గుండె చప్పుడు
- Mohana Krishna Tata
- Feb 14
- 4 min read
#MohanaKrishnaTata, #తాతమోహనకృష్ణ, #GundeChappudu, #గుండెచప్పుడు, #TeluguStories, #తెలుగుకథలు

Gunde Chappudu - New Telugu Story Written By Mohana Krishna Tata
Published In manatelugukathalu.com On 14/02/2025
గుండె చప్పుడు - తెలుగు కథ
రచన: తాత మోహనకృష్ణ
కళ్ళు తెరిచిన నాకు.. ఎక్కడున్నానో తెలియలేదు. చుట్టూ చూస్తే, అదేదో హాస్పిటల్ లాగ అనిపించింది. "జానకీ.. ! జానకీ.. !" అని ఉన్న ఓపికతో పిలిచాను.. కాదు అలవాటు ప్రకారం అరిచాను
"నేను ఇక్కడే ఉన్నాను.. !" అంటూ బయట కూర్చున్న నా భార్య.. ఎప్పుడూ వచ్చేలాగే మెల్లగా లోపలికి వచ్చింది
"నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను జానకి.. ? నిన్న ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మనిద్దరం బాల్కనీ లో కూర్చుని కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకున్నాము కదా.. ! అప్పుడు నేను బాగానే ఉన్నాను కదా.. మరి ఇప్పుడు ఇక్కడ ఎలా.. ? ఫ్రీ చెకప్ కోసం నన్ను ఏమైనా తీసుకొచ్చావా.. ?
"చెకప్ కాదు.. ఏమీ కాదు.. ! కబుర్లు మధ్యలో అనుకోకుండా మీరు కిందపడిపోయారు. మిమల్ని నేను మొయ్యలేక, చుట్టుపక్కల ఒక పదిమంది సాయంతో ఇక్కడ హాస్పిటల్ లో చేర్పించాను. "
"ఇంతకీ నాకు ఏమైంది.. ? బాల్కనీ కుర్చీ నుంచి ఇలా హాస్పిటల్ బెడ్ మీదకు ప్రమోషన్ ఎలా.. ?"
"ఇంత జరిగినా సరే.. మీ కామెడీ మానలేదు కదా.. "
"స్వర్గానికి వెళ్ళినా సరే, నేను మారనే.. అంతే.. !"
"ఎందుకా మాటలు చెప్పండి.. ! మీకు గుండె ఆపరేషన్ చేసారు.. అరడజను స్టెంట్స్ వేసారు. ఇప్పుడు మీరు బాగానే ఉన్నారు.. ఏమీ ఆలోచించకండి.. "
"గట్టిగా ఉండే నాకు స్టెంట్స్ వేసారా.. ?"
"మీరు ఇంకా చాలా బెటర్.. ఆ పక్క బెడ్ మీద ఉన్న అంకుల్ కి పది, ఎదురుగా బెడ్ మీద ఉన్న ఆంటీ కి ఇరవై వేసారు.. "
"ఏమిటి వేసారు.. స్టెంట్ లేనా.. ? అదేదో దోశలు వేసినట్టు చెబుతున్నావే.. ఇలా అయిపోయింది కాలం"
"కాదండీ.. మీరు చాలా లక్కీ అంటున్నా.. మీకోసం నేను నా రెండు గాజులే అమ్మేసాను.. వాళ్ళైతే ఒక్కొక్కరు రెండేసి ఎకరాలే అమ్మేసారు తెలుసా.. ?"
"ఏమిటో నీ సంబడం.. ?" అంటూ కళ్ళు మూసుకున్నాను. మళ్ళీ కళ్ళు తెరిచి చూసేసరికి.. 'స్వర్గలోకానికి ఆహ్వానం' అని బోర్డు కనిపించింది. పక్కనే నన్ను లోపలికి తీసుకుపోవడానికి రిచ్ కాస్ట్యూమ్స్ లో ఇద్దరు కనిపించారు
"అంటే నేను.. బకెట్ తన్నేసానా.. ? అయ్యో.. ! ఆపరేషన్ బాగానే అయిందని అన్నారుగా.. మా ఆవిడ నా కోసం తన 'చేతి రెండు గాజులు' అమ్మి మరీ నన్ను బతికించుకోవాలని ప్రయత్నం చేసింది కదా.. మళ్ళీ ఆమెకు గాజులు కొనడానికి నేను కుడా లేనే.. "
"నన్ను ఇక్కడకు తీసుకువచ్చింది మీరే కదా.. నన్ను ఒకసారి బ్రహ్మలోకానికి తీసుకుని పొండి.. " అని ఆ ఇద్దరినీ వేడుకున్నాను
"అది ఎలా కుదురుతుంది.. ? " అన్నారు ఆ ఇద్దరు
"ఒక గంట నన్ను అక్కడకు తీసుకుని వెళ్ళండి.. నన్ను అక్కడకు తీసుకుని వెళ్తే, భవిష్యత్తులో నాలాంటి వాళ్ళని ఇలా తిప్పడానికి మీకు ఇక్కడ ఓవర్ టైం పని ఉండదు.. పైగా చిల్ అవడానికి టైం బాగా దొరుకుతుంది"
నా మాటలు నమ్మి "అలాగే.. ఒక గంట మాత్రమే.. " అని ఇద్దరు నన్ను బ్రహ్మలోకానికి తీసుకుపోయారు
"ఓ బ్రహ్మదేవా.. ! నమస్కారం.. ! నా బాధను కొంచం వినండి అంటూ నా స్టోరీ స్టార్ట్ చేసాను..
నా చిన్నప్పుడు నాన్న పొలం పనులు చేసేవాడు.. అమ్మ ఇంటి పని చేసి అందరికీ వండి పెట్టేది. అప్పట్లో సంసారం సాఫీగా సాగేది. ఎవరూ ఎక్కువ టెన్షన్స్ పెట్టుకునేవారు కాదు. డబ్బు ఎక్కువ సంపాదించాలని, మేడలు కట్టాలని అంతగా ఆశ ఉండేది కాదు. రిటైర్ అయ్యాక, లేకపోతే దాచుకున్న డబ్బులతో ఎప్పుడో ఇల్లు కట్టుకునేవారు.. లేకపోతే ఎలాగో ఉన్న దానిలో సర్దుకు బతికేవారు.
అప్పట్లో తొందరగా డబ్బులు సంపాదించాలన్న ఆశ ఉండేది కాదు. ఉన్న దానిలోనే సంతోషంగా ఉండేవారు. అప్పుడు టెన్షన్స్ బాగా తక్కువ.. జబ్బులూ తక్కువే, ఖర్చులూ కుడా తక్కువే. ఎవరికో గాని.. బాగా వయసైపోయాక ఎక్కడో గుండె జబ్బులు మాట వినిపించేది. కానీ, నేడు.. గుండె జబ్బులు ఎక్కువే.. వైద్యం కోసం ఖర్చు ఎక్కువే. డబ్బులు ఖర్చు పెట్టినా.. లైఫ్ కి గ్యారంటీ లేదు స్వామీ.. !
ఉదయం లేచిన దగ్గరనుంచి భార్యాభర్తలు ఇద్దరు ఉరుకులు పరుగులు.. ఎందుకు.. ? డబ్బు సంపాదనకోసం. ఎంత డబ్బు వచ్చినా చాలదు. ఎక్కువ డబ్బు సంపాదించాలన్న తపనతో ఆరోగ్యం గాలికి వదిలేస్తున్నారు. టెన్షన్స్.. టెన్షన్స్.. లైఫ్ అంతా టెన్షన్స్ మయం ఈ కలి ప్రపంచంలో స్వామీ.. !
చదువు చదవలేక టెన్షన్..
ప్రేమిస్తే ఒక టెన్షన్.. పెళ్ళి అవకపోతే ఒక టెన్షన్.. ఒకవేళ పెళ్ళైతే మరొక టెన్షన్
భార్య కోరే గొంతెమ్మ కోరికలు తీర్చడానికి టెన్షన్..
కన్న పిల్లలు మాట వినరు.. టెన్షన్..
ఆఫీస్ కి లేట్ గా వెళ్తే బాస్ తిడతాడని టెన్షన్..
టైం కి ట్రైన్ అందుకుంటామా లేదో నన్న టెన్షన్..
భార్య పుట్టినరోజు మర్చిపోతే పడే టార్చర్ కి టెన్షన్..
అప్పిస్తే, తిరిగి రాక టెన్షన్..
ఎందులోన లేదు టెన్షన్.. ? ఈ కలికాలం లో అన్నింటిలోనూ టెన్షన్.. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి మొదలు ఆ టెన్షన్..
ఈ టెన్షన్స్ కి గుండెచప్పుడు లయ తప్పుతున్నది స్వామీ.. ! ఫలితము..
చిన్నారులకి గుండెపోటు..
పద్దెనిమిది నిండకుండానే గుండెపోటు..
ఆటలు ఆడుతూ గుండెపోటు..
వ్యాయామం ఎక్కువ చేస్తే గుండెపోటు..
డాన్స్ చేస్తూ గుండెపోటు..
నవ్వుతూ కుడా గుండెపోటే స్వామీ.. !
కాలంతో పరుగెడుతున్న మనిషికి.. అంతే వేగంగా అన్ని టెన్షన్స్ వస్తున్నాయి. తింటున్న తిండి కల్తీ అయినప్పుడు.. బీపీ కుడా డబుల్ సెంచరీ కామన్ అయిపోయిన ఈ రోజుల్లో.. చాలా వరకూ మనిషి చేసుకున్న తప్పిదాలే కారణములే అయినప్పటికీ.. కాలానుగుణంగా గుండె గట్టితనం అప్డేట్ చెయ్యకపోతే, ఆ పాత గుండె ఈ టెన్షన్స్ ఎలా తట్టుకుంటుంది స్వామి.. ? ఇన్ని టెన్షన్స్ మా గుండె భరించలేకపోతోంది స్వామి.. ఇక పై గుండె మరింత గట్టిగా నిర్మించమని నా మనవి స్వామి..!"
"తథాస్తు!"
**********
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
Profile Link:
Youtube Play List Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు
తాత మోహనకృష్ణ
నిజమే మరి, గుండె కి updated version కావాలి. చాలా బాగుంది కథ 👍🏻
కథ చాలా బాగుంది. అభినందనలు 👍
"గుండె చప్పుడు" కథ సమకాలీన జీవనశైలిపై హాస్యంతో కూడిన విమర్శ. కథానాయకుడు గుండెపోటుతో ఆసుపత్రిలో మేల్కొని, స్వర్గానికి వెళ్లినట్టు అనుభవించి, బ్రహ్మతో నేటి సమాజంలోని టెన్షన్ జీవితం గురించి తన మనోభావాలను పంచుకుంటాడు. హాస్యంతో పాటు వ్యంగ్యం కూడా ఉంది. కుటుంబ, ఉద్యోగ బాధ్యతలు, డబ్బు సంపాదనపై పెరుగుతున్న ఒత్తిళ్లు ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతున్నాయని కథ చెబుతుంది. కథలో హాస్యం, నిజం కలిపి సమాజంపై చేసిన చక్కటి వ్యాఖ్యగా నిలుస్తుంది. చివరగా, బ్రహ్మ "తథాస్తు" చెప్పడం కథకు చక్కటి ముగింపు కలిగిస్తుంది.