top of page

నల్లమల నిధి రహస్యం పార్ట్ -11'Nallamala Nidhi Rahasyam Part - 11' written by Ramya Namuduri

రచన : రమ్య నముడూరి

‘అజయ్ కి ఏమి జరిగిందో తను ఇందాక చూసినది అంతా ఏంటో తెలుసుకోవాలి అంటే.. ఒకసారి అజయ్ జాతకం

సిద్ధాంతి గారికి చూపించాలి. జరిగినది అంతా ఆయనకి చెప్పాలి. ఇప్పుడు ఎలాగైనా ఆయనకి ఫోన్ చేయాలి’ అనుకుంటూ ఉండగా

" అమ్మా! ఏమి ఆలోచిస్తున్నావు? ఇందాకట్నుంచి చూస్తున్నా! అసలు నువ్వు మాలో లేవు. ఏమైంది నీకు? " అని అడిగాడు సంజయ్.


"నేను నిద్రలేచే సరికి అమ్మ దేన్నో చూసి భయపడిపోయి, కళ్ళుమూసుకుంది. ఈలోగా నువ్వు వచ్చావు."

అంటూ మాట్లాడుతున్న అజయ్ కి ఫోన్ వచ్చింది. అది అతని సుపీరియర్ ఫోన్ కావడంతో అజయ్ లేచి, ఫోన్ మాట్లాడుతూ బయటకు వెళ్ళిపోయాడు.

"అమ్మా! అన్నయ్య చెప్పిందంతా ఏంటి ? నీకు ఎందుకు భయమేసింది? నువ్వు ఇప్పుడు దేని గురించి అంతగా ఆలోచిస్తున్నావు? ఏమున్నా నాకు చెప్పు. నేను చూసుకుంటాను. నీ చిన్ని బంగారాన్ని కదా నేను. నాతో చెప్పమ్మా!" అంటూ అనునయంగా అడిగాడు సంజయ్.

సీతకి కన్నీళ్లు ఆగలేదు. తను అజయ్ పడుకుని ఉన్నప్పుడు నిద్ర లోనే అతను మాట్లాడిన మాటలు, తను చూసిన ఆకారం, అజయ్ లో వచ్చిన మార్పు, అతని కళ్ళు నీలంగా మారడం, ఆ ఆకారాన్ని ఎదుర్కోవడం, అజయ్ వింత భాష మాట్లాడడం.. ఇంతలో తను భయపడి కళ్ళుమూసుకోవడం.. అంతా. చెప్పింది సీత సంజయ్ కి.

అదంతా విన్న సంజయ్ కి గుండె వేగం పెరిగిపోయింది. ఇవాళ్టి వరకూ తనకి మాత్రమే తెలిసిన తన అన్నయ్య వింత ప్రవర్తన, ఈ రోజు తన తల్లికి కూడా తెలిసిపోయింది అని సంజయ్ కి అర్ధం అయింది. ఇంకా దాచి ఉపయోగం లేదు అనుకున్నాడో, ఏమో!

" అమ్మా! ఇవాళ నీకు ఒక విషయం చెప్పాలి. ఇది విని నువ్వు భయపడకూడదు. అన్నయ్య ఇలా ప్రవర్తించడం ఇవాళ మొదటి సారి కాదు. ఆ ఆకారం అన్నయ్య పై దాడి చేయడం ఇవాళ మొదటి రోజూ కాదు.

ఆరునెలల క్రితం మా ఇద్దరి బర్త్ డే రోజు. నువ్వు, నేను కూడా అన్నయ్య కోసం రాజమండ్రి వెళ్ళాము కదా.

అప్పుడు అన్నయ్య అక్కడ ఎస్. ఐ గా పనిచేసేవాడు కదా!

ఇద్దరం కలిసి మా 25 వ బర్త్డే కేక్ కట్ చేసి, ఆ రోజు అంతా ఎంతో ఎంజాయ్ చేసాం కదా.. నువ్వు మా ఇద్దరినీ చూసి మురిసిపోయిన ఆ రోజూ రాత్రి ఏమైందో తెలుసా అమ్మా!


పార్టీ అయిపోయాక, అన్నయ్య స్టాఫ్ అందరూ భోజనం చేసి వెళ్లిపోయాక, నువ్వు పడుకున్నావ్. అప్పుడు మేము ఇద్దరం కూడా నిద్రపోయాం.


అదోరాత్రి వేళ ఎందుకో నిద్రలోంచి సడన్ గా మెలుకువ వచ్చేసింది. చుట్టూ చూసాను. అంతా ప్రశాంతంగానే ఉంది. కానీ ఉన్నట్టుండి గది అంతా చల్లగా అయిపోయింది. కిటికీలు టప, టపా శబ్దం చేస్తున్నాయి. నేను లేచి, కిటికీ వేసేలోగా. ఆ గాలి తీవ్రత కి నేను చూస్తుండగానే ఆ కిటికీ అద్దం పగిలిపోయింది.

నేను ఆ గాజు ముక్కలు తీయబోతుంటే..


ఆ పగిలిన కిటికీ అద్దం లో ఒక నల్లటి ఆకారం, సీలింగ్ మీద ఫ్యాన్ చుట్టూ తిరుగుతున్నట్టు కనిపించి,

వళ్ళు జలదరించింది. నేను పైకి లేచి, చూసేసరికి

ఆ ఆకారం, అన్నయ్య పై పడి ఇందాక నువ్వు చెప్పినట్టుగానే వాడి పీక పిసికేస్తోంది. వాడు కనీసం కదలననన్నా కదలడం లేదు.

నాకు భయం వేయలేదు. ఆ ఆకారాన్ని అన్నయ్య మీద నుంచి కిందకి తోయడానికి ప్రయత్నించి, నేనే అన్నయ్య మీద పడ్డాను.

అయినా వాడు లేవలేదు. ఆ ఆకారం వాడ్ని వదలలేదు. నేను వాడ్ని ఎలాగైనా లేపాలి అని ప్రయత్నం చేసి, వాడు లేవకపోవడంతో మొహంపై నీళ్లు కొట్టాను.


ఆ ఆకారం వాడ్ని వదిలేసి, నన్ను పీక పట్టుకుని గాలిలోకి లేపి,

" ఉంగిలేయ్.. ఉంగిలియే! " సమ్థింగ్.. ఏదో డిఫరెంట్ లాంగ్వేజ్ లో ఏదో అన్నది అమ్మా! అది నాకు గుర్తులేదు కానీ అది ఏదో వాగింది అమ్మా!

నేను విడిపించుకునే ప్రయత్నం చేసా కానీ నా వల్ల కాలేదు.

అప్పుడే అన్నయ్య ఒక్క ఉదుటున లేచి, వాడు కూడా అదే బాష మాట్లాడాడు అమ్మా.. అప్పుడే చూసాను నేను! వాడి కళ్ళు నీలం రంగులోకీ మారడమ్..

ఆ ఆకారం నన్ను వదిలేసింది. నేను కిందపడ్డాను. ఆ పడ్డం, పడ్డం, ఆ మరునాడు లేచాను.

నేను కళ్ళు తెరిచే సరికి మంచం మీదే ఉన్నాను. అదంతా కలో.. నిజమో.. భ్రమో..ఏమీ అర్ధం కాలేదు నాకు.

పగిలిన కిటికీ మళ్ళీ మామూలు అయిపోయింది.

అన్నయ్యని అడిగితే

“దెయ్యం సినిమాలు ఇంకా చూస్తూనే ఉన్నావా నువ్వు? జాబ్ వచ్చినా మారవా! పిచ్చి వాగుడు వాగుతున్నావ్?” అంటూ క్లాస్ పీకాడు.

నేను అది నా కలే అనుకుని, ఆ విషయం ఆ రోజే వదిలేసాను. మళ్ళీ ఈరోజు నువ్వు చెబుతుంటే నాకూ అదంతా గుర్తొచ్చింది” అంటున్న సంజయ్ చెంప చెళ్లుమనిపించింది సీత.


"అమ్మా!" అంటూ చెంప నిమురుకుంటూ చూస్తున్నాడు సంజయ్ .

నీరు నిండిన కళ్ళతో సంజయ్ ని చూస్తూ

" ఆరోజు నువ్వు నాకు చెప్పొచ్చు కదా! అంత నిర్లక్ష్యం ఏంటిరా నీకు.. అన్నయ్యకి గాని నీకు గాని ఏమైనా అయితే తట్టుకునే శక్తి ఇంక నాకు లేదు నాన్నా! " అంటూ సంజయ్ ని పట్టుకుని ఏడుస్తోంది సీత.


"సారీ అమ్మా. ఇప్పుడు ఏమి చేద్దాం.. అసలు ఇదంతా ఏంటి?" అంటూ తల్లిని అడుగుతున్నాడు సంజయ్.


" సిద్ధాంతి గారికి, అన్నయ్య జాతకం చూపించి అసలు ఇదంతా ఏంటో తెలుసుకోవాలి! అన్నయ్యకి ఏదోకటి చెప్పి, ఇప్పుడే మనము ఆయన్ని కలవడానికి వెళ్దాం!" అంది సీత.


"కానీ అమ్మా! అసలు ఆయన ఊర్లో ఉన్నారో లేదో తెలుసుకుని, అప్పుడు వెళ్దాం! అంటూ ఫోన్ తీసుకుని, అజయ్ కి తెలీకుండా. మేడ మీదకి వెళ్లి సిద్ధాంతి గారి శిష్యుడికి ఫోన్ చేసాడు సంజయ్.

***

అజయ్ బాల్కనీ లో ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు.

అజయ్ వాళ్ళు పై ఫ్లోర్ లో ఉంటారు.

కింద ఫ్లోర్ లో ఇంటి ఓనర్ కుటుంబం ఉంటారు.

వాళ్ళు ఉన్న ఇల్లు వీధికి చివర్లో ఉండటం, అది కూడా పొలాలకి అనుకుని ఆ వీధి ఉండడంతో ఆ ఇంటి చుట్టూ. చాలా మొక్కలు, చెట్లు ఉండి, ఆహ్లాదకరంగా ఉంటుంది.

బాల్కనీలో నుంచుని , సుపీరియర్ తో మాట్లాడుతున్న అజయ్ కళ్ళు ఒకచోట ఆగిపోయాయి.

ఆ వీధిలో కుంటుకుంటూ నడుస్తున్న ఒక ముష్టివాడు చూడ్డానికి చాలా నీరసంగా కనపడుతున్నాడు. ఎవరూ అతనికి ఆ రోజు ఏమీ పెట్టినట్టు లేరు. చాలా ఆకలిగా ఉన్నట్టు ఉన్నాడు.

చెత్తకుండీ దగ్గరకు వెళ్లి, అందులో ఏమైనా దొరుకుతాయేమో అని వెతుకుతున్నాడు.

అది చూసిన అజయ్ చలించిపోయాడు.


ఫోన్ మాట్లాడ్డం అయిపోగానే కిందకి వెళ్లి, ప్లేట్ లో అన్నం సర్ది, మంచినీళ్ళ బాటిల్ పట్టుకుని ఆ ముష్టివాడి దగ్గరికి వెళ్లి, అతనికి తను పట్టుకెళ్లిన అన్నం పెట్టాడు.

అది చూసి సీత ఎంతగానో సంతోషించింది.


తృప్తిగా అన్నం తిన్న ఆ ముష్టివాడు నీరు నిండిన కళ్ళతో. చల్లగా ఉండు తండ్రి.!అంటూ అజయ్ చేయ పట్టుకున్నాడు. ఇంతలోనే అతనికి షాక్ కొట్టినట్టు అనిపించి, చెయ్య వదిలేసాడు.

అతను భయంతో వదిలేసాడు అనుకుని, అతని భుజం పై చేయేసి, “జాగ్రత్త! ఇదిగో ఈ డబ్బులు ఉంచు” అంటూ ఆ ముష్టివాడి చేతిలో డబ్బులు పెట్టి, పైకి మెట్లు ఎక్కుతున్నాడు అజయ్.


"ఆగు సామీ!" అన్నాడు అతను అజయ్ ని పిలుస్తూ.

‘ఏంటి’ అన్నట్టు చూసాడు అజయ్.


"సామీ! ఏమీ అనుకోకపోతే ఇది నీ కాడ ఉంచు సామి..ఇది హనుమన్న రక్ష. నీకు అవసరం పడతాది సామి.." అంటూ ఒక తాడు ఇచ్చాడు.


"ఓయ్! నాకిలాంటివి నమ్మకాల్లేవ్. పోయి ఏదైనా పని చూసుకుని బతుకు " అంటూ విసురుగా పైకి వెళ్ళిపోయాడు అజయ్.


"తెలుస్తది సామి! నమ్మకాలొస్తయి సామి.. అన్నం పెట్టినావని నీ మంచికోరా! చల్లగుండు సామి. " అంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు.

అజయ్ విసిరేసిన తాయత్తు అక్కడనుండి అదృశ్యం అయిపోయింది.

అది ఎవరు తీశారో తరువాత చెప్తాన్లే😝

***********************************

సశేషం

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత్రి పరిచయం :

నా పేరు రమ్య

నేనొక గృహిణిని

మాది తూర్పు గోదావరి జిల్లా, ముక్కామల గ్రామం. నేను తెలుగు భాషని ఎంతగానో ఇష్టపడతాను. నేనొక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ని. కధలు, కవితలు, నవలలు రాస్తూ ఉంటాను. ధన్యవాదములు24 views0 comments

Comments


bottom of page