top of page

ఇక జీవితం ఉద్వేగ పూరితమై, ఉత్తుంగ తరంగమై - పార్ట్ 3


'Ika Jeevitham Udvega Purithamai - Utthunga Tharangamai - 3' - New Telugu Web Series Written By Pandranki Subramani

'ఇక జీవితం ఉద్వేగ పూరితమై - ఉత్తుంగ తరంగమై - 3' తెలుగు ధారావాహిక

రచన : పాండ్రంకి సుబ్రమణి

(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:


కుటుంబ పోషణ కోసం ఢిల్లీలోని ఒక మెస్ లో కుక్ గా చేరుతాడు రామభద్రం.


ఒకరోజు అతనికి కలలో ఆ మెస్ నిర్వాహకురాలు రూపవతి కనిపిస్తుంది. అతనిలో అలజడి మొదలవుతుంది.


తన ఊరికి వెళ్లి రావడం కష్టంగా ఉందని, పని మానేసి వెళ్ళిపోతానంటాడు భద్రం. కుటుంబాన్ని ఢిల్లీకి తీసుకురమ్మని, అవసరమైన సహాయం చేస్తానని చెబుతుంది రూపవతి.



'ఇక జీవితం ఉద్వేగ పూరితమై, ఉత్తుంగ తరంగమై - పార్ట్ 3' చదవండి.


ఆవేదనా పూర్వమైన అతడి మాటలు విన్నంతనే ఆమెలో హృదయావేశం పొంగింది. వయసు ముదిరిన తల్లిదండ్రుల కోసం ఎంతమంది ఈరోజుల్లో అంతగా ఆలోచిస్తారు? ఇప్పటి తరం వాళ్ళు చాలా మంది గట్టు దాటిన తరవాత తెప్పను తగలబెట్టే రకమే--


అప్పుడు రామభద్రమే మళ్ళీ అందుకున్నాడు- “పోను రెండురోజులు- రాను మరొక రెండురోజులు- ఇది దాదాపు నాకు వల్లకాని వ్యవహారమండీ—ఇందులో మరొకటి కూడా ఇమిడి ఉందండీ! రాఘవయ్యగారు నాకు కన్నతండ్రే కాదు- నాకు గురువు గారు కూడాను. పాకశాస్త్ర వ్యవహారమంతా చిన్నప్పుడు ఆయనే నేర్పారు. ఆ తరవాతనే కామయ్యగారి వద్దకు మరింతగా వంట పనులు నేర్చుకోవడానికి పంపించారు. ఇప్పుడాయననూ అమ్మనూ అలా గాలికి వదిలి రావడం ఏమాత్రమూ సముచితంగా తోచడం లేదండీ!


ఇక నేను బయల్దేరడానికి ఇంకా నాలుగైదు రోజులున్నాయి గనుక నేను గంగాధరానికి ఓ మాట చెప్పి- నాకు వత్తాసుగా నిలచిన ఇద్దరు ముగ్గురుకి కూడా ఓ మాట చెప్పి వస్తానండి. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మీరు నా పట్ల చూపించిన ఆదరణ నేనెన్నటికీ మరవలేనండీ! మొదట్లో ఇంకేమో అనుకున్నాను గాని-- ఇంత కచ్చితంగా నికార్సుగా పని వాళ్ల అవసరాలు తెలుసుకుని జీతభత్యాలందించే ఓనర్ ని నేనింత వరకూ చూడలేదండి.


పెద్ద పెద్ద హోటేల్ వాళ్ళు కూడా మా బోటి వాళ్ల వద్దకు వచ్చేటప్పటికి పిలకలు పట్టుకుని ఆటలు ఆడిస్తారు. జీతభత్యాలివ్వకుండా పి ఎఫ్ కట్టకుండా పదిహేనవ తేదీవరకూ ఈడ్చుకుంటూ పోతారండి. ఈవిషయంలో మీవి అమృత హస్తాలండి” అపరిమితమైన ఆవేశానికి లోనైపోయి అసంకల్పితంగా రూపవతి చేతిని అందుకుని కళ్ళకు హద్దుకున్నాడు.


అతడు చూపించిన అభిమానానికి ఆమె నేత్రాలు తడిసాయి. ఇంతటి ఉన్న త సంస్కా రవంతుడి ఉనికిని కోల్పోవచ్చా! ఆణిముత్యాలు కడలి అడుగున కదూ ఉంటాయి-- ఆమె తన చేతిని వెనక్కి తీసు కుంటూ అంది- “నేనొకమాట చెప్తాను వింటారా! ”


ఉఁ అన్నాడతను.


“నా అనుభవంలో నాకు తెలిసినంత వరకూ చాలామంది పని చేస్తారు ఏనో తానుగా-- కాని అందరూ మనసుంచి పని చేయరు. కాబట్టి చెప్తున్నాను, ఇక మీరక్కడుండకండి. మళ్లీ ఇక్కడకు వెంటనే వచ్చేయండి. నాకిక్కడ కాస్తంత దూరాన సింగల్ విజిటర్స్ రూముంది. ఇన్నాళ్లూ బాడుగపైన అక్కడుంటూన్న వారు ఖాలీ చేయబోతున్నారు. మీరూ- మీవాళ్ళందరూ ఆ సింగిల్ రూము గదిలోకి వచ్చేయండి. సరేనా?"


“వీలుపడదేమోనండీ! ఎందుకంటే మాకుటుంబానికి ముఖ్యంగా మా అమ్మానాన్నలకు సింగిల్ బెడ్ రూము చాలక పోవచ్చం డి. అందునా మాకుర్రాలిద్దరికీ ఇక్కడ స్కూలులో సీట్లు దొరకకడమంటే మాటలు కావుగా! వంటవాణ్ణి—అంతెత్తు విరాళాలు ఫీజు లూ ఇచ్చుకోలేనుగా-- అక్కడి వ్యవహారం వేరు—ఏదో ఒక పంచాయతీ బోర్డు స్కూలులో చేర్పించేయ వచ్చు”


“అలాగయితే మరొక పని చేద్దాం. నేనిప్పుడుంటూన్న డబుల్ బెడ్ రూముని ఖాళీ చేసి మీకిచ్చేస్తాను. ఆ సింగిల్ బెడ్ రూముని విస్తరించి తగు అమరికలు చేసుకున్న తరవాత నేను తీసుకుంటాను. సౌకర్యవంతంగా ఫర్నిష్ చేసుకుంటాను. కిచెన్ రూముని టైడీగా పెద్దది చేసుకుంటాను. కారిడార్ ని హాలులోకి కలుపుకుంటాను.


ఇక మీ అబ్బాయిల స్కూలు అడ్మిషన్ వ్యవహారం నాకు విడిచి పెట్టేయిండి. ఎందుకంటే నేనిక్కడ ఎన్ జీ వో లు నడిపే రెండు మూడు ప్రైవేటు స్కూళ్లకు అడపా దడపా విరాళాలు ఇస్తుంటాను. అక్కడి వార్షికోత్సవాలకు వెళ్ళి వస్తుంటాను. అంచేత మీ ఇద్దరబ్బాయిల అడ్మిషన్ అప్లికేషన్లని కాదని అంత తేలిగ్గా తీసిపారేయ లేరు. ఈజిట్ ఓకే! ”


అంతావిన్న తరవాత మౌనంగా ఉండిపోయిన రామభద్దాన్ని చూసి ఆమె నిలదీసేలా అడిగింది “అదేమిటి అలా ఉండిపో యారు మాటా పలుకూ లేకుండా? నేను చేసిన ఆఫర్ పైన నమ్మకం లేదా?"


“విషయం అది కాదు మేడమ్! మీరు నాకోసం ఇంతగా శ్రమపడుతూ ఉంటే నాకు ఇబ్బందికరంగా ఉందండీ— ఇంతకూ నావల్ల మీరు నడిపే మెస్సుకు ఒరిగిందేమిటని-- ”


“ఎందుకు జరగలేదు? మీరు మా మెస్సులో చేరిన తరవాత సంప్రదాయ ఉత్తరాంధ్రుల రుచుల్ని చూపించారు. అంతేనా—తెలంగాణా వంటకాలను తెలుగు వారి పండగలప్పుడు మాకే కాకుండా కస్టమర్సుకి కూడా రుచి చూపించారు. కట్లెట్ గారె, పెరుగు చట్నీ మామిడి కాయ పప్పు, వంకాయ పూర్ణం, గుమ్మడికాయ జిగురు, ముంజల కర్రీ, పచ్చి పులుసు, మిర్యాల రసం నల్లకారం—ఇలా యెన్నో రకరకాల తెలుగు ప్రాంతాల వంటకాల రుచి చూపించారు.


కరకరలాడే రుచులతో బాటు సంప్రదాయ కారప్పొడుల రుచులు కూడా చూపించారు. లొట్టలు వేసుకునేలా అచ్చ తెలుగు పచ్చళ్ళ రుచులు కూడా మెస్ కస్టమర్లకు చూపించారు. రెగుల్యర్ కస్టమర్ల చేరికను పెంచారు. ఇదంతా ఊరకే పోదుగా! ఇక మరొక ముఖ్యమైన పర్సనల్ కారణమూ ఉంది. చెప్పేదా?"


రామభద్రం ఆసక్తికరంగా చూస్తూ తలూపాడు.


“కారణం ఉంది. బలమైన కారణం ఉంది. సెంట్రల్ ప్లేసులో నడుస్తూన్నఈ మెస్సుపైనా—నిజం చెప్పాలంటే ఇక్కడున్న ఆడాళ్ల పైనా కొందరికి కన్నుపడింది. నేనూ చుట్టు ప్రక్కల ఇద్దరు మనుషుల్ని రాత్రిపూట పహరా కాయడం కోసం పెట్టకోక పోలేదు. కాని ఈ యేర్పాట్లన్నీ అడ్డు తడికల్లా ఎన్నాళ్లు నిలుస్తాయని? నాకు నమ్మకం కలిగించే వ్యక్తులెవరైనా ఒకరిద్దరుండాలి కదా నాకు తోడుగా- మంజులవాణి మాలతి ఉన్నారనుకున్నా-- యెంతైనా నాలా ఆడవాళ్ళే కదా!

హెడ్ కుక్ సోమనాథం ఉన్నాడనుకో—ఆయనొక్కడి ఉనికీ చాలదుగా-- ఇక మావారి విషయానికి వస్తే ఆయనిప్పుడిక్కడకు వచ్చే స్థితిలో లేరు. ఇక మీ విషయానికి వస్తాను. చాలా విషయాలలో మీకనుకూలంగా చేస్తున్నానన్నదే మీకు తెలుసు గాని- నేను గమనించిన మరొక అంశం మీకు తెలియదు”


అదేమిటన్నట్టు కళ్లెత్తి రూపవతి ముఖంలోకి తేరిపార చూసా డతను.


“మీ నిజాయితీ పైన నాకు మిక్కిలి నమ్మకం ఉంది. ఈ మెస్సునీ నన్నూ కనురెప్పలా చూసుకుంటారన్న విశ్వాసం ఉంది నాకు. ఇకపైన ఏమైనా చెప్పాలా రామభద్రం?"

అతడిక ఏమీ మాట్లాడలేదు. అతడు అంతకు ముందు తిరిగిచ్చేసిన రిటార్న్ టిక్కెట్టుని నిశ్శబ్దంగా అందిపుచ్చుకుని వెనుదిరిగాడు “సారీ! ” అంటూ--


“ఎందుకు సారీ? ”అని అడిగింది.


”మరేం లేదండీ! మేం ఉత్తరాంధ్రులమండీ! భావావేశం ఎక్కువ- అనుకోకుండా మీ చేతులు పుచ్చుకుని--” అని ఆగిపోయాడతను.


దానికామె నవ్వేసి అతణ్ణి ఆపి బల్లపైనున్న తన ఫోను అందించింది- కంచెరపాలేనికి ఫోను చేసి చెప్పమని.


అతడు పేలవంగా నవ్వి అన్నాడు- “థేంక్సండీ! ఇంట్లో మాకు ఫోనులేదండీ- తరవాత మా బంధువులింటి ఫోను నెంబర్ వెతికి ఫోను చేసి చెప్తాను”అని చెప్పి అభిమానపూర్వకంగా ఆమె చేతులు పుచ్చుకుని మరు క్షణం వదేలేసాడు.


రూపవతి స్నేహపూర్వంకంగా నవ్వి తలూపింది. తలూపుతూ తానుగా తన చేతుల్ని చాచింది- “ఉఁ అందుకోండి! “


అతడు కూడా చిన్నగ నవ్వుతూ ఆమె చేతుల్ని అందుకోకుండానే అక్కణ్ణించి కదలి వెళ్ళిపోయాడు.

నమ్మకాలు అపనమ్మకాల విషయమై నికార్సుగా తేల్చేది మాటలు కావు. మనసులు—స్పందించే నిర్మల సరస్సు వంటి మనసులు మాత్రమే కదా!

----------------------------------------------------------

దీపావళి వచ్చినట్టే వచ్చి వెళ్లిపోయింది ఊరంతటినీ రంగుల తెరల్లో ముంచి. సన్నగా చురుగ్గా సూది కొనల్లా గుచ్చుకునే ఢిల్లీ నగర చలిగాలులు ఆరంభమయాయి. అనుకున్న ప్రకారం రామభద్రం గ్రాండ్ ట్రంక్- ట్రైనెక్కాడు వాల్తేరు వేపు ఆలోచనల్ని పోనిస్తూ-- రైలు ప్రయాణంలో ఒక రోజుకాదు- రెండురోజులూ ఊహాగానాలలోనే గడిపాడు. ఇప్పుడతని ముందు నిల్చున్న ఏకైక లక్ష్యమొ క్కటే—తనలా తన తండ్రిలా పొగచూరే వంట గదుల్లో కుమిలి పోనివ్వకుండా కొడుకులిద్దరినీ స్కూలు ఫైనల్ వరకూ తీసుకు వచ్చి పిమ్మట వెనుక నుంచి వత్తాసు ఇస్తూ గట్టెక్కించేసి సత్తా ఉన్న ప్రయోజకుల్ని చేయాలి.


ఎలాగో ఒకలా యేదో ఒక సర్కారు కార్యాలయంలో కుదురుకునేలా చేయాలి; కనీసం నాల్గవ శ్రేణికి చెందిన మెసేంజర్ పోస్టులోనైనా సరే--- నిలకడ లేని భరోసా లేని జీవన కారాగారాల నుండి వాళ్ళకు విమోచనం కల్పించాలి. తమలా మసకేసి కప్పివేసే అరల్లో- సాలెగూళ్ల బిడారాల క్రింద వేగుతూ తన కొడుకులిద్దరూ నలిగి నలిగి పనిచేయ కూడదు. వాళ్ళకావిధంగా రెక్కలు వచ్చేంత వరకూ బ్రతుకు బడబాగ్నికి తనను తను సమర్పించు కుంటాడు. ఆ లక్ష్య సాధన కోసం తను దేనికైనా తెగిస్తాడు. వాళ్ళ జీవన యజ్ఞానికి తనొక సమిథనై అర్పించుకుంటాడు, ఇది నిశ్చయం!


ఎట్టకేలకు మూడనెలల ఎడబాటు తరవాత వాల్తేరు స్టేషన్ లో దిగాడు రామభద్రం. ఖర్చుముఖం చూడకుండా ఆటోరిక్షా ఎక్కి తిన్నగా కంచెరపాలెంలో దిగాడు. తండ్రిని చూసిన వెంటనే కొడుకులిద్దరూ పరుగెత్తుకు వచ్చారు-


“ఆటో రిక్షాలో వచ్చారా బాబూ! బస్సులో కదూ వస్తారూ—“ అంటూ ఇద్దరూ తండ్రి చేతుల్లోని సామాను అఁదుకున్నారు. భర్తను చూస్తూ కాంతం గడప వద్దకు వచ్చి నవ్వుతూ నిల్చుంది చెమ్మగిలిన కళ్ళతో— కాపరానికి వచ్చి అన్నాళ్ళపాటు తనెప్పుడా భర్తనుండి తొలగి ఉండ లేదు. అదీ ఆమె చిందే కన్నీటి తుంపరకు కారణం.


రాఘవయ్య చేతి కర్ర ఆసరాతో అక్కడకు చేరుకుని కొడుకు నెత్తి పైన చేతి నుంచి ఆశీర్వదించి మళ్లీ లోపలకు వెళ్లిపోయాడు-


“ఢిల్లీ వైపు చలి మిక్కుటంగా ఉంటుందటగా! అప్పుడప్పుడు నీరు సహితం గడ్డకట్టుకుపోతుందటగా! ”అంటూ తనలో తను గొణుక్కుంటూ-- ఆ మాట విన్నంతనే భద్రానికి గుండె గుభేలుమంది. నిజమే—చలి చాలా తీవ్రంగా ఉంటుందని తనకు తెలుసు. ఈ విషయమై గంగాధరం మరీ మరీ హెచ్చరించాడు కూడాను. మరిప్పుడు అమ్మానాన్నా తనతో బాటు అక్కడకు వచ్చి ఎలాగుంటారో! అసలు తనతో రావడానికి సిద్ధపడతారో లేదో!


ఎందుకంటే ఉత్తర భారతంలో ఈ మధ్య ఆరంభమైన సన్నపాటి చల్లగాలికే వణకు వంటిది ఆరంభమై దవడ కూడా బిగువుగా బిగించుకోసాగింది. అందరూ చకాచకా స్వెట్టర్లు కూడా వేసుకోనారంభించారు;మంచుగాలికి గుండెల్లో కఫం పేరుకు పోకుండా- ముందు జాగ్రత్తగా--

ఆరోజు భార్య చేసిన ఉల్లిగారెలు తింటూ కాఫీ తాగుతూ అందర్నీ చావడిలోకి రప్పించాడు రామభద్రం.


మొదట మెస్సు చుట్టు ప్రక్కల ఉన్న ఆంజనేయ స్వామి గుడి గురించి- ఆ తరవాత అంబ గుడిగురించీ వివరించి చెప్పా డు. పిమ్మట అక్కడ విరివిగా చౌకగా వారపు సంతలో దొరికే గుడ్డల గురించి పెట్టుడు చీరల గురించి చెప్పాడు. అందరి ముఖాలూ వెలిగాయి.


నాణ్యత గల ఆవిన్ పాలు విరివిగా లభ్యమవుతాయని చెప్పేటప్పటికి మరింత కాంతివంతమయాయి వాళ్ళ కళ్ళు. కాని చిట్టచివర విషయాన్ని ఒక కొలిక్కి తెచ్చేటప్పటికి అందరూ మౌనపు పరదాలోకి తల దాచుకున్నారు. పుట్టినూరు విడిచి పరిచయాలు లేని ఊళ్లో పరిసరాల గురించి ఏ మాత్రమూ తెలియని ఊళ్ళో మనుగడ సాగించడమా!


భార్యాబిడ్డలందరూ బేలగా దిక్కులు చూడనారంభించారు. రాఘవయ్యేమో ఏకంగా ఇటు రావడమే మానుకున్నాడు. కాని రామభద్రం పట్టు వీడలే దు. తండ్రి చేతిని పట్టుకుని వసారాలోకి లాక్కొచ్చాడు. ఆయన నాడిని తాటించడానికి పూనుకున్నాడు.


సాధారణంగా వయసు మళ్ళిన వారు కాస్తంత వైరాగ్యం పెంచుకుని చాలా విషయాలకు అతీతంగా ఉంటారు; ఒక్క దానికి తప్ప-- రక్తంలో రక్తమై జీర్ణిం చుకు పోయిన మానవీయ మనోరాగాలకు తప్ప. ఆ జీవనాడినే పట్టుకున్నాడు రామభద్రం-


“నేనొక మాట చెప్తాను చివరి మాట గా- శాంతంగా వింటారా బాబూ! ”


దానికాయన కూర్చోకుండానే బదులిచ్చాడు- “ఇంకేం చెప్తావూ! మమ్మల్ని ఆ మంచు గడ్డల మధ్య పడేస్తానంటావు- నిమోనియా వంటి జబ్బులతో అవస్థపడుతూ చావమంటావు- అంతేనా? ఇంత మందికి అంతంత లావు డబ్బులు పోసి ఎన్ని స్టెట్టర్లు ఎన్ని దుప్పట్లు కొనవలసి వస్తుందో ఆలోచించావా? అసలు బుర్ర ఉపయోగించావా లేక ఎక్కడైనా తాకట్టు పెట్టేసి వచ్చావా? ”


రామభద్రం బదులివ్వలేదు. మర్యాద పూర్వకంగా లేచి తండ్రిని సాదరంగా ప్రక్కన కూర్చోబెట్టుకుని చెప్పనారంభించాడు. “ఇది ఆవేశాలకు పోయే సమయం కాదు బాబూ! శాంతంగా ఆలోచించాల్సిన సమయం. ఎందుకంటే ఇది మన కుటుంబ భవిష్యత్తుకి సంబంధిన విషయం. అంతకంటే ముఖ్యంగా మీ మనవళ్లిద్దరి భవిష్యత్తుకి సంబంధించిన విషయం. వింటారా! ”


ఆమాటతో రాఘవయ్య. తాయారమ్మా ఇద్దరూ విస్మయాత్మకంగా చూసారు. ఆ తరవాత కళ్ళప్పగించి ఒకరినొకరు చూసుకుంటూ తగ్గారు వెనక్కి; కొడుకు చెప్పబోయే దాంట్లో ఏదో విషయం ఉందేమోననుకుంటూ-- ఐనా రాఘవయ్యను సందేహం వీడలేదు- ఆయన వయసు ఆయనను నచ్చచెప్పనీయటం లేదు.


“వాళ్ళనెందుకు మన మధ్యకు తీసుకువస్తున్నావురా భద్రా! నీగురించి చెప్పు- మన గురించి చెప్పు. వింటాం. పిల్లకాయల్ని రొంపిలోకి లాగబోకు- లేనిపోనివి కల్పించడానికి ప్రయత్నిస్తూ-- ”

“అది కాదు బాబూ! అసలు విషయం వాళ్ల చుట్టూనే తిరుగుతూంది. వాళ్ళకోసమే నడుస్తూంది. నాలా అబ్బాయిలిద్దరూ వంట చావడ్లలో మసక వెలుతుర్లో జీవితకాలమంతా గడపడం నాకిష్టం లేదు బాబూ! ”


“అంటే- నిన్ను చదివించకుండా కష్టాల పాలు చేసానంటావా? పదుగురికి అన్నం పెట్టే వృత్తిని ఎన్నడూ తక్కువగా తలచకురా! ”


అప్పుడు తాయారమ్మ కలుగ చేసుకుంది- “ముందు అబ్బాయిని మాట్లాడనియ్యవయ్యా ముసలాడా! ఎక్కణ్ణించో వచ్చాడు ఆగమేఘాల మీద మనకేదో చెప్పాలని. ముందు వాడి మాట విని ఆ తరవాత మీ సోదె ఆరంభిద్దువు గాని-- “


భార్య మందలింపుతో రాఘవయ్య ఆవేశం అణచుకున్నాడు. దారికి వస్తూ శాంతం వహించాడు. ఈ భూలోకంలో ఎక్కడైనా సరే ఎవడైనా సరే వంట వృత్తికి వ్యతిరేకంగా మాట్లాడితే అతడు భరించలేడు. అది రామభద్రానికి కూడా తెలుసు. అంచేత సౌమ్యం గా తండ్రి చేతిని పట్టుకుని విషయాన్ని ఒక కొలిక్కి తేవడానికి ప్రయత్నించాడు- “విషయం అది కాదు బాబూ! ఇంతకూ మన వంట వృత్తిని ఎవరు కించపరిచారని? అలా ఎవరైనా చేస్తే చూస్తూ ఊరుకుంటామా! నేను దిగులు పడేదల్లా అబ్బాయిలిద్దరి గురించే—


మీ రోజుల్లో అవకాశాలు లేక—పిదప నేను పుట్టి పెరిగిన రోజుల్లో అవకాశాలు కనుచూపు మేర కనిపించినా అందుకు నే స్తోమత లేక పై చదువులు పూర్తి చేయలేకపోయాను. ఆ ఎనిమిదీ ఎలా పూర్తిచేసానని-- మా పంతులుగాలు వచ్చి మీకు మరీ మరీ చెప్తేనే-- అంతెందుకు—ఎంత ఆశపడ్డా స్కూల్ ఫైనల్ పూర్తిచేయగలిగానా! ఇదీ అప్పటి మన దుస్థితి. ఇకపోతే- ఇంత విశాలంగా పెరిగిన ఇప్పటి ప్రపంచంలో మనవాసుదేవరావుకి, వెంకట్ కి మనదశ ఎదురవకూడదు కదా! ”


దీనికి రాఘవయ్య సరైన మోతాదులో స్పందించాడు తనను తను అదుపు చేసుకుంటూ- “మరైతే—అక్కడ మాత్రం డబ్బుల్లేకుండా పిల్లకాయలి ద్దర్నీ స్కూలు ఫైనల్ వరకూ చదివించేస్తావా! ఆ తరవాత మాత్రం వాళ్లిద్దర్నీ నీతో బాటు వంటశాలకు తీసుకెళ్ళవా! నన్నడిగితే—చదవుల ఖర్చులు ఇక్కడి కంటే అక్కడే ఎక్కువంటానురా రామభద్రం-- ”


నిజంగా రామభద్రానికి తండ్రి తెచ్చిన ప్రస్తావన నచ్చింది. ప్రశ్నలోని సూటిదనం కూడా నచ్చింది. తద్ద్వారా విడమర్చి చెప్పడానికి బోలెడంత అవకాశం ఇచ్చిందది- “చాలా బాగా అడిగారు బాబూ! అక్కడ మాబాస్ గారు మేడమ్ రూపవతి మాటిచ్చారు- ఇద్దర్నీ తన పలుకుబడితో ఎన్జీఓలు నడిపే స్కూళ్లలో సీట్లు సంపాదిస్తానని- విరాళాల జోలికి పోకుండానే-- ఎలాగంటారా- ఆమె మెస్ ఓనర్ మాత్రమే కాదు- ఒకప్పటి మిలిటరీ ఆఫీసరుగారి భార్యకూడాను.


బుర్ర మీసాలతో ఉన్న ఆయనగారి ఫొటోని తన ప్రక్కనే తగిలించుకుంటారు. అందుకే పైలాపచ్చీసులు చిల్లర వేషగాళ్లూ డొనేషన్లంటూ మరేదో అంటూ అటువేపు అంత చొరవతో రారు. అక్కడ తచ్చాడరు. అంతే కాదు- రూపవతిగారు సహితం చాకులా ఉంటారు- కత్తి పదునులా పని చేస్తారు. నా పనితనం మెచ్చి ఆమెగారే నాకోసం ఇన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.


ఇక స్కూలు ఫైనల్ తరవాత అబ్బాయిల భవిష్యత్తు మాటంటారా- కచ్చితంగా నాతో బాటు నేను పనిచేసే పాకశాలకు మాత్రం తీసుకెళ్ళను. ఏదో ఒక చోట ఏదో చిన్న ఉద్యోగంలో చేరేటట్లు పాడుపడతాను. పైకి తోస్తాను. ఢిల్లీ అంటే- మన కంచెరపాలెం అనుకుంటున్నారా- ఏ దారీ లేకపోవడానికి? అదీ ఇదీ లేదంటే- ఇద్దరూ మా మేడమ్ గారి వద్దే అసిస్టెంట్లుగా చేరుతారు. ట్రైనింగు తీసుకుంటారు.


అప్పుడు అవసరమైతే ఇద్దరూ అక్కడ వంట పనులు నేర్చుకుంటారు. ఐనా అదంతా ఇప్పుడెందుకులే- ఆమెగారే చూసుకుంటారు. ఆమెగారే కదా కంచెరపాలెంలో ఉండిపోకుండా మళ్లీ ఢిల్లీకి రమ్మన్నది“


ఆ మాటతో ఇంటి మూలన హోమ్ వర్కు చేస్తూ కూర్చున్న ఇద్దరు మనవళ్లని తదేకంగా చూస్తూ మౌనం వహించాడు రాఘవయ్య. ఔను. నిజమే! ఇక పైన తమ మనుగడా తమకు ముఖ్యం? తమ సౌఖ్యమా ముఖ్యం? ఇకముందు ఎదిగొచ్చే ఆ పిల్లకాయలకు కదూ నిలకడగా నిలవడానికి స్వావలంబనం కావాలి! ఆ మాటకు వస్తే- కష్టాలకు జడుసుకుంటూ పోతే బ్రతుక్కి భరోసా యెలా వస్తుంది? దీర్ఘమైన ఆలోచనలో పడ్డ భర్తను చూసి చిన్నగా ముసిముసి గా నవ్వింది తాయారమ్మ.


కోడిపుంజు జుత్తు ఊరకే ఆడదుగా! తన వంశాంకురం నుండి వచ్చిన మనవళ్ళిద్దరినీ చూసేటప్పటికి వాళ్ల భవిష్యత్తు కళ్లముందు హరివిల్లులా కదలాడే సరికి ఎలా చల్లబడిపోయాడో కదా ముసలాడు! అత్తయ్యా మామలకు నచ్చచెప్పడంలో దిగ్విజయం సాధించిన భర్తను చూసి సంతోషంగా చెంత చేరి రెండు భుజాలపైనా రెండు చేతులూ ఉంచింది కాంతం. ఆమెకు సహితం కొడుకులిద్దరూ పైకి రావడమే కదా ముఖ్యం! నేడు అంత పెద్ద నగరంలో స్థిరపడగలిగితే రేపు పిల్లల భవిష్యత్తు నిలకడగా తామరాకు చుక్కలా మెరుస్తూ నిలవదూ!


ఢిల్లీవంటి పెద్ద నగరానికి వెళ్ళిన తరవాత మళ్లీ తను పుట్టింటి తరపు బంధువుల్ని ఎప్పుడు చూస్తుందో ఏమో మరి- అంచేత ఆమె మరునాటినుంచే వీడ్కోలు పారాయణం ఆరంబించింది- గడప గడపకూ వెళ్లి- మనిషి మనిషికీ ఎదురెళ్లి- ఆ తర వాత భర్తను అమ్మానాన్నల వద్దకు తీసుకువెళ్లి వాళ్ళ ఢిల్లీ ప్రయాణం వెనుక ఉన్న కథా కమీషూ గురించి వివరించింది.


కమలకాంతం ఢిల్లీ రాజధానిని టి వీ సెట్టులో మాత్రమే చూసింది గాని, జీవితంలో స్వయంగా చూడగలననుకోలేదు.

=======================================================================

ఇంకా వుంది

=================================================================================

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

Podcast:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.




71 views1 comment
bottom of page