top of page

నల్లమల నిధి రహస్యం పార్ట్-9


'Nallamala Nidhi Rahasyam Part - 9' written by Ramya Namuduri

రచన : రమ్య నముడూరి

ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాడు అజయ్. పైకి లేవలేకపోతున్నాడు. వళ్ళంతా ఏదో తెలియని మైకం కమ్మేస్తోంది. కాళ్ళు, చేతులు కూడా కదపలేకపోతున్నాడు.

ఇంతలో ఎవరో తనను బాణాలతో చిత్రవధ చేస్తున్నట్టు వళ్ళంతా రక్తం కారిపోతున్నట్టు బాధ పడుతున్నాడు. కానీ కళ్ళు తెరువలేకపోతున్నాడు..

ఇంతలో తను తెల్లవారు ఝామున చూసిన అమ్మాయి..

" మావా.. మావా.." అంటూ తనపై పడి ఏడుస్తూ తనని లేపడానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది.

ఈలోగా సీత వచ్చి

"అజయ్.. అజయ్ .. ఏమైంది నాన్నా? " అంటూ అతన్ని లేపడానికి ప్రయత్నం చేస్తోంది . అప్పటికే అతను ఏదేదో మాట్లాడేస్తున్నాడు. వళ్ళంతా చెమటలు పట్టేసి, నిలువెల్లా తడిసిపోతున్నాడు.

కొడుకుని అలా చూసేసరికి, సీతకి కాళ్ళు, చేతులు ఆడట్లేదు. అలాగే అతన్ని లేపడానికి ప్రయత్నం చేస్తోంది.

అతను ఇంకా ఆ కలలోనే ఉన్నాడు.

"మాటివ్వు మరియా.. నీ శక్తులతో ఈ నిధిని

కాపాడతాను అని! నేను మళ్ళీ జన్మ ఎత్తయినా, నా రాజుకి ఇచ్చిన మాట నెరవేరుస్తాను.. ఈ రాజ్యం కోసం, ఈ దేశం కోసం, నా మహారాజుకి ఇచ్చిన మాట కోసం మళ్ళీ పుడతాను. ఇది ఆ కొండదేవర పై ఆన.. మన ప్రేమ మీద ఆన!" అంటూ ఏదేదో మాట్లాడేస్తున్నాడు.

సీత చాలా కంగారు పడిపోతోంది.

లే నాన్నా! ఏమ్మాట్లాడుతున్నావు? అంటూ అజయ్ ని కుదిపేస్తోంది.

ఒక్కసారిగా ఆ తల్లీకొడుకులు ఉన్న గది అంతా చల్లగా అయిపోయింది. కిటికీలు టప, టపా కొట్టేసుకుంటున్నాయి..

మిట్టమధ్యాహ్నం 12 అయింది అప్పటికి..

ఒక్కసారిగా కుక్కలు అరవడం మొదలుపెట్టాయి.

సీత నిలువెల్లా వణికిపోతోంది.

గది అంతా ఏదో గాలి. అటు, ఇటు తిరుగుతున్నట్టు అనిపిస్తోంది. సీతకీ కొడుకు చూస్తే ఇలా ఏదో కలవరిస్తున్నాడు. అది సరిపోనట్టు, ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం సీతలో భయాన్ని, గుండె వేగాన్ని పెంచేసింది.

గాలి వేగం ఎంత పెరిగిపోయింది అంటే..

ఆ గది కిటికీలు పెళ్ళుమని శబ్దం చేస్తూ విరిగిపోయి, గాజు పెంకులు చెల్లాచెదురై పడిపోయాయి. అజయ్ లేవడం లేదు..

" మరియా.. మరియా.." అంటూ కలవరిస్తూనే ఉన్నాడు..

ఇంతలో సీత చూస్తూ ఉండగానే ఒక తెల్లటి ఆకారం అజయ్ మీద వాలిపోయి అతని మెడను గట్టిగా నులిమేస్తోంది. సీత అజయ్ ను లేపడానికి మొహంపై నీళ్లు కొడుతోంది. ఆ ఆకారం నుండి అజయ్ ని ఎలా కాపాడుకోవాలో తెలియక, గట్టిగా హనుమాన్ చాలీసా చదవడం మొదలు పెట్టింది..

అంతే! ఆ ఆకారం అజయ్ ని వదిలేసి..

" ఉంగిడే .. ఉంగిడే.."(ఆపవే.. ఆపవే..)

అంటూ వికృతంగా అరుస్తోంది..

అజయ్ కి ఇంకా మెలుకువ రావట్లేదు. అతను ఏదో ట్రాన్స్ లోకి వెళ్ళిపోతున్నాడు.

తనని తాను పూర్తిగా కోయరాజు మార్తాండగా చూస్తున్నాడు ఆ కల్లో..

సీత ఇంకా గట్టిగా హనుమాన్ చాలీసా చదువుతూ ఉంది..

ఆ ఆకారం ఆ గదిలో ఉన్న గాజు గ్లాస్ ని సీత మీదకు విసిరింది .

అది ఆమెను తాకే క్షణం లో

అజయ్ కి మెలుకువ వచ్చింది. ఒక్కసారిగా గాలిలోకి ఎగిరి, ఆ గాజు గ్లాస్ సీతను తాకక మునుపే దాన్ని పట్టుకుని ఆపాడు.

"ఉఫియే.. కిరీగచ్చు.. అమ్మా కీ హకిలీయా .. ఇంద మార్తాండ. ముంగర్ల.. నీవెన్నడా.. ద్రోహి.. రాజద్రోహి..(వచ్చావా.. నీచుడా.. అమ్మకి హాని కలిగిస్తావా.. ఇక్కడ ఉన్నది మార్తాండ.. నువ్వు ఒక ద్రోహివి.. రాజద్రోహివి..)"

అంటూ ఆ గాజు గ్లాస్ ని ఆ ఆకారం మీదకి తిరిగి విసిరాడు.

అంతే! ఆ ఆకారం అక్కడనుండి పొగలా మారి పారిపోయింది.

అజయ్ కళ్ళు నీలం రంగులో ఉన్నాయి. అది చూసి సీత ఇంకా భయపడిపోతూ, ఇంకా గట్టిగా హనుమాన్ చాలీసా చదువుతూ తనకి దగ్గరగా వస్తోన్న కొడుకుని చూస్తూ భయంతో కళ్ళు మూసుకుంది .

"అమ్మా.. అమ్మా.. " అంటూ సీత భుజంపై చేతులు వేసి కుదుపుతున్నాడు అజయ్.

సీత కళ్ళు తెరిచి చూసే సరికి అజయ్ మామూలు స్థితిలోనే ఉన్నాడు. అతని కళ్ళు నీలంగా కాక, ఎప్పటిలాగానే ఉన్నాయి..

"బాబూ! నువ్వు బాగానే ఉన్నావా?" అంటూ అజయ్ ని గట్టిగా హత్తుకుని ఏడుస్తోంది సీత.

"నేను బానే ఉన్నా అమ్మా! ఏమైంది నీకు?

నేను కళ్ళుతేరిచి చూసే సరికి నువ్వు భయపడుతూ, హనుమాన్ చాలీసా చదువుతున్నావ్.. ఏమైంది అమ్మా?" అంటూ కంగారుగా అడుగుతున్నాడు అజయ్.

సీత ఏమీ చెప్పలేకపోతోంది. ఇందాక జరిగిన ఘటనలో

పగిలిపోయిన కిటికీ అద్దాలు, ఇప్పుడు మామూలుగానే ఉన్నాయి. తన మీదకి విసిరిన గాజు గ్లాస్ ఎప్పుడూ ఉన్న చోటే ఉంది.

మరి ఇప్పటివరకు జరిగింది అంతా ఏంటి?

ఆ ఆకారం, అజయ్ ని చంపడానికి ఎందుకు ప్రయత్నం చేసింది?

అసలు ఆ ఆకారం ఏంటి?

అజయ్ కళ్ళు నీలంగా ఎందుకు మారిపోయాయి?

తను మాట్లాడినది అంతా ఏంటి?

అంతు చిక్కని ప్రశ్నలతో సీత మెదడు మొద్దుబారిపోయింది.

ఏమీ మాట్లాడలేని, ఏం జరిగిందో చెప్పలేని స్థితిలో ఉండిపోయింది సీత.

ఇంతలో..

***సశేషం***

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

> పుకారు

> సంక్రాంతి -కొత్త అల్లుడు

> పాపం పండిన రోజు

> మరణాన్ని జయించి బ్రతుకుదాం

> నల్లమల నిధి రహస్యం పార్ట్ -1

> నల్లమల నిధి రహస్యం పార్ట్ -2

> నల్లమల నిధి రహస్యం పార్ట్ -3

> నల్లమల నిధి రహస్యం పార్ట్ -4

> నల్లమల నిధి రహస్యం పార్ట్ -5

> నల్లమల నిధి రహస్యం పార్ట్ -6

> నల్లమల నిధి రహస్యం పార్ట్ -7

> నల్లమల నిధి రహస్యం పార్ట్ -8


రచయిత్రి పరిచయం :

నా పేరు రమ్య

నేనొక గృహిణిని

మాది తూర్పు గోదావరి జిల్లా, ముక్కామల గ్రామం. నేను తెలుగు భాషని ఎంతగానో ఇష్టపడతాను. నేనొక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ని. కధలు, కవితలు, నవలలు రాస్తూ ఉంటాను. ధన్యవాదములు


25 views0 comments
bottom of page