top of page
Original.png

అత్తమ్మ!

#DinavahiSathyavathi, #దినవహిసత్యవతి, #Atthamma, #అత్తమ్మ, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ

ree

Atthamma - New Telugu Story Written By Dinavahi Sathyavathi

Published In manatelugukathalu.com On 19/11/2024

అత్తమ్మ! - తెలుగు కథ

రచన: దినవహి సత్యవతి

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



శాంతి మనసు కలవరపాటుగా ఉంది ఉదయంనుంచీ!


ఆరేళ్ళ క్రితం ప్రేమించి పెళ్ళి చేసుకున్న శాంతి-ధీరజ్ దంపతులకి కవలలు, అమ్మాయిలు! ఇంకా అక్కడక్కడా కనిపిస్తున్న, అప్పటి ఆచార వ్యవహారలు పాటిస్తున్న కుటుంబం ఆమె అత్తగారు వాళ్లది. శాంతి అత్తగారు బడి చదువులు పెద్దగా చదవకపోయినా జీవితాన్ని చదివిన అనుభవం మెండుగా ఉన్న ఇల్లాలు. ఆప్యాయంగా మాట్లాడే మామగారు కొన్ని విషయాలలో నిర్దిష్టమైన అభిప్రాయాలను వ్యక్తం చేయడం, పెళ్ళైనప్పటినుంచీ గమనిస్తూ వచ్చింది శాంతి. 


కొడుకుకి ఇద్దరూ ఆడపిల్లలే కావడం చేత ఒక మగ బిడ్డ కూడా ఉండాలన్న అత్తమామల అవ్యక్త భావాలని గుర్తించింది, అందుచేతనే తన నిర్ణయం విని వాళ్ళ ప్రతిక్రియ ఎలా ఉంటుందోననే ఆలోచనే ఆమె కలవరపాటుకి కారణం!


కొన్ని రోజుల క్రితం ఈ విషయమై భర్తతో జరిగిన సంభాషణ మదిలో మెదిలింది... 

!+!+!

“ధీరజ్! మీతో ఒక విషయం చెప్పాలి” ఒకరోజు రాత్రి నెమ్మదిగా భర్తతో అంది. 


సాలోచనగా ఆమె వైపు చూసాడు. 

శాంతి చెప్పినదంతా విన్నాక, కాసేపు ఆలోచించి, “సరే అలాగే చేద్దాం నీ ఇష్టమే నా ఇష్టం” అన్నాడు.

 

“కానీ అత్తయ్య మామయ్య ఏమంటారోనని భయంగా ఉందండీ” 


శాంతి మాటల్లో కలవరం గమనించాడు. 

శాంతి భయానికి కారణం తెలుసు ధీరజ్ కి... తన తల్లి ఏదైనా భరిస్తుంది కానీ కొడుకుకి, అంటే తనకి, ఎవరివల్లా, ఎటువంటి కష్టమూ, ఇబ్బంది కలిగినా సహించదు. అటువంటి సందర్భాలు ఎదురైనప్పుడు తండ్రి అభిప్రాయాన్ని కూడా తల్లి వ్యతిరేకించడం చూసాడు తాను. 

ధీరజ్ మనసు, శాంతితో పెళ్ళైన కొత్తలో జరిగిన సంఘటను గుర్తు చేసుకుంది... 


శాంతికి నెల తప్పడంతో, ప్రెగ్నెన్సి నిర్థారించుకోవడానికి, డాక్టర్ వద్దకి వెళ్ళారు. టెస్ట్ లన్నీ సానుకూలంగా వచ్చాయి, శాంతి ప్రెగ్నెంట్ అని నిర్థారణైంది. తిరిగి ఇంటికి రాగానే, కుర్చీలో వాలింది శాంతి. ఆమె ప్రెగ్నెంట్ అనే వార్త ఇంకా ఇంట్లో వాళ్ళకి చెప్పాల్సి ఉంది. 


దాహంగా అనిపించి, “శాంతీ కాసిన్ని చల్లనీళ్ళు తెచ్చి పెడుదూ” అన్నాడు తను. 

“అబ్బా! అలసటగా ఉంది కాస్త ఏమనుకోకుండా వెళ్ళి తెచ్చుకుందురూ” బదులిచ్చింది శాంతి. 


ఆ మాటలు వంటింట్లో ఉన్న తల్లికి వినపడ్డాయేమో, “అన్ని పనులూ వాళ్ళే చేసుకుంటే ఇక మీరెందుకూ?” మంచి నీళ్ళ గ్లాసు నా చేతిలో పెట్టి శాంతి వైపు చుర చురా చూసింది అమ్మ! 


ఊహించని ఆ అకారణ ఆ నిందకి, శాంతి నిర్ఘాంతపోయి తన వైపు చూసింది. 


అమ్మ మాటలలోని పదును శాంతి మనసుని బాధపెట్టిందని అర్థమై, ‘అయ్యో! ఇలా జరిగిందేమిటీ, తల్లి సంగతి తెలిసీ, ఆమెకు వినపడేలా మాట్లాడకుండా ఉండాల్సింది’ అనుకుని, బాధపడవద్దని, శాంతి చెయ్యి సున్నితంగా నొక్కాడు తను. 


ఆ తరువాత అత్తగారి మనసు తెలుసుకున్న శాంతి, ఆమె ఎదురుగా ఏనాడూ తనకి చిన్న పని కూడా చెప్పి ఎరగదు. అమ్మ మనసు వెన్న, కానీ తానే ఆవిడ బలమూ, బలహీనతా కూడా! 


“నిద్రపోయారా?” అంటున్న శాంతి స్వరానికి, ఆలోచనలలోంచి తేరుకుని, “నెమ్మదిగా చెప్దాము నువ్వు బెంగపెట్టుకోకు” అని సాంత్వన పరిచాడు. 

***** 

మర్నాడు భర్త ఆఫీసుకి వెళ్ళాక, “శాంతీ నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను ఇలా రామ్మా” అంటూ అత్తగారి పిలుపు విని, వెళ్ళింది. అత్తగారు చెప్పింది విని, తాను ఏ విషయమైతే చెప్పడానికి జంకుతోందో అదే ఆవిడ ప్రస్తావించడంతో ఆశ్చర్యానికి లోనైంది. కొడుకు పైన ఈగ వాలినా కూడా సహించలేని అత్తగారు ఇచ్చిన సలహా, శాంతి భయాలన్నీ పటాపంచలు చేసింది. 


ఆ రాత్రి, అందరూ పడుకున్నాక, “ఇవాళ ఒక విచిత్రం జరిగింది తెలుసా?” అంటూ భర్త ప్రక్కన చేరింది. 


“అదే చూస్తున్నాను అమ్మాయిగారి ముఖంలో సంతోషం దాచుకున్నా దాగట్లేదు ఏమిటాని, చెప్పు చెప్పు” 


“ఉదయం అత్తయ్య నన్ను పిలిచి, ఆడపిల్లైనా మగ పిల్లవాడైనా ఇద్దరూ సమానమే. అయినా ఇక పై పిల్లలు కావాలా వద్దా అన్నది మీ ఇష్టం. ఒకవేళ వద్దనుకుంటే మాత్రం, పిల్లలు పుట్టకుండా ఆపరేషన్, నువ్వు కాదు, అబ్బాయిని చేయించుకోమను. అది వాళ్ళకే తేలిక. ఇప్పటికే రెండు ఆపరేషన్ లు చేయించుకుని నువ్వు పడిన కష్టం చాలన్నారు” సంతోషంగా చెప్పింది శాంతి. 


భార్య చెప్పినది విని, దిండు మీద వాలి వింటున్న వాడల్లా ఒక్క ఉదుటున లేచి కూర్చుని “అవునా! నిజమా! అమ్మ ఈ విషయాన్ని ఒక భిన్నమైన కోణంలో ఆలోచించగలదని నేనస్సలు ఊహించనే లేదు సుమా!” అమితమైన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసాడు ధీరజ్. 


“అవునండీ. ఆవిడకి మీరే పంచప్రాణాలు. మీకు కష్టం కలిగితే చూడలేరని నాకు తెలుసు. ఆడపిల్లలు చాలు, ఇక పిల్లలు వద్దనుకుంటున్నామని, అందుకు ఆపరేషన్ నా బదులు మీరు చేయించుకుంటారంటే, అత్తయ్య ఏమంటారోనని ఎంత భయపడ్డానో చెప్పలేను. నా మనసులో మాట, చెప్పకుండానే, అమ్మలా, ఆవిడ నన్నర్థం చేసుకోవడం నాకెంతో ఆనందం కలిగించిందండీ” అత్తమ్మపట్ల అభిమానం పొంగిపొరలి శాంతి కనులు చెమ్మగిల్లాయి. 


*****


దినవహి సత్యవతి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ దినవహి సత్యవతి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

రచయిత్రి పరిచయం: https://www.manatelugukathalu.com/profile/dsatya

పేరు: దినవహి సత్యవతి

విద్య : బి.టెక్., ఎం.సి.ఎ. ;

వృత్తి : విశ్రాంత కంప్యూటర్ సైన్స్ లెక్చరర్.

ప్రవృత్తి : రచనా వ్యాసంగం.

సాహితీ ప్రయాణంలో నేటివరకూ కథలు, కవితలు(వచన, పద్య, మినీ), నవలలు, గజల్స్, పంచపదులు, పద్యాలు, శతకములు, వ్యాసములు, పద ప్రహేళికలు, లఘు నాటికలు, పంచతంత్రం కథలు, నానీలు, హంసికలు, హైకూలు, సిసింద్రీలు, తెలుగు దోహాలు వంటి వివిధ ప్రక్రియలలో రచనలు చేయడం జరిగింది.


పలు దేశీయ, అంతర్జాల పత్రికలు, బ్లాగులు, ATA & NYTTA జ్ఞాపికలలో రచనలు ప్రచురితమైనవి.

గుర్తింపు : చైతన్య దీపికలు కథా సంపుటీలోని ‘దీక్ష’ కథ మహారాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో 12 వ తరగతి విద్యార్థులకు తెలుగు పాఠ్యాంశంగా తీసుకొనబడింది.

పలు కథా, కవితా, పద్య సంకలనములలో కథలు & కవితలు ప్రచురితమైనవి.

ఆటవెలది ఛందస్సులో ‘మధుర సత్య శతకం’ వ్రాయడం జరిగింది.

6 గొలుసుకట్టు నవలలలో భాగస్వామ్యం చేయడం జరిగింది.

ముద్రితములు: ‘చైతన్యదీపికలు’ (బాలల కథల సంపుటి) & ‘ఇంద్రధనుస్సు’ (సప్త కథా సంపుటి) &

గురుదక్షిణ (కథల సంపుటి ) ; ‘పంచతంత్రం కథలు’ (బొమ్మల బాలల కథల సంపుటి);

పంచామృతం!(సత్య! పంచపదులు)


స్వీయ బ్లాగు(My Blog) : “మనోవేదిక” : Blog – id: http://satya-dsp.blogspot.in


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page