top of page

పెళ్ళికాని ప్రమోద్


'Pellikani Pramod' - New Telugu Story Written By Padmavathi Divakarla

'పెళ్ళికాని ప్రమోద్' తెలుగు కథ

రచన: పద్మావతి దివాకర్ల

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

ఎన్ని పెళ్ళి సంబంధాలు వచ్చినా పెళ్ళి కావలసిన ప్రమోద్ కి ఏ ఒక్కటీ నచ్చకపోవడంతో ఇంతవరకూ పెళ్ళికాని ప్రసాద్ లా...కాదు…కాదు, పెళ్ళికాని ప్రమోద్ లా మిగిలిపోయాడు. ఇప్పటికే చాలా సంబంధాలు చూసినా ఏ ఒక్కటీ ప్రమోద్ కి నచ్చక వచ్చిన సంబంధాలన్నీ తిరగొట్టాడు. పెళ్ళి చూపుల్లో తను చూసిన అమ్మాయికి చదువుంటే అందముండదు, అమ్మాయి అందంగా ఉంటే పెద్ద చదువు ఉండదు, రెండూ ఉంటే ఉద్యోగముండదు. చదువు, అందం, ఉద్యోగం అన్నీ ఉన్న అమ్మాయిలకి ప్రమోద్ కన్నా ఇంకా యోగ్యమైన మంచి సంబంధాలు దొరకడంతో అతని పెళ్ళిచూపుల తంతు రానురాను ఓ ప్రహసనంగా మారిపోయింది.


ఇలా వచ్చిన ప్రతీ సంబంధం తప్పిపోతుంటే ప్రమోద్ తల్లి తండ్రీ తమ కొడుకు బెండకాయలా ముదిరిపోతాడేమోనని తెగ బెంగపెట్టేసుకున్నారు. పెళ్ళి సంబంధాలు చూసిన కొత్తలో అతని తల్లి వరలక్ష్మి తమకు కాబోయే కోడలు తెచ్చే కట్న కానుకలమీద గంపెడు ఆశ పెట్టుకున్నా రాను రాను ఆమెకి కూడా నేటి పరిస్థితి బాగా అర్థం అయిపోయింది. కట్నం కన్నా కోడలే మిన్న అన్న అవగాహన కాస్త ఆలస్యంగానైనా కలిగింది. కనీసం లాంఛనాలు రాబెడితే అదే చాలునన్న ధోరణిలో ఉంది. ఆ లాంఛనాలు కూడా లక్షణంగా దొరుకుతాయో లేదోనన్న బెంగ కూడా ఉంది ఓ మూల.

ఇప్పటికే ప్రమోద్ కి వయసు కూడా ముప్ఫై అయిదు దాటి, నెత్తిమీద ఫ్లాట్ క్రికెట్ పిచ్ లా పలచనవడం ప్రారంభించింది. జుట్టు ఇంకా పలచనైతే, పదిమంది ముందు, ముఖ్యంగా పెళ్ళివారి ముందు తాము పలచనైపోతామని భయం పట్టుకుంది అతని తల్లితండ్రులకి. ఇప్పటికి ఓ నూట ఎనిమిది సంబంధాలు చూసారు. అదే నూట ఎనిమిది సార్లు తిరుమల కొండెక్కి దైవదర్శనం చేసుకున్నా పుణ్యం పురుషార్థం దక్కును అని వరలక్ష్మి అనుకోని రోజు లేదు.


ముందు గొంతెమ్మ కోరికలతో పెళ్ళికొడుకైన ప్రమోద్ కొండెక్కి కూర్చుంటే, రాను రాను ఇప్పుడు పెళ్ళికూతుళ్ళు చెట్టెక్కి కూర్చున్నారు. ప్రమోద్కి నచ్చిన పెళ్ళిసంబంధాలు తేలేక పెళ్ళిళ్ళ పేరయ్య పరమేశం సతమతమవుతూ పాపం కళ్ళు తేలేస్తూ ఉన్నాడు. ఎలాగోలా పెళ్ళి కుదిరిస్తే తనకు వచ్చే సంభావనతో తన కూతురి పెళ్ళి చేయాలని దృఢ సంకల్పంతో ఉన్నాడు. అయితే, పాపం పరమేశానికి ఆ పరమేశ్వరుడు కూడా కరుణించకపోవడంతో పట్టుదలగా సంబంధాల కోసం వెతుకుతూనే ఉన్నాడు. ప్రమోద్ లాంటి పెళ్ళి కొడుకుల జాబితాయే, పెళ్ళి కూతుర్ల జాబితా కన్నా పెద్దగా ఉంది. కనీసం ఇలాంటి ఓ అరడజను సంబంధాలు కుదిరిస్తేనే కానీ తను కూతురి పెళ్ళి చెయ్యలేడు. అందుకే పరమేశానికి అంత తొందరెక్కువ.


చాలా రోజుల తర్వాత ఓ రోజు హడావుడిగా ఆ ఇంట్లో అడుగుపెట్టాడు పరమేశం. అతన్ని చూస్తూనే, సాక్షాత్తు పరమేశ్వరుణ్ణి చూసినంత ఆనందంతో ఉప్పొంగిపోయారు ఇంటిల్లపాదీ.


"ఏమైనా కొత్త సంబంధాలు తెచ్చారా?" ఆతృతగా అడిగింది వరలక్ష్మి అతనికి మంచినీళ్ళు అందిస్తూ.


"ఆఁ..." అంటూ తను తెచ్చిన సంబంధం వివరాలు చెప్పాడు పరమేశం.


ముగ్గురూ ఆ అమ్మాయి ఫోటో చూసారు. వాళ్ళ అదృష్టం బాగుండి ఆ రోజు పరమేశం తెచ్చిన సంబంధం ప్రమోద్ కి బాగా నచ్చేసింది. అమ్మాయి పేరు ప్రణీత. పేరు బాగుండటమే కాదు, తన పేరుకి బాగా మ్యాచయ్యింది కూడా. బాగా చదువుకుంది. బిటెక్ పూర్తి చేసి బెంగుళూరులో మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. తన ఉద్యోగం కూడా బెంగుళూరులోనే కాబట్టి ఎటువంటి బెంగా లేదు.


అమ్మాయి మంచి అందగత్తే, అందులో సందేహం లేదు. తను కోరుకున్న లక్షణాలన్నీ ప్రణీతలో ఉండటంతో పెళ్ళి చూపులు చూడటానికి పచ్చజెండా ఊపాడు పెళ్ళికొడుకైన ప్రమోద్. ప్రమోద్ అలా పచ్చజెండా ఊపగానే ట్రైన్ ఎక్కేసారు పెళ్ళిచూపులకి ఆ ముగ్గురూ. అలా పెళ్ళిచూపులకి తల్లితండ్రులతో బయలుదేరాడు ప్రమోద్. ఈ సంబంధం ఎలాగైనా కుదరాలని ప్రమోద్ తల్లి వరలక్ష్మి తనకు తెలిసిన దేవుళ్ళందరికీ మొక్కుకుంది. ఈ సంబంధం కుదిరితే అమ్మవారికి నూట తొమ్మిది కొబ్బరి కాయలు కొడతానని మొక్కుకుంది కూడా. మరి ఇది నూట తొమ్మిదో సంబంధం కదా! అలా కొడుకు పెళ్ళి కుదిరేవరకూ సంబంధానికో కొబ్బరికాయి చొప్పున పెంచుకుంటూ పోతోందామె. కాకపోతే ఎప్పటికి ఆ మొక్కు తీరుతుందో, అప్పటికి ఎన్ని కొబ్బరికాయలు కొనాల్సి వస్తుందో తెలియక అయోమయంలో ఉందామె!


ప్రమోద్ తండ్రి వరదరాజులు కూడా ఈ పెళ్ళి జరిగిపోతే తన బాధ్యత తీరిపోతుందన్న తలంపులో ఉన్నాడు. కొడుకు పెళ్ళైపోతే బంధువర్గం నుండి 'మరి నీ కొడుకు పెళ్ళెప్పుడు? ఇంకా పెళ్ళెందుకు చెయ్యలేదు? కట్నాల కోసం కొండెక్కి కూర్చున్నారా? మీ వాడిలో లోపాలేమైనా ఉన్నాయా?' అని వరదలా వచ్చే ప్రశ్నలకి జవాబు చెప్పే పని తప్పుతుందని వరదరాజులు భావన.


పెళ్ళివారిని సాదరంగా ఆహ్వానించారు ప్రణీత తల్లితండ్రులు. పెళ్ళివారితో పాటు పేరయ్య పరమేశం కూడా వచ్చాడు. కొద్దిసేపు మాటామంతీ అయ్యాక, పెళ్ళిచూపుల కార్యక్రమం ప్రారంభమైంది.


"మా అమ్మాయి అని గొప్పలు చెప్పుకోకూడదుగానీ ఇంత చదువు చదివి ఉద్యోగం చేస్తున్నా ఇంటిపని, వంటపని కూడా బాగా వచ్చు వదినగారూ! అలాగే సంగీతం, నాట్యంలో కూడా ప్రవేశముంది. ఈ స్వీట్లు హాట్లు కూడా మా అమ్మాయి చేసినవే!" చెప్పింది పెళ్ళికూతురు తల్లి సుభద్రమ్మ పెళ్ళివారికి ఫలహారాలు, కాఫీ అందిస్తూ.


"అవునవును. మా అమ్మయి నిజంగా ఆణిముత్యం!" అని వంతపాడాడు ప్రణీత తండ్రి సుందరయ్య.


"మా వాడు మాత్రం అబద్ధంగా కూడా స్వాతిముత్యం కాడు లెండి!" తన జోక్కి తానే విరగబడి నవ్వాడు వరదరాజులు.

నవ్వకపోతే బాగుండదని సుందరయ్య కూడా నవ్వాడు. తను నవ్వితే నవ్వులపాలు అవుతానని ప్రమోద్ నవ్వలేదు సరికదా, పెదవులు బిగించి మరీ కూర్చున్నాడు. పెళ్ళికూతురు ప్రణీతైతే నవ్వు ఆపుకోవడానికి విశ్వ ప్రయత్నం చేసింది. పరమేశం అయితే ఎవరు నవ్వినా, ఎవరు నవ్వకపోయినా ఈ పెళ్ళి జరిగి తన సంభావన తనకి ముడితే చాలన్న మూడ్లో ఉన్నాడు.


అయితే, వరలక్ష్మి మాత్రం భర్తకేసి సీరియస్గా చూసింది. ఆమె ఎందుకలా చూసిందో ఎంత బుర్ర చించుకున్నా అర్థం కాలేదు వరదరాజులుకి. అందుకే ఎందుకైనా మంచిది కవర్ చేసుకుందామని, "మా వాడు చాలా మంచివాడు. ఆఫీసు, ఇల్లు అంతే! ఏ దురలవాట్లు లేదు. ఆఖరికి కాఫీ, టీ కూడా ఎప్పుడో గాని తాగడు." తన కొడుక్కి తనే కితాబిచ్చుకున్నాడు.


పెళ్ళికూతురు ప్రణీత మాత్రం ప్రమోద్ ని వింతగా చూసింది. బుద్ధిమంతుడా, లేక బుద్ధావతారమా అని ఆమె భావన కాబోలు మరి!


"మా అమ్మాయీ అంతే! ఈ కాలం పిల్లల్లా సినిమాలు, షికార్లు అంటే మోజు లేదు. షాపింగులంటూ తిరగదు. ముఖ్యంగా టివిలో జీడిపాకం సీరియల్స్ అస్సలు చూడదు." అని తన కూతురు గొప్పతనం చెప్పుకున్నాడు సుందరయ్య.


పెళ్ళికూతురు ప్రణీతవైపు వింతగా చూసాడు ప్రమోద్. ఈ కాలంలో కూడా సీరియల్స్ చూడని ఆడవాళ్ళున్నారా అని కాస్త ఆశ్చర్యపోయాడు. పెళ్ళికూతురి వైపు మెచ్చుకోలుగా చూసింది వరలక్ష్మి. ఆమె టివి సీరియల్ వీక్షణంలో తనతో పోటీకి రాదని తెలిసి మనసులోనే మురిసిపోయింది కూడా. ఆమెకీ సంబంధం చాలా బాగా నచ్చేసింది.


"ఈడూ జోడూ బాగా కుదిరింది. శుభస్య శీఘ్రం!" అనందంగా అన్నాడు పరమేశం కనుల ముందు తన సంభావన డబ్బులు గలగలమని మెదలగా.


పెళ్ళికూతురుకి అన్ని పనులూ వచ్చని తెలిసిన వరలక్ష్మి మురిసిపోయింది. స్వీట్స్, హాట్స్ కూడా బాగానే చేసింది కాబట్టి వంట పనుల్లో ఇబ్బందేమీ ఉండదు. కోడలికి బాధ్యతలన్నీ అప్పచెప్పి తను విశ్రాంతి తీసుకోవచ్చని మనసులోనే తలచింది. లాంఛనంగా పెళ్ళిచూపులు జరిగిన తర్వాత ప్రమోద్, ప్రణీత ఇద్దరూ ఏకాంతంగా మాట్లాడుకోవటానికి ఓ గదిలోకి వెళ్ళారు. ఒకరి అభిప్రాయాలు, అభిరుచులు మరొకరు తెలుసుకోవాలి కదా మరి!


పది నిమిషాల తరవాత ప్రమోద్ మొహం వెళ్ళాడేసుకుని ఆ గదిలోంచి బయటకు వచ్చాడు. ప్రణీత మాత్రం చలకీగా నవ్వుతూ బయటకు వచ్చింది. ఏమి జరిగిందో ఎవ్వరికీ అంతుబట్టలేదు. అయితే ఈ సంబంధం కూడా 'హాం ఫట్!' అయ్యిందని వరలక్షి, వరదరాజులు కూడా తమ కొడుకు మొహంలో భావాలు చూసి గ్రహించారు. పెళ్ళికొడుకు బిక్క మొహం చూసి, అ 'రహస్య సమావేశం'లో ఏ జరిగిందో తెలియక తికమక పడ్డారు సుభద్రమ్మ, సుందరయ్య. అయితే అందరికంటే బాగా డీలా పడిపోయాడు పరమేశం.


ఎందుకంటే, ఈ సంబంధం గనుక కుదరకపోతే తను ప్రమోద్ కోసం మళ్ళీ మరో సంబంధం తేవాలి. ఎప్పుడు ప్రమోద్ పెళ్ళి కుదురుతుందో, ఎప్పుడు తనకి సంభావన ముడుతుందో, ఎప్పుడు తన కూతురి పెళ్ళి చేస్తానో అని మనసులోనే తెగ మధనపడసాగాడు పాపం పరమేశం! పెళ్ళి చూపుల తంతు ముగిసిన తర్వాత ఏ విషయం మేము కబురు చేస్తామనో, లేక ఫోన్ చేస్తామనో మగ పెళ్ళివారు అనడం రివాజు. కాని చాలా రోజులైంది ఆ సీను రివర్స్ అయి.


ప్రణీత సైగలు అర్థం చేసుకున్న సుందరయ్య, 'ఏ విషయం మేము కబురు చేస్తాములెండి.' అన్నాడు పెళ్ళి వారిని సాగనంపుతూ.


కారులో స్టేషన్ కి వెళ్తున్నప్పుడు వరలక్ష్మి కొడుకుని అడిగింది, "ఏం జరిగిందిరా!" అని.


ప్రమోద్ భారంగా నిట్టూర్చి, "ఈ పెళ్ళి జరగదమ్మా! మా ఇద్దరి అంతస్తులమధ్య చాలా అంతరం ఉందట! నా హోదా ఆమె హోదా కన్నా తక్కువట. ఆమెకి నేను తగనట." అన్నాడు. ఆ మాటలు విన్న వరదరాజులు నివ్వెరపోయాడు. "మనకేం తక్కువరా నాయనా! మనది వాళ్ళతో సరితూగే అంతస్తే కదా! వాళ్ళిల్లు ఇంకా రెండంతుస్తుల మేడ అయితే మన ఇల్లు మూడంతస్తులు కదరా! వాళ్ళ కన్నా మనది ఒక అంతస్తు ఎక్కువే కదా! ఆఫీసులో నీది మంచి హోదాయే కదరా, మరి నీ హోదాకేం తక్కువైంది?" అంది వరలక్ష్మి తెల్లబోయి.


"అది కాదు అమ్మా! ఆ అంతస్తుల విషయం కాదు. ఆ అమ్మాయి యాభైకి పైగా వాట్సప్ గ్రూప్లో మెంబరట. అందులోనూ నలభై గ్రూపులో అడ్మిన్ట. నేనేమో రెండంటే రెండే గ్రూపులో మెంబర్ని. అదీ ఒకటి మన ఫామిలీ గ్రూపైతే, మరోటి మా ఆఫీసు ఉద్యోగులు, బాస్తో కూడినది. వేటిలోనూ నేను అడ్మిన్ కాదు. అందుకే నేను ఆమె అంతస్తుకి సరితూగనని నవ్వుతూ తేల్చి చెప్పిందమ్మా!


అదే మా ఇద్దరి హోదాల్లో ఉన్న తేడా మరి! అంతే! నిజమే కదా! ఇదంతా వాట్సప్ యుగం, సామాజిక మాధ్యమాల కాలం కదా మరి!" అన్నాడు ప్రమోద్ భారంగా.


ఆ మాటలు విని అవాక్కయిపోయారు వరలక్షీ, వరదరాజులూను.


"అంతేనా!" వరలక్ష్మి నిస్పృహగా.


"అంతేగా!...అంతేగా!..." అన్నాడు వరదరాజులు అంతే నిరాశగా.

అయితే పెళ్ళి కూతురు ప్రణీతకి సామాజిక మాధ్యమాల్లో చురుకుగాలేని బుద్ధావతారం లాంటి మన ప్రమోద్ నచ్చలేదని వేరే చెప్పాలా? ఆమెకి ఈ సంబంధం కాకుంటే, మరోటి! కో..అంటే కోటిమంది పెళ్ళి కొడుకులు లైన్లో ఉంటారు మరి. కానీ ప్రమోద్ కి మాత్రం పెళ్ళి ఎప్పుడు కుదురుతుందో ఆ పెళ్ళిళ్ళ పేరయ్య పరమేశానికే కాదు, ఆ పరమేశ్వరుడికి కూడా తెలియదు మరి!

***

పద్మావతి దివాకర్ల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:


పేరు పద్మావతి దివాకర్ల. నివాసం బరంపురం, ఒడిషా. ఇప్పటి వరకు వంద కథల వరకూ వివిధ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ఆంధ్రభూమి, సహరి, హాస్యానందం, కౌముది, గోతెలుగు అంతర్జాల పత్రికలలో కథలు ప్రచురించబడ్డాయి. బాల సాహిత్యం, హాస్య కథలు రాయటం చాలా ఇష్టం.


58 views1 comment

댓글 1개


కథ బాగుంది పెళ్ళికాని ప్రమోద్ కొరకే దిగులు పెళ్ళి ఎప్పుడా అని--అభినందనలు.

좋아요
bottom of page