'Nallamala Nidhi Rahasyam Part - 10' written by Ramya Namuduri
రచన : రమ్య నముడూరి
అంతు చిక్కని ప్రశ్నలతో సీత మెదడు మొద్దుబారిపోయింది.
ఏమీ మాట్లాడలేని, ఏం జరిగిందో చెప్పలేని స్థితిలో ఉండిపోయింది సీత.
ఇంతలో కాలింగ్ బెల్ మోగింది.
అసలే భయంతో బిగుసుకుపోయిన సీత, ఒక్కసారిగా మోగిన బెల్ కి ఉలిక్కిపడింది.
"ఆమ్మా.. తమ్ముడు వచ్చినట్టున్నాడు. కాలింగ్ బెల్ కి కూడా భయపడిపోతావేంటి? నీకు ఏదో అయింది" అంటూ హాల్ లోకి వెళ్ళాడు అజయ్.
" నాకు ఏమైంది అంటాడేంటి.. ఇప్పటి వరకూ ఏం జరిగిందో వీడికి తెలియదా? ఎలా చెప్పాలి? నమ్ముతాడా? అసలు ఇదంతా నిజమా.. భ్రమా? " అనుకుంటూ నిలబడిపోయింది సీత.
డోర్ ఓపెన్ చేయగానే సంజయ్ లోపలికి వచ్చి,
" నేను హాఫ్ డే లీవ్ పెట్టేసాను అన్నయ్యా! ఈ పూట మీతో ఉంటాను. నైట్ నైన్ కి బస్సు కదా ! అన్నీ రెడీ చేసుకున్నావా? అమ్మ ఏది? " అంటూ తల్లి కోసం చుట్టూ చూస్తున్నాడు సంజయ్.
"అమ్మ గదిలో ఉందిరా " అంటూ "అమ్మా! తమ్ముడు వచ్చాడు" అని సీతని పిలిచాడు అజయ్.
సంజయ్ వచ్చాడని విన్న సీతకి కొంచెం ధైర్యం వచ్చింది.
హాల్ లోకి వెళ్లి, ఏమీ జరగనట్టు మామూలుగానే ప్రవర్తిస్తోంది సీత. రండి అన్నం తిందురుగాని! అంటూ ఇద్దరికీ ప్రేమగా అన్నం తినిపిస్తోంది సీత.
ఆ అన్నాతమ్ముళ్లు ఇద్దరూ ఏవో కబుర్లు చెప్పుకుంటున్నారు. సీతకు అవేమి చెవికెక్కట్లేదు.
ఆమె ఆలోచనలు అన్నీ ఇందాక జరిగిన ఘటన మీదే ఉన్నాయి. అలా ఆలోచిస్తూ ఉండగా.
ఆమెకు ఒక విషయం గుర్తు వచ్చింది. అజయ్, సంజయ్ లు పుట్టినపుడు.. వాళ్ళు విజయనగరంలో ఉండే రోజుల్లో..
ఒక రోజు తను, తన భర్త, ఇద్దరు పిల్లల్ని తీసుకుని అక్కడ ఉన్నఅమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు..
వాళ్ళు దర్శనం చేసుకుని, గుడి మండపంలో కూర్చుని ఉన్నప్పుడు ఒక కోయదొర వచ్చి, తన ఇద్దరి పిల్లల వైపు చూస్తూ
"పిల్లలు జర భద్రం తల్లే! నీ పెద్ద బిడ్డడు కారణజన్ముడు తల్లే! అయన ఎవురననుకునేవు తల్లే..
దొర!మా నల్లమలకే దొర! మళ్ళా పుట్టిండు తల్లే.." అంటూ ఉండగా
తన భర్త అతడ్ని వారించి, డబ్బులు చేతిలో పెట్టి వెళ్ళిపోమంటే
"నాకు పైసలొద్దు దొర! నీ బిడ్డడు జర భద్రం! పాతికేళ్ల అప్పుడు గండం వచ్చును దొర. నూకలు చెల్లునో.. మిగులునో..అంతా ఆ అంబకే ఎరుక దొర! ఈయన ఇచ్చిన మాటకోసం మళ్ళీ పుట్టిండు దొర." అంటూ ఇంకా ఏదో మాట్లాడబోతుంటే తన భర్త అతడిని తిట్టి ఇంకా ఎక్కువ మాట్లాడితే జైలులో పడేస్తా అంటూ అరవడం తో
ఆ కోయదొర "నాపై కోపం చేయకు తండ్రే! నీ బిడ్డడు భద్రం..ఇది అంబ పలుకు దొర! ఆ జగదాంబ పలుకు దొర! వస్తను దొర!" అంటూ ఆ కోయదొర వెళ్లిపోవడం.
అంతా సీత కళ్ళముందు కదలాడుతోంది. అప్రయత్నంగా ఆమె చేతులు వణికిపోతున్నాయి.
తన కొడుకులిద్దరికీ ఇప్పుడు 25 ఏళ్ళు.
"ఆ కోయదొర ఆనాడు ఏదో గండం వస్తుంది అని చెప్పాడు. అదేంటో పూర్తిగా చెప్పనివ్వలేదు అయన. పూర్తిగా వినిఉంటే దాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలిసేది.
అజయ్ కి ఏమీ జరిగిందో.. తను ఇందాక చూసినది అంతా ఏంటో తెలుసుకోవాలి అంటే.. ఒకసారి అజయ్ జాతకం
సిద్ధాంతి గారికి చూపించాలి. జరిగినది అంతా ఆయనకి చెప్పాలి. ఇప్పుడు ఎలాగైనా ఆయనకి ఫోన్ చేయాలి.
అనుకుంటూ ఉండగా..
***సశేషం***
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.
> పుకారు
రచయిత్రి పరిచయం :
నా పేరు రమ్య
నేనొక గృహిణిని
మాది తూర్పు గోదావరి జిల్లా, ముక్కామల గ్రామం. నేను తెలుగు భాషని ఎంతగానో ఇష్టపడతాను. నేనొక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ని. కధలు, కవితలు, నవలలు రాస్తూ ఉంటాను. ధన్యవాదములు
Comments