top of page

ప్రేమంటే ఇదేనా! పార్ట్ 1


'Premante Idena Part 1' - New Telugu Web Series Written By Penumaka Vasantha

'ప్రేమంటే ఇదేనా! పార్ట్ 1' తెలుగు ధారావాహిక ప్రారంభం

రచన, కథా పఠనం: పెనుమాక వసంత


"ఏ రాజీ! మన ఫ్రెండ్ కం టీచర్ పద్మ కి పెళ్లి కుదిరిందే. " అన్నాను.


"అవునా విరిజా! ఎవరే!?" అడిగింది రాజీ.


"పద్మ తో పని చేసే తోటి టీచరేనే! అన్నాను.


"లవ్ మ్యారేజ్ కదా!" అన్న రాజీ తో


"ప్రేమనా తొక్కనా.. ప్రేమ అయితే కట్నం తీసుకోరుగా! మరి పద్మ లవర్ సూరి మా నాన్న ఒప్పుకోడని కట్నం తీసుకుంటున్నాడు. పద్మ మీద అంత లవ్ ఉంటే వాళ్ల నాన్న ని ఒప్పించి చేసుకోవాలి! అందుకే నాకు ప్రేమల మీద నమ్మకం లేదు. మగవాళ్ళు అందరూ సెల్ఫిష్ లు" అన్నాను.

"సరేలే కాని, మనం పద్మ పెళ్ళిలో సందడి చేయాలే" అన్న రాజీతో "సందడి తర్వాత, పద్మపెళ్లికి మనం, హెల్ప్ చేయాలే" అన్న నా మాటతో ఏకీభవించింది రాజీ.

పద్మ మా కన్నా ఒక రెండు యేళ్లు పెద్దది. కాకపోతే, మా హిందీ పరీక్షలకు తను ట్యూషన్ చెప్పింది. అందువల్ల నేను, రాజీ హెల్ప్ చేయాలనే నిర్ణయానికి వచ్చాము.

ఇక పద్మ పెళ్లికి ఇంటి ముందు తాటాకుల పందిరి వేసి, దాన్ని రంగు రంగుల కాగితాలతో అలంకరించాము. సాయంత్రం పెళ్లి అనగా ఇక మేము రెడీ అయి.. వస్తాం అని చెప్పి ఇంటికి వెళ్ళాము.

"త్వరగా వచ్చేయండి" అన్న పద్మ తో "ఇదిగో చిటికెలో, ఫ్రెసపయి వచ్చేయం!?" అని ఇద్దరం ఇళ్లకు చేరాము.

"ఏంటి వారం రోజులు గా ఆ పద్మ ఇంట్లో వేలాడుతున్నారుగా పెళ్లి పనులనీ! అన్నం అన్నా పెట్టారా, లేదా!" అని మా బామ్మ వెటకారం ఆడింది.

"అయ్యో బామ్మ! అక్కడే, తినేసి వస్తున్నా. కాసేపు పడుకుని మళ్ళీ వెళ్ళాలి. ఇవాళ సాయంత్రం పెళ్లి" అని డాబా పైన గదిలోకి వెళ్ళి పడుకున్నా.

ఈవెనింగ్ రాజీ వచ్చి "ఏ లేవే వసు! నన్ను ఏమో ఎపుడూ లేట్ అంటావు. నువ్వు మాత్రం హాయిగా పడుకున్నావుగా" అని రాజీ లేపుతుంటే లేచి "ఏ రాజీ.. ఒక్క నిముషం వెయిట్ చేయి" అని బాత్ రూంలో దూరా.


"త్వరగా రావే బాబు. లేదంటే, మీ బామ్మ, నా బుర్ర తింటుంది” అన్న రాజీ తో "లేదులే, ఫైవ్ మినిట్స్ లొ వస్తా”నని డోర్ వేసుకున్నా.


"ఏమే, రాజీ! నీకు పెళ్ళెప్పుడు?" అన్న బామ్మతో రాజీ, "నా కన్నా మీ విరిజ పెద్దది, దాని పెళ్లి తర్వాత నా పెళ్లి" అంది.


"మా విరిజ ఇంకా చదవాలంటుంది. మీ వయసుకు, నాకు ఇద్దరు, పిల్లలు పుట్టారు కూడా” అన్న బామ్మ మాటలను విన్న నేను, బాత్రూం నుండే “బామ్మ, రాజీ నీ విసిగించ”కని కేక పెట్టాను.

ఒక అరగంటకు రెడీ అయి కిందకి దిగి అమ్మ కు చెప్పి, మళ్ళీ పద్మ దగ్గరికి వెళ్ళాము.


"వచ్చారా ఇద్దరు శిష్యురాళ్లు, మీ టీచర్ కం ఫ్రెండ్ మీ కోసం ఎదురు చూస్తుంది" అని పద్మ అమ్మ నవ్వుతూ, అనగానే, "పద్మని రాజీ, నేను రెడీ చేస్తాముగా" అని ఇద్దరం రెడీ చేశాం.

"నా పట్టు చీర మరీ వదులుగా, జారిపోతూ ఉంది. మీ ఇంటి పైన రూం లో కట్టుకుని వస్తా”నని పైకి వెళ్ళాను. రూం లోకి వెళ్లి హడావుడి గా చీర కట్టుకుంటున్న టైం లో కొంచం దగ్గుతూ "ఎక్సూజ్ మీ!” అన్న గొంతు తో అదిరి, చీర పట్టుకుని గుమ్మం వైపు చూసాను. 'పద్మ రిలేటివ్స్ అనుకుంటా!' తెల్లగా హైట్ గా, ఉన్నతను కనిపించాడు.

‘తలుపు తోసుకుని రావటం కాదు! తలుపుని నెమ్మదిగా తట్టి పిలవాలి. లోపల ఎవరు ఎలాంటి స్థితి లో ఉంటారో తెలియదుగా! ఈ చిన్న మ్యానర్స్ తెలియదా!’ అన్నట్లు చూసిన నాకు "మీరు తలుపు లోపల గడియ వేస్తే మాలాంటి వాళ్లకు ఓ.. లోపల ఎవరో ఉన్నారని తెలుస్తుంది" అన్న అతని ఆన్సర్ కు నాకు ఒళ్లు మండి "అలాగా.. నాకు తెలీదు మరి.. " అంటూ అటు తిరిగి గబగబ చీర కట్టుకుని కిందకు దిగాను.

ఆ తర్వాత పెళ్ళిలో తెలిసింది.. ఇందాక రూంలో కి వచ్చిన గడకర్ర పేరు ఆనంద్ ట. పెళ్లి కొడుకు సూరి ఫ్రెండ్. వైజాగ్ బ్యాంక్ లో పని చేస్తున్నాడని.

పెళ్లి లో నేను, రాజీ హడావిడి చేస్తుంటే.. పెళ్ళికొడుకు తరుపున ఆనంద్ ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ సందడి చేస్తున్నారు.

పద్మ పెళ్లి ఫిబ్రవరి వాలెంటైన్ రోజే జరిగింది. లవ్ సింబల్స్ తో ఉన్న కేకు ను తెచ్చి దానిపై ఇద్దరి పేర్లు రాయించి, కట్ చేయించాం. మీరు ఎపుడు హాపీ గా ఉండాలన్న, గ్రీటింగ్ కార్డ్, ఇచ్చి అల్ ది బెస్ట్ చెప్పాం అందరం.

పెళ్లి లో పాటలు పాడమంటే నేను, రాజీ ఏవో లేటెస్ట్ సినిమా పాటలు పాడాము. ఆనంద్ ‘జడనిండ, పూదండ దాల్చిన రాణి’ అని ఘంటసాల ఎప్పటివో పాత పాటలు పాడాడు. పెద్ద జడున్న నేను వెంటనే ఆనంద్ పాటతో జడ వెనక్కి వేసుకున్నా.

"ఎవరే ఈ బీసీ నాటి పెళ్ళికొడుకు.. క్రీస్తుపూర్వం పాటలు బాగా పాడుతున్నా”డని రాజీ నేను, నవ్వుకున్నాము. పెళ్లి బాగా జరిగింది. పెళ్లి లో అపుడప్పుడు ఆనంద్ కళ్ల తో నా కళ్ళు కలవగానే వెంటనే, తిప్పేసుకున్నాను.


రాజి ఆనంద్ ను చూస్తూ, "చాలా బావున్నాడు, కానీ అసలు, చూడటం లేదు మన వైపు. నిజం గా బీసి నాటి వాడే, సందేహం లేదు" అంది.


"మనకెందుకే, అతని గురించి" అనీ రాజీని వారించాను. 'కానీ నిజం గా, అందంగా ఉన్నాడు' అనుకున్నా మనసులో

ఎటు వాళ్ళు అటు వెళ్ళారు. పద్మ అత్త వారింటికి వెళ్ళింది. నేను రాజి ఎప్పటిలా కాలేజ్ కి వెళ్లి వస్తూ ఉన్నాము. ఈ యేడు తో నాకు డిగ్రీ అవుతుంది. రాజీది, వచ్చే యేడు అవుతుంది. పద్మ అపుడప్పుడు ఫోన్ చేస్తూ.. ఉంది. హిందీ ప్రవీణ పూర్తి చేయమని. "ఏవన్నా డౌట్స్ వుంటే నేనక్కడికి వచ్చినప్పుడు అడగండి చెప్తాను" అంది.

పద్మ పెళ్లి గుర్తుకు వస్తే, ఆనంద్ గుర్తుకు వచ్చే వాడు. వెంటేనే అతను ఎవరో, నేను ఎవరో అనుకునేదాన్ని. అదీగాక నాకు లవ్ మీద అసలు నమ్మకం లేదు.

నేను ఆంధ్ర యూనివర్సిటీ లో ఎంఏ కి అప్లయ్ చేశాను. పద్మ కి కాల్ చేసి చెప్పాను. "ఏ విరిజ.. నా పెళ్ళికి వచ్చిన ఆనంద్ వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీ లోని బ్యాంక్ లో జాబ్ చేస్తాడు. నీకు సిటీ కొత్త కాబట్టి, ఏవన్నా.. హెల్ప్ కావాలంటే.. ఆనంద్ నంబర్ ఇస్తా, కాల్ చేయి” అంది.

"అలాగే” అన్నా. 'మళ్ళీ ఆ ఆనంద్ ని తగిలించుకోవడం ఎందుకు!’ అనుకున్నా.

వైజాగ్ కి ప్రయాణం అయ్యాను. నేను మా ఫ్రెండ్స్ కలిసి ఉండటానికి ఒక రూం కూడా ఏర్పాటు చేసుకున్నాము.

వైజాగ్ చేరుకున్నాము. ఒక రోజల్లా రూం సర్దుకోవడం తో సరిపోయింది. వండుకోవటానికి, కావాల్సిన సరుకులు తెచ్చుకుని, చిన్నగా ఫ్రెండ్స్ తో కలిసి ఉండే, దానికి, ప్రయత్నం చేస్తున్నా. ఎపుడూ అమ్మా నాన్నను వదిలి ఉండలేదు కాబట్టి, కొంచం ఇంటి వాతవరణమును మిస్ అవుతున్నాననిపించి బాధ కలిగింది.


కానీ ముందున్న గోల్ ముందు, ఇవన్నీ చిన్నవనిపించి, కాస్త కుదుట పడ్డాను. ఈ రెండేళ్లు ఎలాంటి పరిస్థితి అయినా తట్టుకుని నిలబడాలని, నిర్ణయం తీసుకున్నా.


రూం మేట్స్ కూడా, మంచి వాళ్ళు దొరకటం వల్ల, కాస్త, తెరిపిన పడ్డాను. ఒక రోజు, వైజాగ్ బీచ్ కి వెళ్ళాను ఫ్రెండ్స్ తో కలిసి. సాగర తీరం లో కాసేపు కూర్చుంటే, మనసుకు ఎంతో ప్రశాంతత లభించింది.

ఇక రేపటి నుండి యూనివర్సిటీ కి వెళ్ళటానికి సిద్దం అవ్వాలని, ఆ రోజే, బాగ్, బుక్స్, అన్ని సర్ది, పెట్టుకున్నాము.


నాన్న కాల్ చేశాడు, "విరిజా, నీ అకౌంట్ లో డబ్బులు వేసా తల్లి, డ్రా చేసుకో" అని.


"అలాగే నాన్న! అమ్మ, బామ్మ ఎలా ఉన్నారు” అని అడిగాను.


"బామ్మ ప్రతి రోజూ నిన్ను అనుకుంటుంది. నువ్వు జాగ్రత్త! ఉంటానమ్మ. "

ఇంటి నుండి తెచ్చిన డబ్బులు, అయిపోవటంతో 'రేపు బ్యాంక్ వెళ్ళి మనీ డ్రా చేసుకోవా’లనుకున్నా.

యూనివర్సిటీలో ముందు, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవటానికి వెళ్ళాను.

========================================================================

ఇంకా వుంది..



========================================================================


పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


Podcast Link:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్. మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.




60 views1 comment
bottom of page