top of page

ప్రేరణ


'Prerana' - New Telugu Story Written By Sudarsana Rao Pochampally

'ప్రేరణ' తెలుగు కథ

రచన: సుదర్శన రావు పోచంపల్లి


శాంత మూర్తిపేరుకు తగినట్టు శాంత స్వభావుడు- సాత్వికుడు- భార్య వసుధ- నలుగురు కొడుకులు, ఒక కూతురు. వారి పేర్లు వరుసగా దేవేశ్, దివిజేశ్, అమరేశ్, లోకేశ్. కూతురు కొరకు లోకేశ్వరిని మొక్కగా మొక్కగా పుట్టింది కావున లోకమాత అని పేరు పెట్టుకుంటాడు-

శాంత మూర్తికి ఒక తమ్ముడు మాత్రమే ఉంటాడు పేరు దశావతార మూర్తి. అతని భార్య పేరు దేహిని.


పూర్వీకులనుండి సంక్రమించిన ఆస్తి ఎనిమిది ఎకరాల పొలము, పెద్ద బంగళా అరువది తులముల బంగారము, నాలుగు ఆవులు, ఎనిమిది ఎడ్లు.


అన్నీ సగము సగము పంచుకుంటారు అన్నదమ్ములు- ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే. ఒకే బంగళాలో ఎవరి వాటాలో వారు ఉంటారు.


తమ్ముడు దశావతార మూర్తికి సంతానము కలుగక పోవడముచే అన్న కొడుకులు నలుగురిలో ఒకనిని దత్తత ఈయమని అడుగుతాడు. శాంత మూర్తి ఆలోచించి చెబుతానంటడు.


దశావతార మూర్తి భార్య దేహినికి మాత్రము జ్ఞాతుల పిల్లల దత్తత తీసుకుంటె మునుముందు పేచీలు వస్తాయి అని ఇష్టము లేదు అని వద్దంటది భర్తతో. ఆమె అక్క హరిప్రియకు ఇద్దరు కొడుకులలో ఒకనిని తెచ్చి పెంచుకుందామంటది భర్తతో దేహిని. ఇంట్ల గెలిచి రచ్చ గెలువాలని సామెత తెలిసినవాడు కావున దశావతార మూర్తి ఆలోచిద్దాము అంటడు-


“ఏమిటండీ మీరు? ఇద్దరన్నదమ్ములూ ఒకే మంత్రము.. ఆలోచిద్దాము అని తెగదగ్గరెందుకు” అంటుంది దేహిని.


“తొందరెందుకు పడుతవు.. అన్నయ్య చెప్పింది కూడా సబబే. మనకు పెళ్ళయి కూడా పది యేండ్లు దాటి పాయె. అయినా పిల్లలు కలుగకపాయె- ఉన్న ఫళంగా దత్తత ఈయమంటే ఆలోచించుకోవద్దా” అంటడు దశావతార మూర్తి.


“అసలు మీ అక్కను అడిగినవా, అక్క ఒప్పుకున్నా బావ ఒప్పుకుంటడా, ఇద్దరొప్పుకున్నా పిల్లలు ఒప్పుకుంటరా? ఇదంతా ఒక చిక్కుముడి దేహినీ” అంటాడు దశావతార మూర్తి.

అసలు మీకు మీ అన్న కొడుకు మీద మమకార మెక్కువ అందుకొరకే ఈ చిక్కు సమస్య తెస్తున్నారు అంటుంది దేహిని. మరి నీకు మాత్రము లేదా మీ అక్క కొడుకైతె బాగుంటుందని అంటాడు దశావతార మూర్తి.


“అయితే ఏ కులము గానోణ్ణి తెచ్చుకుందాము” అంటుంది దేహిని.


“అందులో తప్పేముంది - అధిక సంతానముండి తిండిలేక నానా యాతన పడుచున్న భీమయ్య పార్వతమ్మల ఎనిమిది మంది సంతానములో ఒక కొడుకును అడుగుదాము” అంటాడు దశావతార మూర్తి.


శాంత మూర్తికి ఒక స్నేహితుడు ఉన్నడు విశ్వేశ్వర్ అని- రోజూ ఉదయాన్నే శాంతమూర్తి ఇంటికి రావడమూ

ఏవేవో కబుర్లు చెప్పి చాయదాగి పోవడము అతని నిత్య కృత్యము.


శాంతమూర్తి- దశావతార మూర్తి ఇద్దరన్నదమ్ములు సఖ్యత తో ఉండడము విశ్వేశ్వర్ కుళ్ళు బుద్ధికి మనసొప్పదు.

దశావతార మూర్తి అన్న కొడుకును దత్తత కోరడము- అదిగాకపోతె అతని సడ్డకుని కొడుకు గురించి ఆలోచించడము- ఇరువురు కుదరక పోతె భీమయ్య కొడుకును దత్తత గురించి అనుకోవడము అంతా తెలుసుకుంటాడు విశ్వేశ్వర్.


విశ్వేశ్వర్ ఒక పాపాల భైరవుడు. అపర నారథుడు అని పేరు పెట్టవలసినోడు- ఎప్పుడూ అటు శాంతమూర్తిని దత్తత ఈయవద్దని- ఇటు అన్న కొడుకైతేనే దత్తత బాగుంటుందని ప్రేరేపిస్తుంటాడు. అక్కడి మాటలు ఇక్కడ, ఇక్కడి మాటలు అక్కడ తెలియకుండా జాగ్రత్త పడుతుంటాడు విశ్వేశ్వర్.


ఒకనాడు శాంత మూర్తి దగ్గరకు వచ్చి ”ఒక వేళ మీ తమ్ముడు భీమయ్య కొడుకును దత్తత తీసుకుంటె రేపు ఏదైనా జరుగరానిది జరిగితె కొడుకు హోదాలో పిండ ప్రదానానికి భీమయ్య కొడుకు పనికి రాడుకద.. మీ వంశజుడు కానప్పుడు అది దోషమే కదా” అంటుంటాడు విశ్వేశ్వర్.

అదివిన్న శాంత మూర్తి భార్య- - - వసుధకు కోపము వస్తుంది.


“విశ్వేశ్వర్ గారు.. ఇది మా యింటి అన్నదమ్ముల సమస్య. నిప్పు లేనిచోట మంట పుట్టించడము విజ్ఞత అనిపించుకోదు. మీ ప్రేరణ తో పచ్చని సంసారాలకు చిచ్చు పెట్టుడే- దయచేసి మా వ్యవహారాలలో కలిపించుకోకండి, మీకు పుణముంటుం”దని తీవ్ర గొంతుతో అంటుంది వసుధ.


విశ్వేశ్వర్ ఖిన్నుడై మరుమాట పలుక లేక అక్కడి నుండి వెడలి పోతాడు. ఆయన పోగానే వసుధ అంటుంది “బేకారు గాడు.. పని పాట లేక మంది ఇళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళకు వీళ్ళకు పుల్లలు పెడుతుంటాడు” అని. “మళ్ళీ వస్తె కాళ్ళు విరుగ గొడుతాను” అంటుంది. అంత తీవ్రమైన కోపము ఎన్నడూ రాలేదు వసుధకు.


స్నేహ భావము వదులలేక శాంత మూర్తి అంటాడు “పోనీ వసుధా! ఆయన చెప్పినందువల్ల మేమేమైనా పేచీలకు వస్తామా- మాది విడదీయరాని రక్తబంధం” అని ఊరుకుంటాడు.


తిరుగ మరిగిన కాలు తిట్ట మరిగిన నోరూ ఊరుకోవంటారు. రెండు రోజులకే మళ్ళీ వీళ్ళ ఇంటికి వస్తుంటాడు విశ్వేశ్వర్. అది చూసిన శాంత మూర్తి కూతురు లోకమాత “అమ్మా అదిగో.. పనీపాట లేని పుల్లయ్య అంకుల్ మనింటికి వస్తున్నాడు” అని చెబుతుంది వసుధకు.


“వసుధ అంటుంది మనిషికో మాట కొడ్డుకో దెబ్బ అంటరు” అని తన పనిలో తను నిమగ్నమైతది వసుధ.


“శాంతమూర్తి గారున్నారా” అని సరాసరిగా విశ్వేశ్వర్ లోనికి వస్తుంటె “మా అమ్మ మొన్ననే చెప్పెగద అంకుల్.. మా ఇంటికి రావద్దని” అంటుంది లోకమాత.


“అమ్మో మరిచిపోయానమ్మా” అనుకుంటూ వెళ్ళిపోతాడు విశ్వేశ్వర్.


కొన్ని రోజుల తరువాత దశావతార మూర్తి వచ్చి “అన్నయ్యా! మీ మరదలు దేహిని పిల్లలు లేక అలమటిస్తుంది. ఇక ఆగేటట్టు లేదు. నువ్వు ఏమీ అనుకోక పోతె ఊరి చివర ఉన్న భీమయ్య చిన్న కొడుకును తెచ్చి పెంచుదామ నుకుంటున్నము” అంటాడు నేరుగా దత్తత అనకుండా.


“నాదేముంది.. మా పిల్లవాణ్ణి దత్తత ఇత్తామనుకున్నా మీ వదిన ఏ మాట చెప్పక పాయె. ఆకలి గొన్నవానికి ఆరు నెలలు ఆగు అన్నటు ఉంటది మా పరిస్థితి. నిరభ్యరంతంగా నీ ఇష్టానుసారము నడుచుకో” అంటాడు శాంత మూర్తి.


“మరి విశ్వేశ్వర్ మేము పెంచుకొనుడు మీకు ఇష్టము లేదని చెప్పాడు గద” అంటుంటే- అదివిని లోపలి నుండి వచ్చిన వసుధ “వాడొక పుండాకోరు. అటువిటు ఇటువటు చెప్పుడే వాని పని- అక్కడో కప్పు ఇక్కడోకప్పు చాయదాగి కడుపు నింపుకోని పోతాడు. వాని మాటలు నమ్మకు నాయనా” అంటుంది.

“అయినా మా సంతృప్తి కొరకు అడుగుచున్నాను వదినా.. పరోపకారార్థం ఇదం శరీరం అను సామెత ఇప్పుడు మా అవసరానికే తెలియ వచ్చిందనుకో- పాపము ఆ భీమయ్యకు అధిక సంతానము చే చిన్న పిల్లవానికి సీసా పాలు త్రాపడానికే తంటాలు పడుచున్నాడు. అటువంటప్పుడు వాణ్ణి తెచ్చి సాదుకోవడములో తప్పేమి లేదు కదా వదినా” అంటాడు దశావతార మూర్తి.


“మనము మానవులం. మానవ సేవయే మాధవ సేవ. మీకే పుణ్యము కలుగుతది. ఇంక వెనుక ముందు చూడకండి. పది మంది పది తీర్లు చెబుతారు” అంటుంది వసుధ.


వసుధ చెప్పిన మాటలకు సంతృప్తి చెంది దశావతార మూర్తి, దేహిని మనసులోని సందేహ భావమొదిలి మరునాడే భీమయ్య యింటికి పోయి అతని చిన్న కొడుకును పెంచుకుంటాము అని అడుగుతారు.


భీమయ్య సరే అనినా భీమయ్య భార్య గోపమ్మ కొడుకును వదులుకోవాలంటె మనసులో వ్యాకులత చెందుచూ కన్నీరు పెట్టుకుంటుంది.


“అమ్మా గోపమ్మా! నీ కొడుకును మహరాజుగా పెంచుకుంటాము. ఏ లోటూ రానీయము” అంటుంది దేహిని.


“మాకు నాలుగు ఎకరాల పొలము ఉంది, నాలుగు ఆవులు, నాలుగు ఎడ్లు, బంగళాలో సగ భాగము ఉందమ్మా- ఇంకొకటి.. మేము నేరుగా ఇప్పుడే నీ కొడుకును నీకు కాకుండా తీసుక పోము - ఒక వారము పది రోజులు వాణ్ణి తీసుకొని మాయింటికి రండి - అలవాటు కూడా పడాలె కద - పైగా మన ఊరి సర్పంచ్ దగ్గర తగిన విధానము వ్రాయించుకొని నలుగురు సా క్షులను కూడా పెట్టుకుందాము” అంటడు దశావతార మూర్తి.


“అదంత సరే గాని మీరు పెద్దోళ్ళు. మాది తక్కువ జాతి” అనబోతుంటే మేము “క ళ్ళు మూసుకొని రాలేదు. మా అన్నగూడ సంతకము చేస్తడు, సరేనా-” అంటడు దశావతార మూర్తి.


“మేము ఏ జాతి అయినా మీ సహాయము లేనిది మాకు పూట గడువదు. మేము తాగేది బర్రె పాలే, మీరు తాగేది బర్రె పాలే. వాటికి వేరు వేరు జాతి లేదుకదా - అదీ నీవు పిండుక వస్తేనే మేము తాగేది భీమయ్యా- ఆలోచించుకో. ఈ రోజే మునిగి పోయిందేమీ లేదు” అంటుంది దేహిని-


“సరే అమ్మగారు! దేవుడు ఉన్నడో లేడో మీరైతె దేవు ణోలె మా ఇంటికొచ్చారు - రేపు మా కులపోళ్ళను అడిగి మీ దగ్గరికి వస్తాము” అంటాడు భీమయ్య.


మరునాడు సాయంత్రము వచ్చి “మావోండ్లందరు ఒప్పుకున్నారు అయ్యగారు. రేపు మీరు అన్నట్టు సర్పంచ్ దగ్గర కాయిదము వ్రాయించుకుందాము” అంటడు భీమయ్య.


“మీ బాబు పేరేమిటి?” అని అడుగుతుంది దేహిని-

“వాణి పేరు హనుమంతు” అని చెబుతుంది గోపమ్మ.


“సరె సంతోషము, ఇదిగో ఈ డబ్బులు తీసికొని మీ పిల్లలందరికి కొత్త బట్టలు కొనుక్కోండి - మీరుగూడా కొత్తవే ఏసుక రండి” అంటూ నాలుగు వేల రూపాయలు ఇస్తాడు దశావతార మూర్తి భీమయ్యకు. దండము బెట్టి వాళ్ళు వెళ్ళి పోతారు.


దశావతార మూర్తి, దేహిని అన్నా వదినల చెంతకు పోయి దండము పెడుతారు, మీ దీవెన ప్రేరణ అనుకుంటు-


దానికి వాళ్ళు సంతతిస్తూ “మన వంశానికి ఇదొక రకమైన మంచి పేరే - మీ ధైర్యానికి మెచ్చుకోవలసిందే. ఇదొక ఘన కార్యమే” అంటాడు శాంత మూర్తి.


“అవును నాయనా! ఇంకా పాతకాలపు పట్టింపులెందుకు? మంచి మని చెశారు. ఆర్తులను ఆదుకోవడములోనే గొప్పతనమున్నది” అంటుంది వసుధ.


తెల్లవారిన తరువాత భీమయ్య కుటుంబము కొత్త బట్టలు వేసుకొని సర్పంచ్ దగ్గరికి పోదాము అని వస్తారు- సర్పంచ్ కూడా అందుబాటులో ఉండి హనుమంతు పెంపక అంగీకార పత్రము వ్రాసి అందరి సంతకాలు చేయించి భీమయ్యకు, దశావతార మూర్తికి చెరొక ప్రతి ఇస్తారు.


అప్పుడే హనుమంతును ఎత్తుకొని ఇవాల్టి నుండి వీడు హనుమంత మూర్తి అంటుంది దేహిని. అందరూ సంతసించి చప్పట్లు కొడతారు. తక్కిన పిల్లలను కూడా బాగుగా చూసుకొమ్మని పదివేల రూపాయలు భీమయ్య చేతిలో పెడుతాడు దశావతార మూర్తి.


సంతకానికి వచ్చిన శాంత మూర్తి కూడా పదివేలు ఇస్తాడు భీమయ్యకు- నాకు పెద్ద పేరు వచ్చింది అనుకుంటు. వసుధ హనుమంతు మెడలో బంగారు గొలుసు వేస్తుంది.

ఊరి వారందరు దశావతార మూర్తి అభ్యుదయ భావానికి మెచ్చుకుంటూ పూల దండ వేస్తారు.


శుభం

సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

పేరు-సుదర్శన రావు పోచంపల్లి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)

వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి

కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను

నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,

నివాసము-హైదరాబాదు.
49 views0 comments
bottom of page