top of page

రఘుపతి రాఘవ రాజారాం ఎపిసోడ్ 2


'Raghupathi Raghava Rajaram Episode 2 - New Telugu Web Series Written By Parupalli Ajay Kumar

'రఘుపతి రాఘవ రాజారాం ఎపిసోడ్ 2' తెలుగు ధారావాహిక

రచన: పారుపల్లి అజయ్ కుమార్

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ

కాలేజీ లెక్చరర్ గా పని చేస్తుంటాడు రఘుపతి.

కాలేజ్ దగ్గర స్పృహ కోల్పోయి పడున్న స్త్రీని చూస్తాడు.

ఆ యువతిని గ్రామంలో తమ ప్రత్యర్థి సీతయ్య బావమరిది శేషగిరితో చూసినట్లు పోలీసులతో చెబుతాడు.

స్పృహ వచ్చిన ఆయువతి తనని శేషగిరి, అతని స్నేహితులు సామూహిక అత్యాచారం చేసినట్లు చెబుతుంది.

ఇక రఘుపతి రాఘవ రాజారాం ఎపిసోడ్ 2 చదవండి..


వెంకటాయపాలెం లో మోహన్ గాంధీ మోతుబరి రైతు.

గాంధీ తండ్రి బలరామయ్య స్వాతంత్ర సమరంలో పాల్గొన్నాడు.

పక్కా గాంధేయవాది. లేక లేక పుట్టిన తన కొడుకుకు జాతిపిత గాంధీ గారి పేరు పెట్టుకున్నాడు.

మహాత్మా గాంధీ ఆశయాలను తాను త్రికరశుద్ధిగా పాటిస్తూ వాటిని కొడుకు కు నూరి పోసేవాడు.


గాంధీకి తండ్రి అంటే వల్లమాలిన ప్రేమ. తండ్రి మాటను ఎప్పుడూ జవదాటలేదు. సత్యం, అహింస మొదలైన సుగుణాలన్నీ తండ్రినుండి పుణికి పుచ్చుకున్నాడు. గాంధీ భార్య సత్యవతి కూడా భర్తకు తగ్గ ఇల్లాలే. మామగారిని తండ్రిలా ఆదరించి గౌరవించేది.


గాంధీకి ముగ్గురు మగపిల్లలు.


బలరామయ్య వారికి రఘుపతి, రాఘవ, రాజారాం అని పేర్లు పెట్టాడు. ముగ్గురూ తాతగారి స్వాతంత్ర పోరాట కథలను వింటూ పెరిగారు. ముగ్గురిలో రఘుపతి నెమ్మదైన వాడు. రాఘవ కొద్దిగా ఆవేశపరుడు. రాజా మధ్యస్తంగా వుండేవాడు.


రఘుపతి M . sc . చదివి కాలేజ్ సర్వీస్ కమీషన్ పరీక్ష పాస్ అయి మండల కేంద్రం లో వున్న ప్రభుత్వ జానియర్ కాలేజీలో జూనియర్ లెక్చరర్ గా పని చేస్తున్నాడు.


రాఘవ ఇంటర్ తో చదువుకి స్వస్తి పలికి వ్యవసాయం చేస్తున్నాడు.


రాజారాం మెకానికల్ ఇంజనీరింగు ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు.


ముగ్గురు అన్నదమ్ములు ఒకేమాట, ఒకే బాట అన్నట్లుగా వుంటారు. ఒకరంటే ఒకరికి ఎనలేని ప్రేమ. అనురాగాలకు, అనుబంధాలకు ఆ ఇల్లు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తుంది.


ఉద్యోగం రాగానే రఘుపతికి పెళ్ళి చేసారు. విశాల డిగ్రీ చదివింది. ఉమ్మడి కుటుంబంలో పెద్దకోడలిగా బాగా కలిసిపోయింది.


రాఘవ, రాజా వదిన దగ్గర బాగా గారాలు పోతారు. ఏది కావలసిన ముందుగా వదినకే చెపుతారు.

విశాల కూడా వారి కోరికలను నవ్వుతూ నెరవేరుస్తుంది. తల్లి తండ్రులతో, అన్నతో పంచుకోలేని విషయాలను కూడా వదినతో చెపుతుంటారు.


రఘుపతి పెళ్ళి అయిన సంవత్సరానికి బలరామయ్య చనిపోయాడు. రఘుపతి, విశాలలకు ఒక పాప పల్లవి, ఒక బాబు తిలక్, ఫస్ట్ క్లాస్, LKG చదువుతున్నారు.


పిల్లలకి తండ్రి దగ్గరకన్నా బాబాయిల దగ్గర చనువు ఎక్కువ. వాళ్ళ చంకనెక్కి బాగా అల్లరి చేస్తుంటారు. బాబాయిలను యక్ష ప్రశ్నలతో పీకి పాకం పెడుతుంటారు.


రాఘవకు సంబంధాలు చూస్తున్నారు. రాఘవ అన్నను, తల్లితండ్రులను, వున్న ఊరిని వదిలి వుండనన్నాడు. పెళ్లికూతురుతో అదే విషయాలను చెప్పేవాడు. కాలేజీ చదువులు చదివిన అమ్మాయిలు ఉమ్మడి కుటుంబంలో భాగస్వామ్యం కావటం ఇష్టపడక రెండు మూడు సంబంధాలూ వెనక్కుపోయాయి.


రాజా ఇంజనీరింగు చదువుతుండగానే కొన్ని కంపెనీలు జరిపిన కాంపస్ ఇంటర్వ్యూలకు అటెండ్ అయి సెలెక్ట్ అయ్యాడు. తన కెపాసిటీ తెలుసుకోవాలనే వాటికి అటెండ్ అయ్యాడు. కానీ రాజాకు చదువు పూర్తికాగానే స్వంత ఊర్లోనే ఒక పరిశ్రమను స్థాపించి ఊరు లోని నిరుద్యోగ యువతకు బాసటగా నిలవాలని కోరిక.


అన్నలిద్దరూ కూడా రాజాకి మద్దతు పలికారు. ఒకరిద్దరు స్నేహితులు అబ్రాడ్ వెళితే భవిష్యత్తు, కెరీర్ చాలా బాగుంటాయని చెప్పినా ఉన్నవూరిని, అయినవాళ్లను ముఖ్యంగా అన్నలిద్దరినీ వదిలి వెళ్ళటం ఇష్టంలేక ఆ వైపుగా ఆలోచనలే చేయలేదు.


రోజూ సాయంత్రం కాలేజీ వదలగానే హాస్పిటల్ కు వెళ్లి కమల ఆరోగ్యం గురించి వాకబుచేసి ఆమెను పలకరించి వెళుతున్నాడు రఘుపతి.


శేషగిరి బెయిల్ కోసం సీతయ్య ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. అతను బయటకు వస్తే సాక్షాలను తారుమారు చేస్తాడని పోలీసుల తరుఫున గట్టిగా వాదించాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్.

దాంతో మేజిస్ట్రేట్ గారు అతనికి బెయిల్ నిరాకరించారు. పదునాలుగు రోజుల జ్యూడిషియల్ కస్టడీ విధించి జైలుకు పంపారు. కేసు ఎందుకనో నత్తనడక లా నడుస్తుందని అనిపించింది రఘుపతికి.


హాస్పిటల్ నుండి డిస్చార్జ్ చేసాక ఎక్కడికి వెళతావని కమలని అడిగాడు రఘుపతి. కమల మేనమామ ఇంటికి గానీ, ఆశ్రమానికి గానీ వెళ్ళటానికి ఇష్టపడలేదు. ఎక్కడన్నా గౌరవంగా ఉండేచోట పని ఇప్పిస్తే చేస్తానని రఘుపతితో అన్నది.


ఆ రోజే తన యింట్లో ఈవిషయం పై కుటుంబ సభ్యులందరితోమాట్లాడాడు. పదిరోజుల తరువాత కమలను హాస్పిటల్ నుండి డిస్చార్జ్ చేసారు.


కమలతో "నీకు ఇష్టమయితే మా ఇంట్లోవుండి ఇంటిపనులు చేసుకోవచ్చు. వచ్చి ఒక రెండు రోజులు ఉండి చూడు. నీకునచ్చితే అక్కడే ఉండవచ్చు. లేకుంటే తరువాత ఇక్కడైనా పని దొరికితే చూద్దాం" అన్నాడు.


కమల సంతోషంతో వొంగి రఘుపతి కాళ్ళకు దండం పెట్టింది. రఘుపతి ఇదేం పని అని కోప్పడుతూ ఆమెను లేవనెత్తాడు.


కమలను తీసుకుని పోలీస్ స్టేషను కు వెళ్ళి SI ప్రభాకర్ కు విషయం చెప్పి కేసు సంగతి ఎప్పటికప్పుడు తెలియచేయమని చెప్పి కమలను ఇంటికి తీసుకువచ్చాడు.


విశాల కమలను లోనికి తీసుకెళ్లి సర్వెంట్ రూం చూపించి, కమలకు కావలసిన బట్టలు అవీ ఇచ్చింది. అప్పటినుండి కమల, విశాలను కూర్చోబెట్టి తనే అని పనులు చేయసాగింది.


నెల రోజుల తరువాత ఒక రోజు హీరో స్ప్లెండర్ ప్లస్ మీద వచ్చిన రఘుపతి బైక్ స్టాండు వేసి ఇంట్లోకి వచ్చాడు.


" విశాలా" అని పిలుస్తూ హాల్లో వున్న సోఫాలో కూర్చున్నాడు.


విశాల మంచినీళ్ల గ్లాసుతో వచ్చింది.


నీళ్ళు త్రాగి గ్లాసు టీపాయ్ మీద పెట్టి

"ఎవరూ లేరా యింట్లో? ఇంత నిశ్శబ్దంగా వుంది." అని అడిగాడు.


"పిల్లలిద్దరూ ఆటలకు వెళ్ళారు. రాజు కాలేజీ నుండి ఇంకా రాలేదు.

రాఘవ పొలం దగ్గర వున్నాడు. మామయ్య, అత్తయ్య గుడిలో పురాణకాలక్షేపం వుందని వెళ్ళారు. స్నానం చేసిరండి. కమల పకోడీ పిండి కలిపి వుంచింది. వేడివేడీగా పకోడీలు వేస్తుంది." చెప్పింది విశాల.


రఘుపతి సోఫాలో నుండి లేచి తన గదిలోకి వెళ్లబోయే సరికి పాలేరు సాంబయ్య పరుగుపరుగున వచ్చి


"బాబుగారూ ! తమ్ముడుగారు రోడ్డు పక్కన వున్న మన పొలం దగ్గర సీతయ్య గారితో గొడవ పడుతున్నాడు. ఇద్దరూ కొట్టుకునేలా ఉన్నారు. మీరు రావాలి" అని చెప్పాడు.


అది వినగానే రఘుపతి ఆదుర్దాగా "పద వెళదాం" అంటూ బైక్ తీసి స్టార్ట్ చేసాడు. సాంబయ్య వెనుక కూర్చోగానే బైక్ ను ముందుకు దూకించాడు.


రఘుపతి మనసు ఆందోళనతో నిండిపోయింది. తన బావమరిది జైలు పాలు కావటానికి తానే కారణమని సీతయ్య ఆనాడు కోర్టు అవరణలో కోపంగా అన్న మాటలు గుర్తుకొచ్చాయి. ఈ నెల రోజులనుండి చడీచప్పుడు చేయకుండా వుంటే తాను ఆ సంగతులను అంతగా పట్టించుకోలేదు.


అక్కడికీ తాను తమ్ముళ్ళతో కొంతకాలం పాటు సీతయ్య విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. రాజా సరేనన్నాడు. రాఘవ 'అతనేం చేస్తాడు మనల్ని' అంటూ తేలికగా తీసుకున్నాడు.


సీతయ్య పగబట్టిన పాము లాంటివాడు. రాఘవకేం ప్రమాదం తలపెట్టాడో అని అనుకుంటూ బైక్ వేగాన్ని మరికాస్త పెంచాడు.


సీతయ్య తో పోల్చుకుంటే రాఘవ యువకుడు, బలాఢ్యుడు. రాఘవకేం కాదని మనసులో దైర్యం వున్నా, ఆవేశపరుడైన రాఘవ, సీతయ్యకు ఏదైనా ప్రమాదంతలపెడితే.. ఆలోచించలేక గట్టిగా తలవిదిల్చాడు రఘుపతి.


వూరి చెరువు నుంచి రఘుపతి వాళ్ల పంట పొలాలకు వెళ్తున్న పిల్ల కాలువను సీతయ్య మట్టితో కప్పివేశాడు. పొలానికి వచ్చిన రాఘవ అదిచూసాడు. వెంటనే పార పట్టుకొని కాలువలో దిగి పాలేరు సాంబయ్య తో పాటు మట్టిని తొలగిస్తుండగా, సీతయ్య వచ్చి అడ్డుకున్నాడు.


దీంతో ఇరువురి మధ్య గొడవ మొదలైంది. ఇద్దరూ పెద్దగా అరుచుకుంటుండగానే సాంబయ్య పరుగున వెళ్ళి రఘుపతితో చెప్పడం జరిగింది. రఘుపతి పొలం దగ్గరకి చేరుకునేసరికి రాఘవ, సీతయ్య ఇద్దరూ ఒకరినొకరు తోసుకుంటూ కలబడుతున్నారు.


ఇద్దరూ ఆ పొలాన్ని ఆగమాగం చేసేశారు. రాఘవ సీతయ్య ను బలంగా తోసేశాడు.

సీతయ్య క్రిందపడుతు రాఘవ చొక్కా గట్టిగా పట్టుకోవడం తో రాఘవ కూడా అదాటున సీతయ్య మీద పడ్డాడు. వెంటనే ఒక్క ఉదుటున లేచి నిలబడ్డాడు రాఘవ. ప్రక్కనే వున్న కర్ర అందుకుని సీతయ్య తలపై గట్టిగా మోదబోయాడు.


"రాఘవా! ఆగు" అంటూ రఘుపతి ఉరుక్కుంటూ అడ్డు వచ్చి సీతయ్యను ప్రక్కకితోసేసాడు.

సీతయ్య క్రిందపడటం, సీతయ్యకు తగలాల్సిన కర్ర దెబ్బ రఘుపతి తలపై బలంగా తగలటం ఒక్కసారిగా జరిగి పోయింది.


"అమ్మా" అంటూ రఘుపతి నేల కూలాడు. తలచిట్లి నెత్తురు ప్రవాహంలా బయటికి వచ్చింది.


రాఘవ ఒక్కక్షణం నిశ్చేష్టుడై నిలబడి పోయాడు. మరుక్షణం తెప్పరిల్లి "అన్నయ్యా" అంటూ రఘుపతి తలను తన వడిలోకి తీసుకున్నాడు.


కారుతున్న రక్తానికి తన కండువాను అడ్డుగా వుంచాడు. ఈ అదనులో సీతయ్య అక్కడినుండి పారిపోయాడు. రాఘవ సెల్ తీసి 108 కు కాల్ చేసాడు.


సాంబయ్య మాటలు రాని వాడిలా నిలబడిపోయాడు.

========================================================================

ఇంకా వుంది..


========================================================================

పారుపల్లి అజయ్ కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

Podcast Link:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

నా పేరు పారుపల్లి అజయ్ కుమార్ ...

పదవీ విరమణ పొందిన ప్రభుత్వ జూనియర్ అధ్యాపకుడుని ...

ఖమ్మం జిల్లా, ఖమ్మం పట్టణ వాసిని ...

సాహిత్యం అంటే ఇష్టం .... కథలు,

నవలలు చదవటం మరీ ఇష్టం ...

పదవీ విరమణ తరువాత నా సహచరి దుర్గాభవాని సహకారంతో ఖమ్మం లో

"పారుపల్లి సత్యనారాయణ పుస్తక పూదోట - చావా రామారావు మినీ రీడింగ్ హాల్ " పేరిట ఒక చిన్న లైబ్రరీని మా ఇంటి క్రింది భాగం లో నిర్వహిస్తున్నాను ..

షుమారు 5000 పుస్తకాలు ఉన్నాయి .

నిరుద్యోగ మిత్రులు ఎక్కువుగా వస్తుంటారు ..

రోజుకు 60 నుండి 70 మంది దాకా వస్తుంటారు ...

ఉచిత లైబ్రరీ ....

మంచినీరు ,కుర్చీలు ,రైటింగ్ ప్యాడ్స్ ,వైఫై ,కరెంటు అంతా ఉచితమే ...

ఉదయం 6 A M నుండి రాత్రి 10 P M దాకా ఉంటారు ...మనసున్న

మనిషిగా నాకు చేతనైన సాయం నిరుద్యోగ మిత్రులకు చేస్తున్నాను. ఇప్పుడిప్పుడే కొంతమందికి జాబ్స్ వస్తున్నాయి.




31 views0 comments
bottom of page