top of page

నాణేనికి అటు వైపు


'Naneniki Atu Vaipu' - New Telugu Story Written By Surekha Puli

'నాణేనికి అటు వైపు' తెలుగు కథ

రచన: సురేఖ పులి

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

ఆఫీసు నుండి వచ్చిన భానుప్రకాష్ చాలా హుషారుగా కనిపించాడు. టిఫిన్ బాక్స్ కాంచన చేతికిస్తూ చెప్పాడు “షాపింగ్ వెళ్దాం, తొందరగా తయారవ్వు”.


ఎందుకు, ఏమిటీ అని ప్రశ్నించక, “కాఫీ కావాలా?” అంది.


“అఫ్కోర్స్” అంటూ చలాకీగా, జేబులోనుండి ఈమెయిల్ ప్రింట్ పేపర్ను యిస్తూ చదువమని సైగ చేసి, స్నానానికి వెళ్ళాడు.


‘డియర్ భాను, ఎలా వున్నావు? ఏం చేస్తూన్నావు? నేను గుర్తున్నానా? నువ్వు చదువు పూర్తి చేయకుండానే జాబ్ చేస్తున్నావట.. రియల్లీ యు ఆర్ సిల్లీ! ఒక రోజు మన కాలేజీ దాదా కిషన్ కలసి నీ గురించి చెప్పినప్పుడు, నీ డీటైల్స్ అడిగి తెల్సుకున్నాను. మేరేజ్ కూడా అయిందిట. నాతో చెప్పనేలేదు. ఎనివే, కంగ్రాట్స్!


ఇంతకీ అసలు విషయం.. నేను, మా వారు కల్సి పూణే వస్తున్నాం. మా వారికి కొంచెం బిజినెస్ పనుంది. మనిద్దరం ఫ్రెండ్స్ అని, కలసి చదువు కున్నామని చెప్పాను. మా వారికి హోటల్ వసతి ఇష్టం, కానీ నేనే మీ ఇంటికే వెళ్లాలని మొండి చేశాను, కొన్ని గంటలే కదా.


ముఖ్యంగా నీ భార్య ను చూడాలని చాలా వూబలాటగా వుంది. చాలా అందంగా వుందిట (నా కంటెనా?) కిషన్ చెప్పాడు. ప్లీజ్ నీ డీటైల్స్ రిప్లయ్ చేయి.


సీ యు, బై. లీలా రాణీ’


ఇందుకా యింత సంతోషం! దువ్విన తలనే దువ్వుతున్నాడు, బాడిస్ప్రేని తనకే కాకుండా కాంచన పైన స్ప్రే చేశాడు. భర్త పిచ్చి ఆనందం చూస్తుంటే భార్యకు చిరాగ్గా వున్నా, పైకి మాత్రం మామూలుగానే వుంది, ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్న వాడిలా, సీరియస్గా వుండే భర్త, అమాంతం లీలారాణీ ఈమెయిల్తో కొత్త శక్తిని పుంజు కున్న ప్రవర్తనకు ఒళ్ళు మండిపోతున్నది.


‘మేడమ్ లీలారాణీ’ తనకేమి కొత్త కాదు. పెళ్ళైన కొత్తలో ఆయన గుక్క తిప్పు కోకుండా చెప్పు కొచ్చారు. అన్ని కోణాల్లో ప్రయత్నించినా, చదువుల దేవత సరస్వతీదేవి; ప్రియురాలు లీలారాణీ అనుగ్రహం దక్కలేదట. కానీ ప్రేమ చిగుర్చు సమయంలోనే వీళ్లిద్దరి పేర్లు వివాహ పత్రికలో అచ్చు కాక పోగా కాలేజీ గోడల పైన లిఖించ బడ్డాయట.


దురదృష్టవశాత్తూ భానుప్రకాష్కు వ్యతిరేకంగా వున్న విద్యార్థులు చేసిన దుశ్చర్యకు బలై, కాలేజీ నుండి వచ్చే అంత్యంత తెలివి గల విద్యార్థుల జాబితాలోని స్కాలర్షిప్, ఉచిత విద్యా భోదన రద్దు అయిందిట. ఆర్థికంగా స్తోమత లేని భానుప్రకాష్ కాలేజీ చదువులను కొనసాగించలేక పోయాడట. ఈ వూహించని మలుపు తట్టుకోలేక లీలారాణీ ప్రేమకు వీడ్కోలు చెప్పి ప్రతాప్ అనే ధనవంతుడ్ని మరింత ధనం కట్నంగా ఇచ్చి జీవితంలో సెటిల్ అయి పోయిందిట.


ఇంటి భారం తన పైన పడినందుకు గత్యంతరం లేక ఎదుగు బొదుగు లేని ఉద్యోగంలో చేరాడుట. చేదునే ఎక్కువ చవి చూసిన భానుప్రకాష్ జీవితంలో ఇక రాజీ దశకు చేరి తనను పెళ్లి చేసు కోవాల్సి వచ్చిందిట.


****


సరైన పెళ్ళి సంబంధాలు రాక, వచ్చినా కట్నలకు తూగలేని పరిస్తితిలో కాంచన తండ్రి ముందు- వెనుక పరీక్షించి సంబంధం ఖాయం చేశారు.


“అబ్బాయి తరపు వారి నుండి ఎటువంటి కట్నకానుకల కోరికలు, లాంఛనాల పట్టింపులు లేవు. కులం, గోత్రం, రాశులు కుదిరాయి” అని కాంచన్ను పెళ్ళికి ఒప్పించారు.


కాంచన తనకంటూ ఒక చాయిస్ పెట్టుకోక, పెద్ద చదువు, అంతకు మించి సంపాదన, లగ్జరీ కారు, బోలెడు బ్యాంక్ బ్యాలెన్స్, మంచి పెంపుడు జాతి కుక్క యిలా ఎన్నో కలలకు పెద్ద సున్నా చుట్టి భానుప్రకాష్ను పెళ్లి చేసుకుంది.


చాలా సార్లు ఆడగాలనుకుంది, “లీలారాణీ పెళ్లి చేసుకుని సుఖంగా వుంది, మరి మీరేందుకని నాతో ముభావంగా వుంటా”రని. కానీ మాటలు పెదవి దాటక మౌనంగా వుండిపోయింది. తనను భార్యగా ఎప్పుడు గుర్తిస్తాడో అని కొన్నాళ్ళు ఎదురు చూసి, మానుకొని నిస్సారంగా, నిర్లిప్తంగా కాలం గడిపేస్తుంది.


ఇప్పుడు ఈ ఒక్క గదిలో వచ్చే అతిథులతో ఎలా సర్దుకోవటం? కాంచనకు ఆ క్షణంలో చాలా ఇరుగ్గా తోచింది. అతిథులు రావటం అసలు ఇష్టం లేదు, కానీ తన అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్ప లేని అశక్తత.


ఆడవాళ్ళ చీరల గూర్చి తెలియక కాంచన ఎంపిక చేయగా భానుప్రకాష్ షాపింగ్ పేరిట మూడు వేలు ఖర్చు పెట్టి చీర కొన్నాడు. చీర నాణ్యతా, రంగు, డిజైన్ అన్నీ నచ్చాయి. ఒక్కసారి కట్టుకొని హాయిగా గాల్లో తేలి పోవాలని వున్నది కాంచనకు.


ఇంటికి వస్తుంటే అన్నాడు “నీ సెలెక్షన్ చాలా బాగుంది. నెక్స్ట్ టైమ్ లోన్ తీసుకున్నప్పుడు నీకూ ఇలాంటిదే కొంటాను. ”

లోన్ అంటే అప్పు పెట్టి కొన్నాడా?


“లీలారాణీ నన్ను చాలా మార్లు చీర గిఫ్ట్ ఇవ్వమని అడిగింది”.

అది గతం, ఇప్పుడు అప్పు చేసి కొనాలా?


“ఈ చీరలో యింకా అందంగా కనబడుతుంది లీల.”

ప్రక్కనే సొగసైన భార్య కనబడ్డం లేదా? ఊహాసుందరి సోయగం కనబడుతుందా?


కణ కణ మండే నిప్పుల పైన పెట్రోల్ గుమ్మరిచ్చినట్టున్నది.


****

“కాంచన, నా మిసెస్. వీళ్ళు..” అంటూ వచ్చిన అతిధులను పరిచయం చేశాడు. చెవులకంటే కళ్ళు ప్రాణం పోసుకుని పరీక్షిస్తున్నాయి. లీలారాణీ నిజంగానే రాణీ వలె వుంది. తన భర్త పర్సనాలిటీకి సరిపోయే జోడీ!


లీలారాణీ భర్త, ఫరవాలేదు. డబ్బే ప్రధానంగా గల ఈ రోజుల్లో భాను కంటే ప్రతాప్ ధనవంతుడు అని అతని శరీర కవళికలు ప్రస్ఫుటం చేస్తున్నాయి.


భోజనాలై, ప్రతాప్ మంచమెక్కి గుర్రులో మునిగాడు. ఆ గదిలోనే కొంత భాగాన్ని పరదా కట్టి వంటింటిగా మార్చిన చోట కాంచన సాయంత్రం స్నాక్స్ కోసం పిండి కలుపుతోంది. భానుప్రకాష్, లీలారాణీ డైనింగ్ కం రీడింగ్ టేబల్ వద్ద గల రెండే కుర్చీల్లో కూర్చొని కబుర్లల్లో కాలం గడుపుతున్నారు. కాలేజీ వదిలేశాక ఎలాటి పరిస్తితుల్లో చిక్కుకున్నదీ ఈయనగారు చెబుతుంటే; పెద్దవాళ్ళు నిశ్చయించిన పెళ్ళికి ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చిందో ఆమెగారు వివరిస్తున్నది.


“భాను, ఈ అందాలరాశి, అపరంజి బొమ్మని ఎక్కడ కొన్నావ్?”


“బజార్లో మాత్రం కాదు. ” నవ్వుతూ జవాబు చెప్పాడు.


భాను ఎంత మధురంగా, తృప్తిగా నవ్వగలడు. మరొకసారి నవ్వితే బావుడ్ను.


"నా వంటి రాణులను కాదని ఏకంగా బంగారం కొట్టేసావా?"


“నువ్వే వెలుగును త్రోసిపుచ్చి బలాన్ని కోరుకున్నావు.”


కాంచన వింటున్నదనే ధ్యాసే లేదు.

అబ్బో! ఎంత పరోక్షంగా సంభాషించుకుంటున్నారు.

లీలారాణీ పైన వ్రాసిన కవితలు చదివి వినిపిస్తున్నాడు.

రాణీ నుండి ధారాళంగా వచ్చే సువాసనలు, వాటి చల్లదనం. రారాణి కోసం విశాల హృదయం నిండా పొంగి పొరలుతున్న ప్రేమ!


భగ్న ప్రేమికుడు దుఖాఃన్ని దిగమింగి మళ్ళీ నవ్వాడు.

ఈ మారు కాంచనకు భాను నవ్వు వెగటుగా తోచింది.

ఆ కంఠంలోని సౌరభాన్ని నా ముందు, నా కోసం వెదజల్లితే ఏం పోతుంది?

భర్తగా ఆ మాత్రం చేయలేడా?


****


టీల కార్యక్రమం అయింది. రేకుల షెడ్డుతో బాత్రూమ్గా నిర్మించిన చోట చిన్నగా గట్టు, ప్రక్కనే సిమెంట్ తొట్టిలో నీళ్లతో కాంచన గిన్నెలు శుభ్రం చేస్తున్నది. కూరగాయల బండి వస్తే రేపటి కోసం కూరలు కొందామని భానుప్రకాష్ బయటకు వెళ్ళి, బయట నుండి లోపలికి వస్తూ లీలారాణీ మాటలు విని ఆగిపోయాడు.


“ప్రతాప్, దిస్ ఇస్ టూ మచ్, నిద్రకు మొహం వాచినట్టు, ఆ కుక్కి మంచం చూడగానే అలా నిద్ర పోయారెంటీ?”


“నిద్ర సుఖ మెరుగదు, పడుకున్నాక బడలిక తీరి ఇప్పుడూ హాయిగా వుంది రాణీ. ”


“పడుకోవద్దనీ కాదండీ, కాస్త ఆ పర్సు తీసీ జాగ్రత్త చేయాలని తెలియదా, వూరకే అలా కోటు జేబులో పెడితే ఎలా? భానుతో మాట్లాడుతున్నానే కానీ..”


“ఏమైంది, ఎవరైనా పర్స్ తీశారా?”


“ఊహూ, తీయలేదు, కానీ వీళ్ళు అసలే దరిద్ర దేవతను ఇంట్లో పెట్టుకొని పూజిస్తున్నారు. ఆకలికి మంచీ-చెడులు కనబడవు.”


పరోక్షంగా విన్న శ్రోతలిద్దరూ ఆశ్చర్యంతో అవాక్కయ్యారు.


“నేను ముందే చెప్పాను, హోటల్ లో వుందామంటే, విన్నావు కాదు,”


“భాను యింత గతి లేని వాడని తెలిస్తే నేను మాత్రం వచ్చేదాన్నా?”


ఇకపైన వినలేక కాంచన కడిగిన గిన్నెలు తీసుకుని లోపలికి వచ్చింది. అర్థాంతరంగా మాటలు ఆగిపోవటంతో భానుప్రకాష్ కూడా లోపలికి వచ్చాడు.


కాస్సేపటికి లీలారాణీ అంది, “మా వారి ఫ్రెండ్స్ కూడా పూణేలో ఇక్కడికి దగ్గరలోనే వున్నారట, మేము అర్జెంట్గా వెళ్ళాలి.”


భాను అభ్యంతరం చెప్పొద్దని పదే పదే అనుకుంది కాంచన. భానుప్రకాష్ మనసు వుడికి పోతుంది. “అంతకంటేనా, సరే మరి..”


అతిథులు వెళ్లిపోయారు. కాంచన ఇష్టపడి ఎంపిక చేసిన చీరను భానుప్రకాష్ కాంచన బుజాల చుట్టూ కప్పి, బుజాలను పట్టుకుని, కళ్ళల్లోకి చూసాడు. మెత్తగా, హాయిగా మెడను తగులతున్న చీర! భాను చేతుల్లో తను!! ఎంత ధైర్యంగా వుంది. కళ్లు పైకి ఎత్తి చూసింది. ఏ భాషకు అందని భావాలు భాను కళ్ళల్లో ప్రకాశిస్తున్నాయి. ఆ వెలుగును సమీక్షిద్దామనుకున్న పెదాలు బంధించ బడ్డాయి.


****

సురేఖ పులి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

పేరు :సురేఖ

ఇంటి పేరు: పులి

వయసు: 68 సంవత్సరాలు

భర్త పేరు: స్వర్గీయ పి. అరుణ్ కుమార్

ఎంఏ (సోషియాలజీ&ఇంగ్లీష్) చేశాను. ఇద్దరు అమ్మాయిల వివాహమైంది.

పుట్టి, పెరిగింది హైదరాబాద్ లో.

ప్రస్తుత నివాసం బెంగళూర్ లో.

మా నాన్న స్వర్గీయ అర్జున్ రావు గారు నా మార్గదర్శకులు.

స్కూల్, కాలేజీ మ్యాగజైన్ కు రాయడంతో నా రచనా వ్యాసంగం ప్రారంభమైంది.

HMT Hyd లో నా ఉద్యోగం, 2008 లో స్వచ్ఛంద పదవీ విరమణ తర్వాత

ఒక డైలీ న్యూస్ పేపర్ కోసం పనిచేసాను.

చందమామ, యువ, స్వాతి, ఈనాడు, నెచ్చెలి, మన తెలుగుకథలుడాట్కాంల లో నా కథలు, కథానికలు ప్రచురితమయ్యాయి.

ప్రస్తుతం విశ్రాంత సీనియర్ సిటిజన్ను. కధలు రాయటము, చదవడం నా హాబి. చిత్ర లేఖనం, పెన్సిల్ డ్రాయింగ్ ఇష్టపడతాను.

మీ ప్రోత్సాహమే నా బలం 🤝

మరిన్ని రచనలతో పాఠకులకు దగ్గర కావాలన్నదే నా ఆశయం.

సురేఖ పులి


70 views4 comments

4 commentaires


Chala bavundi... Madam..

Non stop ga చదవాల్సి వచ్చింది..


J'aime
En réponse à

మీ స్పందనకు ధన్యవాదాలు 🙏

J'aime

Mana Telugu Kathalu
Mana Telugu Kathalu
03 sept. 2023

@giridharlal1239 • 7 hours ago

Nice

J'aime
Surekha Arunkumar
Surekha Arunkumar
04 sept. 2023
En réponse à

Thank you very much for valuable comments.

J'aime
bottom of page