top of page

చిగురించిన వసంతం

#AyyalaSomayajulaSubrahmanyam, #ChigurinchinaVasantham, #చిగురించినవసంతం, #అయ్యలసోమయాజులసుబ్రహ్మణ్యము, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ


Chigurinchina Vasantham - New Telugu Story Written By Ayyala Somayajula Subrahmanyam Published In manatelugukathalu.com On 06/03/2025

చిగురించిన వసంతం - తెలుగు కథ

రచన: అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము   

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)


మొన్నటిదాకా ఆనందకరమైన జీవితం వసంత్ ది. కానీ, హఠాత్తుగా పరిస్థితి మారిపోయింది. అకారణంగా అందరిమీదా అరుస్తున్నాడు. కేకలేస్తున్నాడు. ఊళ్ళోవాళ్ళయితే అతనికి పిచ్చిపట్టిందనుకున్నారు. అసలేం జరిగింది? వసంత్ ఎందుకిలా తయారయ్యాడు?


“నిష్కారణంగా ఉద్యోగం పోయింది. పనిలేదంటూ కొంతమందిని తీసేశారు. మీతో పాటు చేసినవాళ్ళు ఏదో ఉద్యోగం చూసుకున్నారని మీరే చెబుతున్నారు. అరునెలలు గడిచిపోయాయి. మీ స్నేహితుడు కృష్ణ ని కనుక్కోకపోయారా, ఆయనతో పాటూ మీకూ అక్కడే చూడమని.”


“కృష్ణ చేరిందే కొత్త. అప్పుడే నాక్కూడా ఎక్కడ చూస్తాడు. అయినా అతగాడే ప్రయోజకుడైనట్లు, నేను చేతగానివాడిలా అతణ్ణి బతిమిలాడాలా? కొన్నాళ్ళాగుతాను. ఏదో ఒకటి దొరక్కపోదూ'” అంటూ సింక్ లో వేస్తున్న గిన్నెల్ని పైపు కిందకు నెట్టి శుభ్రం చేయసాగాడు వసంత్. 


‘వంటింటి పనులు నేనే చూసుకుంటాను. మీరు అవసరం లేదులే’ అని చెప్పటానికి రాధిక కు సంకోచం గా ఉంది. 'ఏం.. నేనీపనికి కూడా తగనా? నువ్వూ నన్ను పనిమానిపిస్తున్నావా? ' అంటూ నిష్ఠూరంగా మాట్లాడతాడు. 


ఉద్యోగం పోయిన దగ్గరనుంచి పనిమనిషినీ, ఇస్త్రీకి బట్టలివ్వడం మానిపించాడు. పిల్లలకు కారేజీ లు సిద్దం చేయడంలో రాధిక హడావుడి పడుతోంది. సాయం చేయడానికి వసంత్ ముందుకొచ్చాడు. 

క్రమంగా అన్ని పనుల్లోనూ సాయపడుతున్నాడు. కానీ, అతడి మానసిక పరిస్థితి మాత్రం మారింది. 


ఒకరోజు ఇంట్లో సరుకులు అయిపోతే “నాకెందుకు చెప్పలేదు? ఈ ఊద్యోగం లేని మొగుడు ఎలా సర్దుబాటు చేస్తాడులే అని ఊరుకున్నావా? నేను బతికున్నంతవరకూ పెళ్ళాంగ నీకు, కన్నందుకు 

పిల్లలకూ ఇంత తిండి పెట్టగలను. మరీ అంత చవట లాగా లెక్కేయకు. నా దగ్గర ఇంక కొంత డబ్బుంది” అంటూ మూతలు తీసి ఏమేం సరుకులు నిండు కున్నాయో చూసి కాగితం మీద రాసుకున్నాడు. 


సబ్బులూ, సర్ఫూ, నూనెలు, పప్పులు పెట్టే షెల్ఫ్ దగ్గర కెళ్ళి చూసి వాటినీ రాసుకున్నాడు. 

మరోరోజు కొడుకూ, కూతురూ ఏదో అడుగు తున్నారు. రాధిక వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం 

చేస్తోంది. వసంత్ అక్కడికొచ్చి కోపంగా చూస్తూ  “ఏం కావాలో నాతో చెప్పొచ్చుగా? ఉద్యోగం పోయిన 

వీడివల్ల ఏమవుతుందిలే అని మీ అమ్మతో మంతనాలాడుతున్నారా? నేను డబ్బులిస్తేనే మీ అమ్మ దగ్గర డబ్బుంటుంది. తెలిసిందా? ఉద్యోగం పోగానే ఈ నాన్న అంత లెక్కలేని వాడయ్యాడా?” అని పెద్ద పెద్ద గా పిల్లల మీద కేకలేశాడు.


వాళ్ళు బిక్కముఖా లేసుకుని తల్లి చాటుకెళ్ళి నిలబడ్డారు. “మీతో ఏం మాట్లాడాలన్నా భయపడుతున్నారు. ఈ మధ్య అన్నిటికీ పెడర్థాలు తీస్తున్నారు. పిల్లలతో బాటు నేను కూడా భయపడుతున్నాను”


“భయం కాదే.. అది భక్తిలేక. తండ్రి అన్న పదానికి విలువలేక. ఇప్పుడు నేను ఉద్యోగస్థుడిని కాదుగా”

అన్నాడు గట్టిగా. 


కొడుకూ, కూతురూ పుస్తకాలు తీసుకుని మౌనంగా అవతలికి వెళ్ళిపోయారు. రాధిక బట్టలుతకటానికి వెళ్ళింది. వసంత్ విసుర్లతో రాధిక మనసుకు ఎంతో భారంగా, మరెంతో కష్టంగా రోజులు, వారాలూ గడుస్తున్నాయి. 


వసంత్ కు ఏ ఉద్యోగప్రయత్నమూ కలిసిరావటం లేదు. మనిషిలో అసహనం పెరిగిపోతోంది. పిల్లల పరీక్షలు దగ్గరపడటంతో రాత్రి పొద్దుపోయేదాకా హాల్లోనే కూర్చుని వాళ్ళని చదివించి, ఆ తరువాత పడుకోవడానికొచ్చింది. “ఉద్యోగం సద్యోగం లేనివాడికి పడకసుఖం మాత్రం ఎందు కనుకున్నావా? ఈ మధ్య నాసంగతే పట్టడం లేదు నీకు. వంట్లో బావుండలేదనో, మరేదో వంక చెప్పి దూరంగా ఉంటున్నావు. ఏంటి నీ ఉద్దేశం” బిగ్గరగా అరిచాడు. 


“గట్టిగా అరవకండి. పిల్లలు వింటే బాగుండదు. వాళ్ళకు పరీక్షలు. ఇదివరకు మీరే శ్రద్ధగా కూర్చుని 

చదివించేవారు. ఇప్పుడు వాళ్ళంతట వాళ్ళే చదువు కుంటుంటే తోడూగా కూర్చున్నాను. మీకే మనసు బాగులేక నన్నూ దూరంగా పెడుతున్నారు” అంది. 


“ఒకమాటకు రెండు మాటలు బదులు చెప్పటం బాగా నేర్చుకుంటున్నావు. ఒక్కొక్కళ్ళ బుద్దులు బాగా బయట పడుతున్నాయి" అన్నాడింకా గట్టిగా. 


ఎదురు మాట్లాడితే మరింత రెచ్చిపోతాడని రాధిక మౌనం వహించింది. 


ఆరోజు ఊరినుంచి రామయ్యగారొచ్చారు. కొడుకు కుటుంబాన్ని చూసిపోదామని. ఇంట్లో వాతావరణమంతా తేడాగా అనిపించింది. తండ్రికి రాధిక ఏమన్నా చెబుతుందేమోనని కాపలా కాశాడు వసంత్. 


“ఆఫీసుకు పోవేమిరా బిడ్డా, నిన్నా ఇవాళ ఇంట్లో ఉన్నావు?” అడిగాడు తండ్రి. 


“సెలవు పెట్టాను నాన్నా”


“ఒంట్లో బాగానే ఉందిగా, ఏ పని మీద సెలవు పెట్టావు?”


“ఒంట్లో అంతా బాగా ఏం ఉండట్లేదు. ఆఫీసు కెళితే బాగా ఇబ్బందిగా ఉంటోంది. దానికి తోడు పని ఒత్తిడి. అందుకని ఇంట్లోనే ఉండా లనుకుంటున్నాను”


“పిల్లలకి సెలవులివ్వగానే మనూరు వచ్చేయండి. వాతావరణం మారుతుంది. నీకూ నెమ్మదిస్తుంది”

“నాకు పనులున్నాయిలే. పిల్లలూ, రాధీ వస్తారు.”


“లేదులే మావయ్య, మేమొచ్చేస్తే ఆయనొక్కరు ఇబ్బంది పడతారు. తరువాతెప్పుడన్నా అందరం కలిసే వస్తాం”

అప్పటికాయన వెళ్ళిపోయారు. కానీ ఇరవై రోజు లకే తిరిగొచ్చాడు. అప్పటికీ వసంత్ ఏ ఉద్యోగంలోనూ చేరలేదు. అతనిలో అసహనం మరింత బాగా పెరిగిపోయింది. 


అసలు విషయం చెప్పి “కష్టపెట్టడమెందుకని మీక్కానీ, మా అమ్మా వాళ్ళక్కానీ ఏం చెప్పలేదు. మామయ్యా” అంటూ లోగొంతుకతో చెప్పింది రాధిక. అప్పుడు స్నానాని కెళ్ళాడు వసంత్. 


“నాక్కూడా లోపల ఏదో అనుమానం గానే ఉందమ్మా, వీడి వాలకం చూసి. అందుకే ఉండబట్ట లేక మళ్ళీ వచ్చాను”


“ఒరేయ్ వసంత్;మీ అమ్మకు ఒంట్లో బాగుండటం లేదు. మందులు వాడుతున్నాం. కొన్నాళ్ళపాటు ఇక్కడికి తీసుకొద్దామని ఉంది. మీ అమ్మ మాత్రం ఒప్పుకోవటం లేదు. నువ్వెట్లాగూ సెలవులో ఉన్నావు. పిల్లలకు పరీక్షలయిపోయాయి. అందరం కలిసి మన ఊరెడదాం. కాదనకుండా బయలుదేరు. సాయం కాలమే మన ప్రయాణం”


ఏ కళనున్నాడో అట్టే వాదించకుండా ప్రయాణాని కొప్పుకున్నాడు వసంత్. 


ఊళ్ళో ఒకటీరెండు రోజులు ఎవరికీ అనుమానం రాలేదు. ప్రైవేట్ కంపెనీ లో పనిచేసేవాళ్ళకు సెలవులు ఎక్కువగా ఎందుకిస్తారు? ఏదో జరిగినట్లుంది. ఉద్యోగం ఉందో, ఊడిందో అని గుసగుసలు మొదలయ్యాయి. 


'వైజాగ్ లో ఉన్న మా బంధువులబ్బాయికి ఫోన్ చేస్తే తెలిసింది. వసంత్ ఉద్యోగం పోయిందట. అతడూ, వసంతూ ఒకచోట పనిచేసేవారట. వాడికేదో పని దొరికిందట. వీడేమో బిఛాణా ఎత్తేసి ఇక్కడికొచ్చీ పడ్డాడు ' అని చాటూమాటుగా ప్రచారం చేయ సాగారు కొందరు. 


“అమ్మా, నామీద నీకోడలు నీకేం చాఢీలు చెబుతోంది? నీ కొడుకు ఒట్టి చేతగాని వాడు, అంటోందా? ఇంకా నా గురించి ఏమైనా చెబుతోందా?” అన్నాడు భోజనం ముందు కూర్చుంటూ. 


“వసంతూ, రాధి మన అదృష్టం కొద్ది ఈ ఇంటి కోడలు అయ్యింది. నీ చెల్లెలు జ్యోతి కన్నా ఎంతో నేర్పు, ఓర్పూ ఉన్న పిల్ల. చేసే ఉద్యోగం పోయిందని నీ మనసు అంతలా కష్టపెట్టుకోవాలా? అదిపోతే ఇంకోటి రాదా? పోనీ, రాకపోయినా మనకు తింటానికి ఉంటానికి కొదవలేదు గదరా; మన పొలం పనులు చేయించడంలో మీ నాన్న కు తోడుగా ఉండు. పిల్లల చదువులకు వైజాగే పోవాలంటే పో. 


ఈణ్ణుంచి నెలనెలా మేమే పంపుతాం. దీనికోసం ఊరికే ఇదయ్యి పెళ్ళాం పిల్లలు బిక్కు బిక్కుమనేలా చెయ్యకు. వాళ్ళతో ప్రేమగా ఉండు”


కొసరి కొసరి వడ్డిస్తూ తియ్యని మాటల్ని రంగరించి చెప్పింది అమ్మ. 


అన్నావదినా వచ్చారని జ్యోతి తన భర్తా పిల్లలతో పుట్టింటికొచ్చింది. “ఏం బావా, ఖాళీయేగా? మావూరు రండి. సరదాగా రెండురోజులుండి వద్దురు గానీ” అన్నాడు జ్యోతి భర్త. అతను ఆఫీసు కెళ్ళి ఉద్యోగం చేసేవాడు. నేనేమో ఖాళీగా తిని తిరిగేవాణ్ణని హేళన చేస్తున్నాడనుకున్నాడు వసంత్. 


“మీ నాన్న ఎంతమంది కాళ్ళు పట్టుకుని నీకా ఉద్యోగం వేయించాడో నాకు తెలుసులే, బావా. మరీ అంత మిడిసిపడకు. నేను ఖాళీగా ఉన్నానని నువ్వేం వెక్కి రించక్కర్లేదు” అన్నాడు కోపంగా. 


జ్యోతి తెల్లబోయింది. ఆమె భర్త తన ఉద్దేశం అది కాదని చెప్పబోయాడు. వసంత్ వినిపించుకోకుండా లోపలి కెళ్ళిపోయాడు. జ్యోతి వాళ్ళు చిన్నబుచ్చు 

కుని ఆ మధ్యాహ్నమే వెళ్ళిపోయారు. రాధిక తల పట్టుకుంది. 


ఊళ్ళో ఉన్న గ్రంథాలయాని కెళ్ళాడు వసంత్. తాను రిజిస్టర్ లో చూసిన ప్రకారం బీరువాల్లో ఒక్క పుస్తకమూ లేదు. బీరువాల్లోని పుస్తకాల వరుసలకూ సంబంధమే లేదు. “చదువుకునే వాళ్ళు ఎట్లా వెతుక్కుంటారు. ? మీకింద సిబ్బంది ఇద్దరు ఉన్నారు. దేని కండీ మీరంతా?” అన్నాడు చిరాగ్గా. 


“పుస్తకాలు తీసుకున్న వాళ్ళు చదివి తెచ్చినాకా, తెచ్చినవి తెచ్చినట్లు సర్దేస్తారు. నీకే పుస్తకం కావాలో చెప్పు మామయ్యా, నేను చూస్తాను” అక్కడే నుంచుని ఉన్న ఓ అమ్మాయి చనువుగా అంది. 


ఆ అమ్మాయెవరో చప్పున గుర్తుకు రాలేదు. వసంత్ కు కోపం మాత్రం వచ్చింది. 


“ఎవరే నీకు మామయ్య.. వెతుక్కోవటం చేతకాదా? నువ్వెతికి ఇచ్చేదేమిటి? నా మొహాన ఏమన్నా రాసి ఉందా? అలా కళ్ళప్పగించి నావంకే చూస్తావేంటీ? వెళ్ళిక్కడనుంచి” గట్టిగా అరిచాడు. 


“ఊరుకోండి సార్, మీరంత ఆవేశపడవలసిన అవసరమేంటీ? ఆ అమ్మాయి మంచిగానే మాట్లాడింది” లైబ్రేరియన్ తన కుర్చీలోంచి లేచివచ్చి అనునయంగా మాట్లాడాడు. ఆ అమ్మాయి బిత్తరపోయి గుడ్లనీరు కుక్కుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయింది. గ్రంథాలయంలో మిగతా వాళ్ళు వసంత్ వంక అనుమానంగా చూశారు. 


ఆ అమ్మాయి ఇంటికెళ్ళి విషయాన్ని వాళ్ళ అమ్మతో చెప్పింది. 


“వాడా, ఉద్యోగం లేదు. పనీ పాటా లేకపోయే. బలాదూర్ గా తిరగడం. కొంప కెళ్ళి టైముకి కూడు తినడం. అటు పొలం పనికి పోడు. వాడికి మతి తప్పినట్లుంది” అంది ఆ పిల్ల అమ్మ. 


తరువాత నుంచి వసంత్ ను అందరూ అనుమానం గా చూస్తున్నారు. అతడి వెనకాల గుసగుసలాడు తున్నారు. ఉద్యోగ ప్రయత్నాలు ముమ్మురం చేశాడు. కానీ, ఏదీ కలిసిరావటం లేదు. ఏదైనా వ్యాపార ప్రయత్నం చెయ్యటానికి ధైర్యం చాలటం లేదు. మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోదామంటున్నాడు. పిల్లలు తండ్రితో వెళ్ళటానికి ఇష్టపడటం లేదు. 


“మీనాన్న పొలమెళ్ళారు. ఊళ్ళో ఇవాళ సంత. కాస్త కూరగాయలు తీసుకురా వసంత్” అంది అమ్మ సంచి అందిస్తూ. సంచి పట్టుకుని అమ్మ ఇచ్చిన డబ్బును సంకోచిస్తూ తీసుకుని వీధిలోకి వచ్చాడు. అతను నడూస్తుంటే వెనుక నుంచి సన్నగా మాటలు విన 

బడ్జాయి. 


“పాపం వసంత్ కు పిచ్చిపట్టిందట. ఆ పిచ్చి తో అందరినీ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడట. 

తీసుకెళ్ళి ఏ డాక్టరుకన్నా చూపిస్తే పోయేదిగా”


“ఎవరికీ, పిచ్చాసుపత్రి డాక్టరుకా”.. 


“ఆ.. మరికాక..”


ఆ మాటలు విన్న వసంత్ రివ్వున వెనక్కితిరిగి వాళ్ళ దగ్గరకెళ్ళి “ఏంటీ వాగుతున్నారు? ఎవరికే పిచ్చి? నీకా? నాకా? దానికా? మీరే పొండి. పిచ్చాసుపత్రికి,” పెద్ద పెద్దగా అరవసాగాడు. 


ఆ ఆరుపులు ఇంట్లో ఉన్న రాధిక కూ వినపడ్డాయి. ఆమె గబగబా వచ్చి వసంత్ ని బతి

మాలుకుని లోపలికి తీసుకెళ్ళింది. వసంత్ ఉద్రేకంతో ఊగిపోతున్నాడు. ఆస్థితిలో కొడుకును చూసి వాళ్ళ అమ్మ కళ్ళ వెంట ధారాపాతంగా నీరు కారుతోంది. 


‘వీదిలో వాళ్ళు ఈయన్ని నిజంగా ఏమైనా అన్నారా? లేకుంటే ఈయనే ఇలా ఊహించుకుంటున్నారా? ఈ మధ్య ఏ ఇద్దరు మాట్లాడుకుంటున్నా తనగురించే 

అనుకుంటున్నారు. ఈ స్థితి నుంచి ఆయన బయట పడటం ఎలా?’ ఆలోచించసాగింది. 


“ఏమ్మా రాధీ, ఎలా ఉన్నావ్? చాలా రోజులకు ఫోన్ చేశావ్? ఒకసారి మీ ఆయన్ని, పిల్లలను అమలా పురం తీసుకు రారాదూ, మనం కలుసుకుని చాలా రోజులయింది” అన్నాడు డా: రవికాంత్ ఆప్యాయంగా. 


“తప్పకుండా వస్తాం అన్నయ్యా, కానీ నాకిప్పుడొక సమస్య వచ్చిపడింది. దానికి నువ్వు పరిష్కారం చూపుతావన్న నమ్మకంతో ఫోన్ చేస్తున్నాను” అంటూ వివరంగా తన భర్త సంగతి చెప్పింది. 


“ఫోన్ చేసి మంచిపని చేశావ్. నాపని ఇలాంటి వాళ్ళకు వైద్యం చేయటమే గదా? ఒకసారి తీసుకు రా బావగారిని”


“ఆయన చాలా డిప్రెషన్ లో ఉన్నారు. ఎవరిమాటా వినిపించుకునే స్థితిలో లేరు. నువ్వు పిఠాపురం వస్తున్నావని పెద్దమ్మ చెప్పింది. వీలు చూసుకుని ఒకసారి ఇంటికి రా అన్నయ్యా. నువ్వే ఆయన్ని మామూలు మనిషిని చెయ్యాలి”


“తీవ్రమైన మానసిక ఒత్తిడి మూలంగా ఆయన అలా అయ్యాడు. ఇది పెద్ద జబ్బేం కాదు. ఉద్యోగాల్లోంచి తీసేస్తే ఏమవుతుందో అని ఆలోచించకుండా కొన్ని కంపెనీల వాళ్ళు తమ ఉద్యోగస్థుల్ని ఇళ్ళకు పంపించి వేస్తూంటారు. అందులో సున్నితమనస్కులు ఆరోగ్యాల్ని పాడు చేసుకుంటూ ఇంటిల్లిపాదినీ సమస్యల పాల్జేస్తుంటారు. 


నేను తప్పకుండా వస్తాను. నువ్వేం దిగులుపడకు. మరోసారి చెబుతున్నా. ఇది పెద్ద జబ్బేం కాదు. మీ అత్తామామలక్కూడా దైర్యం చెప్పు. మనవాళ్ళు మానసిక జాడ్యం అంటారు. ఇక అంతా నేను చూసుకుంటాను. 

-------------------------

“హలో బావగారూ, ఎలా ఉన్నారు? పిఠాపురం వచ్చాను. రాధీని చూసి చాలా కాలమైంది. మిమ్మ

ల్నందరినీ చూసిపోదామని వచ్చాను. నీరసంగా కనబడుతున్నారు. ఇక్కడ ఊళ్ళో అయితే కాస్త 

కోలుకోవచ్చు” అంటూ పిల్లల్ని దగ్గరికి పిలిచి చదువు గురించి అడిగాడు రవికాంత్. ఆ మధ్యాహ్నం భోజనానికక్కడే ఉండిపోయాడు. వసంత్ కు కూడా రవికాంత్ తో పాటే వడ్డించింది రాధిక. 


“అమలాపురం రాకూడదూ బావగారూ, చిన్నప్పుడు నేనూ, రాధీ ఒకతల్లి పిల్లలగానే పెరిగాం. తనంటే నాకు చాలా ప్రేమ, ఆప్యాయత. మీరూ అక్కడి కొస్తే మా పిల్లలూ, మీ పిల్లలూ కలిసిమెలిసి చిన్నప్పుడు మేమున్నట్లే ప్రేమగా ఉంటారు. మా ఆవిడక్కూడా రాధీ అంటే చాలా అభిమానం. 


వైజాగ్ లో చాలా రోజులున్నారుగా. ఇప్పుడు ఆమలాపురం లో ఉద్యోగం చెయ్యండి. అక్కడ ఒక కంపెనీ మానేజర్  నాకు తెలుసు. నమ్మకమైన సూపర్ వైజర్ కావాలట. జీతం బాగానే ఉంటుంది. మీకిష్టమైతే మాట్లాడతాను. ఆలోచించుకుని చెప్పండి. బాగా నీరసంగా వున్నారు. ఇదిగో ఈ టాబ్లెట్ ఇవాళ ఒకటి వేసుకోండి. 


మళ్ళీ ఇదేరోజు వారానికి ఒకటి చొప్పున వేసుకోవాలి. విటమిన్ టాబ్లెట్స్ లాంటివనుకోండి. కొద్ది వారాలు వాడితే చాలు. అశ్రద్ధ చెయ్యకండి. వాడకపోతే మరీ నీరస పడిపోతారు. మీరు అమలాపురం లో ఉద్యోగం లో చేరితే బక్క మనిషిని తెచ్చిపెట్టాడేంటి డాక్టరు గారు అనుకుంటారు వాళ్ళు నన్ను” అన్నాడు నవ్వుతూ రవికాంత్. 


నిజానికి ఆయన ఇచ్చింది ఆ వ్యాధికి సంబంధించిన మాత్రలు. వసంత్ కు వాటిగురించి ఏమీ అనూమానం రాలేదు. ఉద్యోగం చూస్తానన్నమాటే అమృతపుజల్లులా అనిపించింది. 


“అలాగే బావగారూ, మాత్రలు వేసుకోవటం ఇప్పుడే మీ ముందే మొదలుపెడతాను. మీ చెల్లెలికి ఇష్టమైతే అమలాపురం వచ్చి జాయినవుతాను” అన్నాడు సంతోషాన్ని దాచుకుంటూ. 


ఆ మాటల్లో ఆ ముఖకవళికల్లో పాత వసంత్ కనిపించాడు రాధిక కు. కళ్ళతోనే కృతజ్ఞతలు చెప్పింది రవికాంత్ కు. 


“నువ్వంతగా చెబుతుంటే కాదంటామా అన్నయ్య. తప్పకుండా అమలాపురం వస్తాం. ఆయనక్కడ నువ్వు చెప్పిన కంపెనీ లోనే చేరతారు” అంది.


 అప్పుడామె ముఖంలో అతి పెద్ద భారం దిగిపోయిందన్న ప్రశాంతత, అంతులేని సంతోషము చూసి రవికాంత్ ముఖంలో ఒక సంతృప్తికరమైన చిరునవ్వు మెరిసింది. 


***శుభంభూయాత్‌***


అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

 రచయిత పరిచయం

రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.


అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.


ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,


ఆంధ్రభూమి, దేశభక్తిసాహిత్య ఈ పత్రిక, సహరి, మిసిమి,తపస్విమనోహరం,మాధురి


మాసపత్రిక,ఉషాపక్షపత్రిక, సుమతి మాస పత్రిక, షార్‌ వాణి,మన తెలుగు కథలు.కామ్‌.


బిరుదులు- సాహిత్యవిక్రమార్క- దేశభక్తిసాహిత్య ఈ పత్రిక


ఉత్తమ రచయిత- మనతెలుగుకథలు.కామ్‌.


కలహంస—- నెలవంక- నెమలీక మాస పత్రిక.


ప్రథమబహుమతులు- నవలల విభాగము- మనతెలుగుకథలు.కామ్‌ మరియు


త‌పస్విమనోహరము.


ప్రథమద్వితీయబహుమతులు— కథల విభాగము- సహరి, మనతెలుగుకథలు.కామ్‌


చారిత్రక నవలలో ప్రథమ, ద్వితీయబహుమతులు.


సాంఘికనవలలో ద్వితీయ, కన్సోలేషన్‌ బహుమతులు.


ఇవేకాక ఆర్థిక, సామాజిక, ఆరోగ్య, ,రాజకీయ సంబంధించి పెక్కు వ్యాసాలు పత్రికల్లో వస్తూంటాయి.


కవితలు కూడా అన్ని విషయాల మీద కూడా వస్తూంటాయి.



30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.








Commentaires


bottom of page