#NeerajaHariPrabhala, #నీరజహరిప్రభల, #మలివయసుజీవితం, #MaliVayasuJeevitham, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ
'Mali Vayasu Jeevitham' - New Telugu Story Written By Neeraja Hari Prabhala
Published In manatelugukathalu.com On 01/11/2024
'మలి వయసు జీవితం' తెలుగు కథ
రచన: నీరజ హరి ప్రభల
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
కథా పఠనం: పద్మావతి కొమరగిరి
రోజూలాగానే ఆ రోజు కూడా ఉదయం లేవగానే కాలకృత్యాలను ముగించుకుని వాహ్వాళికి సమీపంలోని పార్కుకు బయలుదేరాడు మురారి. తన జీవితంలో ఈరోజుకొక ప్రత్యేకత ఉన్నదని మనసులో పదే పదే అనుకున్నాడు. ఆ ఆలోచనలతోనే క్రితం రాత్రి ఆయనకు సరిగా నిద్రపట్టలేదు. వడివడిగా నడిచి పార్కుకు చేరుకుని నలుదిశలా పరికించి చూశాడు మురారి. ఎదురుగా వస్తున్న విద్య నవ్వుతూ వచ్చి ఆయన్ని పలకరించింది.
“రండి. ఆ అరుగుమీద కాసేపు కూర్చుందాం.” అంది విద్య.
“సరే!” అని ఆమెను అనుసరించాడు మురారి.
ఇద్దరూ కూర్చున్నాక విద్య, తనే సంభాషణ మొదలు పెట్టింది.
“నిన్న మీరు చెప్పిన విషయం గురించి సుదీర్ఘంగా రాత్రంతా ఆలోచించి ఒక స్ధిర నిర్ణయం తీసుకున్నాను.” అన్న విద్య ముఖంలోకి ఆతృతగా చూశాడు మురారి.
ఆమె ఏం చెప్పబోతోందో అన్న ఆతృత ఆయన వదనంలో కొట్టొచ్చినట్లు కనపడుడుతోంది. అది గమనించిన విద్య చిరునవ్వు నవ్వుతూ “చూడండి మురారి! నిన్న మీరు మీ అభిప్రాయం చెప్పి నా నిర్ణయం అడిగారు. మనం గత సంవత్సరం నుంచి ఒకళ్లనొకళ్లం ఇదే పార్కులో నిత్యం కలుస్తూ, ఇరువురి కష్టసుఖాలను ఒకరికొకరం చెప్పుకుంటూ మంచి స్నేహితులం అయ్యాము. మనమిద్దరం జీవితంలోని ఆటుపోట్లను అనుభవించి వాటిని తట్టుకుని ఇలా నిలబడ్డాము.
ఈ మలి వయసులో కష్టసుఖాలను పంచుకునేందుకు ఒక ఆత్మీయత, ఆదరణ, ఒక చేయూత మనకు అవసరము. కామక్రోధాలను వెలిబుచ్చే ప్రాయము మనది కాదు. ‘కడదాకా నాకొక తోడు ఉంటే బావుండు. అది నీవే అయితే మరీ సంతోషం. బాగా ఆలోచించి నీ నిర్ణయం చెప్పు’. అన్న మీ మాటలు నన్ను బాగా ఆలోచింపజేశాయి. మన ఈ స్నేహబంధాన్ని పవిత్రమైన వివాహబంధంగా మార్చుకుందామన్న మీ నిర్ణయంతో నేను మనస్ఫూర్తిగా ఏకీభవిస్తున్నాను.“ అని అంది విద్య.
అది విన్న మురారి ముఖం వేయి వోల్టుల బల్బులా వెలిగిపోయింది. ఆమె చేతిని చనువుగా తన చేతిలోకి తీసుకుని “చాలా ధాంక్స్ విద్యా! నే చెప్పినదానికి నీవు ఏ నిర్ణయం తీసుకుంటావో? నన్ను అపార్ధం చేసుకుని ఎక్కడ నాకు దూరమవుతావో?” అనే ఆందోళనతో రాత్రి నాకు నిద్ర పట్టలేదు.“ అన్నాడు మురారి.
నవ్వుతూ ఆయన్ని చూస్తూ “ఇంక మనం చట్టరీత్యా దంపతులమయ్యే విధానం చూడండి” అంది విద్య.
“ఈరోజే మనం రిజిస్ట్రార్ ఆఫీససులో మన పేర్లు నమోదుచేసుకుందాం” అని, అక్కడ తాము కలవాల్సిన సమయం వగైరా వివరాలను చెప్పాడు మురారి. “సరే” అంది విద్య.
ఇద్దరూ కాసేపు కబుర్లు చెప్పుకుని ఎవరి ఇళ్లకు వాళ్లెళ్లిపోయారు.
ఆతర్వాత ఇంట్లో పనులు ముగించుకుని ఇద్దరూ రిజిస్ట్రార్ ఆఫీసులో కలిశారు. అక్కడ అధికారికి తమ వివరాలను తెలిపి చట్టరీత్యా పూర్తి చేయవలసిన ఫార్మాలిటీస్ ని పూర్తిచేసి ఎవరిళ్లకు వాళ్లు వెళ్ళిపోయారు.
ఆ రాత్రి మురారి మనసంతా ఏదో ఆలోచనలతో గత స్మతులలోకి వెళ్లింది. తన భార్య కరుణ. పేరుకి తగ్గట్టే ఆమె చాలా కరుణామయి. కాలేజి రోజులలో తామిద్దరూ ప్రేమించుకుని, ఆ తర్వాత ఇద్దరూ మంచి ఉద్యోగాలొచ్చాక తమ పెద్దలనెదిరించి పెళ్లి చేసుకుని అన్యోన్యంగా కాపురం చేసుకుంటున్నారు.
పెళ్లై ఎన్ని ఏళ్లైనా తమకు సంతానం కలగలేదు. ఎంతో మంది డాక్టర్లకు చూపించినా ఫలితం కనబడలేదు. కరుణ చేయని పూజలు, నోములు లేవు. అయినా తమ కోరిక తీరలేదనే దిగులుతో ఉంటున్న కరుణని ఎంతో ప్రేమతో అనునయించేవాడు తను.
ఒకనాడు కరుణని ఒప్పించి అనాధాశ్రమానికి తీసుకెళ్లి అక్కడ ఒక పాపని చట్టరీత్యా దత్తత తీసుకుని తమ ఇంటికి తెచ్చుకుని ప్రేమగా పెంచుకుంటున్నారు మురారి దంపతులు. ఆ పాపకు “సుమ” అని పేరు పెట్టుకుని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. సుమ క్రమేపీ పెరుగుతూ తన ముద్దుముద్దు మాటలు, చేష్టలతో వాళ్లని అలరిస్తోంది. చక్కగా చదువుతూ మంచిగా వృధ్ధిలోకి వస్తున్న సుమని చూసి సంతోషిస్తున్నారు మురారి దంపతులు.
కాలం హాయిగా గడుస్తోంది. సుమ పదవతరగతి చదువుతున్న సమయంలో తన క్లాస్ మేట్ అయిన విజయ్ “ఆమెను ప్రేమిస్తున్నాను.” అంటూ వెంబడించి వేధించసాగాడు. సుమ తనకు బాగా చదువుకోవాలని ఉందని, తన కసలు ప్రేమ ఉద్దేశ్యం లేదని ఎన్నోమార్లు అతనికి చెప్పినా అతను పట్టించుకోకుండా ఆమెని ఇంకా వేధింపులకు గురిచేసేవాడు.
సుమ తన తల్లిదండ్రులకు చెప్పి, వాళ్లని తీసుకుని తమ స్కూలు హెడ్మాస్టరికి అతని గురించి ఫిర్యాదు చేసింది. హెడ్మాస్టరు విజయ్ ని పిలిచి తీవ్రంగా హెచ్చరించాడు. అది అవమానంగా భావించిన విజయ్ ఒకరోజు దారికాచి సుమ మీద కత్తితో దాడిచేయగా ఆమె అక్కడికక్కడే విగతజీవురాలైంది.
ఎవరో పోలీసులకు ఫోన్ చేయగా వాళ్లు వచ్చి అతన్ని అరెస్టు చేయడం, సుమ తల్లిదండ్రులకు సమాచారాన్ని ఇవ్వడం అన్నీ చకచకా జరిగిపోయాయి.
జరిగిన దారుణం తెలిసి గుండెలు పగిలేలా ఏడ్చారు కరుణ దంపతులు. ఆతర్వాత పోస్టమార్టం వగైరా కార్యక్రమాలయ్యాక సుమ పార్ధివ దేహాన్ని వాళ్లకి అప్పగించారు పోలీసులు. తర్వాత జరగవలసిన కర్మకాండలని పూర్తిచేశారు మురారి దంపతులు.
సుమ పోయిన దిగులు, ఆమె జ్ఞాపకాలతో మామూలు మనిషికాలేకపోయింది కరుణ. మురారి ఎంతగానో నచ్చచెప్పి, కంటికిరెప్పలాగా చూసుకుంటున్నా ‘మనోవ్యాధికి మందులేదన్నట్లుగా’ కరుణ నిద్రలోనే గుండెపోటుతో కన్నుమూసింది. ఇంక మురారి బాధ వర్ణనాతీతం. బాధాతప్తహృదయంతో కరుణ తాలూకు క్రియలను యధావిధిగా పూర్తిచేసి ఆమె జ్ఞాపకాలను, సుమ జ్ఞాపకాలను గుండెలనిండా పదిలపరుచుకుంటూ ఇన్ని సంవత్సరాలు ఒంటరిగా జీవనం సాగిస్తున్నాడు మురారి. ఉద్యోగం లోంచి రిటైరైనాక వచ్చిన సొమ్ముతో ఒక చిన్న ఇంటిని కొనుక్కుని ఉంటున్నాడు మురారి.
సంవత్సరం క్రితం అనుకోకుండా ఆ పార్కులో పరిచయమైన విద్యతో పరిచయం క్రమేపీ పెరిగి తమ ఇరువురి మనసులు కలిసి వివాహ బంధంగా దారితీయబోతోంది. ఏదో చప్పుడైతే తృళ్ళిపడి నిద్రలోకి జారుకున్నాడు మురారి.
అక్కడ విద్య కూడా మురారి గురించిన తలపులతో నిదురరాక తన గతాన్ని గుర్తుకుతెచ్చుకుంది. చిన్నతనం నుంచి అనాధాశ్రమంలో పెరిగిన తనకు ‘నా’ అనే వాళ్లు లేక మనసంతా తల్లడిల్లేది. కష్టపడి చదివి డిగ్రీ పూర్తిచేసి ఏదో ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసుకునేది. కొన్నేళ్లయ్యాక తన సహోద్యోగి అరుణ్ తో ప్రేమలో పడింది. ఇద్దరూ పెళ్లిచేసుకున్నారు. అన్యోన్యంగా కాపురం చేసుకుంటున్న ఆ దంపతులను చూసి “విధికి కన్నుకుట్టిందా!” అన్నట్లుగా వాళ్ల జీవితంలో ఒకరోజున ఒక దుర్ఘటన జరిగింది. ఆఫీసునుంచి తిరిగి వస్తున్న అరుణ్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. జరిగిన దారుణానికి తల్లడిల్లిన విద్య అతని తాలూకు జ్ఞాపకాలను, అతని ప్రేమని మరిచిపోలేకపోయేది. చాలాకాలానికి గానీ మామూలు మనిషి కాలేకపోయింది. కాలమే అన్ని గాయాలను మాన్పుతుంది కదా!
మరలా ఉద్యోగం చేసుకుంటూ ఈ పార్కుకు సమీపంలోనే ఒక చిన్న ఇంటిని అద్దెకి తీసుకుని ఉంటోంది. మురారితో పరిచయం, ఆయన స్నేహం తన మనసుకు ఎంతో హాయినిస్తూ మానసిక ఉల్లాసాన్ని కలుగచేస్తోంది. తన జీవితానికి ఒక ఆత్మీయనేస్తం, ఈ వయసులో ఒక ఆదరణ లభిస్తుందని మనసులో ధృఢంగా అనిపిస్తోంది. గతం తాలూకు ఆలోచనలనుండి క్రమేపీ నిద్రలోకి జారింది విద్య.
ఆ తర్వాత ఒక శుభముహూర్తాన రిజిస్ట్రార్ ఆఫీసులో విద్య, మురారి దంపతులయి క్రొత్త జీవితాన్ని మొదలుపెట్టారు. విద్య తన ప్రేమతో మురారికి దగ్గరకాసాగింది. మురారి తన ఆత్మీయానురాగాలతో ఆమె మదికి మరింత చేరువకాసాగాడు. రోజులు హాయిగా గడుస్తున్నాయి. చూస్తూ ఉండగానే వాళ్ల పెళ్లయి రెండేళ్లు గడిచాయి.
చిలకాగోరింకలలాగా అన్యోన్యంగా ఉంటున్న ఆజంటని చూసి చుట్టుప్రక్కల అందరూ ముచ్చట పడుతున్నారు. ప్రతి పనిలో ఇద్దరూ పాలుపంచుకుంటూ, ముచ్చట్లతో, ఇంటి పనులు, వంట పనులు, బజారు పనులను అన్నీ ఇద్దరూ కలిసే చేసుకుంటూ ఉంటున్నారు.
తమ ఇరువురి మనసులు కలిసి తమని జంటగా కలిపిన ఆ పార్కు అంటే వాళ్లకు చాలా ఇష్టం. ప్రతిరోజూ ఆ పార్కుకు ఇద్దరూ కలిసి వచ్చి తమ తొలి పరిచయాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటూ సరదాగా గడపడం వాళ్లకు పరిపాటిగా మారింది.
ఆ పార్కులో ఏ ప్రేమ జంటని చూసినా ముచ్చట పడుతూ తాము అలాగ ఉండాలనే ఆరాటం వాళ్ల మదిలో ఉంటోంది. మలివయసులో తమకొక మంచి జోడీ, ఆత్మీయానురాగాలు, మనసెరిగిన నేస్తం దొరికిందని ఇద్దరూ సంతోషంగా ఉంటున్నారు.
తమకు ఇంతటి మంచి తృప్తికరమైన చక్కటి జీవితాన్నిచ్చిన ఆ భగవంతునికి నిత్యం చేతులు జోడించి నమస్కరించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపు కుంటున్నారు విద్య దంపతులు.
రోజూ లాగానే ఈరోజు కూడా విద్య, మురారి పార్కులోకి వచ్చి చక్కగా కబుర్లు చెపుతూ గడుపుతున్నారు. కొంచెందూరంలో ఎవరో ఒక యువతి నడుచుకుంటూ వెళ్లడం గమనించిన ఇద్దరూ తమ మాటలు ఆమెకి ఎక్కడ వినబడతాయో అనుకుని నెమ్మదిగా మౌనం వహించారు.
.. సమాప్తం ..
నీరజ హరి ప్రభల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ నీరజ హరి ప్రభల గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం :
Profile Link:
Youtube Play List Link:
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు
నా గురించి పరిచయం.....
నా పేరు నీరజ హరి ప్రభల. మాది విజయవాడ. మావారు రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మాలతి, మాధురి, మానస. వాళ్లు ముగ్గురూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ భర్త, పిల్లలతో సంతోషంగా ఉంటున్నారు.
నాకు చిన్నతనం నుంచి కవితలు, కధలు వ్రాయడం చాలా ఇష్టం. ఆరోజుల్లో వాటిని ఎక్కడికి, ఎలా పంపాలో తెలీక చాలా ఉండిపోయి తర్వాత అవి కనుమరుగైనాయి. ఈ సామాజిక మాధ్యమాలు వచ్చాక నా రచనలను అన్ని వెబ్సైట్ లలో వ్రాసి వాటిని పంపే సౌలభ్యం కలిగింది. నా కధలను, కవితలను చదివి చాలా మంది పాఠకులు అభినందించడం చాలా సంతోషదాయకం.
నా కధలకు వివిధ పోటీలలో బహుమతులు లభించడం, పలువురి ప్రశంసలనందుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
మన సమాజంలో అనేక కుటుంబాలలో నిత్యం జరిగే సన్నివేశాలు, పరిస్థితులు, వాళ్లు పడే బాధలు కష్టాలు, ధైర్యంగా వాటిని ఎదుర్కొనే తీరు నేను కధలు వ్రాయడానికి ప్రేరణ, స్ఫూర్తి. నా కధలన్నీ మన నేటివిటీకి, వాస్తవానికి దగ్గరగా ఉండి అందరి మనస్సులను ఆకర్షించడం నాకు సంతోషదాయకం. నిత్యం జరుగుతున్న దారుణాలకు, పరిస్ధితులకు నా మనసు చలించి వాటిని కధల రూపంలోకి తెచ్చి నాకు తోచిన పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తాను.
నా మనసులో ఎప్పటికప్పుడు కలిగిన భావనలు, అనుభూతులు, మదిలో కలిగే సంఘర్షణలను నా కవితలలో పొందుపరుస్తాను. నాకు అందమైన ప్రకృతి, పరిసరాలు, ఆ సుందర నైసర్గిక స్వరూపాలను దర్శించడం, వాటిని ఆస్వాదించడం, వాటితో మమేకమై మనసారా అనుభూతి చెందడం నాకు చాలా ఇష్టం. వాటిని నా హృదయకమలంలో అందంగా నిక్షిప్తం చేసుకుని కవితల రూపంలో మాలలుగా అల్లి ఆ అక్షర మాలలను సరస్వతీ దేవి పాదములవద్ద భక్తితో సమర్పిస్తాను. అలా నేను చాలా దేశాల్లలో తిరిగి ఆ అనుభూతులను, అనుభవాలను నా కవితలలో, కధలలో పొందుపరిచాను. ఇదంతా ఆ వాగ్దేవి చల్లని అనుగ్రహము. 🙏
నేను గత 5సం… నుంచి కధలు, కవితలు వ్రాస్తున్నాను. అవి పలు పత్రికలలో ప్రచురణలు అయ్యాయి. పుస్తకాలుగా ప్రచురించబడినవి.
“మన తెలుగు కధలు.కామ్. వెబ్సైట్” లో నేను కధలు, కవితలు వ్రాస్తూ ఉంటాను. ఆ వెబ్సైట్ లో నాకధలకి చాలా సార్లు నగదు బహుమతులు వచ్చాయి. వస్తున్నాయి. అనేక ప్రశంసలు లభించాయి. వాళ్ల ప్రోత్సాహం జీవితాంతం మరువలేను. వాళ్లకు నా ధన్యవాదాలు. ఆ వెబ్సైట్ వాళ్లు రవీంద్రభారతిలో నాకు “ఉత్తమ రచయిత్రి” అవార్డునిచ్చి ఘనంగా సన్మానించడం నా జీవితాంతం మర్చిపోలేను. ఆజన్మాంతం వాళ్లకు ఋణపడిఉంటాను.🙏
భావుక వెబ్సైట్ లో కధల పోటీలలో నేను వ్రాసిన “బంగారు గొలుసు” కధ పోటీలలో ఉత్తమ కధగా చాలా ఆదరణ, ప్రశంసలను పొంది బహుమతి గెల్చుకుంది. ఆ తర్వాత వివిధ పోటీలలో నా కధలు సెలక్ట్ అయి అనేక నగదు బహుమతులు వచ్చాయి. ‘మన కధలు-మన భావాలు’ వెబ్సైట్ లో వారం వారం వాళ్లు పెట్టే శీర్షిక, వాక్యానికి కధ, ఫొటోకి కధ, సందర్భానికి కధ మొ… ఛాలెంజ్ లలో నేను కధలు వ్రాసి అనేకమంది పాఠకుల ప్రశంశలను పొందాను. ‘మన తెలుగుకధలు. కామ్ వెబ్సైట్ లో “పశ్చాత్తాపం” అనే నా కధకు విశేష స్పందన లభించి ఉత్తమ కధగా సెలక్ట్ అయి నగదు బహుమతి వచ్చింది. ఇలా ఆ వెబ్సైట్ లో నెలనెలా నాకధలు ఉత్తమ కధగా సెలెక్ట్ అయి పలుసార్లు నగదు బహుమతులు వచ్చాయి. వస్తున్నాయి.
ఇటీవల నేను వ్రాసిన “నీరజ కథాకదంబం” 175 కధలతో పుస్తకం, “ఊహల అల్లికలు” 75 కవితలతో కూడిన పుస్తకాలు వంశీఇంటర్నేషనల్ సంస్థ వారిచే ప్రచురింపబడి మా గురుదంపతులు ప్రముఖ వీణావిద్వాంసులు, రాష్రపతి అవార్డీ శ్రీ అయ్యగారి శ్యామసుందరంగారి దంపతులచే కథలపుస్తకం, జాతీయకవి శ్రీ సుద్దాల అశోక్ తేజ గారిచే కవితలపుస్తకం రవీంద్ర భారతిలో ఘనంగా ఆవిష్కరించబడటం, వాళ్లచేత ఘనసన్మానం పొందడం, బహు ప్రశంసలు, అభినందనలు పొందడం నాఅదృష్టం.🙏
ఇటీవల మన మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడి గారిచే ఘనసన్మానం పాందడం, వారి అభినందనలు, ప్రశంసలు అందుకోవడం నిజంగా నా అదృష్టం. పూర్వజన్మ సుకృతం.🙏
చాలా మంది పాఠకులు సీరియల్ వ్రాయమని కోరితే భావుకలో “సుధ” సీరియల్ వ్రాశాను. అది అందరి ఆదరాభిమానాలను పొందటమే కాక అందులో సుధ పాత్రని తమ ఇంట్లో పిల్లగా భావించి తమ అభిప్రాయాలను చెప్పి సంతోషించారు. ఆవిధంగా నా తొలి సీరియల్ “సుధ” విజయవంతం అయినందుకు చాలా సంతోషంగా ఉన్నది.
నేను వ్రాసిన “మమతల పొదరిల్లు” కధ భావుకధలు పుస్తకంలో, కధాకేళిలో “మంచితనం-మానవత్వం” కధ, కొత్తకధలు-5 పుస్తకం లో “ప్రశాంతినిలయం” కధ, క్షీరసాగరంలో కొత్తకెరటం పుస్తకంలో “ఆత్మీయతానుబంధం”, “గుర్తుకొస్తున్నాయి” పుస్తకంలో ‘అత్తింటి అవమానాలు’ అమ్మకు వ్రాసిన లేఖ, మొ…కధలు పుస్తకాలుగా వెలువడి బహు ప్రశంసలు లభించాయి.
రచనలు నా ఊపిరి. ఇలా పాఠకుల ఆదరాభిమానాలు, ఆప్యాయతలే నాకు మరింత రచనలు చేయాలనే ఉత్సహాన్ని, సంతోషాన్నిస్తోంది. నా తుది శ్వాస వరకు మంచి రచనలు చేయాలని, మీ అందరి ఆదరాభిమానాలను పొందాలని నా ప్రగాఢవాంఛ.
ఇలాగే నా రచనలను, కవితలను చదివి నన్ను ఎల్లప్పుడూ ఆశ్వీరదిస్తారని ఆశిస్తూ
మీ అభిమాన రచయిత్రి
నీరజ హరి ప్రభల.
విజయవాడ.
Photo Gallery
Commenti