'Jathirathnam' New Telugu Story
Written By Damaraju Visalakshi
'జాతిరత్నం' తెలుగు కథ
రచన: దామరాజు విశాలాక్షి
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
రాగరంజితమైన తూర్పుకనుమలలో, అప్పుడే జన్మించి, పొత్తిళ్ళనుండి తొంగిచూస్తున్న, పసికందులాంటి బాలభానుణ్ణి, పురిటి బిడ్డను ప్రేమగా అక్కున చేర్చుకుని ఆనందించే తల్లిలాంటి ప్రకృతిని, చిగురించిన పొదలను, విరబూసిన పువ్వులను, మంచుకి తడిసిన లేలేత సూర్యకిరణాలు పడి, మెరిసీ మురిసే హేమంత సోయగాలను, పొలాలకెళ్తున్న రైతులను, నీలాటిరేవు నుండి వస్తున్న స్త్రీలను, ముంగిళ్ళలో రంగవల్లులు దిద్దుతున్న ముద్దుగుమ్మలను, ఆహారాన్వేషణకై, గుండెనిండా ఊపిరి పీల్చుకొని గూళ్ళు నుండి బయటకు వచ్చి రెక్కలు టపటపా కొట్టుకుని గుంపులుగా వెళ్తున్న పక్షులను, ఆలమందలతో వెళ్తున్న పాలేర్లను, చలిమంటల చుట్టూ చేరి కాచుకుంటూ కబుర్లాడుకుంటున్న వృద్ధులను, మేలుకొలుపులు పాడి, ఇళ్ళకు మరలుతున్న భజన బృందాలను, హరిదాసులను, బుడబుక్కల వాళ్ళను, కొమ్మదాసరులను, కన్నెలేడి గుంపుల్లా కదిలే కన్నెపిల్లలను.. ఒక్కటేమిటి ఆ గ్రామంలో తనకు నచ్చిన, మనసు మెచ్చిన ప్రతీ అంశాన్నీ, వీడియో కెమేరాలో బంధించి నడుస్తున్నాడు రాజీవ్..
“చినబాబూ, చిన్నప్పుడు నిన్నెంతో సాకినా. నాకో ఫోటో తియ్యవా?" అన్న చిన్ననాటి దాసికి, "బాబుగారూ, మాకో” అనే పసివాళ్ళకు, తనను అడిగినవారికి, తన అనుకున్నవాళ్ళకీ, ఫోటోలు తీసి, మురిసిపోతూ ముందుకు సాగిపోతున్న ఆ యువకునికి, రాఘవయ్య మాష్టారు గుర్తుకువచ్చి అటువైపు వడివడిగా అడుగులేసాడు రాజీవ్.
పచ్చని శరీరఛాయ, పాతికేళ్ళు నిండిన వయస్సు, పట్టుపంచె, లాల్చీ, పైన కండువా, మోచేతితో క్రాఫ్ ఎగదోసుకుంటూ వస్తున్న కాంతిపుంజంలాంటి ఆ యువకునిపై, వరండాలో వాలుకుర్చీలో కూర్చొని వాశిష్ట రామాయణం చదువుతున్న రాఘవయ్యగారి దృష్టి పడింది. చూచే లోగా అతడు పాదాలకు వంగి మాష్టారికి నమస్కారం చేశాడు. “దీర్ఘాయుష్మాన్భవ, దీర్ఘాయశస్వీభవ” అని దీవించి, ప్రేమతో దగ్గరకు తీసుకున్నారు మాష్టారు.
తన ఎదురుగా ఉన్న కఱ్ఱకుర్చీలో కూర్చోబెట్టి “ఎంత పెద్దగా ఎదిగావురా బాబూ? అలా ఎదిగినా నీ ప్రవర్తనలో ఏ మార్పులేదు. అంతర్జాతీయ ఖ్యాతినందిన ఓ యువ శాస్త్రవేత్త ఇలా నన్ను చూడడానికి వచ్చాడంటే, నా కెంతో గర్వంగా ఉంది” అన్నారు సంబరంగా రాఘవయ్యగారు. “బాగున్నావా, నాయనా!” మురిసిపోతూ అన్నారాయన.
“ఇదంతా మీ వరప్రసాదమే గదా మాస్టారూ! విద్యా బుద్ధులు నేర్పి, ఇంత విజ్ఞానం, కీర్తి పొందేట్టు చేసారంటే, మీ ప్రభావమే గదా మాష్టారూ. ఇదుగోండి, మాష్టారూ. చంద్రునికి ఓ నూలుపోగు ఈ కంకణం” అంటూ బంగారు కడియాన్ని మాష్టారి చేతికి తొడిగి, మరోసారి నమస్కరించాడు రాజీవ్. “నన్ను దీనిలో చూచుకోండి” అన్నాడు.
చనువుగా జేబులో పెన్ను తీసుకుని “నీ జ్ఞాపకంగా ఇది చాలు తండ్రీ. ఆ కంకణం నువ్వు బలవంతంగా ఇచ్చినా నావద్ద ఉండదు. నిన్ను చూసాను. నాకదే సంతోషం” నీళ్ళు నిండిన కళ్ళతో రాజీవ్ వీపు నిమురుతూ అన్నారు మాష్టారు.
‘ఈయన ఎంత నిస్వార్ధపరుడు?’ అనుకుని అడిగాడు.
“అమ్మగారు ఎక్కడ? సారధీ, ప్రభు, కౌముదీలు ఎక్కడ, మాష్టారూ?” ప్రశ్నల వర్షం కురిపించాడు..
రాజీవ్ మాటలకు భారంగా నిట్టూర్చి “ఏం చెప్పేది నాయనా? పెద్దవాడు పక్క ఊరికి పంచాయితీ కార్యదర్శి, అంతేగాదు ఏవో వ్యాపారాలు చేస్తాడు. రెండోవాడికి చదువు వంటబట్టలేదు. రాజకీయాల్లో తిరుగుతూ, కాంట్రాక్టులు చేస్తూ, వ్యాపారాలు గూడా చేస్తాడు. అమ్మాయి అత్తవారింటనే ఉంది.”
మాష్టారు అంటుండగానే లోపలినుండి జోరుగా మాటలు వినిపిస్తున్నాయి.
“ఈ చెత్తంతా ముసలాయనదే. నా సంపద, నా సంపద అని ఎవరికీ ఇవ్వనీయడు. చూస్తూ చూస్తూ వదలడు. అతగాడు సంపాదించి కూడబెట్టిన ఆస్తులు లేవుగాని ఈ చెత్తకు లోటులేదు. పండక్కి పిల్లలొస్తారు. ఆ ముసలాయన ఆ వరండాలోనో, పెరటిగదిలోనో ఉంటాడులే” అంటోంది కోడలు కాబోలు.
“ఈ చెత్తంతా భోగి మంటల్లో పడేయ్” అని వినపడింది. కన్నీళ్ళతో మాష్టారు కుర్చీలో కూలబడ్డారు. “నిజమే, మీ మామగారికి చాదస్తం, పోదు, భోగిమంటల్లో పడేయ్” మరో ఆడగొంతు. ‘మాష్టారి భార్యదనుకుంటాను.’ ఇంతలో, 'ఏంట్రా గోల? అంటున్నాడు బహుశా కొడుకేమో. “నాన్నగారి సామాన్లు భోగిమంటల్లో ఏసేమన్నారయ్యా అమ్మగారు” అని బాధతో పలికింది పాలేరు గొంతు.
“దానికింత గోలేంటిరా, ఆయన్ని భోగిమంటల్లో పడేయమనలేదుగా? అవేమన్నా అమెరికావో, రష్యావో కాదుకదా! తీరాచూస్తే అవి డొక్కులు, డోళ్ళు. కొడుకు సారధి గొంతు. అదేదో గొప్ప జోకులా, పకపకానవ్వులు. అదిరిపడిన రాజీవ్ ఇక ఉండలేక, భారం నిండిన గుండెతో ఇటు తిరిగేసరికి, చేతులతో ముఖాన్నిదాచుకొని, రోదిస్తున్నారు వృద్ధుడైన రాఘవయ్య మాష్టారు.
వారి పరిస్థితి చూడలేక మరి అక్కడ ఉండలేక, భారమైన గుండెతో, మాష్టారు కాళ్ళకు నమస్కరించి బయటపడ్డాడు రాజీవ్. వారింటి ముందు వేపచెట్టు దగ్గర ఆలోచిస్తూ ఆగిపోయాడు.
స్వదేశంలో జరుగుతున్న ఈ అతి దారుణాన్ని చూడలేక, ఆ వస్తు దహన కార్యక్రమాన్ని తిలకించే ధైర్యంలేక, ఆ స్వదేశీ వ్యామోహి ‘జాతిరత్నం’ ఆలోచిస్తూ నిలుచుండిపోయాడు. అప్పుడే అటుగా వస్తున్న పాలేరుని ఆపి “ఏం రంగన్న తాతా, బాగున్నావా?” అని ఆప్యాయంగా పలకరించాడు. “ఆ నెత్తిపై మూటేంటి?” ఏమీ తెలియనట్లు అడిగాడు. అతని ముఖంలోకి తరచి చూస్తూ.
“ఏటి సెప్పమంటారు బాబూ? వేలాదిమంది పిల్లల్ని బాగుసేసిన దేముడు మాష్టారు. నేడు నా కొడుకు మంచి గవర్నమెంటులో పెద్ద ఉద్యోగంలో ఉన్నాడంటే ఆ బాబు సలవే. నువ్వొచ్చెయ్, పువ్వులో పెట్టి సూస్తానంటాడయ్యా. కానీ, ఈ మాష్టారు బాబు పానం ఉన్నంత వరకు రాన్రా. తర్వాతొస్తానని సెప్పినాను. ఆ బాబు నాకు చేసిన మేలుకి ఋణం తీర్చుకోవాలి గదా బాబూ.”
మాష్టారుగారి పిల్లలు, పెళ్ళాం, కోడళ్ళకి డబ్బు పిచ్చి బాబూ. ఇంకా డబ్బు సంపాదించనేదని బాధ. వట్టి డబ్బు మనుషులు. ఆల్లకి, విశ్వాసం, గౌరవం. ప్రేమ పాశం నేవు. ఆ బాబు ఆడిన ప్రతీమాటా, సేసిన ప్రతీ పని మనందరికి తోవ సూపెట్టినాది. ఆ యింటికి పనికి రానేదు. సర్లే బాబూ, ఇదుగో ఇయన్నీ ఆరి ఇంట్లో వాల్లు, బోగిమంట్లో పడేయమంటే నేను తీసుకెళ్తున్నా” అన్నాడు.
తాతా, ఏదీ, ఓసారి చూడనీయవా?” అంటే,
“నా బాబే! ఎందుకు సూడనియ్యను? కావాలంటే తీసుకుపో, ఆల్లకన్నీ ప్లాస్టిక్ముక్కలు, ఇనం ముక్కలు కావాలంట” అంటూ బుట్ట దింపాడు తాత. ప్రేమగా చూసాడు రాజీవ్.
శిష్యులిచ్చిన ఓ వ్యాసపీఠం, గంటం, దీపపు సెమ్మె, తాంబూలం పెట్టె, చేతికఱ్ఱ, కళ్ళజోడు పెట్టె, నగిషీలతో అందంగా ఉన్న కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలు, పెన్ స్టాండులు. తనే “అబ్బ, మీకెన్ని బహుమతులొచ్ఛాయో?” అనేవాడు.
మాష్టారు నవ్వుతూ “మీరందరూ బాగా చదువుకొని వృద్ధిలోనికి వస్తే అదే పెద్ద బహుమతి నాయనా” అనేవారు. గత జ్ఞాపకాలను తడివి చూసుకుని ఆ వస్తువుల్ని ఆప్యాయంగా గుండెలకు హత్తుకొన్నాడు రాజీవ్. తాత వద్దన్నా ఆ కంకణం అతని చేతికి పెట్టి నమస్కరించాడు రాజీవ్. “మాష్టారి తర్వాత ఈ కంకణం ధరించే అర్హత నీకే ఉంది. మాష్టారిని నువ్వే బాగా చూసుకో తాతా, నేను మా నాన్నమ్మ పేరు మీద ఆశ్రమం స్థాపిస్తున్నాను” అన్నాడు రాజీవ్.
“తాతగారు పొలంలో కట్టమన్నారు. ఇంట్లో అందరూ ఒప్పుకున్నారు. దానిని నడిపించే బాద్యత మాష్టారికి అప్పగిస్తాను. ఆ అశ్రమానికి రూపకల్పన జరిగిపోయింది. నామాటగా మాష్టారికి చేప్పి ఒప్పించే బాధ్యత నీదే. బ్యాంకులో కొంత సొమ్ము జమ చేస్తాను, ఆ వడ్డీతో ఆయనకి కావలసినవి అందజెయ్. అలాంటి వారు మరి కొందరికి ఆశ్రయం దొరుకుతుంది. మాష్టారిని సాయంత్రం శివాలయానికి తీసుకురా తాతా, మాట్లాడదాం” నిశ్చయంగా అన్నాడు రాజీవ్.
“నా తండ్రి, నిండు నూరేళ్లు చల్లగా బ్రతుకవయ్యా? ఇంట్లోవాళ్లు ఆ బాబు భారం పోయిందని ఇంకా సంతోషిస్తారు. నేను మాష్టారిని ఒప్పిస్తాను. ఆత్మహత్య మహా పాపం అందుకే బ్రతుకుతున్నాను రంగయ్యా అంటారు మాష్టారు. మనసు కష్టపడినప్పుడల్లా ఉపవాసాలు చేస్తారు బాబూ. ఆ మాష్టారు బాబు గాందీ తాతే” అని రంగయ్య తాత అంటుంటే, తలూపాడు రాజీవ్.
మాతృదేశం పట్ల అభిమానం గల ఆ యువకుడు, విదేశాల్లో ఉన్నా, స్వదేశీ వస్తు దహనం జరగరాదని భావించి, సగర్వంగా దానిని ఆపగలిగినందుకు సంతోషించి ఇంటిముఖం పట్టాడు వృద్ధాశ్రమానికి రూపకల్పన జేస్తూ. ఉత్సాహంగా ఉదయిస్తున్న సూర్యునిలాంటి రాజీవ్...
***
సంవత్సరం తర్వాత ఆశ్రమంలో అడుగు పెట్టిన రాజీవ్....
అస్తమయ సమయంలోకూడా, ఉజ్వలమైన ఉషోదయంలో లేచి, ఉన్ని స్వెట్టర్లల్లుతూ, బుట్టలల్లుతూ, బొమ్మలు చేస్తూ, ప్రేములు కడుతూ, అప్పడాలు, వడియాలు పెడుతూ, హాయిగా ఉన్న వారిని చూచి ఆనందించాడు. రాజీవ్..
“మాష్టారూ, మీరు పిల్లల్నే కాదు పెద్దల్ని కూడా ప్రేరేపించి, మంచి మార్గాలవైపు మళ్ళించగలరు.” అంటూ చేతులు ఎత్తి నమస్కరించాడు…
“అదేం లేదు బాబూ. ఆదర్శంతో ఈ ఆశ్రమాన్ని నిర్మించావు నువ్వు. నా బాధల నుండి నన్ను బయటకు లాగి నాకీ బాధ్యత నప్పగించావు. చివరిక్షణం వరకూ చీకూచింతా లేకుండా బ్రతికేలా చేసావు..ఇక్కడున్న వాళ్ళందరిదీ ఇంచుమించుగా ఇలాంటి చరిత్ర కలవారే. నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సహృదయంతో వర్ధిల్లావయ్యా” అంటూ తృప్తిగా దీవించారు మాష్టారు..
***
దామరాజు విశాలాక్షి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం:
నా పేరు దామరాజు విశాలాక్షి. విశ్రాంతౌపాధ్యాయని, విశాఖపట్నం.
ప్రస్తుతం కెనడానుండి.
Comments