యింటింటా సూర్యకాంతం
- Srinivasarao Jeedigunta
- Jan 25
- 4 min read
#JeediguntaSrinivasaRao, #జీడిగుంటశ్రీనివాసరావు, #IntintaSuryakantham, #యింటింటాసూర్యకాంతం, #TeluguKathalu, #తెలుగుకథలు

Intinta Suryakantham - New Telugu Story Written By - Jeedigunta Srinivasa Rao
Published In manatelugukathalu.com On 25/01/2025
యింటింటా సూర్యకాంతం - తెలుగు కథ
రచన : జీడిగుంట శ్రీనివాసరావు
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
“ఆరునెలలు దాటింది, మీ నాన్న ని ఎప్పుడు తీసుకుని వెళ్తాడు మీ అన్నయ్య?” అంది కోపంగా రమణి, మొగుడు కార్తీక్ తో.
“ఎప్పుడు తీసుకుని వెళ్తావు అని అడిగితే ఏం బాగుంటుందే, వీలు చూసుకుని వచ్చి తీసుకుని వెళ్తాడులే, అయినా అలా గట్టిగా సూర్యకాంతం లా అరుస్తావే.. మా నాన్న వింటే బాగుండదు” అన్నాడు.
“చూడండి.. ఒప్పందం అంటే ఒప్పందమే, ఆరునెలలు తరువాత ఒక్క రోజు అయినా ఆలస్యం చెయ్యకుండా తీసుకుని వెళ్ళాలి. మనం ఒక రోజు ముందే తీసుకుని వచ్చి నెత్తిన పెట్టుకోవడం లేదా, యిహ ఈ కంచి గరుడ సేవ నేను చెయ్యలేను” అంది కళ్ళు పెద్దవి చేస్తో..
“వుంటే మా నాన్న అరవై వేల పెన్షన్ ఈ నెల కూడా నువ్వే తీసుకుంటావుగా, ఎందుకు అరుపులు” అన్నాడు భయపడుతూ.
ఇప్పటికే గొడవలు అయ్యి, విడాకులు యిచ్చి వాళ్ల నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను అని భార్య బెదిరించడంతో నోరు ఎత్తలేక పడున్నాడు కార్తీక్.
***
“అలా ఊరంతా బలాదూర్ తిరిగి మట్టి కాళ్ళ తో మంచం మీద పడి దొర్లకపోతే కాళ్ళు కడుక్కుని రావచ్చుగా” అంది మమత.
“కాళ్ళు కడుక్కుని వచ్చాను, అసలే చలికాలం, ఎన్నిసార్లు కడుక్కోవాలి” అన్నాడు రాజు.
“ఏదైనా అంటే నా నోరు బయట పడుతోంది. చూడండి.. ఆ కాళ్ళు ఎంత నల్లగా వున్నాయ్, లేవండి శుభ్రంగా కడుక్కుని రండి” అంది.
“నా కాళ్ళ రంగు అంతే. యిప్పుడు మళ్ళీ లేవలేను. నీ శుభ్రత తో చస్తున్నాను” అన్నాడు రాజు.
“యింట్లో ఏదీ అచ్చిరావడం లేదంటే ఎలా వస్తుంది, మీ మొండితనంతో ఏదీ కలిసిరావడం లేదు. మొన్న సంక్రాంతి పోటికి పంపిన కథలన్ని తిరిగి వచ్చాయి” అంది రుసరుసలాడుతో.
“రావా మరి! ఏదో యుద్ధనపూడి సులోచనా రాణి మీ అమ్మకి వెయ్యి కిలోమీటర్ల దూరం చుట్టం అని నిన్ను కూడా కధలు రాయమని మీ అమ్మ నిన్ను ఎగతోసింది” అన్నాడు.
“యిదిగో యిలాగే మీరు మాట్లాడుతూవుంటే మీ మీద, మీ అమ్మా నాన్న మీద, మీ చెల్లెలు మీద గృహహింస కేసు పెట్టి అందరిని జైలుకి పంపుతాను” అంది.
“ఎక్కడో లండన్ లో వున్న చెల్లెలు నీతో మాట్లాడనే మాట్లాడదు, అది ఎలా హింసించిందే” అంటూ ‘ఈ సూర్యకాంతంతో ఎలాగొ’ అనుకుంటూ లేచి బాత్రూం లో కి వెళ్ళి కాళ్ళు కడుగుకుని వచ్చాడు.
***
స్నానం చేసి మేడ మీద నుంచి దిగి వస్తున్న భర్త ఫోన్ చూస్తో కోపంగా “మళ్ళీ మీ అక్కయ్య కి డబ్బులు పంపించారా” అంది కుమారి.
“నా ఫోన్ ఎందుకు ముట్టుకున్నావు, ఏదో అవసరం అంటే పంపించాను” అన్నాడు మూర్తి.
“ఆవిడకి అవసరం ఎప్పుడు లేదుట, యిక్కడ చెట్టుకి డబ్బులు కాస్తున్నాయి అనుకుంటోంది. మీరేమో పెళ్ళానికి మొదటి వారం సినిమా చూపించటానికి టికెట్ రేట్స్ పెంచేసారు, టీవిలో వస్తుందిగా అప్పుడు చూడు అంటారు, ఊళ్ళో వాళ్ళకి దోచిపెట్టడానికి చేతులు బాగా వస్తాయి” అంటూ అరుస్తున్న భార్య వంక చూసి, “క్రిందటి నెల మీ అమ్మ పుట్టినరోజు అని నా చేత ఐఫోన్ కొనిపించి ఇప్పించావు. అప్పుడు ఎందుకు గుర్తు రాలేదు చెట్టుకి డబ్బులు కాయడం లేదని” అన్నాడు విసుగ్గా.
“ఏదైనా అంటే లక్షలు పోసి మిమ్మల్ని కొన్న మా తల్లిదండ్రులకి పెట్టింది మాత్రమే గుర్తుకు వస్తుంది, వెంటనే దెప్పి పొడుస్తారు. యిహనుంచి మీ బ్యాంకు అకౌంట్ కి నా టెలిఫోన్ నెంబర్ ఇవ్వండి, మీరు చేసే దానధర్మలు నాకు తెలుస్తాయి” అనటం తో, “యిదిగో.. పెళ్ళిలో నిన్ను గంపలో కూర్చోపెట్టి తీసుకుని వస్తోవుంటే సరదాగా అనిపించింది గాని, ఆ గంపలో గంపగయ్యాళి ని తెచ్చారాని అనుకోలేదు” అంటూ బయటకు వెళ్ళిపోయాడు.
***
“యిక్కడ నా మెడిసిన్ సీసా పెట్టాను ఏది” అన్నాడు సంతోష్.
“ఏమిటి అంటున్నారు.. ఈ కుక్కర్ సౌండ్ లో ఏదీ వినిపించడం లేదు. వుండండి వస్తున్నాను” అంటూ వచ్చింది పద్మావతి.
“యిక్కడ నా బీపీ టాబ్లెట్స్ సీసా వుండాలి ఏది” అన్నాడు గూట్లో వెతుకుతో.
“బాగానే వుంది నాకేం తెలుసు, ఎక్కడ పెట్టారో సరిగ్గా చూసుకోండి, కాణి అంత సహాయం లేదు గాని, వంట చేసుకుంటున్నదానిని అరుస్తో పిలుస్తున్నారు కొంపములిగినట్టు” అంటూ వంట గదిలోకి వెళ్ళింది.
గూట్లో వున్న ప్లాస్టిక్ కవర్ తీస్తోవుంటే, వంట గదిలోనుంచి గట్టిగా అరిచింది, “అది నా మందుల కవర్. అది ముట్టుకోకండి, మీ మందులు అందులో వుండవు” అంటూ వచ్చి కవర్ లాక్కుంది.
“అబ్బబ్బా! బీపీ కోసం టాబ్లెట్ వేసుకుందాం అని చూస్తోవుంటే నీ అరుపులకి బీపీ పెరిగిపోతుంది” అన్నాడు సంతోష్.
మాత్రలు సాయంత్రం కొనుకుందాం అనుకుని వూరుకున్నాడు.
భోజనం అయిన తరువాత టాబ్లెట్ వేసుకుందాం అని తన మందుల సంచి తీసిన పద్మావతి కి తన సంచిలో భర్త బీపీ టాబ్లెట్స్ సీసా కనిపించిడం తో , “యిదిగో ఈ సీసా కోసమేనా వెతుకుంటున్నారు, నా మందుల కవర్లో పడేసినట్టున్నారు” అంది.
“నేను ఎందుకు పడేస్తాను, నువ్వే ఎక్కడ పెట్టిన వస్తువు అక్కడ ఉండనివ్వకుండా చేసి మళ్ళీ తప్పు నాది అన్నట్టు మాట్లాడటం నీ తరువాతే ఎవ్వరైనా. నా వస్తువులు ముట్టుకోవద్దు అంటే వినవు” అన్నాడు సంతోష్.
“ఇల్లంతా మందుల షాపులా వుంది చూడండి. అందుకే సద్దినట్టున్నాను, దానికే కొంపలు అంటుకున్నట్టు అరుపులు ఎందుకు” అంటూ అరుస్తోంది పద్మావతి.
“బాబోయ్! నీతో వేగటం చాలా కష్టం, చేసేది చేసి పైగా అరుపులు” అన్నాడు సంతోష్.
“ఆ ముచ్చట తీరుతుంది లేండి, నేను పోయిన తరువాత తెలుస్తుంది నేను లేని లోటు, హాయిగా హోటల్ లో తింటారో, వండుకుని తింటారో చూద్దాం” అంది.
“ఎందుకు పద్మా, చిన్న విషయానికి యింత అల్లరి, పోయే దాకా ఎందుకు చెప్పు, కొద్దిగా ప్రశాంతం గా ఉండటం నేర్చుకో, కావాలంటే బాబా రాందేవ్ ఆశ్రమం లో ఒక పదిరోజుల కోర్స్ అటెండ్ అవ్వు” అన్నాడు నవ్వుతో.
“ఆ వెకిలి నవ్వు నవ్వకండి, ఏదో విధంగా నన్ను సాగనంపాలి అనే కదా మీ ఉద్దేశ్యం” అంది కళ్ళు తుడుచుకుంటో. తనని కొద్ది సేపు ఒంటరిగా వదిలేయడం మంచిది అనుకుని టీవీ పెట్టుకున్నాడు. టీవిలో తోడికోడళ్ళు సినిమా లో సూర్యకాంతం రేలంగి సన్నివేశం వస్తోంది.
వంటగదిలో నుంచి రివ్వున వచ్చి “మీ ఉద్దేశ్యం నేను సూర్యకాంతం అనేగా ఆ సినిమా పెట్టారు” అంటూ రిమోట్ తీసుకుని టీవీ ఆపేసింది. ‘రామా నను బ్రోవరా’ అని పాడుకుంటో పడుకోడానికి వెళ్ళాడు పాపం సంతోష్.
***
పార్కులో భార్యబాధితులు అందరు చేరి కబుర్లు చెప్పుకుంటున్నారు.
“యిహ వెళదాం అండి, చీకటి పడింది” అన్నాడు సంతోష్.
“వుండండి. యింటికి వెళ్ళి ఏం చేస్తారు? మన్సశాంతి పోగుట్టుకోవడం తప్పా” అన్నాడు మూర్తి.
యింతలో ఒక ముప్పై అయిదు ఏళ్ళ కుర్రాడు వచ్చి వీళ్ళ బెంచి మీద కూర్చున్నాడు.
“బాబూ! ఈ గ్రూప్ నీది కాదు, అక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు అక్కడకి వెళ్ళు” అన్నాడు మూర్తి.
“నేనూ మీ సంఘానికి చెందిన వాడినే అండి” అన్నాడు అతను.
“ అదేమిటయ్యా.. చూస్తో వుంటే ఈమధ్య పెళ్లి అయినవాడివి లా వున్నావు, అప్పుడే మీ యింట్లోను..” అంటూ ఆగాడు సంతోష్.
“ఏం చెప్పమంటారు సార్, మాది ప్రేమ వివాహం, ఎంతో యిష్టపడి పెళ్లి చేసుకున్నాము. పెళ్లిరోజున శాస్త్రి గారు “అమ్మాయీ! వెళ్ళి అబ్బాయి పక్కన కూర్చో” అనగానే తను వచ్చి నా పక్కన కూర్చుంది. నాకు ఎంతో హాయిగా అనిపించింది.
ఇంతలో తను నా చెవిలో, “ఏమిటి మీ అమ్మానాన్న తెగ మురిసిపోతున్నారు, మనం కాపురం పెట్టిన తరువాత మీ తల్లిదండ్రులు, మా తల్లిదండ్రులు మనదగ్గరకి వచ్చి ఉండటానికి వీలులేదు గుర్తుపెట్టుకో” అంది.
ఆ మాట వినగానే అక్కడ నుంచి లేచి వెళ్ళిపోదాం అనిపించింది, అయితే పెళ్లి విందులో చాలా రకాల వంటలు వున్నాయి అని తెలిసి ఆగిపోయాను. అప్పటి నుంచి నా పరిస్థితి అంతేగా అంతేగా అయిపొయింది” అన్నాడు.
“అయ్యో పాపం, సరే రేపటి నుండి నువ్వు కూడా యిక్కడే కూర్చో” అన్నాడు సంతోష్.
“నాయనా! ఈ బాధలన్నిటికీ కారణం మోజు నాయనా, కళ్ళు మూసుకునిపోయి నెత్తిన ఎక్కించు కుంటాము, యిహ దింపటం మన వల్ల కాదు. యిది నాయనా సత్యం” అంటూ లేచాడు రాజు.
శుభం
జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


"యింటింటా సూర్యకాంతం" కథలో, రచయిత కుటుంబ సంబంధాలు, ఆర్థిక వివాదాలు, మానసిక ఒత్తిడిని వివరిస్తాడు. ఈ కథలో ప్రధానంగా పాత్రల మధ్య వివాదాలు, వాదనలు, మాటల యుద్ధాలు చోటుచేసుకుంటాయి. రమణి, మమత, పద్మావతి వంటి పాత్రలు తమ భర్తలతో ఆర్థిక సమస్యలు, అవసరాలు, నిర్ణయాలు గురించి ఇబ్బంది పడుతుంటే, వారి మధ్య సంబంధాలు క్షీణిస్తున్నాయి. ఆర్థిక ఒత్తిడులు, వ్యక్తిగత అవసరాలు, కుటుంబ సభ్యులతో సంబంధాలు ఈ కథలో ప్రధానంగా చిత్రించబడ్డాయి. ముఖ్యంగా, ఈ కథ ఒక మనసిక ఒత్తిడి, స్వార్ధం, కుటుంబం మధ్య తేడాలను సూచిస్తూ, హాస్యమూ జోడిస్తుంది. చివరగా, ఇది మనం ఎదుర్కొనే సామాజిక, ఆర్థిక సమస్యలు, వాటి ద్వారా వచ్చే మానసిక ఒత్తిడిని ఎలాఎదుర్కోవాలో చెపుతుంది