top of page

నల్లమల నిధి రహస్యం పార్ట్ -3


'Nallamala Nidhi Rahasyam Part - 3' written by Ramya Namuduri

రచన : రమ్య నముడూరి

ఆనాటి చేదు జ్ఞాపకాల అలల, సుడులు..

తన కంట కన్నీరై కరుగుతుండగా..

వెనక నుంచి వచ్చి సీత కళ్ళు మూసాయి రెండు చేతులు!

ఒక్కసారిగా ఉలిక్కిపడి సీత వెనక్కి తిరిగి చూసేసరికి..

సీత కన్నీరు తన చేతికి అంటుకోవడంతో,తన చేతుల్ని వెనక్కి తీసుకుని, సీత వైపు ఆందోళనగా చూస్తున్నాడు , సీత పెద్దకొడుకు అజయ్.

"నాన్నా..అజయ్! ఏంటి సర్ప్రైజ్? " అంటూ కొడుకుని ప్రేమగా హత్తుకుంది సీత.

" అమ్మా! నాకు శ్రీశైలంకి ట్రాన్స్ఫర్ అయింది. డ్యూటీ లో జాయిన్ అయ్యేముందు ఒకసారి నిన్నూ, తమ్ముడ్ని చూడాలనిపించింది. అందుకే మీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పకుండా వచ్చేసాను.

కానీ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావ్.. ఏం జరిగింది అమ్మా?" అంటూ అడిగాడు అజయ్.

'అరే.. ఏం లేదు నాన్నా! దోసెల్లోకి ఉల్లిపాయలు తరుగుతున్నా కదా! అందుకే! నేను ఎందుకు ఏడుస్తాను నాన్నా.." అంటూ నోటికొచ్చిన అబద్దాన్ని చెప్పేసింది సీత.

" వెళ్లి ఫ్రెష్ అయిరా నాన్నా! టిఫిన్ తిందువు గానీ." అంటూ ఉండగానే

" ఒరేయ్ అన్నయ్యా! ఎప్పుడొచ్చావురా? " అంటూ అజయ్ ని ఎత్తుకుని, గిర గిరా తిప్పేసాడు సంజయ్.

ఇద్దరు కొడుకుల్ని చూస్తూ సంతోష పడిపోతోంది సీత.

******

నల్లమల అడవులు,

సూర్యకిరణాలు కొద్ది కొద్దిగా. ఆ అడవిలోని చెట్ల మధ్యగా. దారి చేసుకుని. తమ వెలుగును ప్రసరిస్తున్న వేళ..

పక్షుల కిలకిలా రవాలతో. సెలయేరుల సరిగమలతో. వన్య ప్రాణుల సందడితో, ఆ అరణ్యం ప్రకృతి అందాలతో శోభాయమానంగా వెలిగిపోతున్న వేళ..

ఒక కుటుంబం శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి దర్శనం చేసుకుని, అక్కడ నుండి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహామహిమాన్వితమైన ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి గాను నంది సర్కిల్ దగ్గర జీప్ మాట్లాడుకుని, ఎక్కి కూర్చున్నారు.

వారు మొత్తం నలుగురు.. మొగుడు పెళ్ళాలు, ఒక పిల్లాడు, ఆ పిల్లాడి నాయనమ్మ.

ఆ కుటుంబం తో పాటు. ఇంకో నలుగురు వ్యక్తులు కూడా ఆ జీప్ లో ఎక్కేసారు.

ఆ అమ్మవారిని దర్శించుకోవాలి అంటే ఉదయం 6 గంటల నుండి. మధ్యాహ్నం 3 గంటల వరకూ మాత్రమే అనుమతి ఇస్తారు.

ఆ తరువాత ఎవరినీ ఆ ప్రదేశానికి వెళ్లడానికి అనుమతించరు.

చెక్ పోస్ట్ దగ్గర, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి అనుమతి తీసుకుని, ముందుకు నడిచారు వారు.

మొత్తానికి వారి ప్రయాణం మొదలు అయింది.

కానీ ఈ కుటుంబానికి తెలియదు ఆ వ్యక్తులు దర్శనం కోసం కాదు వారితో కలసి అడవిలోకి వస్తున్నది అని..

వారు కూడా తోటి భక్తులు అని అనుకుంటూ వారితో

మాట కలిపింది ఆ కుర్రాడి నాయనమ్మ.

"ఏం బాబూ! . మీరు ఇదివరకు అమ్మవారిని దర్శించుకున్నారా? లేక మాకు లాగే మొదటిసారా?" అని అడిగింది ఆ అమాయకురాలు.

"మొదటి సారి కాదు బామ్మ గారు.. మేము చాలా సార్లు వచ్చాము అమ్మవారి దర్శనానికి" అంటూ చెప్పాడు అందులో ఒకడు.

"అవునా బాబూ! . మాకు ఈ ప్రాంతం అంతగా తెలీదు. మేము మొదటిసారి వస్తున్నాం. ఈ జీప్ కొంత దూరమే వస్తుందట కదా. ఆ తరువాత ఎలా వెళ్లాలో. దారి చూపుతూ బోర్డులు ఉంటాయి అని చెప్పారు. మీరు కూడా ఉన్నారు. అమ్మవారి దయవల్ల ఇంకేమి భయం లేదులే!"

అంటూ ఆ బామ్మ వారితో చెబుతూ తనకి తానే ఆపద కొని తెచ్చుకున్నట్టు అయింది.

వారి ప్రయాణం సాగుతూ ఉంది.

శ్రీశైలం నుండి ఈ ప్రదేశానికి,12 కిలోమీటర్ల వరకూ తారు రోడ్డు ఉంది. ఆ రోడ్డు చాలా గతుకులుగా ఉండి పెద్ద పెద్ద మలుపులు తిరుగుతూ. ఒక్కొక్కసారి అయితే జీప్ తిరగబడిపోతుందా అన్నట్టుగా ఉంది.

కొంత దూరం వెళ్ళాక, జీప్ లు ముందుకు వెళ్లవు.

అక్కడ నుంచి సుమారు 16 కిలోమీటర్ల మేర కాలి నడకన నడవాల్సి ఉంటుంది.

ఒకసారి అడవిలోకి తిరిగాక, మట్టి రోడ్డు, పెద్ద పెద్ద పాము పుట్టలు, నీటి గుంతలు తారసపడతాయి.

ఆ ప్రయాణం సాధారణంగా ఉండదు. అందుకే ఆరోగ్యవంతులు మాత్రమే వెళ్ళగలరు.

కానీ బామ్మ అమ్మవారిని చూసి తీరాలి అని పట్టుపట్టడంతో వారు కాదనలేక తీసుకు వచ్చారు.

ఆ పిల్లాడు నడవలేకపోవడం తో వాడి తల్లిదండ్రులు వాడిని ఒకరి తరువాత ఒకరు ఎత్తుకుని నడుస్తున్నారు.

అంత అలసటలోనూ ఆ ప్రకృతి అందం, ఆ చల్లదనం. వారిని సేద తీరుస్తూ ఉంది.

ఆ కుటుంబం వాళ్ళతో వచ్చిన ఆ నలుగురు వ్యక్తుల్లో ఒకడు ఇంకొకడి చెవిలో

"ఒరేయ్! ఎందుకురా.. ఇక్కడే పని కానిచ్చేద్దాం. మళ్ళీ అక్కడ దాక నడిచి వెళ్లడం దేనికిరా? " అన్నాడు.

"నువ్వుండెహే.. మంగి సార్ చెప్పిండు గదా.. పట్రమ్మని గా పోరడ్ని.. గిప్పుడే ఎత్తుక పోతే. ఆగమాగం. ఐపోద్ది. మూసుకుని నే చెప్పేవరకు గా బామ్మని మన మాటల్లో పెడతా ఉండు.దర్శనం అయిపోయినాక. ఎత్తుక పోదాం."

అంటూ గొణిగాడు వాడు.

పాపం ఆ కుటుంబానికి తెలియక, ఆ వ్యక్తులకి కూడా వారు తెచ్చుకున్న, ఆహారం, నీళ్లు ఇచ్చారు.

వారు అలా చాలా సేపు నడిచాక.

గిరిజనుల నివాసాల మధ్య. బండరాళ్ళతో నిర్మించబడిన, చిన్న పాక. కనిపించింది.

ఆ వ్యక్తుల్లో ఒకడు. ఆ బామ్మ కుటుంబం తో మాట్లాడుతూ .

" రండమ్మా. ఇదే ఆ మహిమన్వితమైన ఇష్టకామేశ్వరి అమ్మవారి గుడి." అంటూ చూపించాడు.

ఆ అమ్మవారి గుడిని చూస్తూనే. అప్రయత్నం గా ఆ కుటుంబం ఆనందభాష్పాలు రాల్చారు.

" అమ్మా. ఇష్టకామేశ్వరీ!" అంటూ ఆ జగన్మాత ముందు మోకరిల్లారు.

కుడి వైపు గణపతి విగ్రహం, ఎదురుగా నంది విగ్రహం.

చుట్టూ జంట నాగులతో కొలువై ఉన్నఅమ్మవారి దర్శనం అయింది.

గుడికి ఎదురుగా సెలయేరు, ఒక బావి ఉన్నాయి .

చిన్న ద్వారం గుండా లోపలికి పాకుతూ వెడితే నూనె దీపం వెలుగులో నాలుగు చేతులతో అమ్మవారు దర్శనం ఇస్తారు.

అక్కడే పద్మాసనం వేసుకుని కూర్చున్న పూజారి గారు బొట్టు పెట్టి అమ్మవారిని కోరిక కోరుకోమని చెప్పారు.

ఆ కుటుంబం అయన చెప్పినట్టుగా అమ్మవారికి బొట్టుపెట్టి, తమ కోర్కెలు తెలుపుకున్నారు.

రవికలగుడ్డ, గాజులు ఇవ్వగా. పూజారి గారు అవి ఉంచి అమ్మవారికి పూజ చేశారు .

ఆ పిల్లవాడు "అమ్మా! నాన్నా! ఇక్కడ అమ్మవారి గురించి చెప్పండి" అని అడిగాడు . అక్కడే ఉన్న పూజారి గారు కల్పించుకుని

"బాబూ! ఈ అమ్మవారు ఇష్టకామేశ్వరి దేవి. ఈమె నాలుగు చేతులతో దర్శనం ఇస్తారు.

వెనుక రెండు చేతులలో శంఖాలు పట్టుకుని ఉంటారు.

కుడి చేతిన జపమాల, ఎడమ చేతిన శివలింగం పట్టుకుని ఉంటారు.

ఇన్నో ఏళ్ల క్రిత్రం శివుడ్ని తన నాథునిగా చేసుకునేందుకు సాక్షాత్తు పర్వత రాజు పుత్రిక, జపమాలని, శివలింగాన్ని చేతబట్టి తపస్సు చేసింది. ఆ పార్వతి దేవి ఇంకో పేరు ఇష్టకామేశ్వరి దేవి.

భక్తిగా దండం పెట్టుకుని ఆమెకు బొట్టు పెట్టి, కోరిక కోరుకుంటే తప్పకుండా తీరుతుంది." అంటూ ఆ పిల్లాడితో పాటు అక్కడున్న వారందరికీ ఆ అమ్మవారి మహత్యం తెలియజేసారు పూజారి గారు.

దర్శనం అయిన తరువాత అక్కడ ఆదివాసులు ఇచ్చిన ప్రసాదాన్ని స్వీకరించి, ఆ అమ్మవారికి మళ్ళీ మళ్ళీ నమస్కరించుకుని, తిరుగు ప్రయాణం మొదలు పెట్టింది ఆ కుటుంబం. వారితో పాటుగా ఆ వ్యక్తులు కూడా బయలుదేరారు.

కానీ వారి ప్లాన్ వేరు. ఆ కుటుంబం లోని చిన్నపిల్లాడిని వారి నుంచి ఎత్తుకు పోవాలి. ఆ దిశగా. వారి ప్రణాళిక మొదలుపెట్టారు.

*****

సశేషం


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.


నా పేరు రమ్య

నేనొక గృహిణిని

మాది తూర్పు గోదావరి జిల్లా, ముక్కామల గ్రామం. నేను తెలుగు భాషని ఎంతగానో ఇష్టపడతాను. నేనొక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ని. కధలు, కవితలు, నవలలు రాస్తూ ఉంటాను. ధన్యవాదములు


37 views0 comments

コメント


bottom of page