'Nallamala Nidhi Rahasyam Part - 13' written by Ramya Namuduri
రచన : రమ్య నముడూరి
చంద్రుడు 'నీ ప్రియుడు నీ వైపుగా వచ్చేస్తున్నాడు' అంటూ దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న మరియా ఆత్మకు వర్తమానం అందించాడు.
ఆ పవిత్ర ఆత్మ తన ప్రియుడు రాబోతున్నాడు అన్న ఆనందంలో తనకు విముక్తి కలగబోతోంది అన్న సంతృప్తితో సంతోషంగా నృత్యం చేస్తోంది.
అది తెలిసిన ఒక దుష్టాత్మ మాత్రం "నా పగ నెరవేరే తీరుతుంది! " అంటూ వికృతంగా నవ్వుతోంది.
అదేమీ తెలియని అజయ్, తన ఊహాలోకంలో విహరిస్తూ చల్లని గాలికి మత్తుగా నిద్రపోతున్నాడు.
సీత మాత్రం నిద్రపోకుండా అజయ్ ని ఒక కంట కనిపెడుతూనే, ఆ నల్లమల అడవి తనకి మిగిల్చిన చేదు అనుభవాల జ్ఞాపకాల సుడిగుండంలో కూరుకుపోతూ, ఎప్పుడు నిద్రలోకి జారుకుందో తెలియకుండానే నిద్రాదేవి ఒడిలో సేద తీరుతూ ఉంది.
అలా వాళ్ళని నిద్రపుచ్చి, తను మాత్రం మబ్బుల చాటుకు పోయి, సూర్యుని మేల్కొలిపి, తను బజ్జున్నాడు చంద్రుడు.
***
సూర్యోదయం కాగానే సంజయ్ రెడీ అయిపోయి, సిద్ధాంతి గారి ఇంటికి వెళ్ళిపోయాడు.
అప్పటికే అన్ని ఏర్పాట్లతో ఉన్న గురువుగారి శిష్యుడు సంజయ్ రాగానే లోపలికి తీసుకెళ్లి, ఒక గదిలో కూర్చోమని చెప్పి, కొన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాడు.
అయన ఏదో హోమం చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తోంది సంజయ్ కి. అతని ఆలోచనలన్నీ నిన్న ఫోన్ సంభాషణలొ గురువుగారి శిష్యుడు తనకు చెప్పిన విషయాల చుట్టూనే తిరుగుతున్నాయి.
"మీ అన్నయ్య కి ప్రాణగండం ఉంది. అతను కారణ జన్ముడు. మృత్యు దిశగా అతని పయనం విధి రాత. అతని రాక కోసం ఒక ఆత్మ పరితపిస్తోంది. కానీ అతని అంతం కోసం వేరొక దుష్ట ఆత్మ ఎదురుచూస్తోంది. ఇదంతా పూర్తిగా తెలుసుకోవడం ఇప్పుడు సాధ్యం కాదు. ఇప్పుడు నీకు ఒక రక్ష ఇస్తాము. అది తీసుకుని వెళ్లి, నీ అన్నకు కట్టు. రేపు సూర్యోదయం అయ్యేసరికి ఇక్కడికి వస్తే అసలు విషయం అంతా చెప్తారు గురువుగారు. అయన ఇప్పుడే నిన్నుఇక్కడికి రమ్మంటున్నారు. వచ్చి రక్ష పట్టుకెళ్ళు" అని చెప్పిన మాటలే అతని చెవుల్లో మారుమ్రోగుతున్నాయి.
"గురువుగారు రమ్మంటున్నారు" అని ఒక శిష్యుడు పిలవడంతో ఈ లోకంలోకి వచ్చాడు సంజయ్ .
ఇప్పుడు ఏమి తెలుస్తుందో! ఏం వినాల్సొస్తుందో.. అనుకుంటూ ఆ గదిలోకి వెళ్లిన సంజయ్
అక్కడ ఉన్న దృశ్యం చూసి ఉలిక్కిపడ్డాడు.
***
బస్ శ్రీశైలం చేరుకునేసరికి ఉదయం 7 అయింది. వాళ్ళు బస్సు దిగి రెండు అడుగులు వేసారో లేదో వాతావరణం అంతా మారిపోయింది. భయంకరమైన గాలి! చెట్లు ఊగి పోతున్నాయి. సీతకి భయం మొదలైంది.
ఇంతలో అజయ్ జూనియర్ వచ్చి, వాళ్లని ఇంటివైపు తీసుకెళ్తుంటే గాలి వేగం ఇంకా ఎక్కువైపోయింది. ఒక ఆటో మాట్లాడుకుని ఇంటికి చేరుకున్నారు. ఆ ఇంటి చుట్టూ చెట్లు, పొదలు ఉండి, అక్కడక్కడ బీటలు పడి చూడటానికి భయంకరంగా ఉంది. సీతకి ఆ ఇల్లు, వాతావరణం భయంగా అనిపించి, “ఇదా! ఇక్కడ ఎలా ఉంటావురా? ఇంకేదైనా ఇల్లు చూసుకుందాం” అంది.
ఆ జూనియర్ అబ్బాయి కలుగజేసుకొని "ఒక్క నెల అడ్జెస్ట్ అవ్వండి అమ్మా! ఆ లోగా ఇంకో ఇల్లు వెతుకుదాం" అని చెప్పి సామాన్లు లోపల పెట్టి, వాళ్ళకి కావాల్సినవి అన్నీ తెచ్చి, " స్టేషన్లొ కలుద్దాం సార్" అని చెప్పి వెళ్ళిపోయాడు.
సీత, అజయ్ లు స్నానాలు చేసి రెడీ అయ్యి, శ్రీ భ్రమరాంబ, మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. ఆపదల నుంచి రక్షించమని సీత, స్వప్న సుందరిని చూపించమని అజయ్ దండం పెట్టుకున్నారు.
అక్కడే ఒక హోటల్ లొ టిఫిన్ తిని, సీతను ఇంట్లో దిగబెట్టి, తను స్టేషన్ కి వెళ్లి ఎస్. ఐ గా డ్యూటీలొ చేరుతూ సంతకం పెట్టాడు అజయ్.
అది ఒకప్పుడు తన తండ్రి పనిచేసిన స్టేషన్ అని తెలిసి, భావోద్వేగానికి గురి అయ్యాడు అజయ్.
మొదటి రోజు అందరినీ పరిచయం చేసుకుని, తన డ్యూటీలొ పడ్డాడు.
***
ఇల్లంతా సర్దుతోంది సీత. ఆ ఇల్లు, వాతావరణం ఆమెకు చాలా భయంగా అనిపిస్తోంది. ఆ ఇంటి చుట్టూ పెద్ద పెద్ద చెట్లు, పొదలు ఉన్నాయి. ఆ ఇంటి వెనక నుండి రెండు కిలోమీటర్ల లోపలి నుండి నల్లమల అడవికి ఒకవైపు సరిహద్దుగా పెద్ద గోడ ఉంది.
ఆమె ఇల్లు సర్దుతూనే మధ్యాహ్నం భోజనం కోసం, ఆ అబ్బాయి తెచ్చిపెట్టిన సరుకులు కూడా ఒక్కొక్కటే తీస్తూ వంట చేస్తూ ఉంది.
ఈలోగా హాల్ నుండి ఒక వింత శబ్దం వచ్చింది.
సీత గుండె ఘల్లుమంది!
ఆ శబ్దం ఏంటో చూడడం కోసం, ఎలాగో ధైర్యం తెచ్చుకుని, అడుగులో అడుగు వేసుకుంటూ హాల్ లోకి వెడుతోంది సీత.
***
సశేషం
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.
> పుకారు
రచయిత్రి పరిచయం :
నా పేరు రమ్య
నేనొక గృహిణిని
మాది తూర్పు గోదావరి జిల్లా, ముక్కామల గ్రామం. నేను తెలుగు భాషని ఎంతగానో ఇష్టపడతాను. నేనొక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ని. కధలు, కవితలు, నవలలు రాస్తూ ఉంటాను. ధన్యవాదములు
Commentaires