బతుకు పచ్చని సంతకం
- Kotthapalli Udayababu
- Jan 30
- 12 min read
#KotthapalliUdayababu, #కొత్తపల్లిఉదయబాబు, #BathukuPachhaniSanthakam, #బతుకుపచ్చనిసంతకం, #StoryOnTeachers, #గురుశిష్యులు

Bathuku Pachhani Santhakam - New Telugu Story Written By - Kotthapalli Udayababu
Published In manatelugukathalu.com On 30/01/2025
బతుకు పచ్చని సంతకం - తెలుగు కథ
రచన : కొత్తపల్లి ఉదయబాబు
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
“నాన్నగారూ! ఏదీ మీ ఫోన్? ఇలా ఇవ్వండి?’’ అంటూనే రాధాకృష్ణ ఫోన్ తీసుకుని చూసి, గూగుల్ ఫిట్ యాప్ పరిశీలించి అన్నాడు ప్రతాప్. తప్పు చేసినవాడిలా చూశాడు రాధాకృష్ణ.
"ఫోన్ పుచ్చుకుని కారిడార్లో నడవమన్నాను కదా.. కనీసం రోజుకి ఆరు వేల అడుగులు వేయకపోతే ఎలా చెప్పండి. పోనీ నేను ఆఫీస్ కు పర్మిషన్ పెట్టి నడిపించనా?’’ అడిగాడు తండ్రిని.
"అదికాదురా.. తిన్నాకా నడుద్దాం అనుకుంటాను. నడవకపోతే బద్ధకం- నాలుగడుగులు నడిస్తే ఆయాసం వచ్చేస్తోంది’’ అన్నాడాయన..
ప్రతాప్ తండ్రి ముందు మోకాళ్ళమీద కూర్చుని అన్నాడు.
"మీరు గుర్తు తెచ్చుకోండి నాన్న. చిన్నప్పుడు నన్ను అందరూ "బీర పొట్ట" అని ఏడిపించేవారు. అప్పుడు మీరే కదా మీ పనులన్నీ మానేసి ‘గోడాట’ నేర్పించారు. మర్చిపోయారా?’’
చకితుడైనట్టు చూశాడు రాధాకృష్ణ.
"పిల్లాడికి ఏ చొక్కా వేసిబొత్తాలు పెట్టినా మధ్యలో బోత్తాలన్నీ వూడిపోయి ఆఖాళీలోంచి తెల్లని బొజ్జ బయటకు వచ్చి అందరి దృష్టి తగులుతోంది. ఇంటికి వఃచ్చాకా టీవీ ముందు శిలావిగ్రహం వేషం మానేసి వాడి సంగతి చూడండి.’’ అని హెచ్చరించింది భార్య.
ఇక తప్పదని చేతిలోకి టెన్నిస్ బాల్ తీసుకుని తాను ఇంటి హాలులో మధ్య కూర్చుని ఒక గోడవైపు బంతిని దొర్లించి దానిని తీసుకురమ్మన్నాడు ప్రతాప్ ని. ప్రతాప్ బుడి బుడి అడుగులు నడుచుకుంటూ వెళ్ళి బంతి తీసుకురావడం మానేసి గోడను పట్టుకుని నియబడి తనకేసి నవ్వుతూ చూశాడు.
ఎంతముద్దోస్తున్నాడో అనుకుని పట్టుకోబోతే, దొరక్కుండా రెండోవైపు గోడదగ్గరకు వెళ్ళి ఒకచేత్తో దానీమీద చేయివేసి నిలబడి తనకేసి గర్వంగా చూశాడు. మళ్ళీ అదే విధానంలో ఆగకుండా పరుగులు తీస్తుంటే తనకే జాలి వేసి మధ్యలో పట్టుకుని కొడుకుని తనివితీరా ముద్దాడాడు. అలా మొదలైంది ప్రతాప్ ’గోడాట’.
ఈవేళ తన వయసు ఉడిగి కీళ్లనొప్పులతో బాధపడుతున్నాడు. టీవీ ముందర కాలక్షేపం పేరుతో చతికిలపడిపోవడంవల్ల పొట్టలో కొవ్వు ఇంకా పెరిగిపోయింది.
"ఏమిటి ఆలోచిస్తున్నారు. లెండి. ఈవేల్టినుంచే మీరు నా గోడాట ఆడటం మొదలు పెట్టాలి. ఆరోజు మీరు నేర్పిన ఆ వ్యాయామమే ఈవేళ నేను ఇంత ఫిట్ గా ఉండటానికి కారణం. రండి. ’ అంటూ ’చల్లగా ఉన్న తన చేతిని వెచ్చని తన చేతుల్లోకి తీసుకున్న కొడుకుని మురిపెంగా చూస్తూ లేచి నిలబడ్డాడు రాధాకృష్ణ.
కోడలు తనని ఎన్నోసార్లు హెచ్చరించి ప్రయోజనం లేక వాడికి చెప్పినట్టుంది. "ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుగా.. అటో.. ఇటో.. ఎటోవైపు.. ’’ సినీ రచయిత రాసిన పాట గుర్తుకు వచ్చింది.
రాధాకృష్ణ అడుగులువేయడం ప్రారంభించాడు కొడుకు చేయి పట్టుకుని. పదడుగులు బానే వేశాడు. అంతలోనే ఆయాసం మొదలైంది. ప్రతాప్ వదలలేదు.
"ఆయాసంగా అనిపిస్తోందా? ఇంకా నెమ్మదిగా నడవండి. నేను పట్టుకున్నాను. మీకేం భయం లేదు’’ అన్నాడు. అలా అడుగులో అడుగు వేయిస్తూ పదిహేను నిముషాలు అతినెమ్మదిగా నడిపించాడు ప్రతాప్.. తండ్రికి పట్టిన చెమటలు చూసి అతనికే జాలి వేసింది. తీసుకువచ్చి సోఫాలో కూర్చుండ జేసి ఫాన్ ఒకటిలో పెట్టి మంచినీళ్లు అందించాడు. రాధాకృష్ణ నెమ్మదిగా తాగాడు.
"మళ్ళీ రేపు ఉదయం. ఇలా ఒక వారం రోజులు చేశారంటే ‘నన్ను కాసేపు నడిపించరా అబ్బాయి’ అని మీరే అడుగుతారు. ఆతరువాత మీరు మన వీధిలో ఆచివరనుంచి ఈ చివరకు మీరే నా సాయం లేకుండా నడిచేస్తారు. సరేనాండీ?’’ అన్నాడు ప్రతాప్.
"నువు తోడుగా ‘ఆసరా’గా ఉంటానంటే తప్పకుండా నడుస్తాను. నా అంతట నేను నడిచే ధైర్యం వచ్చేంతవరకు ఆసరాగా ఉండు చాలు’’ అన్నాడు రాధాకృష్ణ.
"సరేనండీ’’ అన్నాడు ప్రతాప్.
"ఆయన బద్ధకించినా నేను వూరుకొను మమయ్యా. ఆయనకి గుర్తుచేస్తాను. ’’ అంది కోడలు సంధ్య నవ్వుతూ.
*****
సుమారు నెలరోజులకే తండ్రి గూగుల్ ఫిట్ యాప్ లో రోజుకు ఆరువేల అడుగులు దాటి నడవడం గమనించిన ప్రతాప్ కి చాలా ఆనందం అనిపించింది. ఆమాటే రాధాకృష్ణ తో అంటే..
"ఏమిటోరా.. వ్యాయామం చేసి చెమటలు పట్టిన శరీరాన్ని తనకు చూపిస్తే గానీ మానాన్న చద్దెన్నం తినడానికి అనుమతించేవాడు కాదు. వృత్తిలో ఉండగా ఆరోగ్యం గురించి ఎందరికో ఎన్నెన్నో నీతులు చెప్పేవాడిని.. అతి సుఖం మనిషికి సోమరితనం పెరిగేలా చేస్తుంది. ఈవేళ మీచేత చెప్పించుకున్నందుకు సిగ్గు పడుతున్నాను. ఇపుడు నా శరీరం తేలికపడి హాయిగా నా అంతటా నేను నడవగలుగుతున్నాను.’’ అన్నాడు.
"అందుకే ఈ వేళ ఆయన ఆఫీసు నుంచి వచ్చాకా సాయంత్రం మన కాలనీ ఆఖరి వీధిలో "’ప్రభ’’ అని నా స్నేహితురాలి ఇంటికి వెళ్ళి వద్దాం మావయ్య.. దగ్గరే.. మనది 3 వ వీధి.. వాళ్ళది 8 వ వీధి. నడిచి వేళ్లొద్దాం ఏమంటారు?’’ అడిగింది సంధ్య.
"తప్పకుండా అమ్మా’’అన్నాడు రాధాకృష్ణ.
సాయంత్రం కొడుకు ఆఫీసునుంచి రాగానే రాధాకృష్ణ కొడుకు, కోడలు, ఇద్దరు మనవలతో సునాయాసంగానే నడిచి సంధ్య స్నేహితురాలైన ప్రభ ఇంటికి వచ్చారు.
తాము వస్తామని ముందే తెలియజేయడంతో ప్రభ ఇల్లు అద్దంలా ఉంచింది.
"రండి మేడమ్. రండి అంకుల్ " అంటూ స్వాగతించింది అందరినీ.
ప్రభ కుటుంబాన్ని పరిచయం చేసాకా, ప్రభ ఇద్దరి పిళ్లతో కలిసి తనపిల్లలు కూడా ఎదురుగా ఉన్న పార్క్ లోకి ఆడుకోవడానికి వెళ్లారు. అందరూ స్థిమితంగా కూర్చున్నాకా సంధ్య రాధాకృష్ణ తో అంది.
"మావయ్యా. ప్రభ వాళ్ళు నా చిన్నప్పుడు మేముండే పక్కవాటాలో అద్దెకుండేవారు. వాళ్ళ అమ్మగారు పిల్లల చిన్నప్పుడే విషజ్వరం వచ్చి నలభై లంఖనాలు చేసి కోలుకోలేక చనిపోయారు. వాళ్ళ నాన్నగారు ఆర్. టి. సి. గారేజీలో మెకానిక్ గా చేసేవారు. పెద్దమ్మాయికి పెళ్లి చేసేశారు.
ఇక ఆయన చీటీలు కట్టి దాచిన డబ్బుతో తనకు పెళ్లి చేద్దామనుకున్నారు. ఆ చీటీల కంపెనీ బోర్డు తిప్పేసిందన్న వార్త వినగానే ఆయన ఒక్కసారి కుప్పకూలిపోయి పక్షవాతం పాల పడ్డారు. పెద్దల్లుడు కూతురు ముఖం చాటేయడంతో అపుడు ఆయనతో ఆర్. టి. సి. లో కండక్టర్ గా పనిచేస్తున్న ‘భుజంగరావు’ అనే అతను ప్రభను పెళ్లిచేసుకున్నాడు.
అతనికి చదువు అంటే చాలా చాలా ఇష్టమట. ఆరోజుల్లో ఏడవ తరగతిలో అతనికి "ప్రతిభ’’ అవార్డ్ కూడా వచ్చిందట. జిల్లా కలెక్టర్ గారు స్వయంగా సన్మానించి మెచ్చారట. వాళ్ళ నాన్నగారు "మేము దారిఖర్చులు పెట్టుకుని జిల్లా కేంద్రానికి తీసుకువెళ్లలేము.’’ అంటే తాను చదువే పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దగ్గరుండి తీసుకువెళ్లారట. అప్పటినుంచి అతన్ని సొంతకొడుకు సాకినట్టు సాకేవారట. ఆ ఫోటో మా మావయ్యగారికి చూపించు ప్రభా.’’ అంది సంధ్య మధ్యలో చెప్పడం ఆపేసి.
ప్రభ చమర్చిన కళ్ళతో కార్డ్ సైజు ఫోటోలు పెట్టిన ఆల్బమ్ అలమారులోంచి తీసుకువచ్చి సంధ్యకి అందించింది.
సంద్య రాధాకృష్ణ కి ఇచ్చింది, కళ్ళజోడు సరిచేసుకుని ఆల్బమ్ మొదటిపేజీ తిప్పాడు రాధాకృష్ణ.
అది భుజంగరావుకు కలెక్టర్ గారు ప్రతిభా అవార్డ్ గా శాలువా కప్పి, ప్రభుత్వ అధికారిక జ్ఞాపిక, ప్రశంసా పత్రం, పుష్పగుచ్చం, డబ్బు ఉన్న కవరు అందిస్తున్న ఫోటో అది. అన్నీ పట్టుకోలేక సతమవుతుంటే డబ్బున్న కవరు తన ప్రధానోపాధ్యాయుని చేతికిచ్చి చిరునవ్వుతో తీయించుకున్న ఫోటో.
సన్నగా బక్కగా ఆరోజుల్లో సినీ హీరో లెక్కన ఉన్న ఆ ప్రధానోపాధ్యాయుడు ఎవరో కాదు.. తానే.
“ఏడమ్మా? వాడు.. ఎక్కడ. ఒక్కసారి పిలువు. చడామడా కడిగేస్తాను వెధవని’’ సంభ్రమంతో అన్న రాధాకృష్ణ మాటలకు సంధ్య, ప్రతాప్ లతో పాటు ప్రభ కూడా విస్తుబోయింది.
“ఈ ఫోటో చూడరా అబ్బాయ్.. నువు అప్పుడు ఆరో తరగతి.. వాడు ఏడోతరగతి. నువు ‘అన్నయ్యా’ అని పిలిచేవాడివి. గుర్తొచ్చిందా?’’ అడిగాడు రాధాకృష్ణ.
రాధాకృష్ణ కళ్ళు జ్ఞాపకాల చురుకుదనం తో ఒక్క క్షణం మెరిసాయి.
ఫోటో ని పరిశీలించి అన్నాడు. “అవును నాన్నగారు. మీరే. అపుడు ఎంత సన్నగా ఉండేవారో.. అతను భుజంగరావు అన్నయ్యే.. ’’అన్నాడు సంతోషాతిరేకంతో.
“ఏమిటల్లా వింతగా చూస్తారు? ఆ ఫోటో లో వాడి పక్కన ఉన్నది ఎవరనుకున్నారు? నేనే. ఎంతబాగా చదివేవాడు? నాకిప్పటికి బాగా గుర్తు. ఒక్క లాంగ్వేజెస్ లోనే తొంభై ఎనిమిది, తొంభై ఆరు.. అలా వచ్చేవి తప్ప మిగతా మూడు నాన్-లాంగ్వేజెస్ లోనూ ప్రతీ పరీక్షలోను వందకి వంద మార్కులు. ఒక జిల్లాపరీషత్ ఉన్నత పాఠశాలలో అలా చదివే కుర్రాడిని చూడటం అదే మొదటిసారి నాకు.. వాడిని సరియైన దారిలోనడిపిస్తే "జిల్లా కలెక్టర్" అవుతాడని ఎనిమిదవ తరగతి నుంచి పదవ తరగతి వరకు వాడిమీద ఎంతో శ్రద్ధ చూపించి నా కన్నబిడ్డ అయిన మీ ఆయన్ని కూడా పెద్దగా పట్టించుకోకుండా అటు పాఠశాలలోనూ, ఇటు ఇంటికి రప్పించి మరీ శిక్షణ ఇచ్చాను.
వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్ళి ‘మీ అబ్బాయికి నేను ప్రైవేట్ చెబుతాను. వాడిని పంపించవయ్యా..’ అంటే ఏమన్నాడో తెలుసా?
"మీ మాస్టర్లు ప్రైవేట్ కి అని పిల్లల్ని ఇంటికి పిలిపించుకుని అడ్డమైన బజారు పనులూ చేయించుకుంటారు. నాకు చదువు చెప్పిన మాస్టారైతే నాచేత సైకిలు తుడిపించుకునేవాడు, సిగరెట్టు పాకెట్లు తెప్పించుకునేవాడు. నేను ఫీజుకూడా ఇచ్చే స్థితిలో లేను. నేను పంపను " అని నన్ను చీదరించుకున్నాడు.
"మీ అబ్బాయి మా పాఠశాలలో చదివినంతకాలం నా కన్న బిడ్డలా చూసుకునే పూచీ నాది. ’’ అని హామీ ఇచ్చిన మీదట ఒప్పుకుని నా ఇంటికి పంపాడు.
అయితే తరగతి పెరిగే కొద్దీ వాడిలో కొద్ది మార్పు రావడం గమనించాను. నా దగ్గర మాత్రం ఎంతో వినయ విధేయతలతో ఉండేవాడు. ఆడపిల్లల్ని పాఠశాల బయట అల్లరి చేసేవాడట. నాతో చెబుతానని ఆడపిల్లలు అంటే, ‘సార్ కి నేను దత్తపుత్రుణ్ణి. సార్ నన్ను ఏమీ అనరు. ’ అనే వాడట. నా గణితం, భౌతిక శాస్త్రాల్లో ఎపుడు వందకి వంద మార్కులే. వయసు వస్తున్న కుర్రవాడిని మరీ నియంత్రించడం మంచిది కాదు అనుకుని "వాడికి నేను నచ్చచెబుతానమ్మా. ’’ అని సర్ది చెప్పాను ఆడపిల్లలకి.
ఆ ప్రతిభా అవార్డును ఇపుడూ ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయి. చాలా సంతోషించాల్సిన విషయం. అలాంటి ఉత్తమ విజయాన్ని పెద్దయ్యాకా కూడా అందమైన అపురూపమైన జ్నాపకంగా చదువుకోవడానికి వీలుగా "డైరీ’’ రాయడం నేర్చుకో. అని సలహా ఇచ్చి ఎలా రాయాలో నేర్పించి పాటింపచేశాను.
వాడు కొత్త విషయం నేర్చుకుని రాసుకొచ్చినప్పుడల్లా నాకు చూపించేవాడు. "ఇతరుల డైరీ నేను చదవకూడదురా. ’’ అంటూ తిరిగి ఇవ్వబోతే "ఇది మీరు నేర్పిన విద్య మాష్టారు. రోజూ చదువుకోవడానికి కూర్చున్నప్పుడల్లా ‘ప్రతిభా’ అవార్డ్ పొందిన రోజు జ్నాపకం చదువుకుంటుంటే నన్ను మీరు వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్నట్టే అనిపిస్తోంది సర్. మీరు చదవకపోతే ఇక డైరీ రాయను సర్. ’’ అన్నాడు. వాడి తృప్తికోసం చదివాను.
వాడు చాలా తెలివైనవాడు. వాడు చేసే మంచిపనులు, గ్రహించిన మంచి విషయాలు రాసి చూపించేవాడు. అన్నీ నమ్మిన నేను వాడి వయసు వాడిని కోరికల్ని అదుపు చేయలేకపోయింది అని వాడు నా పాఠశాల వదిలి వెళ్లినప్పుడు గానీ తెలియలేదు. పదో తరగతి లో వాడికి ప్రతిభ అవార్డ్ రాలేదు. పట్టణ స్థాయిలో ప్రధముడిగా వచ్చాడంతే.
"ఇదేమిటిరా అబ్బాయి.. ఇలా చేశావు?’’ అన్నాను.
వాడు తలదించుకున్నాడు అంతే తప్ప సమాధానం చెప్పలేదు. కానీ తరువాత తెలిసింది అతను ఎనిమిదిలో ఉండగానే తన సహవిద్యార్ధీని ‘సుందరి’ ప్రేమలో పడ్డాడని, అది ఇంజనీరింగ్ లో చేరే వరకూ కొనసాగిందనీ.. అందుకే వాడు ‘చదువు’లో తగ్గి ‘ప్రేమలో ఎదిగాడని.
ఆ సుందరి అన్న అమ్మాయి మా పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుని కూతురు. వాడితోపాటు పోటీగా చదివేది. వాడికి అరమార్కు ఎక్కువ వస్తే తాను చేసిన తప్పు చూసుకోకుండా వాడి జవాబుపత్రం తీసుకుని చూసి వెళ్ళి వాళ్ళ నాన్నకు ఫిర్యాదు చేసేది. అతను నాతో వాదించేవాడు.
‘మీకు వాడంటే అభిమానం’ అని కుళ్ళుకునేవాడు. తన కూతురు చేసిన తప్పులేమిటో పోల్చి చెప్పేవాడిని. దాంతో నోరుమూసేవాడు అతను.
ఇంటర్ చదివేటప్పుడు ప్రతీ జనవరి ఒకటవ తేదీన, గురుపూజోత్సవం నాడు తప్పకుండా ఏదో సమయంలో వచ్చి కనిపించి వెళ్తూ ఉండేవాడు. ఒక వేళ రాలేకపోతే ఫోన్ లో అయినా శుభాకాంక్షలు చెప్పేవాడు. ఒకసారి నేను మీ అమ్మ ద్వారకాతిరుమల వెంకటేశుని దర్శనానికి ఆరోజు ఉదయం మొదటి బస్ ఎక్కితే అప్పుడు చూశాను ఆర్. టి. సి. కండక్టర్ గా మొదటిసారి డ్యూటీలో ఉండగా.
"నువు చదివింది ఇంజనీరింగ్ కదా.. ’’ అన్నాను.
తలవంచుకుని టిక్కెట్లు కొట్టి నా చేతుల్లో పెట్టాడు తప్ప ఛార్జీలు తీసుకోలేదు. "తప్పయ్యా.. దైవదర్శనఫలం నాకు దక్కదు’’ అని డబ్బులు ఇవ్వబోతే.. ‘మీరు నాపాలిట దేవుడు సర్. నేనే ఆ దైవాన్ని కాలదన్నుకున్నాను. ’’ అన్నాడు. బస్ దిగబోతుంటే మా కాళ్ళకు నమస్కరిస్తే వింతగా అడిగారు ఒకరిద్దరు. ’ఎవరు?’ అని.
"నన్ను ఇంతవాడిని చేసిన మా మాస్టారు’’ అని వినయంగా వాళ్ళకి చెబుతోంటే కడుపునిండా అన్నం తిని తృప్తిగా త్రేన్చి ‘అన్నదాతా సుఖీభవ’ అని దీవించిన అతిధిదేవుడిలా కనిపించాడు వాడు.
ఆతర్వాత నాకు ఆవూరినుంచి బదిలీ అయిపోయింది. వాడి వివరమూ తెలియలేదు.
"ఒకసారి వాడిని చూడాలని ఉంది. డ్యూటికి వెళ్లాడా ? ఒకసారి ఫోన్ అయినా చేసి ఇవ్వమ్మా.. మాట్లాడతాను. ’’ అన్నాడు రాధాకృష్ణ.
"అతను.. అతను లేడు మావయ్యగారు. మీరు చెప్పిన ఆ సుందరి చేసిన మోసం వల్ల ఆత్మహత్య చేసుకున్నాడు. "అంది సంధ్య.
కలతనిద్ర లో ఉన్న బిడ్డ భయంతో ఒక్కసారిగా కెవ్వుమన్నప్పుడు ఆలంబన కోసం తల్లి పొత్తిళ్లలో దూరిన పసిబిడ్డ మనసుల మూల్గింది రాధాకృష్ణ మనసు.
"ప్రభను పెళ్లి చేసుకున్నాకా కూడా ఆ అమ్మాయి తన భర్తతో ఉంటూనే తనకు అవసరమైనప్పుడల్లా డబ్బు అడిగి తీసుకుని, ఆవిషయం భర్త కళ్ళలో పడ్డప్పుడు భుజంగరావే ‘ఎంత డబ్బైనా ఇస్తాను. ఒక్కసారి నా కోరిక తీర్చమని డబ్బిస్తున్నాడండీ.. ’’అని అబద్ధం ఆడటంతో ఆమె భర్త చుట్టుపక్కలవాళ్లతో కలిసి అతన్ని కొట్టారట. ఆ అవమానం భరించలేక అతను అటునుంచి అటే ఎదురోస్తున్న రైలుకు అడ్డంగా వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నాడట. అతని తాలూకు ఉద్యోగం వస్తుందేమోనని ఆఫీసుల చుట్టూ తిరిగితే పై అధికారులు ‘తననే’ లంచంగా అడిగారట.
అనుకోకుండా ఒకరోజు మా ఆఫీసులో అటెండర్ పోస్ట్ కోసం ఇంటర్వ్యూ కి వచ్చి నాకు కనిపించింది. నేను మా బాస్ గారితో ఆమె పరిస్తితి వివరించి చెప్పడంతో ఆయన పెద్దమనసుతో ఆమెకు ఉద్యోగం ఇచ్చారు. అందుకు కృతజ్నతగా అవసరమైనప్పుడు బాస్ గారి ఇంట్లో సాయం చేస్తూ ఆ పిల్లలిద్దర్ని ‘ప్రభుత్వ పాఠశాలలో ‘ చదివించుకుంటోంది. " అంది సంధ్య.
అంతలో "అమ్మా.. మంచినీళ్లు ఇవ్వవా.. ’’ ఆడుకుని అలసిపోయి వచ్చిన భుజంగరావు పిల్లలు మంచినీళ్లు తాగి వచ్చాక రాధాకృష్ణ వాళ్ళ ఇద్దరినీ దగ్గరగా పిలిచాడు. అమ్మాయి అచ్చంగా భుజంగరావు పోలికలోనే ఉంది. అబ్బాయిది తల్లిపోలిక. వారు యే యే తరగతులు చదువుకుంటున్నారో అడిగాడు. ప్రభకు అభ్యంతరం లేకపోతే తాను వారిద్దరికి తన మనవలతో పాటు చదువు చెబుతాను అన్నాడు.
ప్రభ తన ఇద్దరి పిల్లలతో రాధాకృష్ణ కాళ్లమీద పడింది. "మీరు అంతమాట అన్నారు. నాకు అదే చాలు నాన్నగారు. ’’ అంది కన్నీళ్లతో.
సరిగ్గా అప్పుడు ‘జ్ఞాపకం’ వచ్చింది రాధాకృష్ణకి. "ఇంటికి వెళ్ళి తన బీరువాలో ఉన్నఆ ‘ఫైల్’ తీసుకురా నాన్నా.. ’’ కొన్ని గుర్తులు చెప్పి ప్రతాప్ కి పురమాయించాడు. అతను ఆ ఫైల్ తెచ్చేలోగా పిల్లల చదువును ఎన్నోరకాలుగా పరిశీలించాడు రాధాకృష్ణ.
ప్రతాప్ తన చేతికి ఇచ్చిన ఆ ఫైల్ చుట్టూ ఉన్న జిప్ తీసి అందులో భద్రంగా దాచిన "ప్రతిభ అవార్డ్’’ ప్రశంసాపత్రం తో పాటు మరో సర్టిఫికేట్ ను కూడా బయటకు తీశారు ఆయన సంధ్యకు ఇచ్చాడు. సంధ్య ఆశ్చర్యంతో దాన్ని చదివి ప్రభకు అందించింది. ప్రభ వణుకుతున్న చేతులతో దాన్ని అందుకుంది. ఆమె కళ్ళు కన్నీటిమొగ్గలేసిన సరసులయ్యాయి.
నైపుణ్యం కలిగిన కళాకారుడి చేత అత్యద్భుతంగా రాయబడిన "కలువకొలను భుజంగరావు’’అన్న భర్త అక్షరాలను ఆమె అపురూపంగా స్పృశించడం రాధాకృష్ణ గమనించాడు.
అనంతరం రాధాకృష్ణ ఆమెను దగ్గరగా పిలిచి ఒక బాంక్ డిపోజిట్ రశీదు అందించాడు. దాన్ని చూడగానే ఆమె కళ్ళు పెద్దవయ్యాయి.
"ఏమిటి బాబుగారు ఇది?’’ అడిగిందామే ఆశ్చర్యపోతూ.
“అది మీ ఆయన కష్టార్జితం అమ్మా. ఆరోజు.. అవార్డ్ అందుకుని తిరుగుప్రయాణం లో బస్ లో వస్తున్నప్పుడు మీ ఆయన నాతో ఒక మాట అన్నాడు. ’సార్. మా నాన్నకు చదువు విలువ, దానివల్ల లభించిన ఈ అవార్డ్ విలువ తెలియదు. అందుకని ఆ డబ్బు మీదగ్గరే ఉంచండి సర్. ఇంట్లో అయితే దేనికో ఒకదానికి ఖర్చుపెట్టేస్తారు. మిగతావన్ని ఇంట్లో చూపిస్తాను. ’’ ఇంట్లోను, పాఠశాలలోనూ అందరికీ చూపించాకా దాన్ని మళ్ళీ తీసుకువచ్చి నాకు అప్పగించాడమ్మా.
‘సర్టిఫికేట్ తీసుకెళ్లవయ్యా.. నీకు స్ఫూర్తిగా ఉంటుంది’.. అంటే.. ’నేను డైరీలో రాసుకున్నాను కదా సర్. ఇక నేను చదువు మొదలుపెడితేనే మీరు నా కళ్ళముందు నిలబడతారు. ఈ సర్టిఫికేట్ నా పిల్లలకి చూపించాలి. వాళ్ళకి మీగురించి చెప్పాలి. ఒకవేళ నేను ఎప్పుడైనా పొరపాటు చేస్తే నన్ను ‘ చేర్నాకోలా’లా అది హెచ్చరించాలి. అందుకే నా పెళ్లి అయ్యాకా మీరెక్కడున్నా వచ్చి అడిగి తీసుకుంటాను సర్. ’’ అని నాదగ్గరే ఉంచి వెళ్లిపోయాడమ్మా.
అపుడు అతనికి 750రూపాయలు అవార్డుగా ఇచ్చారు. నేను ఎంత ఆనందించానో మాటల్లో చెప్పలేను. వాడికృషిని ప్రోత్సహిస్తూ నేను 4500 రూపాయలు కలిపి రు. 5000 కు పెంచి దానిని ప్రతీసంవత్సరం రెన్యూవల్ చేస్తూ వస్తున్నాను. ఆ సొమ్ము నీకు, నీ పిల్లలకు చెందింది. ఆతరువాత నుంచి నేను పనిచేసిన ప్రతీ పాఠశాలలోనూ పదవ విద్యార్హులను ప్రోత్సహిస్తూ.. వారిలో స్పూర్తి కలిగేలా ఈ సర్టిఫికేట్ చూపించి భుజంగరావు గురించి ఉద్యోగవిరమణ చేసే వరకు చెబుతూనే వచ్చాను.
భుజంగరావు ఏదో ఒకనాడు నన్ను వెతుక్కుంటూ వస్తాడని నేను ఎదురు చూస్తూనే ఉన్నాను ఈనాటికీ. నా అంచనా నిజమైతే వాడు డైరీలో ఈ విషయం రాసుకుని ఉండాలి. పిచ్చివాడు. సరళరేఖలా లక్షాన్ని నిర్దేశించుకుని ఆ గమ్యాన్ని చేరుకోవాలని ప్రయత్నం చేసే ఎందరో విద్యార్ధులు టీనేజ్ వయసులో వచ్చే మార్పులవల్ల ‘అమ్మాయి’ల పట్ల ఏర్పడుతున్న ఆకర్షణ ని ‘ప్రేమ’ అనుకుని తమ లక్ష్యామార్గాన్ని మర్చిపోతున్నారు. వాటన్నినుంచి మనసును నియంత్రించుకునేటందుకు ఈనాటి విద్యావిధానం లో పిల్లలకి చిన్ననాటినుంచే ధ్యానం, యోగా, వ్యాయామం మొదలైనవన్ని నేర్పుతున్నారు. పాపం ఆనాడు అవన్నీ లేక భుజంగరావూ తన మనసును జయించుకోలేకపోయాడు. ’’ అన్నాడు రాధాకృష్ణ బాధగా.
అంతలో ప్రభ లోపలికి వెళ్ళి వచ్చి రాధాకృష్ణకి ఒక చీరల కవరులో భద్రంగా దాచిన, నల్లని అట్టవేయబడి రంగు మాసిన కాగితాలున్న డైరీ తెచ్చి అందించింది. దాన్ని అందుకుని మొదటి రెండు మూడు పేజీలు తిప్పిన రాధాకృష్ణ నిటారుగా అయ్యాడు.
అది భుజంగరావు డైరీ.. తనకు ఆ సంవత్సరం రెండు మూడు డైరీలు వస్తే, ఒకటి అతనికి ఇచ్చి జీవితంలో జరిగే అతి ముఖ్య అపురూప సంఘటనలు ఎలా రాయాలో నేర్పాడు. ఆ డైరీలో సగం పేజీలు కూడా పూర్తికాలేదు. అన్నేళ్లు అదే డైరీ వాడినట్టుగా ఆ డైరీలో ప్రింట్ అయిన తేదీని కొట్టివేసి వేయబడ్డ తేదీలన్నీ రకరకాల సంవత్సరాలవి.
ఆయన చకచకా పేజీలు తిరగేశారు వేగంగా చదువుతూనే.
అతను చివరగా రాసిన రెండు పేజీలలో-
“మాష్టారూ.. మీకు నా ప్రణామాలు. నాకు ప్రతిభ అవార్డ్ వచ్చినప్పటినుంచి నా కన్నతండ్రి కన్నా ఎక్కువ శ్రద్ధ తీసుకుని ప్రోత్సహించారు. కానీ నేను ఎంత ప్రయత్నించినా చదువు మీద దృష్టి కేంద్రీకరించలేకపోయాను. కారణం నా మనసుకు తెలుసు. కానీ మీకు చెప్పుకోలేను. అలా అని నా మనసుని నియంత్రించుకోలేకపోయాను.
మీ సమక్షంలో నా శరీరం మంచుగడ్డలా అయిపోయేది. కానీ నేను ఒంటరిగా ఉంటే ‘నిప్పులా’ కాలిపోయేది. డైరీలో రాసుకున్న స్పూర్తివాక్యాలున్న పేజీ కళ్ళముందు తెరిచే ఉంటోంది. కానీ నాలో అవి ఎలాంటి ఉత్తేజాన్ని కలిగించలేకపోతున్నాయి.. స్నేహితుల బలవంతంతో తాగుడు అలవాటు చేసుకున్నాను. ఆలోచనలు నన్ను బాధపెట్టకుండా మనసును మత్తులో జోకొట్టేశాను.
ఓడిపోతున్నాను మాష్టారు. నన్ను నేను మళ్ళీ వెలిగించుకునేటందుకు మీదగ్గరకు రావాలి మాష్టారు. కానీ భయం మాస్టారు.. మీరు ఏమంటారో అని భయం.
నిర్మలంగా ప్రేమించిన మగవాడు తట్టుకోలేనిది ఆడదాని నిర్లక్ష్యం మాష్టారు. ఆ నిర్లక్ష్యం ఎలాంటిదంటే ‘‘ప్రపంచంలో ఉన్న తెల్లదనమంతా పోగేసిన మనసు కాగితాన్ని వెచ్చని రక్తం లో ముంచిన పదునైన కత్తితో నిర్దాక్షిణ్యంగా లోతుగా పొడవడం. ’’ అది తట్టుకోలేకపోతున్నాను.
‘తమ్ముడికి కూడా చెప్పండి సార్’ అని నేనంటే.. ’’వాడికింకా ఒక సంవత్సరం సమయం ఉందిరా’’ అనేవారు.. కన్నబిడ్డలకన్నా కొద్దికాలం పాటుమాత్రమే ఉండిపోయే శిష్యులపట్ల మీకు, మీ టీచర్లకు ఎందుకుసార్ అంత ప్రేమ? మేము గొప్పవాళ్ళమైతే ‘వాడు నాశిష్యుడు’ అని చెప్పుకునే సంతృప్తికోసమేనా?
పాపం నా భార్య వట్టి అమాయకురాలు. తనకు అన్యాయం చేసేసి ఇద్దరు పిల్లల్ని కనేశాను. ప్రేమావేశంలో ఏమైపోతానో తెలియడం లేదు మాష్టారు. ఈవేళ యేసంగతీ తేల్చేసుకుంటాను మాష్టారు. మీ పాదాలపై పడి నా తప్పులన్నీ ఒప్పుకుని మరీ ఏడవాలని ఉంది సారు. ఏదో ఒకరోజున మీ దగరకు తప్పకుండా వస్తాను. నాకు.. నా కుటుంబానికి మీ ఆశీసులు కావాలి మాస్టారు. మీ ప్రోత్సాహం, ప్రేమ ఈ దుష్టుడు అందుకోలేకపోయాడు సార్. కనీసం నా పిల్లలకు అందజేయడం కోసమైనా మీదగ్గరకు వస్తాను మాష్టారు. వస్తాను.
నమస్కారాలతో - భుజంగరావు. ’’
రాధాకృష్ణ మనసంతా గరళం మింగిన శివునిలా అయిపోయింది. కళ్ళతో పాటు మనసు కూడా కన్నీటి చెలమలా ఆర్ద్రమైపోయి ఆసరా కోసం "నాన్నా.. ప్రతాప్. ’’ అన్నాడు.
ప్రతాప్, సంధ్య ఒక్క అంగ లో ఆత్రంగా దగ్గరగా వచ్చారు ’’నాన్న.. ఎమోషన్ అవుతున్నారా.. ప్లీజ్ రిలాక్స్.. రిలాక్స్ అవండి’’ అన్నాడు తండ్రి రెండు చేతుల్ని తన చేతుల్తో పట్టుకుని. ప్రభ మంచినీళ్లు అందివ్వబోతే మనవడు సంధ్య బాగ్ లోంచి యాపిల్ ఓ. ఆర్. ఎస్. పేకట్ స్ట్రా వేసి ఇచ్చాడు. అది తాగి అయిదు నిముషాల్లో తేరుకున్నాడు రాధాకృష్ణ.
"ప్రభా.. భగవంతుడు ఎన్ని విచిత్రాలు చేస్తాడు? ఎంతటి వింత ఈవేళ మిమ్మల్ని ఇలా కలవగలగడం?మీ పేర్లు ఏమిటర్రా?’’ నెమ్మదిగా అడిగాడు.
“నాపేరు సరోజీని. అన్నయ్య పేరు వివేకానంద తాతగారు. ’’ అంది ప్రభ కూతురు.
"అలాగా.. రోజూ మీరిద్దరు వచ్చి మాఇంట్లో చదువుకుంటారా? "అడిగాడు రాధాకృష్ణ. వాళ్ళిద్దరూ ప్రభ కేసి చూశారు. వెంటనే ప్రభ బాంక్ డిపోజిట్ సెర్టిఫికేట్ ఆయన చేతుల్లో పెట్టి రాధాకృష్ణకి నమస్కరించి వినయంగా అంది.
“బాబుగారు. ఆ డబ్బు వాళ్ళ నాన్న కష్టార్జితం. దాని పునాదులమీద వాళ్ళ భవితవ్యం నిలబడాలి. ఆ డబ్బునే పెట్టుబడిగా పెట్టి అదే బాంక్ లో పిల్లలిద్దరి పేరుమీద జాయింట్ ఖాతా తెరిపించి పెట్టండి. నేను పొదుపు చేసే డబ్బు కూడా దానిలో వేస్తాను. వాళ్ళు ఉన్నత స్థితిలోకి రావడం కన్నా నాకు మరే కోరిక లేదు సర్. నా పిల్లలకు మీరే చదువు చెబుతాను అంటున్నారు. మళ్ళీ జన్మంటూ ఉంటే మీ కొడుకుగా పుట్టి ఆ రుణం తీర్చుకుంటాను సర్. ’’ అంది.
"ఇపుడు మాత్రం నా కోడలితో పాటు నువ్వు రెండో కూతురివే.. భుజంగరావు నీ బిడ్డల భవిష్యత్తుపై "బ్రతుకు పచ్చని సంతకం’’ చేశాడమ్మా. ఎక్కడున్నా అతని ఆత్మ సంతోషిస్తుంది. అమ్మా ప్రభా.. మంచి నిర్ణయం తీసుకున్నావ్.. శుభం భూయాత్. " అని ప్రతాప్ చేతులు పట్టుకుని ముందుకు అడుగువేసిన ఆయనను అనుసరించారు సంధ్య, మనవలు.
నెమ్మదిగా దూరమవుతున్న ఆ మానవతామూర్తి కుటుంబానికి తల్లి చేతులు జోడించి నమస్కరిస్తుంటే సరోజినీ, వివేకానంద తల్లిని అనుసరించారు.
సమాప్తం
కొత్తపల్లి ఉదయబాబు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
పేరు : కొత్తపల్లి ఉదయబాబు పుట్టిన తేదీ : 01/07/1957 విద్యార్హతలు : M.Sc., M.Ed., M.phil (maths) నిర్వహించిన వృత్తి : ప్రధానోపాధ్యాయులు
తల్లి తండ్రులు : శ్రీ కొత్తపల్లి గంగాధర్ శర్మ, విశ్రాంత హెడ్ పోస్ట్-మాస్టర్ స్వర్గీయ శ్రీమతి సుబ్బలక్ష్మి. భార్య : శ్రీమతి సూర్యకుమారి కుమార్తె : చి. సౌ. గుడాల సుబ్బ లక్ష్మి సంతోషిత , M.B.A. w/o లక్ష్మికాంత్ – లాయర్ మనుమరాలు : చి. లక్ష్మి పూర్ణ సాధ్వి కుమారుడు : చి. హనుమ గంగాధర్ శర్మ , సాఫ్ట్-వేర్, h/o చి.సౌ.తేజశ్రీ మనుమలు : చిరంజీవులు గహన్ ముకుంద, ఋషిక్ వశిష్ట.
*వృత్తి పరంగా :
*జిల్లాస్థాయి, రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనల పోటీలలో వివిధ అంశాలలో బహుమతులు, క్విజ్,సాంకేశృతిక కార్యక్రమాల నిర్వహణ, న్యాయ నిర్ణేతగా వ్యవహిరించిన అనుభవం.
*పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 2002 లో తొలిసారిగా ఐదుగురు విద్యార్థులకు నూటికి నూరు మార్కులు రావడం ఆ సందర్భంగా అరకాసు ఉంగరం బహుమతిగా అందుకోవడం ఒక చక్కని ప్రోత్సాహం, ఉత్సాహం. అలా మొత్తం సర్వీసులో నూటికి నూరు మార్కులు దాదాపు తొంభై మందికి పైగా విద్యార్థులు పొందగలగడం వృత్తిపరంగా సంతృప్తిని కలిగించిన విషయం.
*జిల్లా స్థాయిలో అధికారికంగా నిర్వహించిన భౌతిక శాస్త్ర,గణిత శాస్త్ర సదస్సులకు రిసోర్స్ పర్సన్ గా వ్యవహరించడం.
*జిల్లా ఉమ్మడి పరీక్షల సంస్థకు అయిదు సంవత్సరాలపాటు ఎక్కువమంది విద్యార్హులు గణితంలో ఉత్తీరర్ణతాశాతం పొందదానికి అవసరమైన విజయ సూచిక, విజయ సోపానాలు... పుస్తకాలను ప్రభుత్వం తరపున రూపొందించుటలో ''గణిత ప్రవీణుడు''గా వ్యవహరించడం.
*ఆకాశవాణిలో కథానికలు, నాటికల ప్రసారం,అవగాహనా సదస్సులలో పాల్గొనడం, రేడియో నాటక కళాకారునిగా మూడు సంవత్సరాలు విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో పాల్గొనడం..మొదలైనవి
ప్రవృత్తి పరంగా :
*కథా రచయితగా రచనలు :
1. అందమైన తీగకు...! - 25 కధల మాలిక (2003) 2. చిగురు పిట్టలు* - నానీల సంపుటి (2007) 3. ఉదయబాబు మాస్టారి' కధానికలు - ఉదయకిరణాలు (2015) 4. అమ్మతనం సాక్షిగా... కవితా సంపుటి (2015) 5. నాన్నకో బహుమతి - 16 కథల సమాహారం (2019-.) జీ.వి.ఆర్. కల్చరల్ అసోసియేషన్ వారు నిర్వహించిన కథాసంపుటుల పోటీలలో ద్వితీయ బహుమతి పొందిన కథల సంపుటి) 6. ఆయన మా నాన్నగారు ( దీర్ఘ కవిత - త్వరలో )
నవలలు : 1 . లేడీ సింగర్ (2 భాగాలు )
2 . మనసు చేసిన న్యాయం(ప్రతిలిపి వారు మార్చి 2202 లో నిర్వహించిన ధారావాహికల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొందినది)
ప్రేరణ : నాన్నగారు...ఆయన నాటక రచయిత,దర్శకుడు,ఉత్తమ నటుడు(18 నాటక పరిషత్తులలో)
*సామాజిక సేవ : రక్తదాన కార్యక్రమం లో, లయన్స్ క్లబ్ వారి కార్యక్రమాలలో విరివిగ పాల్గొనడం .
తెలుగు సాహిత్యానికి సేవ : తెలుగు సాహితీ సమాఖ్య లో కార్యకర్తగా, సంయుక్త కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షునిగా తెలుగు సాహిత్యానికి విశేష కృషి , జిల్లా స్థాయిలో ర్యాలీల నిర్వహణ ...అష్టావధానం, త్రీభాషా శతావధానం లలో పృచ్చకునిగా 46 సంవత్సరాలపాటు ప్రతీ నెల సాహితీ స్రష్టల ప్రసంగాలు...విద్యార్హులకు వివిధములైన పోటీల నిర్వహణ,
పత్రికా రంగం లో : వ్యంగ్య చిత్రకళ లో పలు కార్టూన్లు వేయడం. :*1999 - జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు - పశ్చిమ గోదావరి జిల్లా*
2000 - యువసాహితీ సహస్రాబ్ది అవార్డు - ఆంద్ర ప్రదేశ్ సాంస్కృతిక సమాఖ్య 2011 - సోమేపల్లి సాహితీ పురస్కారం 2016 - గోదావరి మాత అవార్డు - ఉంగుటూరు ఎం.ఎల్.ఎ, శ్రీ గన్ని వీరంజనేయులుగారి చే- గణపవరం - పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఎం.ఎల్.ఎ. శ్రీ వి.వెంకట శివరామరాజు గారి చే ''ఉగాది పురస్కారం*
పాలకొల్లు - కళాలయ సంస్థవారిచే " కధాభారతి" బిరుదు ప్రదానం.
*జన విజ్ఞానవేదిక - భీమవరం వారిచే " ఉగాది పురస్కారం" ....సుమారు నూటికి పైగా సన్మానాలు సత్కారాలు...ఇంకా ఎన్నో..
Youtube :1. తెలుగు కథను ప్రపంచ వ్యాప్తం చేయాలనే ఉద్దేశ్యంతో ప్రస్తుతం "Mastaru Kadhalu 'in' Telugu " ఛానెల్ ద్వారా నా కథలతో పాటు దాదాపు 25 మంది రచయితల కథలు (ఈనాటికి 420 కధల ఆడియో వీడియోలు)చదివి వీడియోలుగా మలుస్తూ ఉచిత సేవగా అందించడం జరుగుతోంది.
2.KUBDevotionalWorld అనే ఛానల్ ద్వారా శ్రీ భగవద్గీత 700 శ్లోకాలను ప్రతీరోజు 5 శ్లోకాలను భావాలతో సహా వీడియోలుగా చదివి అందించడం జరుగుతోంది.
3. UDAYABABUMathsBasics యు ట్యూబ్ ఛానెల్ ద్వారా విద్యార్థులకు గణితంలో మౌలిక భావనల బోధన
ప్రస్తుత నివాసం : 2010 లో సికింద్రాబాద్ సైనిక్ పురి లో స్థిరనివాసం ఏర్పరచుకుని ఇప్పటికీ కధా రచయితగా, బాలల కథారచయితగా కొనసాగడం.
చివరగా నా అభిప్రాయం :
ఇప్పటికీ నా కవితా ప్రస్తానం, కధా సాహితీ సేద్యం కొనసాగుతోంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం లో చెట్టు నాకు ఆదర్శం.
కవిగా రచయితగా తమ సాహితీ ప్రస్తానం కొనసాగిన్చాదలుచుకున్న యువత అంతా పాత సాహిత్యాన్ని బాగా చదవాలి. 'వెయ్యి పేజీలు చదివి ఒక్క పేజీ రాయి' అన్న ఒక మహాకవి వాక్యాలు స్పూర్తిగా తీసుకుని నిన్నటి రచన కన్నా, నేటిది, నేటి రచన కన్నా రేపటిది మరింత మెరుగుపరచుకుని ఈ రంగం లో తమకంటూ ఒక ప్రత్యెక స్థానాన్ని ఏర్పరచుకోవాలని, ఆ దిశగా వారి సాహితీ ప్రస్తానం కొనసాగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ.. ...సాహిత్యాభినందనలు.
కొత్తపల్లి ఉదయబాబు
సికింద్రాబాద్
تعليقات