top of page
Writer's pictureIndumathi Palegaru

చెల్లని నోటు

 #IndumathiPalegaru #ఇందుమతిపాలేగారు #చెల్లనినోటు #ChellaniNotu #TeluguStoryOnSoiledNote #తెలుగుకథ


'Chellani Notu' - New Telugu Story Written By Indumathi Palegaru

Published In manatelugukathalu.com On 27/09/2024

'చెల్లని నోటు' తెలుగు కథ

రచన : ఇందుమతి పాలేగారు

కథా పఠనం: పద్మావతి కొమరగిరి



“సార్ ఈ నోటు బాలేదు వేరే నోటు ఇవ్వండి” అన్నాడు కండక్టర్ నలిగిన నోటుని తిరిగి ఇచ్చేస్తూ. 


వేరే నోటు ఇచ్చి టికెట్ తీసి జేబులో వేసుకున్నాడతను. 


బస్ దిగి నడుచుకుంటూ కూరగాయల సంతకి వెళ్లాడు. కుప్పగా పోసిన బెండకాయల్ని కొనల్ని విరిచి లేతగా ఉన్నవాటిని ఏరి తూకం వేసాక ఆ నలిగిన నోటుని ఇచ్చాడు. ఆ నోటు ని తిరిగి ఇచ్చేస్తూ “వేరే నోటుంటే ఇయ్యండి ఇది మారదు” అంది ఆవిడ. వేరే నోటు తీసి ఇచ్చాడు. ఆ నోటు జేబులోకొచ్చి కూర్చుంది. 


సంత అంతా తిరిగి బేరమాడి కావల్సిన కూరగాయలు కొన్నాడు. బ్యాగు సగానికి నిండింది కాని ఆ నలిగిన నోటు మాత్రం జేబుని అంటి పెట్టుకుని కూర్చుంది. చివరగా ఆ నోటుని పండ్లమ్మే అతనికి అంటగట్టేయాలనుకుంటూ

“కిలో బత్తాయి, అర్థ కిలో దానిమ్మ ఇవ్వు” అంటూ నలిగిన నోటు ని బావున్న నోట్ల మధ్యలో పెట్టేసి ఇచ్చాడు. 


పండ్లమ్మే అతను ఇచ్చిన అన్నీ నోట్లని విడి విడిగా తీసి చూస్తూ “ఇది ఎవరు తీసుకోరన్నా వేరేది ఉంటే ఇయ్యి” అన్నాడు హుషారుగా. మళ్లీ తిరిగొచ్చి ఆ నోటు జేబులో కూర్చుంది. 

అరచేతిలో ఉన్న నోటుని అసహనంగా చూస్తూ ఆ నోటు ఎలా వచ్చింది? ఎవరిచ్చారు? అని ఆలోచించుకుంటూ ముందుకు నడిచాడు. ఆ ఒక్క నోటుని మార్చడం కోసం బ్యాంకుల చుట్టూ తిరగలేడనిపించింది. సరే పోనిలే వంద రూపాయలే కదా అని వదులుకోడానికి మనసొప్పలేదు. ఎవరికో ఒకరికి ఇచ్చేసి చేతులు దులిపేసుకోవాలనుకున్నాడు. చాలా వరకు అందరూ ఇలానే ఆలోచిస్తారు సమస్య నుండి బయటపడాలనుకుంటారు తప్ప సమస్యని పరిష్కరించుకోవాలనుకోరు. 


ఆ నోటు ఎన్నో చేతుల్ని దాటుకుని రావడం వల్ల అంచుల చివర నలిగిపోయి మధ్యలో కూడా చిల్లులు పడి అక్కడక్కడా పెన్ ఇంకు మరకలు కూడా ఉన్నాయి. అరచేతిలో నోటు చెమటకి తడిచి కాస్త మెత్తబడింది. 


చేతిలో చెమట తడికి నోటు చిరిగిపోక ముందే మార్చేయాలి అనుకుంటూ పెద్ద బట్టల షాపు ముందు పూల బుట్టని పెట్టుకుని ఉన్న ముసలావిడ దగ్గరికి వెళ్లాడు. పూలన్నీ అమ్మేసి ఒకటి రెండు మూరలున్నట్టున్నాయి. అతను వెళ్లగానే “రెండు మూరలున్నాయి యాభైకి ఇచ్చేస్తానయ్యా తీసుకో” అంది. 


అతను చేతిలో ఉన్న వంద రూపాయల నోటుని పూర్తిగా వీడదీసి నోటితో ఊది ముసలావిడ ముందు చాపాడు. 


ముసలావిడ నోటు తీసుకుని పైకెత్తి చూసి “వేరే నోటు ఉంటే ఇయ్యండయ్య” అంది. 

అతను జేబులోకి తడిమి చూసి “లేదు ఇదే ఉంది. లేదంటే పువ్వులొద్దులే” అని అన్నాడు. 

అలా చెప్తే వేరే దారి లేక తీసుకుంటుందని అతని తెలుసు. ముసలావిడ వచ్చిన చివరి బేరాన్ని వదులుకోలేక అన్యమనస్కంగానే నలిగిన నోటుని తీసుకుంది. ఏదో విధంగా ఆ నోటు మార్చేయగలిగాడన్న సంతోషంతో పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ గర్వంగా ఇంటి దారి పట్టాడు అతను. 

 ******

పూలమ్మే ముసలావిడ వెనక ఉన్న బట్టల షాప్ లో ఎన్నో రోజులుగా చూస్తూనే ఉన్న ప్యాంటు చొక్కా తగిలించిన బొమ్మ ఇంకా అక్కడే ఉంది. రోజు ఆ చొక్కా ప్యాంటుని చూస్తూ అదైతే మనవడికి బాగుంటుందని మనస్సులోనే ఊహించుకుంటూ ఉంది. కొన్ని రోజులుగా కూడ బెట్టుకుంటూ వచ్చిన డబ్బుని, ఈ రోజు పూలు అమ్మగా వచ్చిన డబ్బుల్ని కలిపి కొనేయ్యాలని షాపు లోకి వెళ్లింది. బొమ్మకి తగిలించి ఉన్న చొక్కా ప్యాంటుని చూపిస్తూ

“ఈ ప్యాంటు చొక్కా కావాల. ఎంతవుతాది?” అంది ముసలావిడ ఆ బొమ్మకి ఉన్న బట్టల్ని తడిమి చూస్తూ. 


“వెయ్యి రూపాయలు డిస్కౌంటు పోగా ఎనిమిదొందలకి ఇస్తారు” అన్నాడు సేల్స్ అబ్బాయి. 

ఆ బొమ్మ కి ఉన్నబట్టల్ని చూస్తూ “మా మనవడికి పుట్టిన రోజొస్తాంది. ప్యాంటు చొక్కా కావల్నని అడుగుతా ఉన్నేడు. ఈ బొమ్మ మారిగానే చామన ఛాయగా ఉంటాడు. ఈ రంగు వాడికి బాగుంటాది గదా?” అంది ముసలావిడ బట్టల్ని తడుముతూనే. 


“బాగుంటాది లేవ్వా” అన్నాడు సేల్స్ అబ్బాయి. 


తిత్తిలో డబ్బు లెక్కపెట్టి చూసుకుంది. ఆ నలిగిన నోటుతో కూడా కలిపితే ఎనిమిదొందల ఇరవై రూపాయలు ఉంది. బేరమాడే ప్రయత్నం చేసింది గాని షాపులో బేరాలు ఉండవని, డిస్కౌంట్ అని వివరించి చెప్పడంతో మారు మాట్లాడకుండా, బట్టల్ని తీసుకుని క్యాష్ కౌంటర్ దగ్గరికి వెళ్లింది. ఎనిమిదొందలు అనగానే మడిచిన నోట్లని విడదీసి లెక్కపెట్టి ఇచ్చింది. 


క్యాష్ కౌంటర్ అతను మరో సారి లెక్క పెడుతూ “ఈ నోటు బాలేదు, చెల్లదు గూడా వేరే ఉంటే ఇయ్యమ్మా అన్నాడు. మిగిలిన ఇరవై తప్ప ఇంకేం లేదు తిత్తిలో, కొంగు చివరన, జాకెటు సందున చూసుకుని ఇదే ఉంది నాయనా అంది. 


“మరి ఈ నోటు మారదే ! నన్నేం చెయ్యమంటావు?” అన్నాడు నిట్టూరుస్తూ. 


“మారుతుందిలేయ్యా అంది నసుగుతూ. 


“ఈ నోటు చెల్లదవ్వా.. కావాలంటే రేపొచ్చి తీసుకో డ్రెస్సు పక్కన పెట్టిస్తా అన్నాడు క్యాష్ కౌంటర్ అతను బొమ్మని సేల్స్ అబ్బాయి వైపు విసిరేస్తూ. 


“ఈ డబ్బులు రేపిటి దాకా ఉండవు నాయనా.. నా మొగుడు గాని చూస్నేడా ఎత్తుకొని తాగి సస్తాడు” అంది మెల్లగా. 


“ఆ నోటు మారదు నువ్వు రేపు రాపో” అన్నాడు క్యాష్ కౌంటర్ అతను, ముసలావిడ వెనక లైన్ లో ఉన్న వాళ్లని రమ్మని సైగ చేస్తూ. వెనక లైన్ లో ఉన్న వాళ్లంతా బిల్ కట్టేసి కవర్లు పట్టుకుని వెళ్లిపోతూ ఉన్నారు. చెల్లని నోటుని తీసి చూసి “దీన్నెక్కడ మార్చుకుంటారు?” అని అనుకుంటూ ఆ విసిరిన బొమ్మ వైపే చూస్తూ బయటకి వచ్చేసింది. 


డబ్బుల్ని తిత్తిలో పెట్టి “ఆ చొక్క ప్యాంటు ఎవరు కొనుక్కోకపోతే బాగుండు. రేపైనా కొనేయ్యాలి అనుకుంది మనస్సులో.. 

***

ఇందుమతి పాలేగారు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:

పేరు  ఇందుమతి పాలేగారు , స్వస్థలం చిత్తూరు జిల్లా. బి టెక్ పూర్తి చేసుకుని ఐటీ లో ఉద్యోగం చేస్తున్నాను. కథలు , కవితలు చదవడం అంటే ఇష్టం. ఆ ఇష్టం తో సరదాగా రాయటానికి ప్రయత్నిస్తున్నాను.


50 views0 comments

Comments


bottom of page