top of page

ఇక జీవితం ఉద్వేగ పూరితమై, ఉత్తుంగ తరంగమై - పార్ట్ 5


'Ika Jeevitham Udvega Purithamai - Utthunga Tharangamai - 5' - New Telugu Web Series Written By Pandranki Subramani

'ఇక జీవితం ఉద్వేగ పూరితమై - ఉత్తుంగ తరంగమై - 5' తెలుగు ధారావాహిక

రచన : పాండ్రంకి సుబ్రమణి

(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ:


కుటుంబ పోషణ కోసం ఢిల్లీలోని ఒక మెస్ లో కుక్ గా చేరుతాడు రామభద్రం. ఒకరోజు అతనికి కలలో ఆ మెస్ నిర్వాహకురాలు రూపవతి కనిపిస్తుంది. అతనిలో అలజడి మొదలవుతుంది.


తన ఊరికి వెళ్లి రావడం కష్టంగా ఉందని, పని మానేసి వెళ్ళిపోతానంటాడు భద్రం. కుటుంబాన్ని ఢిల్లీకి తీసుకురమ్మని, అవసరమైన సహాయం చేస్తానని చెబుతుంది రూపవతి. ఇంటికి వెళ్లిన రామభద్రం ఢిల్లీకి రావడానికి తన కుటుంబ సభ్యులను ఒప్పిస్తాడు.

కుటుంబంతో ఢిల్లీకి చేరుకున్న భద్రం కుటుంబానికి వసతి చూపిస్తుంది రూపవతి.


'ఇక జీవితం ఉద్వేగ పూరితమై, ఉత్తుంగ తరంగమై- పార్ట్ 5' చదవండి.


ఆరోజు రూపవతి మెస్సుకి పెందలకడే వచ్చినట్లుంది. అప్పటికి మంజులగాని, మాలిని గాని రాలేదు. నిన్ననే ఇద్దరికీ డీల్ పైన డిస్కౌంటులో దొరికాయని చెరొక చీరా కొనిచ్చిందామె. ఒక ప్రక్కన బోలెడన్ని బిల్లులూ మరొక వేపున లెడ్చర్ బుక్కునీ పెట్టుకుని లావాదీవీలను లింక్ చేసుకుంటూ అప్డేట్ చేసుకుంటూంది. ఆమె ఆభిప్రాయం ప్రకారం- ఖర్చు ఎంత చేసామన్నది ముఖ్యం కాదు. చేసిన ఖర్చుకు నికార్సయిన లెక్క పక్కాగా ఉన్నదా లేదా అన్నదే ముఖ్యం--

అప్పుడు కాఫీ కప్పు ఆమె ప్రక్కన పెడుతూ- “శుభోదయం మేడమ్. ఎందుకో ఈరోజు చాలా బిజీగా ఉన్నట్టున్నారు. వాళ్లిద్దరూ వచ్చిన తరవాత మీరు తీరుబడిగా రావచ్చు కదా—ఇంతటి హైరానా ఉండుదు కదా-- “


రూపవతి నిదానంగా తలెత్తి నవ్వు ముఖంతో చూసింది. అదే నవ్వు ముఖంతో సాసర్లో కాసింత కాఫీ పోసి అతడికి అందిస్తూ, మిగతాది తను తీసుకుంటూ అంది- “ఇద్దరూ వచ్చిన తరవాత పని మరింత ఎక్కువయేటట్లుంది. లింకు చేయాల్సిన బ్రోచర్స్ చాలానే ఉన్నాయి. ఫైనాన్సియల్ ఇయర్ కొలిక్కిరాబోతుంది కదా- లెక్కలన్నీ ఇప్పటికిప్పుడు చూసుకోకపోతే ఇన్కమ్ టాక్స్ జి- యెస్టీ స్టేట్ మెంట్లు ఎలా సమర్పిస్తాం? టైముకి సమర్పించక పోతే ఏమవుతుందో తెలుసా- హెవీ పెనాల్టీలు లెవీ చేస్తారు”

ఆమె తనకు అలా ఎందుకు సగం కాఫీ ఇస్తుందో అతడికి తెలుసు. తన పట్ల అక్కర ఉందని తెలియచేసేలా గాంభీర్యత ఉట్టుపడే సంకేతం-- రామభద్రం సాసర్లోని కాఫీ తాగడం పూర్తిచేసి నిదానంగా అన్నా డు- “నేనొకటి చెప్తే మీరు నమ్ముతారో లేదో—”

ఏమిటన్నట్టు చూస్తూ లెడ్జర్ పుస్తకాలను ప్రక్కకు తోసింది. “నేను స్కూలు ఫైనల్ పూర్తిచేయలేక పోయానే గాని, నాకు అడపా తడపా అకౌంట్సు పనులు చేస్తూ నేర్చుకోవాలన్న ఆసక్తి ఉంది. కాబట్టి బిల్లులు సరిచూసి లెడ్జర్ లోకి ఎంట్రీ ఎక్కించగలను. ఔనో కాదో మీరిప్పటికిప్పుడే చెక్ చేసుకోవచ్చు”


“నాకు సందేహం ఉంటేనే కదా, చెక్ చేసుకోవడానికి-- నాకెప్పుడైనా అవసరం ఏర్పడితే మీ సహాయం తప్పకుండా తీసుకుంటా ను గాని—మీరిప్పుడు నాకొక సహాయం చేసి పెట్టగలరా—ఇఫ్ యు డాంట్ మైండ్!”


“చెప్పండి మేడమ్. సందేహిస్తారెందుకూ---” అంటూ కప్పూ సాసరూ మెస్సు హలు లోపల పెట్టి వచ్చాడు రామభద్రం.

“సమయానికి మంజుల కూడా లేదాయె—అందుకుని మీకు చెప్పాల్సి వస్తుంది. ఇప్పటి నా విషయం విష్ణుమూర్తి అంతటి వాడే దేని కాళ్ళో పట్టుకున్న తంతు- అంటూ తన క్యాష్ చేంబర్ వేపు పిలిచిందామె.

అతడు ఆమె వెనుకే నిదానంగా నడచి వెళ్ళాడు. అప్పుడామె స్వెట్టర్ని తీసి చీర చెంగుని ప్రక్కకు తొలగించి అమృతాంజనం చేతికిచ్చింది మెడ చుట్టూ మెడదిగువనా గట్టిగా అదుముతూ రుద్దమని--

రామభద్రం డబ్బా అందుకున్నాడే గాని చేష్టలుడిగి నిల్చున్నాడు. కలలో లేక ఊహలో మాత్రమే ఎదురు చూడగల పనిని రూపవతి మేడమ్ తనకు మక్కికి మక్కిగా అప్పగిస్తూంది. ఒక విధంగా ఇది నిప్పుతో చెలగాటమే- వాళ్ళ మరదలు మంజులవాణి ఆమెకు మర్దన చేయడం వేరు. అకౌంట్సు స్టాఫ్ మాలిని రుద్దడం వేరు.

పరపురుషడైన తను తాకుతూ రుద్దడం అంటే, కత్తిపైన సాము చేయడమే అవుతుంది. ఈతంతు అంతా ఎక్కడో ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూన్న ఆ మాజీ మిలిటరీ ఆఫీసరు భవ్యంగా చేయాల్సిన పని. అప్పుడతనికి రూపవతి గొంతు వినిపించింది- ”అదేమిటి గోడకు కొట్టిన పటంలా నిల్చుండిపోయారూ! నొప్పితో మెలికలు తిరిగి పోతుంటేనూ—త్వరగా ముగించండీ—నాకు బోలెడంత పనులున్నాయి“

“హాఁ హాఁ! డబ్బా విప్పుతున్నానండీ! ఐనా మీరు మరి కొంచెం సేపు మంజులవాణిగారి రాక కోసం నిరీక్షిస్తే బాగుంటుందేమో- లేదా మీ యింటి పనిగత్తెను పిలిపిస్తే బాగుంటుందేమో-- ” అంటూ అతడు మరొక మారు నిశ్చలంగా చూస్తూండిపోయాడు.

అందమైన ఆమె శరీరఛ్చాయికి అతడి కళ్ళు రెండూ ఫెళ్లు మంటున్నాయి. తెల్లటి విశాలమై నునుపైన వీపు. చాతీ మధ్య పచ్చపాములా ప్రాకిన చార బిగువైన యవ్వనానికి ముత్యాల హారం. అతడెప్పుడో చదివిన పద్య భావం స్ఫురణకి వచ్చింది- ‘దొండపండులాంటినీ పెదవులు, గుండె ఎత్తులు, గిరిజాల జుత్తు, మెరిసే సుందరమైన నీ కన్నులు చూపించకుండా నీ సౌందర్యమైన వదనాన్ని అలుక వహించి చాటేసుకున్నంత మాత్రాన వచ్చిన నష్టం ఏ మొచ్చింది గనుక? అద్భుతమైన నీ నితంబాలు, పొడవైన వంపులు పోయే నీ జడ చాలవూ నన్నూ నా మనసునీ ముప్పిరిగొనడానికి! ’” అతడిక ఆలోచించడం ఆపుచేసాడు.

ఆడది ఎదుర్కుంటూన్న అపాయ సమయంలో ఈ తెలివి మీరిన ఉపాయాలేమిటి? ఊహాగానాలేమిటి? అందులో తనకు ఉపాధి కల్పిస్తూన్న యజమానురాలాయె—ఐనా విధి విలాసం కాకపోతే, ఇటువంటి సమయంలోనే ఆ మంజులాదేవి మహాతల్లి మాలినీ మహాతల్లీ నల్లపూసల్లా కనుమరుగయి పోవాలా!

తనను తను నిగ్రహించుకుని నిదానంగా “పాహిమాం! పాహిమాం! ”అని మనసున పదే పదే అనుకుంటూ అమృతాంజనం మెడ చుట్టూ కొంత మెడకి అవతలి వేపు మరికొంత రుద్ది డబ్బాను ఆమెచేతికిచ్చేసాడు భద్రం.

రూపవతి రిలీఫ్ గా ఫీలవుతూ అంది- “అబ్బ! ఎంత రిలేక్స్ గా ఉందని—పోయిన ప్రాణం లేచి వచ్చినట్లుంది. నిజం చెప్తున్నాను- చాలా బాగ మర్దన చేసారు”.

అప్పుడతను నవ్వి సమర్థింపుగా అన్నాడు- “ఔను! మీరు చెప్పిందాంట్లో వాస్తవం ఉంది. మర్దన చేయడం ఒక కళ మేడమ్. ఇది మా బాబు నేర్పాడు. కొన్ని కీలక స్థానాల్లోనే నొక్కి వదలాలి. అలాగని అంతటా గట్టిగా ఒత్తిడికి లోను చేయకూడదు” అంటూ క్యాష వింగ్ నుండి బైటకి వచ్చాడతడు.

అప్పుడామె అంది-. “అదేంవిటి? థేంక్స్ కూడా తీసుకోరా!”

”అప్పుడతను వెనక్కి తిరిగి చూసి అన్నాడు- “థేంక్స్ నాకెందుకండీ? మీకు సహాయకారిగా ఉండటంలో నాకెంతో సంతోషం. లోపల సోమనాథం గారు నాకోసం వెతుకుతుంటారు ఐతే- వెళ్లే ముందు రెండు మాటలు చెప్తాను—మీరు గాని ఫ్రెండ్లీగా తీసుకుంటే--”

“దానికేముంది? చెప్పండి”

“మీరెప్పుడైనా మీ ముఖార విందాన్ని బాగా చూస్తుకున్నారా!”

”దానికామె నివ్వెరపోయి చూసింది- “ఏమిటీ వింతైన ప్రశ్న? ఏ ఆడదైనా తన ముఖాన్ని అద్దంలో చూసుకోకుండా ఉంటుందా! ”

“నా మాట పూర్తిగా వినండి ఆ తరవాత స్పందించండి”.

ఆమె తలూపింది అలాగే అన్నట్టు.

”మీది చక్కటి రూపం. పొంగులూరే బిగి సడలని నిండు యవ్వనం. తనువెల్లా మెరిసే అందం. మీకు దగ్గరగా వస్తే- ఎంతటి మగాడైనా చివరకు మునివర్యుడు వంటి ప్రవరాఖ్యుడైనా నేలవాలిపోవలసిందే!

రెండవది- ఇది మీకు తెలిసే అవకాశం లేదు కాబట్టి చెప్పవలసి వస్తూంది—మీ సుకుమార మైన మేని సుగంధ సువాసనల్ని వెదజల్లుతూంది. ఇటువంటి మృదువైన సౌగంధాలంటే మగాడికి మిక్కిలి ఇష్టంగా ఉంటుంది. అంచేత మనసార వేడుకుంటున్నాను మరొకసారి నన్నుపిలవకండి ఇటువంటి పర్సనల్ పనులకు.

పిల్లలు గలవాణ్ణి. కుటుంబ భారం మోయ వలసిన వాణ్ణి. తప్పటడుగులు పడకుండా చూసుకోవాలి- నాలుగుకాలాల పాటు నేనిక్కడే మనుగడ సాగించాలి. దయచేసి అన్యధా భావించకండి- మరీ ఎడంగా ఉండి మీ మిలిటరీ ఆఫీసరుని మరచిపోకండి” అంటూ గిరుక్కున వెనక్కి తిరి గాడు.

ఈసారామె అతడి చేతిచొక్కాను చటుక్కున పట్టుకుని ఆపింది- “ఏం? ఇటువంటి సౌగంధ వీచికల వాసన మీ ఆవిడ వద్ద లేదా?"

అతడు ఆగి బదులిచ్చాడు. “ఉంది. కాని స్త్రీల శరీర వాసనల్ని దేనితో, ఏ సౌగంధంతో ఏ రాశితో పోల్చాలో తెలియక తల పట్టుకుంటాననుకోండి. బహుశ: నాకీ విషయంలో అనుభవం చాలదేమో- ” అంటూ మెస్సు మెయిన్ హాలువేపు ఇక ఆగకుండా నడచి వెళ్లిపోయాడు రామభద్రం.

అదే రోజు సాయంత్రం రూపవతి భద్రాన్ని పిలిచి చీఫ్ కుక్ సోమనాథానికి తను బైటకు వెళ్తున్నానన్నది చెప్పిరమ్మని పురమాయించి, ఒక ముఖ్యమైన పని అప్పగించింది- “సేఠ్ కిషన్ జీ ఈరోజు రాత్రికి ముంబాయి వెళ్తున్నారట- ఆయన కిరాణా మార్కెట్టుకి వెళ్లి ఈ చెక్ ఇచ్చేసి రండి. వెళ్ళేటప్పడు మదన్ మోహన మాలవ్యా పార్కు గుండా వెళితే త్వరగా చేరుకోగలరు- మీరు మళ్ళీ మెస్సుకి ఇటు రానవసరం లేదు. అదే పార్కుగుండా మీరు మీ ఇల్లు చేరుకోవచ్చు తేలిగ్గా--”

అతడు చెక్కుని అటూ ఇటూ చూస్తూ అడిగాడు- “అక్నాలెడ్జి మెంట్ తీసుకోరావాలండీ! ”అని.

అప్పుడామె అతడి అలార్ట్ నేస్ కి మనసున మెచ్చుకుంటూ అంది- “విడిగా తీసుకోనవసరం లేదు. ఈ ఫర్వార్డింగ్ లెటర్ పైనే సంతకం తీసుకుంటే చాలు”

రామభద్రం తలాడిస్తూ అర్జంటు పనులు ముగించి ఓనర్ మేడమ్ యిచ్చిన పనిపైన వెళ్లడానికి ఉద్యుక్తుడయాడు. అప్పుడు ఎక్కణ్ణించో వస్తూన్న మంజలవాణి అతణ్ణి ఆపింది. నవ్వుతూ అడిగాడు భద్రం- “మీకు కూడా ఏదైనా పని చేసిపెట్టాలా? ”అని.

ఆమె సూటిగా బదులిచ్చింది “అబ్బ! మీ మగాళ్లు ఫాస్టుగా నిర్ణయానికి వచ్చేస్తారండీ బాబూ! నేను చెప్పబోయే మేటర్ అది కాదు”

మరేమిటన్నట్టు కళ్ళెత్తి చూసాడ తను. “మా వదినమ్మ లేదూ- ఆమె సాధారణంగా అందర్నీ అంత తేలిగ్గా నమ్మదండీ- ముఖ్యంగా ఫైనాన్సియల్ వ్యవహారాలలో- మీకు చెక్కు వ్యవహారం ఇవ్వనారంభించిందంటే —దానర్థం మీకు రాను రాను పెద్ద బాధ్యతలే ఇవ్వడానికి తలపెట్టిందన్నమాట. పని భారమని తలపోయకుండా వీలున్నంత మేర మా వదినమ్మతో సర్దుకు పోవడానికి ప్రయత్నించండి. హార్డ్ వర్కింగ్ సిన్సియర్ మనుషులంటే మా వదినకు మిక్కిలి అభిమానం. అంతే సంగతులు” అంటూ క్యాష్ క్యాబిన్ వేపు వెళ్ళిపోయింది మంజుల.

ఆమె ఇంకేదో చెప్పడానికి పూనుకోబోయి, దానిని అసంపూర్తిగా విడిచి పెట్టి వెళ్లిపోయిందనిపించింది రామభద్రానికి. వదినమ్మ గురించి ఇంకా మరిన్ని సకారాత్మకమైనవి చెప్పడానికి ప్రయత్నించి దానిని పూర్తికానివ్వకుండానే వెడలి పోయిందేమో! లేక—అదను దొరికింది కదానని వదినమ్మతో మరీ క్లోజ్ గా మూ వ్ చేయకని వార్నింగ్ సంకేతం ఇవ్వడానికి ప్రయత్నించిందేమో; తను రూపవతి మేడమ్ కి తైలం రుద్దిన విషయం తెలుసుకుని--

ఆడాళ్ళమాటలకు అర్థాలే వేరు కదా! అర్థాలే తెలియనప్పుడు భావాలెలా మొలుస్తాయి? ఎంతైనా తనకన్నా నాలుగాకులు యెక్కువ చదువుకున్న ఇక్కడి స్త్రీల వద్ద కొంచెం హుషారుగానే ఉండాలి మరి, పలుకుల పంజరాలలలో చిక్కుకుపోకుండా—మాటల గారడీలో పల్టీలు కొట్టకుండా—

“స్త్రీల మనసులు క్షణ క్షణ భంగురముల్!” అన్నది తనకు తెలియనిదా! ఇకపోతే—తను అంత దూరం నుంచి ఇక్కడకు వచ్చింది ఉపాధి కోసం- కుటుంబ సంరక్షణ కోసం—ఇది తను యెలా మరచిపోతాడు? మరచిపోతే గనుక కుటుంబమంతా రోడ్డున పడదూ!

ఏమైందో మరి—మరునాడు ఉదయం రామభద్రం మెస్సు డ్యూటీకి రాలేదు. రూపవతి ఆదేశానుసారం మాలిని భద్రం సెల్ ఫోనుకి కనెక్టు చేయడానికి ప్రయత్నించింది. కనెక్ట్ కాలేదు. రింగ్ టోన్ రాలేదు.

”అలాగైతే ల్యాండ్ లైన్ కి కనెక్ట్ చేయి“ అని పురమాయించింది రూపవతి. దానికి మాలిని వెంటనే బదులిచ్చింది- “వాళ్లింట్లో ల్యాండ్ లైన్ ఉండదు మేడమ్. అది మీ రూముకి బదలీ చేసుకున్నారుగా! ”

ఆమె అర్థం అయినట్టు తలూపుతూ అంది- “అతనికో లేక వాళ్ళింట్లో వాళ్ళెవరి కో ఒంట్లో సుస్తీ చేసుంటుంది కాబోలు. ఆస్పత్రికి వెళ్ళుంటారు. రేపు వస్తాడులే! మీరు ముందు అతనింటికి ల్యాండ్ లైన్ కనెక్షన్ ఇవ్వడానికి భద్రంగారి సంతకం తీసుకుని అర్జీపెట్టండి. అతడీరోజు రాలేదన్న వైనం సోమనాథానికి చెప్పండి”.

మాలిని తలూపింది.

=======================================================================

ఇంకా వుంది

=================================================================================

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

Podcast:


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.
52 views0 comments

Comments


bottom of page