స్థిరపడాలి. ఇదే నా కోరిక.! బాగా చదువుకోవాలి.! సరేనా..!" అంటూ కొడుకుని హత్తుకుని.. " వెళ్ళొస్తా..! మరి!" అంటూ బుగ్గన ముద్దు పెట్టుకుని, బయలుదేరబోయాడు.

" నాన్న..! నాకు ఇక్కడ ఉండాలి అంటే భయమేస్తుంది! ఇక్కడ నాకు ఎవరూ తెలియదు నాన్నా.! నేనూ మీతోనే ఉంటాను. మిమ్మల్ని విసిగించను. బుద్దిగా చదువుకుంటాను నాన్నా! ఇక్కడ వదిలేయకండి నాన్నా! ఇంటికి వచ్చేస్తాను.!" అంటూ ఆ పిల్లాడు కన్నీటితో తండ్రిని వేడుకున్నాడు.

" ఏంటిరా? ఇంత డబ్బు కట్టి, ఇక్కడ చేర్పించింది ఇంటికి తీసుకు వెళ్ళడానికి కాదు. ఇక్కడే ఉండాలి నువ్వు. అందరూ అదే పరిచయం అవుతారు. ఇక్కడే అందరితో కలిసి చదువుకోవాలి. ఇంటికి వస్తాను అంటూ ఏడవకూడదు.! నాలుగు రోజులు ఉంటే అదే అలవాటు అయిపోతుంది.!" అంటూ ఆ పిల్లాడికి నచ్చచెప్పి, ఇంటి బాట పట్టాడు సూర్యం.

అతని ఊహల్లో, తన కొడుకు అందమైన భవిష్యత్తు మాత్రమే కనిపిస్తోంది. కానీ ఈనాడు తన నిర్ణయం వల్ల ఆ పసివాడి మనసుపై పడే ప్రభావం కనిపించట్లేదు. ఏదో సాధించిన వాడిలా ఇంటికి చేరాడు. ఆనాటి నుండి ప్రతీ రూపాయి పిల్లాడి చదువుకి, భవిష్యత్తుకి మాత్రమే ఉపయోగించాడు. అలా తన కడుపున పుట్టిన కొడుకు భవిష్యత్తు కోసం బంగారు కలలు కంటూ రోజులు, నెలలు, సంవత్సరాలు గడిపేసాడు.

అలా ఇరవైయ్యేళ్ళు గడిచిపోయాయి. ఇప్పుడు తను కోరుకున్నట్టే తన కొడుకు పెద్ద ఉద్యోగం సంపాదించి, అమెరికాలో స్థిరపడ్డాడు. ఆ విషయం సూర్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది. అతని సంతోషానికి హద్దులు లేవు. సంతోషంగా సాగిపోతున్న అతని జీవితంలో, ఇన్నేళ్లుగా కష్ట, నష్టాల్లో తనకి తోడు, నీడగా ఉన్న తన జీవిత భాగస్వామి.. ‘ఈ సంతోషం నువ్వే భరించు’ అంటూ తుదిశ్వాస విడిచి, శాశ్వతంగా సెలవు తీసుకుంది.!

అప్పటి వరకు "నా పెంపకం ఎంత గొప్పదో, నా త్యాగం ఎంత విలువైనదో, నా కొడుకు విదేశంలో స్థిరపడ్డాడు.!" అంటూ పొంగిపోయిన ఆ తండ్రికి, తన పెంపకంలోని లోపాన్ని ఎత్తి చూపుతున్నట్టుగా,’తల్లి చనిపోయింది’ అని తెలిసినా, కొరివి పెట్టేందుకు రాలేనని చెప్పిన కొడుకు మాటలు.. అతని గుండెల్ని చెల్చేసే బాణాలై గుచ్చుకుంటే.. ఆ బాణాలు చేసిన గాయాలనే తలచుకుంటూ… భారంగా రోజులు గడుపుతున్నాడు.! అలా తన భార్యను పోగొట్టుకుని మూడు నెలలు గడిచాక, తనను చూడడానికి వచ్చిన కొడుకుని చూసుకుని, ఏ భావం లేకుండా ఉండిపోయాడు ఆ తండ్రి.!

" నాన్నా..! నన్ను క్షమించండి. అమ్మ చనిపోయినప్పుడు రాలేకపోయాను.! మీరైనా నాతో వచ్చేసేయండి.!" అంటూ సూర్యాన్ని ఒప్పించి అమెరికా తీసుకెళ్తాను అని మాట ఇచ్చి, సూర్యం ఉంటున్న ఇంటిని అమ్మించేస్తాడు ఆ కొడుకు. ఎలాగూ కొడుకుతోనే ఉంటాను కదా, ఈ ఇల్లు మాత్రం ఏమి చేసుకుంటాను అని కొడుకు చెప్పినట్టే చేసాడు సూర్యం. ఆ ఇల్లు అమ్మేసిన రెండు రోజుల తరువాత, తండ్రిని ఒక ఆశ్రమానికి తీసుకు వెళ్ళాడు ఆ కొడుకు.

" ఏంటిరా..! ఇక్కడికి తీసుకువచ్చావు? మనము వెళ్లాల్సినది ఎయిర్పోర్ట్ కి కదా!” అంటున్న ఆ తండ్రి కళ్ళల్లోకి చూస్తూ.. " ఇక మీదట ఇదే మీ ఇల్లు, మీ కుటుంబం, మీ ప్రపంచం.! నేనూ, మీ కోడలు కూడా ఉద్యోగస్థులమే. మా ఇద్దరికీ మిమ్మల్ని పట్టించుకునే అంత సమయం ఉండదు.! అందుకనే ఈ నిర్ణయం తీసుకున్నాను.!" అంటూ సూర్యాన్ని ఆ వృద్ధాశ్రమంలో చేర్పించి, కాళ్లకు దండం పెట్టి, వెళ్లి పోతున్న కొడుకు చేయ పట్టుకుని, కన్నీటితో బ్రతిమాలాడు ఆ తండ్రి. “నన్ను ఇంటికి తీసుకువెళ్ళారా..! నాకు ఇక్కడ ఉండాలి అంటే భయంగా ఉంది. ఇక్కడ నాకు ఎవరూ తెలిసిన వారు లేరు.నేనూ మీతోనే ఉంటాను. పెట్టినది తింటాను. మిమ్మల్ని విసిగించను.!" అంటూ వేడుకున్నాడు.

" ఏంటి నాన్నా? ఇంత డబ్బు కట్టి మిమ్మల్ని ఇక్కడ చేర్చింది ఇంటికి తీసుకు వెళ్ళడానికి కాదు.! ఇల్లు అమ్మిన డబ్బు ఇక్కడ కొంత కట్టాను. మిగతాది మీ అకౌంట్ లోనే వేసాను. దాని మీద వచ్చిన వడ్డీ, మీ ఖర్చులకి సరిపోతుంది.! ఇక్కడ అయితే మీకు టైం కి భోజనం దొరుకుతుంది. ఇక్కడ అందరూ మీ వయసు వాళ్ళే ఉంటారు.!" అంటూ నచ్చచెప్పి, తన జీవితం తను బ్రతికేందుకు వెళ్ళిపోయాడు ఆ కొడుకు.!

ఇప్పుడు ఆ కొడుకు కళ్ళలో కసితో నిండిన కన్నీరు కురుస్తోంది. అతని మనసులో చిన్ననాటి నుండి ఇంటికి దూరం చేసాడు అన్న బాధ తో తన తండ్రిపై పెంచుకున్న కోపం, కక్ష ఇవాళ్టితో తీరింది. అతని మనసు తేలికై.. బతుకు బాట పట్టాడు.! ఒంటరిగా తనని ఈ మానవ సమూహంలో వదిలేసి వెళ్లిపోయిన కొడుకుని తలుచుకుంటూ క్రుంగిపోతున్నాడు సూర్యం.!

" నేను చేసిన తప్పు ఏమిటి? జీవితమంతా కష్టపడి సంపాదించినది వాడి చదువుకి, అభ్యున్నతికే ఖర్చు పెట్టానే.. ఏనాడూ ఏ లోటూ చేయలేదే… ఎందుకు వాడు నన్ను ఈ వయసులో ఇంత మోసం చేసాడు..!" అనుకుంటూ కుమిలి కుమిలి ఏడుస్తున్న సూర్యం భుజం పై ఒక చేయ పడింది. ఉలిక్కిపడి పైకి చూసాడు సూర్యం.

కన్నీటితో నిండిపోయిన ఆ కళ్ళు.. ఎదురుగా కనిపిస్తున్న ఆకారాన్ని పోల్చుకునేందుకు ఒక నిమిషం పట్టింది.

" ఎలా ఉన్నవురా సూర్యం? " అంటున్న ఆ వ్యక్తి గొంతులో బాధ.. శోకంలో మునిగిపోయిన సూర్యం మనసుని తేలిక చేసాయి.

" రామారావు..! " అంటూ ఆ వ్యక్తిని హత్తుకుని ఏడుస్తున్నాడు సూర్యం.

" నా కొడుకు నన్ను మోసం చేసాడురా..! జీవితమంతా కస్టపడి సంపాదించి, వాడిని చదివించి పెద్దవాడిని చేస్తే.. ఇవాళ వాడు నన్ను ఇక్కడ వదిలేసి, వెళ్లిపోయాడురా..!" అంటూ ... జరిగింది అంతా రామారావుతో చెప్పుకుని బాధపడ్డాడు సూర్యం.

" జరిగిన దానిలో నీ కొడుకు తప్పు లేదురా.! నువ్వు వాడి భవిష్యత్తు బంగారు మయం కావాలి అనుకున్నావే కానీ, వాడిని దూరం చేసుకుంటున్నాను అని తెలుసుకోలేకపోయావు అప్పుడు.! నువ్వు వాడిని పెద్ద స్కూల్ లో వేసి చదివిస్తే, గొప్పవాడు అవుతాడు అనుకున్నావు. ఆ రోజే నేను ఎంతగానో చెప్పాను. అప్పుడు విని ఉంటే, ఇప్పుడు ఇలా ఉండకపోదువురా..!" అంటూ ఉన్న రామారావు మాటలకి అడ్డొస్తూ..

" ఏమి మాట్లాడుతున్నావు రా రాము.! వాడి మీద ప్రేమతోనే కదరా ఇంత చేసాను నేను! అందులో తప్పేమి ఉందిరా? " అంటూ వాపోయాడు సూర్యం.

" అది నీ పెంపకం లోని లోపంరా సూర్యం.! పిల్లలకి మన మీద ప్రేమ ఏర్పడే చిన్నవయసులో.. నువ్వు వాడి భవిష్యత్తు కోసం రెసిడెన్షియల్ స్కూల్ లో వేసావు. అదే విషయం వాడికి ప్రేమగా చెప్పాలి కానీ నువ్వు వాడిపై అజమాయిషీ చేసావు. ఆ విషయం చెల్లెమ్మ నాకూ చెప్పిందిలే..! అప్పుడే వాడిలో నీపై వ్యతిరేక భావన ఏర్పడింది.! దాని పర్యవసానం ఇది.!" అంటూ చెప్పాడు రామారావు.

అది విన్న సూర్యం గుండె బరువెక్కింది. తనని ఇక్కడ దింపి వెళ్ళిపోతున్నప్పుడు తన కొడుకు అన్న మాటలు.. ఒకప్పుడు తను ఆ పిల్లాడిని స్కూల్ లో జాయిన్ చేస్తున్నప్పుడు మాట్లాడిన మాటలే.! ఆ తండ్రికి ఇప్పుడు తన తప్పు అర్ధం అయి.. తనకి ఇలా అవడం లో తప్పులేదు అనుకున్నాడు. వాళ్లు అలా మాట్లాడుకుంటూ ఉండగా..

" నాన్నా..! ఇంటికి వెళ్దాం రండి. భోజనం టైం అవుతోంది. మీరు మళ్ళీ మందులు వేసుకోవాలి.!" అంటూ వచ్చాడు రామారావు కొడుకు.

ఆ అబ్బాయి ని చూస్తుంటే సూర్యం కళ్లలో నీళ్లు తిరిగిపోయాయి.

" సరేరా. సూర్యం.! నేను నిన్ను కలవడానికి రోజులో ఏదొక టైం లో వస్తూ ఉంటాను. ఎక్కువ ఆలోచించి, ఆరోగ్యం పాడుచేసుకోకు. ఉంటాను మరి.!" అంటూ పైకి లేవబోయిన రామారావుకి తన చేయి అందించి సాయం చేసాడు అతని కొడుకు. వాళ్ళు వెడుతున్న వైపే చూస్తున్న సూర్యానికి ఆ తండ్రీ కొడుకులను చూసి తను పోగొట్టుకున్న ప్రేమ విలువ తెలిసివచ్చింది. రామారావు చిన్నప్పటి నుండీ కొడుకుని ప్రేమ, ఆప్యాయత, విలువలు అర్థమయ్యేలా పెంచాడు. ఆ పిల్లాడు ఇప్పుడు పెద్ద ఉద్యోగంలో చేరలేకపోయినా.. ఉన్న దానితో తృప్తిగా ఉంటూ.. బాధ్యతగా మెలుగుతూ.. కుటుంబంతో సంతోషంగా ఉన్నాడు. సూర్యం తన కొడుకుకి ప్రేమ, ఆప్యాయత, విలువలు నేర్పకుండా, పెద్ద చదువులు, డబ్బు సంపాదన, అంటూ నేర్పించి, ప్రేమ విలువ చెప్పకుండా, ప్రేమ అనేది తెలియకుండా దూరంగా పెంచి, కుటుంబ విలువలు సరిగా నేర్పించలేకపోయాడు. రామారావు తన కొడుకుని పెంచిన విధానం చూసి నవ్వుకున్న సూర్యం, ఇవాళ తన పెంపకం లోని లోపాన్ని చూసి సిగ్గుపడుతూ.. ఆ వృద్ధాశ్రమంలో మిగిలిపోయాడు.

***

పిల్లలకి ప్రేమ, ఆప్యాయత, కుటుంబ విలువలు ముఖ్యమని నేర్పిద్దాం. మన పెంపకంలోని విలువలతో వారి భవిష్యత్తుని ప్రేమమయం చేద్దాం.

***శుభం***


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలు :

రచయిత్రి పరిచయం :

నా పేరు రమ్య. నేనొక గృహిణిని.

మాది తూర్పు గోదావరి జిల్లా, ముక్కామల గ్రామం. నేను తెలుగు భాషని ఎంతగానో ఇష్టపడతాను. నేనొక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ని. కధలు, కవితలు, నవలలు రాస్తూ ఉంటాను. ధన్యవాదములు.

75 views0 comments

Comments


bottom of page