'Daridra Narayanudu Nadu Nedu' - New Telugu Story Written By Sudarsana Rao Pochampally
'దరిద్ర నారాయణుడు - నాడు నేడు' తెలుగు కథ
రచన: సుదర్శన రావు పోచంపల్లి
నాడు:
భగవంతుడు అందరిలోను ఉంటాడు అంటారు. ఇంకా చెప్పాలంటె మానవుడే భగవంతుడనే పలుకులూ వింటుంటాము. దాన్ననుసరించే దరిద్రుణ్ణి దరిద్ర నారాయణుడు అని సంబోధిస్తారు.. సిరి గలవాడు గనుక దేవుణ్ణి శ్రీమన్నారాయణుడు అని కీర్తిస్తారు.
ఇహ లోకేహి ధనినాం పరోపి స్వజనాయతే.
స్వజనాపి దరిద్రాణాం సర్వదా దుర్జనాయతే.
అంటే తనవాడు కాక పోయినా ధనికుడైనప్పుడు అతనిని ఆత్మీయునిగా భావించి అందరు ఆదరిస్తారు. ఒక వేళ పేదవాడు తనవాడైనప్పటికీ దుర్జనుని దూరముంచినట్లు అతనిని దూరముంచుతారు. ఇది నేటి మానవ నైజము.
అలనాడే శ్రీ కృష్ణుని సహాధ్యాయి- బాల్య మిత్రుడు ఐన సుధాముని దరిద్రము కారణంగా అతనిని కుచేలుడు అని నేటికీ పలుకుతున్నారు. కుచేలుడు అంటే జీర్ణించిన వస్త్రములు కలవాడు అని అర్థము.
ఇంట్ల ఇత్తూ లేదు ఈ బిడ్డ తోడు భోంచేసి పోవయ్య నా బొట్టు తోడు. ఇది ఒక బీదింటి సంస్కారముగల ఇల్లాలు చేసే మర్యాద.
ఖాళీ కుండలు మావి, చేత కాసైన లేదు..
కలిగింది తిందాము కలిసి రండమ్మ..
అని ఆమె అన్న ఆవేదనా భరిత పిలుపు.
కర్మ క్షేత్రము, కర్మ భూమి, నాభీదము, భరతవర్షము. హైమవతము అని ఎన్నో పేర్లతో పిలువబడే ఈ భారతావనిలో నేటి జనాభా 130 కోట్లకు పైబడి యుండి అధిక శాతము బీదతనములో మ్రగ్గుతూ అదీ రోజుకు ఒక్కపూటైనా తిండికి నోచుకోని వారు కోకొల్లలు.
మానవులు తమలో వర్గావర్గి(రాబడి) ననుసరించి రెండు వర్గాలుగా విభజించుకొని బ్రతుకులీడుస్తున్నారు వారిలో స్థూలముగా చెప్పాలంటె ఒకరు ధనికులు, ఇంకొకరు బీదవారు.
వాళ్ళను ఎన్నో పేర్లతో పిలుచుకుంటారు.
ధనికులు:
అచ్చుకుప్ప, ఆఢ్యుడు, ఆస్తికాడు, ఆస్తిపరుడు, ఇభ్యకుడు, ఉభ్యుడు, ఉపపన్నుడు, ఐశ్వర్యవంతుడు, కలవాడు, గర్భేశ్వరుడు, గుజారి, ధణియ, ధనాఢ్యుడు, ధని, ధనికుడు, భాగ్యవంతుడు, రయి, లక్ష్మీవంతుడు, విత్తవంతుడు, శ్రీకరుడు, శ్రీమంతుడు, శ్రీలుడు, సంపత్కరుడు, సంపన్నుడు, సిరిమంతుడు, ఉన్నవాడు..
బీదలు:
పేదవాడు, దరిద్రుడు, అకించనుడు, ఇత్వరుడు, కంఠేరుడు, కాకరూకుడు, కీనాశుడు, కూటిపేద, క్రకరుడు, ఖిదిరుడు, గరీబు, గాలిదిర్గుడు, చేబోడి, దరిద్రాయకుడు, దరిద్రితుడు, దిగంబరుడు, దీనుడు, దురతుడు, దుర్విధుడు, ధనహీనుడు, నిధనుడు, నిరుపేద, నిర్ధనుడు, నిర్భాగ్యుడు, నిష్కంచనుడు, నిస్వ్యుడు, పేద, పాయిడి, ఫకీరు, బడరుడు, బరికట్టె, బికారి, బిక్కు, బీదవాడు, బుక్కాఫకీరు, ముష్టింపచుడు, రంకుడు, లేనివాడు, లొల్లకాడు, వరాకుడు.
అందరూ మనుషులే. అందరూ భరత మాత బిడ్డలే. ఐనా వివక్ష కలిమి లేముల కావడి బ్రతుకులే.
దరిద్రులకు వారి వేష ధారణలో, తినే తిండిలో, పెట్టుకునే పేర్లలో నివసించే ఆవాసలలో ఇట్ల ప్రతి విషయములో ధనిక బీదల వ్యత్యాసాల విన్యాసాలు గోచరిస్తుంటాయి.
సన్నబియ్యపుటన్నము, రకరకాల కూరగాయలు, గడ్డపెరుగు, నెయ్యి ఇత్యాదివాటితో వెండి కంచము, నీళ్ళు త్రాగటానికి వెండి చెంబు దానిమీదొక గ్లాసు. కూర్చొని తినడానికొక నగిషీల పీట.. ఇది శ్రీమంతులు ప్రతి నిత్యము ప్రొద్దున- రాత్రి తినే ఆహారము.
ఇక మధ్యాహ్నము ఎదో ఒక పిండి వంట, తీపి పదార్థము. తిన్న తరువాత తాంబూలము. ఇన్ని వైభొగాలతో వారి జీవన విధానముంటే.. ఆడవారు ఇంటిలో వంట పనులు తప్ప ఇతర పనులు బీదవారైన పనివాళ్ళే చేయాలి. సంపాదనకొరకు ఉద్యోగాలు చేయరు.
బీదవాడు మాత్రము ఆ పూటకు పుడితె గంజి మెతుకులు లేదా గటుక అందులోనికి నంజుకోను ఉప్పుగల్లు, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ. తినడానికి ప్రత్యేకించి ఒక స్థలమంటూ ఉండక ఉన్న గుడిసెలోనో పొలము పనుల దగ్గర ఏ చెట్టు కిందనో బాయి గడ్డమీదనో కడుపు నింపుకొని రాతెండి గ్లాసులో కుండలోని నీళ్ళు లేదా బావిలోనో, బోరు బావిదగ్గర దోసిలితోనో త్రాగి దప్పిక తీర్చుకొను పద్ధతి అవలంభిస్తాడు. మగవారితో సమానంగా ఆడవారుకూడా నిత్యము పని చేయవలసిందే. గర్భిణులకు, బాలింతలకు మినహాయింపు ఉండదు.
అలవాటున్న మగవారు చుట్టనో బీడీనో త్రాగుతు తృప్తిచెందుతారు. సాయంకాలము కల్లు త్రాగటము పల్లెటూరి బీదల నిత్యకృత్యము.
బీదవాళ్ళ పిల్లలు నడక నేర్చిందే తడవుగా ఏదో ఒక రీతిగా పని నేర్చుకొనుట పనిలో చేరుట తలిదండ్రులకు సహకరించే పద్ధతి అవలంభిస్తారు.
ధనికుల పిల్లలు మాత్రము పనిలో చేరక చదువుకొనుటకై బడికి పోవుట పట్నమైన పల్లె ఐనా పరిపాటే.
ఇక బీదవారు తాము నివసించు ప్రాంతములో పని లభించని తీరుకు ఉదరపోషణకై పని దొరికేచోటుకు వలసపోతారు.
ధనికులు పట్టణ ప్రాంతాలకు పిల్లల పై చదువులకో ఉద్యోగార్థమో పోతుంటారు వీరి పోకడ మాత్రము వలస అనరు.
పట్టణ ప్రాంతాలలో నివాసము సమకూర్చున్న ధనికులు నాగరికతకలవడి వేషము, భాష, తిండి నడవడి గ్రామ వాతావరణముకు సరితూగని విధంగా ఉంటుంది.
బీదవాడు పట్టణ ప్రాంతానికి వలసపోయినా ఏ మార్పు లేకుండ ఏరోజుకారోజు కూలీ డబ్బులతోనే జీవనము కొనసాగిస్తాడు.
ప్రకృతిలో ఏమి వింతనో కాని ధనికులను పేదలను విడదీయుచు తిండి బట్టలలో కూడా వ్యత్యాసము సృష్టించడము విడ్డూరమే.
గ్రామ ప్రాంతాలలో పేదవారి ఆటలలో కూడా వ్యత్యాసమే.
1. పచ్చీసు
3. వనగుంతలు
4. కచ్చకాయలు
5. పరమపదము. (వైకుంఠపాళి).
6. పెంకాసుల ఆట.
7. చిర్రగోనె.
8. వంగుడు. దునుకుడు
9. గోలీలాట.
10. బొంగరాలు.
11. సైకిల్ టైర్
12. వాన పడేటప్పటి ఆట(వానా వానా వల్లప్ప)
13. చుక్ చుక్ రైలు
14. బాణాలాట.
15. గులేరు ఆట
16. వడిసేల
17. దాగుడు మూతలు
18. బావిలో ఈదుడు ఆట.
19. కర్రసాము
20. కండ్లు మూసుకొని ముట్టిచ్చుకునే ఆట.
21. అష్ట చెమ్మ
22. గుజ్జనగూళ్ళు.
23. చెట్లు ఎక్కి దునుకుడు
24. గూన పెంకలు లేదా అగ్గి పెట్టెలతో టెలిఫోన్ ఆట.
25. పరుగు పందెము.
26. చెండు (బంతి)ఆట.
ఇక తెలంగాణా ప్రాంతములోనే పల్లె మహిళలు చిన్న పెద్ద తెడా లేకుండ ఆడే ఆట "బతుకమ్మ". ప్రతి సంవత్సరము భాద్రపద అమావాశ్య మొదలు ఆశ్వీయుజ నమమి వరకు పది రోజులు ఎంతో కోలాహలంగా- అదీ ప్రతి దినము సాయంత్రము వరకు రక రకాల పూలతో తపుకులలో వాళ్ళ శక్త్యానుసారము ఎత్తు పెంచుతూ ఊరంతా ఒక్కటై సాయంకాలము చీకటి పడువరకు ఆ బతుకమ్మల చుట్టూ ఆడుతూ పాడుతూ తుదకు వారి వారి ఊరి చెరువులో బతుకమ్మను పోయిరావంటు నిమజ్జనము చేయడము ఆనవాయితి.
బతుకమ్మను లక్ష్మి దేవిగా, దుర్గామాతగా, సరస్వతి గా భావించి పూజించడము అనాదినుండి వస్తున్న పండుగ సంబరము. ఆడపిల్లలు తమ అత్తగారింటినుండి తల్లిగారింటి వచ్చి వాళ్ళ వాళ్ళ ఇండ్లలోనేకాకా ఊరంతా ఒక్కటై అందరూ సమైక్యంగా సంతోషంగా బతుకమ్మలాడి వాళ్ళకు వచ్చిన పాటలు. ఉయ్యాలో, లెదా చందమామ, లేదా కోల్ లేదా వలలో అని పాట చివర లయబద్ధంగా పాడుచు జరుపుకునే పండుగ అందరికీ నేత్ర పర్వమే. సంతోష దాయకమే.
తొమ్మిది రోజులు జరుపుకొనే బతుకమ్మ పండుగ తొమ్మిది విధాల నైవేద్యముతో సాగుచుంటది.
1. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ (మహా అమవాశ్య. లేదా పెతరమాస) నువ్వులు, బియ్యంపు పిండి కలిపి నైవేద్యము పెడుతారు.
2. రెండవ రోజు అటుకుల బతుకమ్మ. చప్పటి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం.
3. మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ.. పాలు. బెల్లం తో నైవేద్యం.
4. నాల్గవ రోజు నాన బియ్యం బతుకమ్మ. పాలు. బెల్లం కలిపి నైవేద్యం.
5. ఐదవ రోజు అట్ల బతుకమ్మ. అట్లు (దోశలు)నైవేద్యం.
6. ఆరవ రోజు అలిగిన బతుకమ్మ. నైవేద్యము పెట్టరు.
7. ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ. వేయించిన బియ్యపు పిండిని వేపకాయల రూపం లో చేసి నైవేద్యం పెడుతారు.
8. ఎనిమిదవ రోజున వెన్నముద్దల బతుకమ్మ. నువ్వులు, వెన్న/నెయ్యి బెల్లం కలిపి నైవేద్యం పెడుతారు.
9. తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ.. ఐదు రకాల నైవేద్యములో పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర, కొబ్బరి హోర, నువ్వుల హోర ఉంటాయి.. మొక్కజొన్నలు, జొన్నలు, సజ్జలు, మినుములు, శనగలు, పెసలు, వేరుశనగ, నువ్వులు, గోధుమలు, బియ్యము, బెల్లము, ఖాజు పాలు ఉపయోగిస్తారు.
ధనికుడు తినగలుగుతడు కనుక సన్న బియ్యము, కట్టుటకు సన్న వస్త్రాలు అదే పేదలకు దొడ్డు బియ్యము, దొడ్డు వస్త్రాలు.
ఈ రకంగా ప్రతి కదలికలో ధనిక బీద జీవన ప్రమాణాలు ఎంతో వ్యత్యాసంగా సాగుతాయి.
దేవుని దగ్గర కూడా బీదవారి పట్ల వివక్షకు తోడు కసిరింపులు కూడా చోటు చేసుకుంటాయి.
కనపడని దేవుడు. కనలేని దీనుడు
1. కనరాని దేవునికి కనక సింహాసనంబు
కనలేని దీనుణికి కడమెట్టె గుడికాడ
తినబోని స్వామికి తీర్థ ప్రసాదంబు
తినబోవ దీనునికి తిరిపమెత్తుటయె
2. పగడాలు ముత్యాలు పట్టు పానుపులతోడ
పవళింపు సేవకై పరమాత్ము కొలువుండ
సగమైన సరిపోని చింపి గుడ్డలతోడ
నిదురించు నిరుపేద నింగియే కప్పుయై నిలిచియుండ
3. ముక్కంటి ఫలములు మ్రొక్కుగా గొట్టి
చెక్క యొక్కటి గూడ చేజారనీయక
దిక్కు దేవుడె నీకంటు దీనులను జూచి
మ్రొక్కు దీరెనటంచు మోదంబుతోనుంద్రు మోసజనులు
4. నీలాలు నీకిత్తు మా మేలు జూడంటు
కళ్యాణ కట్టలో కత్తెరేయించుకొని
గుండములో స్నానాలు గుడిచుట్టు తిరుగుళ్ళు
మెండుగా పూజలు మెడనిండ పూదండ
5. బెట్టు మడిగట్టి జుట్టు ముడిబెట్టి
కట్టు బొట్టు కాషాయ బట్టలుంగట్టి
చుట్టు గుడి దిరిగి గంటలు గొట్టి గొట్టి
పట్టి హారతులింక పనిగట్టి దీనుల నెట్టివేతురిలన్.
6. పసుపు కుంకుమ పూలు గూర్చి పేర్చి
విసురుచు వింజామరులు విభునికి విభూతిగోరి
కసురుచుందురు కనులు కాల్జేతులు లేని కడు దీనులన్
ఉసురుదగులదె యట్టివారికుపకారమెరుగకున్న.
"ఏక స్వాదః న భుంజీత" అంటే రుచికరమైన ఆహారాన్ని ఒక్కడే కూర్చొని తిన కూడదు అని అర్థం. కాని ఈ సంస్కృతిని పాటించేదెవరు? స్వార్థమే దిన దిన ప్రవర్థమానమౌతున్న కాలములో ఇతరులను పట్టించుకోవాలను స్ఫృహ ఎంతమందికున్నదీ రోజుల్లో. నీతులన్నీ పుస్తకాలలో నిక్షిప్తమై ఉన్నాయంతే.
"రోదసీ కుహరంబు రుచి రుచిరాంశు తతి జేసి అర్కుండు వెలిగించినటుల" అని ఆనాడు భీష్ముడు శ్రీకృష్ణున్ని స్తుతించాడు. ఈ కాలములో ఆ భీష్ముడూ లేడు, శ్రీకృష్ణుడూ లేడు. ఎందుకంటే ఇది కలి కాలము. దోచుకోవడము- దాచుకోవడమే ఎరిగిన మనుషులు పెరుగుచున్న కాలము.
నిరుపేద బతుకులను దుర్భరం చేస్తున్న పరాన్న భుక్కులు ప్రజాస్వామ్యాన్ని దోపిడీ స్వామ్యము చేసి పబ్బము గడుపుకుంటున్నరీ కాలములో.
వారిని ప్రతిబంధించు చట్టాలున్నా అవి ఉపయోగార్థము కావు అన్న చందాన నేటి నాయకుల వ్యవహారము. అవి కాగితాలలో నిక్షిప్తమయి బూజుపట్టి పోతున్నవేకాని ఉపయోగార్తము కావన్నటుల ద్యోతకమగుచున్నది.
వెయ్యేండ్ల క్రింది రామానుజా చార్యులు (నేడు అంటున్న సమతా మూర్తి)గాని, దాదాపు ఎనిమిది వందల ఏండ్ల క్రిందటి వల్లభాచార్యులుగాని లోక కల్యాణానికై పరితపించి ఎన్నో బోధనలు చేసి కులమతాలుండక అందరూ సమానమనే నినదించారు కాని, ఈ నాటికి కులం, మతం, జాతి అను వివక్షలు ఇంకా సమూల నిర్మూలన కాలేదు.
వల్లభాచార్యుడు భక్తి ద్వారా కుల మతాల తారతమ్యాల నధిగమించవచ్చన్నాడేకాని ఆ భక్తికి మార్గ ద్వారాలైన గుడులు, మందిరాలు, పుణ్యక్షేత్రాలు, కోవెలలు అన్ని కూడా అగ్రవర్ణాలు లేదా ధనికుల ప్రాపకములో కొలువై ఉన్నందున పేదవాడు లేదా నిమ్నజాతులవారనబడేవారు సంపూర్ణ తృప్తితో దైవారాధన చేయలేకున్నారు.
వల్లభాచార్యుడు భక్తి అందరికి సమానమని, అందులో కులాలు మతాలు పెద్దా చిన్నా తారతమ్యాలు లేవన్నాడు. ఆయన ఆచరించాడట. మనిషి స్థాయి అతని గుణాలబట్టి కాని పుట్టుక మూలంగా కాదని బోధించాడు. సమాజములోని చెడును సంస్కరించాలని భావించాడు. స్త్రీలే మేలైన గురువులని వారిపట్ల ఎటువంటి భేద భావము సరియైనది కాదని బోధించాడు. కృషుని చేష్టలు వర్ణించుచు వ్రాసిన మథురాష్టకం ఏమంటే-
అధరం మథురం/ నయనం మథురం/ హసితం మథురం/ హృదయం మథురం/ గమనం మథురం/ మథురాధిపతేరఖిలం మథురం
వచనం మథురం / చరితం మథురం/ వసనం మథురం/ వలితం మథురం/ చలితం మథురం/ బ్రమితం మథురం/ మథురాధిపతేరఖిలం మథురం
ఇట్ల శ్రీ కృష్ణుని సకల అంగాలు, చర్యలు వర్ణిస్తు ఎనిమిది అష్టకాలు వ్రాసాడు.
ఇవన్ని పేదలకు, బీదలకు చదువు నోచుకోనివారికి అర్థమయ్యేవి కావు. ఏ మహానుభావుడో వీటి గురించి ప్రవచనాలు చెప్పినా పేదలు చివరి స్థానములో నిలబడి వినవలిసిందే. వారికి సందేహ నివృత్తికి ఆస్కారముండదు.
"పూజ్యతే యద పూజ్యోపి
యద గమ్యోపి గమ్యతే
వంద్యతే యద వంద్యోపి
న ప్రభావో ధనస్యచ
అంటే ఒకవ్యక్తి ధనవంతుడైనప్పుడు అతడు పూజింపకూడని వాడైనప్పటికి పూజింపబడుతాడు. పోగూడని వ్యక్తి ఐనప్పటికి అతని వద్దకు పోతారు. నమస్కరింప తగని వ్యక్తి ఐనప్పటికి నమస్కరిస్తారు. ఇదంతా ధనం ప్రభావంగా భావించాలి. అంతెగాని అతని గొప్పతనము కాదుగదా
ఇటువంటి మానవ నైజమే బీదవానిని అభివృద్ధికి తేలేక పోతున్నది.
ధనికులకు పిల్లలు పుడితే ఎంతో ఆర్భాటము చేసి వాళ్ళకు పెట్టే పేర్లు కూడా ఒకరకమైన నాగరికతకులోబడి ఉంటాయి. అదే పేద వారి పిల్లలకు పెట్టే పేర్లు గ్రామీణ వాతావరణాని కనుకూలంగా ఉంటాయి.
పట్టణ వాసులైన ధనికులు తిన్న ఆహారము జీర్ణము కావడానికి మందులు వాడడము, వ్యాయామము చేయడము చేస్తున్నా రక రకాల రుగ్మతలకు లోనై ఆస్పత్రి పాలగుట జరుగుచుండగా బీదవారు మాత్రము వాళ్ళు నిత్యము కాయకష్టము చేయుటలోనే వ్యాయామ ప్రక్రియ ఇమిడి ఉంటది కావున వారికి అజీర్ణము, అనారోగ్యము కలుగుట చాలా తక్కువ. ఏ ప్రమాదము జరిగితేనో, అపరిశుభ్ర వాతావరణానికి లోనైతేనో ఆస్పత్రి కడప తొక్కుతారు.
ధనవంతుడను నేను ఎక్కువ, ధన హీనుడు నాకంటె తక్కువ- అను సంస్కారహీన భావనతో బీదవారిని పేరుపెట్టి లేదా రారా పోరా అని సంబోధిస్తూ వుంటే బీదవాడు మాత్రము తన సంస్కారము ఎన్నడూ మరువక ఎదుటివారిని గౌరవించే రీతితోనే మెలుగుతాడు.
పూర్వ కాలములో పనిలో ఏ మాత్రము పొరపాటు జరిగినా ధనికులనబడేవారు బీదలపట్ల అమానుషంగా వ్యవహరించుచు వారిని శారీరకంగా దెబ్బలతో, మానసికంగా తిట్లతో హింసించెవారు.
ఇప్పటికి గ్రామ ప్రాంతాలలో ఆ దర్పము అడుగంటక బీదలను కులాల పేర్లతో పిలువడము- బీదలు ధనవంతుల ను దొర, పంతులు, రెడ్డి, పటేలు, అయ్యవారు, సామి ఇద్యాది గౌరవ పదాలతో సంబోధించడము చూస్తుంటాము.
ఇంకొక ఘాతుకమేమంటె ఆడ పిల్లలకు చదువు అవసరము లేదనడము. చిన్న తనముననే పెండ్లి చేసి అత్తవారింటికి పంపడము. వరుని వయసుతో నిమిత్తము లేకుండ ఆడ పిల్లల వివాహము అప్పటి సమాజము ఒప్పుకొనడము ఆడపిల్లల పాలిటి శాపమయ్యింది. తను కూడా అదే విధముగా కోడలుగా వచ్చిన అత్త కూడ కొత్త కోడలును నానా ఇబ్బందులకు గురిచేయడము ఆనాటి సంస్కృతి.
దురదృష్ట వశాత్తు భర్త చనిపోతె జీవితాంతము అప్పుడు పెట్టిన పేరు "విధవ"గానే ఉండవలసి రావడము.. అదే భార్య చనిపోతె భర్త మళ్ళీ మళ్ళీ ఎన్ని సార్లైనా పెళ్ళి చేసుకోవచ్చు.
విధవగా నామకరణము చేయబడ్డ ఆడ పిల్ల ఇక పసుపు, కుంకుమ, బొట్టు కాటుక, గాజులు, మట్టెలు, తలపై పూలు, భర్త కట్టిన పుస్తె ఏదీ నోచుకోక తెల్ల చీర మాత్రమే కట్టుకుని జీవితాంతము బ్రతుకీడ్వాలె. ఇక శుభ కార్యాలప్పుడు, లేదా ఎవరైనా పయనానికి పోతున్నప్పుడు ఎదురుపడకూడదను నిబంధన. పొరపాటున ఎదురుపడితె అపశకునంగా భావించేవారు. ఇంకా అంతకు ముందు కాలములో మూర్ఖత్వము ఏమిటంటె భర్త చనిపోతె ఆ చితిమీదనే భార్యను "సతీ సహగమనమను"పేర పడేసి కాల్చేవారు. కొందరు శిరోముండనము చేయించేవారు. అప్పటి ఆచారాల దురాగతాలు చెప్పుతూ పోతే భారత భాగవత ఇతిహాసాల మించి పోతదేమో.
నేడు:
కాలానికి మార్పు సహజము. ప్రకృతిలో మానవ ప్రకృతిలో నేడు ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడిది యంత్ర యుగము ఇంకా ఆధునికంగా చెప్పాలంటె కంప్యూటర్ కాలము. ఉన్న వాళ్ళు, ఆటలు కొంత భిన్నంగా ఉంటాయి.
1. టెన్నిస్ ఆట
2. వాలీ బాల్
3. ఫుట్బాల్
4. రింగ్ బాల్
5. పేకాట
6. గుర్రపు పంద్యాలు
7. కంప్యుటర్లో ఆటలు
8. సైకిల్ రేస్
9. కబ్బడ్డి
10. ఖొఖొ
11. క్యారం బోర్డ్
ఇత్యాదివన్ని పట్టణ ప్రాంత ధనికులాడే ఆటలు.
బతుకమ్మ పండుగ ఒక్క గ్రామీణ ప్రాంతానికి- పేద కుటుంబాలకేగాక, కలవారు లేని వారు అను తేడా లేకుండ అందరు మమేకమై పట్టణ ప్రాంతాలలో కూడా ఎంతో ఉత్సాహ భరితంగా జరుపుకుంటారు. ఇటీవల బతుకమ్మ పండుగ ప్రాశస్త్యము ఇతర దేశాలకు ప్రాకి ఎంతో ఉత్సాహ భరితంగా అన్య దేశీయులు కూడా జరుపుకొనడము ముదావహము.
చదువుల సరస్వతి కళ్ళు తెరిచిందో ఏమో నేటి తరానికి విద్యా విశిష్ఠత. ఆవశ్యకత తెలియుచున్నది. పట్టణ వాసులైనా పల్లెలలో నివసించేవారైనా చదువుపట్ల శ్రద్ధ కనబరచటము స్వాగతించవలసిన విషయము.
ఆ చదువులే లేకుంటె ఈ విజ్ఞానమెక్కడిది. వినయమెక్కడిది. సంస్కారమెక్కడిది?
ఈ ఆధునిక యుగములో యంత్రాలు, కంప్యూటర్లు రావడానికి మూలకారణము చదువులేకదా. మానవుని మస్తిష్కములో దాగియున్న విజ్ఞానానికి చదువులు తోడై క్రొత్త క్రొత్త ఆవిష్కరణలకు కారణభూతమైనది.
తద్వారా మనిషికి పని ఎంతో సులభమై కాలాన్నే బంధిచే స్థితికి చేరింది అంటే పది మంది పది రోజులు చేయగలిగే పని ఒక్కడు ఒక్కరోజులో లేదా ఒక్క పూటలో చేయగలుగుచున్నాడు.
ఒకనాటికాలములో మొదట అక్షరాలే లేకుండెనట. భాష నిలుపుకొనుటకు అక్షరాలను సిద్ధము చేసుకొని అవి నిక్షిప్తము చేయడానికి కాగితము లేని కాలములో తాటాకులను వ్రాతకుపయోగకరంగా తీర్చి వ్రాయు సాధనంగా ఒక గంటమును ఏర్పరుచుకొని వ్రాత సాగించేవాడు. తరువాత తరువాత సిరా కలము కాగితము సృష్టించుకొని ఇంకా ఆధునిక పరిచిండు మానవుడు.
ఎప్పుడైతే చదువులవల్ల మేథో సంపత్తి అభివృద్ధి చెందిందో ముద్రణా యంత్రము. ముద్రారాక్షసము రూపుదిద్దుకున్నవి. అటు తరువాత ఇంకనూ అభివృద్ధి చెంది నేటి యంత్ర పరికరాలు కంప్యూటర్లు. సెల్ ఫొన్లు మున్నగునవన్నియు అందుబాటులోనికి వచ్చి మానవ మనుగడ సులభ సాధ్యమౌతున్నది.
ఈ కారణాన నవీన యుగము ఎవ్వరికి దాస్యము అనుటకు ఆస్కారము లేకుండా అయినది. ధనవంతుల దాష్టీకము తగ్గినది. ఇంకా తగ్గుచున్నది.
కాకపోతె ధనికుడు అత్యంత ధనికుడుగా పేదవాడు నిరుపేదగా బ్రతుకులో అంతరము తగ్గుట లేదు దీనికి కారణము మన ప్రజాస్వామ్య పాలనలోని లొసుగులే కావచ్చును.
ఒక దిక్కు అధికారము పోగొట్టుకున్నవారే రాజకీయ నాయకులు, పెట్టుబడి దారుల రూపములో మళ్ళీ విజ్రుంభించుచు కొత్త ఎత్తుగడలతో ముందుకు వస్తున్నారు. వారిని నిరోధించడానికి ఇంకా కొంత కాలము పట్టవచ్చునేమో. ఇప్పుడు ఊరూర, పల్లె పల్లె, వీధి వీధి, పట్టణము నగరము అన్నింటిలో జనము జాగరూకులై వారి పిల్లలను చదివించి ప్రయోజకులను చేసిన నాడే ముష్కరులకు ముకుతాడు.
ఎన్ని నదులు, సెలయేరులు, వర్షపాతాల్తో నిండుచున్నా సముద్రము ఇంకా దప్పిగొన్నదానిలా అలల రూపున అర్రులు చాచుచున్నటే ధన దాహ పరులు ఇంకా బీదలను వంచించు మార్గము విడనాడుట లేదు.
రోజుకు ఇరువది నాలుగు గంటలలో పండ్రెండు గంటల రాత్రి. పండ్రెండు గంటల పగలు చీకటి. వెలుగులు మనిషి అనుభవిస్తూ కాలము కరుణించి ప్రకృతి తిమిరము అజ్ఞాన తమస్సు తొలగిపోవాలనే తపన పడుచుంటాడు. ఐతె జ్ఞానాంధకారము తొలిగే రోజులు ఇంకా కొద్దికాలములోనే మానవ జాతి వీక్షించే సమయము రాగలదు. మనిషి ఆశాజీవి. సాధకుడు. జ్ఞాన సంపన్నుడు.
భూ స్థాపితమై ఉన్న ఎంతో విలువైన మానవ చారిత్రక సంపద త్రవ్వకాలలో బయల్పడినట్లే మనుషుల బ్రతుకు సుభిక్షము కావాలంటె నేర్పు, ఓర్పు కావాలి.
స్త్రీ జాతిపై విధించిన గత కాలపు దురాచాల దుర్మార్గపు సంస్కృతి నేడు కొంతవరకే అంతరించింది కాని సమూలంగా నిర్మూలన కాలేదు. ఇప్పుడు ఆడపిల్లలు చదువుకే ప్రధాన్యమిచ్చి మగపిల్లలకంటే ముందు వరుసలో నిలబడుతున్నారు. పెళ్ళి విషయములో కొంతమంది యుక్త వయసు వచ్చిన పిదపనే ప్రేమించి పెళ్ళి చేసుకోవడము లేదా తలిదండ్రులు నిర్ణయించిన వరుణ్ణి అంగీకరించడము జరుగుచున్నది. అక్కడక్కడ అంటే ఇంకా నాగరికత చెందనివారు బాల్య వివాహాలు చెస్తునే ఉన్నారు.
సంపూర్ణ నాగరిక సమాజము ఏర్పడాలంటె ఇంకా కొంత కాలము కావాలి.
చదువులు, పుస్తకాలు, టీ. వీ, లు సినిమాలు, నాటకాలు
దూర ప్రాంత పయనాలు. ఇవన్ని వెనుకబడివున్న మానవున్ని అజ్ఞానమనే నిదురనుండి మేల్కొల్పజేస్తున్నవి.. కుల మతాలకతీతంగా పయనింపజేయ బడుచున్నవి.
ఆంగ్లేయులు దేశము విడిచి వెళ్ళిపోయి 75 ఏండ్లు గడుస్తున్నా మన ప్రజా ప్రభుత్వ పాలనలో మానవునికి ఇంకా సంపూర్ణ స్వేఛ్చ లభించలేదు. ధనవంతుడింకా ధనవంతుడై బీదలనెదుగకుండ చేయుచున్నాడు. దానికి కారణము పరిపాలనా పగ్గాల పట్టు సడలడమే.
శుభం
సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
పేరు-సుదర్శన రావు పోచంపల్లి
యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)
వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి
కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను
నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,
నివాసము-హైదరాబాదు.
Commentaires