top of page

ఇక జీవితం ఉద్వేగ పూరితమై, ఉత్తుంగ తరంగమై - పార్ట్ 4


'Ika Jeevitham Udvega Purithamai - Utthunga Tharangamai - 4' - New Telugu Web Series Written By Pandranki Subramani

'ఇక జీవితం ఉద్వేగ పూరితమై - ఉత్తుంగ తరంగమై - 4' తెలుగు ధారావాహిక

రచన : పాండ్రంకి సుబ్రమణి

(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ:


కుటుంబ పోషణ కోసం ఢిల్లీలోని ఒక మెస్ లో కుక్ గా చేరుతాడు రామభద్రం.


ఒకరోజు అతనికి కలలో ఆ మెస్ నిర్వాహకురాలు రూపవతి కనిపిస్తుంది. అతనిలో అలజడి మొదలవుతుంది.


తన ఊరికి వెళ్లి రావడం కష్టంగా ఉందని, పని మానేసి వెళ్ళిపోతానంటాడు భద్రం. కుటుంబాన్ని ఢిల్లీకి తీసుకురమ్మని, అవసరమైన సహాయం చేస్తానని చెబుతుంది రూపవతి.

ఇంటికి వెళ్లిన రామభద్రం ఢిల్లీకి రావడానికి తన కుటుంబ సభ్యులను ఒప్పిస్తాడు.


'ఇక జీవితం ఉద్వేగ పూరితమై, ఉత్తుంగ తరంగమై - పార్ట్ 4' చదవండి.


రామభద్రం కుటుంబ సమేతంగా రైలు బండినుండి న్యూఢిల్లీ స్టేషనులో దిగేటప్పటికి తనతో బాటు అసిస్టెంటు కుక్సుగా పనిచేస్తూన్న భీమన్, సుందరయ్య ఇద్దరూ ఎదురు వచ్చారు చేయూత నివ్వడానికి. వాళ్ళను చూసిన మరుక్షణం అతడికి కడుపులో బిందెడు పాలు పోసినట్లనిపించింది. సహాయమంటే ఇది కాదా నిజమైన సహాయం! అదీను తను అడక్కుండానే తాముగాఎదురొచ్చి చేయూతనివ్వడమంటే ప్రాణదానం చేసినట్లుకాదూ!

వాళ్ళను భర్త పరిచయం చేసిన తోడనే కాంతం ఇద్దరికీ నమస్క రించింది. అందరూ ట్రాలీలో సామానుంచుకుని స్టేషన్ బయటకు వచ్చేటప్పటికి చలి తీవ్రంగా తాకనారంభించింది. రాఘవయ్యా తాయారమ్మా తమతో తెచ్చుకున్న దట్టమైన దుప్పట్లను ఒంటినిండా కప్పుకున్నారు. పిల్లకాయలిద్దరూ వేసుకున్న నార స్వెట్ట ర్లకు ఉషారుగా గుండీలు వేసుకుని సర్దుకుని చుట్టు ప్రక్కల కలయ చూస్తూ నడవసాగారు; కదిలే ప్రవాహంలా సాగుతూన్న జనసం దోహం మధ్య. కాంతం మాత్రం చీర చెంగుని మెడనిండా పరచుకుంది.


దేశరాజధాని పరిసరాలను అక్కడ కొత్తగా గోచరించే ప్రజల ఆహార్యాన్ని పరకాయించి చూస్తూ నడుస్తూంది. అలా వాళ్ళతో కలసి నడుస్తూనే ఆగాడు రామభద్రం- “ఎన్ని ఆటోరిక్షాలు మాట్లాడుకుందాం? మూడు చాలా? ”అని అడుగుతూ--


ఆ ప్రశ్నతో ఇద్దరు కుక్సులూ తిరిగి చూసి బదులిచ్చారు ముక్తకంఠంతో- “ఎందుకూ? మేడమ్ తన క్వాలీ జీప్ ని పింపించారు, నువ్వు భార్యాబిడ్డలతో అమ్మానాన్నలతో వస్తున్నావని తెలిసి— నువ్వి ప్పుడు నీకు మేడమ్ కేటాయించిన అపార్టుమెంటుకి తిన్నగా వెళ్లు. అక్కడ మీకు సామాను సర్దడంలో సహాయం చేయడానికి ఇద్దరు ముగ్గురు చౌకీదారుల్ని ఏర్పాటు చేసారు మేడమ్. మేం మాత్రం తిన్నగా మెస్సుకే వెళ్లిపోతాం. సరేనా?” అంటూ అక్కడ వాళ్ల ముందుకు వచ్చిన క్వాలీస్ బండిలో కి సామానంతటినీ ఎక్కించి ప్రక్క కు తప్పుకున్నారు భీమన్ సుందరయ్యలిద్దరూ--


మెస్సు ఓనర్ రూపవతి రామభద్రం కుటుంబానికి కేటాయించిన టూ- బెడ్ రూమ్ ఫ్లాట్ మెస్సుకి మరీ దూరాన కాకుండా సర్దార్ పటేల్ రోడ్డులో ఉంది. అపార్టుమెంట్ ప్రాతదైనా చూడటానికి పకడ్బందీగానే ఉంది. సామానంతటినీ ఇంట్లోకి జొప్పించిన తరవాత కాంతం స్వయంగా గమనించిన విషయాలు రెండు- ఒకటి నీళ్లధార- అది యమునా నదినుండి రీసైక్లింగ్ అయి ఎడబాటు లేకుండా వస్తుందని తెలుసుకుంది. మనసున తెరపి చెందింది. అక్కడి నీళ్ళ ధార ఆమెకంటికి ప్రాణధారగా కనిపించింది. నీటి చుక్కల్ని నెత్తిపైన చల్లుకుంది.


రెండవ అంశం తెలుసుకుని మరింత తెరపి చెందిందామె- చుట్టుప్రక్కలున్న వారందరూ పంజాబీలు, యుపీ వాళ్లు, బీహారీలే కాదు. అక్కడక్కడ రవికెల్లో వేసిన నగిషీ రవ్వల్లా దక్షిణాది వాళ్లు కూడా కలబోతగా కనిపించారు. కాంతం అంతటి ఉపశమనం పొందడానికి కారణం- ఆమెకు హిందీ రాదు. ఇకపైన నేర్చుకో వాలి; ముప్పైరోజుల్లో తెలుగు ద్వారా హిందీని నేర్చుకోగలిగే పుస్తకాన్ని కొని తెచ్చుకుని--


అది చాలదని తలపోస్తూ పంజాబీలో కూడా కటాబొటి పరిజ్ఞానం అలవర్చుకోవాలి. రోమ్ లోకి ప్రవేశించినప్పుడు రోమన్ లాగే కదూ మారాలి! ఇంతకూ విషయం ఏమంటే- ఆమెకు దినపత్రిల్లో వచ్చే పలు శీర్షికలు చదివడం- టి వీ విషయాలు ఆకళింపు చేసుకోవడం అలవాటు. అంచేత లోకజ్ఞానం కాస్తో కూస్తో అలవడిందామెకు-

-------------------------------------------

డ్యూటీలో చేరిన మూడవరోజు సాయంత్రం రామభద్రం ఇంటికి పెందలకడే వచ్చాడు. వస్తూనే అన్నాడు- “కాంతం! అరగంట లో సిధ్దమయిపో! మనం వేడిని పుట్టించే స్వెట్టర్లు కొనుక్కోవడానికి వెళ్తున్నాం”.


ఆమె ఆశ్చర్యంగా చూసి “ఎంతదూరం?” అని అడిగింది.


“అబ్బే- ఎంతో దూరం కాదు. నాలుగు కిలోమీటర్లే! ఎప్పుడూ అడగని వాణ్ణి నేనే వెళ్ళి మేడమ్ ని అడిగాను- అడ్వాన్స్ ఇవ్వమని- మరుమాటలేకుండా ఇచ్చేసిందావిడ- పదివేలు“.


ఈ మాటతో ఆమె డంగై పోయినట్టు చూసింది. ”పది వేలా!”


“మరి? టిబెటన్లు నడిపే గొంగళ్ళ సంతకు వెళ్ళడం అంటే మాటలా! అందరికీ కొనివ్వద్దూ! అబ్బాయిలతో సహా అమ్మా నాన్నలకు కూడా కొనివ్వద్దూ!”.


ఆమె బెదురుగా చూస్తూ అడిగింది- “మరెప్పుడు తిరిగి ఇవ్వగలరు అంత పెద్ద ముత్తాన్నీ!”


“నీకు అప్పులంటే, అప్పిచ్చిన వాళ్ళంటే అలర్జీ అని నాకు తెలుసు లేవోయ్! అలాగని మరీ కంగారు పడిపోకు. సాధారణం గా అడగను. ఆమెగారే పిలిచి ఇస్తారు. మరీనాడూ నేనే స్వయంగా వెళ్లి ఆడిగానంటే దాని అవసరం ఆమెగారు కనుక్కోలేరూ! ”


“అది కాదండీ. అప్పుకంటే దారిద్య్రం మరొకటుండదండీ! దానికి అలవాటు పడటమే తరవాయి- ఆ తరవాత అంతే సంగతులు- ఇల్లు మట్టిగొట్టుకు పోతుంది. మొన్న మనూళ్ళో మనింటికి మూడో వీధిలో ఏమీ జరిగిందంటే- అతను టైలర్- భార్యేమో చీటీలు నిర్వహించేది. ఇద్దరూ సమంగానే ఇంటి వ్యవహారాల్ని నిర్వహించారు. మరేమైందో మరి- మెంబర్లుగా చేరిన కొందరేమో చీటీ డబ్బులు కట్టకుండా ఎగనామం పెట్టేసారు. దానితో ఇంకా తమ వాటా చీటీ తీసుకోని వారు ఇంటిపైన పడ్డారు.


భార్యాభర్తలిద్దరూ తిన్నగా ఊరి పెద్దల వద్దకు వెళ్లి మొరపెట్టుకోకుండా, కనీసం పోలీసుల వద్దకు విషయం తీసుకు వెళ్ళకుండా తీవ్రమైన మానసి క ఒత్తిడికి గురయి-- ఇద్దరు బిడ్డల్నీ గాలికి వదిలేసి-- క్రిమిసంహారక మందేదో తినేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఇప్పుడిద్దరూ స్పృహ లేకుండా ఆస్పత్రిలో పడి ఉన్నారు --


అటువంటి పరిస్థితి మన బధ్ధశుత్రువులకు సహితం రాకూడదండీ. ఉన్నదానితో ఎలాగో ఒకలా సర్దుకు పోదామండీ! తీసుకున్న అడ్వాన్స్ తిరిగిచ్చేయండి. దయచేసి ఈ ఒక్కపనీ నాకోసం చేయండి. దండాలు పెడ్తాను”


“నేను సరదా కోసం జల్సాగా ఊరు తిరగడం కోసం అప్పు తీసుకున్నాననుకుంటున్నావన్నమాట! భలేదానివే! రాబోయే చలి ఇప్పటి చలిలా ఉండదు. అంత కంతకూ పెచ్చరిల్లిపోతుంది. ఈ చీరలూ దళసరి దుప్పట్లూ ఉల్లిపొరల్లా మారి ఒంటికి యేమాత్ర మూ చాలవు, వజవజలాడుతూ ఒళ్లు చల్లబడి మంచాన పడాల్సిందే. మీ అత్తామామలతో సహా నువ్వు కూడా మంచమెక్క వలసిందే--


మరి రేపు వాసుదేవరావు- వెంకట్ ఎలా స్కూలుకి వెళ్తారని? వాళ్ళను వణుకుతో జ్వరం తెచ్చుకోమంటావా! ఐనా- నేను వెతుక్కుంటూ వెళ్లి వాఫస్ చేయడ మేమిటోయ్. ప్రతినెలా వాయిదాల ప్రకారం నా జీతం డబ్బు ల్లోనుంచి వాళ్ళే కట్ చేసుకుంటారు. చూస్తూ చూస్తూ ఊరకే ఇస్తారేమిటి?”


కాంతం ఇక మాట్లాడకుండా కదలి వెళ్లి అత్తామామలను కూడా సిధ్దం కమ్మని పురమాయించింది.


టిబెటన్ల సంతలో కొలతల ప్రకారం దుస్తుల కొనుగోళ్ళు పూర్తయిన తరవాత చివరి మాటగా అన్నాడు రామభద్రం- “ఇకపైన ఈ ఢిల్లీ చలికాలం పోయేంతవరకూ నువ్వు ఎక్కువ భాగం ఈ వేడి దుస్తుల్లోనే ఉండాలి. అంతేకాదు- ఇప్పుడు మనం కొనుక్కున స్వెట్టర్లు సహితం చాలవు. ఎందుకంటే ఇక్కడి చలి రాత్రులు దీర్ఘమైనవని ఇక్కడ మొదట్నించీ ఉంటూన్న మా గంగాధరం చెప్పాడు”.


అది విని బరువుగా నిట్టూర్చింది కాంతం అక్కణ్ణించి కదులుతూ-- రామభద్రానికి అసహనం పుట్టుకు వచ్చింది-- “అదేంవిటి—ఇంతా చెప్పిన తరవాత కూడా అంతటి పెను నిట్టూర్పు విడుస్తావు? కొన్ని సమయాలలో తెగువ చూపించే తీరాలి. ఇది గుర్తుంచుకో! మొండి ధైర్యానికి ప్రతి రూపమైన పుట్టి ఎలుగు గురించి నువ్వేగా చెప్పావు!”.


అప్పుడు రాఘవయ్య నడుస్తూ నడుస్తూనే వెనక్కి తిరిగి చూసాడు- “మా కోడలి పిల్ల నిట్టూర్పుకి అర్థం నేను చెప్తారా అబ్బాయీ! నువ్విలా వీటికోసమే డబ్పులు తగలబెట్టేస్తుంటే- ఇక కుర్రాళ్ళ చదువులు ఎలా సాగుతాయి? ఇంటి వెచ్చాలకు కాసులెలా మిగులుతాయి? మధ్య మధ్యన పిలవని పేరంటానికి వస్తున్నట్టు నేనూ మీ అమ్మా జబ్బయి పోతుంటాం- ఇది కూడా నీకొక సమస్యేగా- అప్పుడు దానికి ఏం చేస్తావు? ఇస్తున్న వారున్నారు కదానని యెడాపెడా తీసుకుంటూ ఉండటమేనా-- ఇన్ని అర్థాలు ఆ ఒక్క నిట్టూర్పులోనూ ఇమిడి ఉన్నాయన్నమాట! అర్థమైందా లేక ఇంకా విడమర్చి చెప్పనా!”


ఆ మాటతో రామభద్రం ఇక నోరు విప్పకుండా నడుస్తూ అటు వెళ్తూన్న రెండు ఆటోరిక్షాలను పిలిచాడు.


భయమన్నది ఎవర్ని విడిచి పెట్తుందని! మొదటి సారి రామభద్రం కలత చెందాడు అప్పుల ఊబి గురించి తలచుకుని. ఇంట్లో వాళ్లన్నదాంట్లో వాస్తవం లేకపోలేదు కదా! తెలుగు గడ్డపైన అక్కడక్కడ సంభవిస్తూన్న అవాంఛనీయ సంఘటనలు చాలా వరకు ఆర్థిక ఇబ్బందుల్ని తట్టుకోలేకనే కదా చోటు చేసుకుంటున్నాయి! ఇక చూపు వెనక్కి మరలించి చూస్తే- నిజానికి ఇదంతా రూపవతి మేడమ్ సలహాప్రకారమే కదా తను చేస్తున్నదీ--


అందునా రూపవతి దంపుతులకు పిల్లలు లేరు. అందుకే కదా- ఇద్దరి పిల్లకాయల చదువులు గట్రా తనే చూసుకుంటానన్నది స్వయంగా—ఏమో- రేపో మాపో యేమౌతుందో మరి- ఎంతయినా మేడమ్ ఢిల్లీ బిజినస్ ఉమన్. అందునా మిలిటరీ ఆఫీసరయిన భర్త దన్నుకూడా ఉంది. అంతేనా- స్థానబలం కూడా ఉందావిడకి. అంచేత ఆమెకు తోచింది ఏమి చేసినా చెల్లుతుంది మరి. ఈ సమయంలో ఆమెగాని ఇచ్చిన మాట ఒక్కటంటే- ఒక్కటి వెనక్కి తీసుకుంటే చాలు- మగధీర సినిమాలో ఎడారి ఊబిలో గుర్రపు బగ్గీ దిగబడ్డట్టే తన బ్రతుకూ కుటుంబ మనుగడా సంకుల సమరమే ఔతుంది.


ఇక పోతే-- ఇంతవరకూ వచ్చి వెనక్కి చూడటమెందుకు-- అంతా ఆ ఆంజనేయస్వామి పైన భారం ఉంచాలి. ముందుకు సాగాలి. ఇవన్నీ గంగాథరానికి గాని చెప్తే ఏమంటాడు- ‘వాళ్లకు అనుభవం లేదు- ఊరుకాని ఊరు వచ్చి కొట్టుమిట్టాడుతుంటారు. కొత్త పరిసరాల గురించి బొత్తిగా అవగాహన లేని వాళ్ళు- నీకైనా కాస్తంత నిదానం ఉండవద్దూ! ’ అని కొట్టి పడేస్తాడామో! నిజమే- తను కూడా తనకు తెలియకుండానే బెంబేలు పడిపోతున్నాడు. ఏది ఏమైనా తను ఒకే బుట్టలో గుడ్లన్నీ పెట్టడం లేదు కదా!


హిమాలయ ప్రాంతాల చుట్టూ మంచు తీవ్రంగా కురిసినట్లుంది. ఢిల్లీ చలి రెట్టింపయింది.

ఎప్పుడూ ప్రొద్దుటే లేచి అత్తామామలను కూడా లేపి, వాళ్ళ కడుపులు ఖాలీగా ఉండకుండా మొదటి దశగా బిస్కట్లూ కాఫీ అందిచ్చే కాంతం లేవలేక పోయింది. చలి ఆవిరై- ముసురై కప్పేసిందేమో; రోడ్డుపైన మనిషిని మనిషి చూడలేక పోతున్నంత గడ్డు పరిస్థితి. కొన్ని చోట్ల వాహనాలు ఎక్కడివక్కడే బారులు తీరి ఆగిపోయాయి;ఒకటినొకటి ఒరసుకోకుండా ఢీకొనకుండా ఉండటానికి- ప్రమాదాల బారి నుండి తప్పుకోవడానికి.


అప్పుడు రామభద్రం లేచి భార్యను కుదుపుతూ లేపి, తను మాత్రం మందకొడితనానికి తావివ్వకుండా బ్రెడ్ ముక్కలతో టీ పోసుకుని తాగి డ్యూటీకి బయల్దేరాడు. అతడికి కాఫీ కంటే టీ ఎక్కువ ఇష్టం. సంసార పక్ష స్త్రీ ఐన కాంతం, నిజంగానే బోలెడంత సిగ్గు పడింది. గభాల్ను లేచి ముఖ ప్రక్షాళన గావించుకుని త్వరగా ప్లాస్కులో కాఫీ పోసి బిస్కట్ల పళ్ళెంతో మామగారికి అందించింది- “ఏమనుకోకండి మామగారూ! ఆలస్యం అయినట్లుంది. బైటంతానూ చిమ్మచీకటిగా ఉంటేను. మీరు ముందు మాత్ర వేసుకోండి. కాసేపు తరవాత మీరు వేడినీళ్లతో స్నానం చేసి పూజా పునస్కారాలు ముగించేటప్పటికి టిఫిన్ చేసి ఉంచుతాను“.


కోడలు పిల్ల మన్ననకు ముచ్చుటపడి లోలోన అభినందిస్తూ రాఘవయ్య అన్నాడు- “దీనికి నొచ్చుకోవడానికేముందమ్మా? ఊరికి కొత్తగా వచ్చాం కదా-- కొన్ని రోజులు ఇలాగే అగమ్య గోచరంగానే ఉంటుంది మరి. మీ అత్తయ్యను లోపలకు తీసుకెళ్లు. అది కూడా మాత్రలు గట్రా వేసుకోవాలి కదా!” అంటూ బిస్కట్ల జోలికి వెళ్ళకుండానే మొదట అరకప్పు కాఫీ పోసుకుని తాగాడు.


నరాలు కొరికే చలికి వేడి వేడి కాఫీ గొంతున పడ్డ వెంటనే చెప్పలేనంత హాయ నిపించింది. బంగారు కొండలో ఏముంది? చిన్నపాటి కప్పులోనే ఉంది అంతాను-- కంచెరపపాలెం ప్రక్కనే కొండలున్నా- కొండగాలి విసురుగా వీస్తూనే ఉన్నా, చలికాలంలో చలి జోరుగా తగిలినా ఇంతటి వణకు ఎప్పుడూ లేదేమో! మరైతే- ఈ కోడలు పిల్ల వెచ్చాలకు ఎలా సర్దుకుపోతుందో-- అసలే హిందీ రాదుగా! ఏదో పుస్తకం కొని తెచ్చుకుని నేర్చుకుంటున్నట్లుంది. హిందీ భాష కోసమే ఇంతటి పాట్లు పడుతున్నప్పుడు మధ్యన పంజాబీ కూడా నేర్చుకుంటానంటుంది కాంతం--


ఏమిటో ఈ కాలపు అమ్మాయిలు ఎల్లలు లేని ఆకాశంలా పరిమితి లేని బ్రతుకులు బ్రతికేస్తున్నారు. సత్సాంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగిన అమ్మాయి కావడాన, సంసారం కోసం ఏదైనా చేయడానికి సిధ్ధపడుతుంది పిచ్చిది. వెంకట్ పుట్టిన వెంటనే కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేయించుకుంది; కటాబొటిగా సంపాదిస్తూన్న భర్తకు తన వల్ల మరిన్ని కష్టాలు దాపురించకూడదని. అప్పటికీ భద్రం చెప్తూనే ఉన్నాడు- తను కుటుంబ నియంత్రణ చేసుకుంటానని. కాని కోడలు పిల్ల వినలేదు.


మగాళ్ళకు శస్త్ర చికిత్స జరిగేటప్పుడు అనుకోకుండా అప్పుడప్పుడు నరాలేవో తెగిపోతాయని విందట—ఆ సమయంలో భర్తకు గాని అనారోగ్యం చేస్తే కుటుంబం సర్వమూ తుఫాను గాలిలో మ్రాను ఒరిగి పోయినట్లవుతుందని తనే చొరవ తీసుకుని ధైర్యంగా కుటుంబ నియంత్రణ చేసుకుంది కాంతం. ఏ పూర్య జన్మసుకృతమో గాని- ఈ విషయంలో రామభద్రం అదృష్టవంతుడే కాంతం వంటి జీవన సహచరి లభించడం వల్ల--


ఇక పోతే- అవన్నీ గుర్తుంచుకనే కుటుంబ పెద్దయిన రాఘవయ్య ముందే షరతు పెట్టేసాడు మనవళ్ళ విష యంలో; పెద్ద కుటుంబమా లేక చిన్నకుటుంబమా- ఉన్నకుటుంబమా లేని కుటుంబమా అన్నది కాదు ప్రసక్తి—జల్లెడ పట్టి మంచి కుటుంబంలోని అమ్మాయిల్నే కష్టం యెరిగిన అమ్మాయిల్నే వెతికి కట్టబెట్టమని;కట్నం కానుకుల విషయంలో వేగిరి పాటుకి ఏ మాత్రమూ లోను కాకుండా-- అలా కాకుండా డబ్బుకి కక్కుర్తి పడి ఏనో తానోగా మరోలా చేస్తే తను అసలు మనవళ్ళ పెండ్లికే రాననేసాడు.


ఆ మాటకు కొడుకూ కోడళ్లూ ఒకటే నవ్వు—“వాళ్ళెప్పుడు స్కూలు చదవులు పూర్తి చేస్తారు, ఎప్పుడు ఉద్యోగంలో చేరుతారు, ఆ తరవాత వాళ్ళెక్కడుంటారు మీరెక్కడుంటారు- మేం ఎక్కడుంటాం- అసలిక యేమి జరగబోతుందో పైనున్న ఆ చిత్ర గుప్తుడికి సహితం తెలియదు” అన్నారు ముక్త కంఠంతో. ప్రాత తరానికి చెందిన తాయారమ్మ కూడా అంగీకార సూచకంగా పెద్ద పెట్టున నవ్వింది- “ఈ కాలపు కుర్రాళ్ళు-- పెల్లిళ్లు వాళ్ళకు వాళ్ళే చేసుకునే రోజులు. అసలు మన మాట వింటారా! ” అంటూ— అసలు పెళ్ళిల్ల జోలికే పోకుండా సహజీవనం గడిపే రోజులని తాయారమ్మకు ఇంకా తెలియదేమో!

=======================================================================

ఇంకా వుంది

=================================================================================

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

Podcast:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.

65 views0 comments

Comentários


bottom of page