top of page

మచ్చ


'Machha' New Telugu Story
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

"ఆంటీ. మేము ఎదురింటి వారి పక్కవాటాలోకి వచ్చాము. మీకు పాలబ్బాయి ఇంటికి వచ్చి పోస్తాడట కదా. మీకు అభ్యంతరం లేకపోతే అతనికి చెప్పి మా ఇంటికి పంపిస్తారా?"


పడకగదిలో ఉన్న నాకు వీణ మీటినట్లు మధుర కంఠస్వరంతో మాటలు వినిపించాయి.


"అలాగా! తప్పనిసరిగా పంపిస్తానమ్మా. ఇంతకీ మీ పేరు? మీ వారు ఏం చేస్తుంటారు?"అడుగుతోంది శ్రీమతి.


" నాపేరు లక్ష్మీప్రణతి. ఆయన పాలిటెక్నిక్ కాలేజీలో ప్రొఫెసర్ గా చేస్తున్నారండి. తన పేరు లక్ష్మణ ప్రదీప్. ఆయన కాలేజీకి వెళ్ళడానికి బయల్దేరబోతూ టిఫిన్ చేస్తున్నారు. నేను మీతో ఈ విషయం అడుగుదామని ఇలా వచ్చాను. మళ్లీ ఇంకోసారి వస్తాను" అని వెళ్ళిపోయినట్టుంది ఆమె.


ఆమె పేరు మరోసారి గుర్తు చేసుకుంటూ నిటారుగా అయ్యాను. అప్రయత్నంగా నా ఎడం చేతి ముంజేయి చూసుకున్నాను. అక్కడ కట్టెతో కాల్చిన వాత 'మచ్చ'గా నన్ను వెక్కిరిస్తూ. ..గతంలోకి లాక్కెళ్ళింది.


*******


పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసినా ఇంకా ఉద్యోగం దొరకని రోజులు. ఒక కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ విద్యార్థులకు రసాయన శాస్త్రం బోధించడానికి పార్ట్ టైం లెక్చరర్ గా జాయిన్ అయ్యాను. మొదటిరోజు పాఠం చెప్పడానికి క్లాసులో అడుగుపెడుతూనే కుడివైపు మొదటిబెంచీలో ఐదవ స్థానంలో కూర్చున్న ఆమెను చూస్తూనే కన్ను తిప్పుకోలేకపోయాను.


ఆడవాళ్ళలో అందంగా ఉన్నా ఆకర్షణ ఉండని వాళ్ళు కొందరు, ఆకర్షణ, కళ లేకుండా,ఎర్రతోలు, పచ్చతోలు కప్పుకున్న పిండి బొమ్మల్లా ఉండే వాళ్ళు కొందరు. కానీ ఆ రెండూ కలబోసిన అద్భుత సౌందర్యం ఆమెది. ఆమె ముఖపద్మంలో అన్ని అవయవాలు సరైన నిష్పత్తిలో ఉన్నాయి. ముఖ్యంగా వెన్నముద్దల్లాంటి కళ్ళు, ఆ కళ్ళలో మార్దవమైన చూపు నన్ను మొదటి క్షణంలోనే ఆకర్షించాయి.


నేను స్థానంలో నిలబడి ఒక్క నిముషం తరగతిగది అంతా పరిశీలించాను. ఎక్కువమంది అబ్బాయిలు నా వైపు చూస్తూ మధ్య మధ్యలో తమ తమ లేడీస్ కు లైన్ వేసుకుంటున్నారు.


"శుభోదయం స్టూడెంట్స్" అంటూ నల్లబల్ల వైపు తిరిగి పాఠం మొదలుపెట్టాను.


పరమాణునిర్మాణం, ఎలక్రాన్ విన్యాసం, పరమాణు ధర్మాలైన పరమాణు సంఖ్య, పరమాణు ద్రవ్యరాశి, ధనవిద్యుదాత్మకత,ఋణవిద్యుదాత్మకత.. అన్నీ వివరంగా బోధ పరిచాను.


సంతోషాతిరేకంతో చప్పట్లు వినిపించినవైపు చూసాను. ఆ అమ్మాయే హుషారుగా కొడుతోంది. ఆమెను చూసి మిగతావారందరూ అందుకున్నారు.


ఆమె లేచి నిలబడింది.


"ధన్యవాదాలు సర్. చాలా బాగా అర్ధమయ్యేలా చెప్పారు" అని తనపక్కన కూర్చున్న వాళ్లకేసి చూసింది. వాళ్లూ నిలబడ్డారు.


"అవును సర్. పదో తరగతిలో విన్నా ఇంత స్పష్టంగా అర్ధం కాలేదు నాకైతే. చాలా బాగా చెప్పారు సర్" అంది మొదటి అమ్మాయి.


అవర్ పూర్తికావడంతో - "థాంక్యూ. ఎవరికైనా ఇంకా సందేహాలు ఉంటే ఇంటర్వెల్ లో స్టాఫ్ రూమ్ కి రావచ్చు. " అనేసి బయటకి వచ్చేసాను.


ఇంటర్వెల్ లో ఓ కుర్రాడు వచ్చాడు.


"సార్. నా పేరు లక్ష్మణ ప్రదీప్. నాకు రసాయనశాస్త్రము అంతగా రాదు. మీ ఇంటికి వస్తే ట్యూషన్ చెబుతారా?"


"కార్పొరేట్ కాలేజీలో ట్యూషన్ అంటే ఉద్యోగం పీకేస్తారు. ఏదైనా సందేహం ఉంటే ఒకే" అన్నాను.


"సాయంత్రం ఇంటికి వస్తాను సర్" అని నా ఇంటి వివరాలు తెలుసుకుని వెళ్లిపోయాడు.


*****


ఆ సాయంత్రం అతను వచ్చాడు. పరమాణు ధర్మాలు మళ్ళీ చెప్పమన్నాడు.. వివరించడానికి అతను తెచ్చి ఆ నోట్సు వెనుక అట్ట తిప్పాను.


ఆ వెనుక అట్ట లోపలి పేజీల్లో ఒక అమ్మాయికి ఏవేవో సందేశాలు.. .. ప్రేమచిహ్నాలు.. . ఇంకా కవితల్లోని, సినిమా ప్రేమపాటల్లోని వాక్యాలు దర్శనమిచ్చాయి.


''వీటి మీద దృష్టి ఉంటే తరగతి గదిలో పాఠం చెప్పినప్పుడు ఎలా ఎక్కుతుంది?'' అడిగాను.


''అయ్యో.. . సార్.. . ఇదంతా వన్ వే ట్రాఫిక్ లవ్.. . అంటే ఏకమార్గ ప్రేమ..''


''ఆ అమ్మాయికి తెలీదా?''


'' తెలీదు సర్. కానీ తనంటే నాకు పంచప్రాణాలు. తనని చూడందే ఒక్క రోజు కూడా ఉండలేను. '' అన్నాడు అతను తలవంచుకుని.


'' మరి ఇదేమిటి?'' అన్నాను ఒక నెంబర్ లాంటి సంఖ్య చూపిస్తూ.. .


'' హాజరు పట్టీలో నా నెంబర్ సర్. నాలుగు. '' అన్నాడు ప్రదీప్


'' నాలుగును ఇంత శృంగారంగా కూడా వేయవచ్చా ?'' అని వెటకారంగా అడిగాను.


''ఇది ఇంగ్లిష్లో కాపిటల్ 'ఎల్' సర్.. . దానికి కాపిటల్ 'పి' ని కలిపాను. అలా రెండు కలిపితే నా నెంబర్ సర్. ఎల్.. . అంటే లక్ష్మణ.. . పి అంటే ప్రదీప్. లక్ష్మణ ప్రదీప్. నా ఇనీషియల్స్ సర్. '' అన్నాడు.


''ఓహో..'' అని తల పంకించబోయి చటుక్కున ఆలోచన మెరిసిన వాడిలా అడిగాను.


''ఎవరైనా తన కిష్టమైన వాళ్ళ పేర్లు ఇలా ఎవరికీ తెలియకుండా రాసుకుంటారేమో గాని తన పేరు తాను ఎవరూ రాసుకోరే?'


''అది.. . అది.. . తరవాత చెబుతాను సర్. మళ్ళీ మైండ్ అటువైపు వెళ్ళితే నేను వచ్చిన పని ఆగిపోతుంది. అయోనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ అఫినిటి ఈ రెండింటికీ బేధం బాగా అర్ధమయ్యేలా చెప్పండి సర్'' అని అడిగాడు.


ఒక తటస్థ పరమాణువు లేదా అణువు నుండి ఒక రుణ విద్యుదావేశ కణాన్ని బయటకు తీయడానికి అవసరమైన శక్తిని ''అయోనైజేషన్ ఎనర్జీ'' అంటారు. అని ఉదాహరణలతో సహా వివరించాను.


అతనికి బాగా అర్ధం అయినట్టుంది.. . ఎక్కడికో ఆలోచనల్లోకి వెళ్ళిపోయాడు.


''ఏమయ్యా? ఏ లోకంలో ఉన్నావ్?'' అన్నాను.


''ఏం లేదు సర్. 'ఎలక్ట్రాన్ అఫినిటి ' అంటే కూడా ఏమిటో స్పష్టంగా చెప్పండి సర్. '' అన్నాడు.


''ఒక వాయు స్థితిలో ఉన్న తటస్థపరమాణువుకు ఒక రుణవిద్యుదావేశితకణాన్ని చేర్చడం వల్ల విడుదల అయ్యే శక్తిని ''ఎలక్ట్రాన్ అఫినిటి " అంటారు.. . '' అని ఆ మౌలికభావాన్ని కూడా ఉదాహారణలతో వివరించాను.


అతను అర్ధమైంది అన్నాక మళ్ళీ అతని చేత నేను వివరంగా చెప్పించుకున్నాక అతనికి అర్ధమైనట్టు నాకు అర్థమైంది.


'' ఇంతకీ అసలు విషయం చెప్పనే లేదు. ఈ రెండు మౌలికభావనలే నీకు ఎందుకు అర్ధం కాలేదు?'' అడిగాను.


'' కొన్ని అర్ధం అయినట్టుగా ఉండి అర్ధం కావు సర్. కొన్ని అర్ధంకానట్టు అర్ధమవుతాయి సర్. '' అన్నాడు.


వీడి అసాధ్యం కూలా.. . వీడెవడో ఈ వయసులోనే తత్వ శాస్త్రవేత్తలా ఉన్నాడే అనుకుని అర్ధం కానట్టు చూసాను.


''ఒక రుణ విద్యుదావేశాన్ని వాళ్ళ కుటుంబాన్నుంచి తీయాలంటే మనం 'శక్తి' ఖర్చుపెట్టాలి.. అదే.. .. ఒక రుణవిద్యుదావేశాన్ని మనం మరో కుటుంబంలోని పరమాణువుకు చేర్చాలంటే మనం 'శక్తి' ఖర్చుపెట్టాలి. ఇపుడు బాగా అర్ధమైంది సర్. '' అన్నాడు.


''కుటుంబం ఏమిటి?'' అన్నాను విస్తుపోతూ.


''అదే సర్.. . మా అక్కకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు సర్. కుటుంబంలోకి 'రుణవిద్యుదావేశం' లాంటి ఒక అమ్మాయిని ఇవ్వాలన్నా, తెచ్చుకోవాలన్నా.. . 'శక్తి' లాంటి 'డబ్బు' ఖర్చు ఎవరికైనా తప్పదన్నమాట. ''


''ఓరినీ.. . రసాయన శాస్త్రాన్ని ఇలా కూడా అన్వయించుకోవచ్చా ?'' అన్నాను.


''పొండి సర్.. . మీకేం తెలీనట్టు.. . రసాయన బంధం పాఠం చెప్పేటప్పుడు చూడండి. బోలెడు సందేహాలు వస్తాయి.. . అయానిక బంధం, సమయోజనీయ బంధం, సమన్వయ సమయోజనీయ బంధం.. . ఇవన్నీ ఎలా ఏర్పడతాయో.. . ఇంకా వివరంగా చెప్పాలి మీరు.. . ''


''చూడు.. . నాకు పాఠం పాఠంలా చెప్పడం వచ్చు.. . అంతేకానీ ఇలా పరమాణువుల్ని బంధాలకు, అణువుల్ని కుటుంబాలకు అన్వయించి చెప్పడం రాదు. ఆపెళ్లిళ్లు.. . డబ్బుఖర్చు మీపెద్దవాళ్ళుచూసుకుంటారు. బుర్రపెట్టి, బుద్ధిగాచదువుకో. '' అని పంపించేసాను.


అతను వెళ్ళాక.. . ఆ మొదటి బెంచీలోని అందగత్తెకు నా ప్రేమ విషయం ఎలా తెలియ చేయాలా అని ఆలోచనలో పడ్డాను.


******************


అది కార్పొరేట్ కళాశాల కదా.. . ఒక కుర్రాడు నా ఇంటికి సందేహం తీర్చుకోవడానికి వచ్చాడు అని యాజమాన్యానికి తెలిసినట్టుంది. నన్ను ఆఫీస్ రూమ్ కి పిలిచారు డైరెక్టర్.


''ఏమిటి.. తరగతి గదిలో పాఠం బాగా చెప్పేసి పిల్లలనుంచి అభినందనలు పొందావట. నువ్వు ఇక్కడ ఉద్యోగం చేసినంతసేపు నీ శక్తి అంతా మా సంస్థకే ధారపోయాలి. అంతే గానీ.. ఇలా పిల్లల్ని ఆకర్షించి ఒక్కక్కడిని నీవెనక తీసుకుపోతూ ఉంటె మేము చూస్తూ ఊరుకోము. అలా నీ వెనుక వచ్చిన కుర్రాళ్లతో మాకు పోటీగా ఓ ట్యూషన్ సెంటరో.. . ఒక జూనియర్ కాలేజీనో పెట్టుకుని నీ బ్రతుకుతెరువు నువ్వు వెతుక్కుంటే లక్షలు ఖర్చుపెట్టి ఇన్నిన్ని భవనాలు కట్టుకుని పిల్లలు లేక మేము మట్టికొట్టుకు పోవాలి. ఇంకో సారి ఇలా జరిగిందంటే నువ్వు వేరే ఉద్యోగం వెతుక్కోవాల్సి ఉంటుంది. ''అని నాకు మరో మాటకు అవకాశం ఇవ్వకుండా పంపేశారు.


నేను ఆవిషయం పెద్దగా పట్టించుకోకపోవడానికి కారణం ఆ అమ్మాయి. అనుక్షణం ఆ అమ్మాయే గుర్తుకురాసాగింది. ఒక్క మాటలో చెప్పాలంటే నిద్ర పట్టడమే మానేసింది. గడ్డంపెంచేసాను. వారం రోజుల్లోనే జ్వరం వచ్చిన వాడిలా తయారయ్యాను. అయితే నా డ్యూటీలో నేను పరిపూర్ణంగా ఉన్నాను. ఎందుకంటే ఏ మౌలిక భావన విద్యార్థికి అర్ధం కాకపోయినా అధ్యాపకుడిగా నేను ఓడిపోయినట్టే అనేది నా మౌలికసూత్రం.


మరో పదిహేను రోజుల తరువాత లక్ష్మణ్ ప్రదీప్ మళ్ళా ఇంటికి వచ్చాడు.


''ఈ సారి ఏ సందేహంతో వచ్చావు నాయనా?'' అన్నాను.


''సారి.. . మీరు ఏమీ అనుకోనంటే ఒక ప్రేమలేఖ రాసి పెట్టాలి సర్. ''


''ఎవరికీ?''


''ఆరోజు నా నోట్స్ వెనుక చూసారు.. . ఆ నెంబర్ నాలుగుకు.. . '' అన్నాడతను సిగ్గుపడుతూ.


''ఛీఛీ.. . నేను మగాళ్లకు ఉత్తరాలు రాసే టైపు అనుకున్నావా?'' అన్నాను కోపంగా.


''అయ్యో.. . ఆ నెంబర్ నాలుగుకు అంటే.. . నా ఎల్.. పి.. . కి సార్ '' అన్నాడు.


''ఛీఛీ.. . నువ్వు అలాంటివాడివనుకోలేదు. వెళ్ళు ముందు ఇక్కడనుంచి. '' అన్నాను కోపంగా.


''అబ్బా.. . ఎల్.. . పి.. . అంటే నేను ప్రేమిస్తున్న లవర్ లక్ష్మీ ప్రణతికి సార్.. ''


'' అంటే నీ నెంబర్ నాలుగుకు అర్ధం?''


''అవును సార్.. . ఎల్.. అంటే.. . లక్ష్మీ.. . నా పేరులో లక్ష్మణ్.. . పి.. . అంటే ప్రణతి.. ..


నా పేరులో ప్రదీప్. ''అన్నాడతను.


ఆ కుర్రాడి తెలివితేటలకు ఆశ్చర్యపోయాను. పిల్లల్ని బుద్ధిగా చదువుకోమని తలలు తాకట్టు పెట్టి లక్షలు ఫీజులు కట్టి కాలేజీకి పంపిస్తే వాళ్ళు నేర్చుకుంటున్న ట్రిక్కులు ఇవన్నమాట.. .


''ఇంతకీ ఎవరా అమ్మాయి?''


''మన క్లాసులో మొదటి బెంచీలో ఆఖరున కూర్చుంటూందే. తను సర్.. . "


''ఆ అమ్మాయి పేరు లక్ష్మీ ప్రణతా.. . "


నేను ఇంతవరకు ఆ అమ్మాయిని పేరు అడగనేలేదు.


''ఇంతకీ ఆ అమ్మాయి ఎక్కడుంటుంది? వాళ్ళ నాన్నగారు ఏంచేస్తారు?''అడిగాను.


''వాళ్ళ నాన్నగారు కాంట్రాక్టర్ సర్. మీ అవతలి వీధిలోని నాలుగు కొబ్బరి చెట్లు ప్రహారీ లోపల ఉన్న ఇల్లు వాళ్లదే.. ఆ వీధిలో కొబ్బరి చెట్లు కనిపించే ఇల్లు కూడా అది ఒకటే. వాళ్ళ అన్నయ్య అమెరికాలో చదువుకుంటున్నాడు. మా నాన్నగారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు. '' అన్నాడు.


''ఇంతకీ ఇపుడు నేను ఏం చేయాలి?''


''నేను తనకు రాసినట్టుగా మీరు ప్రేమలేఖ రాయండి సర్. నాకు భాష రాదు. మీరు రాసిన విధానానికి ఆమె నాకు పడిపోవాలి. రేపు క్లాస్ లో తన టెక్స్ట్ బుక్ అడిగి తీసుకుని మీరు పాఠం చెప్పేసాక ఆ ఉత్తరం అందులో పెట్టి ఇచ్చేయండి సర్. నేను మీకు సైగ చేస్తూనే ఉంటాను. ప్లీజ్ సర్. ఇదిగో సర్.. . లవర్స్ కి రాసే లవ్ లెటర్, కవర్'' అని ఒక రంగుల కవర్ నా చేతికి ఇచ్చి నా పాదాలమీద పడ్డాడు ప్రదీప్.


ఈ ఉద్యోగం నాకు ఎలాగూ ఉండి చావదు. అందుకే తెగించాలి. వాడికి ఆ అమ్మాయి పడిపోకముందే నాకు పడిపోయేలా ప్రేమలేఖ రాయాలి. ఈ చాన్సు పోగొట్టుకుంటే మళ్ళీ తన మనసుకు నచ్చిన అంత అందమైన అమ్మాయి నాకు మళ్ళీ దొరకదు - అనుకున్న నేను 'ఈ రాత్రికి చక్కగా ఉత్తరం రాసి రేపు ఉదయం కాలేజీకి తెస్తా'నని చెప్పి అతన్ని పంపించేసాను.


***********

నాకున్న సాహిత్య పరిజ్ఞానం, తెలివితేటలు అన్నీ ఉపయోగించి అయిదారు చిత్తు కాగితాలు పాడుచేసి, తేట తేనెలొలికే పదాలతో చక్కగా నా ప్రేమను వ్యక్తంచేస్తూ రాసాను.


మరునాడు పాఠం చెప్పాకా పిల్లలందరూ వెళ్లిపోయాకా అనుకున్న ప్రకారం లక్ష్మణ్ ప్రదీప్ నాకు సైగ చేయగానే లక్ష్మీ ప్రణతి ఇచ్చిన టెక్స్ట్ బుక్ లోనే ఆ ప్రేమలేఖ పెట్టి ఇచ్చేసాను తనని ఆరాధనగా చూస్తూ.

*************

మరునాడు ఆమె కళాశాలకు రాలేదు.


ఆ తరువాత రోజు ఉదయం నేను లోపలి కళాశాలల అడుగుపెడుతూండగానే అటెండర్ చెప్పాడు 'డైరెక్టర్ గారు వచ్చిన వెంటనే రమ్మన్నారని'.


నాకు తెలుసు ఏం జరుగుతుందో.. .


జంకు లేకుండా వెళ్లాను. ''శుభోదయం సర్. '' అన్నాను.


ఆయన నన్ను కూర్చోమనలేదు.


ఆయన ఎదురుగా ఉన్న రెండు కవర్లను నా ముందుకు తోశారు.


వాటిని చూసి బల్లమీద తిరిగి పెట్టేసాను.


''పిల్లలు నీ బోధన మీద ఇచ్చి రిపోర్ట్. నువ్ మా కార్పొరేట్ కళాశాలలో పనిచేయడానికి పనికిరావు. నువ్వు విద్యార్థులకు సందేహాలు వచ్చేలా పాఠం చెప్పి ఆపేస్తావ్. దాంతో వాళ్ళు సందేహం వచ్చి నీ చుట్టూ తిరుగుతారు. నీ అవసరాలు తీర్చుకుని వాళ్ళని నీవెంట తిప్పుకుంటావ్ అని పిల్లలు ఇచ్చిన రిపోర్ట్. అందుకే మా ఒప్పందం ప్రకారం నీకు రెండు జీతాలు ఇస్తున్నాం. అవి తీసుకుని నువ్వు వెళ్ళచ్చు '' అన్నాడు..


''అప్పనంగా వచ్చే జీతం నాకు అవసరం లేదు. నా బోధన మీద నాకు నమ్మకం ఉంది. ''అని జీతం ఉన్న కవరులోంచి నాకు రావలసినది తీసుకుని ఇంటికి వచ్చేసాను.


ఇంటికి వచ్చానే కానీ ఆమె రూపం కళ్ళముందు కదలాడుతూనే ఉంది. ఆమెకు ఇచ్చిన ఉత్తరం ఫలితం తెలియలేదు. ఏదిఏమైనా ఆమెతో ముఖాముఖి తేల్చుకోవడం అవసరం.. అనిపించి వెంటనే బైక్ అవతలి వీధిలోకి పోనిచ్చాను.


ఆమె ఇల్లు చూస్తూనే గుర్తుపట్టేసాను. కారణం ప్రణతి ఇంటిముందు కారు ఆగివుంది. లోపలినుంచి ఓ ముసలావిడని మరో నడివయసు ఆవిడ జబ్బ పుచ్చుకునికారు ఎక్కిస్తుంటే డోర్ పట్టుకుని నిలబడిన ప్రణతి డోర్ వేసింది.


''మేము వాళ్ళని పలకరించి మధ్యాహ్నానికల్లా వచేస్తాము. నువ్వు స్నానం చేసి వంట చేసేసేయ్. '' అంది నడివయసు ఆవిడ.


''అలాగే. ''అని తలవూపింది ప్రణతి. కారు బయల్దేరి వేగంగా మలుపు తిరిగి మాయమైంది.


ప్రణతి లోపలికి వెళ్ళిపోయింది.


ఇదే మంచి సమయం నా ప్రేమ తెలపడానికి అని.. . ధైర్యం చేసి బైక్ స్టాండ్ వేస్ లోపలికి అడుగుపెట్టాను.


విశాలమైన పాతకాలం నాటి పెంకుటిల్లు. తలుపులు దగ్గరగా వేసి ఉన్నాయి.


తోసుకుని వెళ్లడం సభ్యత కాదనుకుని చుట్టూ తిరిగి ఇంటి వెనకవైపుకు వచ్చాను.


ప్రణతి మసిబిందె ఉన్న ఇటుకల పొయ్యిలోకి కట్టెల్ని ఎగదోస్తోంది.


''ప్రణతీ''అని పిలిచాను. టక్కున లేచి నిలబడింది.


''మాస్టారు.. . మీరా.. . ఇక్కడా?ఎంత ధైర్యం మీకు? మీ ప్రేమలేఖ ఫలితం తెలుసుకోవడానికా?''అడిగింది తీవ్రంగా.


''నేను నీకు ప్రేమలేఖ రాయడం ఏమిటి?ప్రదీప్ రాసి నాకిచ్చిన పుస్తకంలో పెట్టి ఇమ్మన్నాడు. ఇచ్చాను. అంతే''


''సార్.. . రోజూ బోర్డు మీద రాసే మీ చేతిరాత గుర్తుపట్టలేనంత అమాయకురాలిని కాదు. ఆ వుత్తరం మీరే రాసి కింద ప్రదీప్ పేరు పెట్టారు అంతే. ''


నేను ఓపెన్ అయిపోయాను.


''నువ్వు చాలా తెలివైనదానివి. బాగా గ్రహించావు. నిజమే ప్రణతీ.. మొదటి చూపులోనే నేను నిన్ను మనసారా ప్రేమించాను. నన్ను ఉద్యోగం లోంచి తీసేసారు డైరెక్టర్. మరల నిన్ను చూసే అవకాశం నాకు దక్కుతుందో లేదో అని నా ప్రేమను నీకు తెలియచేయడం కోసం వచ్చాను. ప్లీజ్ ప్రణతి. నిర్మొహమాటంగా నీ అభిప్రాయం చెప్పు. ''


''మిమ్మల్ని ఉద్యోగంలోంచి తీయించేలా నా తరగతి వాళ్ళందరినీ మోటివేట్ చేసింది నేనే సర్. అయామ్ సారీ సర్. కానీ అలా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే మీరు ఒక మామూలు మనిషిగా వచ్చి అడిగి ఉంటె నేనేమి చెప్పేదాన్నో.. కానీ మీరు వందలమందికి విద్యాదానం చేసే పవిత్రమైన అధ్యాపక వృత్తిలో ఉన్నారు సర్. ఉపాధ్యాయుడంటే నా దృష్టిలో తండ్రి తర్వాత తండ్రి అంతటివాడు అని నా నమ్మకం సర్. ఆ నమ్మకానికి మీరు నిప్పు పెట్టారు. ఇక మీదట ఏ ఉపాధ్యాయుడిని చూసినా నాకు మీరే గుర్తుకువచ్చేలా నానమ్మకానికి 'మచ్చ. తెచ్చారు. మీరు తరగతి గదిలో నన్ను చూసిన చూపులతోనే నేను మిమ్మల్ని అర్ధం చేసుకున్నాను. దయచేసి మరే విద్యార్థి తోనూ 'నిన్ను ప్రేమిస్తున్నాను' అని మాత్రం చెప్పకండి సర్. ఆ అమ్మాయి నాలా ధైర్యం లేనిదైతే 'ఆత్మహత్య'కైనా వెనుకాడకపోవచ్చు. అలాంటి పాపం మాత్రం మూట కట్టుకోవద్దని నా మనవి. ఇక మీరు వెళ్లొచ్చు. ''


''ప్రణతీ.. . నా మాట విను ప్లీజ్.. ఒక్కసారి.. '' అంటూ నేను దగ్గరకు వెళ్లబోయాను.


ప్రణతి వెంటనే పొయ్యిలో మండుతున్న కట్టెను తీసుకుని నాకు చూపిస్తూ అంది.


''సార్.. . మీరు ముందుకు అడుగువేశారంటే ఏ అందం చూసి మీరు ప్రేమించారో ఆ ముఖాన్ని కాల్చేసుకుంటాను. దయచేసి వెళ్లిపోండి. ''


''వద్దు ప్రణతీ.. వద్దు.. అంతపని చెయ్యకు. ''అంటూ నేను వెంటనే పొయ్యిలో మండుతున్న మరొక కట్టెను తీసుకుని నా ఎడమ ముంజేయి మీద గట్టిగా నొక్కి పట్టి పళ్ళబిగువునా బాధను భరించాను.


''మాస్టారూ.. . '' అంటూ ప్రణతి తన చేతిలోని కట్టెను పడేసి, గబగబా మగ్ తో నీళ్లు తెచ్చి నా ముంజేయి మీద పోసి 'ఎంతపని చేశారు మాస్టారు' అంటూ మోకాళ్ళమీద కూర్చుని ఏడవసాగింది..


''అమ్మా.. . ప్రణతీ.. . నేను సభ్యత సంస్కారం లేని వాడిని కాదు. లక్ష్మణ్ దీపక్ నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడు. నాకన్నా ముందుగా అతను నిన్ను ఎక్కడ దక్కించుకుంటాడో అనే భయంతో నీకు నా ప్రేమను వ్యక్తం చేసి, నా గురించి నీ అభిప్రాయం తెలుసుకోవడం కోసం మాత్రమే ఇక్కడకి వచ్చాను. నువ్వు నమ్మిన గురుశిష్య సంబంధ మౌలిక సూత్రాన్ని నేను విస్మరించాను. ఈ వాత ఎందుకు పెట్టుకున్నానో తెలుసా? భవిష్యత్తులో నేను ఏ అమ్మాయిని ప్రేమించాలనుకున్నా ఈ మచ్చ గుర్తు చేయడం కోసం. అయామ్ వెరీ వెరీ సారీ.. వస్తానమ్మా. '' అనేసి రివ్వున బయటకు వచ్చి బైక్ ఎక్కేసాను. ఆ 'మచ్చ' నన్ను మళ్ళీ ఉపాధ్యాయ వృత్తిలోకి వెళ్లనివ్వలేదు.


కొద్దీ రోజులకే బ్యాంకు పోస్ట్ కు ఎన్నికై ఈవేళ బ్రాంచ్ మేనేజర్ హోదాలో ఉన్నాను.


**********

ఆ తరువాత లక్ష్మణ్ ప్రదీప్ బైక్, చేతుల్లో బాబుతో ఎక్కిన లక్ష్మీ ప్రణతిని,బాల్కనీలోంచి ఆ వారంలో రెండుమూడు సార్లు చూసాను.


''మీవారు కనిపించరేమిటి ఆంటీ?'' అని ఒకటికి రెండుసార్లు అడిగిందట ప్రణతి మా ఆవిడని.


''పొద్దున్నపోయి రాత్రికి వస్తారమ్మా ''అందిట మా ఆవిడ.


''నీకో శుభవార్తోయ్.. . మీ అమ్మగారింటి దగ్గరలో ఫ్లాట్ దొరికిందోయ్. రేపు శనివారం శనినిముషంలో పాలు పొంగించుకుని మారిపొమ్మని పంతులు గారు చెప్పారు. ''అన్నాను. పుట్టింటికి చేరువవుతున్నానన్న వాస్తవం ఆడదానికి ఎంత సంతోషమో కదా.. . ఆ శని ఆదివారాల్లో ఇల్లు మార్చేసాను.


నా చేతిమీద ప్రణతి 'మచ్చ'లా నా జ్ఞాపకంగా మిగిలిపోయినా, మరిచిపోయిన తన గాయాన్ని నేను మళ్ళీ రేపదలుచుకోలేదు.


సమాప్తం

కొత్తపల్లి ఉదయబాబు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసంమాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).Podcast Link

Twitter Link


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

పేరు : కొత్తపల్లి ఉదయబాబు పుట్టిన తేదీ : 01/07/1957 విద్యార్హతలు : M.Sc., M.Ed., M.phil (maths) నిర్వహించిన వృత్తి : ప్రధానోపాధ్యాయులు


తల్లి తండ్రులు : శ్రీ కొత్తపల్లి గంగాధర్ శర్మ, విశ్రాంత హెడ్ పోస్ట్-మాస్టర్ స్వర్గీయ శ్రీమతి సుబ్బలక్ష్మి. భార్య : శ్రీమతి సూర్యకుమారి కుమార్తె : చి. సౌ. గుడాల సుబ్బ లక్ష్మి సంతోషిత , M.B.A. w/o లక్ష్మికాంత్ – లాయర్ మనుమరాలు : చి. లక్ష్మి పూర్ణ సాధ్వి కుమారుడు : చి. హనుమ గంగాధర్ శర్మ , సాఫ్ట్-వేర్, h/o చి.సౌ.తేజశ్రీ మనుమలు : చిరంజీవులు గహన్ ముకుంద, ఋషిక్ వశిష్ట.

*వృత్తి పరంగా :

*జిల్లాస్థాయి, రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనల పోటీలలో వివిధ అంశాలలో బహుమతులు, క్విజ్,సాంకేశృతిక కార్యక్రమాల నిర్వహణ, న్యాయ నిర్ణేతగా వ్యవహిరించిన అనుభవం.

*పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 2002 లో తొలిసారిగా ఐదుగురు విద్యార్థులకు నూటికి నూరు మార్కులు రావడం ఆ సందర్భంగా అరకాసు ఉంగరం బహుమతిగా అందుకోవడం ఒక చక్కని ప్రోత్సాహం, ఉత్సాహం. అలా మొత్తం సర్వీసులో నూటికి నూరు మార్కులు దాదాపు తొంభై మందికి పైగా విద్యార్థులు పొందగలగడం వృత్తిపరంగా సంతృప్తిని కలిగించిన విషయం.

*జిల్లా స్థాయిలో అధికారికంగా నిర్వహించిన భౌతిక శాస్త్ర,గణిత శాస్త్ర సదస్సులకు రిసోర్స్ పర్సన్ గా వ్యవహరించడం.

*జిల్లా ఉమ్మడి పరీక్షల సంస్థకు అయిదు సంవత్సరాలపాటు ఎక్కువమంది విద్యార్హులు గణితంలో ఉత్తీరర్ణతాశాతం పొందదానికి అవసరమైన విజయ సూచిక, విజయ సోపానాలు... పుస్తకాలను ప్రభుత్వం తరపున రూపొందించుటలో ''గణిత ప్రవీణుడు''గా వ్యవహరించడం.

*ఆకాశవాణిలో కథానికలు, నాటికల ప్రసారం,అవగాహనా సదస్సులలో పాల్గొనడం, రేడియో నాటక కళాకారునిగా మూడు సంవత్సరాలు విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో పాల్గొనడం..మొదలైనవి


ప్రవృత్తి పరంగా :

*కథా రచయితగా రచనలు :

1. *అందమైన తీగకు...! - 25 కధల మాలిక (2003) 2. *చిగురు పిట్టలు* - నానీల సంపుటి (2007) 3. ఉదయబాబు *మాస్టారి' కధానికలు* - ఉదయకిరణాలు (2015) 4. *అమ్మతనం సాక్షిగా*... కవితా సంపుటి (2015) 5. *నాన్నకో బహుమతి* - 16 కథల సమాహారం (2019-.) జీ.వి.ఆర్. కల్చరల్ అసోసియేషన్ వారు నిర్వహించిన కథాసంపుటుల పోటీలలో ద్వితీయ బహుమతి పొందిన కథల సంపుటి) 6. ఆయన మా నాన్నగారు ( దీర్ఘ కవిత - త్వరలో )

నవలలు : 1 . లేడీ సింగర్ (2 భాగాలు )

2 . మనసు చేసిన న్యాయం(ప్రతిలిపి వారు మార్చి 2202 లో నిర్వహించిన ధారావాహికల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొందినది)

ప్రేరణ : నాన్నగారు...ఆయన నాటక రచయిత,దర్శకుడు,ఉత్తమ నటుడు(18 నాటక పరిషత్తులలో)

*సామాజిక సేవ : రక్తదాన కార్యక్రమం లో, లయన్స్ క్లబ్ వారి కార్యక్రమాలలో విరివిగ పాల్గొనడం .

తెలుగు సాహిత్యానికి సేవ : తెలుగు సాహితీ సమాఖ్య లో కార్యకర్తగా, సంయుక్త కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షునిగా తెలుగు సాహిత్యానికి విశేష కృషి , జిల్లా స్థాయిలో ర్యాలీల నిర్వహణ ...అష్టావధానం, త్రీభాషా శతావధానం లలో పృచ్చకునిగా 46 సంవత్సరాలపాటు ప్రతీ నెల సాహితీ స్రష్టల ప్రసంగాలు...విద్యార్హులకు వివిధములైన పోటీల నిర్వహణ,

పత్రికా రంగం లో : వ్యంగ్య చిత్రకళ లో పలు కార్టూన్లు వేయడం. :*1999 - జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు - పశ్చిమ గోదావరి జిల్లా*

*2000 - యువసాహితీ సహస్రాబ్ది అవార్డు - ఆంద్ర ప్రదేశ్ సాంస్కృతిక సమాఖ్య* *2011 - సోమేపల్లి సాహితీ పురస్కారం* *2016 - గోదావరి మాత అవార్డు - ఉంగుటూరు ఎం.ఎల్.ఎ, శ్రీ గన్ని వీరంజనేయులుగారి చే- గణపవరం - పశ్చిమ గోదావరి జిల్లా *ఉండి ఎం.ఎల్.ఎ. శ్రీ వి.వెంకట శివరామరాజు గారి చే ''ఉగాది పురస్కారం*

*పాలకొల్లు - కళాలయ సంస్థవారిచే " కధాభారతి" బిరుదు ప్రదానం*.

*జన విజ్ఞానవేదిక - భీమవరం వారిచే " ఉగాది పురస్కారం" ....సుమారు నూటికి పైగా సన్మానాలు సత్కారాలు...ఇంకా ఎన్నో..

Youtube :1. తెలుగు కథను ప్రపంచ వ్యాప్తం చేయాలనే ఉద్దేశ్యంతో ప్రస్తుతం "Mastaru Kadhalu 'in' Telugu " ఛానెల్ ద్వారా నా కథలతో పాటు దాదాపు 25 మంది రచయితల కథలు (ఈనాటికి 420 కధల ఆడియో వీడియోలు)చదివి వీడియోలుగా మలుస్తూ ఉచిత సేవగా అందించడం జరుగుతోంది.

2.KUBDevotionalWorld అనే ఛానల్ ద్వారా శ్రీ భగవద్గీత 700 శ్లోకాలను ప్రతీరోజు 5 శ్లోకాలను భావాలతో సహా వీడియోలుగా చదివి అందించడం జరుగుతోంది.

3. UDAYABABUMathsBasics యు ట్యూబ్ ఛానెల్ ద్వారా విద్యార్థులకు గణితంలో మౌలిక భావనల బోధన

ప్రస్తుత నివాసం : 2010 లో సికింద్రాబాద్ సైనిక్ పురి లో స్థిరనివాసం ఏర్పరచుకుని ఇప్పటికీ కధా రచయితగా, బాలల కథారచయితగా కొనసాగడం.

*చివరగా నా అభిప్రాయం :*

ఇప్పటికీ నా కవితా ప్రస్తానం, కధా సాహితీ సేద్యం కొనసాగుతోంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం లో చెట్టు నాకు ఆదర్శం.

కవిగా రచయితగా తమ సాహితీ ప్రస్తానం కొనసాగిన్చాదలుచుకున్న యువత అంతా పాత సాహిత్యాన్ని బాగా చదవాలి. 'వెయ్యి పేజీలు చదివి ఒక్క పేజీ రాయి' అన్న ఒక మహాకవి వాక్యాలు స్పూర్తిగా తీసుకుని నిన్నటి రచన కన్నా, నేటిది, నేటి రచన కన్నా రేపటిది మరింత మెరుగుపరచుకుని ఈ రంగం లో తమకంటూ ఒక ప్రత్యెక స్థానాన్ని ఏర్పరచుకోవాలని, ఆ దిశగా వారి సాహితీ ప్రస్తానం కొనసాగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ.. ...సాహిత్యాభినందనలు.

కొత్తపల్లి ఉదయబాబు

సికింద్రాబాద్35 views0 comments

Comments


bottom of page