top of page
Original_edited.jpg

కొసమెరుపు

  • Writer: Veereswara Rao Moola
    Veereswara Rao Moola
  • Nov 20, 2024
  • 4 min read

#VeereswaraRaoMoola, #వీరేశ్వరరావుమూల, #Kosamerupu, #కొసమెరుపు, #TeluguKathalu, #తెలుగుకథలు

ree

Kosamerupu - New Telugu Story Written By - Veereswara Rao Moola

Published In manatelugukathalu.com On 20/11/2024

కొసమెరుపు - తెలుగు కథ

రచన: వీరేశ్వర రావు మూల


అసలు రచనలు చెయ్యడం కూడా ఒక వ్యసనమేమో! రచనలు చెయ్యడం, అవి బాగున్నాయని చదివిన వాళ్ళు అనడం, మళ్ళీ రాయడం. మళ్ళీ అచ్చవ్వడం వీటన్నిటివల్ల రచన వ్యసనంలా తయారవుతుంది. ఆరోజు వ్రాయడానికి ఏం కనిపించలేదు. 


వీధిగది కిటికీ తెరిచి కూర్చున్నాను. 


"తెరిచిన కిటికీ ప్రపంచానికి మీనియేచర్!" అన్నాడొక హైకూ కోయిల! నేను కూర్చున్నాక నా స్నేహితుడు భరత్ వచ్చాడు. వాడు నాకు డిగ్రీలో క్లాస్మేట్. ఈ మధ్య హైదరాబాద్ వచ్చాడు ఉద్యోగం అన్వేషణ గురించి. 


“శేఖర్! నేను కథ చెప్తాను వ్రాస్తావా?" 


'కథ కోసమే కదా కాచుక్కూర్చున్నాను'..

 ఇద్దరం కుర్చీలలో సెటిలయ్యాము. భరత్ ప్రారంభించాడు. 


 ******


భరత్ చిన్నప్పుడు అమలాపురం దగ్గర అగ్రహారం లో ఉండే వాడు. భరత్, పదేళ్ళ వయస్సులో ఒకరోజు పెద్ద కళ్ళు. రెండు జళ్ళు ఉన్న అమ్మాయి వచ్చి 'సయోనరా' అంటే ఏమిటి అని అడిగింది. 


“సయోనరా అంటే జపాన్ భాష లో గుడ్ బై అని అర్ధం” అని చెప్పి “ఎవరు నువ్వు?” అని అడిగాడు భరత్. 


“మేము మీ ఇంటి పక్కన అద్దెకు వచ్చాము” అని చెప్పింది.


 పెద్ద కళ్ళ అమ్మాయి. పేరు 'ప్రియ'. అలా పరిచయం అయ్యాక ఇద్దరూ కలిసి స్కూలుకు వెళ్ళేవారు. ఇద్దరూ కలిసి ఆడుకొనేవారు. ప్రియకు వర్షం అంటే చాలా ఇష్టం. చాలాసార్లు వర్షంలో తడిసి ఇంట్లో దెబ్బలుతింది. భరత్ ప్రియ కోసం కాగితం పడవలు చేసేవాడు. ఒకసారి పడవలు చేయడానికి చిత్తు కాగితాలు దొరక్కపోతే మ్యాథ్స్ హోమ్ వర్క్ పుస్తకంలోని కాగితాలు చించి, లెక్కలు మాస్టారుచే దెబ్బలు తిన్నాడు. 


మరోసారి నెమలికన్ను తెలుగు వాచకంలో దాచుకోవడానికి, నెమలికన్ను ఆహారానికి తాటిమట్టల దగ్గరికి వెడితే గీరుకొని రక్తం వచ్చింది. భరత్ తన చేతి మీద ఉన్న మచ్చ చూపించాడు ప్రియ కి. రక్తం వచ్చిన రోజున భరత్ నాన్న గట్టిగా కేకలు వేసాడు ప్రియ తో తిరగవద్దని.


నాలుగు రోజుల తర్వాత భరత్ చెరువు లో ఈదుతున్నాడు. గట్టువైపుకు వస్తుంటే వెనుకనుండి ఎవరో కళ్ళు మూసారు. చేతులు విడదీసి చూసాడు. వెనుక ప్రియ. 


"పేద్ద మగరాయుడిలా చెరువులో ఈత కొట్ఠడానికి వచ్చావా? 

నేను మాత్రం కొట్ట లేనా ఈత" అని సుడి ఉన్న వైపు వెళ్ళింది. 

భరత్ తన వైపు లాక్కున్నాడు. 


ఒంట్లో ఏదో గిలి గింత!. ప్రియ పూర్తి గా వికసించని స్నిగ్ధ! 


"ఆడపిల్లకి ఈత ఏమిటి?" అని ప్రియ ని ఇంట్లో తిట్టారు.

 

'ఆడపిల్లను చెరువుకు తీసుకువెడతావా" అని భరత్ నాన్న, వీపుమీద రెండు వడ్డించాడు.


అలా ఇద్దరూ హాయిగా ఆడుతూ, నవ్వుల్తో, కేరింతల్తో కాలాన్ని కొలుస్తుంటే ప్రియ నాన్నకి ట్రాన్సఫర్ అయింది. ప్రియ వెళ్ళి పోయింది భరత్ ని విడి పోయిన తరువాత ప్రియ నుండి ఉత్తరాలు లేవు భరత్ కి. 

 ******

"తరువాత ప్రియ కనిపించిందా" అడిగాను నేను. 


"లేదు ప్రయత్నాలు చేసాను" చెప్పాడు భరత్. 



మళ్ళీ భరత్ చెప్పడం ప్రారంభించాడు. 


ప్రియ తలపులే తలుస్తూ యవ్వనం లోకి ప్రవేశించాడు భరత్. అతను బియ స్సీ చదువుతున్నప్పుడు వ్రాసిన కవిత కాలేజ్ మేగజైన్లో అచ్చయినప్పుడు మంచి స్పందన వచ్చింది. ఆ కవిత ఇది.. 


"ఒకే కప్పు క్రింద రెండు ఆత్మలు కావాలి నాకు 

సహనంగావేచే రెండు కళ్ళు 

ప్రేమామృతాన్ని అందించే రెండు పెదవులు 

ఆర్తిగా చుట్టుకొనే రెండు చేతులు 

ఒకరికొకరు అద్వైతానందాన్ని పంచుకొనే రెండు క్షణాలు" 


భరత్ తో మాట్లాడాలని చాలామంది అమ్మాయిలు ప్రయత్నించారు. కానీ అతను అవకాశం ఇవ్వలేదు. ఎక్కువగా ఒంటరితనాన్ని ఇష్టపడేవాడు. 


"సరే ఇంత వరకూ చెప్పాను. ముగింపు. నువ్వు ఊహించి కథ వ్రాయి" అన్నాడు భరత్. 


కొద్ది సేపటికే భరత్ పని ఉందని చెప్పి వెళ్ళిపోయాడు. 


నేను ఆలోచనలో పడ్డాను. ఎలా వ్రాయాలి. ఏదో డ్రమటైజ్

చేసి వ్రాస్తేకాని పాఠకులు ఊరుకోరు. 


'కొసమెరుపుతో ఎలా వ్రాయాలి' అని ఆలోచిస్తున్నాను.


పదిహేనేళ్ళ క్రితం ఏదో పల్లెటూర్లో చూసిన అమ్మాయిని మళ్ళీ కలిసాడా? కలిస్తే ఏం జరిగింది? ఆలోచించాక

ఒక ముగింపు తట్టింది. 


********'' 


కూకట్పల్లి విలేజ్ హోటల్లో టీ తాగుతున్న భరత్ కి ఒక ముసలాయన పరిచయం అయ్యాడు. ఆయన మాటల సందర్భంలో ప్రియ మేనమామ అని చెప్పాడు. ఆయన ద్వారా తెలిసింది ఆరోజే ప్రియ గోదావరి ఎక్స్ ప్రెస్లో రాజమండ్రి వెడుతోందని, అప్పుడు సమయం నాలుగు గంటల పది హేను నిమిషాలైంది. వెంటనే ఆటో ఎక్కా డు. ఆటో పంజగుట్ట సిగ్నల్ దగ్గర ఆగింది. ట్రాఫిక్ క్లియర్ అవ్వడానికి పదినిమిషాలు పట్టింది. సమయం 4. 50 అయింది. 


భరత్ లో టెన్షన్ పెరుగుతోంది. సరిగ్గా 5గం. లకు నాంపల్లి స్టేషన్కి చేరాడు. కోచ్ ఎస్3ని వెదికి, సీట్ నెంబర్ 10ని చూశా డు. ప్రియ కనబడింది. పక్కన ఒక వ్యక్తి కూర్చున్నాడు. ప్రియ మెడలో కొత్త మంగళ సూత్రాలు మెరుస్తున్నాయి. పలకరించుదామనుకున్నాడు. 


పలకరిస్తే భర్త అనుమానిస్తాడేమో..

నామూలంగా ప్రియకు కష్టాలు రాకూడదు. పలకరించలేదు. గోదావరి కదిలింది. నెమ్మదిగా కనుమరుగైంది. 


 ********

భరత్ కి గోదావరి వెళ్ళాక ఒక హైకూ గుర్తుకు వచ్చింది. 


పట్టాలకి ఇవతల నీవు

ఆవతల నేను

మధ్యలో నడుస్తున్న జీవనచక్రాలు

కదిలిపోయే సమాంతర రేఖలు 


భరత్ స్టేషన్ నుండి బయటికి వచ్చాడు. ఇక్కడ భరత్ కి తెలియని విషయం ఒకటి ఉంది. భరత్ చూసినది 'ప్రియ'ని కాదు! ఆమె చెల్లెలు పరిమళ'ని. ఇద్దరి పోలికలు ఒకలాగే ఉంటాయి. 

 *******

భరత్ కి కథ ముగింపు చూపించి పత్రికకు పంపుతున్నా అన్నాను. బాగుందన్నాడు. 


తరువాత భరత్ నాకు కని పించలేదు. హైదరాబాద్లో లేడని తెలిసింది. 


 ********


రెండు సంవత్సరాల తర్వాత.. 


నాకు వివాహం జరిగింది. భరత్ కి శుభలేఖ పంపాను. భరత్ ఢిల్లీలో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడని తెలిసింది. భరత్ పెళ్ళికి రాలేదు. 


తరువాత సంవత్స రంలో.. 


భరత్ ఆశ్చర్యంగా హైదరాబాద్లో కనిపించాడు. మనిషి విచారంగా ఉన్నాడు. 


"ప్రియ కనిపించడం కష్టం ఏమో!" అన్నాడు. 


"అమ్మా నాన్న దురాశవల్ల ప్రియని పోగొట్టుకున్నాను"

"ప్రియ సంబంధం ఉందని ప్రియ నాన్నగారు మా నాన్నకి - ఉత్తరం వ్రాసాడు. కట్నం 10వేలు తక్కువ ఇస్తామని అనేసరికి మరోమాట మాట్లాడవద్దని చెప్పి పంపించేశారు. కనీసం పెళ్ళికూతురు పేరు 'ప్రియ' అన్న విషయం అప్పుడు నాకు తెలియదు. ఆ సమయంలో నేను ఢిల్లీ లో ఉన్నాను"


"కనీసం నాన్నగారు ప్రియ వాళ్ళ ఎడ్రస్ నాకు ఇవ్వలేదు. పెళ్ళికూతురు ప్రియ అని అమ్మ చెప్పింది. సర్లే.. నీ విషయం చెప్పు. ఇంకా రచనలు చేస్తున్నావా? పెళ్ళయ్యిందా?" అడిగాడు భరత్. 


"నువ్వు పెళ్ళికి రాలేదు. శుభలేఖ వేసాను. ఇప్పుడు 

తప్పని సరిగా మా ఇంటికి రావాలి" అన్నాను నేను. 


నేను, భరత్ ఇంటికి చేరుకొని డ్రాయింగ్ రూమ్లో కూర్చున్నాము, నా భార్య వంటింట్లో ఉంది. 


"నా స్నేహితుడు భరత్ వచ్చా డు రా!" అని పిలిచాను. 


నా భార్య వచ్చింది. అప్పుడే విరిసిన గులాబిలా ఉంది. ఆమెను చూచి భరత్ ఆశ్చర్యపోయాడు. 


"నా భార్య కృష్ణప్రియ" అని పరిచయం చేసాను. 


"భరత్"


కాఫీ తీసుకువస్తానని నా భార్య లోపలికి వెళ్ళింది. 

"నువ్వు నా కథ వ్రాసావు కదా!" అన్నడు భరత్. 


“అవును ప్రింటైంది అప్పుడే! రెస్పాన్స్ కూడా బాగా వచ్చింది.  ఓ హెన్రీని ఇమిటేట్ చేసాను అన్నారు"


"అవును.. ఈ కథకి రచయిత ఊహించని ముగింపు చెప్ప

మంటావా?"


"ఏమిటి?" అడిగాను ఆశ్చ ర్యంగా!


"భరత్ చిన్నప్పుడు ఆడుకున్న ప్రియే ఇప్పుడు నీ భార్య

కృష్ణప్రియ! "


నేను అవాక్కయ్యాను! 


ఆరగంట తర్వాత భరత్ వెళ్ళిపోయాడు. 

ప్రక్కింటివాళ్ళ అమ్మాయి వచ్చి అడిగింది..


"సయోనరా అంటే ఏమిటి అంకుల్?"


"జపాన్ భాషలో 'గుడ్ బై' అని అర్ధం" అని చెప్పాను నేను. 


"నేను చిన్నప్పుడు ఇదే విషయాన్ని ఎవర్నో అడిగానే?" అనుకుంటోంది కృష్ణప్రియ. ఆమె అస్పష్ట జ్ఞాపకాల అలల్లో భరత్ ఉన్నాడేమో! 


ఎవరి మైబైల్ నుండో హిందీ పాట వినిపిస్తోంది. 

"హర్ ములాకాత్ కి అంజామ్ జుదాయి క్యోం?" 


 సమాప్తం  


వీరేశ్వర రావు మూల  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

రచయిత పరిచయం:

క‌వి, ర‌చ‌యిత‌. నిర్మాణ రంగంలో ఐటీ విభాగం మేనేజర్ గా ప‌నిచేసి పదవీ విరమణ తీసుకున్నారు. 1985 నుంచి రాస్తున్నారు. వివిధ పత్రికల్లో క‌థ‌లు, కవితలు, కార్టూన్‌లు, ఇంగ్లిష్‌లో కూడా వంద‌కు పైగా క‌విత‌లు వివిధ వెబ్ ప‌త్రిక‌ల్లో ప్ర‌చురిత‌మ‌య్యాయి.నిధి చాల సుఖమా నవల సహరి డిజిటల్ మాసపత్రిక లో ప్రచురణ జరిగింది. 






Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page