top of page

వాచస్పతి


'Vachaspathi' - New Telugu Story Written By Sudarsana Rao Pochampally

'వాచస్పతి' తెలుగు కథ

రచన : సుదర్శన రావు పోచంపల్లి

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

పూవు పుట్టగానే పరిమళిస్తుంది’.


ఇది లోక వాడుక. కానీ ఏ పూవూ పుట్టుకతో పరిమళించదు. పెరిగి విప్పారినప్పుడే పరిమళము గుప్పుమంటూ గుబాళిస్తుంది. అట్లనే ఏ కాయైనా పండితేనే పరిమళముతోపాటు మాథుర్యము మనకందిస్తుంది. పూవు రుచి చూడము కాని, కాయను ఓపికలేక కసరుకాయనుండే కొరికేయడమూ మానవ సహజమే. పరిపక్వ దశకొచ్చేటప్పటికి చేదు, వగరు, పులుపు తరువాతనే తీపిదనము ఆస్వాదిస్తాము.


తరువాత జాతులైన, పక్షి రెక్కల బలము పెరిగితేనే ఎగురగలదు, పశువు పాలు మరచి మేత గరిచే దాకనే తల్లి వెంట తిరుగుతుంది. అట్లనే "ఆళి, కుళి, వృచ్చిక, వేణు, రంభ అవసానకాలే ఫలముద్భవంతి" అంటారు. అంటే తుమ్మెద, వెండ్రకాయ(పీత), తేలు, వెదురుచెట్టు, అరటి చెట్టు ఫలమొసంగి చనిపోతాయంటారు.


మానవునికి మాత్రము బాల్య, కౌమార, యౌవన, వార్థక్యమను నాలుగు దశలుండి. శైశవములో పాలుగుడుచుట, బాల్యములో విద్యాభ్యాసము, యౌవ్వనములో సంపాదన. వార్థక్యములో విశ్రాంతి పొందుతూ ఉంటారు.

విద్యాభ్యాసముతో పాటే జ్ఞానము అలవడుతుంది.

కొందరికి ఆ జ్ఞానము చిరు ప్రాయముననే బయట పడితే పూవు పుట్టగానే పరిమళిస్తుంది అను సామెత వాడుతుంటారు.


ఆ జ్ఞానమబ్బుడు చాలా కొద్దిమందిలో మాత్రమే.

కొన్ని తీగ జాతులలో ఉదాహరణకు పొట్ల, ‘పట్టినెత్తుకొనే పందిరెక్కుతుంది’ అంటారు.


అన్ని జీవ జాతులలో మానవ జాతి ఉత్కృష్టమైనది. కాని చెట్టుకు చెదలు పట్టినట్టు కొందరు మానవత్వము చంపుకొని కౄరులుగా దానవులుగా, రాక్షస స్వభావము అలవర్చుకొని సంఘములో చీడలా తయారైతారు. అడవిలో కౄర జంతువులైతే అది స్వాభావికము. కొన్ని కౄర పక్షులూ ఉన్నా అవి అడవికే పరిమితము. తక్కిన పక్షులు, పశువులు మనుషులనాశ్రయించుకొని ఉంటాయి. వాటిలోనూ తరచు కొన్ని తెలివితేటలు బయల్పడుతుంటాయి. అందులో కుక్క విశ్వాసముగల జంతువు. యజమానికొరకు ప్రాణమివ్వడానికి కూడా వెనుకాడదు.


ఇక కథలోకి వస్తే విశ్వేశ్వర్. వినయ ఆదర్శ దంపతులు. ఒకరిమాటకు ఒకరు వ్యతిరేకత కనబరుచరు. అన్యోన్యతకు మారు పేరా అన్నట్టు వ్యవహరిస్తుంటారు. వాళ్ళకో పుత్ర రత్నం- పేరు వాచస్పతి. పదేండ్లైనా విద్య అబ్బదు సరికదా దురలవాటు. దుర్మార్గపు ఆలోచనలే అతని విధానము. విశ్వేశ్వర్, వినయ లోకములో అందరు బుద్ధిమంతులతో పోల్చుకొని తమకీ దురదృష్టమేమిటి అని వాపోతుంటారు.

పుత్రవాత్సల్యము ప్రక్కకు పెట్టి ఎంత దండించినా ఎంత మర్యాదగ చెప్పినా పెడచెవిన పెడుతాడేకాని ఏదీ పట్టించుకోడు వాచస్పతి. ఇక లాభము లేదను తలంపుతో అంతరాత్మకు వ్యతిరేకమైనా బాలుర వసతి గృహములో చేరుస్తారు వాచస్పతిని. అక్కడా షరా మామూలే. వసతిగృహ యాజమాన్యము ఇతని వలన తక్కిన బాలురు చెడిపోతున్నారు ఈ చీడ మనకెందుకు అని ఇంటికి పంపుతారు వాచస్పతిని. తలిదండ్రుల ఆవేదనకు అంతులేకుండా పోతుంది.


మళ్ళీ నాయనా తండ్రీ నువ్వు బుద్ధిగలిగి చదువుకోరా నీకేది కావలసివస్తే అది కొనిస్తాము అని బుజ్జగించ చూస్తారు. అప్పటికి పదిహేను ఏండ్లు దాటిపోయి ఇంక కొంచెము దురుసు స్వభావానికి వస్తాడు వాచస్పతి.


ఇక లాభము లేదనుకొని ఇంటిలోనుండి తరిమేస్తె ఇంకా ఎన్ని దుర్మార్గాలకొడిగట్టి తమ మెడకు ఏలాంటి ఉచ్చు తెస్తాడో అని మథన పడుతుంటారు విశ్వేశ్వర్. వినయ.

వాళ్ళకు భక్త ప్రహ్లాదలోని ఒక పద్యము గుర్తొస్తది.


ముంచితి వార్థులందు-గదలమొత్తితి శైలతటంబులందు ద్రొ బ్బించితి-శస్త్ర రాజి బొడిపించితి మీద నిభేంద్ర పంక్తి ద్రొ ప్పించితి ,ధిక్కరించితి-శపించితి ఘోర దావాగ్నులందు త్రో యించితి పెక్కుపాట్లు నలయించితి చావడిదేమి చిత్రమో-


మేము చదువుకొమ్మనే అంటున్నాము కాని వేరే పనులు కూడా చెయ్యమనుటలేదుకదా! కన్న పాపానికి సలక్షణంగా ముప్పూటల పశువును మేపినట్టు మేపుతున్నాము అనుకుంటూ. ఆ పశువు ఆవు ఐతే పాలిస్తుంది. ఎద్దు దున్న పోతు ఐతే వ్యవసాయపు పనులకు అక్కరొస్తాయి అని వాచస్పతికి వినబడేలా లాశిగా అంటారు విశ్వేశ్వర్, వినయ కొంత దుఃఖోన్ముఖులై..


వాచస్పతి ఒక్కసారిగా విభ్రాంతికి గురియై తలిదండ్రులతో అంటాడు ‘నేను ఈ రోజునుండే చదువుకుంటాను. మీరు చెప్పిన పని చేస్తాను’ అని. తలిదండ్రులు కూడా దిగ్భ్రాంతికి గురియై ఇది కలనా నిజమా అని నమ్మలేకున్న కొంత ఆశ చిగురించి దేవునికి మనసులోనే మ్రొక్కుకుంటారు.


వాచస్పతి వయసు ప్రకారము పదవతరగతి ఐపోవలసినది. ఇప్పుడు పాఠశాలలో ఎవరూ చేర్చుకోరు. మొద్దుగా మిగిలిపోవడముకంటే వేరే ఏ గురువు దగ్గరో రాత్రిoబవలులు చదువుకొనుచు విజ్ఞానము నేర్చుకోవాలను జిజ్ఞాస కలుగుతుంది.


తండ్రికి చెబుతాడు తాను ఇకనుండి ఏ గురువు దగ్గరో పాఠాలు చదివి ప్రభుత్వము వారిచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని వైయక్తిక పరీక్షలు వ్రాస్తాను అంటాడు వాచస్పతి.


కొడుకులో వచ్చిన మార్పుకు తలిదండ్రులు ఉబ్బిపోతారు.

విశ్వేశ్వర్ వాచస్పతికి ఒక మంచి విద్యావేత్త ఐన పరశుధర్ అను గురువును ఏర్పాటు చేస్తాడు.

ఇక వాచస్పతి చదువుకే ప్రాధాన్యమిస్తూ ఆకలి దప్పులు కూడా మరిచిపోయిన విధంగా కఠోర దీక్షతో చదువుకుంటుంటాడు.

ప్రభుత్వము నిర్వహించే పరీక్షలు వ్రాస్తూ అంచెలంచెలుగా విద్యలో పై మెట్లు ఎక్కుతుంటాడు వాచస్పతి. ఇంకా ఇంకా చదువుతూ చిన్ననాటినుండి చదివితే ఏ స్థాయిన ఉండెడిదో తన వయసుకు ఆ స్థాయికి చేరుతాడు వాచస్పతి.


గురువు పరశుధర్ విశ్వేశర్తో “మన (ఇక్కడ గురువు చూపే వాత్సల్యము) వాచస్పతి దీక్షా దక్షతతో చదువు కొనుచున్నాడు నా శ్రమ కూడా సార్థకమౌతున్నది సంతోషం. మీరిక నిశ్చింతగా ఉండండి” అంటాడు.


ఆ మాటలు విన్న విశ్వేశ్వర్ పరశుధర్ కు ప్రణామము చేస్తూ “మీకు రుణపడి ఉంటాము” అంటాడు.


‘అదేమి లేదు. నా శిష్యుడు నా అంతవాడు కావలనే నేననుకుంటాను. ఆ అవకాశము మీ వాచస్పతి ద్వారా నాకు దక్కింది’ అనుకుంటూ “మన వాచస్పతి ఇప్పుడు సార్థక నామధేయుడు కాబోతున్నాడు” అంటాడు పరశుధర్.

గురువు తలపోసినట్టుగానే వాచస్పతి బాగా చదివి గొప్ప విద్యావంతుడౌతాడు. గురువు దగ్గర చదువు ముగియగానే వాచస్పతి గురువుకు నమస్కారం చేస్తూ..


గురు బ్రహ్మ. గురు ర్విష్ణు. గురుర్దేవో మహేశ్వర

గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః


అని గురువు పరశుధర్ కు పాదాభివందనము చేస్తాడు వాచస్పతి. ఇంకా..


వ్యాసం వశిష్ట నస్తారం శక్తే పౌత్ర కల్మషం

పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం.


ఈ శ్లోకము చదువగానే గురువు పరశుధర్ అడుగుతాడు వాచస్పతిని “గురువుకు మొదట నమస్కారము పెట్టినవు కద.. రెండవ శ్లోకము ఎందుకు చదివినట్టు?” అని.


దానికి వాచస్పతి సమాధానమిస్తూ..


“వశిష్ట మహాముని ముని మనుమడు, శక్తి మహాముని మనుమడు, పరాశరముని పుత్రుడు, శుక మహార్షికి జనకుడైనట్టియు నిర్మలుడైనట్టి తపవు అనే ధనరాశి గలిగిన శ్రీ వ్యాసులవారికి నమస్కారము. అంటె ఆదిగురువు వేద వ్యాసులవారు పుట్టిన రోజు పూర్ణిమ. ఈ రోజు పూర్ణిమే. వ్యాస పూర్ణిమ అంటారు కద.. నారాయణ మూర్తి స్వరూపమే వ్యాసులవారు. అందుకే అతనిని నారాయణ మూర్తి అని పిలుస్తారు. వేద విభజన చేసిన మహానుభావుడాయన. ఆయన పట్లే మనకు అష్టాదశ పురాణాలు సిద్ధించాయి. ఇంకా భారత భాగవతాలను మనకందించిన పుణ్యమూర్తి వ్యాసుల వారు.

బ్రహ్మను తాత అంటారు. విష్ణువును తాత తాత అంటారు. సంస్కృతములో తాత అంటె తండ్రి అని కూడా అర్థమున్నది.


గురువుగారు.. గురువు నారాయణ మూర్తితో సమానము కదా! నా దృష్టిలో దైవ సమానులైన మిమ్ముల వ్యాస భగవానునితో పోల్చి ప్రణమిల్లుతున్నాను” అంటడు వాచస్పతి. గురువు ఎంతో సంతసిస్తాడు ఇదంతా వింటున్న తలిదండ్రులు ఆనంద భాష్పాలొలికిస్తూ వారు కూడా గురువుకు పాదాభివందనము చేస్తారు.


తరువాత పట్టువస్త్రములు గురువుకు, గురుపత్నికని సమర్పించి వీడ్కోలు పలుకుతారు.


వాచస్పతి గొప్ప విద్యావంతుడేగాక తలిదండ్రుల పట్ల గౌరవము, అందరి పట్ల ఎంతో మర్యాద నమ్రత కనబరుస్తూ మంచివాడని బుద్ధిమంతుడని ప్రశంసలు పొందుతాడు.


తలిదండ్రులు విశ్వేశ్వర్. వినయ ఆనందానికి హద్దులు లేవన్నట్లుగా కొడుకు ప్రయోజకుడైనాడని మురుస్తారు.


పుత్రోత్సాహము తండ్రికి

పుత్రుడు జన్మించినపుడు పుట్టదు జనులా

పుత్రుని గనుగొని పొగడగ

పుత్రోత్సాహంబు నాడు పుట్టును సుమతీ


అని బద్దెన అను సుమతీ శతక కారుడు ఎంతో చక్కగా వర్ణించినాడు. అట్లనే కొడుకు వాచస్పతి కీర్తినార్జించుచుంటే తండ్రి విశ్వేశ్వర్ పొందే ఆనందము ఇంత అంతా కాదు.

అప్పటికే యుక్త వయసు వచ్చినందున మంచి చక్కనైన, బాగా చదువుకున్న సారస అను అమ్మాయి తో వివాహం చరిపించుతారు.


ఏడాది గడిచే నాటికి సారస, వాచస్పతి లకు పున్నమ చంద్రుడు బోలిన బిడ్డ పుడుతుంది. విశ్వేశర్, వినయ మనుమరాలు పుట్టినందున ఎంతో సంతోషిస్తారు. తరం మార్చినందుకు అంటే ‘తాత, నాయనమ్మ’ అయినందులకు. ఇక మనుమరాలు పేరు చంద్రిక అని నామకరణము శాస్త్రోక్తంగా చేయిస్తారు. అందరూ ఆనంద డోలికలో ఊగుతూ పరవశమైపోతారు పసి పాపను చూస్తూ.


చదువు వల్లనే కదా జ్ఞానము. సంస్కారము, అణకువ ఇత్యాది మంచి లక్షణాలు అబ్బేది.. ‘మా చంద్రికను బాగా చదివిస్తాము’ అని కలలు కంటూ చంద్రిక తలిదండ్రులు అంటుంటే. “అవును నాయనా! చంద్రిక వచక్నుని కూతురై సహజ వేదాంత జ్ఞాని అని పిలువబడే గార్గి లాంటి మహా విధ్వాంసురాలు కావాలి. ఇవి మా దీవెనలు” అంటారు విశ్వేశ్వర్. వినయ.

అందరూ చంద్రికవైపు చూసి చప్పట్లు కొడుతారు


సమాప్తం.


సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

Podcast:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

పేరు-సుదర్శన రావు పోచంపల్లి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)

వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి

కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను

నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,

నివాసము-హైదరాబాదు.

26 views0 comments

Comments


bottom of page