సెల్ తెచ్చిన తంటా
- Srinivasarao Jeedigunta

- Apr 23
- 7 min read
#JeediguntaSrinivasaRao, #చూస్తున్నాడుజాగ్రత్త, #ChusthunnaduJagrattha, #JeediguntaSrinivasaRao, #TeluguMoralStories, #నైతికకథలు, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

Cell Thechhina Thanta - New Telugu Story Written By Jeedigunta Srinivasa Rao
Published In manatelugukathalu.com On 23/04/2025
సెల్ తెచ్చిన తంటా - తెలుగు కథ
రచన : జీడిగుంట శ్రీనివాసరావు
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
డిన్నర్ చేసి సాక్షి టీవిలో వార్తలు చూస్తున్న వాసుదేవ్ దగ్గరికి అతని భార్య సునీత వచ్చి, మెల్లగా అంది "ఏమండీ! అమ్మాయి గదిలో నుంచి ఒకటే నవ్వులు, మాటలు. హరిణి ఎవ్వరితోనో మాట్లుడుతోంది. బహుశా ఎవ్వరైనా మగపిల్లాడితో మాట్లాడుతోంది అని అనుమానం గా వుంది" అంది.
టీవీ ఆపేసి, “తలుపు కొట్టి పిలిచి అడగలేకపోయావా” అన్నాడు.
“అడిగాను, చదువుకుంటున్నా. అనవసరంగా ఎందుకమ్మా ఆటంకం పరుస్తావు” అంటూ తలుపు వేసుకుంది. తప్పంతా మీదే. పిల్లల గది అంటూ వాళ్ళని చిన్నప్పుటి నుంచి వేరుగా పడుకోపెట్టారు. యిప్పుడు వాళ్ళు మనల్ని వాళ్ళ గదిలోకి రానివ్వడం లేదు” అంది సునీత..
“తప్పు నాది అంటావేమిటి, దానికి ఫోన్ ఎందుకే అంటే విన్నావా?”
“కాలేజీ కి వెళ్లే పిల్ల, ఎక్కడ వుందో ఏమిటో తెలుసుకోవడానికి ఫోన్ కొంటే, యిలా వికవికలు ఏమిటండి” అంది.
“దాని ఫోన్ డబ్బా ఫోన్, వీడియో రాదు. భయపడక, రేపు ఉదయం అది స్నానానికి వెళ్ళినప్పుడు దాని ఫోన్లో కాల్ లిస్ట్ చూడు, అప్పుడు ఆలోచిద్దాం” అన్నాడు వాసుదేవ్.
ఉదయం హరిణి స్నానానికి వెళ్ళగానే బ్యాగ్ లో వెతికింది సునీత. తాము కొన్న డబ్బా ఫోన్ తప్ప ఏమీ కనిపించలేదు. కాల్ లిస్ట్ చూస్తే సునీత నెంబర్ కి వాసుదేవ్ నంబర్స్ వున్నాయి. ‘అమ్మయ్య.. పిల్ల దారిలోనే వుంది. అనవసరంగా అనుమానించాను’ అనుకుని భర్తకి విషయం చెప్పింది. కూతురు మీద జాలి కలిగి బ్రేక్ఫాస్ట్ పూరీకూర తయారుచేసింది. తల్లి హృదయం కదా.
యిల్లు వూడుస్తున్న పనిమనిషి మంగమ్మ, “అమ్మగారు.. పాపగారి దగ్గర మంచి ఫోన్ ఉందిగా, పాత ఫోన్ నాకివ్వండి అమ్మా, ఎప్పుడైనా పనికి రాకపోతే ఫోన్ చేసి చెప్పగలను” అంది.
“పాప దగ్గర రెండు ఫోనులు ఎక్కడవే, ఒక్క ఫోను తోనే తలనొప్పిగా వుంటే” అంది సునీత.
“అదేమిటమ్మా! పాప గారు స్నానం చేసి వస్తున్నప్పుడు చేతిలో కొత్త ఫోన్ పట్టుకుని వున్నారు” అంది మంగమ్మ.
“నిజమా” అంటూ భర్త చెవిలో వూదింది.
పుస్తకాల బ్యాగ్ పట్టుకుని “అమ్మా! టిఫిన్ పెట్టు త్వరగా, కాలేజీ కి వెళ్ళాలి” అంది డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి.
ప్లేటులో పూరీలు వేసి కూతురుకి యిచ్చింది సునీత భర్త వంక చూస్తో. బ్యాగ్ పక్కన కుర్చీలో పెట్టి టిఫిన్ తింటోంది హరిణి. వాసుదేవన్ హరిణి బ్యాగ్ తీసుకుని లోపల చూసాడు. కొత్త ఐ ఫోన్ ని బయటకు తీసాడు. టిఫిన్ తిని బ్యాగ్ కోసం చూసుకుని కంగారుగా అటూ యిటు చూసింది. తండ్రి చేతిలో బ్యాగ్, ఐ ఫోన్ ఉండటం చూసి భయం తో వణకటం మొదలుపెట్టింది.
“ఎక్కడిది ఫోన్ నీకు, నెలకు రెండు లక్షలు సంపాదించే నాకే ఐ ఫోన్ లేదు, నీకు ఈ ఫోన్ ఎలా వచ్చింది” అంటూ లాగి లెంపకాయ కొట్టాడు.
“మీరు ఆగండి, నేను తెలుసుకుంటాను” అంటూ కూతురిని వేరే గదిలోకి తీసుకుని వెళ్లి, “నిజం చెప్పు, ఈ ఫోన్ ఎవ్వడు కొనిపెట్టాడు, ఎవ్వడిది ఈ ఫోటో” అంటూ జుట్టుపట్టుకుని గుంజింది.
“మా ఫ్రెండ్ యిచ్చాడు అమ్మా, అతను లెక్కలలో ఫస్ట్ వస్తాడు, నాకు లెక్కలు హెల్ప్ చేస్తాను అని ఈ ఫోన్ లో వీడియో కాల్ చేసి నా డౌట్స్ తీరుస్తాడు” అంది ఏడుస్తూ హరిణి.
“అంటే ఐ ఫోన్ నీకు యిచ్చి సహాయం చేసే గొప్పవాడు అని అనుకుంటున్నావా, చిన్న పిల్లలకి చాక్లెట్ యిచ్చి ఎత్తుకెళ్లినట్టే నిన్ను ఈ ఫోన్ యిచ్చి ఎత్తుకెళ్తాడు. చేసింది తప్పు అని తెలిసిందా లేదా” అని అరిచింది సునీత.
“ఈ రోజు ఫోన్ తిరిగి యిచ్చేస్తాను, యిహ అతనితో మాట్లాడాను, నన్ను నమ్ము అమ్మా’ అంది హరిణి.
“నువ్వు ఇవ్వక్కరలేదు, కాలేజీ కి కూడా రెండు రోజులు వెళ్లకు వాడి సంగతి తేలేవరకు” అంటూ ఫోన్ తీసుకుని వెళ్లి భర్త చేతికి యిచ్చి “మీరు ఒకసారి కాలేజీ కి వెళ్లి ప్రిన్సిపాల్ తో మాట్లాడి ఆ కుర్రాడిని బెదిరించండి. ఎంతవరకు యింట్లో నామీద అరవడం కాదు, మీ ప్రతాపం వాడి మీద చూపించండి” అంది.
ఫోన్ చేతిలోకి తీసుకున్న వాసుదేవ్, “యిదిగో మంగమ్మా.. నీకు ఫోన్ కావాలి అన్నావుగా, ఈ ఫోన్ తీసుకో” అన్నాడు.
“నాకెందుకు బాబు అంత పెద్దఫోన్, ఏదో మామూలు ఫోన్ చాలు” అంది.
“తీసుకో మంగమ్మా” అంటూ ఫోన్ యిచ్చేసాడు.
“అదేమిటి, ఆ అబ్బాయి కి ఫోన్ యిచ్చేసి నాలుగు చివాట్లు పెట్టమంటే మంగమ్మ కి యిచ్చేసారు” అంది మంగమ్మ వెళ్లిన తరువాత.
“ఆ పిల్లాడికి యిస్తే ఈ ఫోన్ తో యింకో అమ్మాయిని వలలో పడేస్తాడు, వాడి సంగతి మీ తమ్ముడు రికవరీ ఆఫీసర్ గా చేస్తున్నాడుగా.. వాడిని పంపించి బెదిరించమందాం” అన్నాడు.
సునీత తన తమ్ముడు వెంకట్ కి ఫోన్ చేసి జరిగిన సంగతి చెప్పి, “నువ్వు నీ రికవరీ ఏజెంట్స్ ని పంపి ప్రిన్సిపాల్ తో మాట్లాడి, ఆపిల్లాడి తల్లిదండ్రులని హెచ్చరించి పుణ్యం కట్టుకోరా, మీ బావగారు నన్నూ, దానిని చంపేసేడట్లున్నారు” అంది.
“నీకెందుకు అక్కయ్య, నేను చూసుకుంటా, వీలుంటే ఆ కుర్రాడి కాళ్ళు విరగకొట్టి రమ్మంటాను” అన్నాడు.
“ఒరేయ్ అంత పని చెయ్యకు, భయపెట్టి రండి చాలు, వాడూ చిన్నపిల్లాడే గా” అంది సునీత.
రెండవ రోజు పనిమనిషి మంగమ్మ వాచిపోయిన మొఖం తో పనికి వచ్చి, “అమ్మా! మీకు, మీ ఫోన్ కి ఒక నమస్కారం. మా పెనిమిటి నీకు ఈ ఫోన్ ఎక్కడిది, దొంగతనం చేసావా అని తిట్టిపోశాడు. మీరు యిచ్చారు అన్న తరువాత ఫోన్ తీసుకుని చూసి ఫోన్ లో వున్న కుర్రాడి ఫోటో ఎవ్వరిది” అంటూ అనుమానం తో విరగకోట్టాడు అమ్మా. ఫోన్ అంటే మాట్లాడుకోవచ్చు అనుకున్నాను కాని యిలా దెబ్బలు, అపార్దాలు కూడా వస్తాయి అనుకోలేదు” అంటూ ఫోన్ బల్లమీద పెట్టేసింది.
సునీత తమ్ముడు వెంకట్ తన రికవరీ ఏజెంట్స్ ని తీసుకుని కాలేజి కి వెళ్లి ప్రిన్సిపాల్ తో మాట్లాడి, ఆ కుర్రాడిని అతని తండ్రి దగ్గరికి తీసుకుని వెళ్లి జరిగింది చెప్పాడు.
“ఒరేయ్! చదువుకోమని పంపితే నువ్వు చేసే అని యిదా? అసలు నువ్వు ఐ ఫోన్ ఎలా కొన్నావు? అంటే ఆ నాడు నేను బ్యాంకు నుంచి ఖర్చులు కోసం తెచ్చిన యాభై వేలు నా జేబులోనుంచి కొట్టేసింది నువ్వా, బ్యాంకు నుంచివస్తోవుంటే ఏ జేబుదొంగో కొట్టేసాడు అనుకున్నాను. వేంకట్ గారూ! మా అబ్బాయి మీ అమ్మాయి వంక చూడకుండా నేను ట్రీట్మెంట్ యిస్తాను, మీరు యిహ ప్రశాంతంగా వెళ్ళండి” అని చెప్పి, కొడుకుని బెల్ట్ తో నాలుగు దెబ్బలు వేసి “యిహ సరిగ్గా చదువుకోకుండా ఫోన్లో చాటింగ్ చేస్తో కనిపించినా, తెలిసినా చదువు మానిపించి ఆటో కొని యిస్తాను, డ్రైవర్ గా బతకాలి జాగ్రత్తగా వుండు” అన్నాడు.
యింకో యింట్లో..
“ఏమిటే ఎప్పుడు ఫోన్ చేసినా నీ ఫోన్ ఎంగేజ్ వస్తోంది. ఉద్యోగం లేని నీకు అన్ని కాల్స్ ఏమిటి, ఎవ్వరితో మాట్లాడుతున్నావ్?” అన్నాడు రమణ భార్య శ్రీదేవి తో.
“ఏమిటి.. నేను అడిగేది వినకుండా ఆ సెల్ ఫోన్ లో ఎవ్వరితో మాట్లాడుతున్నావ్?” అన్నాడు మళ్ళీ.
“అయ్యో! మీరు వచ్చేసారా, వుండండి పాలు వెచ్చపెట్టాను, కాఫీ తీసుకుని వస్తాను” అంటూ వంటగదిలోకి వెళ్ళింది శ్రీదేవి. భార్య వెనుకే వెళ్లిన రమణ కి స్టవ్ మీద గిన్నెలోనుంచి మాడిపోయిన వాసన తో పొగలు వస్తున్నాయి.
“పాలు స్టవ్ మీద ఉదయం పెట్టావా, నీ సెల్ ఫోన్ లాక్కుని పొయ్యిలో పడేస్తాను. యింతకీ ఎవ్వరు నీతో పనిలేకుండా అంతసేపు మాటలుడుతున్నారు?” అన్నాడు.
“మా అమ్మానాన్నా అండి, సంసారాన్ని ఎలా చక్కదిద్దుకోవాలో నేర్పుతున్నారు” అంది.
“ఏడిచినట్టు వుంది. చూసావుగా పాలు ఎలా మరిగిపోయి మబ్బుల్లో కలిసిపోయాయో, పాల వాన కురిసేదాకా కాఫీ లేదన్నమాట. పోనిలే నిన్న నిన్న నానపెట్టిన పప్పు దోశలకోసం గ్రైండ్ చేసావా, రెండు దోశలు వేసి తీసుకుని రా” అన్నాడు.
“అయ్యో మీరు దోశలు అంటే గుర్తుకు వచ్చింది, ఉదయం పప్పు మిక్సీ లో వేసి స్విచ్ నొక్కే లోపు మా నానమ్మ ఫోన్ చేసింది, ఆతరువాత మా అమ్మ, ఈలోపున పక్కింటి పిన్నిగారు వచ్చారు. పప్పు రుబ్బుటం మర్చిపోయాను. త్వరగా అన్నం వండుతాను, ఉదయం వండుకోలేదు” అంది.
వంటగదిలో మినప్పప్పు మిక్సీ లోనుంచి అదోరకం వాసన వస్తోంది. టేబుల్ మీద వున్న భార్య సెల్ ఫోన్ తీసుకుని సిమ్ తీసి అటకమీద పడేసాడు.
కుక్కర్ స్టవ్ మీద పెట్టి ఫోన్ తీసుకుని ఆన్ చేసి, ‘నెట్ లేదా’ అంది.
“ఏమో నాకూ రావడం లేదు” అన్నాడు.
“అదేమిటండి కాల్స్ కూడా వెళ్ళటం లేదు” అంది.
“ఈమధ్య ఫ్రీ కాల్స్ అని గంటలు గంటలు మాట్లాడు తున్నారు అని కంపెనీ వాళ్ళు కొంతసేపు సిగ్నల్స్ లేకుండా చేస్తున్నారుట, ఈ రోజుకి ప్రశాంతం గా వుండు. రేపు రాకపోతే చూద్దాం” అన్నాడు.
“పోనీ ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి, వాసన వచ్చిన మినప్పప్పు తో ఏమి చెయ్యాలో మా అమ్మని అడుగుతాను” అంది.
“చాల్లే.. నా ఫోన్ కి కూడా సిగ్నల్స్ ఆగిపోతే కష్టం, ఆ పప్పు పక్కింటి పిన్నిగారికి యిచ్చేసేయి” అన్నాడు సెల్ ఫోన్ జేబులో పెట్టుకుంటూ.
మరో యింట్లో..
“అర్ధరాత్రి కూడా ఆ సెల్ ఫోన్ లో మాట్లాడుతున్నారు ఎవ్వరితో అండి?” అని అడిగింది రేవతి భర్త అరుణ్ ని.
“మా మెయిన్ ఆఫీస్ నుంచి ఫోన్. రేపు ఉదయం బయలుదేరి చెన్నై వెళ్లి అక్కడ ఆఫీస్ ఇన్స్పెక్షన్ చేయ్యమని అంటున్నారు” అన్నాడు భార్య వంక చూడకుండా.
“మరి మొన్న కూడా అదే టైముకి లేచి వరండాలో నుంచుని మెల్లగా మాట్లాడుతున్నారు, అది ఏ ఆఫీస్ నుంచి” అంది.
“చంపేస్తావా నీ ప్రశ్నలతో, నేను ఏమన్నా గుమస్తా ఉద్యోగం చేస్తున్నానా, నాలుగు స్టేట్స్ లో వున్న మా బ్రాంచి ఆఫీసులకు హెడ్ ని. ఏదో ఒక ప్రాబ్లెమ్ తో ఫోన్ చేస్తారు, హాయిగా పడుకోకుండా నా మీద సి ఐ డి లా తయారయ్యావు” అన్నాడు పెట్టె సద్దుకుంటో.
“త్వరగా వస్తారా లేకపోతే వారం రోజులు ఉండిపోతారా, ఏమీలేదు.. మా అమ్మకి వొంట్లో బాగుండలేదుట. ఒకసారి వెళ్లి చూసి వస్తే బావుంటుంది” అని అంది.
“చూడు.. అక్కడ ఆఫీసులో ఎలా వుందో యిప్పుడే చెప్పలేను, నాలుగు రోజులు అయితే తప్పనిసరిగా పడుతుంది. నువ్వు మీ అమ్మగారిని చూడాలి అనుకుంటే కారు తీసుకుని వెళ్ళు, డ్రైవర్ యిక్కడే వుంటాడు” అని కారులో కూర్చున్నాడు అరుణ్.
క్యాంపు కి వెళ్తే ఈయనకి యిల్లు గుర్తుకు రాదు, భార్య కి ఫోన్ చేసి ఎలావున్నావు అని కూడా అడగడు. మొదట్లో కొంగుపట్టుకుని తిరిగేవాడు, ఆఫీసు నుంచి రోజుకి పదిసార్లు ఫోన్ చెయ్యడం, అటెండర్ ద్వారా సాయంత్రం స్నాక్స్ పంపించడం చేసేవాడు. యిప్పుడు ఏమైందో..
తల్లికి బాగుండలేదు అని తండ్రినుంచి ఫోన్ రావడం తో డ్రైవర్ ని పంపమని ఆఫీస్ కి ఫోన్ చేసింది రేవతి.
పి. ఏ ఫోన్ తీసి మేడం గొంతు గుర్తుపట్టి, “సార్ కి కనెక్ట్ చేస్తున్నా” మేడం అన్నాడు.
“మీ సార్ క్యాంపు కి వెళ్ళాలి అన్నారే వెళ్లలేదా” అని అడిగింది రేవతి.
“లేదు మేడం. సార్ కి ఈ నెలలో క్యాంప్స్ లేవు” అంటూ ఫోన్ లోపలికి కనెక్ట్ చేసాడు.
“హాయ్ సుశీ! యిప్పటి దాకా నీతోనే వున్నాగా.. అప్పుడే ఫోన్ చేసావు, డబ్బులు ఏమైనా కావాలా” అన్నాడు.
“సుశీ ఎవ్వరండీ, నేను రేవతిని, మీరు క్యాంపు కి వెళ్తున్నాను అని వెళ్లారు, మీ పి ఏ మీరు ఎక్కడికి వెళ్ళలేదు అంటున్నాడు, మరి ఈ నాలుగు రోజులు యింటికి రాలేదే” అంది. “ముందు మీరు వేంటనే బయలుదేరి యింటికి రండి, మీతో మాట్లాడాలి” అని ఫోన్ పెట్టేసింది రేవతి.
భయపడుతోనే పెట్టెతో సహా యింటికి వచ్చాడు అరుణ్. హాల్ లో బుగ్గ మీసాల్తో పోలీస్ ఆఫీసర్ గా పనిచేస్తున్న బావమరిది భయంకర్ కాఫీ తాగుతో కనిపించడంతో అరుణ్ కి అర్ధం అయ్యింది వ్యవహారం చాలా దూరం వెళ్ళింది అని.
బావగారిని చూసిన భయంకర్ “రండి బావగారు, చెల్లాయ్.. బావగారు వచ్చారు కాఫీ తీసుకునిరా” అన్నాడు.
“పోలీస్ వాళ్ళకి ఏమిటి మా యిల్లు గుర్తు వచ్చింది” అన్నాడు అరుణ్ సోఫాలో కూర్చుని.
“బావగారూ! మీ బావమరిది గా రావడం నాకు యిష్టం, కాని ఈసారి పోలీస్ గా రావాలిసివచ్చింది, యింతకీ యెవ్వరు ఆ సుశీల?” అన్నాడు.
యిహ దాచి లాభం లేదు అనుకుని, “ఒకసారి సూపర్ బజార్ లో పరిచయం చేసుకుంది నాతో.
‘తన ఫోన్ పనిచెయ్యడంలేదు, మీ ఫోన్ నుంచి మా ఫ్రెండ్ నెంబర్ కి ఒక వెయ్యి రూపాయలు గూగుల్ పే చేస్తే మీకు క్యాష్ యిస్తాను’ అంది. అంతే! అప్పటినుంచి ఫోన్ చేస్తో పరిచయం పెంచుకుని, నన్ను తన పుట్టినరోజు కి రమ్మని పిలిచింది. బుద్ది తక్కువతో నేను మీ చెల్లెలికి చెప్పకుండా వెళ్లాను. మేము ఇద్దరే వున్నాము, మిగిలిన వాళ్ళు వచ్చేలోపు జ్యూస్ తీసుకోండి అని యిచ్చింది. అంతే! నాకు ఏమీ గుర్తులేదు. కాని కొన్ని ఫొటోలు మేము కలిసి వున్నవి చూపించి నన్ను డబ్బుల కోసం పీడించడం మొదలుపెట్టింది.
నాలుగు రోజులు క్రితం ఫోన్ చేసి తనకి వొంట్లో బాగుండలేదు అని, కొన్నిరోజులు తన యింట్లో వుండి సహాయం చేస్తే ఫోటో ఒరిజినల్స్ యిచ్చేస్తాను అని ఆశ పెట్టడం తో రేవతి కి క్యాంపు అని చెప్పి వెళ్ళాను అన్నాడు.
“అంతేనా కథ ఏమైనా నడిచిందా మీ యిద్దరి మధ్యలో” అని అడిగాడు బావమరిది.
“లేదు, సాలెగూడు లో చిక్కుకుని ఎలా బయటికి రావాలో తెలియక అబద్దం మీద అబద్దం మీ చెల్లెలికి చెప్పి డబ్బులు ఆ కిలాడీ కి దోచిపెడుతున్నాను.”
అంతా విన్న రేవతి “అన్నయ్యా! నువ్వే ఈయనని దాని చేతిలోనుంచి తప్పించాలి, అయినా ఎవ్వరు జ్యూస్ ఇచ్చినా మీరు తాగేసెయ్యాడమేనా, నాకు మీ విషయం తెలుసు కాబట్టి మిమ్మల్ని అనుమానించటం లేదు, యిహ ఆ అమ్మాయి ఫోన్ తియ్యకండి, మిగిలిన విషయం మా అన్నయ్య చూసుకుంటాడు” అంది.
భయంకర్ ఆ అమ్మాయి ని పట్టుకుని వచ్చి విచారణ చెయ్యగా డబ్బున్న వాళ్ళకి ఫోన్ చేసి మాటలలో దింపి, డబ్బుల కోసం బెదిరించి పబ్బం గడుపుకుంటుంది అని తెలిసి కేసు పెట్టి జైలుకి పంపించాడు. అరుణ్ పూర్వంలాగా సాయంత్రం ఆరుగంటలకు యింటికి వచ్చి రేవతి తో సరదాగా గడుపుతున్నాడు.
అందరి ఇళ్లలో..
‘మీకు నాకంటే సెల్ ఫోన్ ఎక్కువైంది’ అని భార్య,
‘ఎప్పుడూ మన యింటి విషయాలు తెలుసుకోవటానికి మీ అమ్మగారు రోజు రెండు సార్లు ఫోన్ చెయ్యడం మానరా’ అని ఒక యింట్లో,
‘యిదిగో కొత్త సినిమా వచ్చింది, ఐ మాక్స్ కి వెళ్దాం. కాలేజీ కి వద్దు’ అని అబ్బాయి అమ్మాయి తో,
‘నన్ను ఎప్పుడు పెళ్లిచేసుకుంటావు, నాకు ఎందుకో భయంగా వుంది’ అని మోసపోయిన ఆడపిల్ల ఫోన్ లో అబ్బాయి తో..
యిలా అలా కాదు ఫోన్ లే ఫోన్ లు. మంచి కి సెల్ ఫోన్ ఎంత ఉపయోగ పడుతోందో చెడుకి కూడా ఎక్కువగా ఉపయోగ పడుతోంది. సెల్ ఫోన్ చేతిలో బాంబు లా వుంది జాగ్రత్తగా ఉపయోగించకపోతే పేలిపోతుంది.
సెల్ - 'జైలు సెల్' కాకూడదు.
శ్రీనివాసరావు జీడిగుంట
శుభం
జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.






Comments