top of page

కుటుంబ ఆర్ధిక జ్ఞానం

Writer's picture: Amaraneni MaheshAmaraneni Mahesh

#MaheshAmaraneni, #మహేష్అమరనేని, #KutumbaArthikaJnanam, #కుటుంబఆర్ధికజ్ఞానం, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ


Kutumba Arthika Jnanam - New Telugu Story Written By - Mahesh Amaraneni

Published In manatelugukathalu.com On 02/02/2025

కుటుంబ ఆర్ధిక జ్ఞానం - తెలుగు కథ

రచన: మహేష్ అమరనేని


ప్రకాశరావు హడావిడిగా ఇంట్లోకి వచ్చాడు. ఆఫీస్ బ్యాగ్ సోఫాలో వేసి, “పద్మా, బట్టలు బ్యాగ్‌లో సర్దావా? తొందరగా వెళ్ళాలి. సమయం లేదు. బస్సు బయలుదేరింది” అని అన్నాడు.


“సిద్ధంగా ఉన్నాయి. ఇడ్లీ చేశాను. తిని వెళ్ళండి” అని పద్మ అంది.


“సమయం లేదు అంటే, ఇడ్లీ, బోడ్లి అంటూ... ” అని విసుక్కుంటూ వెళ్ళాడు ప్రకాశరావు. 

***

“పద్మ, ఒకసారి ఇటు రా” అని ప్రకాశరావు పిలిచాడు. 


“వస్తున్నాను” అంటూ పద్మ లోపలికి వచ్చింది. ప్రకాశరావు ల్యాప్‌టాప్ తెరిచి ఏదో ఫైల్స్ చూస్తున్నాడు. 


“చెప్పండి, ఎందుకు పిలిచారు?” అని పద్మ అడిగింది. 


“ఇలా రా, ఇక్కడ కూర్చో” అని ప్రకాశరావు అన్నాడు. 


“ఏమిటి, చెప్పండి” అని పద్మ అడిగింది. 


“చెబుతాను, నువ్వు ఇక్కడ కూర్చొని నేను చెప్పేది జాగ్రత్తగా వినాలి” అని ప్రకాశరావు అన్నాడు. 


“ఏమిటి అంత జాగ్రత్తగా వినాలి? వంట ఇంట్లో అన్నం, కూర పొయ్యి మీద ఉన్నాయి. నేను వెళ్ళాలి” అని పద్మ అంది. 


“అబ్బా, సరే, ముందు ఆ పని అయ్యాక ఇక్కడికి రా, నీతో కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలి” అని ప్రకాశరావు అన్నాడు. 


ఈ లోపు ప్రకాశరావు కొన్ని ఫైల్స్ వెతుకుతూ ఉన్నాడు. అరగంట తరువాత, పద్మ ప్రకాశరావు దగ్గరికి వచ్చింది. “ఇప్పుడు చెప్పండి, ఏమి వినాలి?” అని అడిగింది. 


“రా, ఇక్కడ కూర్చో” అని ప్రకాశరావు అన్నాడు. 


“ముందుగా నన్ను క్షమించాలి” అని ప్రకాశరావు అన్నాడు. 


“ఏమైంది మీకు? మీ స్నేహితుడి ఊరికి వెళ్ళి వచ్చినప్పటి నుండి మీరు ఏదోలా ఉన్నారు” అని పద్మ అడిగింది. 


“ఏమీ లేదు, నువ్వు మధ్యలో మాట్లాడకుండా నేను చెప్పేది విను” అని ప్రకాశరావు అన్నాడు. 


“ఇది నా ల్యాప్‌టాప్‌లో ఉన్న “మై డీటెయిల్స్” ఎక్సెల్ ఫైల్ పాస్‌వర్డ్. ఇది ఎవరికీ చెప్పవద్దు” అని ప్రకాశరావు అన్నాడు.


 “నాకు ఎందుకు చెబుతున్నారు దీని గురించి?” అని పద్మ అడిగింది. 


“మాట్లాడకుండా నేను చెప్పేది వినమన్నాను కదా, నీ సందేహాలు ఉంటే తరువాత అడుగు. సరేనా?” అని ప్రకాశరావు అన్నాడు. 


“సరే, చెప్పండి” అని పద్మ అంది. 


“నా జీతం వివరాలు, నా బ్యాంకు వివరాలు, అకౌంట్ నెంబర్, నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్, నా పాలసీ వివరాలు, నేను ఎవరికి డబ్బు ఇచ్చాను, నేను ఎవరి దగ్గర నుండి డబ్బు తీసుకున్నాను, మన పది ఎకరాలు ఎవరికి కౌలుకి ఇచ్చాను, అన్ని వివరాలు ఇందులో ఉన్నాయి” అని ప్రకాశరావు అన్నాడు. 

“నువ్వు ఈ పాస్‌వర్డ్ ఒక్కటి గుర్తు ఉంచుకుంటే చాలు, ఈ ఫైల్ ఓపెన్ చేస్తే మన ఆర్థిక పరమైన అన్ని వివరాలు ఇందులో ఉన్నాయి” అని ప్రకాశరావు అన్నాడు. 


“పిల్లలకు కూడా అన్ని విషయాలు చెప్పాలి. ఒకవేళ నాకు ఏమైనా అయితే మీరు ఇబ్బంది పడకూడదు” అని ప్రకాశరావు అన్నాడు. 


“ఏమి మాట్లాడుతున్నారు? ఏమైంది మీకు? ఎప్పుడు లేనిది ఈరోజు ఇవన్నీ నాకు ఎందుకు చెబుతున్నారు?” అని పద్మ అడిగింది. 


“చెబుతాను, మన పెళ్లి అయిన కొత్తలో, నువ్వు మన పొలం గురించి, నా సంపాదన గురించి అడిగావు, అప్పుడు, నిన్ను కసురుకున్నాను. నీకు ఎందుకు ఈ వివరాలు అని, మళ్ళీ తరువాత నువ్వు నన్ను ఏమీ అడగలేదు. అవునా?” అని ప్రకాశరావు అన్నాడు. 


“అవును, మీ భార్యగా నాకు అన్ని విషయాలు తెలిస్తే మంచిది అని అడిగాను, డబ్బు ఎక్కడ ఇస్తున్నారు, ఎక్కడ తీసుకుంటున్నారు తెలిస్తే నేను కూడా ఏమైనా సలహాలు కానీ, సూచనలు కానీ ఇవ్వచ్చు అని అడిగాను” అని పద్మ అంది. 


“హ్మ్, అందుకే అప్పుడు నిన్ను కసురుకున్నాను కాబట్టే, ఇందాక నన్ను క్షమించమని అడిగాను. నా మీద గౌరవంతోనో, భయంతోనో నువ్వు నన్ను మళ్ళీ వాటి గురించి అడగలేదు, నేను చెప్పలేదు. నేను ఇచ్చే నెలవారి డబ్బులతోనే నువ్వు ఇల్లు చక్కబెట్టేదానివి. పిల్లలకి నాకు కావలసిన అన్ని చేసేదానివి” అని ప్రకాశరావు అన్నాడు. 


“వచ్చే వారం పండక్కి మనం అందరం ఊరికి వెళుతున్నాము. పిల్లలకి, నీకు మన పొలం సరిహద్దులు చూపిస్తాను. అలాగే మన పొలం కౌలు చేసే సోమన్న ఇంటికి కూడా వెళదాము” అని ప్రకాశరావు అన్నాడు. 


“సరేలెండి, ఇంతకు ఏమైంది? ఎందుకు వీటి గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు?” అని పద్మ అడిగింది. 


“అదా, చెబుతాను. మొన్న నా స్నేహితుడు చనిపోతే వాళ్ళ ఊరికి వెళ్ళాను కదా, అక్కడ జరిగిన కొన్ని సంఘటనలు నాకు కనువిప్పు కలిగించాయి” అని ప్రకాశరావు అన్నాడు. 


“ఈ రోజుల్లో, ఎవరి ప్రాణం ఎప్పుడు, ఎలా పోతుందో తెలియదు. నా స్నేహితుడు కూడా చాలా ఆరోగ్యంగా ఉండేవాడు. హఠాత్తుగా గుండెపోటు వచ్చి నిద్రలోనే చనిపోయాడు. పాపం, వాడి భార్య, పిల్లలకి ఆస్తుల గురించి కానీ, ఎవరికి డబ్బులు ఇచ్చాడు, ఎవరి దగ్గర తీసుకున్నాడు, ఏమి విషయాలు తెలియవు. ఇంట్లో డబ్బు లేదు, ఆ అమ్మాయి దగ్గర రూపాయి లేదు. 


ఇంట్లో నెల నెల సరుకులు వాడే తెచ్చేవాడు. పిల్లలకి ఏమైనా కావాలంటే వాడే చూసుకొనే వాడు. పొరపాటున ఈ అమ్మాయి డబ్బులు అడిగినా ఎందుకు అని అడిగి, ఏమైనా కావాలంటే వాడే తెచ్చి ఇచ్చేవాడు. కనీసం గ్యాస్ బుక్ చేయటం కూడా తెలియదు ఆ అమ్మాయికి. ఆ అమ్మాయికి తల్లిదండ్రులు లేరు. అన్నయ్య కూడా ఈ మధ్య చనిపోయాడు. మా స్నేహితుడి తరపున కూడా పెద్దగా బంధువులు ఎవరూ రాలేదు. 


ముగ్గురు అప్పుల వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఆ అమ్మాయిని డబ్బులు కావాలని అడుగుతుంటే, ఆ అమ్మాయికి ఏమి అర్థం కావటంలేదు. ఇద్దరి దగ్గర డబ్బు తీసుకున్నట్టు నోట్ ఉంది. ఒక అతను నోటి మాట మీద ఇచ్చాను అంటాడు. పిల్లల స్కూల్ ఫీజుకి, ఇంటి లోన్ కోసం బిల్డర్ కి ఇవ్వటానికి కొంత డబ్బు అప్పు చేశాడు. వాళ్ళు వచ్చి డబ్బులు ఎప్పుడు ఇస్తారని కూర్చున్నారు. 


చుట్టాలు, చుట్టుపక్కల వాళ్ళు ఏమి మాట్లాడటం లేదు. ఇంటికి ఎంత EMI కడుతున్నాడు, బ్యాంకు డీటెయిల్స్ ఏమి పిల్లలకి, భార్యకి తెలియవు. వాడికి పొలాలు ఉండాలి, వాటి గురించి కూడా పిల్లలకి, భార్యకి తెలియవు అంట.  


నాతో ఒకసారి టర్మ్ పాలసీ తీసుకోవాలి అని అన్నాడు. మరి తిసుకోన్నాడో లేదో తెలియదు. 

‘అసలు ఏమి తెలుసుకోకుండా ఎలా ఉన్నావమ్మా’ అని అడిగితే, ఒకటి రెండు సార్లు అడిగితే గొడవలు అయ్యాయి అన్నయ్య గారు అన్నది. ‘నీకు ఎందుకు, నీకు ఏమి కావాలో చెప్పు, నేను తెస్తాను’ అని అనేవాడు, ఆర్దిక పరమైన విషయాలు ఏవి చెప్పేవాడు కాదు అంట. 


ఇద్దరు పిల్లలు ఉన్నారు. చిన్నోడు ఐదు, అమ్మాయి ఏడు చదువుతున్నారు. వాళ్ళకి డబ్బు విషయాలు ఏమి తెలియవు. బంధువులు కూడా, వీడికి వచ్చే పొలం అంటూ ఏమీ లేదు, అది వాడు డబ్బులు అవసరం వచ్చి వాడి భాగం వాళ్ళ అన్నకి అమ్మేశాడు అంటారు. 


కొంచెం గొడవలు అయ్యాయి. నిదానంగా అందరికీ నచ్చజెప్పి, తలా కొంచం డబ్బులు వేసి జరగాల్సిన పనులు అన్నీ కానిచ్చి వచ్చాము. ”

***

"తరువాత ఆలోచిస్తే, ఒకవేళ నాకే అలా జరిగితే, నా భార్య, పిల్లలు ఎలా? అనే భయం వేసింది. నేను కూడా నీ మీద అరిచేవాడిని ఏదైనా ఆర్థిక పరమైన విషయాలు అడిగితే, అందుకే నేను నీకు అన్ని విషయాలు చెప్పాలని అనుకున్నాను. 


పిల్లలకి కూడా మన ఆర్థిక పరిస్థితి చెప్పకపోతే, వాళ్ళకి ఏమీ తెలియదు, నాన్న దగ్గర డబ్బులు ఉన్నాయి, మనకే ప్రాబ్లం లేదు అనుకుంటారు. 


ఇంకొక ఏడాదిలో నా LIC పాలసీ అయిపోతుంది. ఒక పది, పన్నెండు లక్షలు వస్తాయి. నువ్వే ఏదైనా ఇన్వెస్ట్ ప్లాన్ ఆలోచించు. పిల్లల చదువులకి వస్తే చాలు”. 


“నాకు తెలిసిన ఏకైక ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ అంటే బంగారమే. అది అయితేనే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బుగా మారుతుంది. " అన్నది పద్మ. 


ఈ లోపు పిల్లలు స్కూల్ నుండి వచ్చారు. "ఒరేయ్, బట్టలు మార్చుకొని, ఫ్రెష్ అయి ఇటు రండి" అన్నాడు ప్రకాశరావు. 


పిల్లలు ఇద్దరు వచ్చారు. వారికి నెట్ బ్యాంకు ఓపెన్ చేసి, ఇంటికి ఎంత లోను తీసుకున్నాడు, ఎంత కట్టాడు, ఇంకా ఎంత బ్యాలన్స్ ఉంది, వడ్డీ ఎంత కట్టేడు అన్నీ చెబుతున్నాడు. 


అంతలోనే పద్మ, "అబ్బా, ఈ విషయాలు పిల్లలకి ఎందుకు చెబుతున్నారు? వాళ్ళకి ఏమి అర్థం అవుతాయి ఇవన్నీ" అంది. 


"అదేనొయి... నేను కూడా ఇన్నాళ్ళు అలాగే ఆలోచించాను. నా భార్య, పిల్లలకి నా సంపాదన, ఖర్చు గురించి ఎందుకు చెప్పాలి? చెప్పనవసరం లేదు. చెప్పినకాడి నుంచి, 'అది కొను, ఇది కొను, బంగారం కొను. నాన్న దగ్గర డబ్బు ఉందిగా, అన్నీ కొనవచ్చు కదా' అనుకుంటారు. నువ్వు కూడా నీ వాళ్ళకి డబ్బు సహాయం చేయమని అడుగుతావు. ఇలాగే పిచ్చి ఆలోచనలతో ఇన్నాళ్ళు చెప్పలేదు. కానీ ఇవన్నీ కుటుంబ పెద్దగా మీకు చెప్పాలి" అన్నాడు ప్రకాశరావు. 


"ఏమీ కాదు, ఈ విషయాలు పిల్లలకు తెలియాలి. ఇప్పటి పిల్లలు చాలా తెలివైన వాళ్ళు. అన్నీ అర్థం చేసుకోగలరు. చూడండి రా, ఇప్పటికి ఈ ఇల్లు బ్యాంకు వాళ్ళది. నాన్న డబ్బు మొత్తం కడితేనే ఒరిజినల్ పేపర్స్ బ్యాంకు వాళ్ళు మనకి ఇస్తారు. అర్థం అయినదా?" అన్నాడు ప్రకాశరావు. 


"పద్మ... నీకు ఒక స్మార్ట్ ఫోన్ ఆర్డర్ పెడతాను. అందులో అన్ని కావలసిన అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసి, ఎలా వాడలో, గ్యాస్ ఎలా బుక్ చేయాలో చెబుతాను" అన్నాడు ప్రకాశరావు. 


"నాకెందుకు, ఇచ్చారుగా ఒక డబ్బా ఫోన్, అదే చాలు, ఇదిగో... " అంది పద్మ. 


"చెప్పగా తప్పు అయింది అని. ఇప్పుడే ఆర్డర్ పెడతాను ఉండు, రెండు రోజుల్లో వస్తుంది. ?" అన్నాడు ప్రకాశరావు. 


“అప్పుడేదో అన్నారుగా స్మార్ట్ ఫోన్ ఉంటే ఆన్లైన్ లో అన్ని ఆర్డర్ పెట్టి డబ్బులు అన్నీ ఖర్చు పెడతావని” అన్నది పద్మ. 


"అన్నాను... ఇప్పటికి అది కరెక్ట్. కానీ ఏ వస్తువు కొనాలో, ఎంత వరకు వాడలో అంతవరకు వాడితే ఏమీ కాదు. నీ మీద నాకు నమ్మకం ఉందిలే. ఇంకా నుంచి ఏ దాపరికాలు లేవు. నా విషయాలు అన్నీ నీకు చెబుతాను. అలాగే పిల్లలకు కూడా ఆర్దికంగా తెలియవలసిన విషయాలు చెబుతాను" అన్నాడు ప్రకాశరావు. 


"అంటే ఇంతకాలం మీ సంపాదన గురించి తెలిస్తే, నేను మీ డబ్బు అంతా అనవసర ఖర్చు చేస్తాను అని అనుకున్నారు అవునా!”


"ప్రపంచం అంతా స్త్రీ శక్తి గురించి పొగుడుతుంటే, మీలాంటి కొంతమంది మాత్రం ఇంకా పాతకాలం ఆలోచనలతో ఉన్నారు. ఇంట్లో ఉన్న గృహిణిని తక్కువ చేసి చూడటం, వాళ్ళకు వంట తప్పితే ఏమీ తెలియదు అనుకోవటం, ఒకవేళ తెలిసినా ఏది దాచుకోరు, అన్ని అందరికీ చెబుతారు అనుకోవటం. పోనీలే, ఇప్పటికైనా తెలుసుకున్నారు. పెళ్ళాలు అందరూ మొగుడు సంపాదనని ఎలా పెంచాలా అని ఆలోచిస్తారే కానీ, కరిగించాలని అనుకోరు, ఎవరో ఇద్దరు, ముగ్గురు ఉంటే ఉన్నారు కానీ. ” అన్నది పద్మ. 


“సరేలేవో, నాకై నట్టు నాలాంటి వారికీ సమయం వచ్చినప్పుడు జ్ఞానోదయం అవుతుందిలే" అన్నాడు ప్రకాశరావు. 


***సమాప్తం***


మహేష్ అమరనేని గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



రచయిత పరిచయం: నా పేరు మహేష్. 

సాధ్యమైనంత వరకు, నిజ జీవితంలో చూసిన సంఘటనలు మీద కథలు రాస్తూ ఉంటాను. ఇంతకు ముందు కొన్ని కథలు ప్రతిలిపి లో ప్రచురించాను.







46 views2 comments

2 comentários


కుటుంబ ఆర్థిక జననం: మహేష్

బాగుంది. ఉపయోగం ప్రజలకు - కుటుంబాలకు. 

Accidental deaths ఎప్పుడైనా జరగ వచ్చు. అప్పుడు కుటుంబ సభ్యులు తయారుగా ఉండాలి ... అన్ని విషయాల్లో, ఆర్థిక విషయాల్లో మోస పోకుండా ... Awareness ఉండాలి. 

ప్రభుత్వం 24 hour help line కల్పిస్తే... ఎవ్వరూ మోస పోరు ... కష్టం - నష్టం పాలవ్వరు.

పి.వి. పద్మావతి మధు నివ్రితి

Curtir

mk kumar
mk kumar
03 de fev.

ఈ కథ "కుటుంబ ఆర్ధిక జ్ఞానం" ప్రకాశరావు, పద్మ మధ్య జరుగుతున్న సంభాషణల ద్వారా కుటుంబంలో ఆర్థిక విషయాలను పంచుకోవడం, అవగాహన పెంచడం వంటి ముఖ్యమైన అంశాలను వివరిస్తుంది.


ప్రకాశరావు తన కుటుంబ సభ్యులకు ఆర్థిక విషయాలను వివరించి, కుటుంబ పరిస్థితులపై అవగాహన పెంచాలని నిర్ణయించుకుంటాడు.


కథలో వాడిన స్నేహితుడి ఉదాహరణ, ఆర్థిక విషయాలను పంచుకోవడం ప్రాముఖ్యాన్ని తెలియజేస్తుంది. పద్మ మొదట నిరుత్సాహంగా ఉండగా, తర్వాత సమాజంలో మహిళల పాత్ర మారిపోతున్నట్లు తెలియచేస్తుంది. సమాజంలో ఆర్థిక విషయాలపై అవగాహన కలిగి ఉండడం, అన్ని తరగతుల వ్యక్తులకూ ముఖ్యమవుతుందని కథ చెప్తోంది.

ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి అవగాహన పెంచడం, కుటుంబ సభ్యుల మధ్య సానుకూల మార్పు సాధించడం ఆ కథలో మేధోజ్ఞానం.


కుటుంబంలో పారదర్శకత పెంచడం, ఆర్థిక లావాదేవీలు గురించి తెలుసుకోవడం, కుటుంబ సభ్యుల మధ్య బంధాన్ని పటిష్టం చేస్తుందని ఇది చూపిస్తుంది. కథ ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యుల మధ్య సంభాషణ పెంచడం, భవిష్యత్తు సంక్షోభాలను నివారించడంపై దృష్టి పెట్టింది.


Curtir
bottom of page