top of page

ఔను, వాళ్లిద్దరు ఇష్టపడ్డారు

#AvunuValliddaruIshtapaddaru, #ఔనువాళ్లిద్దరుఇష్టపడ్డారు, #Kandarpa Murthy, #కందర్ప మూర్తి, #TeluguKathalu, #తెలుగుకథలు

Avunu Valliddaru Ishtapaddaru - New Telugu Story Written By Kandarpa Murthy

Published In manatelugukathalu.com On 04/03/2025

ఔను, వాళ్లిద్దరు ఇష్టపడ్డారు - తెలుగు కథ

రచన: కందర్ప మూర్తి


 "అబ్బబ్బ, ఏమి వేసంగి. ఎండలు దంచేస్తున్నాయ్. ముందు ముందు ఇంకెలాగుంటాయో దేవుడా! ఉస్ " అంటూ ఇంట్లో అడుగు పెడుతూనే గుర్నాథం హాల్లో కుర్చీలో కూలబడ్డాడు. 


"ఎండని గోల పెట్టకపోతే కూర్చొనే ముందు ఫేన్ ఆన్ చేసుకో వచ్చుగా!" అంటూ వంట గదిలోంచి గ్లాస్తో మంచినీళ్లు పట్టుకు వచ్చి ఫేన్ ఆన్ చేసింది భార్యామణి కాంతం. 


"ఈ ప్రబుద్ధుడు ఉండీ ఏం ప్రయోజనం లేదు. చెట్టంత కొడుకు చేతి కొచ్చాడు నీకేమయ్యా అంటారు చూసేవాళ్లు. ఇంట్లోకి కూరలు కూడా తెచ్చే నాథుడు లేడని ముప్పై ఏళ్లు దాటిన కొడుకు పూరీ జగన్నాథాన్ని తిట్టిపోస్తున్నాడు. 


గుర్నాథం పంచాయతీ గుమస్తాగా జీవిత మంతా బండచాకిరి చేసి పదవీ విరమణ చేసాడు. కూతురికి ఉన్నంతలో డబ్బు ఖర్చు చేసి అత్తారింటికి పంపేరు. మిగిలిన ఏకైక పుత్రుడి పెళ్లి గురించే బెంగ పట్టుకుంది. 


"ఈ కరువు రోజుల్లో ఆడపిల్ల పెళ్లి చెయ్యడం కష్టమంటారు కాని ఉన్న ఒక్క ఆడపిల్ల పెళ్ళి నిశ్చింతగా చేసాను. ఈ సుపుత్రుడి పెళ్లి మాత్రం చెయ్యడం నావల్ల కావడం లేదు. పూర్వపు రోజుల్లో ఆడపిల్లల తండ్రులు పెళ్లకొడుకుల కోసం చెప్పులు అరిగేలా తిరిగేవారు. రోజులు మారేయి. ఇప్పుడు పెళ్లికూతుళ్ల గురించి తిరగాల్సి వస్తోంది. " సణుగుతున్నాడు గుర్నాథం. 


పక్కన కూర్చున్న భార్య కాంతం ఈ సోదంతా కొడుకు గురించే అని తెలిసినా రోజులో ఏదో ఒక సమయంలో గుర్నాథం కొడుకు పెళ్లి ప్రస్తావన తెస్తూనే ఉంటాడు. 


నిజమే మరి, జగన్నాథాన్ని చదువుకోరా అంటే ఇంటర్ తో చదువు పూర్తి చేసి స్నేహితులు, తిరుగుళ్లతో కాలం గడుపుతున్నాడు. వాడి నాన్న వీళ్లని వాళ్లనీ పట్టుకుని ఉధ్యోగం వేయిస్తే ఆ పని వాడికి నామోషి అని

 మానేస్తున్నాడు. 


ఒక్కడే కొడుకని గారం చేసినందుకు తగిన ప్రతిఫలమే చూపెడుతున్నాడు. పెళ్లి చేస్తే కుదురుకుంటాడని పెళ్లి సంబంధాలు చూస్తుంటే, అబ్బాయి ఏం చదువు కున్నాడు? ఎక్కడ ఉధ్యోగం? జీతం ఎంత? అని అడుగుతుంటే

 సిగ్గుతో తల దించుకోవల్సి వస్తోంది. ఇలా ముప్పై సంవత్సరాలు దాటి బ్రహ్మచారిగా మిగిలాడు. ఇదో చింత పట్టుకుంది గుర్నాథం దంపతులకు. 


 ఒరిస్సాలోని పూరీ జగన్నాథుని దర్సనం తర్వాత కొడుకు పుట్టాడని భక్తిగా పూరీ జగన్నాథ్ గా నామకరణం చేసారు గుర్నాథం దంపతులు. పూరీ జగన్నాథం మోడరన్ సొసైటీ కుర్రాడు. తండ్రి పెట్టిన పేరు పాత చింతకాయ పచ్చడిలా ఉందని పేరు " పిజె నాథ్" అని మార్పించుకున్నాడు. ఫ్రెండ్స్ మాత్రం " పూరీ" అని ముద్దుగా పిలుస్తుంటారు. 


తండ్రి చదువుకోరా అని కాలేజీలో చేర్పిస్తే స్నేహితులు, సినేమాలు, షోకులతో కాలం వెళ్లదీసాడు. కొన్నాళ్ళు మార్కెటింగ్ సేల్స్ రిప్రజెంటీవ్ గా ఊళ్లంట తిరిగాడు. అందులోను కుదురుకో లేదు. స్నేహితులతో తిరిగి ఏ రాత్రికో ఇంటికి చేరుతాడు. తల్లి తలుపు తీసి లోపలికి తీసుకు వస్తుంది. ఒక్కొక్కసారి మందు కొట్టి వస్తే అప్పుడు అన్నం తినడు. 


ఉదయం పది గంటల వరకు లేవడు. ఎప్పుడూ మొబైల్ ఫోన్లో స్నేహితులతో ఏదో మాట్లాడుతు ఉంటాడు. ఇదేమని తండ్రి అడిగితే ఘర్షణ పడతాడు. తండ్రి కొడుకుల మాటలు వినలేక కాంతమ్మ చెవుల మూసుకుని వంటగదిలో కెల్తుంది. 


 సరైన ఉధ్యోగం చదువు సంపాదన లేదని రెండు మూడు పెళ్లి సంబంధాలు తప్పిపోయాయి. వాస్తవానికి పూరీజగన్నాథం ఈ కాలానికి తగ్గట్టు మోడరన్ గా స్టైల్ గా

 కనబడతాడు. మంచి మాటకారి. సినిమా హీరోల్లా డ్రస్సు హైర్ స్టైల్ మెంటినెన్స్ చేస్తాడు. ఆడపిల్లల్ని ఫస్టు లుక్ లోనే తనవైపు తిప్పుకోగల కెపాసిటీ ఉంది. ఎప్పటికైనా డబ్బున్న పిల్లని వలలో వేసుకుని ఎంజాయ్ చెయ్యాలని ఉవ్విళ్లూరుతున్నాడు జగన్ ఉరఫ్ పిజె నాథ్. 

  *

 ఇటువంటి సాల్తీనే బిజినెస్ మేన్ ఏకాంబరం గారి ఏకైక పుత్రిక పావని. గారాబంగా పెరిగింది. తల్లి చిన్నతనంలోనే చనిపోవడంతో విధన మేనత్త పెంచి పెద్ద చేసింది. డిగ్రీ చదివి మోడరన్ సొసైటీలో పెరిగిన యువతి. 


జీన్స్ పేంట్లు, టి షర్టులతో స్టైల్ గా ఉంటుంది. మేనత్త పద్దతిగా చీర కట్టుకోవే అంటే పాత సంప్రదాయం అని కొట్టి పారేస్తుంది. ఎప్పుడూ స్నేహితులు, బ్యూటీపార్లర్లు, క్లబ్బులు పబ్బులంటు ఎంజాయ్ చేస్తుంటుంది. 


చిరుతిళ్లు పానీపూరి, ఛాట్, పిజ్జా, బర్గర్, ఐస్ క్రీమ్ లాంటి జంక్ ఫుడ్ కోసం ఎగబడుతుంది. సాయంకాలమైతే చాలు ఛాట్ బండార్ దగ్గర ఫ్రెండ్సుతో పానీపూరీ తింటూ కనబడుతుంది. దాని పానీపూరీ పిచ్చికి ఫ్రెండ్స్ పా(వ)ని కి బదులు 'పానీ' అని పిలుస్తూ మజాక్ చేస్తుంటారు. 


 తన మనసుకు నచ్చే హీరో లాంటి అబ్బాయి దొరికే వరకు పెళ్లి చేసుకోనని ఎన్నో మంచి సంబంధాలొస్తే తిరగ్గొట్టేది. వయసు పాతిక పైబడింది. ఏకాంబరానికి కూతురు పెళ్లి గురించి దిగులు పట్టుకుంది. ఎవరైన ఇల్లరికం అల్లుడు కుదిరితే బట్టల వ్యాపారం అప్పగించి విశ్రాంతి తీసుకుందా మనుకుంటున్నాడు. 


ఒకసారి అనుకోకుండా బండి ట్రబులిస్తే హెల్ప్ కోసం చూస్తున్న పావనికి మన హీరో పూరీ నాథ్ ఎదురుపడ్డాడు. బండిని సరిచేసిన హీరోతో పా(వ)ని ఫస్ట్ లుక్ లోనే లవ్ లో పడ్డది. ఇంకేముంది. పక్కనే ఉన్న పానీపూరి బండి వద్ద ఇద్దరూ పానీపూరీ మస్తుగా తిన్నారు. ఇలా పానీ పూరీ

 కలిపింది ఇద్దర్నీ. 


ఒకరోజు సాయంకాలం రోడ్డు మీద మోటర్ బైక్ మీద వెల్తున్న 

 హీరో పిజె నాథ్ కి పానీపూరీ బండి దగ్గర ఫ్రెండ్సుతో పానీపూరీ తింటూ కనబడింది పావని. 


బండి ఆపి పూరి(పిజె నాథ్) 'హలో'' అని విష్ చేసాడు. 

'కమాన్, పూరీ' అంటు తన ఫ్రెండ్స్ కి పరిచయం చేసింది పావని. ఈ హేండ్సమ్ బోయ్ ఫ్రెండ్ ఎప్పుడు పరిచయమయాడా అని మిగిలిన ఫ్రెండ్స్ సంశయంలో పడ్డారు. 


అందరూ పానీపూరీ బండి చుట్టూ చేరి "పానీ, నీకు ఈ పూరీ ఎప్పుడు కలిసా”డని హాస్యమాడారు. జరిగిన విషయం చెప్పింది. ఇలా ఎక్కడో ఒకచోట కలుసుకుంటు పరిచయం పెంచుకున్నారు. పావని టౌన్లో వస్త్ర వ్యాపారి ఏకాంబరం ఏకైక పుత్రిక అని తెలిసి తన రొట్టె విరిగి నేతిలో పడ్డట్టే అనుకుంటున్నాడు పిజె నాథ్ ఉరఫ్ పూరీ. ఒకరికొకరు మనసులు ఇచ్చి పుచ్చుకున్నారు. పూరీ జగన్నాథ్ మాత్రం తన వివరాలు తెలియకుండా జాగ్రత్త పడుతున్నాడు. 


ఒక నిశ్చయానికొచ్చిన పావని ఒకరోజు తండ్రి ఏకాంబరానికి తన మనసులోని మాట చెప్పింది. ఇన్నాళ్లకు కూతురు పెళ్లికి ఒప్పుకుందని ఆనందించినా అబ్బాయి వివరాలు తెలిసిన తర్వాత మిగతా విషయాలు మాట్లడుదామని, ఒకసారి అబ్బాయిని, వారి కుటుంబ సబ్యుల్ని కలియాలని చెప్పాడు. 


పూరిజగన్నాథ్ ఇంటి అడ్రసు తెలుసుకుని ఒకరోజు మధ్యాహ్నం అతనికి తెలియకుండా బండి మీద వచ్చింది పావని. 


గుర్నాథం భోజనం చేసి ఫేను కింద సోఫాలో పడుకుంటే వీధి తలుపు చప్పుడైతే ఎవరా అని కాంతమ్మ వచ్చి తలుపు తీసింది. ఎదురుగా జీన్స్ ఫేంటు, టి షర్టుతో ఆధునాతన యువతి నిలబడి ఉంది. 


"ఎవరు కావాలమ్మా" అని కాంతమ్మ అడగ్గా " జగన్నాథ్ ఇల్లు ఇదేనా, ఆంటీ !" అంది. 


కొడుక్కి మగ స్నేహితులు ఉన్న విషయం తెలుసు కాని ఇటువంటి ఫేషన్ అమ్మాయి ఉందని తెలియదు. ఒకవేళ ఏదైనా తప్పుడు పని చేసాడా అని భయపడుతూ" ఔను, మా అబ్బాయే జగన్నాథ్. వాడి వల్ల ఏదైనా తప్పు జరిగిందా?" అంది ఆందోళనగా. 


"ఆంటీ, లోపలికి రావచ్చా" అంది వినయంగా పావని. 


"అయ్యో, నా మతిమండా! వీధిలో నిలబెట్టి మాట్లాడుతున్నా”నంటు లోపల కుర్చీలో కూర్చోబెట్టి మంచినీళ్లు తేవడానికి వంట గదిలో కెళ్లింది. 


ఈ సందడికి సోఫాలో పడుకున్న గుర్నాథం లేచి కూర్చున్నాడు. ఇంతలో గ్లాస్ తో కూజాలోని చల్లటి నీళ్లు తెచ్చి ఇచ్చింది కాంతమ్మ. 


ఆ మధ్య తరగతి ఇంటి వాతావరణం, ఆదరణ, ఆప్యాయతకు పావని ముగ్ధురాలైంది. తనకు పుట్టినప్పటి నుంచి తల్లి ప్రేమ, ఆప్యాయత తెలియదు. మేనత్త పోషణలో ఆడంబరంగా కష్టమంటే తెలియకుండా పెరిగింది. 

ఏసి భవంతి, ఎప్పుడూ నౌకర్లు పనివాళ్లతో ఏది కావాలంటే అది వెంటనే లబ్యమౌతుంది. తండ్రి మిత్రులు కూడా ధనవంతులు కావడం వల్ల ఆడంబర జీవితమే తప్ప ఇటువంటి మధ్య తరగతి కుటుంబంతో పరిచయమే లేదు. 


"ఎవరమ్మా నువ్వు ? ఇంత ఎండపడి మా ఇంటి కొచ్చావు?" ఆశ్చర్యం ప్రకటిస్తు అడిగారు గుర్నాథం. 


"నా పేరు పావని. శ్రీ నివాసా వస్త్ర భండార్ యజమాని ఏకాంబరం మా నాన్న గారు. మీ అబ్బాయి జగన్నాథ్ ని పెళ్లి చేసుకుందామను కుంటున్నాను. ఎప్పుడూ తన ఇంటి విషయాలు నాతో మాట్లాడ లేదు. 


నేనే వాకబు చేసి మీ ఇంటి అడ్రసు తెలుసుకుని వచ్చాను. ఇటువంటి కుటుంబ వాతావరణం నాకు తెలియదు. మిమ్మల్ని చూసిన తర్వాత మధ్య తరగతి కుటుంబ వాతావరణం ఏమిటో తెల్సింది. అనురాగం ఆప్యాయతలు చీకూ చింత లేని సంసారాలు మీవి. మాలా హంగులు

ఆర్బాటాలు ఉండవు. మరి జగన్నాథ్ అలా జులాయిగా తిరుగుతున్నా డేమిటి ?" మనసు లోని మాట బయట పెట్టింది పావని. 


జగన్నాథం గురించి వారు పడుతున్న బాధను గుర్నాథం దంపతులు బయట పెట్టారు. "మాకు అవకాశం ఉన్నంత వరకు చదివిద్దా మంటే ఇంటర్తో ఆపేసి స్నేహితులతో జల్సాలు చేస్తూ కాలం గడుపుతున్నాడు. ఏ ఉద్యోగంలో స్థిరత్వం లేదు. నేను గవర్నమెంట్ ఆఫీసు నుంచి రిటైరైన చిరు ఉద్యోగిని. నా పెన్షన్ తో మా సంసారం గడుస్తోంది. చేతికి అంది వచ్చిన కొడుకు ఈ వయసులో సహాయంగా ఉంటాడు అనుకుంటే స్నేహితులతో తిరుగుతూ జల్సాలు చేస్తున్నాడు" అని వారి మనోవేదన బయట పెట్టారు గుర్నాథం దంపతులు. 


వారి ఆర్థిక స్థితి, అనురాగ ఆత్మీయతలకు ముగ్ధురాలైన పావని జగన్నాథ్ ని దారిలో పెట్టి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనుకుంది. తను ఇక్కడికి వచ్చి వెళ్లిన విషయం జగన్నాథ్ కి చెప్ప వద్దని మాట తీసుకుని వెళిపోయింది. 


పావని ఇష్టపడిన అబ్బాయి వివరాలు సేకరించిన వస్త్ర వ్యాపారి ఏకాంబరం కూతుర్ని పిలిచి అబ్బాయి జులాయిగా తిరిగే మధ్య తరగతి చిరు ఉద్యోగి కొడుకనీ, తన స్థాయికి తగినవాడు కాదని మరేదైన సంబంధం చూసి ఘనంగా పెళ్లి చేస్తానన్నాడు తండ్రి. 


 పెళ్లి చేస్తే తను ఇష్టపడిన అబ్బాయితోనే చెయ్యండి, లేదంటే తనకు పెళ్లే వద్దని మొండి పట్టు పట్టింది పావని. 


ఆప్యాయంగా పెంచుకున్న ఒక్కగానొక్క కూతురు ఇన్నాళ్లకు పెళ్లికి ఒప్పుకుంది అనుకుంటే ఇలాంటి సంబంధమా అని తర్జనభర్జన పడసాగాడు. కూతురికి పెళ్లి చేసి వస్త్ర వ్యాపారం అల్లుడికి అప్పగిద్దామంటే ఇలాగైంది ఏమిటని ఆలోచనలో పడ్డాడు. ఎలాగైతే అలాగే జరగనీ అని నిశ్చయాని కొచ్చి పెళ్లికి అయిష్టంగానే ఒప్పుకున్నాడు. 


జగన్నాథ్ తల్లిదండ్రుల్ని పెళ్లి సంప్రదింపులకు పిలవమని తండ్రికి చెప్పింది. ఇష్టం లేకపోయినా గుర్నాథం దంపతులకు కబురు పంపించాడు ఏకాంబరం. 


పావని తన మనసులోని మాట జగన్నాథ్ కి చెప్పి కొన్ని షరతులు పెట్టింది. అలాగైతేనే ఈ పెళ్లి జరుగుతుందని చెప్పింది. తన చిరకాల వాంఛ తీరబోతోందని ఎగిరి గంతేసి ఒప్పుకున్నాడు జగన్. 


ఆ షరతులు ఏమిటంటే స్నేహితులతో చెడు తిరుగుళ్లు మానాలని చెడు అలవాట్లకు స్వస్థి పలికి కొంతకాలం బట్టల వ్యాపారంలో తండ్రికి సహాయంగా ఉండాలనీ గుర్నాథం దంపతులకు జీతం రూపంలో నెలనెలా కొంత డబ్బు ముట్ట చెప్పాలని వివరించింది. ఇష్టం లేకపోయినా తను

అనుకున్నది సాధించాలంటే ముందు మార్గం సరి చేసుకోవాలనుకుని సరే నన్నాడు. 


 జగన్నాథ్ రోజూ ఏకాంబరం బట్టల షాపులో ఉద్యోగిలా టైము ప్రకారం షాపు తెరవడం, పనివాళ్ల చేత లోపల శుభ్రం చేయించడం, వచ్చే కష్టమర్లతో మర్యాదగా వ్యవహరించడం, షాపు మూసే వరకు యజమాని ఏకాంబరానికి అన్ని విధాల సహకరించడం చేస్తున్నాడు. 


 జులాయిగా తిరిగే కొడుకులో వచ్చిన మార్పు చూసి గుర్నాథం దంపతులు ఆశ్చర్య పోయారు. చెడు తిరుగుళ్లు మానేసాడు. ఇంటి దగ్గరే ఉంటూ టైము ప్రకారం బట్టల షాపుకి వెళ్లి వస్తున్నాడు. నెల నెలా డబ్బు తెచ్చి తండ్రి గుర్నాథానికి ముట్ట చెబుతున్నాడు. 


ఒక్కసారిగా కొడుకులో వచ్చిన మార్పుకి ఆనంద భరితులయారు ఇద్దరూ. ఇదంతా రాబోయే కోడలి క్రమశిక్షణ అనుకున్నారు. కొద్ది నెలల్లో జగన్ లో ఎన్నో మార్పులు వచ్చాయి. సమయపాలన, మాటతీరు, సంపాదనలో పొదుపు అలవడ్డాయి. 


పావనిలో కూడా చాలా మార్పులు వచ్చాయి. పానీ పూరి చిరుతిళ్లు మానేసి ఇంట్లో వంటకాలనే ఇష్ట పడుతోంది. అల్లరిగా తిరిగే ఫ్రెండ్స్ కి విధాయి చెప్పింది. మేనత్త చెప్పినట్టు సంప్రదాయ వస్త్రధారణ వంటావార్పు నేర్చుకుంటోంది. మేనత్త పనివాళ్ల చేత చేయిద్దామన్నా తనే నేర్చుకుని వంటలు చేస్తోంది. కూతురిలో వస్తున్న ఈ మార్పులకు ఏకాంబరం ఆశ్చర్యపోతున్నాడు. 


కొద్ది నెలలుగా కాబోయే అల్లుడు జగన్నాథం తనకు బట్టల వ్యాపారంలో స్వంత కుటుంబ సబ్యుడిలా సహకరిస్తు ఎంతో కలివిడిగా ఉంటున్నాడు. పావని కూడా జగన్ లో వస్తున్న మార్పుల్ని గమనిస్తు ఇవి తాత్కాలికమా లేక నిజంగానే మారాడా అని చూడసాగింది. 


 జగన్నాథ్ ఇంట్లో కూడా అమ్మా నాన్నలతో అణకువగా భాద్యతగా వ్యవహరిస్తున్నాడని తెలిసి తన ఆలోచన సరైందేనని నిశ్చయాని కొచ్చి తండ్రికి పెళ్లికి సిద్ధమని చెప్పింది. 


శ్రీనివాస వస్త్ర భండార్ యజమాని ఏకాంబరం కూడా జెగన్ వినయం, నడవడిక, వ్యాపారంలో చాతుర్యం చూసి పావని - పూరీ జగన్నాథ్ ల పెళ్లి ఘనంగా జరిపించి తను కూడా వియ్యంకుడు గుర్నాథంతో విశ్రాంత జీవితం సాగిస్తున్నాడు. 


 జులాయిగా తిరిగే జగన్, ఫ్రెండ్సుతో ఆడంబరంగా జల్షాలు చేసే పావని "పానీ పూరి " బండి ధర్మమా అని ఆలుమగలై ఒకటయారు. 

  *

 (మిత్రుడు జి. యస్. కె సాయిబాబాకు ధన్యవాదాలు)


 సమాప్తం


కందర్ప మూర్తి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


  పూర్తి పేరు  :  కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి

  కలం పేరు :  కందర్ప మూర్తి

  పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.

  భార్య పేరు:   శ్రీమతి  రామలక్ష్మి

 కుమార్తెలు:


శ్రీమతి రాధ విఠాల, అల్లుడు  డా. ప్రవీణ్ కుమార్

              

శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్

                  

శ్రీమతి  విజయ సుధ, అల్లుడు సతీష్

                   

  విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే  పత్రికలలో  ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు  చదువులు,  విశాఖపట్నంలో  పోలీటెక్నిక్ డిప్లమో  కోర్సు చదివే రోజుల్లో  1965 సం. ఇండియా- పాకిస్థాన్  యుద్ధ  సమయంలో చదువుకు స్వస్తి  పలికి  ఇండియన్  ఆర్మీ  మెడికల్ విభాగంలో చేరి  దేశ సరిహద్దులు,  

వివిధ నగరాల్లో  20 సం. సుదీర్ఘ సేవల  అనంతరం పదవీ విరమణ  పొంది సివిల్  జీవితంలో  ప్రవేసించి 1987 సం.లో  హైదరాబాదు  పంజగుట్టలోని నిజామ్స్  వైద్య  విజ్ఞాన  సంస్థ  (నిమ్స్ సూపర్  స్పెషాలిటీ  హాస్పిటల్) బ్లడ్ బేంక్  విభాగంలో  మెడికల్ లేబోరేటరీ  సూపర్వైజరుగా  18 సం. సర్వీస్  చేసి  పదవీ  విరమణ  అనంతరం  హైదరాబాదులో కుకట్ పల్లి

వివేకానందనగర్లో  స్థిర  నివాసం.


సుదీర్ఘ  ఉద్యోగ  సేవల  పదవీ విరమణ  తర్వాత  మళ్లా  తెలుగు సాహిత్యం మీద  శ్రద్ధ  కలిగి  అనేక  సామాజిక కథలు,  బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా  బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ, 

బాలభారతం,  బాలబాట, మొలక,  సహరి,  సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి,  గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త  ఇలా  వివిధ  ప్రింటు, ఆన్లైన్  మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.


నాబాలల  సాహిత్యం  గజరాజే వనరాజు, విక్రమసేనుడి  విజయం రెండు  సంపుటాలుగాను, సామాజిక  కుటుంబ కథలు  చిగురించిన వసంతం,  జీవనజ్యోతి   రెండు  సంపుటాలుగా  తపస్వి మనోహరం పబ్లికేషన్స్  ద్వారా  పుస్తక రూపంలో  ముద్రణ  జరిగాయి.


 నా సాహిత్య  రచనలు  గ్రామీణ,  మద్య తరగతి,  బడుగు బలహీన   వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు  సమాజానికి  ఒక సందేశం  ఉండాలని  కోరుకుంటాను.


 


Comments


bottom of page