ఇంద్రియజాలం
- Keerthidhar
- Mar 20
- 3 min read
#KalamKathaKeerthidhar, #కలంకథకీర్తిధర్, #Indriyajalam, #ఇంద్రియజాలం, #TeluguStories, #తెలుగుకథలు

Indriyajalam - New Telugu Story Written By Kalam Katha Keerthidhar
Published In manatelugukathalu.com On 20/03/2025
ఇంద్రియజాలం - తెలుగు కథ
రచన: కలం కథ కీర్తిధర్
అది దేహవనం అనే ఒక రాజ్యం. ప్రజలు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. అక్కడి ఎర్ర మట్టి పొలాలు రైతులకు మంచి పంటలను ఇచ్చేవి. దేహవనం రాజు అయిన గణతగణుడు ఎంతో తెలివైన వాడు. ఆ రాజు పాలనలో రాజ్యం ఎంతో ఆనందంగా ఉండేది. అయితే, ఆ రాజ్యంలో ఐదుగురు గొప్ప ప్రతిభ కలిగిన మనుషులు ఉండేవారు, కానీ వారికి ఒకరికి ఒకరు అంటే అంతగా పడేది కాదు. "నేను గొప్ప" అంటే "నేను గొప్ప" అని ఐదుగురూ చెప్పుకునే వారు.
ఆ ఐదుగురు ఎవరు మరియు వారి ప్రత్యేకతలు ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
1.మొదటి వ్యక్తి గొప్ప కంటి చూపు కల వ్యక్తి. ఆమె పేరు మీనాక్షి. ఆమె కళ్ళు ఎంతో అందంగా ఉండేవి. ఆమె చూపు సూక్ష్మమైన వాటిని కూడా చూడగలిగేది. ఒకసారి రాజ్యంలో జరిగిన విల్లు పోటీలలో ఆమె మొదటి బహుమతి గెలుచుకుంది. ఆమె దృష్టి గ్రద్ద వంటిదని, గురి అర్జునుడి వంటిదని ఊరిలో అనేవారు.
2.రెండో వ్యక్తి శంకర్. ఆయన వాసనలను బాగా పసిగట్టేవాడు. "గాలి దానిలోని రహస్యాలను చెబుతుంది, కానీ దానిని జాగ్రత్తగా వినిపించుకోవాలి" అనేది ఆయన సిద్ధాంతం.
3.మూడో వ్యక్తి శ్రావణి. ఆమెకు వినికిడి శక్తి చాలా ఎక్కువ. ఒక రాత్రి శ్రావణి ఇంట్లో దొంగలు పడ్డారు. ఇంట్లో దీపం లేకపోయినా, ఆమె మరియు ఆమె భర్త అయిన శ్రవణుడు కలిసి వినికిడి శక్తి ద్వారా ఆ దొంగలను పట్టుకున్నారు.
4.నాలుగో వ్యక్తి జిహ్వుడు. ఇతను మంచి వక్త. తన మాటలతో ఎవరినైనా నమ్మించగలడు.
5.అయిదో వ్యక్తి మృదుజలుడు. ఇతనిలో ఏదో దైవశక్తి ఉందని రాజ్యం అంతా నమ్మేవారు. అతని మంచి స్పర్శతో గాయాలను సైతం నయం చేయగల గొప్ప మహానుభావుడు.
ఇంక కథలోకి వస్తే, ఎంతో ప్రశాంతంగా ఉన్న ఆ దేహవనం రాజ్యంలో ఒక పెద్ద సమస్య వచ్చింది. అకస్మాత్తుగా రాజ్యం అంతా పెద్ద మాయాజాలపు పొగలో కప్పుకొని పోయింది. ప్రజలకు మార్గం కనిపించలేదు. పంటలు మాడిపోతున్నాయి. రాజ్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
తెలివైన రాజు అయిన గణతగణుడు తన మంత్రి చింతనుడుతో చర్చించాడు. రాజు మంత్రితో ఇలా అన్నాడు: "మంత్రీ! మన రాజ్యంలో ఉన్న ఐదుగురు కలిస్తే, ఈ సమస్యను పరిష్కరించటం సులువు అవుతుంది."
మంత్రిచింతనుడు: "ఆజ్ఞ, ప్రభూ! ఆ ఐదుగురు మన ముందుకొచ్చేలా ఆదేశిస్తాను."
దాంతో మంత్రిచింతనుడు ఆ ఐదుగురిని రాజు దగ్గరకు హాజరు కావాలని డండోరా వేయించాడు. ఆ మాయపొగ తగ్గు ముఖం పెట్టుకున్నప్పుడు, వారు అంత త్వరగా రాజుగారి కోట చేరుకున్నారు. వారు చేరుకున్న కొద్ది సమయానికే, ఆ మాయపొగ మరింతగా గాఢంగా మారింది.
ఆ సమయంలో రాజుగారి సమీక్షలో జరిగే సంభాషణ ఈ విధంగా సాగింది: (రాజు తన సింహాసనంపై కూర్చున్నాడు, ఆ ఐదుగురు సభలో ఉన్నారు.)
రాజు: "ఈ సమస్యకు పరిష్కారం ఎలా కనుగొంటారు?"
మీనాక్షి: "ఇంత చిన్న విషయానికి ఈ నలుగురితో పని ఎందుకు, రాజుగారూ! నా సూక్ష్మ దృష్టితో ఆ పొగ ఎక్కడి నుంచి వస్తోందో తెలుసుకొని ఆపేస్తాను," అని ఆమె గర్వంగా చెప్పింది.
(ఇంతలో...)
శంకర్: "రాజు గారు, నాకు గాలి ఏదో సందేశం ఇస్తోంది. మీరు అనుమతి ఇస్తే నేను ఈ సమస్యను పరిష్కరిస్తాను," అని అన్నాడు. (ఇలా అందరూ తమ తమ గొప్పలను చెప్పుకుంటుంటే రాజుకు కోపం వచ్చింది. ఇది మంత్రి గమనించాడు.) మంత్రి: "ఇది మీ గొప్పలను చెప్పుకునే సమయం కాదు. రాజ్యం కోసం మనమందరం కలసి పని చేయవలసిన సమయం ఇది," అని ఎంతో కోపంగా అన్నాడు. "చూడండి, మీ శక్తులు గొప్పవే కావచ్చు, కానీ అది సరిపోదు. దానికి తగిన ఐకమత్యం ఉండాలి. అందరం కలసి పని చేస్తేనే పని అవుతుంది," అని చెప్పాడు. (అందరూ ఆలోచించి, మంత్రితో అంగీకరించారు.)
మంత్రి ఆ ఐదుగురికి ఆ రాజ్యంలో మాయపొగ మూలాన్ని చిత్రపటంలో చూపించాడు. మంత్రి: "మాకు వచ్చిన సమాచారం ప్రకారం, ఏదో శపించిన శక్తివంతమైన వస్తువును మన రాజ్యం మీదకు వదిలారు. అది ఈ చిత్రపటంలో చూపించినట్టుగా ఇక్కడ ఉంది," అని ఆ వస్తువు ఉన్న ప్రాంతాన్ని చూపించాడు.
అయిదుగురు ఐకమత్యంగా ఒకటిగా అయ్యారు. మీనాక్షి తన సూక్ష్మ దృష్టితో దారి చూపిస్తూ ఉంది, మిగతా నలుగురు ఆమె వెంటే నడుస్తున్నారు. ఇంతలో పక్కనుంచి ప్రజల ఏడుపు వినిపించింది. అది తన శ్రవణ తేజస్సుతో శ్రావణి పసిగట్టింది. శ్రావణి, దైవస్పర్శ కలిగిన మృదుజలుడును వెంట పెట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్లింది. మృదుజలుడు తన దైవస్పర్శతో ప్రజల గాయాలను నయం చేశాడు. ఇంతలో ప్రజలు ఆ శపించిన వస్తువు వైపు పరుగు తీస్తున్నారని గమనించిన మీనాక్షి, వక్త అయిన జిహ్వుడుతో, "వాళ్ళందరినీ భయపడకుండా ఆపండి" అని చెప్పింది. జిహ్వుడు తన మాటలతో వారిలో ధైర్యాన్ని నింపి, పరుగు తీస్తున్న ప్రజలను ఆగేలా చేశాడు. మీనాక్షి, సూక్ష్మ దృష్టి కలిగి ఉన్నా, తనకు ఆ శపించిన వస్తువు కనిపించలేదు. అప్పుడు శంకర్ తన శ్వాసను అదుపులో పెట్టుకొని నిశ్చింతగా గాలిని పరిశీలించాడు. అతను ఆ శపించిన వస్తువును తన చేత్తో బలంగా విసిరాడు. ఆ శపించిన వస్తువు ముక్కలుగా విరిగి పోయింది. రాజ్యం అంతా శుభ్రమైన గాలి వ్యాపించింది. రాజు ఆ అయిదుగురు రాజ్యానికి చేసిన మేలుకు ఎంతో మెచ్చుకున్నాడు.
ఇంతలో మంత్రి వాళ్లతో ఇలా అన్నాడు: "చూశారా! మీరు కలిసిపని చేస్తే పెద్ద పెద్ద సమస్యలను కూడా జయించవచ్చు" అని చెప్పాడు. ఆ మాట విన్న ఆ అయిదుగురు కలిసిపోయారు. వాళ్ల మధ్య ఇకపై ఎటువంటి గొడవలు లేవు.
కథ ఉద్దేశ్యం: ఈ కథలోని పాత్రలు ఎవరూ కాదు, అవి మన జ్ఞానేంద్రియాలు, ఆ రాజ్యం అయిన దేహవనం అంటే మన శరీరం. ఆ జ్ఞానేంద్రియాలను ఐక్యంగా చేసే రాజు మన మెదడు, వాటిలో ఐకమత్యాన్ని నింపిన మంత్రి మన మనస్సు. మనస్సు తన జ్ఞానేంద్రియాలను అలాగే హృదయం మరియు మెదడును అదుపులో ఉంచుకుంటే ఎలాంటి విజయాలను సొంతం చేసుకోవచ్చో చెప్పడమే ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
మీనాక్షి - కన్ను
శంకర్ - శంఖం (ముక్కు)
శ్రావణి - చెవి శ్రవణుడు - రెండో చెవి (కథలో శ్రావణి భర్త)
జిహ్వుడు - నాలుక
మృదుజలుడు - మృదుజలకం (చర్మం)
గణతగణుడు - గణతగణం అనగా మెదడు
చింతనుడు - మనసు(చింతనం)
నీతి: ఐకమత్యమే మహాబలం!
కలం కథ కీర్తిధర్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
Profile Link:
కలం పేరు: కలం - కథ - కీర్తిధర్
మంచి సందేశం నా ఉద్దేశం ❤️
Comments