#NeerajaHariPrabhala, #నీరజహరిప్రభల, #బంధాలుఅనుబంధాలు, #BandhaluAnubandhalu
'Bandhalu - Anubandhalu' - New Telugu Story Written By Neeraja Hari Prabhala
Published In manatelugukathalu.com On 28/09/2024
'బంధాలు - అనుబంధాలు' తెలుగు కథ
రచన: నీరజ హరి ప్రభల
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
శేషయ్యగారు స్కూలు మాస్టరుగా పదవీ విరమణ చేసి తను కష్టపడి కట్టుకున్న ఇంటిలో విశ్రాంత జీవనం గడుపుతున్నారు. భార్య, ఇద్దరు కొడుకులు, ఒక కూతురుతో ఉన్నంతలో ఏ లోటు లేకుండా గౌరవంగా జీవితం గడుపుకొచ్చారు. పిల్లలను తన శక్తికి మించి వాళ్లు కోరుకున్న చదువులు చెప్పించి వాళ్లు ప్రేమించిన వాళ్లతో వివాహం జరిపి, వాళ్ల బాగోగులను కనిపెట్టుకుని, వాళ్లకు అవసరమైనప్పుడు తనకు చేతనైన విధంగా అండగా ఉన్నారు.
వేరే ఊరిలో వాళ్లు మంచి ఉద్యోగాలలో స్థిరపడి, భార్యా బిడ్డలతో సంతోషంగా ఉన్నారు. కూతురిని కూడా మంచి యోగ్యుడైన వాడికిచ్చి వివాహం జరిపించి ఆమె పురుళ్ళు, వగైరా బాధ్యతలను నెరవేర్చారు. ఊరిలో అందరితో తలలో నాల్కలాగా ఉంటూ మంచి పేరు - ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు సంపాదించుకున్నారు. పరువు - ప్రతిష్టలే ఆయన మూలధనము. ఎవరినీ చేయి చాచి అడుగకుండా తనకు ఉన్న దానితోనే తృప్తిగా, ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారు.
ఆయన భార్య అనసూయ కూడా భర్తను అనుసరించి నడుస్తూ ‘ఉత్తమ ఇల్లాలు’గా పేరు తెచ్చుకున్నది. కోడళ్లు కూడ వాళ్లకు అవసరమైనప్పుడు పిల్లల పెంపకము మొ.. వాటిల్లో ఆవిడను రప్పించుకొని కొన్నాళ్లు తమ దగ్గరుంచుకుని పంపేవారు.
కాలక్రమేణా వారి పిల్లలు కూడా పెద్ద వారయ్యారు. ఇంక వీళ్లతో అవసరాలు కూడా తగ్గిపోయాయి. కొడుకులు వాళ్ల ఉద్యోగాలలో ప్రమోషన్లు వచ్చి సంపాదన పెరిగి ఆస్తి - అంతస్థులు, హోదా ఏర్పడి తల్లి తండ్రులతో రాక - పోకలు క్రమేపీ తగ్గించారు. కొడుకులు-కోడళ్లు, మనుమలు వచ్చి తమతో కొంత కాలమన్నా గడపాలన్న శేషయ్యగారి కోరికను వాళ్లు పెడచెవిన పెట్టటమే కాక, పదే పదే చెప్పిన మీదట ఎప్పుడో పండుగకు ఒకసారి వచ్చి ఏదో ముళ్లమీద కూర్చున్నట్లుగా వీళ్ల వద్ద గడిపి “పిల్లలువచ్చారు” అన్న ఆనందం ఆ దంపతులకు తీరకుండానే వెళ్ళొస్తామని బయలుదేరేవారు.
ఎంతో లోతైన సుదీర్ఘ జీవితాన్ని చవి చూసిన ఆ దంపతులు వాళ్లను అర్థం చేసుకుని మెలిగేవారు. ఒక రోజున అనసూయకు బాగా సుస్తీ చేసి కొడుకులకు కబురు చేశారు శేషయ్య గారు.
“అవన్నీ మాములే నాన్నా! మీరు ప్రతి దానికీ కంగారు పడతారు, అమ్మని డాక్టర్ వద్దకు తీసుకెళ్లండి” అన్నారు కొడుకులు.
శేషయ్య తమ ఇరుగు - పొరుగు వారి సాయంతో అనసూయను హాస్పిటల్ కు తీసుకెళ్ళగా డాక్టర్ ఆవిడకు అన్ని పరీక్షలు చేసి 'కిడ్నీ పాడయింది, మార్చాలి' అని చెప్పాడు.
ఇంటికి వచ్చి ఆ విషయాన్ని కొడుకులకు ఫోన్ చేసి చెప్పారు శేషయ్య గారు.
“ఉద్యోగ బాధ్యతలు, పని వత్తిడులతో మేము చాలా బిజీగా ఉన్నాము, అక్కడికి రావడానికి మాకు శలవు దొరకదు, అవసరమైతే కొంత డబ్బు పంపిస్తాము” అన్నారు కొడుకులు.
వాళ్లు తమ బాధ్యతల నుండి తప్పుకున్నారని అర్ధమైంది శేషయ్య గారికి. కూతురుకి విషయం తెలిసి బాధపడి వచ్చి తల్లి తండ్రులను తన వెంట తీసుకుని వెళ్లింది. తన వద్ద కొన్ని నెలలు ఉంచుకుని కంటికి రెప్పలాగా చూసుకుని, సేవచేసి తన కిడ్నీలలో ఒక కిడ్నీని ఇచ్చి తల్లిని బ్రతికించుకున్నది.
కొడుకుల నిరాదరణ, కోడళ్ల నిర్లక్ష్యము అనసూయ మనసును బాగా క్రుంగదీసి ఆ దిగులుతోనే కొన్నాళ్లకు తనువు చాలించినది. ‘మనోవ్యాధికి మందు లేదు కదా’! శేషయ్యగారు ఒంటరి వాడైనాడు. తను కూతురికి భారం కాగూడదనుకుని, కూతురికి నచ్చచెప్పి ఒప్పించి తన ఇంటికి వచ్చి భార్య జ్ఞాపకాలను హృదయంలో పదిలంగా భద్రపరుచుకొంటూ జీవితాన్ని భారంగా నెట్టుకొస్తున్నారు.
బాల్యంలో శేషయ్య మాస్టారు వద్ద విద్యాభ్యాసం చేసిన భాస్కర్ ఆ ఊరికి లెక్చరర్ గా ట్రాన్ఫరయి వచ్చాడు. మాస్టారు చెప్పిన చదువు, నేర్పిన క్రమశిక్షణ, నీతి - నిజాయితీలే తన ఈ ఉన్నతికి కారణమన్న కృతజ్ణతా భావము అతనికి ఎప్పుడూ ఉంది.
భాస్కర్ ఆ ఊరికి వచ్చీరాగానే మాస్టారి ఇంటికి వెళ్లి ఆయనకు పాదాభివందనం చేసి, కుశల ప్రశ్నలు అడిగి, అయన జీవన స్థితిగతులను తెలుసుకొని, కొడుకుల నిరాదరణకు చాలా వ్యధ చెందాడు. పాషాణం వంటి హృదయమున్న వాళ్ల ప్రవర్తనకు ఖిన్నుడయ్యాడు. ఆయనని అడిగి వాళ్ల ఫోన్ నెంబర్లని, వాళ్ల అడ్రసులను తీసుకున్నాడు భాస్కర్. వాళ్లిద్దరూ ఒకే ఊరిలో ఉంటున్నట్లు అర్ధమైంది భాస్కర్ కు. ఆయన వద్ద శెలవు తీసుకుని ఇంటికి వచ్చాడన్న మాటే గానీ, ఆ రాత్రి సరిగా నిద్ర పట్టలేదు.
మరుసటిరోజున వాళ్ల కొడుకులకు ఫోన్ చేసి తనని తాను పరిచయం చేసుకున్నాడు భాస్కర్.
“మిమ్మల్ని ఒకసారి కలవాలనుంది. వద్దామనుకుంటున్నాను” అన్నాడు భాస్కర్.
“తప్పకుండా రండి. ” అన్నారు వాళ్లు. వాళ్లకు వీలైన తేదీని, సమయాన్ని చెప్పి, ఆ సమయంలో భాస్కర్ ను రమ్మని వాళ్లు ఫోన్ పెట్టేశారు.
వాళ్లు చెప్పిన తేదీన, ఆ సమయానికి వాళ్లింటికి వెళ్ళాడు భాస్కర్. అన్నదమ్ములిద్దరూ అక్కడే ఉండి భాస్కర్ కోసం ఎదురుచూస్తున్నారు.
భాస్కర్ రాగానే తనను తాను పరిచయం చేసుకున్నాడు. కాసేపటికి వాళ్లకు తమ తండ్రి పరిస్థితిని వివరించాడు భాస్కర్.
“ఆయన మాకు ఏమిచ్చాడు? ఆస్థులా- అంతస్థులా' ? అన్న వాళ్ల మాటలకు మనస్సు చివుక్కుమంది భాస్కర్ కు,
“ఆయన మీ కన్న తండ్రి. మీ ఈ ఉన్నతికీ, పురోగతికి ఆయనే కదా కారణం. ఆయన ఇప్పటిదాకా మీ దరికి చేరకుండా కాలం గడిపారు, మీ అమ్మ గారు కూడా ఆ దిగులుతోనే కాలం చేశారు.
ఇప్పుడన్నా మీరు మీ తండ్రిని తీసుకొచ్చుకుని మీవద్ద ఉంచుకుని ఆయన్ని ప్రేమగా చూసుకోండి. ఇది మీ బాధ్యత. ఆయన విద్యార్ధిగా నేను చొరవ తీసుకొని మీకు ఈ విషయాలను చెపుదామని వచ్చాను. దయచేసి నన్ను అపార్ధం చేసుకోవద్దు” అని వాళ్లకు హితవు చెప్పాడు భాస్కర్.
”ఆయనను తెచ్చుకుంటే మాకు ఏమి ప్రయోజనము? ఆయనకు సేవలు చేసే ఓపిక, సమయము మాకు లేదు” అన్నారు వాళ్లు.
కుత్సితమైన వాళ్ల మనోగతము అర్థమై వెంటనే వాళ్ల వద్ద శెలవు తీసుకుని ఇంటికి వచ్చాడు భాస్కర్.
ఆ రాత్రి భార్య గీతకు జరిగిందంతా చెప్పి బాధపడ్డాడు భాస్కర్.
"తల్లితండ్రుల యందు దయ లేని పుత్రుడు పుట్టనేమి? వాడు గిట్టనేమి? పుట్టలోని చెదలు పుట్టదా? గిట్టదా? విశ్వదాభిరామ వినుర వేమ". అన్న వేమన శతకంలోని పద్యం చిన్నప్పుడు మీకు మీ మాస్టారు నేర్పించారు అని ఎప్పుడూ చెబుతారు కదా! మీరేమీ బాధ పడద్దు. వాళ్ల కొడుకుల గురించి మనకెందుకు? మనం రేపే మాస్టారి ఇంటికి వెళ్లి ఆయన్ని మనతో ఉండమని కోరి మనింటికి తీసుకొచ్చుకుందాము. ఆయన మనమాట కాదనరు" అన్న గీత మాటలకు సంతసించి భార్యను ప్రేమగా దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకున్నాడు రవి. అతని కౌగిలిలో గువ్వలాగా ఒదిగి పోయింది గీత.
ఆ మరుసటి రోజున భార్యను, కొడుకును తీసుకుని మాస్టారింటికి వెళ్లాడు భాస్కర్. పెరట్లో బాదం చెట్టు క్రింద కుక్కి మంచంమీద పడుకొని నిర్మలమైన ఆకాశం వైపు చూస్తూ, ఏదో పరధ్యానంగా ఉన్న ఆయన వదనాన్ని చూసి వ్యధ చెంది “మాస్టారూ!” అని చేతితో ఆయనని తట్టి పిలువగా, తృళ్లపడి, తెప్పరిల్లి లేచి కూర్చున్నారు శేషయ్య గారు.
భార్యా బిడ్డలతో వచ్చిన భాస్కర్ ని చూసి “ ఏంటి బాబూ! ఇలా వచ్చావు?” అని అడిగారు మాస్టారు.
భాస్కర్ ఆయనకు నమస్కరించి " నేను మీకొడుకు లాంటి వాడినే కదా! నా వద్దకు రండి మాస్టారూ! హాయిగా, ప్రశాంతంగా మాతో ఉందురు గాని" అని తన కొడుకు హర్షను ఆయన చేతిలో ఉంచి “వీడు మీ మనవడు హర్ష. ఇకనుండీ వీడితో హాయిగా ఆడుకుందురు గాని. మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది” అని హర్షతో “తాతయ్యా”! అని పిలువమన్నాడు భాస్కర్.
వాడు తన ముద్దు ముద్దు మాటలతో “తాతయ్యా!” అని పిలువగా మరింత మురిపెంగా వాడిని చూస్తూ గుండెలకు హత్తుకున్నారు శేషయ్య గారు.
గీత కూడా “రండి మనింటికి. మిమ్మల్ని నా కన్న తండ్రి లాగా చూసుకుంటాను. మీకు ఏ లోటు రానివ్వను” అని చెప్పగా ఆయన అంగీకరించారు.
భాస్కర్ తనచేయి అందివ్వగా ఆయన వాళ్లింటికి బయలుదేరారు. గీత ఆయన బట్టలను కొన్నిటిని ఒక సంచీలో సర్ది ఇంటికి తాళం వేసి, బాబుని ఎత్తుకుని వాళ్లను అనుసరించింది.
శేషయ్య గారు తన శేష జీవితాన్ని ప్రశాంతంగా భాస్కర్ వద్ద వెళ్ళదీసుకుంటూ “బంధమంటే ఇదేనేమో!” అనుకుని మనసులోనే ఆ భగవంతునికి కృతజ్ణతలు తెలుపుకొని, తనను కంటికి రెప్పలాగా చూసుకుంటున్న భాస్కర్ కుటుంబం మరింత వృధ్ధిలోకి రావాలని మనసారా ఆశీర్వదించారు.
.. సమాప్తం ..
నీరజ హరి ప్రభల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ నీరజ హరి ప్రభల గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం :
Profile Link:
Youtube Play List Link:
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు
నా గురించి పరిచయం.....
నా పేరు నీరజ హరి ప్రభల. మాది విజయవాడ. మావారు రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మాలతి, మాధురి, మానస. వాళ్లు ముగ్గురూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ భర్త, పిల్లలతో సంతోషంగా ఉంటున్నారు.
నాకు చిన్నతనం నుంచి కవితలు, కధలు వ్రాయడం చాలా ఇష్టం. ఆరోజుల్లో వాటిని ఎక్కడికి, ఎలా పంపాలో తెలీక చాలా ఉండిపోయి తర్వాత అవి కనుమరుగైనాయి. ఈ సామాజిక మాధ్యమాలు వచ్చాక నా రచనలను అన్ని వెబ్సైట్ లలో వ్రాసి వాటిని పంపే సౌలభ్యం కలిగింది. నా కధలను, కవితలను చదివి చాలా మంది పాఠకులు అభినందించడం చాలా సంతోషదాయకం.
నా కధలకు వివిధ పోటీలలో బహుమతులు లభించడం, పలువురి ప్రశంసలనందుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
మన సమాజంలో అనేక కుటుంబాలలో నిత్యం జరిగే సన్నివేశాలు, పరిస్థితులు, వాళ్లు పడే బాధలు కష్టాలు, ధైర్యంగా వాటిని ఎదుర్కొనే తీరు నేను కధలు వ్రాయడానికి ప్రేరణ, స్ఫూర్తి. నా కధలన్నీ మన నేటివిటీకి, వాస్తవానికి దగ్గరగా ఉండి అందరి మనస్సులను ఆకర్షించడం నాకు సంతోషదాయకం. నిత్యం జరుగుతున్న దారుణాలకు, పరిస్ధితులకు నా మనసు చలించి వాటిని కధల రూపంలోకి తెచ్చి నాకు తోచిన పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తాను.
నా మనసులో ఎప్పటికప్పుడు కలిగిన భావనలు, అనుభూతులు, మదిలో కలిగే సంఘర్షణలను నా కవితలలో పొందుపరుస్తాను. నాకు అందమైన ప్రకృతి, పరిసరాలు, ఆ సుందర నైసర్గిక స్వరూపాలను దర్శించడం, వాటిని ఆస్వాదించడం, వాటితో మమేకమై మనసారా అనుభూతి చెందడం నాకు చాలా ఇష్టం. వాటిని నా హృదయకమలంలో అందంగా నిక్షిప్తం చేసుకుని కవితల రూపంలో మాలలుగా అల్లి ఆ అక్షర మాలలను సరస్వతీ దేవి పాదములవద్ద భక్తితో సమర్పిస్తాను. అలా నేను చాలా దేశాల్లలో తిరిగి ఆ అనుభూతులను, అనుభవాలను నా కవితలలో, కధలలో పొందుపరిచాను. ఇదంతా ఆ వాగ్దేవి చల్లని అనుగ్రహము. 🙏
నేను గత 5సం… నుంచి కధలు, కవితలు వ్రాస్తున్నాను. అవి పలు పత్రికలలో ప్రచురణలు అయ్యాయి. పుస్తకాలుగా ప్రచురించబడినవి.
“మన తెలుగు కధలు.కామ్. వెబ్సైట్” లో నేను కధలు, కవితలు వ్రాస్తూ ఉంటాను. ఆ వెబ్సైట్ లో నాకధలకి చాలా సార్లు నగదు బహుమతులు వచ్చాయి. వస్తున్నాయి. అనేక ప్రశంసలు లభించాయి. వాళ్ల ప్రోత్సాహం జీవితాంతం మరువలేను. వాళ్లకు నా ధన్యవాదాలు. ఆ వెబ్సైట్ వాళ్లు రవీంద్రభారతిలో నాకు “ఉత్తమ రచయిత్రి” అవార్డునిచ్చి ఘనంగా సన్మానించడం నా జీవితాంతం మర్చిపోలేను. ఆజన్మాంతం వాళ్లకు ఋణపడిఉంటాను.🙏
భావుక వెబ్సైట్ లో కధల పోటీలలో నేను వ్రాసిన “బంగారు గొలుసు” కధ పోటీలలో ఉత్తమ కధగా చాలా ఆదరణ, ప్రశంసలను పొంది బహుమతి గెల్చుకుంది. ఆ తర్వాత వివిధ పోటీలలో నా కధలు సెలక్ట్ అయి అనేక నగదు బహుమతులు వచ్చాయి. ‘మన కధలు-మన భావాలు’ వెబ్సైట్ లో వారం వారం వాళ్లు పెట్టే శీర్షిక, వాక్యానికి కధ, ఫొటోకి కధ, సందర్భానికి కధ మొ… ఛాలెంజ్ లలో నేను కధలు వ్రాసి అనేకమంది పాఠకుల ప్రశంశలను పొందాను. ‘మన తెలుగుకధలు. కామ్ వెబ్సైట్ లో “పశ్చాత్తాపం” అనే నా కధకు విశేష స్పందన లభించి ఉత్తమ కధగా సెలక్ట్ అయి నగదు బహుమతి వచ్చింది. ఇలా ఆ వెబ్సైట్ లో నెలనెలా నాకధలు ఉత్తమ కధగా సెలెక్ట్ అయి పలుసార్లు నగదు బహుమతులు వచ్చాయి. వస్తున్నాయి.
ఇటీవల నేను వ్రాసిన “నీరజ కథాకదంబం” 175 కధలతో పుస్తకం, “ఊహల అల్లికలు” 75 కవితలతో కూడిన పుస్తకాలు వంశీఇంటర్నేషనల్ సంస్థ వారిచే ప్రచురింపబడి మా గురుదంపతులు ప్రముఖ వీణావిద్వాంసులు, రాష్రపతి అవార్డీ శ్రీ అయ్యగారి శ్యామసుందరంగారి దంపతులచే కథలపుస్తకం, జాతీయకవి శ్రీ సుద్దాల అశోక్ తేజ గారిచే కవితలపుస్తకం రవీంద్ర భారతిలో ఘనంగా ఆవిష్కరించబడటం, వాళ్లచేత ఘనసన్మానం పొందడం, బహు ప్రశంసలు, అభినందనలు పొందడం నాఅదృష్టం.🙏
ఇటీవల మన మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడి గారిచే ఘనసన్మానం పాందడం, వారి అభినందనలు, ప్రశంసలు అందుకోవడం నిజంగా నా అదృష్టం. పూర్వజన్మ సుకృతం.🙏
చాలా మంది పాఠకులు సీరియల్ వ్రాయమని కోరితే భావుకలో “సుధ” సీరియల్ వ్రాశాను. అది అందరి ఆదరాభిమానాలను పొందటమే కాక అందులో సుధ పాత్రని తమ ఇంట్లో పిల్లగా భావించి తమ అభిప్రాయాలను చెప్పి సంతోషించారు. ఆవిధంగా నా తొలి సీరియల్ “సుధ” విజయవంతం అయినందుకు చాలా సంతోషంగా ఉన్నది.
నేను వ్రాసిన “మమతల పొదరిల్లు” కధ భావుకధలు పుస్తకంలో, కధాకేళిలో “మంచితనం-మానవత్వం” కధ, కొత్తకధలు-5 పుస్తకం లో “ప్రశాంతినిలయం” కధ, క్షీరసాగరంలో కొత్తకెరటం పుస్తకంలో “ఆత్మీయతానుబంధం”, “గుర్తుకొస్తున్నాయి” పుస్తకంలో ‘అత్తింటి అవమానాలు’ అమ్మకు వ్రాసిన లేఖ, మొ…కధలు పుస్తకాలుగా వెలువడి బహు ప్రశంసలు లభించాయి.
రచనలు నా ఊపిరి. ఇలా పాఠకుల ఆదరాభిమానాలు, ఆప్యాయతలే నాకు మరింత రచనలు చేయాలనే ఉత్సహాన్ని, సంతోషాన్నిస్తోంది. నా తుది శ్వాస వరకు మంచి రచనలు చేయాలని, మీ అందరి ఆదరాభిమానాలను పొందాలని నా ప్రగాఢవాంఛ.
ఇలాగే నా రచనలను, కవితలను చదివి నన్ను ఎల్లప్పుడూ ఆశ్వీరదిస్తారని ఆశిస్తూ
మీ అభిమాన రచయిత్రి
నీరజ హరి ప్రభల.
విజయవాడ.
Photo Gallery
Comments