top of page

చీకటి వెలుగులు పార్ట్ 2


'Chikati Velugulu Part 2/2' - New Telugu Story Written By Allu Sairam

'చీకటి వెలుగులు పార్ట్ 2/2' పెద్ద కథ

రచన: అల్లు సాయిరాం

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ:

ప్రకాష్ ఒక ఔత్సాహిక రచయిత.

అయితే సరైన అవకాశాలు లేవని నిస్పృహలో ఉంటాడు.

అతని తండ్రి, ప్రకాష్ ని చిత్రకారుడు శేఖర్ కి పరిచయం చేస్తాడు.

కళ్ళు లేకపోయినా చక్కటి నఖ చిత్రాలు గీస్తున్న శేఖర్ గతం అడుగుతాడు ప్రకాష్.

డిఫెన్స్ ఉద్యోగంలో చేరబోయే సమయంలో కళ్ళు పోగుట్టుకున్న విషయాన్ని వివరిస్తాడు శేఖర్.


ఇక చీకటి వెలుగులు పార్ట్ 2 చదవండి.



శేఖర్ కొనసాగిస్తూ "తర్వాత హాస్పిటల్లో డాక్టర్ నాన్నతో ఆ కర్రముక్క కంట్లో చాలాబలంగా గుచ్చుకుంది. ఒక కంటి ద్వారా రెండో కంటికి కూడా ఇన్ఫెక్షన్ మూలంగా సోకి పూర్తిగా కంటిచూపు పోయింది అని చెప్తుంటే, పెట్టుకున్న ఎన్నో ఆశలు నెరవేరకపోగా, పైగా తాను కొట్టిన కర్రముక్క వలన యిలా జరిగిందని, కొడుకు జీవితం చీకటి అయిపోతుందన్న విషయం జీర్ణించుకోలేని తండ్రి బాధ ఎంత వర్ణనాతీతంగా ఉంటుందో, ఆ బాధలో ఆయన చేసిన ప్రయత్నాలు, ప్రార్ధనలు, దండాలు మీ ఊహకే వదిలేస్తున్నాను. ఎంత ప్రార్థించినా, బతిమాలినా డాక్టర్ అవకాశం లేదని చెప్పేయడంతో, కొన్నిరోజుల తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి నన్ను యింటికి తీసుకువచ్చారు.


సాధారణంగా సాగిపోతున్న మా జీవితసముద్రాల్లో ఊహించని అలజడి రేపిన అలల ధాటికి చితికిపోయిన తండ్రి హృదయం, యింటికి నన్ను పరామర్శించడానికి వచ్చిన వాళ్ళందరూ ఎలా జరిగింది అని అడుగుతుంటే, సమాధానం చెప్పలేక, ఉద్దరిస్తాడు అనుకున్న కొడుకు ఉసూరుమంటూ మూల కూర్చునేటట్టు, నా చేతులతో నేనే చేసినాను. అంతా నా కర్మ! మళ్లీ బాబుకి చూపు వస్తుందంటే, నా చూపు వాడికివ్వనా! అని అంటూ తలుచుకుని తలకొట్టుకుంటూ కుమిలిపోయేవాడు! నా పరిస్దితి యింకా అధ్వాన్నం. పగలైనా, పడుకున్నా చీకటే! నేను పుట్టి పెరిగిన యింట్లో బతకడమే కష్టంగా అనిపించేది.


తండ్రిగా నాన్న నా చిన్నప్పుడు చెయ్యిపట్టుకుని చేయించిన చిన్నచిన్న పనులు మళ్లీ చేయిస్తుంటే, నాకు రెండో జన్మలా అనిపించింది. పనులు మానుకుని నాన్న యింటి దగ్గర నన్ను చూసుకోవడానికి ఉండిపోయేవాడు!" అని భావోద్వేగంగా చెప్తూ, ప్రకాష్ నుంచి స్పందన లేకపోవడంతో "ప్రకాష్ గారు! ప్రకాష్ గారు!!" అని పిలిచాడు శేఖర్.


"ఆఁ చెప్పండి! యిక్కడే ఉన్నాను. వింటున్నాను!" అని పొడిబారిన గొంతుతో అన్నాడు ప్రకాష్.


"ఓఁ ఉన్నారా! ఎటువంటి శబ్దం లేకపోయేసరికి" అని శేఖర్ అంటుంటే "మీరే కదా, మధ్యలో ఏం అడగొద్దన్నారు! అయినా, తరువాత జరిగేది ఊహకి కుడా ఏం అందట్లేదులేండి!" అని అన్నాడు ప్రకాష్.


"అయ్యోయ్యో! ఏమైనా అడగాలంటే అడగండి. పర్వాలేదు!" అని అన్నాడు శేఖర్.


"మీకు పర్వాలేదు. కానీ, మాకు యిబ్బంది శేఖర్!" అని అన్నాడు జగన్నాథం అక్కడికి వస్తూ.


"ఏమైంది గురువుగారు?" అని శేఖర్ కంగారుపడుతుంటే "ఏంలేదు శేఖర్! మాట్లాడండని అంటే, టైం రాత్రి పదిన్నర గంటల దాటుతున్నా యింకా మాట్లాడుకుంటున్నారు. యింటికి బయలుదేరు శేఖర్. రేపు ఉదయం మళ్ళీ రావాలి కదా! మిగతా సగం కథ రేపు మాట్లాడుకోండి!" అని జగన్నాధం నవ్వుతూ అంటే "సరే సార్!" అని అంటూ తన చేతిసంచి సర్దుకుని బయలుదేరుతున్నాడు శేఖర్.


ప్రకాష్ మిగతా కథ కూడా వినాలన్న ఆరాటంగా "మీరు యింటికి ఏలా వెళ్తారు?" అని శేఖర్ ని అడిగాడు.


"కారు బుక్ చేసి పంపిస్తాం ప్రకాష్!" అని అన్నాడు జగన్నాథం.


"కారు బుక్ చెయ్యడం ఎందుకులే నాన్న, నేను మన కారులో దించి వచ్చేస్తాను!" అని అంటున్న ప్రకాష్ మాటల్లో ఆసక్తిని అర్ధం చేసుకుని నవ్వుతూ "సరే! జాగ్రత్తగా శేఖర్ ని యింటి దగ్గర దించు!" అని అన్నాడు జగన్నాథం.


ప్రకాష్, శేఖర్ వచ్చి కారు ఎక్కారు. శేఖర్ తన యింటి అడ్రస్ రాసి ఉన్న కార్డు ప్రకాష్ కి యిచ్చాడు. కారు కదిలింది. "ఊఁ మీరు కంటిన్యూ చెయ్యండి! అదే, ఆ వడ్డీవ్యాపారి, ఉద్యోగం గురించి!" అని అడిగాడు ప్రకాష్.


శేఖర్ చిన్నగా నవ్వి "తరువాయి భాగం రేపు మాట్లాడమని చెప్పారు కదా!" అని అంటే "అబ్బా! మీరు చెప్పండి బాబు! యిలా మధ్యలో గ్యాప్ యిస్తే, నాకు రాత్రంతా నిద్ర పట్టక, రేపటికి కథకి చాలా వెర్షన్లు తయారయ్యిపోయి, నేనే మీకు మిగతా కథ చెప్తాను. అసలు కథ మీరే మర్చిపోతారు. ఆ తర్వాత మీ యిష్టం!" అని అన్నాడు ప్రకాష్.


శేఖర్ నవ్వుతూ "అయ్య బాబోయ్! మీరు అంత కష్టపడొద్దు. నన్ను కష్టపెట్టొద్దు. నేనే చెప్తాను! ఆ తర్వాత, ఒకరోజు 'డాక్టర్ మళ్ళీ చెకప్ చేయించుకోవడానికి రమ్మన్నారు కదా, వెళ్దామా 'అని నాన్న నన్ను అడిగాడు. మా పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని, 'డబ్బులు లేవు కదా, తర్వాత చూద్దాంలే నాన్న' అని చెప్పాను.


నాన్నకి బాధ కలిగి, 'డబ్బుల గురించి నువ్వు ఆలోచించకు బాబు. ఏదోవిధంగా కష్టపడి నిన్ను బాగుచేసుకుంటాను. ఆ డబ్బుల విషయం గురించి వడ్డీవ్యాపారి దగ్గరికి వెళ్ళి, మనం తాకట్టు పెట్టిన భూమిని, మనకి కౌలుకి యిస్తే, పండించుకుని, అప్పు తీర్చేస్తామని అడుగుదామని అనుకుంటున్నాను' అని అన్నాడు.


'ఆ వడ్డీవ్యాపారి మొదటికే ఒకరకం. ఆయన ఒప్పుకుంటాడంటావా?' అని అడిగాను నేను.


'బ్రతిమాలి అడగడం తప్ప, యింకేం చెయ్యగలం' అని అన్నాడు నాన్న.


సరిగ్గా అప్పుడే, నాకు యిలా జరిగిందన్న విషయం తెలిసి పరిగెత్తుకుంటూ ఆఘమేఘాలపై వస్తున్నాడు వడ్డీవ్యాపారి‌. నన్ను చూడడానికి కాదులేండీ! వస్తూనే ప్రశ్నల వర్షం కురిపించాడు. ఎదురుగా సునామీ వస్తుంటే, తడవకుండా గొడుగు పట్టుకుని నిల్చున్నట్లుగా ఉంది మా పరిస్థితి!


'వందేళ్లు ఎందుకయ్యా, వడ్డీలకి తిరగడానికా? ముందు, తీసుకున్న అప్పు గురించి ఏం చేద్దామనుకుంటున్నావు. చెప్పు!" అని అదే చిరాకులో అడిగాడు వడ్డీవ్యాపారి.


"వందేళ్లు ఎందుకయ్యా, వడ్డీలకి తిరగడానికా? ముందు, తీసుకున్న అప్పు గురించి ఏం చేద్దామనుకుంటున్నావు. చెప్పు!' అని అదే చిరాకులో అడిగాడు వడ్డీవ్యాపారి.


'మీరు పెద్దమనసు చేసుకుని, కరుణించి, మా భూమి మాకు కౌలుకి యిస్తే, పండించుకుని మీ అప్పు తీర్చేస్తాం బాబు' అని మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్పాడు నాన్న.


అగ్గి మీద గుగ్గిలం వేసినట్లుగా వడ్డీవ్యాపారి మండిపోతూ, 'మీకేం పోయింది. నువ్వు ఏదైనా మాట్లాడతావు. ఇప్పుడు నీ మీద నేను పెద్దమనసు చేసుకుంటే, రేపు నా మీద ఎవరు పెద్దమనసు చేసుకుంటారు. అప్పు తీసుకున్నప్పుడు ఒక మాట, తిరిగి కట్టేటప్పుడు ఒక మాట మాట్లాడడం జనాలకి బాగా అలవాటైపోయింది. అయినా, తప్పు నీది కాదు, నాది! మా నాయనా ఎప్పుడూ ఒక మాట చెప్తుండేవాడు. తలని చూసి తాకట్టు యివ్వమని చెప్పేవాడు. తల అంటే ఏ చీమ తలో, ఈగ తలో కాదు. ఏనుగు తల. అంటే ఎంత అప్పిచ్చిన తిరిగి తీర్చగలిగే స్థోమత కలిగిన తల! మరి, మీకు అంత స్థోమత లేకపోయినా ఎందుకు అప్పు యిచ్చాను, మధ్యలో గురువుగారిని చూసి కదూ. పైగా వీడికి ఏదో ఉద్యోగం వస్తుంది, తీరుస్తాడని అనుకుని యిచ్చాను. మరి, యిప్పుడు ఉద్యోగమే రాదని తేలిపోయింది. మరి ఇప్పుడు ఎలా అప్పు తీరుస్తారు' అని అడిగాడు.


'ఇప్పటికే అన్నివైపుల నుంచి చితికిపోయిన్నాం. మీరు కుడా అలా అంటే ఏలా బాబు. మా మీద దయ చూపించండి బాబు' అని బ్రతిమాలాడాడు నాన్న.


వడ్డీవ్యాపారి ఆలోచించి, 'అసలు మూడు లక్షలు. వడ్డీ యాభైవేలు. మొత్తం మూడున్నర లక్షలు. మీరు ఎలాగో తీర్చలేరు కాబట్టి, నేనే పైన పాతికో, యాభైవేలో యిస్తాను. పిల్లాడి మందుల ఖర్చులుకైనా పనికొస్తాయి. భూమి నా పేరు మీద రాసేయండి' అని చెప్తుంటే, నాన్న వేరేదారిలేక ఒప్పుకున్నట్లు అనిపించింది.


'మూడు లక్షలకి ఒక సంవత్సరానికి మూఫ్పైఆరు వేలు వడ్డీ అవుతుంది కదా, యాభైవేలు అంటావేంటి' అని నేను అడిగాను.


వడ్డీవ్యాపారికి కోపంవచ్చి, 'చూపుపోయినా యి లెక్కలకేం తక్కువ లేదు. నీతో నాకెందుకులే, చూడు రామయ్య, నీకు పదిరోజులు గడువు యిస్తున్నాను. ఏదోకటి ఆలోచించి చెప్పు. ఆ తర్వాత రోజు మాత్రం నీకు అవకాశం యివ్వను' అని కోపంగా వెళ్ళిపోయాడు" అని శేఖర్ తన గతంలోకి వెళ్లి, ఒక్కొక్క జ్ఞాపకాలను చెప్తుంటే, ప్రకాష్ చాలా ఆసక్తిగా వింటూ "మీ జీవితంలో తిరుమల ఘాట్ రోడ్డులా చాలా మలుపులు ఉన్నాయండీ బాబు!" అని అన్నాడు.


శేఖర్ నవ్వుతూ "ఇంకా చాలా మలుపులు ఉన్నాయి!" అని అన్నాడు.


"అవునా! చెప్పండి. ఆ మలుపులు ఏంటి.. " అని అన్నాడు ప్రకాష్.


శేఖర్ కొనసాగిస్తూ "ఇంతటి ఊహించని దురదృష్టంలో ఆశించిన అదృష్టం ఏంటంటే, రెండు రోజుల తర్వాత ఉద్యోగానికి సంబంధించిన కాల్ లెటర్ యింటికి వచ్చింది. ఎన్నో కలలు కన్న నా ఉద్యోగం, కనీసం కాల్ లెటర్ కళ్ళారా కూడా చూడలేకపోయాను! పోయిన కంటిచూపు, వెళ్ళలేని ఉద్యోగం, భూమి తాకట్టు, పెరుగుతున్న వడ్డీ, యి సమస్యల మధ్య నా జీవితం అగమ్యగోచరంలా అనిపించింది. పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడిలా తయారైంది నా పరిస్థితి! ఆ ఉద్యోగానికి సంబంధించిన డబ్బులు కట్టిన మధ్యవర్తికి ఫోన్ చేసి, జరిగిందంతా వివరించి చెప్తే, కొంచెం బాధపడుతూ, నీకు జరిగినది దానికి నేను బాధపడుతున్నాను. కానీ, నువ్వు యిచ్చిన డబ్బులు ఉద్యోగం రావడానికి ఖర్చు అయిపోయాయి. తిరిగి యివ్వటానికి కుదరదని తెగేసి చెప్పి ఫోన్ కట్ చేశాడు‌!


కష్టాలకు కన్నీళ్ళు, పిలవని చుట్టాలు. సంబంధం లేకుండానే వచ్చేస్తాయి! ఇలా ఒక దాని మీద ఒకటి సమస్యలు వస్తుంటే, కనీసం నేను చూడలేకపోతున్నాను. మరి నన్ను యిలా చూడలేక, నా భవిష్యత్తు ఏమవుతుందోనని ఆందోళనతో కృంగిపోతున్న నాన్న పరిస్థితి ఆలోచిస్తేనే, నాకే భయమేసింది. ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. నేను యిలా మంచానికి మాత్రం పరిమితం అయిపోతే, నాన్న ఎప్పటికీ తేరుకోలేడని అర్ధమైంది. సరిగ్గా అదే దైవనిర్ణయంలా, ఊర్లో మందిరం దగ్గర్నుంచి వినిపిస్తున్న భగవద్గీతలోని కర్మయోగం నుంచి ఒక శ్లోకం నన్ను ఉద్దేశించే చెప్పినట్లుగా అనిపించింది.


కర్మలను ఆచరించటంపై నీకు అధికారం కలదు గాని, వాటి ఫలితములపై లేదు. అటులని, కర్మలను చేయుట మానరాదు. ఆ శ్లోకం మాటిమాటికీ చెవుల్లో మార్మోగుతూనే ఉండేది! నాన్న పడుతున్న బాధని తలుచుకుంటూ, మొదటిసారి నాన్నని చూడాలనిపించడంతో, ఎప్పుడో గురువుగారి యింటి దగ్గర నుంచి తెచ్చుకున్న పేపర్ల మీద నాకు బాధ కలిగించిన ప్రతి ఒక్క రూపాన్ని నఖచిత్రాలుగా గీయడం మొదలుపెట్టాను!" అని అన్నాడు కొన్ని నఖచిత్రాలు ప్రకాష్ కి చూపిస్తూ.


"అవును! యి విషయం మీ గురువుగారికి తెలియలేదా!" అని నఖచిత్రాలు చూస్తూ అడిగాడు ప్రకాష్.


"మీరు బాగా లీనమైయిపోయినట్టున్నారు. ఎంతైనా రచయితలు కదా! సన్మానం ముగించుకుని వచ్చిన గురువుగారికి విషయం తెలిసి ఆత్రుతగా సరాసరి యింటికి వచ్చారు‌. గురువుగారు వస్తూనే, 'ఏం జరిగింది రామయ్య' అని అడిగారు.


'ఏం జరిగిందంటే, ఏం చెప్తాం బాబు. అంతా మా కర్మ. ఇంటి దీపం వెలిగిస్తాడనుకున్న కొడుకు కంటి దీపాల్ని నా చేతులతో నేనే ఆపేశాను. మాలాంటి వాళ్ళకి దేవుడు మంచి చేస్తాడు అనేవారు. ఇదే నా బాబు?' అని గురువుగారిని చూడగానే నాన్న లోలోపల మధన పడుతున్నదంతా చెప్పి బాధపడుతున్నాడు. నాకు యించుమించు అలాగే ఉన్నా, నేను ధైర్యంగా ఉండాలని నిర్ణయించుకున్నాను!


'ఎందుకు నాన్న, యిప్పుడు అవన్నీ, సన్మానం నుంచి వచ్చిన గురువుగారికి చెప్పి బాధపెట్టడం. నువ్వు నా చిన్నప్పుడు నుంచి అక్కడ కర్రలు కొడుతున్నావు. నేను ఆ పక్కనే పనిచేస్తున్నాను. నీకు తెలియని పని కాదు. నాకు రాని పని కాదు' అని అన్నాను.


గురువుగారు నాదగ్గరకి వచ్చి, 'నేను సన్మానం నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఉద్యోగం గురించి శుభవార్త చెప్తానన్నావ్. ఇటువంటి వార్త వినాల్సి వస్తుందనుకోలేదురా. నువ్వు నాతో పాటు వచ్చి ఉంటే, యి ప్రమాదం తప్పి ఉండేదేమోరా' అని బాధపడుతూ అన్నారు.


'ప్రమాదం జరిగే చోటు మారుతుంది గురువుగారు. జరగాల్సిన ప్రమాదం జరగకుండా మానుతుందా! రాసి ఉంటే, ఆ కర్రముక్క కంట్లో కాదు, కంఠంలో దిగుతుంది, కానీ దిగలేదు‌. కారణం, నేను యిక్కడ ఏదో చేయాల్సి ఉంది' అని అన్నాను నేను.


గురువుగారు ఆశ్చర్యంగా నా భుజం మీద చెయ్యి వేస్తూ, 'ఏంటోరా నిన్ను చూస్తుంటే కొత్తగా ఉంది. ఉద్యోగం వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న నీకు యిలా దురదృష్టకరమైన సంఘటన జరిగి, జీవితమే ప్రశ్నార్ధకంగా మిగిలినప్పుడు, అంత బాధ నువ్వు ఎలా తట్టుకుంటావో, ఏమైపోతావో, ఏం చెప్పి నిన్ను ఓదార్చాలో అని కంగారుపడుతూ వచ్చాను. ఇప్పుడు నిన్ను చూశాక నా మనసు కొంచెం కుదుటపడిందిరా. కొంచెం మంచినీళ్లు యివ్వు రామయ్య!' అని అన్నారు.


మంచినీళ్లు తీసుకురావడానికి నేను తడుముకుంటూ లేచి వెళ్లబోతుంటే, అంతవరకు నేను గీచిన నఖచిత్రాలు ఉన్న పుస్తకం జారి కిందపడింది. ఆ పుస్తకంలో ఉన్న నఖచిత్రాలు గురువుగారి కంట పడడంతో తీసి ఆశ్చర్యంగా చూస్తున్నారు. నాన్న పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను పట్టుకొని, 'యిలాగే గురువుగారు, ఏ విషయంలోనూ జాగ్రత్తగా ఉండడు' అని అన్నాడు.


గురువుగారు ఆ నఖచిత్రాలు చూస్తూ, 'ఈ నఖచిత్రాలు నువ్వే వేసావా! బాగుందిరా. చూసి వేసేటప్పుడు ఎన్నో తప్పులు వేసే నువ్వు, యిప్పుడు చూడకుండా నీమనసునే రూపంగా చేసుకొని, గోటితో ఆరంభంలోనే యింత నైపుణ్యంగా వేస్తున్నావంటే చెప్పుకోవలసిన విషయమేరా! చూశావా రామయ్య! దేవుడు దీపం ఆర్పేశాడని అన్నావు. కానీ, చీకట్లో మిణుగురులులాంటి వెలుగు చూపించాడు. ఆ వెలుగు చాలు, వీడు జీవితం గడపడానికి' అని నమ్మకంగా అన్నారు.


'అటువంటి విద్యలు మాకు తిండి పెడతాయా గురువుగారు' అని అడిగాడు నాన్న.


'తిండి పెట్టడమేంటీ రామయ్య, మొన్న నాకు జరిగిన సన్మానాలు, సత్కారాలు యి చిత్రకళ ప్రదర్శించినందుకే కదా! అందరి అభిమానం, అంతటి గౌరవాన్ని పొందగలిగాను కదా! మీకు తిండి పెడుతుంది. పదిమందికి కళని పంచిపెడుతుంది! శేఖర్ యి పరిస్థితుల్లో కూడా చూపు ఉన్నవాళ్ళ కంటే అద్భుతంగా కళని ప్రదర్శిస్తున్నాడు. వంద మంది విజయం సాధిస్తుంటే, అందులో అరవై మంది దివ్యాంగులే అంటే నమ్ము. వారికి ఉండే ధైర్యం, పట్టుదల సామాన్యులకు ఉండదు. వీడు కచ్చితంగా ఉన్నతస్థాయికి వెళ్తాడు. నేను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను' అని గురువుగారు నా భుజంతట్టి చెప్పారు.


ఆ తర్వాత గురువుగారు నన్ను, నేను గీసిన చిత్రాల్ని చూపిస్తూ, ఎంతోమంది పెద్దలకి పరిచయం చేశారు. చాలా చిత్రాలు గీయించారు. అలా చాలా ప్రదర్శనల్లో కొన్ని వందల చిత్రాలు గీసే అవకాశం కల్పించారు. అలా వచ్చినదే యి పేరుప్రతిష్టలు. ఆ తర్వాత జరిగింది మీకు తెలుసు! మా యిల్లు వచ్చేసినట్లుంది!" అని ముగించాడు శేఖర్.


కథలో బాగా లీనమై వింటున్న ప్రకాష్ తేరుకుని, అడ్రస్ చూసి బ్రేక్ వేసి కారు ఆపి "అడ్రస్ వచ్చేసిందని అంత సరిగ్గా ఏలా చెప్పగలిగారు?" అని అడిగాడు.


"ఆ కళాప్రదర్శన స్థలం నుంచి మా యింటికి పదినిమిషాలు పడుతుంది. మా యింటి పక్కనుండే స్వీట్స్ బేకరిలో వచ్చే వాసన వెరైటీగా ఉంటుందిలేండి!" అని కారు దిగుతూ అన్నాడు.


"ఆగండి! ఆఖరిగా ఒక ప్రశ్న. మీలో ఉన్న కళని గురువుగారు ఎలా గుర్తించగలిగారు?" అని అడిగాడు.


శేఖర్ చిన్నగా నవ్వుతూ "ఒక శిల్పికి ఏ రాయి శిల్పమవుతుందో, ఏ రాయి శిలలా మిగులుతుందో తెలియదా! మీకు అర్ధమయ్యింది అనుకుంటున్నాను!" అని అన్నాడు.


"మీ జీవితం చాలామందికి ఆదర్శంగా నిలుస్తుంది. ఈ తరానికి ఏం సందేశం ఇస్తారు?" అని అడిగాడు ప్రకాష్ కారు దిగి శేఖర్ దగ్గరికి వస్తూ.


శేఖర్ నవ్వుతూ "నేను సందేశం యివ్వడం ఏంటండి! ఇచ్చేంతగా నేనేం సాధించాను. నాకు తెలిసింది చెప్తాను. ప్రతి జీవి తన ఉనికిని ఉన్నతస్థాయికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. మనం భవిష్యత్తులో ఏమవుతామో అనేది, యిదివరకే గతంలో పునాది పడుతుంది. దాన్ని మనం గమనిస్తే చాలు, సరిపోతుంది!" అని చెప్పాడు శేఖర్.


ప్రకాష్ చప్పట్లు కొడుతూ శేఖర్ ని పట్టుకుని "అడగ్గానే మీ జీవితం మొత్తం చెప్పారు. మొట్టికాయ, కజ్జికాయ ల గురించి యిప్పుడు కొంచెం అర్ధమవుతుంది. మళ్లీ ఆలోచించుకొని ఏదైనా డౌట్ ఉంటే అడుగుతాను. చెప్తారు కదా! అలాగే, మీ జీవితగాథని తెరకెక్కించిడానికి అనుమతి యివ్వండి. ప్లీజ్!" అని అడిగాడు.


శేఖర్ కారు నుంచి కిందకి దిగి "మీకు ఉపయోగపడుతుందంటే నిరభ్యంతరంగా చెయ్యండి. ఇది నా జీవితంలో యింకో మొట్టికాయో, లేక యింకో కజ్జికాయో చూడాలి మరి! ఇంతకి, యి కథకి రచయితగారి మైండ్ లో ఉన్న టైటిల్ ఏంటో చెప్పలేదు!" అని నవ్వుతూ అన్నాడు శేఖర్.


"ఇది మీ జీవితం. మీరే చెప్పండి టైటిల్!" అని అన్నాడు ప్రకాష్.


"నా జీవితం నాకు చీకటిలో కనిపిస్తుంది! మీకు వెలుగులో కనిపిస్తుంది!" అని అన్నాడు శేఖర్.


"చీకటి, వెలుగు, చీకటివెలుగులు. బాగుంది కదండీ!" అని అడిగాడు ప్రకాష్.


"చీకటివెలుగులు! బాగుందండి!" అని అన్నాడు శేఖర్.


"మీకు మొట్టికాయో, కజ్జికాయో నాకు తెలియదు. కానీ, నాచేతిలో మాత్రం ఖచ్చితంగా దేవుడు కజ్జికాయే పెట్టాడు! ఆరోజు మీనాన్న పడిన ఆవేదన, మిమ్ముల్ని చిత్రకళ వైపు ప్రేరేపించింది. ఈరోజు మీ జీవితగాథ, అవకాశాల పేరు చెప్పి కాలక్షేపం చేస్తున్న నాకు దిశానిర్దేశం చేసింది! నన్ను అలుముకున్న చీకట్లు వదిలేసినట్లనిపిస్తుంది! మీరు చెప్పినట్లు, సూర్యుడిని కారుమబ్బులు కమ్మేసి చీకట్లు అలుముకోవడం, కమ్మేసిన మబ్బులు వర్షించాక అడ్డు తొలిగి సూర్యుడు ప్రకాశించడం, యిలా చీకటివెలుగులు ఆడుకునే దాగుడుమూతలే మన జీవితాలు! త్వరలోనే మీ జీవితగాథ డ్రాఫ్ట్ సిద్ధం చేసి మీ దగ్గరికి వస్తాను. కలుద్దాం!" అని అన్నాడు.


"సరేనండి!" అని అంటూ మనసులో ఏదో తెలియని తన్మయంతో యింటి వైపు నడుస్తున్నాడు శేఖర్.


ఏదో తెలుసుకున్నాన్న ఆత్మసంతృప్తితో కార్యసాధన దిశగా, శేఖర్ చెప్పిన అనుభవాలను అక్షరాలుగా మార్చడంపై మనసు లగ్నం చేసి కారు పోనిచ్చాడు ప్రకాష్.

========================================================================

సమాప్తం

========================================================================

అల్లు సాయిరాం గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

Podcast:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

రచయిత పరిచయం: పేరు అల్లు సాయిరాం


హాబీలు: కథా రచన, లఘు చిత్ర రూపకల్పన

ఇప్పటివరకు పది కథల దాకా ప్రచురితమయ్యాయి.

ఐదు బహుమతులు గెలుచుకున్నాను.





62 views1 comment

1 Comment


Surekha Arunkumar
Surekha Arunkumar
Nov 08, 2023

కధ బావుంది 👌

Like
bottom of page