'Raghupathi Raghava Rajaram Episode 4' - New Telugu Web Series Written By Parupalli Ajay Kumar
'రఘుపతి రాఘవ రాజారాం ఎపిసోడ్ 4' తెలుగు ధారావాహిక
రచన: పారుపల్లి అజయ్ కుమార్
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ
కాలేజీ లెక్చరర్ గా పని చేస్తుంటాడు రఘుపతి. కాలేజ్ దగ్గర స్పృహ కోల్పోయి పడున్న స్త్రీని చూస్తాడు. ఆ యువతిని, గ్రామంలో తమ ప్రత్యర్థి సీతయ్య బావమరిది శేషగిరితో చూసినట్లు పోలీసులతో చెబుతాడు.
స్పృహ వచ్చిన ఆ యువతి- తన పేరు కమల అనీ, తనని శేషగిరి, అతని స్నేహితులు సామూహిక అత్యాచారం చేశారనీ చెబుతుంది. కమలకు తన ఇంట్లో ఆశ్రయం కల్పిస్తాడు రఘుపతి.
రాఘవ, సీతయ్య ల ఘర్షణలో అడ్డు వెళ్లిన రఘుపతి గాయం అవుతుంది.
రఘుపతి కోలుకుంటాడు. అతని కోరిక మీద రాఘవ ఎడ్ల పందాలలో పాల్గొని గెలుస్తాడు.
ఇక రఘుపతి రాఘవ రాజారాం ఎపిసోడ్ 4 చదవండి..
కాలేజీకి వెళ్ళగానే నోటీసు బోర్డులో ఉన్న ఒక సమాచారం రాజారాం దృష్టికి వచ్చింది.
సాయంత్రం 5 గంటలకు కాలేజీ ఆడిటోరియంలో 'అవయవ దానం' పై కుమారి కళ్యాణి ప్రసంగం ఉంటుంది. అభిరుచి, ఆసక్తి వున్నవాళ్లు హాజరు కావచ్చు అని దాని సారాంశం.
సోషల్ సర్వీస్ మీద ఉత్సుకత చూపించే రాజా సాయంత్రం కాలేజీ క్లాసులు అయిపోగానే కొంత మంది స్నేహితులతో కలసి ఆడిటోరియం కు వెళ్ళాడు.
డయాస్ పైకి చూపు సారిస్తూనే ఒక్కక్షణం విస్తుపోయాడు రాజారాం.
ముగ్ధ మనోహర సుకుమార లావణ్యవతి, ఇరవై ఏళ్ళ లేలేత జవ్వని వున్నది అక్కడ.
ఈమేనా ఈ టాపిక్ డీల్ చేసేది అని సంశయించాడు.
కాలేజీ కుర్రవాళ్ళ సంగతి తనకు తెలుసు. ఉపన్యసించడంలో ఏమాత్రం తటపటాయించినా తాటాకులు కడతారు. పిల్లికూతలు కూస్తూ కార్యక్రమమాన్ని రసాభాస చేస్తారు. ఏ కొద్దిగో చెపుదామని వచ్చిన వారు ఆ కంగారులో అది కాస్తా మరచిపోయి అభాసుపాలవుతారు.
సన్నగా, పొడుగ్గా, చలాకీగా కనిపిస్తున్న ఆ అమ్మాయిని జాలిగా చూసాడు.
కాలేజీ ప్రిన్సిపాల్ గారు మైక్ దగ్గరకొచ్చి "చాలా చిన్న వయసు లోనే కుమారి కళ్యాణి గారు 'అవయవ దానం' అనే విషయం మీద అనర్గళంగా మాట్లాడుతున్నారు.
టీ వీ లో కూడా వీరి ఉపన్యాసాలు వచ్చాయి.
దేశం లోని చాలా యూనివర్సిటీలలో, ప్రముఖ కాలేజీలలో వీరు వందలకొద్దీ ప్రసంగాలు చేసారు.
ఎన్నో కళాశాలలు, స్వచ్చందసంస్థలు వీరిని ఆహ్వానించి వారి దగ్గర ఉపన్యసించమని కోరుతున్నారు. మన కాలేజీ ఆహ్వానాన్ని పురస్కరించుకొని ఈ రోజు మనదగ్గరకు వచ్చారు. మీరంతా వారు చెప్పేది విని ఇష్టమైన
వారు అవయవ దానానికి మీ పేర్లు రిజిస్టర్ చేసుకోవచ్చు.
ఇప్పుడు కళ్యాణి గారు మాట్లాడుతారు."
అంటూ ఆయన డయాన్ నుండి క్రిందికి దిగారు.
కళ్యాణి మైక్ దగ్గరకు వచ్చింది.
అడిటోరియం అంతా కలయచూస్తూ "సభకు నమస్కారం" అన్నది.
కోయిల గానంలా ఆమె స్వరం ఆ అడిటోరియం ను పరవశింపచేసింది.
ఆ డయాస్ మీద వున్న బోర్డ్ మీద రాసింది.
"మరణించాక కూడా జీవిద్దామిలా.."
అని.
ఆమె చెప్పటం ప్రారంభించింది.
"నా పేరు కళ్యాణి. నేను ఉస్మానియా యూనివర్సిటీ లో ఎం. ఏ. సైకాలజీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను.
నేను వయసులో చిన్నదానిని అయినా సాహసించి అవయవ దానం మీద నాలుగు మాటలు చెప్పాలని మీ ముందుకు వచ్చాను.
దానాలన్నిట్లోకెల్లా ఫలానా దానమే గొప్పదని తరచూ అంటూ ఉంటాం. సందర్భాన్ని బట్టి ఒక్కోసారి విద్యాదానమనీ, అన్నదానమనీ, ఇలా ఆ పేరు మారుతుంటుందంతే.
కానీ ఎప్పటికీ మారని గొప్పదానం ప్రాణదానం. దానికి దోహదపడేదే అవయవదానం.
మరణించిన వ్యక్తికి ఏమాత్రం పనికిరాని అవే అవయవాలు మరెందరి ప్రాణాలనో నిలబెడతాయి. అలా కాదని ఖననం చేస్తే విలువైన అవయవాలు వృథాగా మట్టిలో కలిసిపోతాయి.
దహనం చేస్తే కాలిపోతాయి.
మట్టిలో కలవడం కంటే.. కాలడం కంటే ఇతరులకు ప్రాణదానం చేయడం ఎంతో మేలని ప్రతివారిలోనూ అవగాహన కలిగినప్పుడు మరెందరో అవయవార్థులు జీవం పుంజుకొని సమాజంలో తమవంతు బాధ్యతలను పోషిస్తారు.
కులం, మతం తో సంబంధం లేకుండా, పేదా, గొప్ప అనే తేడా లేకుండా ఎవరైనా అవయవ దానం చేయవచ్చు.
అయితే క్యాన్సర్, HIV, యాక్టివ్ ఇన్ఫెక్షన్ లేదా ఇంట్రావీనస్ డ్రగ్స్‌తో బాధపడుతున్న వ్యక్తులు దానం చేయకూడదు.
మనిషి బ్రతికుండగానే అవయవాలను రక్త సంబంధీకులకు దానం చేయవచ్చు.
రక్త సంబంధీకులు అంటే అమ్మా, నాన్న, సోదరి, పాప, బాబు, భార్య. ఇందుకు ప్రభుత్వ అనుమతి అక్కర్లేదు.
బ్రతికుండగానే బంధు, మిత్రులకు అవయవదానం చేసేటప్పుడు మాత్రం ప్రభుత్వం నుంచి అనుమతి తప్పనిసరి.
ఆరోగ్యవంతులైన అన్ని వయసులవారు అవయవదానానికి అర్హులే. తన మరణానంతరం శరీరంలోని భాగాలు ఉపయోగించుకునేలా అంగీకారం తెలపవచ్చు. బంధుమిత్రుల ఆమోదంతో వీరి శరీరంలోని అవయవాలను మార్పిడి కోసం సేకరిస్తారు.
సమయానికి అవయవ మార్పిడి చేయడంలో విఫలమవడంతో దాదాపు 50 లక్షల మంది భారతీయులు ప్రతి ఏటా మరణిస్తున్నారు.
చనిపోయాక మనిషి తన శరీరంలోంచి అవయవాలు, కణజాలాన్ని దానం చేయవచ్చు. కళ్ళు, గుండె, కాలేయం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, క్లోమం, పెద్ద పేగు, చిన్నపేగులు, ఎముకలు, మూలుగను దానం చేయవచ్చు.
ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత సగటున ఆరేడుగురికి జీవితం ఇవ్వొచ్చు. చనిపోయాక అవయవాల మార్పిడి గంటల్లో జరిగిపోవాలి. గుండె ఆగి చనిపోతే కళ్లు, గుండె కవాటాలు వంటి వాటిని 6 నుంచి 24 గంటల్లోపు సేకరించవచ్చు.
రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన కేసులను ఎక్కువగా బ్రెయిన్ డెత్‌గా ప్రకటిస్తారు. వీరిని వెంటిలేటర్ నుంచి బయటకు తీసుకొచ్చేలోపు అవయవాలు సేకరించవచ్చు. బయటకు తీసుకొచ్చాక గుండె అయితే నాలుగైదు గంటలు,
కాలేయం 8-10 గంటలు, మూత్రపిండాలు 24 గంటల్లోపు సేకరించాల్సి ఉంటుంది.
మన దేశంలో ధనికుల ప్రాణానికి ఉన్నంత విలువ పేదవాడికి ఉన్నట్లు అనిపించదు. ఆర్గాన్ డోనేషన్ చేసే వాళ్లుంటే.. ఎంత డబ్బైనా చెల్లించి ధనికులు కొనుక్కోగలరు. అదే పేదవాడైతే కొనుక్కోలేడు.
అంతేందుకు ఆర్గాన్ ఫ్రీగా దొరికినా.. ఆపరేషన్, మందులకి అవసరమయ్యే ఖర్చులు కూడా భరించలేరు చాలా మంది.
అందుకే అవయవదాన ఆపరేషన్లను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావాలని కోరుతున్నా.
2012లో ఎన్నో పోరాటాల ఫలితంగా ఉమ్మడి రాష్ట్రంలో అవయవదానం, అవయవ మార్పిడిక కోసం 'జీవన్ దాన్" పేరుతో ఒక విభాగం ఏర్పాటు చేసి మార్గదర్శకాలు విడుదల చేయడం జరిగింది.
మన పక్కరాష్ట్రమైన తమిళనాడులో పేదలకు అవయవ మార్పిడి ఆపరేషన్లు ఉచితంగా చేస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది అమలు చేసే విధంగా ప్రయత్నించాలి.
ఎందరో చేసిన కృషి ఫలితంగా 2014లో హ్యుమన్ ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్ యాక్డ్ వచ్చింది.
అయితే అవయవదానం చేసిన వారికి ఉపాధి కల్పించడం ప్రభుత్వ బాధ్యతగా చూడాలని కోరుతున్నాను. అలాగే మరో మనిషికి ప్రాణం పోసే అవయవ, శరీరదాన కార్యక్రమాలపై ప్రభుత్వం దృష్టి పెట్టి ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నా.
ఎందుకంటే ఇంత చేసినా.. మన దేశంలో ఇప్పటీకి 1 నుంచి 2 శాతం మాత్రం అవయవ, శరీర దాతలు ముందుకొస్తున్నారు. అదే స్వీడన్, నెదర్లాండ్స్, డెన్మార్క్ వంటి దేశాల్లో 40 శాతం వరకూ ఉన్నారు.
ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు కొద్దిగా చైతన్యం వచ్చినా అవయవాల కోసం ప్రస్తుతం ఉన్న డిమాండ్‌తో పోలిస్తే లభ్యత తక్కువే అని చెప్పాలి.
మన పురాణాల ప్రకారం.. ఆత్మకు మరణం ఉండదు.
శరీరానికి మాత్రమే ఉంటుంది. ఆత్మ ఉన్నంతవరకే శరీరం శరీరంలా ఉంటుంది. ఒక్కసారి మరణిస్తే..
నెక్ట్స్ క్షణం నుంచి ఆ శరీరం పాడైపోతూనే ఉంటుంది. ఐతే.. కొంత టైమ్ లోపు కళ్లు, కిడ్నీలు, లివర్ వంటి కీలక అవయవాల్ని సేకరించి.. అవసరమైన, వారికి సెట్ చెయ్యడం వల్ల ఆ అవయవాలకు పునర్జన్మ ఇచ్చినట్లు అవుతుంది, అవి అమర్చిన వారి బ్రతుకుల్లో వెలుగులు విరజమ్మే అవకాశం వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.
దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రతీ సంవత్సరం ఆగస్ట్ 13న అంతర్జాతీయ అవయవదాన దినోత్సవం జరుపుతున్నారు.
అలాగే ప్రతి సంవత్సరం నవంబర్ 27 న భారతీయ అవయవ దాన దినోత్సవాన్ని జరుపుతున్నారు.
ఆ రోజున ప్రపంచ దేశాల ప్రభుత్వాలు, డాక్టర్లు, ఆస్పత్రుల నిర్వాహకులు.. అవయవ దానం గొప్పదనాన్ని వివరిస్తూ.. అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తారు."
అని కళ్యాణి రెండు క్షణాలు ఆగి మరలా చెప్పటం ప్రారంభించారు.
"18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఎవరైనా దాత కార్డుపై సంతకం చేయడం ద్వారా బ్రెయిన్ డెడ్ తర్వాత అవయవాలను దానం చేయడానికి నమోదు చేసుకోవచ్చు.
మీరు అవయవ మరియు కణజాలాన్ని దానం చేయాలనుకుంటే దాత ఫాం
(ఫాం -7 THO The Transplantation of Human Organs ) నింపి సంతకం చేసి NOTTO ( National Organ and Tissue Transplant Organization ) కు పంపవచ్చు.
అడ్రస్ ఈ బోర్డ్ మీద రాస్తాను. ఆసక్తి వున్నవాళ్ళు నోట్ చేసుకోండి. "అని అడ్రస్ బోర్డ్ మీద రాసింది.
Director (NOTTO)
4th Floor, National Institute of Pathology,
NIOP Building,
Safdarjung Hospital Campus
New Delhi-110029.
NOTTO Helpline – 1800-11-4770
Website: https://notto. gov. in
Email: dir@notto. nic. in
"మీలో అవయవదానం మీద ఆసక్తి వుంటే ఒక్కొక్కరుగా మీ పేర్లు చెప్పండి.
నేను నోట్ చేసుకుని ఈసారి వచ్చినప్పుడు ఫామ్స్ తెచ్చి మీ సంతకం తీసుకుని NOTTO కు సబ్మిట్ చేస్తాను.
ఇప్పుడు ఆన్ లైన్లో కూడా ఈ ఫామ్ పెడుతున్నారు. మీరు ఆన్ లైన్లో కూడా దీనిని నింపి పంపవచ్చు.
ఇప్పటిదాకా నేను చెప్పిన విషయాలు శ్రద్ధగా విన్నందుకు మీకు, నాకీ అవకాశాన్ని కల్పించిన కాలేజీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. "
అని ముగించగానే ఆడిటోరియం అంతా చప్పట్లతో మారుమోగింది.
అప్పటికప్పుడు ఒక వంద మంది అవయవ దానానికి పేర్లు ఇచ్చారు. అందులో రాజారాం ఒకడు.
కార్యక్రమం అయ్యాక రాజా కళ్యాణి దగ్గరకు వెళ్ళి
"మీరు విషయాన్ని డొంకతిరుగుడు లేకుండా సూటిగా, క్లుప్తంగా ఎంతవరకు చెప్పాలో అంతవరకూ చక్కగా వివరించారు. అభినందనలు" అని ప్రశంసించాడు.
బదులుగా కళ్యాణి నవ్వుతూ "థాంక్స్" అంది.
"ఈ విషయాలన్నీ నేను మాఇంట్లో, మావూళ్ళో స్నేహితులకు కూడా చెపుతాను. మీ కాంటాక్ట్ నెంబర్ చెపుతారా?" అన్నాడు.
కళ్యాణి మొబైల్ నంబర్ చెప్పగానే సెల్ లో ఫీడ్ చేసుకున్నాడు.
========================================================================
ఇంకా వుంది..
========================================================================
పారుపల్లి అజయ్ కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
Podcast Link:
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
నా పేరు పారుపల్లి అజయ్ కుమార్ ...
పదవీ విరమణ పొందిన ప్రభుత్వ జూనియర్ అధ్యాపకుడుని ...
ఖమ్మం జిల్లా, ఖమ్మం పట్టణ వాసిని ...
సాహిత్యం అంటే ఇష్టం .... కథలు,
నవలలు చదవటం మరీ ఇష్టం ...
పదవీ విరమణ తరువాత నా సహచరి దుర్గాభవాని సహకారంతో ఖమ్మం లో
"పారుపల్లి సత్యనారాయణ పుస్తక పూదోట - చావా రామారావు మినీ రీడింగ్ హాల్ " పేరిట ఒక చిన్న లైబ్రరీని మా ఇంటి క్రింది భాగం లో నిర్వహిస్తున్నాను ..
షుమారు 5000 పుస్తకాలు ఉన్నాయి .
నిరుద్యోగ మిత్రులు ఎక్కువుగా వస్తుంటారు ..
రోజుకు 60 నుండి 70 మంది దాకా వస్తుంటారు ...
ఉచిత లైబ్రరీ ....
మంచినీరు ,కుర్చీలు ,రైటింగ్ ప్యాడ్స్ ,వైఫై ,కరెంటు అంతా ఉచితమే ...
ఉదయం 6 A M నుండి రాత్రి 10 P M దాకా ఉంటారు ...మనసున్న
మనిషిగా నాకు చేతనైన సాయం నిరుద్యోగ మిత్రులకు చేస్తున్నాను. ఇప్పుడిప్పుడే కొంతమందికి జాబ్స్ వస్తున్నాయి.
Comments