'Raghupathi Raghava Rajaram Episode 3 - New Telugu Web Series Written By Parupalli Ajay Kumar
'రఘుపతి రాఘవ రాజారాం ఎపిసోడ్ 3' తెలుగు ధారావాహిక
రచన: పారుపల్లి అజయ్ కుమార్
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ
కాలేజీ లెక్చరర్ గా పని చేస్తుంటాడు రఘుపతి. కాలేజ్ దగ్గర స్పృహ కోల్పోయి పడున్న స్త్రీని చూస్తాడు. ఆ యువతిని గ్రామంలో తమ ప్రత్యర్థి సీతయ్య బావమరిది శేషగిరితో చూసినట్లు పోలీసులతో చెబుతాడు.
స్పృహ వచ్చిన ఆ యువతి తన పేరు కమల అనీ తనని శేషగిరి, అతని స్నేహితులు సామూహిక అత్యాచారం చేశారనీ చెబుతుంది. కమలకు తన ఇంట్లో ఆశ్రయం కల్పిస్తాడు రఘుపతి.
రాఘవ, సీతయ్య ల ఘర్షణలో అడ్డు వెళ్లిన రఘుపతి గాయం అవుతుంది.
ఇక రఘుపతి రాఘవ రాజారాం ఎపిసోడ్ 3 చదవండి..
పొలంలో సీతయ్యతో గొడవ పడుతుండగా తనచేతి కర్ర దెబ్బ అన్నయ్య తలను చీల్చటం చూసి బాధతో కృంగి పోయాడు రాఘవ.
హాస్పిటల్ లో చేర్చాక రక్తం కావాలంటే తనే ఇచ్చాడు.
రాజా ఇస్తానన్నా వద్దని మొండికేసి ఎంత రక్తం కావాలన్నా తన శరీరం నుండే తీయాలని ఏడుస్తూ డాక్టర్ కు మొరబెట్టుకున్నాడు.
రఘుపతికి స్పృహ వచ్చేదాకా పచ్చి మంచినీళ్లు కూడా ముట్టనన్నాడు. కంటికీమంటికీ ఏకధాటిగా ఏడుస్తూనే వున్నాడు.
అన్నయ్యను కొట్టిన చేయి వుండకూడదని హాస్పిటల్ లో తలుపు సండులో చేయి పెట్టి తలుపు బలంగా లాగబోయాడు. రాజా చూసి ఆపుచేసాడు. అప్పటినుండి ఎవరోఒకరు నిరంతరం రాఘవను కనిపెట్టుకొని వుండేవారు.
మగత వీడి రఘుపతి నెమ్మదిగా కళ్ళు తెరిచాడు.
చుట్టూ పరికించాడు.
ICU లో బెడ్ మీద వున్నాడు.
చేతికి సెలైన్ పెట్టివుంది.
తలంతా దిమ్ముగా, భారంగా వుంది. రఘుపతి కళ్ళు తెరవటం చూసి ప్రక్కనే వున్న నర్స్" డాక్టర్" అంటూ డ్యూటీలో వున్న డాక్టర్ ను పిలిచింది.
డాక్టర్ వచ్చి రఘుపతిని చూసాడు.
BP చెక్ చేస్తూ" మీ పేరు?"అడిగాడు.
" రఘుపతి" నీరసంగా బదులు పలికాడు రఘుపతి.
"గుడ్. చాలా త్వరగా రికవరీ అవుతున్నారు. ప్రస్తుతం మీరు ICU లో వున్నారు. రేపుగానీ, ఎల్లుండి గానీ జనరల్ రూం కి షిఫ్ట్ చేస్తాము. అంతవరకు మీరు ఎవరితో ఎక్కువుగా మాట్లాడకూడదు. మీకు స్పృహ వచ్చిందని మీ వారికి చెపుతాను. టేక్ రెస్ట్" అని డాక్టర్ ఇవ్వవలసిన మందులు, ఇంజక్షన్లు నర్స్ కు చెప్పి బయటికి నడిచాడు.
అక్కడ వేచివున్న రఘుపతి కుటుంబ సభ్యులకు
రఘుపతి స్పృహలోకి వచ్చిన విషయం చెప్పాడు.
రఘుపతి కి స్పృహ వచ్చిందన్న వార్త విని అందరూ వూపిరి పీల్చుకున్నారు.
"యిక మీరంతా ఇంటికెళ్లి రేపురండి. వారి మిసెస్ ఒక్కరు ఇక్కడ వుంటారు." అని చెప్పాడు. రాఘవ తాను కూడా ఆసుపత్రిలోనే వుంటానన్నాడు.
రాఘవ అన్నయ్య కాళ్ళపై పడి ఏడుస్తూ వుండిపోయాడు.
విశాలే అతన్ని దగ్గరకు తీసుకుని ఓదార్చింది.
*******************************
తెల్లవారి రఘుపతి ని జనరల్ రూం కు షిఫ్ట్ చేసారు.
హాస్పిటల్ కి SI ప్రభాకర్ వచ్చాడు రఘుపతిని వెతుక్కుంటూ.
"ఎలా వున్నారు?" అని అడిగాడు.
"ఫరవాలేదు. బాగానే వున్నాను."
"ఎవరు మిమ్ములను కొట్టింది?"
రఘుపతి ఏం మాట్లాడలేదు.
"మిమ్ములని కొట్టింది మీ తమ్ముడేనా ?" అని అడిగాడు.
రఘుపతి "ఎవరు చెప్పారు?" అన్నాడు.
"ఎవరో ఫోన్ చేసిచెప్పారు. పేరు చెప్పలేదు. ఈ హాస్పిటల్ లో వున్నారని చెప్పాడు. హాస్పిటల్ కు ఫోన్ చేస్తే డాక్టర్ ఇక్కడ వున్నారని చెప్పాడు. చెప్పండి ఎవరు కొట్టారు మిమ్మల్ని?"
రఘుపతి కి అర్థమయింది సీతయ్య ఫోన్ చేసివుంటాడని.
దూరంగా నిలబడి వున్న రాఘవ ముందుకు రాబోయాడు.
అదిచూసి కంటి సైగ తోనే అతన్ని ఆపేసాడు రఘుపతి.
రాఘవ భుజాన్ని గట్టిగా పట్టుకొని ముందుకు పోకుండా ఆపాడు రాజా.
"నన్ను ఎవరూ కొట్టలేదు. పొలం గట్టుమీద నడుస్తుంటే కాలుజారి క్రిందపడ్డాను. క్రిందపడ్డప్పుడు నా తల అక్కడ పాతివున్న రాయికి తగిలింది."
"మరి, డాక్టరు వేరే రకంగా చెపుతున్నాడు. మీతలమీద తగిలింది గట్టి కర్రదెబ్బ అని.."
చెపుతున్న SI ను ఆపుచేస్తూ, "చూడండి SI గారు.. దెబ్బ తగిలింది నాకు. నా స్టేట్మెంట్ కావాలంటే నేను చెప్పింది రాసుకోండి. నేను కంప్లయింట్ చేయకుండానే మీరు కేసు ఎలా ఫైల్ చేస్తారు? ఎవరో ముక్కూ మొఖం తెలియని వ్యక్తి ఫోన్ చేస్తే ఇలా వచ్చామన్నారు. మరి దెబ్బ తగిలిన నేను మీ ఎదురుగా వున్నాను. నేను చెప్పింది రాసుకోటానికి మీకేమిటి అభ్యంతరం ?
మా తమ్ముడు కొట్టాడని ఎవరో ఫోన్ చేస్తే వచ్చారు. ఇప్పుడు నేను వేరే ఎవరిపేరైనా చెపితే వారిని మీరు అరెస్టు చేస్తారా?
నాకు తెలుసు మీకెవరు ఫోన్ చేశారో! బావమరది శేషగిరిని నేను జైలుకు పంపాననే అపోహతో సీతయ్యే మీకు ఫోన్ చేసి వుంటాడు. మా కుటుంబం మీద కక్షతో మిమ్ములను మిస్ లీడ్ చేస్తున్నాడు.
మీకు తెలుసు నా గురించి. ఒక్కసారి మా వూరికి వెళ్ళి ఎవరినయినా అడగండి మా అన్నదమ్ముల గురించి.
ఏం చెపుతారో వినిరండి. రామాయణంలో వనవాసం కాలంలో రాముడు, భరతుడు వేరువేరు గా గడిపారు పదునాలుగు ఏళ్ళ పాటు..కానీ అన్నదమ్ములమైన మేము మాత్రం ఒక్క రోజు కూడా వేరుగా ఉండలేదు. వుండబోము..మా ముగ్గురిదీ ఒకే రక్తం ..ఒకే మాట.. ఒకే బాట.. వెళ్లండి.. ఇంకెప్పుడూ చెప్పుడు మాటలు విని మా దగ్గిరకు రాకండి.."
రఘుపతి ఆవేశంగా అన్నాడు.
SI ప్రభాకర్ ఏం మాట్లాడలేక మౌనంగా అక్కడినుండి వెళ్ళిపోయాడు.
రఘుపతి తమ్మున్ని తన మంచం మీద కూర్చోమని నెమ్మదిగా చెప్పసాగాడు.
"చూసావా రాఘవా సీతయ్య చేసింది. కాలికేస్తే మెడకు, మెడకేస్తే కాలికి వేసే రకం. ఇదే దెబ్బ సీతయ్య కు తగిలివుంటే ఈపాటికి నువ్వు ఎక్కడుండే వాడివి?
నేను ముందే నిన్ను హెచ్చరించాను. కొన్ని రోజులపాటు సీతయ్య జోలికి వెళ్ళవద్దు అని. నీ ఆవేశం తగ్గించుకోమని ఎన్నోసార్లు చెప్పాను."
"అదికాదు అన్నయ్యా ! ఆ రోజు సీతయ్య మన పొలానికి వచ్చే నీళ్ళను ఆపుచేసాడు. అది చూసి.." అంటూ చెప్పబోతున్న రాఘవను ఆపు చేస్తూ
"అతను అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. కవ్వించి కాలు దువ్వుతున్నాడు. నాలుగు దెబ్బలు తిని అయినా నీ నాశనం చూడాలనే అలాచేసాడు. ఇకనైనా కొద్దిగా ఆవేశం తగ్గించుకుని జాగ్రత్తగా వుండు అతని విషయంలో" అన్నాడు రఘుపతి.
రాముడు మంచి బాలుడు లా తలవూపాడు రాఘవ.
*********************************
రఘుపతి హాస్పిటల్ నుండి డిస్చార్జ్ అయి యింటికి వచ్చాడు. రఘుపతి బాగానే కోలుకున్నాడు.
కానీ రాఘవ ఇంకా అపరాధభావంతో కుమిలిపోతున్నాడు.
అందరూ నువ్వు కావాలని చేసింది కాదు, నీ తప్పేమీ లేదని వూరడించినా కోలుకోలేకపోతున్నాడు.
అన్నం కూడా సరిగా తినటంలేదు. రోజులో ఎక్కువకాలం విచారంగా ఉంటున్నాడు. ఏదో తప్పు చేసిన భావనతో కుమిలిపోతున్నాడు. సర్వం కోల్పోయినట్లు ఉంటున్నాడు.
రాఘవకు ఎవరినీ కలవాలనే ఆసక్తి ఉండకపోవడం, దేనిమీదా ధ్యాస లేకపోవడం గమనించాడు రఘుపతి. ఇంతకుముందు ఎంతో ఇష్టపడి చేసే పనులను చేయటానికి కూడా ముందుకురావటం లేదు. స్నేహితులను దూరంగా పెట్టడం చేస్తున్నాడు.
ఇవన్నీ డిప్రెషన్ కు దారితీస్తాయని రఘుపతి అతన్ని వెంటపెట్టుకొని ఫేమస్ సైక్రియాట్రిస్టు దగ్గరికి తీసుకెళ్ళాడు.
రెండు మూడు కౌన్సిలింగుల తరువాత రాఘవ కొద్దిగా తేరుకున్నాడు.
ఆ సంవత్సరం సంక్రాంతి పండుగను పెద్దఎత్తున జరపాలని రఘుపతి తమ్ముళ్ళతో చెప్పాడు. ఈ వంకన అన్నా రాఘవ మళ్ళీ మునుపటిలా ఉషారుగా వుంటాడని అనుకున్నాడు.
సంక్రాంతికి జరిగే ఎడ్ల పందాలలో రాఘవకు ఎదురే లేదు.
"మరలా మనమే గెలవాలి రాఘవా" అన్నాడు రఘుపతి.
రాఘవకు అన్నమాట వేదవాక్యం లాంటిది. రాఘవ ఆ ఏర్పాట్లలో మునిగిపోయాడు.
రాజాను ప్రక్కకు పిలిచి సీతయ్య మీద ఒక కన్నేసి ఉండమన్నాడు. ఎడ్లపందాలకు సీతయ్య రూపంలో ఎటువంటి అవరోధం రాకుండా చూడమన్నాడు.
రాజా సరేనన్నాడు.
వెంకటాపురం ఎడ్ల పందాలకు జిల్లాలో బాగా పేరు వున్నది.
ఇందులో అన్ని మండలాల నుండి ఎడ్ల జతలు పాల్గొంటాయి.
సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ పోటీలను గ్రామ పొలిమేరలో ఉన్న పెద్ద ఖాళీ స్థలంలో నిర్వహిస్తారు.
ఘళ్ళు, ఘళ్ళు మని శబ్దం చేసుకుంటూ ఎద్దుల బండ్లన్నీ ఒక వరుసలో నిలుచున్నాయి. ఎద్దుల మెడలోని గంటలు వాటి నడకకు లయబద్దంగా మ్రోగుతున్నాయి.
మొదటగా పోటీలో పాల్గొనే బండ్లన్నీ ఊళ్ళో ఉన్న శివాలయం వద్దకు చేరుకున్నాయి. పోటీదారులందరు శివాలయంలోకి వెళ్ళి
ఆలయ ప్రాంగణంలో గల నందీశ్వరునికి తలవంచి నమస్కరించారు.
ఎవరి బండ్లకు సంబంధించిన వారు తమ బండ్లకు కట్టివున్న ఎడ్లకు కుంకుమ దిద్ది హారతులిచ్చారు. రాఘవ ఎడ్లబండికి విశాల వచ్చి ఎడ్లకు కుంకుమ దిద్ధి వాటికి నమస్కరించింది. రాఘవ నుదిటిన కుంకుమ దిద్ది ఆశీర్వదించింది. హారతి వెలిగించి ఎద్దుల ముందు మూడు సార్లు తిప్పింది. రఘుపతి, గాంధీ గారు కూడా వచ్చి రాఘవకు ఆశీస్సులు అందచేశారు.
అనంతరం పోటీదారులు బండ్లపై నిలబడి చేర్నాకోలను గాలిలో ఊపుకుంటూ "హరహర మహాదేవ.. శంభోశంకరా" అంటూ నినాదాలిచ్చుకుంటూ.. మూడు ప్రదక్షిణాలు చేసి మైదానం చేరుకున్నారు..
ఆ తరువాత ఎం. ఎల్. ఎ. వీరబాబు జెండా ఊపి పోటీలను ప్రారంభించాడు.
ఎప్పటిలానే ఆ సంవత్సరం కూడా
ఎడ్ల పందాలలో ప్రధమ స్థానంలో నిలిచాడు రాఘవ.
రఘుపతి ' శభాష్' అంటూ భుజం తట్టేసరికి నిలువెల్లా పులకించిపోయాడు రాఘవ.
ప్రతీయేటా ఇదే గ్రామంలో పోటీలు జరగడం ఆనవాయితీగా వస్తోందని గ్రామ సర్పంచి గోపాలరావు అన్నారు. ఎమ్మెల్యే వీర బాబు ముఖ్య అతిధిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. రాఘవ తన బహుమతిని అన్న రఘుపతి అందుకుంటాడని చెప్పాడు.
రఘుపతి, రాజాను కూడా తీసుకెళ్ళి ముగ్గురన్నదమ్ములు కలసి బహుమతి ని అందుకున్నారు గ్రామప్రజల హర్షద్వానాల మధ్య.
ఈ పోటీలకు వివిధ మండలాల నుండి వచ్చిన వారికి సౌకర్యాలను, భోజన ఏర్పాట్లను గాంధీ కుటుంబం కల్పించారు.
ఎమ్మెల్యే వీరబాబు పాడి రైతులను ఘనంగా సత్కరించారు.
గ్రామంలో జరిగే ఎడ్ల పరుగు పోటీలకు అన్ని మండలాల నుండి ఎడ్ల జతలు రావడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే వీరబాబు అన్నారు.
సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. రాబోవు కాలంలో పాడి రైతులకు మరిన్ని పథకాలు అందజేసేందుకు కృషి చేస్తామన్నారు.
ఎడ్ల పందాల నిర్వహణకు చేయూతనిచ్చిన గాంధీ గారి కుటుంబాన్ని కొనియాడారు.
అందరూ వెళ్లిపోయే దాకా వుండి ఎవరికీ ఏ అసౌకర్యం కలగకుండా చూసి రమ్మని రాజాకు చెప్పి మిగిలిన కుటుంబ సభ్యులందరూ ఇంటికి వెళ్ళారు.
రాజా సరేనని చెప్పి పోటీలకు వచ్చిన అందరూ వెళ్లిపోయే వరకూ వున్నాడు. అంతా అయి ఇంటికి పోయేసరికి రాత్రి తొమ్మిది గంటలు అయింది.
ఇంట్లోకి వెళుతూనే అందరూ హాలులో కూర్చొని వుండటం చూసాడు. ఒక ప్రక్కగా కూర్చొని వున్న కళ్యాణిని చూస్తూనే ఒక్కక్షణం అలానే నిలబడిపోయాడు.
========================================================================
ఇంకా వుంది..
========================================================================
పారుపల్లి అజయ్ కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
Podcast Link:
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
నా పేరు పారుపల్లి అజయ్ కుమార్ ...
పదవీ విరమణ పొందిన ప్రభుత్వ జూనియర్ అధ్యాపకుడుని ...
ఖమ్మం జిల్లా, ఖమ్మం పట్టణ వాసిని ...
సాహిత్యం అంటే ఇష్టం .... కథలు,
నవలలు చదవటం మరీ ఇష్టం ...
పదవీ విరమణ తరువాత నా సహచరి దుర్గాభవాని సహకారంతో ఖమ్మం లో
"పారుపల్లి సత్యనారాయణ పుస్తక పూదోట - చావా రామారావు మినీ రీడింగ్ హాల్ " పేరిట ఒక చిన్న లైబ్రరీని మా ఇంటి క్రింది భాగం లో నిర్వహిస్తున్నాను ..
షుమారు 5000 పుస్తకాలు ఉన్నాయి .
నిరుద్యోగ మిత్రులు ఎక్కువుగా వస్తుంటారు ..
రోజుకు 60 నుండి 70 మంది దాకా వస్తుంటారు ...
ఉచిత లైబ్రరీ ....
మంచినీరు ,కుర్చీలు ,రైటింగ్ ప్యాడ్స్ ,వైఫై ,కరెంటు అంతా ఉచితమే ...
ఉదయం 6 A M నుండి రాత్రి 10 P M దాకా ఉంటారు ...మనసున్న
మనిషిగా నాకు చేతనైన సాయం నిరుద్యోగ మిత్రులకు చేస్తున్నాను. ఇప్పుడిప్పుడే కొంతమందికి జాబ్స్ వస్తున్నాయి.
Comments