చూస్తున్నాడు జాగ్రత్త
- Srinivasarao Jeedigunta
- Apr 17
- 6 min read
#JeediguntaSrinivasaRao, #చూస్తున్నాడుజాగ్రత్త, #ChusthunnaduJagrattha, #JeediguntaSrinivasaRao, #TeluguMoralStories, #నైతికకథలు

Chusthunnadu Jagrattha - New Telugu Story Written By Jeedigunta Srinivasa Rao
Published In manatelugukathalu.com On 17/04/2025
చూస్తున్నాడు జాగ్రత్త - తెలుగు కథ
రచన : జీడిగుంట శ్రీనివాసరావు
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
పురుషోత్తం అతి తక్కువ తెలివితేటలతో సీనియారిటీ మీద, యింకొన్ని అర్హతలు వల్ల పెద్ద ఆఫీసర్ అయ్యాడు. ఇతను చిన్న పోస్టులో వుండగా హెడ్ ఆఫీస్ లో చీఫ్ ఇంజనీర్ కి పర్సనల్ అసిస్టెంట్ గా చేస్తున్న మధుసూదన్, పురుషోత్తం కి లీవ్ లెటర్ కూడా రాసి యిచ్చేవాడు. పురుషోత్తం అంత తెలివితేటలు గలవాడు. సీనియారిటి మీద యిప్పుడు మధుసూదన్ కే ఆఫీసర్ గా వచ్చాడు.
పురుషోత్తం జాయిన్ అయిన రోజునే మధుసూదన్ ఆయన గదిలోకి వెళ్లి “సార్! మీరు జూనియర్ ఇంజనీర్ గా వున్నప్పుడు నుంచి నేను మీకు తెలుసు, యిద్దరం స్నేహితులు లా వున్నాము మొన్నటి వరకు. యిప్పుడు మీరు నాకు బాస్. మీరు నాకు ఏదైనా చెప్పాలి అనుకుంటే మొహమాటం అడ్డురావచ్చు, అందుకే నన్ను వేరే ఆఫీసర్ దగ్గరికి ట్రాన్సఫర్ చెయ్యండి”.
“బలేవాడివి మధు, నీ క్రింద ముగ్గురు అసిస్టెంట్స్ వున్నారు, ఏదైనా ముఖ్యమైన పని అయితే తప్పా నిన్ను పిలవనులే” అన్నాడు పురుషోత్తం గారు.
ఒక రోజున రంగారెడ్డి అనే పెద్ద కాంట్రాక్టర్ చేతిలో పెట్టితో పురుషోత్తం గారి రూంలోకి డైరెక్టుగా వెళ్ళిపోయాడు. సహజంగా విజిటర్స్ ఎవ్వరు వచ్చినా మధుసూదన్ దగ్గరికి వచ్చి కూర్చుంటే మధుసూదన్ ఫోన్లో పురుషోత్తం గారికి ఫోన్లో చెప్పి పర్మిషన్ తీసుకుని పంపుతాడు. అటువంటిది ఈ రంగారెడ్డి గారు అలా లోపలికి వెళ్ళి యిలా ఒట్టి చేతులతో బయటకు వచ్చి అటెండర్స్ కి అయిదు వందల నోట్లు యిచ్చి వెళ్ళిపోయాడు.
పదినిమిషాల తరువాత పురుషోత్తం గారి పిలుపుతో లోపలికి వెళ్ళాడు మధుసూదన్.
“యిదిగో మధు! నేను మీటింగ్ కి వెళ్తున్నాను, రావడానికి ఆలస్యం అవుతుంది, అందాక ఈ బ్యాగ్ నీ దగ్గర జాగ్రత్తగా పెట్టు” అన్నాడు ఇందాక రంగారెడ్డి యిచ్చిన బ్యాగ్ యిస్తో.
బాస్ చేతుల్లోనుంచి బ్యాగ్ తీసుకోకుండా, “అందులో ఏముంది సార్?” అన్నాడు.
“ఏముంటే నీకెందుకు? ఈ బ్యాగ్ నీ దగ్గర వుంచు. తరువాత తీసుకుంటా” అన్నాడు పురుషోత్తం.
“సారి సార్, నేను యిటువంటి పనులు చెయ్యను. ఖర్మ కాలి మీరు అటువెళ్ళగానే ఏసీబీ వాళ్ళు వచ్చి నా దగ్గర వున్న బ్యాగ్ పట్టుకుంటే, అప్పుడు ఈ బ్యాగ్ మీది అని ఒప్పుకుంటారా” అన్నాడు మధు.
“చాల్లే నీతులు చెప్తున్నావు, ఇదివరకు పనిచేసిన ఆఫీసర్స్ బ్యాగ్లు నువ్వు దాయకుండానే ఇన్నాళ్ళు పనిచేసావా” అన్నాడు నవ్వుతూ.
“సార్! యింతకు ముందు ఆఫీసర్స్ వాళ్ళు ఏమి చేసుకున్నారో నాకు తెలిసేది కాదు. మీరు ఓపెన్ గా యిటువంటి బహుమతులు తీసుకోవడం వలన మీకే ప్రమాదం. యిహ నా విషయం అంటారా.. నా తల్లిదండ్రులు నాకు నిజాయితీ గా బతకడం నేర్పారు. నాకు వచ్చే జీతం చాలు” అని బయటకి వచ్చేసాడు.
కాసేపటికి డ్రైవర్ బాషా ఆ బ్యాగ్ ని తీసుకుని వెళ్ళాడు, అతని వెనుక బాస్ మధు వైపు కోపంగా చూసుకుంటో వెళ్ళాడు. రాత్రి పది అయ్యింది, తన అసిస్టెంట్స్ ని ఆరుగంటలకే పంపించేసి తానొక్కడే బాస్ కోసం ఎదురు చూస్తున్నాడు. రెండు సారులు ఫోన్ చేసినా బాస్ రిప్లై ఇవ్వకపోవటంతో యింటికి వెళ్ళిపోయాడు మధుసూదన్.
వారం గడిచిన పురుషోత్తం మధుసూదన్ ని పిలవటం లేదు, అన్ని పనులు మిగిలిన అసిస్టెంట్స్ తో చేయించు కుంటున్నాడు. ఈలోపుల రెండు సారులు బ్యాగ్ లు డ్రైవర్ తీసుకుని వెళ్లడం చూసాడు.
ఒకరోజు అటెండెన్స్ లో సంతకం పెడుతున్న బాషా ని అడిగాడు.
“సార్ యింటికి వెళ్లేదాకా బ్యాగ్ ని సీట్ కింద పెట్టి ఉంచుతాను, యింటికి వెళ్లిన తరువాత బ్యాగ్ తీసుకుని అయిదు వేలు యిస్తున్నారు వుంచుకోమని” అన్నాడు.
“నువ్వు బాంబు ని సీట్ కింద పెట్టుకుని వెళ్తున్నావు అని తెలుసా” అన్నాడు మధుసూదన్.
“తెలుసు సార్! నేను ఒప్పుకోకపోతే టిప్పర్ మీదకి ట్రాన్సఫర్ చేస్తాను అన్నాడు, పైగా డబ్బులు యిస్తున్నాగా ఏం రోగం అని తిట్టాడు సార్, అందుకే ఒప్పుకున్నా” అన్నాడు బాషా.
అసిస్టెంట్స్ తయారుచేసిన మూడు టి. ఏ బిల్లులు తిరిగిరావడం తో మధుసూదన్ ని పిలిచి, “నువ్వు ఏం చేసున్నావు, బిల్లులు తిరిగి వచ్చాయి. వూరికే కూర్చుని వుంటే ఎలా, బిల్లులు చెక్ చెయ్యాలిగా” అన్నాడు కోపంగా.
“సార్! అదివరకు నన్ను బిల్లులు వెయ్యమని చెప్పేవారు, కొన్నాళ్ళు గా నాకు చెప్పటం లేదు, అవి ఎందుకు తిరిగి వచ్చాయో తెలియదు” అన్నాడు.
“సరేలే కథలు బాగా చెప్తావు, వీటిని తీసుకుని, సరిచేసి మళ్ళీ పంపండి” అన్నాడు. ఆ తరువాత నుంచి మళ్ళీ మాములుగానే వున్నాడు.
రోజులు గడుస్తున్నాయి, ఒకరోజు పురుషోత్తం స్నేహితులు సాయంత్రం ఆఫీసుకి వచ్చి ఆయన్ని కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. పురుషోత్తం ఇంటర్ కమ్ లో మధుసూదన్ రమ్మని పిలిచి కొన్ని మాంసాహార పదార్ధాలు చెప్ప తెప్పించమన్నాడు.
“క్షమించండి సార్! నేను బ్రాహ్మణ్ణి. మీరు చెప్పిన పదార్ధాలు నాకు అర్ధం కావడం లేదు, వేరే అతనిని పంపుతాను” అన్నాడు మధుసూదన్.
పురుషోత్తం నవ్వుతో “మీ భ్రమ్మిన్స్ పోటీ పడటం తో మావి రేట్లు పెరిగిపోయాయి, నిన్ను తినమనటం లేదు, మాకు తెప్పించు. వెళ్ళు” అన్నాడు.
తనవిషయం తెలిసి అవమానం చెయ్యడానికి అని తనకి ఈ పని అప్పగించాడు అని, అటెండర్ ని పిలిచి లిస్ట్ యిచ్చి ‘తీసుకుని వచ్చి వాళ్ళకి వడ్డించు’ అన్నాడు.
అటెండర్ ద్వారా తెప్పించాడు అన్న కోపంతో వున్నాడు పురుషోత్తం.
ఆరోజు మీటింగ్ జరిగిన తరువాత, మధుసూదన్ ని పిలిచి ఆరువేల రూపాయలు యిచ్చి తనకి, యింకో ఇంజనీర్ కి ఫస్ట్ క్లాస్ టికెట్స్ తెప్పించమన్నాడు. తన గదిలోకి వచ్చి రైల్వే రిజర్వేషన్ ఫారం పూర్తి చేసి ట్రావెల్ ఏజెంట్ కి పంపుదామనుకుంటో వుండగా లోపల నుంచి ఆ ఇంజనీర్ బయటకు వచ్చి “మధుసూదన్! టికెట్స్ మీరు తెప్పించకండి, యింకా యిద్దరు ఆఫీసర్స్ కూడా వస్తున్నారు. కంపెనీ వాళ్ళు మీ సార్ కి కూడా తెప్పిస్తారు. సార్ యిచ్చిన డబ్బులు వెనక్కి యిచ్చేయండి” అని చెప్పి వెళ్ళిపోయాడు. బాస్ కూడా మీటింగ్ కి వెళ్లిపోవడం తో టికెట్స్ తెప్పించడం మానేసాడు.
సాయంత్రం ఆరుగంటలకి ఎవ్వరో ఒకతను పురుషోత్తం గారి టికెట్ తెచ్చి మధుసూదన్ కి యిచ్చి వెళ్ళిపోయాడు. రాత్రి తొమ్మిది గంటలకు వచ్చిన బాస్ రూమ్ లోకి వెళ్లి టికెట్, డబ్బులు యిచ్చాడు.
“ఏమిటి ఈ డబ్బు?” అన్నాడు పురుషోత్తం టికెట్ జేబులో పెట్టుకుంటూ. జరిగిన విషయం చెప్పి, “మీ స్నేహితుడు అయిన ఇంజనీర్ గారు చెప్పడం వలన నేను టికెట్ కొనలేదు, ఆయనే కొని పంపించారు” అని అన్నాడు.
“నాకు ఎవడో ముష్టి వేస్తే తప్పా టికెట్ కొనుక్కోలేను అనుకున్నావా, నా నిజాయితీ నీకు తెలియదు అనుకుంట, అదివరకు ఈ సీట్ లో పని చేసిన లంచగొండులు దగ్గర పని చేసిన నీకు చెయ్యి జాపడం అలవాటు అయ్యింది. అవునులే.. మీకు అడుక్కోవడం తప్పులేదుగా” అంటూ పిచ్చపట్టినట్టు వాగడం మొదలుపెట్టాడు.
“మాట్లాడింది చాలు సార్! మీరు ఎంత నిజాయితీ గలవారో రోజు కాంట్రాక్టర్లు నా దగ్గర కవర్లు తీసుకుని డబ్బు పెట్టి యివ్వడం నాకు తెలుసు సార్, మీ ముందు పనిచేసిన ఆఫీసర్లు ఎవ్వరు ఈ విధంగా నైట్ బజారు నడపలేదు. అందుకే ఇన్నాళ్ళు పనిచేసాను. యిహ ప్రస్తుత విషయం.. నీ ఫ్రెండ్ వచ్చి చెప్పడం వలన టికెట్స్ తెప్పించలేదు. మీకు యిష్టం లేకపోతే మీ టికెట్ డబ్బులు వెనక్కి యిచ్చేయండి. అనవసరంగా నోరు పారేసుకుంటే పై వాడు చూస్తున్నాడు అని గ్రహించండి. యిహ మీ దగ్గర పని చెయ్యడం నావల్ల కాదు.
ఒక్కవిషయం! మీ రూమ్ లో కి రావాలి అంటే ఉద్యోగస్తులు భయపడిపోతున్నారు అని గ్రహించండి. భగవంతుడు మీకు ఈ పదవి యిచ్చింది మంచి చేస్తారని, యిలా అందరిని అవమాన పరిస్తే పదివి యిచ్చిన వాడికి లాగేసుకోవడం ఎంతోసేపు పట్టదు. యిహ సెలవ్” అని బయటకి వచ్చేసాడు.
అనుకున్నట్టే మర్నాడు ఉదయం ఆఫీస్ కి వెళ్లిన మధుసూదన్ కి తెలిసింది తనని పరిపాలనా విభాగం కి ట్రాన్సఫర్ చేసినట్టు. వెంటనే బాధ్యతలు తన అసిస్టెంట్ కి అప్పచెప్పి తను నూతన బాధ్యతలు తీసుకున్నాడు. సాయంత్రం శ్రీధర్ అనే అసోసియేషన్ మెంబెర్ వచ్చి “పురుషోత్తం గారి రహస్యాలు మీకు తెలుసు. ఒక్కసారి ఏసీబీ కంప్లైంట్ ఇవ్వండి” అని హితబోధ చేసాడు.
“నాకు అటువంటి పాడుపనులు చెయ్యడం రాదు, పైనుంచి దేముడు చూస్తున్నాడు” అని పంపించేసాడు.
ప్రశాంతంగా వున్న సర్వీస్ పూర్తి చేసి రిటైర్ అయ్యాడు మధుసూదన్. ఆరోజు రిటైర్ అవుతున్న వారికి వీడ్కోలు సభ మొదలైంది. ముఖ్యఅతిది పురుషోత్తం గారు వచ్చి తన సీట్ లో కూర్చున్నాడు.
చివరి కుర్చీలో వున్న మధుసూదన్ ని చూసి ఆశ్చర్యం తో తన కుర్చీలోనుంచి లేచి వచ్చి మధుసూదన్ పక్కన కుర్చీ వేయించుకుని కూర్చుని, “ఏం మధు.. యిది నిజమా, నువ్వు నాకంటే పెద్దవాడివా వయసులో? నిన్ను చూసినప్పుడల్లా నాకు నా కంటే చిన్న వాడివి అనిపించేది. తెలిసి, తెలియక నిన్ను ఏదైనా బాధ పెడితే మర్చిపో. రేపటి నుంచి నువ్వు నా దగ్గర కాంట్రాక్టు పద్ధతి లో ఉద్యోగం చెయ్యి” అన్నాడు.
“సార్! మీ ప్రేమ కి కృతజ్ఞతలు. అయితే మా పిల్లలు యిహ విశ్రాంతి తీసుకోండి అని గొడవ పెడుతున్నారు. మీ ఆఫర్ నేను స్వీకరించలేను” అన్నాడు. దానితో ‘సరే నీ యిష్టం’ అని, మధుసూదన్ కి శాలువా కప్పి సభనుంచి వెళ్ళిపోయాడు గతం గుర్తుకు వచ్చిన పురుషోత్తం.
పిల్లల దగ్గర ప్రశాంతంగా గడుపుతున్న మధుసూదన్ కి అతని దగ్గర పని చేసిన క్లర్క్ ఫోన్ చేసి, “సార్ పురుషోత్తం గారు క్యాంపు నుంచి వస్తోవుండగా ఆయన కారుకి ఆక్సిడెంట్ అయ్యింది. డ్రైవర్ బాషా అక్కడే చనిపోయాడుట, సార్ ని హాస్పిటల్ లో జాయిన్ చేసి ఆపరేషన్ చేసారు” అని చెప్పాడు.
“అయ్యో! నువ్వు వెళ్లి చూసావా? యిప్పుడు ఎలా వుంది” అని అడిగాడు మధుసూదన్.
“లేదు. సార్ ఐసీయూ లో వున్నారు. రానివ్వలేదు” అన్నాడు.
“సరే, రూమ్ కి మార్చినప్పుడు చెప్పు. వచ్చి చూస్తాను” అన్నాడు.
వారం రోజుల తరువాత ఫోన్ చేసి “బాస్ మిమ్మల్ని రమ్మని చెప్పామన్నారు, ఒకసారి వచ్చి వెళ్ళండి, రూమ్ నెంబర్ 106” అన్నాడు.
కొద్దిగా చల్లబడ్డ తరువాత బయలుదేరి నిమ్స్ హాస్పిటల్ కి వెళ్ళి పురుషోత్తం గారు వున్న రూంలోకి వెళ్ళాడు. భర్త కి దానిమ్మ గింజలు తినిపిస్తోంది పురుషోత్తం గారి భార్య.
మధుసూదన్ని చూడగానే భార్యని కొద్దిసేపు బయట కూర్చోమని, “ఏం మధు.. చూసావా నా పరిస్థితి. ఓపిక, పదవి, పవర్ చూసుకుని నా అంతటి వాడు లేడు అనుకుని అందరిని బాధపెట్టాను. డబ్బులు సంపాదన ముందు ఎదుటివారికి కూడా మర్యాద ఉంటుంది అని ఆలోచించలేదు. నువ్వు చెయ్యని తప్పుకి నిన్ను అవమానం చెయ్యడంకి కారణం మన కులాలే. మొదట్లో నువ్వు అంటే నాకు చాలా యిష్టం. ఎప్పుడైతే నువ్వు బ్రాహ్మణ కులం కి చెందినవాడివి అని తెలిసిన దగ్గర నుంచి నాకు తెలియకుండానే నీమీద ద్వేషం పెరిగింది. అలా అని నిన్ను చూడకుండా వుండలేను. ఆ దురదృష్టం రాత్రి నిన్ను చాలా అవమానించాను. నువ్వు అన్నది నిజమే. పైనుండి భగవంతుడు అన్నీ చూస్తున్నాడు. బలవంతుడు విర్రవిగి నప్పుడు సరైన బుద్ది చెప్పటానికి సందేహించడు.
నేను ఒక్క సంతకం పెడితే నీ ఉద్యోగం వూడుతుంది అన్నాను. అందుకే..” అంటూ దుప్పట్లోనుంచి మొండి చేతులు బయటకు తీసాడు.
“మోచేతుల వరకు ఆక్సిడెంట్ లో పోయాయి. యిప్పుడు సంతకం పెట్టడానికే లేకుండా చేసాడు పై వాడు” అన్నాడు కళ్ళు నీళ్లు పెట్టుకుంటూ.
“సార్! ఇది అంతా మనం చేసుకున్న ఖర్మ సార్. మనం కష్టపడి సంపాదించుకున్నదే మనది. ఇతరుల డబ్బులు పాపం తో సమానం. ఆ డబ్బులతో కుటుంబాన్ని పోషించితే యజమాని ఆ డబ్బులు యిచ్చినవాడే అవుతాడు.
భగవంతుడు ఎందుకు ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు సార్, అంతా మన మంచికే అనుకోవాలి. దైర్యం గా వుండండి. కోలుకున్న తరువాత మీ రూమ్ బయటకు వచ్చి చూడండి సార్. ఎంతో మంది బీదవాళ్ళు తమ వారికి వైద్యం కోసం కళ్ళలో ప్రాణాలు పెట్టుకుని వున్నారు. వీలుంటే ఆ పాడు డబ్బులతో వాళ్ళకి సహాయం చెయ్యండి” అన్నాడు.
ఇంతలో డాక్టర్ గారు రావడంతో మధుసూదన్ బయటకు వచ్చేసాడు.
పురుషోత్తం గారు ఉద్యోగం కి పనికి రారు అని గవర్నమెంట్ రిటైర్మెంట్ యిచ్చింది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి యింట్లో విశ్రాంతి తీసుకుంటున్న పురుషోత్తం గారికి తెలిసింది.. తను పని చేసిన ఆఫీసు మీద ఏసీబీ దాడి చేసి పెద్ద ఇంజనీర్లను కొంతమంది అరెస్ట్ చేసి జైలుకి పంపించారు అని విని ఒణికిపోయాడు. మధుసూదన్ ‘జరిగింది అంతా మన మంచికే’ అంటే యిదే. ఆక్సిడెంట్ కాకుండా వుంటే తను కూడా అరెస్ట్ అయ్యేవాడిని అనుకున్నాడు.
ఆరోజు నుంచి డ్రైవర్ కుటుంబం కి సహాయం తో మొదలుపెట్టి అవసరమైన వాళ్ళని గుర్తించి సహాయం చెయ్యడం మొదలుపెట్టాడు.
మీరు కష్టపడి సంపాదించినదే మీది. యితరుల సొమ్ము గాని, యితరులకు హాని, క్షోభ పెట్టడం, పదవి గర్వంతో కన్నుమిన్ను కానకుండా ఉండటం.. అంతా చూస్తున్నాడు జాగ్రత్త.
శుభం
జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


@t.s.sbhargavateja6196
• 3 hours ago
Chala bavundi maastaru garu kadha. Chala practical ga nija jeevita satyam