top of page

నల్లమల నిధి రహస్యం పార్ట్ -5'Nallamala Nidhi Rahasyam Part - 5' written by Ramya Namuduri

రచన : రమ్య నముడూరి

అదంతా చూస్తూ, పారిపోడానికి కాళ్ళు, చేతులు పనిచేయకుండా పడి ఉన్న వారందరి వైపు నెత్తురోడుతున్న కళ్ళతో, క్రూరంగా చూస్తోంది ఆ ఆకారం.

"వదిలేయ్.. మమల్ని వదిలేయ్.." అంటూ ఆ మనుషులు అతి కష్టం మీద తడపడుతూ, ఆ ఆకారాన్ని బ్రతిమలాడుతున్నారు.

" ఉఫియే.. చంటి కూన ప్రాణం.. బలి ఎన్నాయా? నిధి ఎన్నయు బలియా? అమ్మమ్మా.. ఇన్నారు ప్రాణం.. పసి కూన ప్రాణం.. ఆఆఆ.."

అంటూ ఆ మనుషులను పైకి ఎత్తి, గాలిలో గిర గిరా తిప్పి, దూరంగా విసిరికొట్టింది.

ఎక్కడ పడ్డ వారు అక్కడే అలాగే భూమిలోకి దిగబడిపోయి ప్రాణాలు వదిలేసారు.

అక్కడ అంత జరిగినట్టు ఆనవాళ్లు లేకుండా.,ఆ శవాలన్నీ భూమిలోకి దిగబడిపోయాయి.

అక్కడ క్షుద్రపూజ కోసం చేసిన ఏర్పాట్లు అన్నీ మాయం అయిపోయాయి.

ఆ అడవి మళ్ళీ ప్రశాంతమైన వాతావరణం లోకి మారిపోయింది.

ఆ ఆకారం వికృతరూపం నుంచి మానవ రూపం దాల్చింది.

పదహారేళ్ళ అందమైన కోయ పిల్ల లాగా మారింది.

చందమామ అమ్మాయి రూపంలో కిందికి వచ్చిందా అన్నట్లు వెన్నెల కురిపించే అందమైన మోము, చారడేసి కళ్ళు, దొండపండులాంటి పెదవులు,

బంగారు మేని ఛాయతో మెరిసిపోతోంది.

ఆ అమ్మాయి.. ఆ పిల్లవాడికి దగ్గరగా వెళ్లి, తలపై ప్రేమగా నిమిరింది. ఆమె చేతి నుండి వచ్చిన బంగారు కాంతి ఆ పిల్లాడి శరీరం అంతా ప్రసరించింది.

కాళ్లకు, చేతులకు ఉన్న కట్లు వాటంతట అవే తొలగిపోయాయి.

పెదవి చివర చిట్లిన గాయం మానిపోయింది.

ఆ పిల్లాడు స్పృహలోకి వచ్చాడు.

తనను ప్రేమగా నిమురుతున్న ఆమెను చూస్తూనే, పైకి లేచి. "ఎవరు అక్కా నువ్వు.? మా అమ్మ, నాన్నా, బామ్మా కావాలి. ఈ అంకుల్ వాళ్లు బాడ్.. అంటూ చూపించబోయి, ఏరి వాళ్లు? " అంటూ చుట్టూ చూస్తున్నాడు..

" వాళ్లు పోయినారులే.. ఇంకేంటి భయం లేదు కూన.. నిన్నూ మీ అమ్మా, అయ్యల కాడికి చేరుస్తలే.. కలవరపడకు.. ఈ అక్క ఉండాదిగా.. " అంటూ అలికిల్లాంతరు పట్టుకుని, ఆ పిల్లాడిని ఎత్తుకుని, కొంత దూరం వెళ్లేసరికి ..

అక్కడ ఆ పిల్లాడి అమ్మా, నాన్నా, బామ్మా చుట్టూ చూస్తూ అ పిల్లాడి కోసం ఏడుస్తున్నారు..

ఆ దీపపు వెలుతురులో తన మనవడిని ఎత్తుకుని వస్తున్న ఆ అమ్మాయిని చూస్తూ ఆ బామ్మ సంతోషం తో ‘ఒరేయ్ రాజూ!’ అంటూ వాళ్ళకి ఎదురువెళ్లి, ఆ పిల్లాడ్ని ఆ అమ్మాయి నుండి తీసుకుని, ముద్దులు పెట్టేసుకుంటోంది..

ఆ పిల్లాడి తల్లీ, తండ్రి కూడా ఆ పిల్లాడ్ని గట్టిగా హత్తుకొని ఏడుస్తున్నారు..

ఏమైపోయావురా.? నా తండ్రీ! అంటూ ఆ తల్లి వాడిని గట్టిగా హత్తుకుని గుండె పగిలేలా ఏడుస్తోంది.

ఆ పిల్లాడి తండ్రి ఆ అమ్మాయికి చేతులు జోడించి, దండం పెడుతూ " అమ్మా! నువ్వు ఎవరో మాకు తెలియదు. కానీ జన్మ, జన్మలకు నీకు ఋణపడి ఉంటాం" అంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు.

"ఓ అయ్యో! ఏడవమాకండి.. మీ కూనడు మీకు దక్కినడు గదా. ఈడ ఉండగూడదు. బేగా జరుగుర్రి. జర నడి రాతిరి అయినదునుకో. గీ అడవిలా అంత మంచిది గాదు. నా ఎంబడి రండి. అడ్డదారిలా మీగూటికి చేరుస్తా. అవు మల్ల. తిన్నంగా నడువురి. ఎనక్కి తిరిగి చూడమాకూర్రి." అంటూ ఆమె ముందుకు నడిచింది.

ఆమెను వెంబడిస్తూ. ఆ అమ్మవారిని తలుచుకుంటూ.. వాళ్ళు ముందుకుసాగారు..

ఆశ్చర్యం.. వాళ్లు ఒక అరగంట నడిచేసరికే వాళ్ళు ఉన్న కాలేజీ వచ్చేసింది..

" వెళ్ళిరండి. వెనక్కి తిరిగి చూడకుండా. మీ గదికి వెళ్లిపోండి" అని ఆ కుటుంబానికి చెప్పి, ఆ బాబు తలపై ప్రేమగా నిమిరి, ఆ అమ్మాయి వెనుతిరిగి వెళ్ళిపోతోంది.

వాళ్లు "మీ మేలు మరచిపోలేము తల్లీ.. " అని ఆమెకు చెప్తూ ఆమె చెప్పినట్టే వెనక్కి తిరిగి చూడకుండా గదిలోకి వెళ్లి తలుపు వేసేస్కుని " హమ్మయ్యా.." అని ఊపిరి పీల్చుకుంటూ ఉండగా

ఆ పిల్లాడి తల్లి అనుకోకుండా ఆ గది కిటికీ లోంచి బయటకు చూసేసరికి కళ్లు తిరిగి కిందపడిపోయింది..

ఆమె భర్త ఆమె ముఖంపై నీళ్లు చెల్లి పైకి లేపి, “ఏం అలా పడిపోయావ్?” అని అడిగితే " ఏమీ లేదు. నీరసంతో కళ్ళు తిరిగాయి" అంది. ఆమెకు తను ఏమి చూసి, పడిపోయిందో.. గుర్తులేదు..

ఆ పూట అంతా ఆ కుటుంబం జాగారం ఉండి, ‘ఆ మల్లన్న, భ్రమరాంబ అమ్మవారి దయవల్ల బతికి బయటపడ్డాం’ అనుకుంటూ భక్తిగా ఆ మల్లన్న స్వామిని ప్రార్ధిస్తూ ఉండిపోయారు.

ఆ అమ్మాయి.అలా నడుచుకుంటూ మళ్ళీ దట్టమైన అడవిలోకి వెళ్లిపోతూ

"ఇంకెన్నాళ్ళు ఈ నిరీక్షణ? ఇంకెన్నాళ్ళు నీ రాక కోసం ఎదురుచూపులు? ఇంకెన్ని ప్రాణాలు.. ఇంకెన్ని మరణాలు.. ఈ రూపం ఇంకెన్నాళ్ళు?

జన్మలు వేచి ఉంటాను నీ ప్రేమ కోసం..

నీకిచ్చిన మాట కోసం..

ఈ బాధ్యత నుండి బయట పడి, నీ ఎదుటే అమ్మవారిలో కలిసిపోతాను. నాకు విముక్తి కలిగించు మార్తాండా!

నీ ప్రేయసిని ఇలా జన్మ జన్మలుగా వేచి వుంచుట భావ్యమా? నువ్వు మళ్ళీ పుట్టి ఉంటే నా ఆత్మ ఘోష నీకు వినిపిస్తూ ఉంటే..ఆనాటి మన ప్రేమే నిజమైతే.. నన్ను చేరగా రా.. ఈ నిధి బాధ్యత నుండి నాకు విముక్తి ని ప్రసాదించు..

నీ మహారాజుకి నువ్వు సామంతుడవు. నా ప్రేమ సామ్రాజ్యపు మహారాజువు. " అనుకుంటూ ఆ అందమైన అమ్మాయి తన అడుగులు ముందుకు వేస్తూ చీకటికే కాటుక పులిమిన ఆ నిశీధి అరణ్యం లో కలిసిపోయింది..

*****

గదిలో ఏసీ ఉన్నా, ఫ్యాన్ ఫుల్ స్పీడ్ లో తిరుగుతూ ఉన్నా..

వళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి అజయ్ కి.

"ఎవరో తనను దూరం నుండి పిలుస్తున్నట్టు.. తన కోసం ఎవరో ఏడుస్తున్నట్టు.. " వినిపిస్తోంది..

"తను పూర్తిగా కోయరాజు వేషంలో ఉన్నట్టు..

ఎవరో మహారాజుకి మాట ఇస్తున్నట్టు.. ఒక అందమైన అమ్మాయి ని గట్టిగా హత్తుకుని ఉన్నట్టు..

ఛావు బ్రతుకుల మధ్య ఉన్న తను.. ఆ అమ్మాయి చేతిలో చేయ వేసి.. నేను వస్తా.. మళ్లి పుట్టి నీకోసం వస్తా! మన మహారాజుకి మాట ఇచ్చాను. నా ప్రాణం పోయినా నువ్వు ఉండాలి. నే వచ్చేవరకు ఈ నిధిని కాపాడాలి. పేద ప్రజలకోసం మన మహారాజు.. " అంటూ ఏదో చెప్తున్నట్టుగా..

ఇలా ఏవేవో దృశ్యాలు .

కనిపించీ , కనిపించినట్టుగా..

కల లాగా వస్తూ ఉండగా పరిగెడుతున్న ఆ అమ్మాయిని ఎవరో గునపంతో గుచ్చినట్టు అనిపించి

"మరియా!" అంటూ ఉలిక్కిపడి లేచాడు అజయ్.

*****

ఇంకా ఉంది

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.రచయిత్రి పరిచయం :

నా పేరు రమ్య

నేనొక గృహిణిని

మాది తూర్పు గోదావరి జిల్లా, ముక్కామల గ్రామం. నేను తెలుగు భాషని ఎంతగానో ఇష్టపడతాను. నేనొక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ని. కధలు, కవితలు, నవలలు రాస్తూ ఉంటాను. ధన్యవాదములు


22 views0 comments

Comments


bottom of page