top of page

ఇక జీవితం ఉద్వేగ పూరితమై, ఉత్తుంగ తరంగమై - పార్ట్ 2


'Ika Jeevitham Udvega Purithamai - Utthunga Tharangamai - 2' - New Telugu Web Series Written By Pandranki Subramani

'ఇక జీవితం ఉద్వేగ పూరితమై - ఉత్తుంగ తరంగమై - 2' తెలుగు ధారావాహిక

రచన : పాండ్రంకి సుబ్రమణి

(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

జరిగిన కథ:

కుటుంబ పోషణ కోసం ఢిల్లీలోని ఒక మెస్ లో కుక్ గా చేరుతాడు రామభద్రం.

ఒకరోజు అతనికి కలలో ఆ మెస్ నిర్వాహకురాలు రూపవతి కనిపిస్తుంది. అతనిలో అలజడి మొదలవుతుంది.


'ఇక జీవితం ఉద్వేగ పూరితమై, ఉత్తుంగ తరంగమై - పార్ట్ 2' చదవండి.


ఇప్పుడతని మనసు మరొక మారు అటువేపు మళ్లింది. ఇంతకీ కలలోకి రూపవతి ఎలా వచ్చిందని? వచ్చి తన ముందు ఎలా కూర్చుందని? నెమరు వేసుకోవడానికి ప్రయత్నించాడు. బుగ్గనిండా చివచివలాడే కొల్ కొత్తా స్వీట్ పాన్ బిగుంచుకొని, పండి పోయిన ఎర్రటి నాలికను పదే పదే తనకు తాను చూసుకుంటూ, అతడికి కావాలనే చూపిస్తూ- కాటుక కళ్ళను ఎగరేసి నవ్వు తూ, కైపెక్కించే చూపులతో పుర్రెక్కిస్తూ- దగ్గరితనమున్న అత్తకూతురులా జారిపోతూన్న పైట చెంగుని కావాలనే గాలికి వదిలే స్తూ- మురిపంగా తన గడ్డం నిమురుతూ బుజ్జగిస్తూంది- గగన వీధిన వీణ మీటగా వినిపించే మోహన రాగంలా--


ఐనా తను భార్యను విడిచి ఎన్నాళ్ళయిందని? పట్టుమని నెలరోజులు కూడా కాలేదే-- కలలో కూడా రూపవతి మేడమ్ ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసరు భార్య అన్నది మరచిపోవచ్చా! మరి కాసేపటికి లేచి చూస్తే అతడికి ముఖం నిండా చెమట చుక్కలు నిండాయి. తిన్నగా మొసలి నోట్లోకి తలదూర్చడం అంటే ఇదేనేమో! ఇంతకీ తనను ఇంతగా హత్తుకుపోవాడనికి రూపవతిలో తనకగుపించినది ఏమిటో! ఇంకేమిటి- అదెప్పుడో వీధి నాటకంలో యెవరో పాడి వినిపించిన పద్యం గుర్తుకి వచ్చింది;

శ్రీనాథుడికి మనసార నమస్కరిస్తూ తలపోసాడు —


“బిగువై, వట్రువులై, విరాజితములై, బింకంబులై- యుబ్బులై, నగసాదృశ్యములై, మనోహరములై, నాగేంద్ర కుంభంబులై, సొగసై, బంగరు కుండలై-”


అబ్బో! ఇక తనవల్లకాదు బాబూ ఆ విరహాగ్నిని భరించడం-- గతి తప్పిన ఆలోచనల్ని తిరిగి దారిలోకి తీసుకురావడానికి కంకణం కట్టుకుంటూ ఆపుకున్నాడ తను. మొదట తన ఇద్దరు కొడుకుల్నీ కళ్లముందుకు తెచ్చుకున్నాడు- పిదప వయసు మళ్ళి కన్న తల్లి దండ్రుల్ని గుర్తుకు తెచ్చుకున్నాడు. అప్పుడు తననే నమ్ముకున్న తన భార్యామణి కాంతం ముఖారవిందం కనిపించింది.


అటు పిమ్మట అతడికి తెలియకుండానే అతడిలోని విరహాగ్నిలో పొంగిన ఆవిరి కొంచెం కొంచెంగా తగ్గు ముఖం పట్ట సాగింది. ఎలాగో ఒకలా తన జీవన సహచరి కాంతాన్ని- కమల కాంతాన్ని ఇక్కడకు తెచ్చుకోవాలి. ఎంత చెట్టుకి అంతగాలి అన్నట్టు- ఉన్నదానితో ఉగ్గబెట్టి సర్దుకో వాలి. సంసారం ఒడుపుగా సాగించాలి. అలా ఆలోచిస్తూ అతడు మరొకసారి మనసున నమస్కరించాడు- కబీర్ దాసుని తలచుకుని- “మనిషి మనసొక కోతి! ” ఎంత చక్కగా ముఖాన వాయించేలా చెప్పాడా మహాశయుడు--


మరునాడు ఉదయమే ఢిల్లీ వాతావరణాన్ని లెక్క చేయకుండా చన్నీళ్ల స్నానం చేసి తిన్నగా మార్కెట్టు యార్డు మార్గాన ఉన్న భజరంగ భళి ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకున్నాడు. గుర్తున్నంత మేర మనసున ఆంజనేయ దండకం చదువుతూ ఆలయ ప్రాంగణంలో కూర్చున్నాడు; ఆశా వాంఛల క్రీనీడల ప్రభావాల నుండి తొలగి నిల్చునేందుకు ప్రమాణ పత్రాన్ని రచిస్తూ--

ఇకపోతే- చాలా సార్లు కొద్ది మందికి మాత్రం దెబ్బపైన దెబ్బ సమ్మెట పోటులా తగుల్తుందంటారు. అలా జరగడం గ్రహపాటంచారు. అదే రీతిన రామభద్రం విషయంలో జరిగేటట్లుంది. ఉన్నవాళ్లకు పని రద్దీ నుండి తెరపి నివ్వడానికి తిరుచ్చికి చెందిన వళ్ళరసి అనే ఒక తమిళ స్త్రీని మెస్సులోకి పోస్ట్ చేసారు మేడమ్. ఆవిడ చురుకైన చూపుల్ని- బిగి యవ్వనాన్ని చూసి- పెనుగాలి అంతటి నిట్టూర్పు విడిచి మరింతగా డీలాపడిపోయాడు రామభద్రం.


వేటినుండి, వేటి ప్రభావం నుండి అతడు దూర దూరంగా జరగాలని చూస్తున్నాడో- అవే అతడికి యమపాశంలా దగ్గర దగ్గరకు వస్తుంటే అతడు మాత్రం ఏమి చెయ్యగలడు? నిజానికతడు అప్పటి పరిస్థితుల్లో నిమిత్త మాత్రుడే కదా! అన్నట్టు వళ్ళరసి గుండెల మధ్య పొదిగినవి- ఉప్పొంగినవి కుచములా లేక కొండ శిఖరములా! కాని అతడి అదృష్టం కొద్దీ వళ్ళరసి కొన్ని రోజుల్లోనే మేడమ్ ఇంటికి వాళ్ళింటి పనిగత్తెగా వెళ్లిపోయింది. -- రామభద్రానికి మనసా వాచా తెరపి కలిగింది. తనకిక తిరుచ్చి నెరజాణ వల్లరసి రూపం కలలోకి వయ్యారంగా నడుమొంపులు చూపిస్తూ, ఓర చూపులతో కైపెక్కిస్తూ కనిపించే ప్రసక్తే ఉండదు కదా!

---------------------------------------------------------------------------------------------------

ఢిల్లీ నగరంలో రోజులు చలిచలిగా రద్దీ రద్దీగా సాగిపోతున్నాయి; చప్పుడు చేయని రబ్బరు పొత్తరాళ్ళలా వాటి కవే దొర్లిపోతున్నాయి. ఈలోపల చీఫ్ కుక్ సోమనాథం వద్ద త్వరలోనే మంచి పనివాడన్న గుర్తింపు పొందగలిగాడు భద్రం. కొంద రు అరుదుగా కొండ కనుముల మధ్య పారే వాగులా ఎదురవుతుంటారు. ఎందుకంటే- వాళ్ళు చీకటిని మాత్రం వెతుక్కుంటూ సంకుచిత స్వభావాలను తడుముకుంటూ మనుగడ సాగించరు.


కడివెడంత కాకపోయినా, కనీసం ఇసుమంత మంచినైనా కుల మత ప్రాంతాలకతీతంగా చూపుసారించి మంచితనపు పందిరిని నలువైపులా పర్చడానికి ఆరాటం చెందుతుంటారు. ఆ కోవకు చెందిన వాడు సోమనాధం. అంచేత అతడు తన పట్ల అందించిన సకారాత్మక భోగట్టా వల్లకాబోలు మెస్సులో భోజనాల బంతి ఆరంభించక ముందు, సాయంత్రపు భోజనాలు పూర్తయిన పిమ్మట రూపవతి మేడమ్ రౌండ్సుకి వస్తున్నప్పుడు మరవకుండా భద్రం వేపు పలకరింపులు ప్రసరించకుండా వెళ్ళడం లేదు. ఎప్పుడైనా ఎక్కడైనా సరే- ‘కష్టే ఫలీ! ’అన్న ధర్మసూత్రం మాత్రం ఎన్నటికీ మారదు కదూ!


ఈమధ్య అతడికి మెస్సు వీధిన రెండు మూడు సంఘటనలు యెదురయాయి; అతణ్ణి అబ్బురపరుస్తూ ఆశ్చర్యాంబుధిలో ముంచుతూ-- అతడికి చిల్లర మల్లర పనులు తగిలి, మార్కెట్టు మెయిన్ రోడ్డుమ్మట యథాలాపంగా వెళ్తున్నప్పుడు మంచి ఎత్తరులైన ఇద్దరు పంజాబీ స్త్రీలు ఎదురు చూడని విధంగా అతడికెదురు వస్తూ ఒరసుకున్నంత దగ్గరగా వచ్చారు. మురిపెంగా ఓరకంట చూస్తూ నవ్వారు. నవ్వుతూనే మోహపు జ్వాలల్ని వెదజల్లారు.


మొదట వాళ్లిద్దరు తన వేపు చూసి నవ్వలేదనుకుని- ఇంకెవరినోనని తలపోస్తూ ముఖం తిప్పుకున్నాడు. ఆ మాటకు వస్తే అతడు ఆ ప్రాంతానికి అనామకుడేగా! అందులో తను ఇప్పుడిప్పుడే భజరంగ భళి ఆలయంలో కంకణం కట్టుకున్నాడు కదా- ఏ స్త్రీ ముఖం వేపూ ఏ నెఱజాణ భుజాన జారే చెంగు వేపూ కన్నెత్తి కూడా చూడకూదని. కాని అతడి పరిస్థితి అంత సజావుగూ సాగేటట్లులేదు.


అలా వాలు చూపులతో వెళ్తూన్న వాళ్ళిద్దరూ విషయాన్ని అంతటితో పోనివ్వలేదు. రెండవసారి అదే పెంకె తనపు చూపులతో ఎదురయారు. మెరెక్కడో వీధి చివరన తటస్థ పడ్డప్పుడు ఏపుగా పెరిగిన మాధవధార అమృతపాణి అరటి బోదెల్లా తన ప్రక్కనే నడుస్తూ ఇద్దరూ తనతో హిందీలో ఏదో మాట్లాడసాగారు.


అతడికేమో ఆ భాష సగం అర్థం అవుతున్నట్లుంది. మరొక సగం అర్థం కానట్లే అనిపిస్తూంది. వాళ్ల సంభాషణలోకి చాలా వరకు పంజాబీ పలుకులు దొర్లుతున్నట్లున్నాయి. వాళ్ల వైఖరి చూసి చూపులోని తెగింపు చూసి అతడికి జంకు కలిగింది. అసలే ఈమధ్య ఆశల ఆరాటంలో కోర్కెల కొలిమిలో పడి కొట్టుమిట్టాడుతు న్నాడు. మరిప్పుడు ఈ వాంఛా పూరిత అలల తాకిడి కూడానా! అలా అనుకుంటూ అతడు అసంకల్పితంగా వాళ్లిద్దరి కంఠస్థలం వేపు తిరిగి చూసాడు.


అంతే-- మనసున కవిసార్వ భౌముడి శృంగార రసగాన ప్రవాహం ఆ కాశవాణి లా మరొకసారి వినిపించింది—“బిగువై, వట్రువులై, విరాజితములై,, బింకంబులై, యుబ్బులై-- అంతే— ఉలిక్కిపడ్డ పిచుకలా వాళ్ల నుండి దూరంగా జరిగి వడి వడిగా నడవనారంభించాడు వాళ్ళను దాటుకుంటూ—పరుగు వంటి నడక అందుకుంటూ--


నిజానికి ఆ ఎత్తరి పంజాబీ స్త్రీలిద్దరూ అక్కడెక్కడో దుకాణదారుల ఇండ్లలో పని చేస్తున్నపనిగత్తలు అయుంటారు. వాళ్ల ఎరుపు మేని ఛాయో- నిండు యవ్వనమో చూస్తే అలా అనిపించరు కళ్ళకు. వాళ్ళనక్కడ నౌఖరాణీలంటారు. ఈసారిగాని మనో నిగ్రహపు జీబ్రా లైను దాటాడంటే తనగతి ఇక అథోగతే! ఐనా- ఇదెక్కడి కర్కష కాలం, ఆకలితో అలమటిస్తున్నవాడి ముందు

పరమాన్నం వడ్డిస్తున్నట్టు--


నడుస్తూనే అతడు చటుక్కున వెనక్కి తిరిగి చూసాడు. ఇద్దరు వనితలూ నవ్వులు చిందిస్తూ చేతు లూపుతున్నారు. అతడు కూడా మరీ బెట్టుసరి చూపిస్తే చచ్చుడు బండనుకుంటా రేమోనని తలపోస్తూ లేని కలుపుగోలుతనం చూపిస్తూ చేతులు ఊపి మలుపు తిరిగాడు.


ఆ ఇద్దరు నౌకరాణీల సంకేత వ్యవహారం ఎక్కణ్ణించి ఎంత సేపట్నించి గమనిస్తూ నిల్చుందోమరి. మేడమ్ రూపవతి మరునాడు ఉదయమే తనను సూటైన ప్రశ్నతో ఎన్ కౌంటర్ చేసినంత పని చేసింది.


తను స్వయంగా కాఫీ కలిపి ఆమెకు అంది చ్చి తిరిగి వెళ్లబోయేంతలో లెడ్జర్ బుక్కులతో సతమత మవుతూన్నదల్లా తలెత్తి చూసి, కాఫీ కప్పుని దగ్గరకు తీసుకుని తాపీగా అదేదో మామూలు వ్యవహారమే అన్నట్టు అంది—“అదేంవిటండీ వీరభద్రం- సారీ రామభద్రం-- ఇక్కడి పంజాబీ స్త్రీల ప్రాప్రం కోసం - ప్రాప్తం ఏమిటి- వాళ్ళ కడగంటి చూపుకోసం ఇక్కడ చుట్టుప్రక్కల ఉద్యోగాలు చేసుకుంటూన్న సౌత్ ఇండియన్స్ తెగ ఆరాట పడుతుంటారు. మీరేమో- ప్రక్క ప్రక్కలకు ఒరసుకుంటూ వచ్చినా ప్రవరాఖ్యుడిలా తొలగిపోతున్నారు! ఇంతకీ విషయం ఏమి టంట?"


అతడు మొదట అర్థం కానట్టు చూసి ఆ తరవాత తలుపుతూ నవ్వి లోపలకు కదలబోయాడు- ఎందుకు వచ్చిన తద్దినంలే అనుకుంటూ మనసున. ఆమె మాత్రం విడిచిపెట్ట లేదు. ఆపిందతణ్ణి. నవ్వు ముఖంతో ఏ మూడ్ లో ఉందోగాని- సగం కాఫీని సాదరంగా సాసర్లో పోసి అతడికి అందిచ్చింది.


”వద్దు మేడమ్. మీరు పనిచేసే తీరుకి మరొక కాఫీ కప్పు కూడా అవసరమేనేమో! చీఫ్ కుక్ గారేమో నాకోసం ఎదురు చూస్తున్నట్టున్నారు. నేనూ చీఫ్ కుక్కూ కాఫీ కలుపుకుని తాగుతాం లెండి”


“ఎదురు చూడనివ్వండి భద్రంగారూ! మీరు మాట్లాడుతున్నది మీ మెస్ మేడమ్ తోనేగా! ముందు నేనిచ్చిన కాఫీ పుచ్చుకోండి”


చక్కటి తెలుగు- ఇంకా వినాలనిపించే కమ్మటి తెలుగు ఉఛ్ఛరణ. ఎక్కడ నేర్చుకుందో- ఎప్పుడు అలవడిందో! ఈ చుట్టు ప్రక్కల ఇటువంటి స్వఛ్ఛమైన తెలుగు లక్ష రూపాయలు పెట్టినా ఒక అక్షరమైనా వినగలడా! ఈసారి అతడు కాదనకుండా థేంక్స్ చెప్పి సాసరు అందుకుని తాగడం పూర్తి చేసాడు-


‘నృపుల అనుగ్రహం- అందమైన ఆడదాని అనురక్తీ ఒక విధంగా ఒకే తీరునుంటుం దంటారు; ఊపిరి సలపనివ్వని జలపాతంలా-- చల్లగా హాయిగా ఉంది కదానని దాని క్రింద జలకాలాట ఆడేందుకు ప్రయత్నిస్తే ఇక సంగతులంతే మరి- ముళ్ళున్న మొగలి పట్టను ముట్టుకోవడమే ఔతుంది!'

అతడు తనకక్కడ పనేమీ లేదనుకుంటూ దూరంగా తొలగిపోవడానికి నడిచాడు. రూపవతి పట్టుదలగల స్త్రీలాగుంది- అదే ప్రస్తావన మళ్లీ తెచ్చింది “ఉఁ చెప్పండి మిస్టర్ భద్రం! తెల్లగా ఎత్తుగా మెరుపు తీగెల్లా కనిపించే ఆ పంజాబీ భామామణులు మీ చూపుకి ఆనటం లేదా? బహుశ: మీరు సౌత్ లో పుట్టి పెరిగిన వారు కదా! మీకు డస్కీ కలర్ మాత్రం నచ్చుతుందేమో!”


కొంటెగా చూస్తూ నవ్వుతూన్న ఆమె కళ్ళలోకి చూసాడతను. ఎందుకు వచ్చిన లంపటం ఇది? ఈమెది దీర్ఘమైన నిఘానేత్రమని తనకు తెలియనిదా యేమిటి! దానిని మళ్లీ మళ్ళీ నిరూపించుకోవాలా! మొత్తానికి గంగాధరం తనను డేంజరస్ స్పాట్ కే పంపించినట్టున్నాడు.

“అదేమిటి అలా ఉన్నుపాటున మౌనంగా ఉండిపోయారు? బదులివ్వడం ఇష్టం లేదా! అలాగైతే మీరిక వెళ్లవచ్చు” అంతలోనే నవ్వు- మరుక్షణంలోనే అసహనపు విసురూను.


మరీమెతో ఎలా సర్దుకోవడం? మౌనం వహిస్తే నిరసన- నోరు తెరిస్తేనేమో తిరస్కరణ-- “అబ్బే! అదేమీ కాదండి. మీరంతగా అడుగుతుంటే చెప్పకుండా ఉంటానా? మరైతే-- కాస్తంత సూటిగా చెప్పవలసొస్తుందేమో! ”


రూపవతి అలాగే అన్నట్టు తలూపింది.


“పెళ్లయిన స్త్రీల వెంట- పెళ్ళికాని అమ్మాయిల వెంట అర్రులు చాచుతూ తిరిగే ఓపిక నాకు లేదండి. భార్యా బిడ్డలు గలవాణ్ణి. ఇక పోతే- ఎరుపైన- పొడవైన పంజాబీ అమ్మాయిల్ని చూసి అర్రులు చాచే బెంగాళీ బాబులూ మిగతా సౌత్ ఇండియన్ రోమియోల గురించంటారా—చెప్తాను. బాధ్యతల్లేని సంబంధాలంటే చాలామందికి టేస్ట్ గానే ఉంటుంది కదండీ! “


“అలాగా! బాగుంది! చాలా బాగుంది! మరి ఆనాడు మీరు నాతో ఉషారైన మూడ్ తో పొంగి పొంగి మాట్లడారే! శృంగార రసాన్ని రెండు దోసిళ్లలోనూ వెదజల్లారే-- ఆమాటేమిటి? అప్పుడది ఎలా సాధ్యమైందండీ! నాకోసం మరొకమారు విపులీకరిస్తారా!”


రామభద్రం ఉలిక్కిపడ్డట్టు చూసాడు. ”నేనా! మీతో అలా ఉషారుగా పొంగి పొంగి మోట్లాడానా! ఎంతమాట ఎంతమాట! క్షమించాలి ఇలా చెప్తున్నందుకు—మీరేదో కలకని వచ్చినట్టున్నారు మేడమ్”


“అబ్బ! మనిషికి- అందునా ఈ వయసులో ఇంతటి మతిమరుపుండకూడదు. అందునా అటువంటి విషయాలు ఆడదాని చేత చెప్పించకూడదు మహాశయా! వారం రోజుల ముందు- దీపాలు పెట్టేవేళ దాటిపోతున్నప్పుడు, నేను ’శివా! ’ అంటూ ఆదరాబాదరా గా అదనపు ఖర్చులకీ రాబడికీ సంబంధించిన లెక్కలు చూసుకుంటున్నప్పుడు, మీరిలాగే సౌమ్యంగా అదేదో మామూలు విష యంలా చూస్తూ నాకొక కాఫీ కప్పు ఇస్తూ నాకోసం నన్వు ఉద్దేశించి ఒక మాట అన్నారు. గుర్తుకి తెచ్చుకోండి. ప్లీజ్! ”


“ఏమనుంటానండి. అలసి పోయినట్టున్నారు- స్ట్రాంగ్ కాఫీ తెచ్చాను, తాగి కాస్తంత సేద దీర్చుకోండి మేడమ్- అనుంటాను”


“అబ్బ! ఎంత అమాయకంగా ముఖం పెట్టి మాట్లాడుతున్నారండీ బాబూ! అంతటి బరువుని మీరు మోయలేరండీ- అనలేదూ?"


“ఇందులో తప్పేముందండీ! ఇంతటి పెద్ద మెస్సులో అందునా స్త్రీ అయుండీ అంతటి బరువు బాధ్యతలు మోయడం కష్టమని- “

“తప్పారైటా అన్నది కాదు మేటర్. నన్ను ముందు ముగించనీయండి. మొదట ఆమాట మామూలుగానే అన్నారనుకున్నాను. కాని చివరను ఒక మెలిక తిప్పారు. దానితో డంగైపోయాను”.


రామభద్రం ప్రశ్నార్థకంగా కనుబొగలెగరేసి చూసాడు.


“మీరు మోయలేని బరువుని మీరెందుకండీ అంత శ్రమపడి మోస్తారూ! ఈ బరువంతా మీ మిలిటరీ ఆయన మోయాలి గాని-” అంటూ దుపట్టా దిగజారిన నా కంఠస్థలాన్ని పదే పదే చూస్తూ అన్నారు. పెళ్లయిన దానిని నాకాపాటి కిటుక తెలియదటండీ! నేను దుపట్టా సరిగ్గా సర్దుకుని తలెత్తి చూసేటప్పటికి మీరు అదేమీ పెద్ద విషయమే కాదన్నట్టు చల్లగా జారుకున్నారు. నిజం చెప్పాలంటే—మీ చూపులు బాణాల్లా సరా సరి గుండె కోణాల్లోకి గుచ్చుకున్నట్లయింది”.


ఆమాటతో అతడు మౌనంగా ఉండిపోయాడు. ఆలోచనల్లో పడ్డాడు. తను ఆమె రూపాన్ని ఒకటి రెండుసార్లు తలచుకున్నది వాస్తవం. ఒకరాత్రి రూపవతి యవ్వన పొంగుకోసం ఊహల్లో తేలుతూ తపించిన మాట కూడా వాస్తవం. కాని- అదంతా ఊహల్లో, కలల అలల్లోనే-- ఒకవేళ అదే అలవాటుతో అదే ఊపుతో మెదడు పొరలోని భావ తరంగాన్ని పైకి పుక్కలించేసాడేమో!

తడబడుతూ అందుకున్నాడతను- “ఆమాట నేనెప్పుడన్నానో- ఎక్కడన్నానో నాకు జ్ఞాపకం రావడం లేదండీ! అలా నిజంగానే అనుంటే- సారీ! ”


”సారీతో సరిపెట్టుకోకండి. మరొకటి కూడా అన్నారు- సనసన్నగా వినిపించీ వినిపించనంతగా గొణుగుతూ—అటు వెళ్తూ—”


“బ్రహ్మదేవుడా! ఇంకా అన్నానా? నాకు- నాకు కాదు. నాకుటుంబానికి చెడుకాలం దాపురించినట్లుంది“ బెంబేలు పడిపోతూ వెను దిరగడానికి పూనుకున్న రామభద్రాన్ని చూసి నవ్వింది “మీకిప్పుడు పట్టుకున్నది చెడు కాలం కాదు. సమ్మోహన రాగం- ”.

“ఇంతకీ నేనేమన్నానండీ?"

“అంతా నానోటితోనే చెప్పించండి. బాగుంటుంది! ఇక చేసేదోముంది. అదీ చెప్తాను. శరీర లావణ్యం చూస్తుంటే- కళ్లల్లో చిమ్మే ధవళ కాంతులు గమనిస్తుంటే ఈమె పద్మినీ జాతికి చెందిన లలనలాగుంది- అంటూ గొణుక్కుంటా కదిలి వెళ్లిపోయారు. అంతవరకూ వ్యవహారం బాగేనే ఉంది. కాని ఆతరవాత ఏమైందో తెలుసా? ”


తెలియదన్నట్టు తల అడ్డంగా ఆడించాడతను.


“తాపం పెరిగి నిద్రకు దూరమై ఆ రోజు రాత్రంతా మావారి గురించిన కలవరింతలే! ”


“అంతటి పాట్లు మీకెందుకండీ! క్యాంపునుండి మీవారిని మంగళూరుకి రప్పించుకోవచ్చు కదా! అదీ వీలుకాకపోతే మీరే సమయం చూసి ఆయనను కలుసుకోవచ్చుకదా! సలహా ఇవ్వడం కాదు, పెళ్ళయిన వాణ్ణి కాబట్టి ఆ అనుభవంతో చెప్తున్నాను”


“చాల్లే భద్రం! మీదంతా వక్రభాష్యం- గాయం రేపింది మీరు, మందు వేయడానికి ఆయన్నక్కడ్నించి పనిగట్టుకుని పిలవాలా? బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉన్నవాళ్ళకు అంత తేలిగ్గా సెలవులు పుట్టుకువస్తాయా! ఆ ఒక్క చూపుతో ఆ ఒక్కతూపుతో నన్ను నిలకడ లేని దానిని చేసేసారు కదా--

అప్పుడు మీరు చేయనిదా నేనిప్పుడు చేస్తున్నాను? ఆ తెలుపు ఆడగుర్రాలు రెండూ మిమ్మల్ని వెన్నంటి ఆటలు పట్టించి కవ్విస్తుంటే చూసి అడిగాను. దీనికే పుట్టుకొచ్చిందా జానెడంత కోపం-” అంటూ రూపవతి నిదానంగా డ్రాయరు తెరిచి ఏదో కవరు బైటకు తీసి అతడికి అందిచ్చింది.


భద్రం ముఖం వెలవెలబోయింది. గోడకు అంటుకుపోయిన వాడిలా చూస్తూ దానిని అందుకున్నాడు. “ఏంవిటండీ ఇది?" గొంతున తడారిపోయింది. తనను ఊరికి పంపించేయడానికి తీర్మానించేసిందా!

“మీ ఊరు కంచెరపాలానికి ట్రైను టిక్కెట్లు”.


అతడు మరుపలుకు లేకుండా టిక్కెట్లు పరీక్షగా చూసి, రిటర్న్ టిక్కెట్టు ఆమెకు ఇచ్చేసాడు. ఈసారి ఆశ్చర్యపోవడం రూపవతి వంతయింది.


“మళ్లీ రారా! ఇంత చిన్నదానికే అంత సీరియస్ గా తీసుకుంటున్నారు—జీవితంలో ఎలా నెగ్గుకురాగలరు?"


“అబ్బే! మేటర్ అది కాదండీ—మన మధ్య వాగ్వాదం సెటిల్ ఐపోయింది కదండీ— ఈ విషయం వేరండి. నేను మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తానో నాకే తెలియదండి. అసలు మళ్లీ ఢిల్లీనగరానికి వస్తానో రానో కూడా తెలియదండి.


ఎందుకంటే- మా అమ్మాబాబూ కొంచెం వయసు మళ్లిన వారు. వాళ్ళ గురించి ఆలోచిస్తే గుండె తరుక్కుపోయేలా ఉంది మేడమ్- ఆ చుట్టుప్రక్కల బంధువులు గాని మాకు దగ్గరితనం గల వారు గాని అంతగా లేరండి. ఉన్న ఇద్దరు ముగ్గురూ ఏదోలా పెడ ముఖంతో ఉంటారు. నేనే వెళ్లి చూసుకోవాలి. అందులో కొడుకులిద్దరూ నాగురించి మాటిమాటికీ అడుకుతున్నారట. విశాఖపట్నం వేవు వెళ్ళ లేకపోతే పోయె. పెద్ద వాణిజ్య నగరమైన హైద్రాబాదు వేపు వెళ్లినా ఏదో ఒక రిస్టారెంటులో చిన్నపాటి ఉద్యోగం దొరక్కపోదు.


అదీ వీలు లేకపోతే—ఏదైనా కో- ఆపరేటివ్ సొసైటీలో లోను తీసుకుని, కర్రీ పాయింట్ పెట్టుకుంటాను కాస్తంత రిస్కీ వ్యవహారమైనా--” చెప్పాడు భద్రం.

=======================================================================

ఇంకా వుంది

=================================================================================

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

Podcast:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.





31 views0 comments
bottom of page