top of page

నల్లమల నిధి రహస్యం పార్ట్ -2


Nallamala Nidhi Rahasyam Part - 2 written by Ramya Namuduri

రచన : రమ్య నముడూరి

2012 వ సంవత్సరం,

విశాఖపట్నం

ఉదయం 7 గంటల.... ఎన్నో నిముషాలు....

మార్నింగ్ వాక్ పూర్తి చేసుకుని, ఇంటికి వచ్చాడు సంజయ్...

" వచ్చావా... వెళ్లి స్నానం చేసి రా... టిఫిన్ చేసి కాలేజీకి వెళ్దువుగాని...." అంటూ కొడుకు తలపై ప్రేమగా చేయి వేసి నిమురుతూ చెప్పింది సీత...

"ఓకే... మామ్... 10 మినిట్స్... న్యూస్ చూసి వెళ్తా...." అంటూ న్యూస్ ఛానల్ పెట్టాడు సంజయ్...

" నల్లమల అడవుల్లో... గుప్తనిధుల కోసం కేటుగాళ్ళ వల... అటవీ ప్రాంతాన్ని... టూరిస్ట్ ప్లేస్ గా మారుస్తున్నట్టుగా హై డ్రామా... 14 వ శతాబ్దానికి చెందిన కాకతీయుల ఆఖరి మహారాజు ప్రతాపరుద్రుని కోట పై కేటు గాళ్ళ కన్ను...

"ఈ సమాచారం పై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు...

“చెప్పండి రాంబాబు.... నల్లమలలో ఏమి జరుగుతోంది..?"

" వనజ... ప్రస్తుతం మనము నల్లమల అడవి లో ఉన్నాము...

నల్లమల అడవి అంటేనే నిధులు, నిక్షేపాలకు నిలయం. అలాంటి అడవిని టార్గెట్ చేశారు కొందరు వ్యక్తులు. టూరిజం పేరుతో గుప్తనిధుల వేట సాగిస్తున్నారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ జోన్‌లో గుప్తనిధుల వేటను సాగిస్తున్నారు. పూర్తి వివరాల్లోకెళితే..

దక్షిణ తెలంగాణా లోని నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్నూరు గ్రామ సమీపంలోని... నల్లమల అడవిలో కాకతీయ మహారాజు ప్రతాపరుద్రుడు నిర్మించిన కోట ఉంది. కృష్ణానది పరివాహక ప్రాంతం వెంబడి నల్లమల అడవిలో దాదాపు 300 కిలోమీటర్ల పొడవున ప్రతాపరుద్రుని కోట ఉంది. ఇది దాదాపు14 వ శతాబ్దానికి చెందిన పురాతనమైన కట్టడం.

రుద్రమదేవి మనవడు ప్రతాపరుద్రుడు నిర్మించిన ఈ కోటలోకి వెళ్లాలంటే రెండు కిలోమీటర్లు కాలినడకన వెళ్ళాల్సి ఉంటుంది. అలాంటి ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చర్యలకు పూనుకుంది. ఇందులో భాగంగా అధికారులు రోడ్డు మార్గం కూడా నిర్మించారు. అంతేకాదు.. టూరిజం పేరుతో స్థానిక అధికారులు కోట మరమ్మతులకు చర్యలు చేపట్టారు. అయితే, ఈ టూరిజం అభివృద్ధి ముసుగులో పలువురు అధికారులు గుప్తనిధుల తవ్వకాలకు తెరలేపారనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి.

వాస్తవానికి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలోకి అడుగు పెట్టాలంటే అటవీశాఖ అనుమతులు తప్పనిసరి. అయితే, అంత ఈజీగా అటవీశాఖ అనుమతులు లంభించవు. మేతకోసం పశువులను అడవిలోకి తీసుకెళ్తేనే రైతులపై అటవీశాఖ అధికారులు కేసులు పెడతారు. స్థానికులు వంట చేయడానికి కట్టెలు తెచ్చుకోవడానికి వెళ్లినా వదిలిపెట్టకుండా భారీ జరిమానాలు విధిస్తుంటారు. కానీ, సామాన్యుల పట్ల ఇంత కఠినంగా వ్యవహరించే అధికారులు.. అభివృద్ధి కార్యక్రమాల ముసుగులో గుప్త నిధుల తవ్వకాలకు పాల్పడుతున్న వారిపట్ల చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఇక కొందరు ప్రజా ప్రతినిధుల అండదండలతో అటవీశాఖ అధికారులు ప్రతాపరుద్రుని కోటపై ఉన్న గుప్తనిధులను స్వాహా చేసే కుట్ర చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అభివృద్ధి ముసుగులో అధికారులే.. గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపడుతున్నారని స్థానిక ప్రజలు జోరుగా చర్చించుకుంటున్నారు. టూరిజం అభివృద్ధి పనులు చేస్తున్నారా? లేక నిధులు, నిక్షేపాలను వెలికి తీసే పనిలో పడ్డారా? అనే సందేహాలను స్థానిక గ్రామ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు ఇప్పటికైనా సంఘటనా స్థలానికి చేరుకుని పూర్తిస్థాయి విచారణ జరిపించాలని నల్లమల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

మరికొన్ని వివరాలు ఇక్కడ స్థానికులను అడిగి తెలుసుకుందాం..." అంటూ...అప్పటివరకు అనర్గళంగా మాట్లాడిన టీవీ రిపోర్టర్.... ఒక స్థానికుడితో అక్కడి పరిస్థితి గురించి మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నాడు...

" చెప్పండి సార్... ఇక్కడ గుప్త నిధుల కోసం తవ్వకాలు జరగడం మీరు ఎప్పుడైనా చూసారా? "

" అవునండి... ఇక్కడ ఉన్న పురాతన శివాలయంలో చాలా గుంతలు తవ్వేసి ఉన్నాయి... మా ఊరు నుండి చాలా మంది పశువుల్ని మేపడానికి ఈ అడవిలోకి వస్తూ ఉంటారు... అయితే కొంత కాలం బట్టి .. ఇక్కడికి ఎవరినీ రానియ్యట్లేదు....ఇక్కడ పశువుల మేతకి, కట్టెలు కొట్టుకోవడానికి కూడా మా వాళ్ళని రానియ్యడం లేదు...

ఏమంటే... అటవీ శాఖ అధికారులు కేసులు పెట్టేస్తున్నారు... మా ఊరోళ్ళు ఇటు పక్క రావడానికే జంకుతున్నారు...

ఇదంతా... ఆ గుప్త నిధుల తవ్వకాలకోసం... ఎవరో పెద్దమనుషులు... చేస్తున్న పనండి... ఇందులో ఆ అధికారులు కూడా కుమ్మక్కయ్యుంటారండి..."

అంటూ ఆ స్థానికుడు చెప్పడం, అంతా పూర్తయ్యాక.

“ఇది వనజా ఇక్కడి పరిస్థితి...

కెమెరామెన్ గంగతో... రాంబాబు... పీకే ఛానల్”

అంటూ ఆ రిపోర్టర్ చెప్తూ ఉన్నాడు...

ఈలోగా... సంజయ్... టీవీ ఆఫ్ చేసి...

"ఈ న్యూసే... నాన్సెన్స్ మామ్... ఈ కాలంలో కూడా గుప్త నిధులు... తవ్వకాలు ఏంటి మామ్... బుల్ షిట్....

అనవసరంగా టైం వేస్ట్... ఇవాళ నేను చాలా క్లాసెస్ తీసుకోవాలి... ఉహ్హ్... బ్రెయిన్ హీట్ ఎక్కిపోయింది.... ఫ్రెష్ అయి వస్తా..." అంటూ... రెడీ అవడానికి వెళ్ళిపోయాడు....

సీత మనసంతా... కకావికాలం అయిపోయింది... ఆ ప్రోగ్రాం చూసి....

టిఫిన్ రెడీ చేస్తోంది, కానీ.. తన దృష్టి అంతా... ఆ న్యూస్ రీడర్ చెప్పిన దాని మీదే ఉంది...

ఎందుకంటే..... తన తండ్రి కూడా ఆ నిధిని దక్కించుకునే ప్రయత్నం చేసే... ఆ అడవిలోనే అదృశ్యం అయిపోయాడు కాబట్టి...

ప్రేమ పెళ్లి చేసుకుందని తనని ఇంట్లోకి రానివ్వకపోయినా...

తన తండ్రి ఎంత దుర్మార్గుడు అయినా కూడా....

ఏ కూతురికి అయినా సహజంగా ఉండే ప్రేమ..

సీత మనసుని మెలిపెడుతుంటే....

ఆనాటి చేదు జ్ఞాపకాల అలల, సుడులు... తన కంట కన్నీరై కరుగుతుండగా...

వెనకనుండి వచ్చి సీత కళ్ళు మూశాయి రెండు చేతులు....

************************************

సశేషం

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.



రచయిత్రి పరిచయం :

నా పేరు రమ్య

నేనొక గృహిణిని

మాది తూర్పు గోదావరి జిల్లా, ముక్కామల గ్రామం. నేను తెలుగు భాషని ఎంతగానో ఇష్టపడతాను. నేనొక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ని. కధలు, కవితలు, నవలలు రాస్తూ ఉంటాను. ధన్యవాదములు


131 views0 comments

Comments


bottom of page