top of page

దైవం మానుష రూపేణా….


ఈ కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.



'Daivam Manusha Rupena' written by Neeraja Hari Prabhala

రచన : నీరజ హరి ప్రభల

" ఛీ ! ఛా! ఆంటున్నా వదిలి పోవు . వెధవ పీడ. ఈ దరిద్రం ఇంతటితో పోయేదికాదు. ఏలనాటి శని లాగా పట్టుకున్నావు." ఉదయాన్నే రమేష్ తిట్లు వినిపిస్తున్నాయి.

"వేదమంత్రాల మధ్య అగ్ని సాక్షిగా తాళి కట్టి ఇలా ప్రతిరోజూ నన్ను వేధించటం మీకు న్యాయమా? పైగా ఇద్దరు చిన్న పాపలు కూడా ఉన్నారు. ఏం తప్పు చేశానని నన్ను మీరు, మీ అమ్మ ఇలా నిత్యం వేధించటం? " కాస్త గట్టిగానే అడుగుతోంది సరోజ.

"నన్నే ఎదురు ప్రశ్నించే ధైర్యం వచ్చిందా? ఇంక నీవు , నీ పిల్లలు ఎక్కడికి పోతారో ? ఏం చస్తారో నాకనవసరం "

అన్నాడు రమేష్.

అతని మాటలకు వత్తాసుగా అతని తల్లి కాంతమ్మ అందుకుని,

" భర్త అనే గౌరవం కూడా లేకుండా వాడి మాటకు మాట ఎదురు చెపుతావా ? మాకాలంలో ఇంత చోద్యం ఎక్కడా చూడలేదు. అత్త గారన్నా , మొగుడన్నా భయపడుతూ మసిలేవాళ్ళం. పిదపకాలం పిదపబుధ్ధులు. నేను చెప్పినట్టు మా తమ్ముడి కూతురిని చేసుకుంటే నీవు సుఖపడేవాడివిరా. ఒక్కగా నొక్క కూతురు. లంకంత ఇల్లు, లక్షల విలువచేసే మాగాణి పొలం. ఎంత చెప్పినా వినకుండా మేనరికం వద్దని ఈ కొరివి దెయ్యాన్ని తెచ్చుకున్నావు. అనుభవించు." అని కొడుకుని ఎగదోసింది.

అలా తిట్ల వర్షం పెరిగి చివరకు రమేష్ రెచ్చిపోయి సరోజ మీదకు చేయిచేసుకోవడం, రమేష్ విసురుగా బయటికి వెళ్ళడం, ఆ తర్వాత ఆమె ఏడుపు….

అన్నీ వినిపిస్తూనే ఉన్నాయి ప్రక్కింట్లో ఉంటున్న విశ్వనాధం గారికి , ఆయన భార్య పార్వతమ్మ కు.

ఉపాధ్యాయుడిగా పదవీ విరమణ పొందాక వచ్చిన డబ్బుతో ఆకాలనీలో ఒక చిన్న ఇల్లు కొనుక్కుని , తనకు వచ్చే పెన్షన్ తో భార్యతో సంతోషంగా ఉంటున్నారు విశ్వనాధం గారు. ఆయన ఏకైక కొడుకు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉంటూ, మూడేళ్ళకొకసారి తన భార్యాబిడ్డలతో ఇక్కడికి వచ్చి వీళ్ళతో సంతోషంగా కొన్నాళ్ళు గడిపివెళ్ళటం పరిపాటి. వాళ్ళున్నన్ని రోజులు ఆ దంపతులకు పండుగరోజులు. మరలా వాళ్ళందరూ వెళ్ళాక తమ యాంత్రిక జీవనంలోకి క్రమేణా అలవడుతారు పార్వతమ్మ వాళ్ళు.

సహజంగా మంచి మనుషులైన విశ్వనాథం దంపతులు ఆ కాలనీలో ఎవరికి ఏ సహాయం కావలసివచ్చినా సాయపడుతూ అందరికీ తలలో నాల్కలా ఉంటున్నారు. ఆ కాలనీలో అందరికీ ఆయనే పెద్దదిక్కు. ఆయన మాటకు అందరూ విలువిస్తారు. సాఫ్టువేరు ఇంజనీరైన రమేష్ వీళ్ళ ప్రక్క ఇంటిని కొనుక్కొని తల్లి, భార్య, ఇద్దరు పిల్లలతో ఇక్కడికి చేరి 6 నెలలైంది. అప్పటినుండి ఆ ఇంట్లో ఆ తల్లి, కొడుకులు రావణకాష్టంలా రగులుతూ సరోజను కాల్చుకు తింటున్నారు. మొదట్లో ఇది వాళ్ళ కుటుంబ గొడవలు, భార్యాభర్తల మనస్పర్థలు కాబోలు, క్రమేణా అవే సర్దుకుంటాయిలే, వాళ్ళ మధ్యలో ఇతరులు చొరవచేయకూడదు అనుకుని మనసుకు సర్దిచెప్పుకున్నారు విశ్వనాధం, చుట్టుప్రక్కల వాళ్ళూ. కానీ రానురానూ మితిమరి పోతుంటే పెద్దమనిషిగా ఒకసారి కల్పించుకుని వాళ్లకు సర్దిచెప్పబోయి చివాట్లు కూడా తిన్నారు విశ్వనాధంగారు. కానీ నిత్యం సరోజ స్ధితిని తలుచుకుని బాధ పడుతూ ఒకరోజు గుడిలో ఆ అమ్మాయిని కలుసుకుని ఆమె వివరాలను అడిగారు విశ్వనాధం దంపతులు.

చిన్నప్పుడే తల్లితండ్రులను కోల్పోయిన తనను మేనమామ పెంచి పెద్దచేసి పెళ్ళిళ్ళ పేరయ్య ద్వారా రమేష్ సంబంధాన్ని ఖాయంచేసి వాళ్ళడగిన కట్నాన్ని ఇచ్చి తన శక్తిమేర పెళ్ళి చేశాడు. మధ్యతరగతి కుటుంబం, ఇద్దరు ఆడపిల్లలున్న ఆయన స్ధితి అంతంత మాత్రమే.

సరోజ ను పెంచి పోషించటమే దండగ అనుకునే ఆయన భార్యకు, ఆమెకోసం కట్నమిచ్చి పెళ్ళి చేయటం ఏమాత్రం ఇష్టంలేదు. ఎలాగో భార్యను ఒప్పించి సరోజకు పెళ్లి చేశాడాయన. ఎలాగోలా సరోజ వదిలిపోయిందనుకుని సంతోషపడిందావిడ. అలాంటి పరిస్థితిలో మెట్టినింట కోడలుగా అడుగుపెట్టిన తొలిరోజుల నుంచి తనకు నిత్యము భర్త, అత్తల ఆగడాలు ఎక్కువయ్యాయి.

పెళ్ళికి ముందే తన భర్తకు మరొక అమ్మాయితో సంబంధం ఉందనీ, అది ఇంకా కొనసాగుతూనే ఉందని, అతనికి ఈ పెళ్ళి ఇష్టం లేదని , ఏ అండాలేని తనను భార్యగా, కోడలిగా చేసుకుంటే వాళ్ళ ఇష్టారాజ్యంగా ఉండచ్చు అన్న మాటలను భర్త నోటివెంట విన్న సరోజకు ఒక్క సారిగా కాళ్ళ క్రింద భూమి కదిలినట్లయి మనసులోనే కుమిలి కుమిలి ఏడ్చింది. ప్రేమతో భర్త మనసుని మార్చి కాపురాన్ని సరిదిద్దుకునే ప్రయత్నంలో ఎన్నోమార్లు ప్రయత్నించి విఫలమైంది. కాలక్రమేణా ఇద్దరు ఆడపిల్లలు పుట్టాక తనను బయటికి గెంటేసే దుర్భుద్థి ఎక్కువై ఎలాగైనా తనను, పిల్లలను వదుల్చుకోవాలని నిత్యం నరకాన్ని చూపిస్తున్నారని తన గోడంతా వెళ్ళబోసుకుంది సరోజ. అంతా విన్న విశ్వనాధం దంపతులు ఆమెను ఓదార్చి ధైర్యం చెప్పి ఇంటికి పంపారు.

కొన్నాళ్ళకు ఆ కాలనీ లోని వాళ్ళ సపోర్టు తీసుకుని సరోజకు ఏమైనా సాయం చేయాలనుకున్నారు విశ్వనాధం గారు. భార్యను వేధిస్తున్నాడని రమేష్ పైన కేసు పెట్టడం, వాళ్ళు వచ్చి అతన్ని అరెస్టు చేయడం , అతను వాళ్లకు డబ్బులిచ్చి బయటికి రావడం జరిగాయి. క్రమేణా ''మనకెందుకులే ఈ గోల ' అనుకుని చుట్టుపక్కల వారు కూడా వెనక్కి తగ్గారు. మహిళా మండలుల సాయం తీసుకుని సరోజ చేత విడాకుల కేసు వేయించి ఆమెకు ధైర్యాన్నిచ్చి అండగా నిలబడ్డారు విశ్వనాధం గారు.

ఇంత జరిగాక ఆ ఇంట్లో ఆమెకు రక్షణ ఉండదని సరోజను, పిల్లలను ఒక ఉచిత హాస్టల్ లో ఉంచి, అక్కడే ఆమెకు ఒక ఉద్యోగం, పిల్లలకు చదువులు ఏర్పాటు చేశారు. కన్నీళ్ళతో, రెండు చేతులతో నమస్కరిస్తున్న సరోజకు "నీవు మా అమ్మాయివి తల్లీ! థైర్యంగా ఉండు. నీకెప్పుడు ఏ అవసరం కావలసిన వచ్చినా మాకు ఫోన్లు చేయటం మరవద్దు. సంతోషంగా ఉండు. అప్పుడప్పుడు మేము వస్తాము " అని తమ ఫోన్ నెంబరు, కొంత నగదు ఇచ్చి ఇంటికి వచ్చారు విశ్వనాధం దంపతులు.

కొన్నాళ్ళకు హార్ట్ఎటాక్ తో కాంతమ్మ కాలం చేసింది. రమేష్ సరోజను తనతో ఇంటికి రమ్మని హాస్టలుకు వెళ్ళి కూడా ఆమెను అల్లరిచేయసాగాడు. సరోజ ససేమిరా అతనితో కాపురానికి ఇష్టపడలేదు. తన పిల్లల భవిష్యత్తు కోసం మనసుని రాయిగా చేసుకుని అతనితో తెగతెంపులు చేసుకుని విడిగా బ్రతకాలని నిర్ణయించుకుంది. సరోజ ద్వారా విషయం తెలిసి విశ్వనాధం ఆమెకు ధైర్యం చెప్పారు.

కొంత కాలానికి కోర్టు కేసులో సరోజకు రమేష్ తో విడాకులు రావడం, రమేష్ ఇంటిలో తన పిల్లలకు భాగం రావడం, రమేష్ దేశదిమ్మరై ఇల్లొదిలి ఎటో వెళ్ళిపోవడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. కొన్నాళ్ళకు సరోజ హాస్టలు ఖాళీచేసి తన పిల్లలతో స్వంత ఇంటికి వచ్చింది. విశ్వనాధం గారి ప్రోత్సాహం తో ఒక చిన్న కంపెనీలో ఉద్యోగం చేస్తూ ప్రైవేటుగా చదువుకొంటోంది. పిల్లలు కూడా చక్కగా చదువుకుంటున్నారు. సరోజకు కాస్త ఆర్ధిక స్వావలంబన , మానసిక స్వాంతన లభిస్తోంది. వాళ్లను 'అమ్మా , నాన్న ' అని పిలుస్తూ ఆదంపతులలో తన తల్లిదండ్రులను చూసుకుంటూ వాళ్లని కంటికి రెప్పలా కాపాడుకుంటోంది.

" దైవం మానుష రూపేణా అవతరించే " లాగా ఆ దైవమే విశ్వనాధం గారి రూపంలో వచ్చి తనకు, తన పిల్లలకు చేయి అందించి ఆదుకున్నారు. సరోజ నిత్యం ఆ దంపతులను స్మరిస్తూ వాళ్ళను చల్లగా చూడమని ఆభగవంతుడికి మనసులోనే చేతులెత్తి నమస్కరిస్తోంది.

***శుభం***

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

మనసులోని మాట

రచయిత్రి పరిచయం : "మన తెలుగు కధలు " వేదిక మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నీరజ ప్రభల. నాది చాలా చిన్న కుగ్రామంలో చాలా సాంప్రదాయ కుటుంబంలో జననం. అగ్రహారం. నాన్న గారు బాలకృష్ణ మూర్తి గారు బ్రాంచి పోస్ట్ మాస్టర్, వ్యవసాయ దారుడు, పంచాయతీ ప్రెసిడెంట్. అమ్మ కమల గృహిణి . మేము ఆరుగురం సంతానం. నాకు ముగ్గురు అక్కయ్యలు, ఇద్దరు అన్నయ్యలు. అందరిలోకీ నేనే ఆఖరిదాన్ని. చిన్న దాన్ని. నాకు చిన్న వయసులోనే వివాహం. మేము విజయవాడలో ఉంటాము. నేను గృహిణిని. మా వారు వాసుదేవశర్మ. రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మా కూతుళ్ళు, అల్లుళ్ళు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా డెన్మార్క్ , అమెరికాలలో సెటిలయ్యారు. మా ముగ్గురు అమ్మాయిలు చిన్నప్పటి నుంచీ కర్ణాటక సంగీతం నేర్చుకుని అనేక పోటీలలో గెలుపొంది , ప్రతి సం.. త్యాగరాజ ఉత్సవాలలో కచేరీలు చేసి ప్రముఖ విద్వాంసుల ప్రశంసలు పొందటం నా అదృష్టంగా ఎల్లప్పుడూ భావిస్తాను. అంతేకాకుండా పాడుతా తీయగా, పాడాలనుంది, రాగం- సంగీతం మొ.. ప్రోగ్రాములలో పాల్గొని పెళ్ళైనాక కూడా విదేశాల్లో కచేరీలు చేస్తూ అందరిచే ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం మాకు ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడు. నాకు చదువంటే చాలా చాలా ఇష్టం. పిల్లలు సెటిలయ్యాక B.Com, MA సంస్కృతం, MAఇంగ్లీష్, MA తెలుగు చేశాను. సంగీతం - సాహిత్యం నాకు ప్రాణం. సంగీతం నేర్చుకున్నాను. ఇప్పుడు వీణ కూడా నేర్చుకుంటున్నాను. టైపు, షార్ట్ హాండ్ ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణత. కధలు-కవితలు వ్రాస్తాను. మీ అందరి ప్రోత్సాహంతో కధలు, కవితలు వ్రాస్తున్నాను . నాకధలు లోగడ పత్రికలలో కూడా ప్రచురితమైనవి. గార్డెనింగ్, స్టిచింగ్, అల్లికలు, సాఫ్ట్ టాయ్స్ బొమ్మలు, డ్రాయింగ్ , ఫాబ్రిక్ పెయింటింగ్, రంగవల్లులు, క్రియేటివ్ ఆర్టికిల్స్ తయారీ మొ.. నా హాబీ. అమ్మ , నాన్న గారు స్వర్గస్ధులయ్యి 10 సం.. అయినది. నాకు నా మాతృభాష తెలుగు అంటే చాలా చాలా ఇష్టం, అభిమానం‌, గౌరవం. ఈ వేదిక మీద మిమ్మల్నందరినీ పరిచయం చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా కధలను ఆదరించి ప్రోత్సాహిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.🙏🙏




Yorumlar


bottom of page