'Premalekha' - New Telugu Story Written By D V D Prasad
'ప్రేమలేఖ' తెలుగు కథ
రచన: డి వి డి ప్రసాద్
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
ఎదురింట్లో ఉన్న అపర్ణని మనసారా ప్రేమించిన సుందర్ తన ప్రేమని అమెకెలా తెలపాలో తెలియక ఒకటే సతమతమవుతున్నాడు. సుందర్ పేరుకి తగ్గట్టే అందగాడు, పైగా మంచి ఉద్యోగంలో ఉన్నాడు. ఎవరినైనా ఇట్టే ఆకర్షించే పర్సనాలిటీ అతని సొత్తు. అందుకే అపర్ణని ఆకర్షించే పనిలో పడ్డాడు. తనని ఆమె తప్పకుండా ప్రేమిస్తుందనే అతని ప్రగాఢ విశ్వాసం.
అయితే, తనని చూసి అపర్ణ చిరునవ్వు చిందిస్తుంది తప్పితే తనంటే ఇష్టముందో లేదో మాత్రం ఎంత ప్రయత్నించినా తెలుసుకోలేకపోయాడు సుందర్. ఆమె సంప్రదాయానికి విలువిచ్చే బాపూ బొమ్మలాంటి అందమైన అమ్మాయి. ఓ రచయిత్రి కూడా! సాహిత్యం అంటే ముక్కూ చెవులూ కూడా కోసుకొనే సుందర్ ఆమెని ప్రేమించాడు. తన ప్రేమ విషయం ఆమె కెలా చెప్పాలో అర్థం కాక అమ్మాయిల వెంటపడి ప్రేమించడంలో బాగా అనుభవం సంపాదించిన తన స్నేహితుడు ప్రేమానందం సలహా అడిగాడు.
"ఏముంది, ఓ మంచి రోజు చూసి నవ్వుతూ ఆమెకి ఎదురెళ్ళి ఓ గులాబీ పువ్వు ఇచ్చి నీ ప్రేమ విషయం చెప్పేయ్! అంతే! సింపుల్!" చెప్పాడు చాలా తేలిగ్గా.
"అమ్మో! ఇంకేమైనా ఉందా! ఆమెకి కోపం వస్తే!" అంటూ చెంపలు తడుముకున్నాడు సుందర్.
"అంత పిరికివాడివి నువ్వెలా ప్రేమించావు మిత్రమా! చిత్రంగా ఉంది సుమా!" విసుక్కున్నాడు ప్రేమానందం.
"నా ప్రేమని వ్యక్తం చేసే ధైర్యమైతే ఉంది కాని అలా ముఖాముఖీ చెప్పడం అంటే ఎంతైనా కొంచెం కష్టమే, ఇంకేమైనా ఉపాయం చెప్పరా?" స్నేహితుడ్ని అభ్యర్థించాడు సుందర్.
"సరే! అపర్ణ ఫోన్ నంబర్ నీకెలాగూ తెలుసు కాబట్టి వాట్సప్లో సందేశం పెట్టు. ఆమె నుంచి సమాధానం వస్తుందేమో చూడు." అన్నాడు.
స్నేహితుడి సలహా ప్రకారం ఆమెకి సందేశం పంపాడు, అయినా ఆమె నుండి ఏ విధమైన స్పందన లేదు. కానీ ఎప్పటిలా తను కనపడినప్పుడల్లా కాల్గేట్ ప్రకటనలా చిరునవ్వులు చిందిస్తూనే ఉందామె. దానితో ఆమె కూడా తనని ఇష్టపడుతోందని గ్రహించాడు. అయితే ఏ విషయమూ తెలియనిదే ఎలా ముందుకెళ్ళాల్లో తెలియక తికమక పడుతున్నాడు పాపం సుందర్. అలా ఆలోచిస్తూంటే బ్రహ్మాండమైన ఉపాయం తట్టింది.
అపర్ణ పూర్తిగా పాతం కాలం అమ్మాయి. ఆమెకి ఇలా సందేశం పెడితే నచ్చి ఉండకపోవచ్చు, అందులోనూ రచయిత్రి కూడా! ప్రేమలేఖ రాస్తే స్పందిస్తుందేమో అన్న ఆలోచన వచ్చిందే తడువు, ఆచరణలో పెట్టాడు. బాగా ఆలోచించి, చాలా కష్టపడి కిందమీదా పడి చివరికి ఓ ప్రేమలేఖ తయారు చేసి, గులాబి రంగు కవరులో పెట్టి ఆమెకి అందించాడు. నవ్వుతూ ఆమె ఆ కవరు అందుకుందే గానీ, రెండు రోజులు గడిచినా ఆమె నుండి ఏ విధమైన జవాబు రాలేదు. దానితో కొంచెం నిరాశ చెందినా తన బుర్రకి మరింత పదును పెట్టాడు. అప్పుడు మెదడులో ఓ మెరుపు మెరిసింది. తక్షణం తన ఆలోచన ఆచరణలో పెట్టాడు.
అంతే!
ఆ మరుసటి రోజు అపర్ణ అతనికి ఎదురు పడి, "సుందర్గారూ...నేను కూడా మిమ్మల్ని…." అని వాక్యంలో సగం మింగేసి సిగ్గు మొగ్గైంది.
"యాహూ!..." అని ఎగిరి గంతేసాడు సుందరం తన ఉపాయం ఫలించినందుకు. తన ప్రేమ ఫలించినందుకు చాలా సంతోషంగా ఉన్నాడు. ఆ రోజు నుండే ఇద్దరూ కలసి పార్కులూ, సినిమా హాళ్ళూ పావనం చెయ్యసాగారు. తన ప్రేమ సఫలమైన కారణంగా ఆ రోజు సాయకాలం తన స్నేహితులకు మంచి విందు ఇచ్చాడు సుందర్.
"అది సరే గానీ! అపర్ణని ఎలా పడగొట్టావు మిత్రమా!" తన సందేహం తీర్చుకోవడానికి కుతూహలంగా అడిగాడు ప్రేమానందం.
"ప్రేమలేఖ రాసినా ఆమె స్పందించకపోయేసరికి హాఠాత్తుగా నాకో ఉపాయం తట్టిందిరా! అపర్ణ పేరుపొందిన రచయిత్రి మాత్రమే కాదు, ఈ మధ్య ఓ అంతర్జాల పత్రికకి సంపాదకురాలిగా కూడా వ్యవహరిస్తోంది కదా. అందుకే ఈ సారి ప్రేమలేఖతో పాటు నా స్వదస్తూరితో రాసిన హామీ పత్రం కూడా జత చేసానురా!
ఆ హామీ పత్రంలో 'ఈ ప్రేమలేఖ నా స్వంతమని, ఎవరినీ అనుకరించలేదని, అనువాదం కానే కాదని, ఇంతకు ముందు ప్రేమలేఖ ఏ అమ్మాయికీ పంపలేదని, ఏ అమ్మాయి పరిశీలనలోనూ లేదనీ హామీ ఇచ్చానురా! అంతే, వెంటనే నా ప్రేమని ఆమె అంగీకరించినట్లు తెలిపిందిరా!
కాకపోతే, ఏ సామాజిక మాధ్యమాల్లోనీ, ఏ సామాజిక వేదికల్లోనూ ఎప్పుడూ ఎవరినీ ఉద్దేశించి ఏ ప్రేమలేఖ పెట్టలేదని, ఇకముందు పెట్టబోనని అదనంగా మరో హామీ పత్రం రాయించుకొని నా ప్రేమ ఖారారు చేసిందిరా! అలా హామీ పత్రమే ప్రేమలేఖగా, ప్రేమ పత్రంగా మారిందిరా! అంతే!" అన్నాడు సుందర్ చిరునవ్వులు చిందిస్తూ.
ప్రేమ విషయంలో అపార అనుభవం కలిగి ఉన్న ప్రేమానందం కూడా సుందర్ మాటలు విని నోరెళ్ళబెట్టాడు.
దివాకర్ల వెంకట దుర్గా ప్రసాద్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
Podcast Link:
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
పూర్తిపేరు దివాకర్ల వెంకట దుర్గాప్రసాద్. పుట్టింది, పెరిగింది కోరాపుట్ (ఒడిశా) లో, ప్రస్తుతం నివాసం బరంపురం, ఒడిశాలో. 'డి వి డి ప్రసాద్ ' అన్నపేరుతో వందకుపైగా కథలు ప్రచురితమైనాయి. ఆంధ్రభూమి, హాస్యానందం, గోతెలుగు, కౌముది, సహరి అంతర్జాల పత్రికల్లోనా కథలు ప్రచురితమయ్యాయి. బాలల కథలు, కామెడీ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
కథ బాగుంది అభినందనలు.