top of page

నల్లమల నిధి రహస్యం పార్ట్ -8


'Nallamala Nidhi Rahasyam Part - 8' written by Ramya Namuduri

రచన : రమ్య నముడూరి

మనసంతా ఏదో తెలియని అలజడి.

తనకి జరుగుతున్నది ఎవరికీ చెప్పుకోలేక, అలాగని దాని గురించి ఆలోచన మానలేక పిచ్చి పట్టేస్తోంది అతనికి.

తల్లికి చెప్పుకుందామంటే అసలే తను ట్రాన్స్ఫర్ విషయం గా టెన్షన్ పడిపోతోంది.

తమ్ముడా కాలేజీకి వెళ్ళిపోయాడు. ఒకవేళ చెప్పినా వాడు నమ్ముతాడా ?

ఇలా కాదు అని కాసేపు టీవీ చూద్దాం అని హాల్ లోకి వెళ్లి, టీవీ ఆన్ చేసి, న్యూస్ ఛానల్ పెట్టి, న్యూస్ చూస్తూ ఉన్నాడు.

సీత, రాత్రి ప్రయాణం కోసం అన్నీ సర్దుకుంటోంది.

వారం రోజుల పైగానే ఇంట్లో తను ఉండదు కాబట్టి, సంజయ్ కి ఇబ్బంది కలగకుండా దోసెల పిండి కోసం రెడీ చేస్తూ, గోంగూర పచ్చడికి కూడా ఏర్పాట్లు చేస్తోంది.

కొత్త ప్లేస్ కి వెళ్ళగానే ఇబ్బంది కలగకుండా కొన్ని కారం పొడులు, పచ్చళ్లు సర్దుకుంటోంది.

ఇద్దరు కొడుకులకి కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటూ బిజీ గా ఉంది.

అజయ్ న్యూస్ చూస్తూ ఛానల్స్ మారుస్తూ ఉండగా ఒక ఛానల్ దగ్గరికి వచ్చాక రిమోట్ పనిచేయడం మానేసింది.

అదే పీకే ఛానల్.

బ్యాటరీ అయిపోయిందేమో అని రిమోట్ పక్కన పడేసి, మొబైల్ చూస్తూ ఉన్నాడు అజయ్.

ఈలోగా ఆ ఛానల్ లో...

మన చరిత్ర అనే ప్రోగ్రాం రన్ అవుతూ ఉంది.

అందులో భాగంగా "మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర, ప్రతాప రుద్రుని సేనలకు, గిరిజనులకు మధ్య జరిగిన యుద్ధం గురించి చాలా అద్భుతంగా వర్ణిస్తోంది. ఆ న్యూస్ రీడర్.

అనుకోకుండా అజయ్ ఆ అమ్మాయి చెప్తోన్న వీరగాధ ఆసక్తిగా వినసాగాడు.

" కాకతీయ సామ్రాజ్యపు ఆఖరి మహారాజు అయిన ప్రతాపరుద్రుని పాలనా కాలం 1289 నుండీ 1323 మధ్య కాలంలో..

మేడారాన్ని పాలిస్తున్న పగిడిద్దరాజు కాకతీయుల సామంతుడు. ఆ రోజుల్లో కరవు కాటకాల కారణంగా కొన్నేళ్ల పాటు ప్రజలు శిస్తు కట్టలేదు. కాకతీయుల సామంతునిగా ఉంటూ శిస్తు కట్టకపోవడం, తన మామ మేడరాజుకు ఆశ్రయం కల్పించడం, కోయ గిరిజనుల్లో విప్లవ భావాలు నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే ఆరోపణలతో కాకతీయ సామ్రాజ్యాధినేత ప్రతాపరుద్రుడు పగిడిద్దరాజుపై సమర శంఖం పూరించాడు. ఇది గమనించిన గిరిజనులు ప్రభుత్వంపై తిరగబడేందుకు సిద్ధమయ్యారు.

మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మేడారం పైకి కాకతీయ సేనలు దండెత్తాయి. ఈ క్రమంలో ములుగు జిల్లా లక్నవరం సరస్సు వద్ద గిరిజనులకు-కాకతీయ సేనలకు మధ్య యుద్ధం జరిగింది. ఈ క్రమంలో సాంప్రదాయ ఆయుధాలతో పగిడిద్ద రాజు, సారలమ్మ, నాగులమ్మ, జంపన్న, గోవింద రాజులు (సమ్మక్క-పగిడిద్దరాజు అల్లుడు) వీరోచితంగా పోరాటం చేశారు. కానీ, కాకతీయ సేనల ధాటికి తట్టుకోలేక మేడరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవింద రాజులు యుద్ధంలో మరణించారు. వారి మరణ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక అక్కడి సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి సంపెంగవాగును జంపన్న వాగుగా పిలుస్తున్నారని చరిత్రకారులు చెబుతారు.

తన కుటుంబం మరణించిందన్న వార్త విన్న సమ్మక్క యుద్ధ రంగానికి వచ్చి కాకతీయ సైనికులపై విరుచుకుపడింది. వీరోచితంగా పోరాటం సాగిస్తుంది. ఆమె వీరత్వం చూసి ప్రతాప రుద్రుడు ఆశ్చర్యపోతాడు. కానీ, ఓ కాకతీయ సైనికుడు దొంగచాటుగా సమ్మక్కను బల్లెంతో వెన్నుపోటు పొడుస్తాడు. ఆ గాయంతోనే మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలకలగుట్టకు వెళ్లి ఆమె అదృశ్యమైపోయిందని చెబుతారు. ఆ తర్వాత చెట్టుకింద ఓ పుట్ట దగ్గర ఓ కుంకుమ భరిణ కనిపించిందట.

ఆ తర్వాత తప్పు తెలుసుకున్న ప్రతాపరుద్రుడు సమ్మక్క భక్తుడిగా మారిపోతాడు.

కొంతకాలానికి ప్రతాపరుద్రుడు కోయరాజులు కట్టాల్సిన కప్పాన్ని రద్దుచేసి, సమ్మక్క భక్తుడై కానుకలు సమర్పించాడు. రెండేళ్లకోసారి జాతర నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశాడు. ఈ సమ్మక్క సారలమ్మ జాతర అలా మొదలయ్యిందనే కథ విస్తృతంగా ప్రచారంలో ఉంది. కుంకుమ భరిణెలనే సమ్మక్కగా భావించి అప్పటి నుంచి రెండేళ్లకు ఒకసారి మాఘ శుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క-సారలమ్మ జాతరను భక్తి శ్రద్ధలతో జరుపుకొనే సాంప్రదాయం ఏర్పడింది" అంటూ ఆసియాలోనే అతిపెద్ద జాతరగా చెప్పుకోబడే

మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర గురించి అత్యద్భుతం గా వివరించింది ఆ రీడర్.

అదంతా వింటున్న అజయ్ కి కన్నుల వెంబడి తనకు తెలియకుండానే కన్నీరు కారింది.

"ఏంటి! నేను ఇంత ఎమోషనల్ అయిపోతున్నాను?"అనుకుంటూ లేచి, టీవీ కట్టేసి కిచెన్ లోకి వెళ్ళాడు.

అక్కడ సీత పని హడావిడిలో ఉంది.

" అమ్మా! ఏం చేస్తున్నావ్? నేనూ హెల్ప్ చేస్తా. " అంటూ తల్లి పక్కన చేరాడు అజయ్.

" ఏమీ వద్దు నాన్నా. నేను చేసుకుంటాలే కానీ నువ్వెళ్ళి కాసేపు పడుకో. నైట్ జర్నీ ఉంది కదా! మళ్ళీ రేపే డ్యూటీ లో చేరిపోవాలి కదా" అంది సీత.

"సరే అమ్మా! తమ్ముడు వచ్చాక లేపు” అంటూ గదిలోకి వెళ్లి పడుకున్నాడు.

కాసేపటికే మత్తుగా నిద్ర పట్టేసింది.

ఆ నిద్రలో..

"మిత్రమా.. మరిచిపోకు! మాట ఇచ్చావు.. నా దేశ ప్రజలు.. ఈ నిధి, ఈ దేశ సంపద ఆ నీచులకి దక్కకూడదు. నా ప్రజలు ఆకలితో అలమటించకూడదు.

నేను తిరిగి రావచ్చు.. రాకపోవచ్చు.. నా ప్రజల భవిష్యత్తు నువ్వు కావాలి మిత్రమా!"

ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాడు అజయ్. పైకి లేవలేకపోతున్నాడు. వళ్ళంతా ఏదో తెలియని మైకం కమ్మేస్తోంది. కాళ్ళు, చేతులు కూడా కదపలేకపోతున్నాడు.

ఇంతలో ఎవరో తనను బాణాలతో చిత్రవధ చేస్తున్నట్టు వళ్ళంతా రక్తం కారిపోతున్నట్టు బాధ పడుతున్నాడు. కానీ కళ్ళు తెరువలేకపోతున్నాడు.

ఇంతలో తను తెల్లవారు ఝామున చూసిన అమ్మాయి!

" మావా! మావా! అంటూ తనపై పడి ఏడుస్తూ తనని లేపడానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది."

ఈలోగా…

సశేషం

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత్రి పరిచయం :

నా పేరు రమ్య

నేనొక గృహిణిని

మాది తూర్పు గోదావరి జిల్లా, ముక్కామల గ్రామం. నేను తెలుగు భాషని ఎంతగానో ఇష్టపడతాను. నేనొక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ని. కధలు, కవితలు, నవలలు రాస్తూ ఉంటాను. ధన్యవాదములు


24 views0 comments

Comentarios


bottom of page