top of page
Writer's pictureSairam Allu

చీకటి వెలుగులు పార్ట్ 1


'Chikati Velugulu Part 1/2' - New Telugu Story Written By Allu Sairam

'చీకటి వెలుగులు పార్ట్ 1/2' పెద్ద కథ ప్రారంభం

రచన: అల్లు సాయిరాం

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

స్వతహాగా కథారచయితగా మంచి కథలు రాసుకుని, తన ప్రతిభను నిరూపించుకోవడానికి చాలామందిని కలిసి చాలావిధాలుగా ప్రయత్నాలు చేసి, సరైన అవకాశాలు లేక నిరుత్సాహంగా గడుపుతున్నాడు ప్రకాష్. కొన్నిరోజులుగా గమనిస్తున్న ప్రకాష్ తండ్రి జగన్నాథం, తమ లలితకళా ప్రోత్సాహక సంస్థ తరపున నిర్వహిస్తున్న కళాచిత్ర ప్రదర్శనకి, ప్రకాష్ ని కాలక్షేపంగా చూడడానికి రమ్మని చెప్పాడు. ప్రకాష్ కూసింత అయిష్టంగా, కూసింత మొహమాటంగా చిత్రప్రదర్శనకి బయలుదేరి వచ్చాడు.


కళాచిత్రప్రదర్శన ప్రాంగణమంతా, తమ తమ కళలను ప్రదర్శిస్తున్న కళాకారులతో, ఆసక్తిగా కళలను వీక్షిస్తున్న సందర్శకులతో, సమన్వయం చేస్తున్న నిర్వాహకులతో హడావిడిగా ఉంది. ఆ చిత్రకళాప్రదర్శనలో ప్రదర్శించిన అన్నిరకాల చిత్రాలను పరిశీలనగా చూస్తూ వస్తున్న ప్రకాష్ దృష్టిని, శిల్పాలను పోలిన నఖచిత్రాలు ఆకర్షించాయి.


ప్రకాష్ కన్నార్పకుండా ఆ నఖచిత్రాలను చూస్తూ, ఆసక్తిగా జగన్నాథానికి ఆ చిత్రాల గురించి అడిగాడు. అప్పుడు జగన్నాథం "అవి నఖచిత్రాలు. నఖం అనగా చేతివ్రేలిగోరు. వ్రేలిగోటితో దళసరి కాగితంపై శిల్పాన్ని చెక్కినట్లు, ఎత్తుపల్లాలను అన్వయించుకుని, మనసులో ఉన్న భావాలను అధ్బుతమైన రూపంలో చిత్రించే కళ. అలా గీసిన చిత్రాలు చూడడానికి శిల్పాలకు ఏమాత్రం తగ్గకుండా కన్నులవిందుగా ఉంటాయి. ప్రస్తుతం యి ప్రదర్శనలో పెట్టిన కళాచిత్రాలు, నఖచిత్రకళలో తనదైన ప్రావీణ్యం సాధించి, అందరి మన్ననలు పొందుతున్న శేఖర్ అనే చిత్రకారుడి సృష్టి!" అని అంటూ నల్లటి కళ్లద్దాలు పెట్టుకొని, ఆ చిత్రాల ప్రక్కన ఒక మూలగా నిల్చున్న శేఖర్ ని చూపిస్తూ చెప్పాడు.


ప్రకాష్ ఆ నఖచిత్రాలను చూసినప్పుడు, ఎంత లోలోపల ఆస్వాదించాడో, శేఖర్ ని చూశాక ఆ చిత్రకళంతా గీసింది ఈయనేనా అని ఆశ్చర్యపోతూ చూస్తున్నాడు.


జగన్నాథం కొనసాగిస్తూ "ముఖ్యంగా, నీకు శేఖర్ ని పరిచయం చెయ్యడానికే నిన్ను యిక్కడికి పిలిచాను. నువ్వు రాసే కథలలాగే, చాలా మలుపులతో కూడిన అతని జీవితమే పెద్ద కథలా ఉంటుంది!" అని చెప్తూ ప్రకాష్ ని శేఖర్ దగ్గరికి తీసుకుని వచ్చాడు.


నల్లటి కళ్ళద్దాలు పెట్టుకుని, చేతిసంచిలో కొన్ని దళసరి కాగితాలు, గురువుగారి ఫోటో, చేతిలో కొన్ని చిత్రాలతో, మొత్తం ప్రదర్శనకే ప్రత్యేకార్షణగా నిలిచిన తన నఖచిత్రాలు గురించి అందరూ ఫోటోలు తీసుకుంటూ, మాట్లాడుతుంటే వారికి నిల్చుని కళ గురించి వివరిస్తున్న శేఖర్ దగ్గరికి జగన్నాథం వచ్చి "శేఖర్!" అని పిలిస్తే, వెంటనే శేఖర్ గుర్తుపట్టి "ఆఁ గురువుగారు!" అని అన్నాడు.


"శేఖర్! మా అబ్బాయి ప్రకాష్! నీ చిత్రాలను, నిన్ను చూడ్డానికి వచ్చాడయ్యా!" అని పరిచయం చేశాడు.


"అవునా! నమస్కారమండి ప్రకాష్ గారు!" అని శేఖర్ చేతులతో నమస్కారం పెడితే, ప్రకాష్ షేక్ హ్యాండ్ యివ్వడానికి ఏకకాలంలో ప్రయత్నించారు.


"అయ్యో! మీరు షేక్-హ్యాండ్ యిచ్చారా?" అంటూ శేఖర్ గబుక్కున చేయిచాచడంతో, పదునుగా, పొడవుగా ఉన్న కుడిబొటన వ్రేలిగోరు అలవాటు ప్రకారం, షేక్-హ్యాండ్ కోసం చేయిచాచిన ప్రకాష్ అరచేతిపై గీసుపోకోవడంతో, ఏమరుపాటుగా ఉన్న ప్రకాష్ టక్కున చేతిని వెనక్కి తీసుకున్నాడు.


"అయ్యో! చేతిపై గీసుకుపోయిందా?" అని శేఖర్ తడుముతూ అడుగుతుంటే, ప్రకాష్ తన చేతిపై చిన్నగా ఎర్రగా మారిన ఆ గీతను చూసుకుంటున్నాడు.


అది చూసిన జగన్నాధం "ఏంలేదు శేఖర్! కంగారుపడకు! ఎన్నో గీతలు గీయడం అలవాటు అయిన చెయ్యి కదా, ప్రకాష్ అరచేతిపైన ఒక గీత గీసింది. అంతే! పరిచయపు పలకరింపులో శేఖర్ లా చక్కగా నమస్కారం చెయ్యడం మంచిది ప్రకాష్!" అని అన్నాడు.


తనకళ్ళని తాను నమ్మలేకుండా ఒక కన్నుతో నఖచిత్రాలను, మరొక కన్నుతో శేఖర్ ని చూస్తున్న ప్రకాష్ ముఖంలో ఆశ్చర్యాన్ని అర్థంచేసుకుని "అవును. ఆయనే! చూడలేడు. చూపులేదు! అయితేనేం, మనకి అద్భుతాలు చూపిస్తాడు!" అని జగన్నాధం చెప్పిన మాటలు ప్రకాష్ ని కలిచివేశాయి.


"సరే! మీ యిద్దరు మాట్లాడుతూ ఉండండి. నేను మళ్ళీ వస్తాను!" అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళాడు జగన్నాధం.


తరువాత ప్రదర్శనలో పలువురు సందర్శకులు శేఖర్ దగ్గరికి వచ్చి నఖచిత్రకళ గురించి ఆసక్తిగా వివరాలు తెలుసుకుంటూ ఉండడంతో, అక్కడ వారిద్దరికీ మాట్లాడటం కుదరక, ప్రదర్శన అయిపోయాక మాట్లాడదామనుకున్నారు. కాలక్షేపానికి వచ్చిన ప్రకాష్ తనని ఆకర్షించిన కళ గురించి, కళాకారుడి గురించి తెలుసుకోవడానికి ఆసక్తిగా కాలమే తెలియకుండా ఎదురుచూస్తున్నాడు.


చీకటి పడడంతో కొంచెంగా సందర్శకులు తగ్గుతుండడంతో యిద్దరికీ టైం దొరికింది. "ప్రకాష్ గారు! మిమ్మల్ని చాలాసేపు నుంచి ఎదురుచూసేలా చేశానా?" అని శేఖర్ అడిగితే "అదేంలేదు! మీలాంటి కళాకారులు గురించి ఎదురుచూసినా తప్పు లేదులేండి!" అని అన్నాడు ప్రకాష్.


"అంతా కళామతల్లి దయండి! మనదేంలేదు ప్రకాష్ గారు! మీరు యిప్పుడు అడగండి. చెప్తాను!" అని కూర్చున్నాడు శేఖర్.


"చెప్పుదురు గాని, ముందు యి గారు, మీరు అని తోకలు వద్దండి! నేను మీకన్నా వయసులో చిన్నవాడినే. అయినా, మీరు ఎన్నో సాధించేసి, నాకు అంత మర్యాద యిస్తుంటే, కొంచెం కష్టంగా ఉంది!" అని అన్నాడు ప్రకాష్.


శేఖర్ చిన్నగా నవ్వుతూ "అంతా కష్టపడుతున్నారా! మీకోసం మర్యాద కొంచెం తగ్గిస్తా! సరేనా!" అని అన్నాడు.


ప్రకాష్ కొనసాగిస్తూ "యిది బాగుంది! విషయానికి వస్తే, మీ గురించి విన్నాక, మీ కళ చూశాక, మీ జీవితంలో కొన్ని విషయాలు చాలా ఆలోచింపజేసి, మీ జీవితగాథకి ఓ అందమైన చిత్రరూపానిస్తే బాగుంటుందనిపిస్తూ మనసులో కొట్టేసుకుంటుంది! అందుకే, ధైర్యం చేసి అడుగుతున్నాను. ఒప్పుకుంటారు కదూ!" అని ఉన్న విషయం చెప్పాడు.


శేఖర్ ఆశ్చర్యంగా "నా జీవితంలో మీకు ఏం నచ్చిందండి?" అని అడిగాడు.


"రెండు విషయాలు నాకు బాగా నచ్చాయి. పెన్సిల్ తో, పెన్నుతో బొమ్మలు వేసేటప్పుడు, పొరపాటు వస్తే సరిదిద్దుకోగలం. కానీ, నఖచిత్రకళలో అటువంటి పొరపాటు సరిదిద్దుకోలేం. అంతటి క్లిష్టమైన నఖచిత్రకళని, మీరు చూపులేకుండా వేయడం నిజంగా అద్భుతం!" అని అన్నాడు ప్రకాష్.


శేఖర్ తన గురువుగారి ఫోటో చూపిస్తూ "మా గురువుగారు! పల్ల.పరిసినాయుడుగారు. ఆయన యి నఖచిత్రకళలో సిద్ధహస్తులు. ఆయన లేకపోతే, నేను యిరోజు, యిస్థానంలో ఉండేవాడిని కాదు!" అని అంటూ గురువుగారి ఫోటో అప్యాయంగా తాకుతున్నాడు.


"ఓఁ మీ చిన్నప్పట్నుంచి గురువుగారు యి కళని నేర్పించి, మిమ్ముల్ని యింతటి కళాకారుడిగా చేశారా?" అని అడిగాడు ప్రకాష్.


శేఖర్ చిన్నగా నవ్వుతూ "గురువుగారు చిన్నప్పుడు కళని నేర్పించడం నిజం! కళాకారుడిగా చేసింది నిజం! కానీ, నేను చిన్నప్పట్నుంచి నేర్చుకుంటే, ఆ చిత్రకళే వేరుగా ఉండేది. నేను యిప్పుడు వేస్తున్న కళ, మా గురువుగారి కళానైపుణ్యంలో పావువంతు కుడా ఉండదు!" అని చెప్పాడు శేఖర్.


"అంటే?? అర్ధంకాలేదు!" అని ఆశ్చర్యంగా అడిగాడు ప్రకాష్.


"మనం ఊహించింది జరిగితే అనుకున్నది సాధిస్తాం! ఊహించనది జరిగితే అద్భుతాలు సాధిస్తాం! నేను అనుకున్నది జరిగి ఉండుంటే, యి టైం కి దేశసరిహద్దుల్లో పహారా కాస్తూ, డిఫెన్స్ లో పదమూడు సంవత్సరాల సర్వీసు పూర్తయిపోయిండేది!" అని అన్నాడు శేఖర్.


"మధ్యలో డిఫెన్స్! అదేంటి! అంటే, మీకు పుట్టుకతో చూపు ఉండి, పదమూడు సంవత్సరాల క్రితం చూపు పోయిందా!" అని ఆశ్చర్యపోతూ అడిగాడు ప్రకాష్.


"అవునండి!" అని చెప్పాడు శేఖర్.

"అయ్యో! యిలా సగం సగం చెప్పి టెన్షన్ పెట్టకుండా అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పండి!" అని అప్పటికే ఆశ్చర్యసముద్రంలో తేలుతున్న ప్రకాష్ తట్టుకోలేక అడిగేశాడు.


"అయ్యోయ్యో! టెన్షన్ అవ్వకండి! చెప్తాను! నీళ్ళు తాగండి!" అని ప్రకాష్ కి నీళ్ళబాటిల్ అందించాడు.


శేఖర్ తన గురించి చెప్పడం మొదలు పెడుతూ "చెప్పే ముందు, మా గురువుగారు ఎప్పుడూ చెప్పే ఒక మాట చెప్తాను. దేవుడు భలే చమత్కారి! ముందు తలపై ఒక మొట్టికాయ వేస్తాడు! నొప్పిని తలుచుకుని అమ్మా అని అరిచేలోపు, చేతిలో కజ్జికాయ పెడతాడు! నా జీవితంలోకి చూస్తే, యి మాట నూటికి నూరుపాళ్ళు నిజమనిపిస్తుంది!" అని అన్నాడు శేఖర్.


ప్రకాష్ కి అర్థంకాక "ఈ మొట్టికాయ కొట్టడమేంటీ? చేతిలో కజ్జికాయ పెట్టడమేంటి? కొంచెం అర్ధమయ్యేటట్టు చెప్పండి బాబు!" అని అడిగాడు.


శేఖర్ కొనసాగిస్తూ "అది నాకు అర్థంకావడానికి జీవితకాలం పట్టింది. సరే అర్ధమయ్యేలా చెప్తాను. వినండి! యిది పదమూడు సంవత్సరాల క్రితం జరిగింది. మాది ఆంధ్ర-ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో ఒక కుగ్రామం. నేను, మా నాన్న మాకున్న అరవై సెంట్ల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ, గ్రామం పక్కనుండి పరవళ్ళుపెడుతూ సాగిపోయే నాగావళినదిలో అప్పుడప్పుడూ కొట్టుకొచ్చే చిన్నపెద్ద కర్రలు పోగుచేసుకుని, అవి పట్నానికి తీసుకుపోయి అమ్మడం ప్రధానజీవనంగా జీవిస్తూ ఉండేవాళ్లం.


నా చిన్నప్పుడే మా అమ్మ అనారోగ్యంతో కాలంచేసింది. మా గురువుగారు మాతో ఎప్పుడూ సన్నిహితంగా ఉండేవారు. నేను మా గురువుగారి యింటి దగ్గర ఎక్కువగా ఉండేవాడిని. ఆ సమయంలో చదువుచెప్తూ, నేను వేసే చిన్నచిన్న బొమ్మలకి తప్పులు సరిదిద్దుతుండేవారు. నా ఇంటర్ చదువు పూర్తయ్యాక, డిఫెన్స్ లో ఉద్యోగాలు భర్తీ చెయ్యడానికి ఓపెన్ ర్యాలీ జరిగితే, అందులో పాల్గొనడానికి నేను వెళ్తే, అదృష్టవశాత్తు సెలెక్టయ్యాను!" అని శేఖర్ చెప్తుంటే, ప్రకాష్ కలుగజేసుకుని


"మరీ డిఫెన్స్ ఉద్యోగానికి ఎందుకు వెళ్ళలేదు? ఒకవేళ ఉద్యోగానికి వెళ్లేటప్పుడు, ఏదైనా ప్రమాదం జరిగి యిలా జరిగి, డిఫెన్స్ నుంచి బయటికి వచ్చేశారా?" అని ఆత్రుతగా అడిగాడు.


శేఖర్ చిన్నగా నవ్వుతూ "ఉండండి! చెప్తాను! సెలక్షన్ ర్యాలీలో సెలెక్టయ్యాక, ఒక వ్యక్తి మా నాన్న దగ్గరికివచ్చి, మీఅబ్బాయి అన్ని పరీక్షల్లోనూ బాగానే పాసయ్యాడు. ఉద్యోగానికి వెళ్తే, లక్షల్లో సంపాదిస్తాడు అని చెప్పగానే, యిన్నాళ్లకి దేవుడు మా మొర ఆలకించాడు అనుకున్నాం.


ఆ వ్యక్తి కొనసాగిస్తూ, కానీ, యిది సరిపోదు అని అనేసరికి, నాన్న కంగారుపడుతూ మరి ఏంచెయ్యాలి బాబు అని అడిగాడు. గవర్నమెంటు ఉద్యోగమంటే, వూరికే వచ్చేస్తుందా! దానికోసం చాలా చెయ్యాల్సి ఉంటుంది. నాలుగు ఆఫీసులకి తిరగాలి. నలుగురి చేతులు తడపాలి. మీరు అన్ని ఆఫీసులకి తిరగలేరు. ఒకవేళ తిరిగినా, ఎవరిని పట్టుకోవాలి, ఎవరికి ఎంత యివ్వాలి మీకు తెలియదు. ఒకవేళ తెలిసినా, మిమ్ముల్ని ఎవరైనా అవినీతి నిరోధక శాఖ అధికారులు పంపించారెమో అని భయపడి, మీరు యిస్తే వాళ్ళు తీసుకోరు. యిదంతా ఎందుకంటారా, అంతా నేను చూసుకుంటాను.


అందుకు, మూడున్నర లక్షలు ఖర్చవుతుంది. అవతల, మరో యిద్దరు నాలుగు లక్షలు యివ్వడానికి సిద్దంగా ఉన్నారు. ఏదో, మీ కుటుంబ పరిస్థితి చూసి, మీకు మూడున్నర లక్షలు చెప్తున్నాను. వారంరోజుల్లో మీ నిర్ణయం చెప్పండి అని చెప్పేసరికి, చేతికందినది నోటికి అందకుండా పోతుందని గుండెలో రాళ్ళు పడినట్లయ్యింది. ఏం చేయాలిరా దేవుడా అని నాన్నకి దిగులుపట్టుకుంది. యి విషయం గురువుగారికి చెప్పడానికి వెళ్లాం.


గురువుగారు మాకు ధైర్యం చెప్తూ, మీ కష్టం దేవుడు చూశాడు రామయ్య! వీడు ఇరవైయేళ్లకే మంచి ఉద్యోగం సంపాదించాడు. యిక, మీ కష్టాలన్ని తీరిపోతాయి. అయితే, యి మధ్య యిలా ఉద్యోగాలు యిప్పించడానికి డబ్బులు తీసుకోవడం మాములు అయిపోయింది! నేను యాభైవేల వరకు సర్దుతాను. మిగతా మూడు లక్షలకి ఏదైనా ఆలోచించాలి. తినడానికి ఆకు వేసినవాడు అన్నం పెట్టకపోడు! ఏదొక దారి దొరుకుతుందిలే అన్న మాటసాయంతో పాటు డబ్బులు సాయం కుడా చేశారు గురువుగారు.


ఎటు చూసినా, ఎంత ఆలోచించినా చివరికి వచ్చి ఆగేది, మాకున్న అరవైసెంట్ల భూమి దగ్గరే! కొడుకు జీవితం బాగుంటుందని, ఆ భూమి అమ్మేయడానికి నాన్న సిద్ధపడిపోయినా, నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే, ఆ కాస్త భూమే లేకపోతే, తినడానికి కుడా మాకు ఏం ఉండదు. యి ఉద్యోగాల మధ్యవర్తిని ఏలా నమ్మగలం. ఒకవేళ ఉద్యోగం రాకపోతే, యింక అంతే సంగతులు!


యిది కాకపోతే, యింకో ఉద్యోగం సంపాదిస్తానని నేను మొండిపట్టు పట్టుకుని కూర్చున్నాను. ఆఖరికి, భూమి తాకట్టు పెట్టించడానికి నన్ను ఒప్పించాడు నాన్న. గురువుగారి పూచీకత్తు సిఫారసు మీద మాకున్న అరవైసెంట్ల భూమిని షరతులతో కూడిన తాకట్టు పెట్టుకుని మూడులక్షలు యివ్వడానికి ఒక వడ్డీవ్యాపారి ఒప్పుకున్నాడు. ఆ మూడున్నర లక్షలు తీసుకెళ్లి, ఉద్యోగానికి సంబంధించిన మధ్యవర్తికి కట్టాం!" అని చెప్పి గ్లాసుతో నీళ్ళు తాగుతున్నాడు శేఖర్.

"అంటే అర్ధమైంది. ఆ మధ్యవర్తి డబ్బులు తీసుకుని మిమ్ముల్ని మోసం చేశాడు కదా. అందుకు మీకు ఉద్యోగం రాలేదా?" అని అడిగాడు ప్రకాష్.


"అయ్యోయ్యో రచయతగారు! నేను చెప్తానులేండి! మధ్యవర్తిని అడిగితే, మరో పదో,పదిహేను రోజుల్లో కాల్ లెటర్ యింటికి వస్తుందని చెప్పేవాడు. దానికోసం ఎదురుచూడడానికి మాకున్నంత అవసరం, ఓపిక రెండూ లేని వడ్డీవ్యాపారి మాకు అస్తమానం అప్పు కట్టమని అడిగేవాడు. మాకు అడిగి అడిగి ప్రయోజనం లేకపోయేసరికి, మాకు సాయం చేసిన గురువుగారి యింటికి ఫోన్లు చేసి, కనపడిన దగ్గరల్లా అప్పు గురించి అడగడం మొదలెట్టాడు. రోజులు యిలా గడుస్తుంటే, నా జీవితాన్ని మార్చేసిన రోజు రానే వచ్చింది.


సరిగ్గా ఆరోజు గురువుగారు కళాసమితి వారి ఆహ్వానం మేరకు ఢిల్లీలో జరిగే సన్మానానికి బయలుదేరుతున్నారు. గురువుగారు ఆయనతో పాటు నన్ను కుడా డిల్లీ రమ్మన్నారు. ఆయనకి తోడుగా వచ్చినట్టుగా ఉంటుంది. కళాకారులని, కళా ప్రదర్శనలని చూసినట్టుగా ఉంటుంది. ఎలాగో బొమ్మలు బాగానే వేస్తున్నానని, వారసుడిగా పరిచయమైతే, భవిష్యత్తు బాగుంటుందని చెప్తూ, బయలుదేరమని చెప్పారు.


అప్పుడు నేను, మీకు తెలియనిది ఏముంది గురువుగారు! కళనే ప్రధానంగా తీసుకునే కుటుంబంలో నేను లేను కదా. అయినా, జాబ్ కాల్ లెటర్ రావడమే లేటు. వెంటనే గాల్లోకి ఎగిరిపోయి, దేశ సరిహద్దుల్లో వాలిపోతా. జై హింద్! అని అంటే, గురువుగారు నన్ను చూసి నవ్వుతూ, సరే! జాగ్రత్త! అని చెప్పి బయల్దేరారు.


ఏదైనా జరిగే ముందు ప్రకృతి కొన్ని సంకేతాలిస్తుందంట! ఆరోజు గురువుగారు చెప్పిన జాగ్రత్త అనే మాట కూడా నాకు కొంచెం విచిత్రంగా అనిపించింది!" అని అన్నాడు శేఖర్.

"మీరు నఖచిత్రాలే కాదండి! కథలు కూడా రాయవచ్చు! మీరు అలా చెప్తుంటే, కథలో పాత్రలు కళ్ళకట్టినట్టుగా తెర మీద కనిపిస్తున్నాయి. మీ జీవిత కథ అలాగే ఉంది. మీరు చెప్పడం కూడా అంతే ఇంట్రెస్ట్ గా ఉంది! మొత్తానికి, మీరు ఉద్యోగం మీద చాలా ఆశలు పెట్టుకున్నట్టున్నారు!" అని నవ్వుతూ అన్నాడు ప్రకాష్.


శేఖర్ నవ్వుతూ "అది నేను చెప్పడం కాదండి! స్వతహాగా మీరు రచయిత కాబట్టి, మీకు అన్ని పాత్రలు కనిపిస్తున్నాయి! ఉద్యోగం మీద ఆశలే కాదు, కోరికలు, బాధ్యతలు. మధ్యవర్తికి డబ్బులు కట్టాం. ఆ అప్పు తీర్చాలనే ఆశ! పుట్టిపెరిగిన తర్వాత తండ్రి కష్టంలో పాలుపంచుకోవాలనే బాధ్యత! అందరిలానే నేను, నా కుటుంబం బతకాలనే కోరిక!


అయితే మనం ఏమనుకుంటే, అది అయిపోదు కదా, కర్మ అనేది ఒకటి ఉంటుంది కదా! దేవుడికి ఏదైనా వద్దంటే, వరాలు! కోరుకుంటే, కష్టాలు! నా కోరిక తగినట్టుగానే దేవుడు చేశాడు. ఆరోజు గురువుగారి యింటి దగ్గర్నుంచి, నాగావళినది ఒడ్డున కట్టెలు కొడుతున్న నాన్న దగ్గరికి వచ్చాను. అంతకుముందే, యింటికి వడ్డీవ్యాపారి వచ్చి వెళ్లాడంట. అందువలన, నేను రాగానే, ఆ ఉద్యోగ ఉత్తరం ఎప్పుడు వస్తుందిరా నాయనా. ఆ డబ్బులు కట్టిన మధ్యవర్తికి అడగొచ్చు కదా. యి మూర్ఖత్వపు వడ్డీవ్యాపారి మనల్నే కాదు, గురువుగారికి కుడా ఎక్కడ పడితే అక్కడ అప్పు గురించి అడిగి పరువు తీసేస్తున్నాడంట అని నాన్న నన్ను అడిగాడు.

మధ్యవర్తికి రోజూ ఫోన్ చేస్తూనే ఉన్నాను నాన్న! ఈరోజు, రేపు అయిపోతుంది అంటున్నాడు. ఇంకా గట్టిగా అడిగితే, చిరాకు అయిపోతున్నాడు అని నాన్న కొడుతున్న చిన్న కర్రముక్కలన్ని ఏరుతూ ఒక దగ్గర పెడుతూ చెప్పాను. ఏం రావడమో నాయనా, మనకు ఏదో మేలు చేద్దామని ముందుకి వచ్చిన గురువుగారిని యిబ్బంది పెట్టేస్తున్నాడు అని నాన్న మాట్లాడుతూ, గొడ్డలితో కొడుతున్న చెక్కలోంచి బలమైన కర్రముక్క, ఒంగి చిన్న కర్రముక్కలు ఏరుతున్న నా కంట్లోకి బలంగా గుచ్చుకుంది.


ఒక్కసారిగా ఏం జరుగుతుందో తెలియక, కన్నుమూసిన చేతినుండి రక్తం కారిపోయి, క్షణాల్లో చీకట్లు పగబట్టినట్టుగా జీవితం మీద పెట్టుకున్న ఆశలను కమ్మేశాయి. కళ్ళు మొత్తం చీకటిగా అలుముకున్నాయని, అమ్మా అని అరిచేసరికి, వెంటనే నాన్న వచ్చి పట్టుకోవడం, అక్కడి నుండి ఆటోలో హాస్పిటల్ తీసుకెళ్లడం, డాక్టర్ ట్రీట్మెంట్ చెయ్యడం, మరి నాకేం తెలియట్లేదు! ఏం కనిపించట్లేదు!" అని తన చేదు జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటే, అప్రయత్నంగా కళ్ళు చెమ్మగిల్లితే, నల్లకళ్ళద్దాలు తీసి కనులు తుడుచుకుంటున్నాడు.


అది చూసిన ప్రకాష్ కి మనసుకి చివుక్కుమని "మీరు ఎమోషనల్ అవ్వకండి! అనవసరంగా నేనే మీ గతాన్ని గుర్తుచేసినట్టున్నాను!" అని బాధపడుతూ చెప్పాడు.


శేఖర్ కొంచెం తేరుకున్నాక "అదేం లేదండి! అదేం మర్చిపోయే గతం కాదు. మీరు కొత్తగా గుర్తుచెయ్యడానికి! ఆరోజు జరిగిన ప్రతి నిమిషం నాకు యిప్పటికీ కళ్ళకట్టినట్టుగానే గుర్తుంది. ఆ కర్రలు కొట్టిన శబ్దం, యిప్పటికీ నా చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది!" అని అంటూ కొంచెం నీళ్లు తాగాడు. "అంటే, ఆ కర్రముక్క కంట్లో బలంగా గుచ్చుకోవడం వల్ల, మీరు ఆశపడ్డ జీవితాన్ని కోల్పోయారన్నమాట. చాలా దురదృష్టం!" అని అన్నాడు ప్రకాష్.


"నేను యింకా అది అదృష్టంగానే భావిస్తున్నాను!" అని శేఖర్ చెప్తే, ప్రకాష్ ఆశ్చర్యంగా "అదృష్టమా! అందులో ఏముంది అదృష్టం?" అని అడిగాడు.


"మీరు సగం ఖాళీగా ఉన్న గ్లాసుని చూస్తున్నారు. నేను గ్లాసులో నీళ్ళు ఉన్న భాగం గురించి చెప్తున్నాను. అదే కర్రముక్క కంఠంలో గుచ్చుకుంటే పరిస్థితి ఏంటి? యిపాటికి శేఖర్ అనే వాడి జీవితం ఎలా ఉండేదో మరి!" అని అన్నాడు శేఖర్.


"మీరు మరీనూ, చెడులో కూడా మంచి చెడు, చెడ్డ చెడు అంటారు. తర్వాత ఏం జరిగిందో చెప్పండి!" అని అన్నాడు ప్రకాష్.

========================================================================

ఇంకా వుంది..


========================================================================

అల్లు సాయిరాం గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

Podcast:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

రచయిత పరిచయం: పేరు అల్లు సాయిరాం


హాబీలు: కథా రచన, లఘు చిత్ర రూపకల్పన

ఇప్పటివరకు పది కథల దాకా ప్రచురితమయ్యాయి.

ఐదు బహుమతులు గెలుచుకున్నాను.


165 views1 comment

1 comentario


@ladiramu1595 • 1 hour ago

Congratulations

Me gusta
bottom of page